ఎలివేటర్ లో కిందికి దిగి వస్తూ 5,4,3,2 అలా లెక్కిస్తూ ఎప్పుడు లాబీ లెవెల్ వస్తుందా అని ఆత్రుతగా ఉంది నిసీ షామల్. ఎలివేటర్ ఆగగానే, తలుపు తెరుచుకుంటూనే బైటికి దూకింది.
ఓవ్! ఓవ్! అంటూ ఆమెను పట్టుకుని ఆపాడు లాస్లో బేకస్. ఆమె తల అప్పటికే టంగుమని అతని గడ్డానికి తగలటం అతనికి నక్షత్రాలు కనిపించటం జరిగిపోయాయి. ఐనా నిసికి నెత్తి మీద ఒత్తుగా జుట్టు, అతనికి ఇంతో అంతో పిల్లి గడ్డం ఉండటంతో అతనికి పెద్ద ఆపద ఏం కలగ లేదు.
“నిసి! ఏమిటా దూకుడు! ఎవరికీ ఉపద్రవం” అని ఎలివేటర్ ముందునుంచీ వేరే వాళ్ళకు అడ్డం లేకుండా నిసిని గోడ పక్కకు లాగాడు. కాసేపు ఆమెతో కబుర్లాడ్డానికి.
“లాస్లో! నీతో సొల్లు చెప్పటానికి నాకు టైమ్ లేదు. అదిగో ఆ ఇరాన్ పెద్దాయనని చూడ్డానికి నాకు కబురొచ్చింది.” అంది
పెద్దగా నవ్వాడు. “ఏ ఇరాన్ పెద్దాయనోయ్?”
“అబ్బా! ఏం చెప్పమంటావు. మా డిపార్ట్‌మెంట్ కబుర్లు, మీ మెడికల్ ఆంకాలజీ దాకా రానట్లు.” అంది నిసి. “ఈ మధ్య మాకు ఓ మెగా మెగా సెలెబ్రిటీ పేషెంట్ వచ్చాడు. నేను లింఫోమా సర్వీసులో రొటేషన్ తీసుకుంటున్నాను తెలుసుగా?”
“తెలుసు. తెలుసు. జగద్విఖ్యాతి కాంచిన, ఒళ్ళంతా ఒక్కసారే ఎలెక్ట్రాన్ రేడియేషన్ ట్రీట్మెంట్ మొదలెట్టిన మహిళామణి. నీ పేరు లాంటి పేరుగలిగిన ‘డాక్టర్ లార్డెస్ నీసీ’ దగ్గరేగా. పూసాన్, గోల్డ్ బర్గ్, ఇంకా ఎవరెవరున్నారక్కడ?”
“ఆ, అదే, ఆమె దగ్గరే. కాని నే చెప్పేది ఇంకో మరియా క్యూరీ. అదేనోయ్ నా బ్రెస్ట్ గురువు -’ఫ్లారెన్స్ చూ’ ఆమెగారు షా ఆఫ్ ఇరాన్ ని ట్రీట్ చేస్తున్నది. ఆమె గదా మరి డిపార్ట్మెంట్ చెయిర్మన్”
“వ్హాట్! ”
“ఇష్ ! ఇష్! అతి రహస్యం. ఎవరికీ చెప్పక నాయనా! నీకు దండం . సీక్రెట్ సర్వీసు వాళ్ళు నా దుంప తెంపుతారు.”
“ఇరేనియన్ రివల్యూషన్ తర్వాత రాజ్యం పోయి షా అక్కడా ఇక్కడా తల దాచుకుంటున్నాడు కదా”
“నిజమేనోయ్! ఆయన ఇక్కడే ఉన్నట్లు ఇంకా మీచెవుల దాకా రాలేదా. ఖుమేనీ నీకు కబురు పెట్టడం మర్చి పోయి ఉంటాడులే. లింఫోమా వైద్యం కోసం వచ్చాడు. ఖీమో మీ వాళ్ళు కాదులే. ఆ వైద్యం లేదు ప్రస్తుతం .” పెదవి విరుస్తూ చెయ్యి అడ్డంగా తిప్పుతూ అంది. “న్యూయార్క్ హాస్పిటల్లో డాక్టర్లు చూస్తున్నారు. అక్కణ్ణించి రాత్రిపూట టన్నెల్లో మెమోరియల్ కి తీసుకొచ్చి రేడియేషన్ ఇచ్చి పంపిస్తున్నాం. అంతా సీక్రెట్. ప్రతి రోజూ వేరే వేరే టైం లో వస్తాడు. బైటి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ”
“ఓ! మై గాడ్! ఓ మైగాడ్!” కొంచెం సేపు నిర్ఘాంత పోయి నిలబడి పోయాడు. నిసి నవ్వుకుంటూ, కొంచెం ఆదుర్దాతో ఎవరన్నా వింటున్నారేమో అని చుట్టూ చూస్తూ ఉంది.
“ఓహోహో! ఐతే ఇప్పుడు పగలు ఈ పరుగులేమిటి?“
“ఏముంది లాస్లో! ఈ షాలు, రాజాలు, రాణీలందరికీ నామీద వల్లమాలిన అభిమానం కలుగుతుంది. వాళ్ళకు జబ్బుగా ఉన్నన్నాళ్ళేలే. ఆ తర్వాత నేనెవరో, వాళ్ళెవరో. ఇప్పుడు మొత్తం పొట్టకంతా రేడియేషన్ ఇస్తున్నాం. దాంతో నాసియా, వాంతులు. మందులిస్తాం. ఐనా కాని అయనకు నేను అప్పుడప్పుడు వెళ్ళి పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పాలోయ్. నాకు తురకం మాట్లాడ్డం కూడా వచ్చేసరికి, ఈ రాయల్ బేబీ సిట్టింగ్ కూడా నా పనుల్లో ఒకటి ఐపోయింది.”
