మా పెద్దనాన్న జువ్వాడి గౌతమరావు గారు

తెలుగు దేశంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన కవులిద్దరూ కరీంనగర్ వారే అని మా జిల్లా వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. ఒకరు కరీంనగర్ పుత్రులు సినారె అయితే మరొకరు కరీంనగర్ దత్తపుత్రులు విశ్వనాథవారు. ఇది కొంత అతిశయోక్తి, మరి కొంత నిజం. ఎందుకంటే విశ్వనాథ స్వస్థలం కృష్ణా జిల్లా అయినా, కరీంనగర్ వేసినంత పెద్దపీట కృష్ణా జిల్లా ఆయనకు వేయలేదు. ఆ మాటకొస్తే కృష్ణాయే కాదు మరే ప్రాంతం కూడా ఆయనని కరీంనగర్ అంత అభిమానించలేదు. ఆయన మాటల్లో చెప్పాలంటే:

ఓ కరీంనగర గత ప్రజా కవిత్వ
రసిక నికురుంబమా! కావ్యరస రమా ని
తంబమా! ఎన్ని జన్మల దాక ఋణము
నిదియె పదెపదె తీర్చుచుండెదను నేను.


జువ్వాడి గౌతమరావు (1929-2012)

విశ్వనాథ వారికి కరీంనగర్‌తో గాఢమైన అనుబంధం ఏర్పడటానికి ప్రధాన కారణం మా పెద్దనాన్న జువ్వాడి గౌతమరావు గారు. ఆ రోజుల్లో కరీంనగర్ శ్రీ రాజ రాజేశ్వరీ (ఎస్.ఆర్. ఆర్.) కళాశాల వేములవాడ రాజరాజేశ్వరీ దేవస్థానం నిధులతో ప్రైవేటు సంస్థగా ఉండేది. ఆనాడు అదొక సాహిత్య పీఠం. గౌతమరావు, పీ. వీ. నరసింహారావు లాంటి సాహితీ ప్రియులతో కళకళలాడుతూ ఉండేది. 1959లో విశ్వనాథ విజయవాడలో పదవీ విరమణ చేసిన తరువాత గౌతమరావు వారిని కరీంనగర్‌కి రప్పించారు. తరువాత విశ్వనాథ కరీంనగర్ వచ్చేటప్పటికి ఆయనకి 63 ఏళ్ళు. గౌతమరావు గారికి అప్పటికి 30 ఏళ్ళు. ఇద్దరికీ 33 ఏళ్ళ వ్యత్యాసం ఉంది. ఐనా విశ్వనాథని గౌతమరావు గారెరిగినట్టుగా వేరెవ్వరూ ఎరగలేదని విశ్వనాథ అభిమానులందరూ అంటూ ఉంటారు. గౌతమరావు గారు కాలేజీ రోజుల్లో విశ్వనాథ గారి పద్యాలు ఇష్టంగా చదివి దాచుకుంటూ ఉండేవారు. వాటన్నింటినీ పట్టుకొని ఒకసారి విశ్వనాథ గారిని చూడ్డానికి విజయవాడ వెళ్ళి అచ్చు వేయవలిసిందని కోరారు. వాటిని అచ్చు వేసినప్పుడు ఆ పుస్తకాన్ని గౌతమరావు గారికి అంకితం ఇస్తూ ఆయన రాసిన రెండు పద్యాలు

నిజమునకు భావుకుండని
సృజనన్ పదివేలమంది నెవ్వడొ యొక్కం
డు జనించు, మెఱయు వానికి
రజనీపతి కాంతి భ్రౌ భరమ్మపుడపుడై

వారిలో నొక్కరుండు జువ్వాడి వంశ
రజనికాంతుండు గౌతమరావనంగ
కవికి నట్టిడు నొక చెలికాడు దొరకు
తొలుతటి జనస్సులందలి చెలిమికాడు

