నువ్వు నాకొద్దు

అది అమెరికాలో ఒక సిటీకి ఒక 40 మైళ్ళ దూరంగా కొన్ని పల్లెటూళ్ళకు అందుబాటు లో ఉండేట్లు హైవేకి దగ్గరలో నిర్మించిన మధ్య సైజు ఆసుపత్రి . ఆ కాంపౌండులోనే ఆసుపత్రి నించీ బయటనించీ కూడా రోగులు సులభంగా జేరుకొనేట్లు అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఆంకాలజీ ( కాన్సర్ )సెంటరు. అందులో రేడిఏషన్ థెరపీ విభాగం, చిన్న సర్జికల్ స్వీటు, ఖీమోథెరపీ విభాగం, చిన్న కాన్ఫరెన్సు హాలు ఉన్నాయి.

ఆ రోజు ఉదయం ఎప్పట్లానే పేషెంట్లతో కాన్సర్ సెంటరు రేడిఏషన్ థెరపీ విభాగం- వెయిటింగ్ రూం కిక్కిరిసి ఉంది. ప్రతి రోగి పక్కనా ఎవరో ఒకరిద్దరు కుటుంబ సభ్యులో స్నేహితులో తోడుగా కనిపిస్తున్నారు. అక్కడక్కడా పార్క్ చేసిన వీల్ ఛైర్ల లో నీరసంగా జేరగిల బడినవాళ్ళో ముందుకు వంగబడి పోయి కూర్చున్న వాళ్ళో కొందరు. మరి కొందరు హాస్పిటల్ పూల గౌనులు తొడుక్కుని ఉన్నారు. బైటనుంచీ వచ్చిన బట్టలతో ఉన్నవాళ్ళు కొందరు . పక్కనే కర్టెన్లు మూసిన క్యూబికిల్శ్ వాటిలో స్ట్రెచర్ల మీద పడుకుని ఉన్న రోగుల కదలికలు, సన్న మూలుగులు, మాటలు వినవస్తున్నాయి.

రిసెప్షన్ డెస్క్ దగ్గర ఒక చక్కని నల్ల పిల్ల కూర్చుని ఉంది. చెవుల నిండి భుజాల దాకా వరసలు వరసలుగా గులాబీ పూసల ఝుంకీలు వేలాడుతున్నాయి. మాచింగుగా చేతికి గులాబీ పూసల పట్టీ ధరించింది. పిల్ల మంచి చలాకీ కళ్ళతో, చురుకుగా ఉంది. ఎదురుగా నుంచుని ఒక ఆంబులెన్స్ డ్రైవరు ఏమీ ఛాన్స్ లేదని తెలిసినా మళ్ళీ పేషెంట్లని ఎక్కిచ్చుకొని వెళ్ళే లోపల టైం పాస్ కోసం రిసెప్షనిస్టు తో ఫ్లర్ట్ చేస్తున్నాడు.

డాక్టరు. నిసీ షామల్ ఈ సీనంతా చూస్తూ వెయిటింగ్ రూంలోనుండి అటూ ఇటూ వాళ్ళకి గుడ్ మోర్నింగులు కొడుతూ లోపలి పక్క గుమ్మంలోచి డాక్టర్ల ఆఫీసుల గదుల వైపుకు వెళ్ళి పోయింది. తన గదిలోకి వెళ్ళి పైనున్న నీలం బ్లేజర్ ని తీసి గోడమీది హుక్ కి వేళ్ళాడేసింది. చక్కటి నీలినీలి చిన్నచిన్న పూలున్న సిల్కు బ్లౌజు, స్కర్ట్ వేసుకుందా రోజు. చెవులకు ఒక్కరాయి నీలి శాఫైరు . చేతికి సన్నని బంగారు స్ట్రాప్ ఉన్న బామ్- మర్సిఎర్ వాచ్ . కాళ్ళకు వంటి రంగులో కలసి పొయ్యే పాంటీ హోస్. మాచింగ్ నీలి రంగు బాల్లీ షూస్. నిసి షామల్ గోడ కొక్కేనికి వేలాడే తన లాబ్ కోటును తొడుక్కుంది. డ్రాయరు సొరుగు తీసి కోటు జేబుకు తన ఫొటో, పేరూ ఉన్న ఐడెంటిఫికేషన్ బాడ్జ్ , పక్కనే ఫిలిం బాడ్జ్ తగిలించింది. తన కుర్చీలో కూర్చుంటూ కంప్యూటర్ ఆన్ చేసి ఆ ఉదయం తన స్కెడ్యూల్ చూసుకుంది.