లాస్లో అప్పటికి కోలుకుని విరగబడి నవ్వాడు. “రెండు వజ్రాలు కొట్టుకు రా. ఇద్దరం పంచుకుందాం.”
“నువ్వేం చేశావనీ?”
“నీ స్నేహితుణ్ణా కాదా?”
“పోవోయ్! షా దగ్గిరకొచ్చేసరికి అందరూ స్నేహితులే, ” అని రొమ్ము మీద చెయ్యి పెట్టి ఒక్క తోపు తోసి వెళ్ళి పోయింది నిసి.
లాస్లో నవ్వుకుంటూ తన ఆఫీసు కేసి వెళ్ళాడు. అంతకు ముందు మౌంట్ సైనాయ్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు వాళ్ళకు స్నేహం కలిసింది. ఇద్దరూ ఫెలోషిప్ మెమోరియల్ హాస్పిటల్లో చెయ్యబోతున్నారని తెలిసినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారు. రోజూ ఏదో ఒక మిష మీద కాసేపు మాట్లాడుకుంటే వాళ్ళ ప్రాణానికి తృప్తిగా ఉంటుంది. ఇద్దరూ పనిలో మంచి హుషారు, తెలివితేటలు చూపిస్తారు.
నిసి చెప్పిన వార్త లాటివి ఆ హాస్పిటల్లో తరచూ వినిపించేవే. వేరే వేరే దేశాలనుండి అథిక ధనవంతులు, ప్రసిద్ధులు, రాజులు, ప్రధాన మంత్రులు, ప్రెసిడెంట్లు వైద్యానికి వచ్చిపోతుండే కేన్సర్ హాస్పిటల్ అది.
ఇండియా ప్రెసిడెంట్ సంజీవరెడ్డికి లంగ్ కేన్సర్ వచ్చినప్పుడు వైద్యం అక్కడే జరిగింది. ఎడ్వర్డ్ బీట్టీ అప్పుడు హాస్పిటల్ ప్రెసిడెంటు, పేరు పడిన థొరాసిక్ సర్జన్. ఆయనకు ఆపరేషన్ చేసి స్వస్తత చేకూర్చి పంపాడు. అక్కడి డాక్టర్లు మాత్రం అందులో మంజిత్ సింగ్ బైన్ చెయ్యి చాలా ఉందంటారు. పేరుగొన్న ఆ ఇండియన్ థొరాసిక్ సర్జన్ అంటే చాలామందికి ప్రాణం. హాస్పిటల్ ప్రెసిడెంట్ బీటీ, రెసిడేంట్లూ, ఫెలోస్ కి ఒక రాత్రి అతని మేడ టెర్రేస్ మీద విందు ఇస్తూ, ఇండియన్ విద్యార్ధులకు ప్రత్యేకంగా తనకు, తన భార్యకు సంజీవ రెడ్డి ఇచ్చిన బహుమతులు – అశోక చక్రము, బుద్దుడి కాంస్య విగ్రహము – ఎంతో గర్వంగా చూపించడం, స్లోన్ కెటరింగ్ హాస్పిటల్ బైటికి నడుస్తున్న నిసి మనసులో మెదిలింది. తల ఎత్తి ఉత్సాహంతో ఆ భవనాల వంక చూసింది. ఎంత గొప్ప వైద్య శాల! ఏమి గొప్ప చదువుల కేంద్రమది. ఎన్ని కాన్ఫరెన్స్ హాల్స్ లో నిరంతరం అనేక రకాల కేన్సర్ వ్యాధుల మీద తర్జన భర్జనలు జరుగుతుంటాయి! ఎంతమంది ప్రాణ రక్షణ! అంతకన్న ఉత్తమ వ్యాపకం ఉన్నదా అనుకుందామె నడుస్తూ.
నిసికి ఆ మధ్యాహ్నం ఒక లింఫోమా కేస్ చూడవలసిన బాధ్యత ఉంది. కేస్ వివరాలు క్లినిక్ లో చిన్న చిన్న గదులుగా విభజింపబడిఉన్న ఒక జాగా లో కూర్చుని ఎదురుగా బల్లమీద చార్ట్ పెట్టుకుని చదువుకుంది. పేషెంట్ కుమార్ కి
ఇరవయ్యెనిమిదేళ్ళ వయస్సు. పుట్టిన తేదీ కోసం చూస్తే గమ్మత్తుగా ఆమెదీ, అతనిదీ ఒకటే. ఒకే వయస్సు వాళ్ళు. కొలంబియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ క్లాస్సిక్స్ చదువుతున్నాడని రెసిడెంట్ రాసి పెట్టాడు. పక్కనే నవ్వు ముఖం బొమ్మ కూడా వేసి ఉంది. నిసికి క్లాస్సిక్స్ ఇష్టమని వాళ్ళకు తెలుసు. నిసికి అది చూస్తే నవ్వు వచ్చింది. ఆ పేషెంట్ మీద కొంచెం ఈర్ష్య కలిగింది. నాకేమో ఈ జబ్బుల రంగం. నేను చదువుకోవాలి అనుకున్నవి ఇతనెవరో కుమార్ ఆద్వానీ చదువుకుంటున్నాడు.