గౌతమరావు 1929 ఫిబ్రవరి 1న కరీంనగర్ లోని ఇరుకుల్ల గ్రామంలో జన్మించారు. బాల్యం సాఫీగానే సాగిపోయింది. హైస్కూలు ఇరుకుల్ల నుండి కరీంనగర్ వెళ్ళి చదువుకున్నారు. శేషాద్రి రమణ కవుల్లో ఒకరైన దూబగుంట రమణాచార్యులు ఆ రోజుల్లో కరీంనగర్లో తెలుగు ఉపాధ్యాయుడుగా పని చేస్తూ ఉండేవారు. ఆయన దగ్గరున్న విశ్వనాథ నవల ‘చెలియలికట్ట’ దొంగతనంగా చదవడంతో విశ్వనాథ ఆయనకు పరిచయం అయ్యారు. ఆ పుస్తకం యథాస్థానంలో ఉంచి, అలాగే అక్కడున్న మిగతా నవలలు చదివి విశ్వనాథ అంటే ఇష్టం పెంచుకొన్నారు. 1943లో హైస్కూలు పూర్తి చేసి కాలేజి చదువుల కోసం హైదరాబాద్ వచ్చి బి.కాం పూర్తి చేసి, ఆ పైన లా చదివారు. ఆ రోజుల్లో లాయర్లు తక్కువ మందే ఉండేవారు కానీ, ఆయన ప్రవృత్తికి న్యాయవాద వృత్తి సరిపోయినట్టు లేదు.

ఆయన రాజకీయ దృక్పథానికి బీజం పడింది కాలేజీ రోజుల్లోనే. అందరికన్నా ఎక్కువగా ఆయన ఆదర్శాలని ప్రభావితం చేసింది జయప్రకాశ్ నారాయణ్. సోషలిస్టు పార్టీ నాయకుడిగా రాం మనోహర్ లోహియా లాంటి మిగతా నాయకులతో సాన్నిహిత్యం పెరిగింది. విద్యార్థులందరూ నిజాంకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేవారు. 1947 ఏప్రిల్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ భవనం మీద కాంగ్రెస్ జెండా ఎగరేశారు. ఇది గౌతమరావు పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానించి ‘అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి’ అనే ఒక ముద్ర వేసి రెండేళ్ళు కఠిన కారాగార శిక్ష విధించారు. కానీ ఔరంగాబాద్ జైలు ఆయనని రెండు నెలలు కూడా ఆపలేక పోయింది. కిటికీ ఊచలు కోసి జైలులో నుండి పారిపోయారు. అక్కడినుండి మిత్రుల సహాయంతో బొంబాయి దాకా వెళ్ళి తిరిగి రైలులో చాందా వచ్చేశారు. అక్కడ 25మంది సహచరులతో కలిసి కె.వి. నరసింగరావు దగ్గర సైనిక శిక్షణ పొందారు. చాందా నుండి కరీంనగర్ దాకా వంద కిలోమీటర్లు నడిచి వచ్చి మళ్ళీ నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. జైలు నుండి కిటికీ ఊచలు కోసి పారిపోవడమనే చర్య చాలా సాహసోపేతమైనదనే చెప్పాలి.

తెలంగాణాకి నిజాం పాలన నుండి స్వాతంత్రం లభించిన తొలి రోజుల్లో అక్కడ కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువగా ఉండేది. 1952 నాటికి గౌతమరావు గారికి ఇరవై మూడేళ్ళే. నిబంధనల ప్రకారం పార్లమెంటుకి పోటీ చేయడానికి కనీసం 25ఏళ్ళు ఉండాలి. ఎట్లా జరిగిందో కానీ మిత్రుల ప్రోద్బలంతో సోషలిస్టు పార్టీ తరఫున లోక్ సభకి పోటీ చేశారు. గెలిచింది కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి. మూడవ స్థానం భావి ప్రధాని పి. వి. నరసింహారావుకి దక్కింది. హైదరాబాదు రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన కౌలుదారీ రక్షణ చట్టం అమలు చేయాలని సోషలిస్టులు గౌతమరావు గారి నాయకత్వంలో పలుచోట్ల ఉద్యమాలు నిర్వహించారు. ‘ఆహార సత్యాగ్రహం’ పేరుతో ఎన్నో గోదాముల తాళాలు పగుల గొట్టి పేదలకు పంచారు. ఎన్నో చోట్ల బలవంతులైన భూస్వాములు కౌలుదారీ రక్షణ చట్టాన్ని ధిక్కరించాలని చూసినప్పుడు దగ్గరుండి అమలు చేయించారు. ఆయనకి రాజకీయంగా, సిద్ధాంతాలతో ముడిపడి ఉన్న ఒక రొమాంటిక్ ఐడియలిస్టు దృష్టి ఉండేది. ప్రజల దృష్టిలో రాజకీయ నాయకుడు అంటే ఒక పైరవీకారు అనే విషయం త్వరలోనే ఆయనకి అర్థం అయ్యి రాజకీయాలకి దూరంగా ఉండడం మొదలు పెట్టారు. 1975 ఎమర్జన్సీ విధించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు నశించి పోతున్నాయన్న బాధ ఆయనని ఎన్నో రోజులు కుంగతీసింది. ఎమర్జన్సీ సడలించిన తరువాత 1977లో లోక్‌సభకి జనతా పార్టీ నుండి సోషలిస్టు పార్టీ పాత మిత్రుల ప్రోద్బలంతో బలవంతంగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో నీలం సంజీవరెడ్డి గారు తప్ప అందరూ కాంగ్రెస్ వారే గెలవడంతో ఓడిపోక తప్పలేదు. ఆ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన ఉపన్యాసం హృదయాన్ని కదిలించి వేసిందని ఎంతో మంది ఎన్నో ఏళ్ళు చెప్పుకోగా నేను విన్నాను. దురదృష్టవశాత్తూ దానిని ఎవరూ రికార్డు చేయలేదు.