9.30. డేవిడ్ ఆర్థర్, 74
ప్రోస్టేట్
10.30. రూథ్ టెన్నర్. 53
బ్రెస్ట్
11.00. ఫిలిప్ వెల్. 44
గ్లయోబ్లాస్టోమా.
12.00. డ్రగ్ రెప్ లంచ్. ( చైనీస్ )
డెస్క్ మీద ఉన్న కొత్త రెడ్ జర్నల్లో ఉన్న ఆర్టికల్సును ఒక సారి చూసింది. ముఖ్యంగా తను ఆ ఉదయం చూసే పేషెంట్లను దృష్టి లో పెట్టుకొని కూడాను. బ్రెస్ట్ కాన్సర్ కొత్త ట్రీట్మెంట్ టెక్నిక్ ఒకటి చదివి , మళ్ళీ చదవాలనుకుంది. బ్రెయిన్ ట్యూమర్లలో గ్లయోబ్లాస్టోమా గురించి వ్రాసి ఉన్న విషయాలను కొన్ని చదువుకుని , తన కంప్యూటర్ లో నోట్ చేసుకుంది. 

టైం తొమ్మిది కావస్తుంది . పేషెంట్లను పరీక్ష చేసే గదులు దాటి వెనక్కు పేషెంటు ట్రీట్ మెంట్ ఏరియా లోకి నడిచింది. ఒక్కొక్క ట్రీట్ మెంట్ కాంసోల్ ముందు ఇద్దరు టెక్నాలజిస్ట్లు పని చేస్తున్నారు. మోనిటర్ల మీద లోపల లీనియర్ యాక్సెలరేటర్ కింద బల్లల మీద పడుకొని ఉన్న పేషెంట్లని గమనిస్తూ అప్పుడప్పుడూ ఇంటర్ కం లో వాళ్ళను కదలవద్దని హెచ్చరిస్తున్నారు. యాక్సెలరేటర్లు ఉన్న గదులు ఎంతో మందాన ఉన్న తలుపులతో మూసి ఉన్నాయి . తలుపు పైగా ఉన్న ఎర్ర లైటు వెలుగుతూ రేడియేషన్ ట్రీట్మెంట్ జరుగుతున్నట్లుగా హెచ్చరిస్తోంది.

నిసీ ఒకరిద్దరు టెక్నాలజిస్టులను నవ్వుతూ పలకరించింది. అంతకు ముందు రోజు తన రోగుల నుండి ఏవైనా ఇబ్బంది సబ్బందులున్నవా అని కనుక్కుంది. కొంచెంసేపయ్యాక అవతలి పక్క కారిడార్ లో ఉన్న ఫిజిసిస్టుల ఆఫీసు దగ్గర ఒకసారి ఆగింది . లోపల ఇద్దరు ఫిజిసిస్టులు దీక్షగా కంప్యూటర్ల ముందు పనిచేస్తున్నారు. పక్కన బల్ల మీద గుట్టలుగా ట్రీట్మేంట్ ప్లాన్నింగ్ కాట్ స్కాన్లు, సిమ్యులేటర్ నుండి వచ్చిన ఎక్స్ -రేలు పెట్టి ఉన్నాయి. మార్కు చేసి పేట్టి ఉన్న ట్యూమర్ ఆకృతులు ఇతర ప్రధానమైన ఆర్గన్ల ఆకృతులు కంప్యూటర్లలోకి ఎక్కించి రేడిఏషన్ ఎలా ఇవ్వాలో ప్లానులు తయారు చేస్తున్నారు. ఆ ప్లానులను బట్టి డాక్టర్ల అభ్యర్ధన మేరకు ప్రతి కొత్త పేషెంట్ కూ రోజూ ఇవ్వాల్సిన రేడిఏషన్ డోస్ ల లెక్కలు గట్టటం జరుగుతూ ఉంది. ఉన్న జబ్బును పట్టి కొందరికి ఒక రోజులోనో, కొందరికి రెండువారాలలోనో ఐపోయే వైద్యం కొందరికి ఆరేడు వారాలు పడుతుంది.