ఏమిటి ఇతని వ్యాధి? కొన్ని రోజులుగా అప్పుడప్పుడు కొంచెం జ్వరం రావటం, నలతగా అనిపించటం, రాత్రి పూట అప్పుడప్పుడూ చెమటలూ గమనించాడట. ఒక రోజు స్నానం చేస్తుంటే గజ్జల్లో చిన్న చిన్న బిళ్ళల్లాగా తగిలాయట.
బయాప్సీ చేసారు, హాడ్జ్కిన్స్ – ? లింఫోసిటిక్ టైప్ అని ఉంది. పెథాలజీ స్లైడ్లు ఉన్నాయి. ఛెస్ట్ ఎక్స్ రేలు, రక్త పరీక్షలు మాత్రం ఉన్నాయి. గబగబా చూసేసి అంతా బాగానే ఉంది అనుకుంటూ లోపలికి వెళ్ళింది.
బల్ల మీద కూర్చుని ఉన్న అతన్ని చూస్తే నిసి గుండె లయ తప్పింది. అతను అతి సుందరుడు. పసుపు రంగా అంటే కాదు. తెలుపా అంటే అది కాదు. గులాబీ వర్ణమా మరి. అతి నాజూకుగా సున్నితంగా ఉన్న ముఖ రేఖలు. కొద్దిగా పొడవాటి మెత్తని జుట్టు. గంభీరమైన సోగ కన్నులు. కనుబొమలు విల్లులా వంగి కొంచెంలో కలుసుకోబోయి మానేశాయి. ఓహో! నాసిక! నిసికి అతి ఇష్టమైన సరైన ఎత్తులో ఉండి కొంచెమే అంటే కొంచెం వంగి ఆ వంపుతో హృదయాన్ని లాగివేసే నాసిక.
ఇతడు డోరియన్ గ్రే! ఇతడు ఇండియన్ ఆడోనిస్?
నిసికి రెప్పలార్పటం కష్టమయ్యింది. తలుపు దగ్గర్నుంచి బల్ల దగ్గరకు రావటానికి సంవత్సర కాలం పటినట్లయ్యింది.
ఆతడు ఆమె అవస్థ గమనించాడు. ముఖం కొంచెం పక్కకు తిప్పి నవ్వుకున్నాడు. అందమైన మగవాళ్ళకు, హృదయాల్లో ఉప్పెనలు, ఉపద్రవాలు తెచ్చేట్టి వాళ్ళ ఆకర్షణ వాళ్ళకే తెలియకుండా ఉంటుందా!
అతను బల్ల దిగి , ఆమె తెలియకుండా చాచిన చెయ్యి మృదువుగా నొక్కాడు. అతని పెదాలు ఎర్రగా మెత్తగా విచ్చుకున్నాయి.
ఓ! మై గాడ్! హాడ్జ్కిన్స్ ఉన్న ఇతనికేమో కాని నాకు చెమటలు పడుతున్నాయ్. ఎంత మన్మథుడు! మన్మథుడికి జబ్బులు రావచ్చునా దేవా! అనుకుంది నిసి.
కుమార్ ! ఇక తనే మాట్లాడటం మంచిదనుకుని “నన్ను గురించి చెప్పమంటారా? ఒక మూడు నెల్లుగా ఒంటో అంత బాగుండటల్లేదు. ఓపిక తగ్గింది. జ్వరం ఎక్కువ కాదనుకోండి. ఎప్పుడైనా వంద డిగ్రీలు అలా ఉంటున్నది. ..”
నిసి ప్రస్తుతంలో పడి, అతని మాటలు వింటూ, అతని జబ్బుకు తగిన పరీక్ష ప్రారంభించింది. తల అంతా తడిమి చూచింది, మెడ ముందు వెనకలు, చంకలు, మోచేతులు, వరసగా లింఫ్ నోడ్స్ ఉండే ప్రదేశాలు తడుముతూ పరీక్ష వివరాలు పక్కనే చార్టులో గీసి ఉన్న మనిషి బొమ్మలో గుర్తులు పెడుతూ నోట్స్ రాసింది. నగ్నంగా పడుకుని ఉండగా పరీక్ష చెయ్యాలి. ‘నర్సుని పిలుచుకు వస్తాను’ -అని వెళ్ళబోయింది.
“ఏం పర్వాలేదు! మీకు అభ్యంతరం లేక పోతే నాకు ఏమీ లేదు. నన్ను బలవంతం చేసారని మీమీద నేనేమీ ఛార్జీలు పెట్టను లెండి!” అన్నాడు. కళ్ళలో మెరుపు నవ్వులు. పెదాల మిద చిన్న విషాదం. అతని జబ్బు ఏమిటా అన్న వ్యధ ఎక్కడికి పోతుంది?