1952 లోక్‌సభ ఎన్నికల తరువాత 1953లో మొదటిసారి విశ్వనాథను కలిశారు. అప్పుడు ఏర్పడ్డ అనుబంధం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. 1959లో విశ్వనాథను కరీంనగర్ తీసుకు రావడంతో గాఢమైన స్నేహంగా మారింది. స్నేహం కన్నా వాళ్ళది గురుశిష్యుల అనుబంధం అనాలేమో. ఆయనతో సమానంగా విశ్వనాథవారి పద్యాలని ఆకళింపు చేసుకున్న మరో శిష్యుడు మల్లంపల్లి శరభయ్య. వారిద్దరికీ లవకుశులు అనే పేరు ఉండేది. ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్ దొరకినగాని ఊరక కృతుల్ రచియించడం సాధ్యం కాదని పెద్దన చెప్పుకున్నాడు. అల నన్నయ్యకు లేదు అంటూ విశ్వనాథ తాను శిష్యుడయ్యే మృదుకీర్తి భోగం చెళ్ళపిళ్ళవారికే దక్కిందని చెప్పుకున్నారు. అట్లాగే గౌతమరావు శరభయ్యలు శిష్యులయ్యే మృదుకీర్తి భోగం విశ్వనాథ వారిది.

విశ్వనాథ ప్రధానంగా పద్య కవి. గద్యం ఎంత వేగంగా రాసినా రామాయణ కల్పవృక్షం మాత్రం మెల్లగా రోజూ కొన్ని పద్యాలు మాత్రమే రాస్తూ ఉండేవారు. కృష్ణా జిల్లాలో బాలకాండతో మొదలైన కల్పవృక్షం 30ఏళ్ళ తరువాత కరీంనగర్లో యుద్ధకాండతో ముగిసింది. విశ్వనాథ 1953లో పరిచయం అయిన తరువాత ఆరేళ్ళ పాటు గౌతమరావు విజయవాడ వెళ్ళి విశ్వనాథ కొత్తగా రాసిన రామాయణ కల్పవృక్షం లోని పద్యాలని విని వస్తూ ఉండేవారు. 1959లో విశ్వనాథ విజయవాడలో ప్రభుత్వ కళాశాలలో రిటైర్ అయ్యారు. కరీంనగర్ ఎస్.ఆర్. ఆర్. కళాశాల వేములవాడ దేవస్థానం నిధులతో ప్రైవేటు కళాశాలగా నడుస్తూ ఉండేది కాబట్టి విశ్వనాథ వారు ప్రిన్సిపల్ పదవి చేపట్టడానికి వీలయ్యింది. తరువాత 1962లో ఆ కళాశాల కూడా ప్రభుత్వపరం కావడంతో విశ్వనాథ పదవీ విరమణ చెయ్యాల్సి వచ్చింది.

కరీంనగర్లో ఉన్న మూడేళ్ళలో విశ్వనాథ రామాయణ కల్పవృక్షాన్ని ముగించారు. పురాణ వైరిగ్రంథ మాల అనే శీర్షికన పదహారు నవలలు రాయాలని సంకల్పించి పన్నెండు మాత్రమే రాశారు. భారతదేశ చరిత్రలో కొన్ని సంఘటనలని ఇతివృత్తాలుగా తీసుకొని రాసిన నవలలు అవి. అక్కడున్నప్పుడు నారాయణ రావు అనే ఒక సంగీత విద్వాంసుడితో గౌతమరావుకి, విశ్వనాథకి, స్నేహం ఉండేది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక వాగు పేరుతో ‘మ్రోయు తుమ్మెద’ నవల రాశారు. దాంట్లో ప్రధాన పాత్ర నారాయణ రావుది. గౌతమరావుని కూడా ఒక పాత్రగా ప్రవేశ పెట్టారు. అక్కడ ఉండగా రాసిన మరో నవల దమయంతీ స్వయంవరం.