నిసీ ఒక్క సారే స్నేహంగా ఇద్దరి ఫిజిసిస్టులు భుజాల మీద చేతులు వేసి నొక్కి, ఇద్దరి కుర్చీల మధ్యగా ఓ నిమిషం నించుంది. వాళ్ళూ మళ్ళీ వాళ్ళ చేతులు ఆమె చేతుల మీద వేసి నొక్కారు. రాబీ. ఆర్డెన్ ఇద్దరూ నిసీకి ఇష్టమే. వాళ్ళకీ అంతే. అప్పుడప్పుడు వాళ్ళకు ఖాళీ దొరికినప్పుడూ కొంచెం ప్రేమ పెరిగినప్పుడూ నిసీ అసలు ఆ డాక్టరు రాక్షసుల గుంపులో ఉండాల్సిన పిల్ల కాదనీ, ఫిజిసిస్టు గ్రూపులో జేరిపొమ్మనీ అడుగుతుంటారు.

ఆ ఫిజిక్స్ గదిలో, తను చూడవలసిన ప్లానులు చూసుకొని, రాబీనీ ఆర్డెన్ నూ ఓ నాలుగు ప్రశ్నలడిగి తనకున్న సందేహాలు తీర్చుకుని ప్లానులూ, చార్ట్ ల మీద సంతకం పెట్టవల్సిన చోట్ల సంతకాలు పెట్టి మళ్ళీ తన ఆఫీసు వైపుకు నడిచింది.

టైం 9.30. పేషెంటు ఇంకా రెడీ అయినట్ట్లు లేదు . తనకు చూడటానికి ఇంకా పిలుపు రాలేదు నర్సు నుండి.

ఆఫీసులో బల్ల ముందు కూర్చుని లాబ్ రిపోర్టులు చూసి నంతకాలు పెట్టీ చార్ట్లో ఫైలు చెయ్యవలసిన బాక్సు లోపడేసింది. కొన్ని ఎం.ర్.ఐ . స్కానులు వ్యూ బా క్సుల మీద వరసగా పెట్టుకుని చూసింది . ఇంకా నర్సు జాడ లేదు.

కుర్చీలో చేరబడి కొంచెంఆలోచనలో పడింది.

నిసీ షామల్ కు ఒక యూనివర్సిటీ హాస్పిటల్ లో టీచింగ్ , రోగులకు వైద్యం చేశే బాధ్యతలూ, వేరే ఇంకో ప్రయివేటు కాన్సర్ సెంటరు లో భాగస్వామ్యమూ, రోగులను చూచే బాధ్యతలూ ఉన్నాయి. తన ప్రాక్టీసులో తనకు తర్ఫ్హీదు ఇచ్చిన అంతర్జాతీయంగా పేరెన్నిక గన్న డాక్టరు గురువులు నేర్పినదానికి . జర్నల్సు చదివీ, దేశవ్యాప్తంగా జరిగే కాన్ఫరెన్స్ లకు వెళ్ళీ ఇంకొంచెం కొత్త వైద్య విజ్ఞ్నానాన్ని జోడిస్తుంది. తన ప్రాక్టీసులో తాను వైద్య ఫలితాలు గమనించిందాన్ని , తన సొంత అభిప్రాయాలు, పేషెంట్లు అందించే సలహా సమాచారాలూ ఇవన్నీ లెక్క లోకి తీసుకుని తన వైద్యం సాగిస్తుంది నిసీ .

వైద్యం సైన్స్ మాత్రమే కాదు ఆర్ట్ కూడాను అని ఆమెకు నమ్మకం వృద్ది కాసాగింది. పేషెంట్ల మాటల వల్లా వాళ్ళూ వెలిబుచ్చే సంతృప్తీ, అసంతృప్తులు ఇవి చూచాక రేడిఏషన్ ఒక్కటే ఇచ్చి కూర్చుంటే చాలదని , పేషెంట్ మళ్ళీ మనుషుల్లో పడేట్లు చేయటనికి ఒక్క ఆధునిక వైద్యమే కాక పాతకాలపు ప్రేమాభిమానాలు మర్యాద మన్నన చాలా అవసరం అని చక్కగా తెలిసింది. కష్టాలలో ఉన్నరోగులకు వాళ్ళ అహం, ఆత్మగౌరవం దెబ్బ తినకుండా వైద్యం పూర్తి చేసి మళ్ళీ బైట ప్రపంచంలో తమ మామూలు పనులు చేసుకునే శ క్తినిచ్చి పంపించడానికి ఎంతో నేర్పూ ఓర్పూ కావాలని రోజు రోజుకూ తెలిసి వస్తోంది డాక్టరు షామల్ కు .