బల్ల మీద పడుకోబెట్టి, లివర్, స్ప్లీన్ గాని పెరిగాయా, పొట్టలో ఇంకా ఏమైనా కణుతులున్నవా అని నొక్కి చూసింది. అసలు పెరిగిన లింఫ్ నోడ్స్ ఎడమ గజ్జలలో ఉన్నాయి. పొట్టమీద , జెనిటల్స్ మీదగా తెల్లని దుప్పటి కప్పి , పక్కనే ఎడమ వైపుగా కొద్దిగా పెరిగి ఉన్న మెత్తని రబ్బరు లాగా ఉన్న లింఫ్ నోడ్స్ పరీక్ష చేసి, వాటి సైజు, ఇతర గుణాలు బొమ్మలోకి ఎక్కించింది. టెస్టిస్ లో గాని కణుతులున్నవా అని పరీక్ష చేసింది.
అతనికి ఇబ్బంది కలుగకుండా చేతులు కడుక్కునే మిష మీద త్వరత్వరగా గదిలో ఆవలగా ఉన్న సింకు దగ్గరకు వెళ్ళిపోయింది. అక్కడినుండే “మీకు కావాలంటే లేచి కూర్చోవచ్చు. కొంచెంసేపట్లో డాక్టర్ గోల్డ్ బర్గ్ వస్తారు. ఆయన కూడా పరీక్ష చేస్తారు. మేమంతా కలిసి మాట్లాడుకున్నాక మళ్ళీ ఒక వారంలో కలుద్దాం. వెళ్ళేముందు సెక్రెటరీ బల్ల వద్ద ఆగితే మీకు అప్పాయింట్మెంట్ ఇస్తుంది.” అంది.
బల్ల మీది నుండే థేంక్స్ చెపుతూ, అన్యమనస్కంగా ఉన్న అతను కాలు మిద కాలు వెసుకుని పడుకున్నాడు. నిసి త్వరగా తలుపు తోసుకుని బయటికి వెళ్ళిపోయింది.
సాయంత్రం లాస్లోతో ఆమెకు డిన్నర్, సినిమా అంతకు ముందే ఒప్పందం ఉంది.
హాస్పిటల్ కి ఎదురుగా ఉన్న హై రైజ్ భవంతి లోనే చాలామంది రెసిడెంట్లు, ఫెలోల నివాసం. ఎప్పటికప్పుడు గబుక్కున బట్టలు మార్చుకుని. ఎంత రాత్రైనా నిమిషాల్లో పేషెంట్లను చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళటం, స్నోలోనూ , వానలోనూ డ్రైవింగ్ బాధ, చాలా కష్టాలు తగ్గిపోయి పని చేసే డాక్ట్ర్లర్లకు ఈ వసతులు ఎంతో వీలుగా ఉంటాయి. అద్దెలు నగరంలో వేరే వాటితో చూస్తే చాలా తక్కువ.
పేరు పడ్డ హాస్పిటల్స్ నగరంలో చాలా మంచి ప్రదేశాల్లో ఉంటాయి. మెమోరియల్ హాస్పిటల్ యార్క్ ఏవెన్యూ, అరవయ్యారూ ఆరవయ్యేడు స్ట్రీట్లలో ఉంది. ప్రసిద్ధి గొన్న న్యూయార్క్ హాస్పిటల్ కూడా చాలా దగ్గర్లో ఉంది. చుట్టూ హాస్పిటల్ కి సంబంధించిన భవనాలు ఇంకా ఉంటాయి.
అదే ప్రదేశంలో వేరే భవనాల్లో ఉండాలంటే ధనవంతులకు గాని సాధ్యం కాదు. దగ్గరలో సబ్వేలు, బస్టాపులు . ఎటు నడిచినా ఎన్నో మంచి రెస్టరాంట్ లు , లంచ్ బ్రేక్ లోనూ, సాయంత్రాలూ, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు చక్కగా అ చుట్టుపక్కలంతా షికార్లు కొడుతుంటారు.
నిసి లాస్లో ఒక చిన్న కఫేలో కూర్చుని సాండ్ విచ్ తింటున్నారు. నిసి కుమార్‌ని గురించి చెప్పకుండా ఉండ లేక పోయింది. పేషెంట్ల ప్రైవసీ అంటూనే హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ఒకరికొకరు అందరి గురించి ప్రైవేటుగా ముచ్చట్లు చెప్పేసుకుంటారు.
కుమార్ భలే అందంగా ఉన్నాడని మహా మెచ్చుకోలుగా చెప్పింది.
లాస్లో చిన్న కళ్ళు ఇంకొంచెం చిన్నవయ్యాయి.
” వ్హాట్! నాకన్నా బాగున్నాడా?” అన్నాడు తన ఎర్ర రంగు గడ్డాన్ని అరిచేత్తో రాసుకుంటూ.
“వందరెట్లు ” అంది ఫెడీమని నిసి.
“రాక్షసి!” అన్నాడు లాస్లో.
“ఉడుకుమోతు” అంది నిసి.
“ఏమి అదృష్టవంతురాలివి. పొద్దున ఇరాన్ షా, మధ్యాహ్నం ఇండియన్ నవమన్మథుడు అన్నమాట!”
“అన్నమాటే! సాయంత్రం మాత్రం ఎర్ర గడ్డం హంగేరియన్.”
“బేంకులో పైసాలేని, పెద్ద బరువైన స్టూడెంట్ లోన్ మాత్రమే కలిగిన హంగేరియన్ అను. ఐనా ఈ కుమార్ ఏం మొగాడోయ్! ఇంగ్లిష్ క్లాస్సిక్స్ చదువుకుంటున్నాడా! ఆ తర్వాత ఉద్యోగం ఎవడిస్తాడు? అందంగా ఉన్నాడంటున్నావు. ఆ తర్వాత బ్రాడ్వే మీదికో, సినిమాల్లోకో పోతాడేమో నిసీ ”
“అంతే అయిఉంటుంది. బ్రహ్మాండమైన ఇంగ్లిష్ ఏక్సెంట్ కూడాను.” అంది నిసి.