జువ్వాడి గౌతమరావు (1929-2012)

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నిత్యం సాహిత్య ప్రపంచంలో ఉంటూ రాయగల ప్రతిభ ఎంత ఉన్నా ఆయన రాసిన రచనలు చాలా తక్కువ. ఆయన రాసిన వ్యాసాలు సంకలనం చేసి సాహిత్య ధార అనే పుస్తకాన్ని వెలిచాల కొండల రావుగారు ప్రచురించారు. ఆయన ప్రధానంగా పేరు మోసింది పద్య పఠనానికి. పద్యం అనే ప్రక్రియ మౌన పఠనానికి చెందినది కాదు. ప్రకాశ పఠనానికి చెందినది. తెలుగు వారికి పద్యం అనగానే గుర్తొచ్చేది నాటకాలు. నాటక శైలిలో పాడే పద్యాలు ప్రధానంగా పాత్రలు పలికే సంభాషణలు. గొంతెత్తి రాగాలు తీస్తూ పాడేవి. గౌతమరావు గారి పద్య పఠన శైలి నాటక శైలి కాదు. ఆయన పద్యాన్ని రాగం తీసే పాటగా మనం భావించలేం. ఆయన పద్య శైలి కావ్య రసాన్ని శ్రోతలకు అందించే విలక్షణ శైలి.

గౌతమరావు గారి సాహిత్య జీవితంలో ప్రస్తావించదగ్గ మరో ముఖ్యమైన విషయం ఆయన సంపాదకుడిగా నడిపిన పత్రికలు. సోషలిస్టు పార్టీ రాజకీయాలలో చురుగ్గా పని చేసేటప్పుడు జనశక్తి పత్రికలో సాహిత్యధార అనే ఒక శీర్షిక ద్వారా సమకాలీన సాహిత్యాన్ని నిశితంగా విశ్లేషించేవారు. ఎంత పెద్దవారైనా సరే మనసులో ఉన్న విషయం నిర్మొహమాటంగా రాసేవారు. ఆయన కలం వేడితో ‘వాడి రచనల జువ్వాడి’గా పేరు తెచ్చుకొన్నారు. సోషలిస్టు పార్టీ నాయకులు బదరీ విశాల్ పిత్తీ ఆ రోజుల్లో కల్పన అనే ఒక హిందీ పత్రిక నడిపేవారు. దీనిలో గౌతమరావు హిందీ కథలని ఎన్నిక చేయడం, సాహిత్య సమీక్షల వంటివి రాయడం చేస్తుండేవారు. ఒకసారి రవీంద్రనాథ్ టాగూర్‌ని అతిశయోక్తులతో కీర్తిస్తూ రాసిన వ్యాసానికి వెక్కిరింపుగా ఒక సమీక్ష రాశారు. కల్పన పత్రికకి సోషలిస్టుల పత్రిక అనే పేరుండడంతో ఆ వ్యాసం చూసిన టాగూర్ మనుమరాలు రాం మనోహర్ లోహియాతో మట్లాడడం మానేసిందని ఆయనే ఒకసారి చెప్పారు.