ఇండియా నుండి అమెరికాకు వచ్చిన కొత్తలో నిసీ వయసు పాతిక సంవత్సరాలు. కాన్సర్ వైద్యం లో శిక్షణ పొందుతూ అన్ని రంగులు జాతుల అమెరికన్ పేషెంట్లను చూడటం మొదలెట్టిన ఆమెకు , మొదటిలో 40, 50, ఏళ్ళ వాళ్ళు ముసలి వాళ్ళు గా కనిపించారు. చచ్చిపోతే మాత్రం ఏం? ఈ వైద్యాలూ ఇవన్నీ ఎందుకు ఇంత వయసు వచ్చాక. వీళ్ళకు బతకడానికి ఇంత తాపత్రయం దేనికీ అనుకునేది. ఇలాఆలోచించడానికి నిసీ చిన్న వయసు ఒక్కటే కారణం కాదు. ఇండియానుండి తెచ్చుకున్న పిలాసఫీ. అక్కడ ఆ వయస్సులొనే కాళ్ళార చాపుకొని ఏమీ చెయ్య కుండా క్రిష్ణా, రామా అనుకోవానేవాళ్ళని చూసి కొంత . ‘నానాటి బతుకు నాటకమనీ, పుట్టుటయు నిజమూ, గిట్టుటయు నిజమూ, నట్ట నడి నీపని నాటకమూ’ అనే అన్నమయ్య పాటలు వినీ వినీ వంటబట్టిన వేదాంతం. హాస్పిటల్ కు డ్రైవు చేస్తూ కారులో ఏరీ కోరీ పెట్టుకోనే ఘంటసాల ‘జగమే మాయా, బ్రతుకే మాయా, వేదాలలో సారమింతే నయా, ఈ వింతేనయా’ అనే నిస్ప్రుహ సినీగీతాలూ – ఇవి వింటుంటే ఇరవైల్లోఉన్న నిసీ కే బ్రతుకు మీద వైరాగ్యం. ఇంక కాన్సర్ రోగులు , ఇంత జబ్బు చేసి ఉన్నవాళ్ళు బతికి చావాలని వీళ్ళకు ఇంత ఉబలాటం దేనికని ఆశ్చర్య పోయేది.

అమెరికాలో కొన్ని ఏళ్ళు గడిచిన కొద్దీ అమెరికన్లకు జీవితం మీద ఉన్న పట్టు, వారి ఉబలాటాలు, రకరకాల ఉత్సాహాలు చూచాక వచ్చిన మార్పు కావచ్చు. తన పెరిగే వయసు, వయసు మీరిన వాళ్ళ మీద అసహనాన్ని కొంత తగ్గించి ఉండవచ్చు. నిసీ కి నెమ్మదిగా బ్రతుకు మీద తీపి అందరికీ ఒకటేననీ దానికి వయసు తారతమ్యాలు ఉండవనీ, బ్రదకడానికి అందరికీ ఇష్టమే కాక అధికారం ఉందనీ అర్ధం అవసాగింది. ఆంతేకాకుండా డాక్టరుగా తనకు వేరే వాళ్ళ జబ్బులు వారి వయసు తో నిమిత్తంలేకుండా తగ్గించాల్సిన బాధ్యత ఉందని అనిపించింది. తన ఇండియన్ వేదాంతాన్ని ఇంట్లో ఒదిలిపెట్టి , అమెరికన్ డాలర్లతో తనకొక గూడు చూపించిన అమెరికన్ ‘వే ఆఫ్ లైఫ్’ ని అర్ధం చేసుకోడానికి సహనం ఏర్పడింది.

ఐతే నిసీ వయస్సు పెరుగుతున్నా దానితోపాటే అమెరికాలో మనిషి సగటు జీవిత ప్రమాణము పెరుగుతున్నందునా, నిసీ చూచే రోగులంతా కాన్సర్ రోగులైనందునా ఆమె చాలాసార్లు తనకన్నా 20-30సంవత్సరాలు ఎక్కువ వయసు వాళ్ళనే చూసేది. వాళ్ళకు నిసీ ఎప్పుడూ చిన్నదానిలాగానే కనపడేది. చిన్నగాకనిపిస్తున్న నిసీకి వైద్యవృత్తి లోసరిపడ అనుభవం ఉందా వారికి వచ్చిన పెద్ద జబ్బుని ఆమె నయంచేయగలదా అని అనుమాన పడే వారు. నిసీ చాల మంచి హాస్పిటల్స్ లో తర్ఫీదు పొందిందని తెలుసుకున్నాక వారికి కొంత ఊరట కలిగేది.