“పెద్ద కాంపిటీషనే!” అని మూలిగాడు లాస్లో.
ఇద్దరూ కాఫీ తాగేసి, సినిమా హాల్ కేసి నడిచారు.
మరుసటిరోజు పెథాలజీ కాన్ఫరెన్స్ లో వారంతా కుమార్ స్లైడ్స్ చూశారు. హాడ్జ్కిన్స్ వ్యాధి అనీ, ఏ రకమో ఇంకా కొన్ని పరీక్షలు చేసి చెపుతానన్నాడు ఒక పెథాలజిస్ట్ . ఆ పూట డాక్టర్ గోల్డ్‌బెర్గ్ చాలా ఉషారుగా ఉన్నాడు. కేసుని గురించి మహా ఉత్సాహం చూపించాడు. స్క్రీను మీద వేసిన బొమ్మలే కాకుండా, తాను సైడ్స్ ని ప్రత్యేకంగా మైక్రోస్కోపులో పెథాలజిస్ట్ తో కలిసి చూశాడు. సెలెబ్రిటీలను మాత్రమే శ్రద్ధగా చూసే ఈ చీఫ్, ఈ ఇండియన్ కుర్రాడి మీద ఎందుకు శ్రద్ధ. ఎవరైనా పేద్ద స్నేహితుడి రెకమెండేషన్ ఐ ఉండాలి అనుకుంది నిసి. ఎలా తీసుకున్నాడో ఈ కేసు అనుకుంది. తర్వాత లింఫోమా గ్రూపు వాళ్ళు వేరుగా అన్ని కేసులు మాట్లాడుతూ , ఆ కుర్రాడి కేసు కూడా చర్చించారు. నిసీ కూడా ఉంది. ప్రాథమిక దశలో ఉన్న వ్యాధి. ప్రపంచమ్మీద జర్నల్స్ తిరగా మరగా చదివేసి, కొత్త కొత్త ఆర్టికల్స్ నన్నీ చూసి అతలాకుతలం అయ్యేది ఏం ఉంది, ఇందులో అనుకుంది నిసి.
కుమార్ ని మళ్ళీ చూసే రోజు రానే వచ్చింది. చెల్లెలిని వెంటబెట్టుకు వచ్చాడు ఈసారి. చక్కదనాల భరిణి. హైస్కూలు పూర్తి కావస్తున్నదట. అన్న వైద్యం గురించి మాట్లాడేప్పుడు తను ఉండలేననీ, బైట కూర్చుంటానని వెళ్ళిపోయింది. గోల్డ్‌బెర్గ్ వచ్చి ఎంతో ప్రేమగా పేషెంట్ తో కరచాలనం చేశాడు. వైద్యం గురించి చెఫ్ఫాడు. కొత్త ప్రోటొకాల్ ప్రకారం ఒక మూడునెల్లు ఖీమో, మళ్ళీ కొన్నాళ్ళు ఎడమ గ్రాయిన్లోని గడ్డలకు రేడియేషన్, మళ్ళీ మూడు నెల్లు ఖీమోథెరపీ. లేదంటే లివర్, స్ప్లీన్ కీ , పొట్టలో అయోర్టా పక్కనా రెండు గజ్జల్లోనూ ఉండే లింఫ్ నోడ్స్ అన్నిటికీ రేడియేషన్. పొట్ట మీద బొమ్మ గీస్తే తిరగ బడిన ‘వై’ లాగా ఉంటుంది రేడియేషన్ ఇచ్చే ఏరియా. ఇది లార్డెస్ నిసీ ప్రవేశ పెట్టిన చికిత్సల్లో ఒకటి . ప్రోటొకాల్ ఏది నిర్ణయిస్తే అలా చేద్దాం రెండూ మంచి పద్ధతులే అని కష్టాలు నష్టాలు లాభాలు అన్నీ వివరించాడు. అంతా అయ్యేసరికి అసలు రోగికి జబ్బు తగ్గెదీ లేనిదీ అన్న విషయం చెప్పాలన్న విషయమే తట్టదు అతనికి. ఒక అధ్భుతమైన సైన్స్ ప్రాజెక్ట్ లాగా చెపుతాడు. మనిషి, మనసు, జీవితం ఇలాటి చిన్న విషయాలు అతనికి లెక్కలోకే వచ్చినట్లు లేదు . వింటున్న నిసికి రోగికి ఏదో భయంకరమైన వ్యాధి వచ్చినట్లుగాను, దాన్ని నాశనం చెయ్యాలంటే చాలా మారణహోమం వైద్యం చెయ్యాలనీ, అది ఆ హాస్పిటల్లో మాలావు మెషిన్లు ఎంత గొప్పగా చెయ్యగలవో , ఒక మంత్రవేత్త వింతలు విచిత్రాలు చెప్పినట్లుగా అనిపించింది.
ఇందులో కుమార్ ఎక్కడ?