విశ్వనాథ 1926 ప్రాంతంలో జయంతి అనే పత్రికను నడిపారు. అది ఆర్థిక కారణాల వల్ల ఒక సంవత్సరం దాటి నడవలేదు. దాన్ని 1958లో గౌతమరావు పునరుద్ధరించారు. దాని సంపాదక వర్గం విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వెంకటావధాని, కేతవరపు రామకోటి శాస్త్రి, గౌతమరావు. విశ్వనాథ సంపాదకీయం మాత్రం రాసేవారు. మిగతా నిర్వహణ అంతా గౌతమరావు గారిదే. ఎన్నో ఇబ్బందులకు గురైనా పత్రిక ఏ రోజు కూడా ఆలస్యంగా రాలేదు. తను ఇంతకు ముందు రాస్తున్న సాహిత్యధారను ‘సమవర్తి’ పేరుతో జయంతిలో కొనసాగించారు. ‘నేను నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ దాన్ని ప్రకటించే స్వాతంత్ర్యం కోసం చివరిదాకా పోరాడతాను’ అని వోల్టేర్‌కు ఆపాదించిన సూక్తిని పూర్తిగా నమ్మిన వ్యక్తి గౌతమరావు గారు. తన వ్యాసాల మీద, పత్రిక మీద వచ్చిన విమర్శలను జయంతిలో యథాతథంగా ప్రచురించేవారు. ఆ రోజుల్లో భారతి పత్రిక కొర్లపాటి శ్రీరామమూర్తి వ్యాసం మీద నిడదవోలు వెంకటరావు వ్రాసిన విమర్శను ప్రచురించింది. దానికి ప్రతిగా కొర్లపాటి రాసిన సమాధానాన్ని మాత్రం ప్రచురించలేదు. అప్పుడు ఆ సమాధానాన్ని జయంతి మాసపత్రిక ప్రచురించింది. దానికి నిడదవోలు వెంకటరావు కోపగించి తాను లీగల్ చర్య తీసుకుంటానని బెదిరింపు ఉత్తరం రాశారు. దానిని తాను ఎదుర్కొంటానని గౌతమరావు తిరుగు టపా రాశారు. జయంతి పత్రికలో దుమారం రేపిన మరో వ్యాసం పొట్లపల్లి సీతారామారావు రాసిన ‘గురజాడ అకవి’. దీని మీద ఘాటైన విమర్శలతో చర్చ చాలా రోజులు సాగింది. చేకూరి రామారావు జలాంతశ్చంద్ర చపల అనే మారు పేరుతో ఎన్నో రోజులు దాన్ని ఘాటుగా విమర్శించారు. జయంతి వెలుగులోకి తెచ్చిన ఒక గొప్ప పేరడీ హాస్య రచయిత ‘కచేరీ కథనం’ రాసిన మాచిరాజు దేవీప్రసాద్. జయంతి ప్రచురించిన మరికొన్ని రచనలు జరుక్ శాస్త్రి ‘వచన భారతం,’ విశ్వనాథ ‘శాకుంతలము యొక్క అభిజ్ఞానత,’ ‘అల్లసానివాని అల్లిక జిగిబిగి’.

విశ్వనాథ కవిత్వం మీద గౌతమరావు గారికున్న అభిమానం చూసి ఆయన ప్రతి అభిప్రాయానికి డూడూ బసవన్న లాగా తల ఊపే మనిషని పాఠకులు పొరపాటు పడే ప్రమాదం ఉంది. నిజానికి ఆయన విశ్వనాథని పూర్తిగా అర్థం చేసుకున్న మనిషే తప్ప నిశితంగా పరిశీలించని మనిషి కాదు. ‘ధర్మా రావు పాత్రలో అనౌచిత్యాలు’ లాంటి విశ్లేషణాత్మకమైన వ్యాసాలను తనే స్వయంగా రాశారు. విశ్వనాథ రాసిన సముద్రపు దిబ్బ ఆయనకు పూర్తిగా నచ్చని నవల.

వ్యక్తిగతంగా చూస్తే పెద్దనాన్న ప్రభావం నా మీద ఎంత ఉంది అంటే చెప్పడం కష్టమైన విషయం. వేరే ఊర్లో ఉన్న కారణంగా చిన్నప్పుడు ఆయనతో ఎక్కువ సమయం గడపలేదు. మొదటిసారి ఆయన కంఠం వింటే ఒళ్ళు జలదరించింది ‘జటా కటాహ సంభ్రమత్’ శివస్తోత్రం విన్నప్పుడు. భారతం చదవాలన్న ఉత్సాహంలో నన్నయ పద్యాలు కాలేజీ రోజుల్లో సీరియల్ నవల లాగా చదివాను. తరువాత ఆ పద్యాలు ఆయన నోటి నుండి వింటే అర్థం అయిన విషయం పద్యం ప్రకాశ పఠనానికి సంబంధించిన విషయమని, మౌన పఠనానికి సంబంధించినది కాదని. ‘విపరీత ప్రతిభాషలేమిటికి’ పద్యం ఆయన నోటినుండి విన్నప్పుడు నన్ను ఎంత ఆకట్టుకుందంటే అది చదివి చాలా సార్లు అందరికీ చదివి వినిపించాను.

చివరిగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలంటే సామవేదం షణ్ముఖశర్మ గారు ఒకసారి నాతో అన్నట్టు, “ఒక మనిషి ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకోవడం కష్టమైన విషయం. కానీ అంతకన్నా ఎన్నో రెట్లు కష్టమైన విషయం ఒక మనిషి సహృదయుడిగా పేరు తెచ్చుకోవడం. అటువంటి అరుదైన మనుషుల్లో ఒకరు గౌతమరావు గారు”.