*

నర్సు బెట్టీ ఫిషర్ తలుపు తట్టి డాక్టర్ నిసీ షామల్ గది లోకి వచ్చింది. రావడం ఎదురుగాఉన్న కుర్చీలో చతికిలపడి బల్ల మీద ఉన్న జర్నల్ తీసికొని విసురుకోటం మొదలు పెట్టింది. ఆమెది మహాకాయం. కుర్చీలో ఇరుకుగా పడుతుంది తెల్లటి జాంపండు రంగు. చర్మం దొంతరలు దొంతరలుగా గడ్డం కింద వేలాడుతున్నది. చేతులు తొడలు సైజు చెప్పక్కర్లేదు. ఐతే ఏం? మహాస్పీడుగా నడుస్తుంది. దడదడా మాట్లాడుతుంది. టక టకా పేషెంట్లను గదులలో పెట్టేస్తుంది. వాళ్ళ ఎత్తులు బరువులు టెంపరేచర్లు డాక్టరుకి కావలసిన కధా కమామీషూ అంతా సేకరించడం చక చకా జరిగి పోతాయి.

ఆమె వచ్చి ఫేషెంట్ గురించి కొంత చెప్పాక చార్ట్లో రిపోర్ట్లూ అవీ ఫైల్ చేసి ఉంటే అవి చూసి, ఎక్స్ -రేలు చదివి అప్పుడు పేషెంట్ ఉన్న రూం లోకి అడుగు పెడుతుంది నిసీ షామల్.

బెట్టీ విసురుకోడంతగ్గించి మెడ కొంచెం వంచి నిసీని చూడ్డానికి ప్రయత్నించింది. నిసీకి నవ్వు వస్తూ ఉంది. నవ్వకుండాబెట్టీ చెప్పేది వినడానికి ప్రయత్నిస్తున్నది. మధ్య మధ్య కిటికీ లోంచి బైటకు చూసి బెట్టీ వైపు చూడకుండా నవ్వునుండి బైట పడటానికి ప్రయత్నిస్తున్నది.

“డాక్టర్ షామల్ ! ఈ పేషెంటు నిన్ను చూస్తానికి ఇష్ట పడటం లేదు.ఆడ డాక్టరు ఎందుకు? ఆమెకు ప్రాస్టేట్ కాన్సర్ గురించి ఏమి తెలుసు?. మగవెధవ డాక్టర్లెవరూ లేరా?” అని అడిగాడు.

నిసీకి ఇంక నవ్వాపుకోవాల్సిన అవసరం కనపడలేదు. హాయిగా నవ్వ సాగింది.

“అవును మన మగ వెధవ డాక్టర్లంతా ఎక్కడకు పోయినట్ట్లు?”

“డాక్టర్ బోలండ్ ఈ పూట వేరే గైనకాలజీ కంబైన్డ్ ఫాలో అప్ క్లినిక్ లో ఉంటాడు కదా. డాక్టర్. సోబీ ఎప్పడి లానే నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. బిల్లింగ్ వాళ్ళతో మీటింగ్ ఉంది. ఆ తర్వాత హాస్పిటల్ ప్రెసిడెంట్ ని వెళ్ళి కలిసి రావాలంట. తర్వాత ఇంకో సెంటర్ ప్లాను గీయించడానికి ఆర్కిటెక్ట్ ని కలవాలి” అని చెప్పాడు.

“అన్నీ మంచి పనులే. మరి పేషెంటు ని ముందు అడగలేదా ఎవర్ని చూస్తానికి ఇష్టపడతాడో. అదేలే మన క్లినిక్ లో అలా జరగదు కదా. స్టాఫ్ మీటింగ్ లో డాక్టర్ల పేర్లు ఒక క్రమంలో రాసేసి ఏ పేషెంట్ వచ్చినా వరస ప్రకారం ఒకరి తర్వాత ఒక డాక్టరు చూడాలని నిర్ణయం చేసుకున్నాముగా. ముందు ఏ పేషేంటు పిలిస్తే అప్పాయింట్మెంట్ కోసం అప్పుడే డాక్టర్ ఖాళీగా ఉంటే అలా చూడాల్సిందే.