ఇతని జబ్బు చాలా ఆరంభ దశలో ఊంది. గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు. ఈ కొత్త గా డిజైన్ చేసిన ప్రోటోకాల్ చిన్న వయసులోని ఇతనికెందుకు. ఇతని జీవితం అంతా ముందుంది గదా. దీనివల్ల అతనికి సంతానం కలక్కుండా పోవచ్చు. ఆ తర్వాత కొత్త కేన్సర్లు రావచ్చు.
ఎందుకో గోల్డ్‌బెర్గ్ ఈ పేషెంట్ జబ్బు పదింతలు, వైద్యం కొండంతలు చేసినట్లు ఆమె కనిపించింది.
పక్కన కొంచెం వెనగ్గా నుంచున్ననిసీ, తనకు తెలియకుండానే నుదురు చిట్లించింది, మూతి ముడిచింది. తల అప్పుడప్పుడూ అడ్డంగా ఊగించింది.
కుమార్ అంత పెద్ద వైద్యం చేయించుకోవాలనేసరికి కొంచెం చిన్నబోయాడు. ఇంటి దగ్గర ఉన్న తల్లి ఇది వింటే ఎంత బాథ పొందుతుందో అని మనోవ్యాకులత కలిగింది. ఆమె తనకు చిన్న ఇబ్బంది కలిగినా సహించలేదు. తన చిన్న చెల్లి తనను బైటికి వెళ్ళగానే లక్ష ప్రశ్నలు వేస్తుంది. ఆమె కళ్ళ వెంట నీళ్ళు తను చూడలేడే! తండ్రి కూడా ప్రస్తుతం వాళ్ళ దగ్గిర్లో లేడు.
లోలోన మథన పడుతూ అతను మధ్య మధ్యలో నిసీని గమనిస్తున్నాడు.
డాక్టర్ గోల్డ్‌బెర్గ్ – ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే నిసి ముగిస్తుంది- అని వెళ్ళిపోయాడు.
నిసి కొంచెం సేపు మౌనంగా ఉండి, కుమార్ ఇంక ఏమీ అడగక పోవటంతో బయటికి వెళ్ళిపోబోయింది.
“డాక్టర్!“ వెనకనించి పిలుపు.
మళ్ళీ వెనక్కు వచ్చింది.
“నిసీ! డాక్టర్ గోల్డ్‌బెర్గ్ మాట్లాడుతుంటే మీ ముఖంలో కొంచెం ఆదుర్దా చూశాను. ఏమిటి విశేషం? మీరు అతనితో విభేదిస్తున్నారా?”
అతని ముఖం చెమటలు పట్టి నిగనిగలాడుతున్నది. చెవులు ఎర్రగా కందిపోయాయి. కళ్ళు విశాలాలయ్యాయి.
“రియల్లీ! అలాటిదేమీ లేదే” అంది నిసీ.
“ఉంది. నా జబ్బు గురించి మీఅభిప్రాయం ఏమిటి?”
“కుమార్ ! మీ జబ్బు చాలా ప్రారంభ దశలో ఉంది. దాన్ని నయం చెయ్యటానికి ఇంత బ్రహ్మ ప్రయత్నం అనవసరం. కేట్ స్కానుల్లొ, లింఫాంజియో గ్రాం లో ఏం జబ్బు లేదు. పెథాలజీ స్లైడులు హాడ్జ్కిన్స్ వ్యాధిని గురించి బాగా తెలిసిన వాళ్ళు దేశంలో ఇంకోఇద్దరు చూసేట్లుగా అడగండి. అది మంచి పద్ధతి. ఏ రకం లింఫోమానో సరిగ్గా నిర్థారిస్తారు. మీకున్న రకం హాడ్జ్కిన్స్ ఇంకా తక్కువ వైద్యంతోనయం చెయ్యొచ్చు. మళ్ళీ తిరిగి వస్తుందని ఎక్కువ భయం ఉన్న వాళ్ళు ఎక్కువెక్కువ వైద్యానికి ఇష్టపడతారు. కావాలంటే అలాగూ చెయ్యొచ్చు. నా మొగ్గు కొన్నిసార్లు తక్కువ వైద్యం మీద ఉంటుంది. కాని నా ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళకు చాలా అనుభవం ఉంది. తెలుసుగా” అంది.
అతనికి ఎంతో సత్తువ వచ్చింది. “పెద్ద జబ్బేం కాదన్న మాట. తగ్గిపోతుంది. అంతసేపు మాట్లాడి ఆ సంగతి చెప్పడేం మరి ” అన్నాడు.
“సరిగ్గా వైద్యం చేస్తే చిన్న జబ్బు. లేకుంటే పెద్ద జబ్బు కావచ్చు. కాని వైద్యం ఉంది గదా పూర్తిగా నయం చేసేందుకు. రాజా లాటి జబ్బు చప్పున నయం ఐపోతుంది.” అంది నవ్వుతూ నిసి.
బల్ల మీది నుంచి ఒక్క గంతు వేసి కిందికి దిగి నిసిని కావిలించుకున్నాడతను జారే బట్టను సర్దుకుంటూనే. నిసికి ఒళ్ళంతా ఆవిర్లొచ్చాయ్.
“ఎక్కడికీ వెళ్ళొద్దు మీరు. ఇదిగో, నేను బట్టలు మార్చుకునేవరకూ.” నిసి అవతకు తిరిగి నుంచుంది.
బట్టలు మార్చుకున్నాక “ఈ వీక్ ఎండ్ ఏం చేస్తున్నారు” అన్నాడు.
“ఇంకా ఏం అనుకోలేదు ” అంది నిసి.
“మా ఇంటికి రావాలి”
“ఇంకోసారి ఎప్పుడైనా. సోమవారం ఫిజిక్స్ పరీక్ష ఉంది. రేడియేషన్ ఫిజిక్స్ కోర్స్ తీసుకుంటున్నాను. ముప్ఫయిమంది మెడికల్ ఫిజిసిస్టులున్న హాస్పిటల్ ఇది. ఎందరో మహానుభావులు. ఇలాటి అవకాశం మళ్ళీ వస్తుందా! మా ఇటాలియన్ గురువు గారికి నా మీద ఇష్టం. ఫిజిసిస్టులతోపాటు సమానంగా నాకు మార్కులు రాకపోతే ఆయనకు బాధ కలుగుతుంది.”
“ఎక్కువ సెపు ఉండవద్దు. మా అమ్మకు మీరు నా జబ్బు గురించి చెపితే , నేను చెప్పిన దానికన్న బాగా అర్ధం అవుతుంది. ఆమెకు మనశ్శాంతి కలుగుతుంది. ఇండియన్ అమ్మల మనస్తత్వం మీకు నేను చెప్పాలా” అన్నాడు కుమార్ .
నిసి నవ్వింది. “అర్థమయింది. అడ్రెస్ ఇవ్వండి. సబ్వే స్టేషన్ దగ్గరేనా?”
“నేను వచ్చి తీసుకు వేడతాను. మా అమ్మ మీద దయయుంచి వస్తారుగా.”
మరుసటి రోజు శనివారం. సాయంత్రం నాలుగింటికి నిసి అపార్ట్మెంట్ డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఒక షోఫర్ నుంచుని ఉన్నాడు. చేతిలో ఎర్రగులాబీ గుఛ్చం ఉంది. “మీ కోసం కుమార్ పంపారు.”
ఆశ్చర్య పోయింది నిసి , లోపల్ వేస్లో పూలు సర్ది ఉంచి, ప్రీతితో వాటిని వాసన చూసింది. ఓహ్! ఎందుకీ గులాబీలు!
షోఫర్ తో కిందికి వెడితే అక్కడ ఒక పెద్ద నల్ల లిమోసీన్ ఉంది. కంగారు పడింది నిసి. కుమార్ ఇంటికేగా అని అడిగింది ఎక్కేముందు.
“అవును మేడం” అన్నాడతను కారు తలుపు వేస్తూ.
లిమో మన్‌హాటన్ లో విచ్చలవిడిగా పరిగెత్తే పసుపు టాక్సీలు, కార్లు, బస్సులు మధ్యగా నిదానంగా వెళ్ళి యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్ దగ్గర్లో రివర్ పక్కగా ఉన్న ఒక హైరైజ్ భవంతి గరాజ్లో ఆగింది. షోఫర్ అమెను ఎలివేటర్లో పై అంతస్తుల్లొ ఉన్న ఒక పెంట్ హౌస్ లో విడిచి వెళ్ళి పోయాడు. ఎలివేటర్ తిన్నగా, నున్నగా పాలరాయి చేసిన ఎంట్రీ ఫోయెర్ లోకి తెరుచుకుంది. ఎదురుగా గుండ్రని బల్ల మీద ఇంత పెద్ద వాటర్ ఫోర్డ్ వేస్ లో తనకు పంపిన లాటివే గులాబీలు. దాని మీదుగా చూస్తే ఈస్ట్ రివర్. నదిలో పడవలు. గోడలమీద టేపెస్ట్రీలు , అక్కడక్కడా పెడెస్టల్స్ మీద కంచు శిల్పాలు. నేల మీద పర్షియన్ రగ్గులు.
ఎటు నుండి వచ్చాడో కుమార్: “హలో! వచ్చినందుకు ధన్యవాదాలు.” అన్నాడు. సిల్క్ పేంట్స్. కష్మీర్ స్వెటర్ ! నవ్వు ముఖం!
“ఓ మి గాడ్” అని తనను సంబాళించుకోడమే పని ఐపోయింది నిసికి.
” మా అమ్మ గారు లోపల ఉన్నారు, రండి ” అని తీసుకు వెళ్ళాడు. సిల్క్ సోఫాలొ మెత్తని చిన్న దిండ్ల మీద రాణి లాగా ఆని ఉన్నదామె.
నిసిని ఆప్యాయంగా పక్కన కూర్చో పెట్టుకుంది. పక్కగా ఉన్నచిన్న ఆకులలాటి వెండిపళ్ళెరాల్లో బాదం పిస్టేషియో, మేకెడేమియాలు, రకరకాల రంగులు సైజుల్లో ద్రాక్షగుత్తులు ఉన్నాయి. గాజు కూజాల్లో ఐస్ వేసి నీరు, ఇతర పానీయాలు. వెడల్పాటి గాజు అద్దాల్లోనుండి బయటి రంగులు మారిన చెట్ల ఆకులు వాటి అనంత ప్రతిబింబాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి.
కుమార్ గురించి నిసితో అన్ని విషయాలు అంతా సవిస్తరంగా చెప్పించుకుందామె. అప్పుడప్పుడూ కన్నీళ్ళు పెట్టుకుంటూ, నిసి చేతులు పట్టుకుని, చెంపలకు నుదుటికి ఆనించుకుంటూ ఆవేదన పడింది.