ఐనా బెట్టీ! అదీ మంచిదేలే. లేక పోతే రోగుల ఇష్టం పాటిస్తే నన్ను చూస్తానికి ఎవరిష్టపడతారు?”

“గొప్ప బడాయి . ఆడా మగా అందరూ నిన్నే కావాలని అడుగుతారని. ఆ పంపించే డాక్టర్లంతా నిసీ షామల్ చూస్తుందేమో అనే పంపుతున్నాము. మా పేషెంట్లు ఆమె పేరు బైట వేరే రోగులనుండి విని వస్తున్నారు. మేము చెప్పటల్లేదు. ఆమె సంగతి. వాళ్ళే మాకు చెబుతున్నారు. అడుగుతున్నారు. రేడియేషన్ ఇవ్వాల్సి వస్తే ఆమె దగ్గరికే పంపాలని అంటున్నారు వాళ్ళు.

మధ్యలో స్కెడ్యూలింగ్ చేసే సెక్రెటరీలు చస్తున్నారు మీవలన , “అంది బెట్టీ డ్ర మాటిక్ గా చేతులూ కళ్ళూ తిప్పుతూ.

నిసీ గడియారం చూసుకుంది . “ఏం చేద్దాం బెట్టీ?”

“నేను ఒప్పించాలే . నీతో మాట్లాడటానికి. నచ్చక పోతే మళ్ళీ ఇంకొకరిని కలవడానికి. ఏమీ ఎక్కువ బిల్లు చెయ్యం. ఇంకో రోజు రావచ్చు ఇష్టం ఉంటే అని.”

“ఓ.కే! అని లేవబోయింది నిసీ.”

“ఐతే డాక్టర్ షామల్ , డేవిడ్ ఆర్థర్ చచ్చినా బట్టలు మాత్రం విప్పేది లేదు . నీతో పరీక్ష చేయించుకునేది లేదు -అన్నాడు.”

నిసీ కుర్చీలోంచి లేచి వెనకనున్న వ్యూ బాక్సు ల మీద, డేవిడ్ ఆర్ఠర్ – పెల్విక్ కాట్ స్కానులన్నీ వరసగా పెట్టి చూచింది. శ్రద్దగా రిపోర్టులన్నీ మరొక్కసారి చదివింది. లాబ్ వర్కంతా చూసింది. పేషెంట్ మెడికల్ హిస్టరీ అంతా మళ్ళీ చదివింది. డేవిడ్ ఆర్థర్ కాన్సర్ వ్యాధి చాలా ఆరంభ దశలో ఉంది. ఏదో వేరే గుండె పరీ్క్షలు చేస్తూ ప్రోస్టేటుకు సంబంధించిన రక్త పరీక్ష కూడా అతని ఫామిలీ డాక్టరు అడిగాడు. అది సరిగా లేనందు వల్ల అల్ట్రాసౌండ్, సి.టి. స్కాను , బయాప్సీ నుండి కాన్సర్ బైట పడటం జరిగింది. పేషెంటు హిస్టరీ చూస్తే అతని ప్రాస్టేటు కాన్సర్ అతనికి హాని కలిగించేట్లు కనబడదు. అతని గుండె జబ్బు అతను ఎన్నేళ్ళు బ్రతికేదీ నిర్ణయం చెయ్యవచ్చు. ఈ లోపల ఇంకేదైనా వేరే కొత్త జబ్బు వల్ల అతను మరణించ వచ్చూ . ప్రాస్టేటు జబ్బు అతన్నేమీ చెయ్యదు అని నిర్ణయించుకుంది నిసీ.