పక్కనే కుర్చీలో కూర్చుని, నవ్వుతూ, అమ్మా! ఖంగారు పడమాకు! అని మధ్య మధ్య ధైర్యం చెప్పాడు కుమార్.
అప్పుడప్పుడు నిసి వైపు చూసి తలపంకిస్తూ ఆమెకు నవ్వు తెప్పిస్తున్నాడు.
ఇంతలో ఫోన్ మోగింది.
కుమార్ ఎత్తాడు. “ఎస్! డాక్టర్ గోల్డ్‌బెర్గ్ ! ష్యూర్! నన్ను చూసినందుకు చాలా థేంక్స్.” నిసి ఫోన్ తన కోసమేమో అని లేవబోతుంటే కాదన్నట్లు చెయ్యి ఆడించి, కూర్చోమని సూచిస్తూ, నిసి వంక చూస్తూ పెదిమల మీద వేలు ఉంచాడు. నిసి సర్దుకుంది. అసలు తను ఇక్కడ ఉన్నట్లు గోల్డ్‌బెర్గ్ కి తెలియదు కదా! తనకెందుకు వస్తుంది ఫోన్.
“ఏమిటి విశెషం. డాక్టర్ గోల్డ్‌బెర్గ్ ! వీకెండ్ పిలుస్తున్నారు. నన్ను గురించి కొత్త విషయాలేమైనా తెలిశాయా!” కొంచెం సేపు మధ్య మధ్యలో ఆహా, ఊహు అంటూ అవతలి వైపు సంభాషణ విన్నాడు
“ఓ! పిల్లల లుకీమియా వింగ్! నేను స్టూడెంట్ ని. ఏదో నా చదువుకు సరిపడా డబ్బు ఉంది ట్రస్ట్ ఫండ్స్ లో. మా ఫాదర్ వస్తారు న్యూయార్క్ త్వరలో. మీరు మాట్లాడుదురు కాని.
నా ట్రీట్మెంట్ ఎక్కడ, అని నెను ఇంకా ఆలోచించుకోవాలి. లండన్ క్రిస్టీ లో కావచ్చు. మీ దగ్గర కావచ్చు. నా వైద్యం ఎక్కడయితేనేం. మెమోరియల్ హాస్పిటల్ కి డొనేషన్ ఇవ్వటానికి. మీకు తెలుసు కదా ప్రపంచంలో మా ఫేమిలీ పేరుతో ఎన్ని హాస్పిటళ్ళలో భవంతులున్నదీ! నా వైద్యానికీ మీకిచ్చే డొనేషన్ కీ ఏం సంబంధం ఉండదు. మనం మళ్ళీ కలుద్దాం. థేంక్యూ.”
నవ్వుతూ, నిసి వంక చూశాడు ఫోన్ పెట్టేసి.
నిసి కళ్ళింత చేసుకుని అతని కేసి చూస్తున్నది.
డాక్టర్ గోల్డ్‌బెర్గ్ ఆత్రుతంతా కుమార్ – కుమార్ అద్వానీ, ప్రపంచంలో కల్లా ధనవంతుల్లో, ఫోర్బ్స్ 400 లిస్ట్ లో ఉన్న, లండన్ లో ఉండే ఇండియన్ ఫేమిలీ – అద్వానీ. హోలీ క్రైస్ట్ !
“అవును నిసీ! హాస్పిటల్లొ అందరికీ నిమిషాలమీద తెలిసింది నేనెవరో . మీకు ఒక్కరికి తెలియలేదు. కాని నా జబ్బుకి తగిన వైద్యం మాత్రం మీకు తెలిసింది. హాట్స్ ఆఫ్ టు యు! “అని నవ్వుతూ నెత్తి మీద లేని టోపీ తీసి అమె నెత్తిన పెట్టినట్లుగా నటించాడు కుమార్ అద్వానీ.
“అందరూ డబ్బులున్న వాళ్ళకి మంచి వైద్యం జరుగుతుంది అనుకుంటారు కదా! అది తప్పు నిసీ. సరిగ్గా పరీక్షలు జరగవు. ఎక్స్‌రేలు అక్కడా ఇక్కడా పోతాయ్. స్లైడ్లు పారేస్తారు. చెయ్యాల్సిన వాటికన్నా ఎక్కువ పరీక్షలు చేస్తారు. కబుర్లాట్టం. కాళ్ళు విరగ తొక్కుకోటం. వెళ్ళిన ప్రతి చోటా మొదటి వారంలోనే డొనేషన్ గురించి ఫోన్లు వస్తాయి. ఎంతో అభిమానం చూపించినట్లు ఉంటారు కాని, అసలు నా మీద ధ్యాసే ఉండదు.”
కుమార్ పక్కనే వచ్చి కూర్చుని చెపుతున్నాడు.
నిసి ఎక్కడ వింటున్నది. ఆమె నిర్ఘాంతపోయి కూర్చుండిపోయింది. కుమార్ ఆద్వానీ ! ఐనా తనకు తెలియ లేదు. మొహమ్మద్ రెజా పహ్లావి – షా ఆఫ్ ఇరాన్ గనక కుమార్ ని కలిస్తే వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళు వెంటనే తెలిసి పోతారు. తనకి ఎవరూ తెలియరు. అవును. లాస్లో అదే అంటాడు తనను – ‘తెలివిగల అజ్ఞాని’ అని.