ఐనా రోగిని పరిక్ష చేసిగాని జబ్బు పరిస్థితి గురించి అభిప్రాయం వెలిబుచ్చకూడదు డాక్టర్లు. ఎన్ని కొత్త కొత్త టెస్ట్ లు వచ్చినా రోగనిర్ణయంలో ఇంకా రోగి అంగాంగ పరీక్ష ముఖ్యంగా పరిగణిస్తుంది వైద్య శాస్త్రం. కొందరు వైద్యులు రోగిని, అంటుకోకుండా , ముట్టుకోకుండా ఎక్స్ -రే లు చూచి, లాబ్ లు చూచి వైద్యం మొదలెట్టటం గమనించిన ఆస్పత్రుల తనిఖీ సంస్థలు , వార్నింగులు, రూల్స్ సరిగా తెలియ జెప్పడాలు చేశారు. ఇంస్యూరెంస్ కంపెనీలు చార్ట్ల లో రోగులను పరీక్ష చేసినట్ట్లు లేకుంటే డాక్టరుకు పూర్తి డబ్బు చెల్లించమనీ ఒక వేళ కట్టినా రికార్డుల లో లోపాలుంటే మరలా డబ్బు వాపసు తీసుకోవచ్చనీ నోటీసులు పంపుతుంటారు . అప్పుడప్పుడూ మాల్ ప్రాక్టీస్ ఇంసూరంస్ కంపనీలు కూడా చార్ట్లు తనిఖీ చెయ్యొచ్చు. పేషెంట్ కోర్టుకు వెడితే వైద్యం సరిగ్గా జరిగిందో లేదో చూడ్డానికి ఛార్టే ముఖ్యాధారం.

నిసీ గదిలోకి వెళ్ళగానే పేషెంటు ముసలాయన ముఖం తిప్పుకున్నాడు.

నిసీకి ముందు కొంచెం బాధ కలిగింది. తర్వాత నవ్వు వచ్చింది. రోగులు వాళ్ళ వయసుని బట్టి, లింగాన్ని బట్టి, జాతి, చేసే వృత్తి, డబ్బు హోదాలూ న్యూనతలూ -అసలు సంగతి- వాళ్ళకు వచ్చిన రోగం గురించి ఉండే భయాన్ని బట్టి రకరకాలుగా ప్రవర్తిస్తారు. డాక్టరుగా తనకెంత మర్యాదిచ్చారు, తన గొప్పవాళ్ళు గుర్తింఛాలనీ తనేం చెపితే వాళ్ళు అదే చెయ్యాలనీ ఇలాటి భేషజాలు ఆమెకు లేవు. అప్పుడప్పుడు తనూ మనిషే కనుక వేరే మనిషి నిరసన నుండి కొంచెం నెప్పి కలిగినా వాళ్ళు వచ్చింది వాళ్ళ రోగం బాగు చేయించుకోడానికి. దానికి తను తోడ్పడాలి కాని తన అహం ప్రదర్సించడానికి కాదు తను వైద్యుని పని చేశేది అని నిసీ అప్పుడప్పుడూ మర్చిపోకుండా గుర్తుచేసుకుంటుంది.

ఈ సారీ అలాగే.

బల్ల మీద ముసలాయన సన్నగా, పొడవుగా ఉన్నాడు. తెల్లాయన. తెల్ల జుట్టు. జుట్టింకా ఒత్తుగా ఉంది. గడ్డం రెండు మూడు రోజుల నాటిది. బట్టలు సాధారణంగా ఉన్నాయి. .పాంటు కొంచెం మాసి ఉంది. మట్టి కొట్టుకుని ఉంది. అక్కడక్కడా కోడిగుడ్డు అలాటి తిండి మరకలు ఉన్నాయి చొక్కా మీద, పాంటు మీదా. నిసీ తీరుబడిగా ఎదురుగా ఉన్న కుర్చీలో కూల బడింది.

ముసలాయన ముఖంతిప్పుకొని కిటికీలోంచి బైటకు చూస్తున్నాడు.

“గుడ్మార్నింగ్ మిస్టర్ ఆర్థర్” అని మాత్రం అన్నది. తనూ అతను చూసే వైపే కిటికీ లోంచి బైటకు చూసింది. దూరంగా ఉన్న మేపుల్ చెట్ట్ల వంక చూస్తూ కొద్దిగా ముక్కుపుటాలెగరేస్తూ సన్నగా బుసలు కొడుతున్నాడతను. చెట్ట్ల మీదుగా రోడ్డు కావల మొక్కజొన్న చేలున్నాయి.

అబ్బో! ఆ మేపుల్స్ అంటే నాకెంత ఇష్టమో . మీకూ అంతే లాగుంది. నిసీ మాట తియ్యగా ఉంటుంది. ఆమె ఇంగ్లిష్ ఆక్సెంట్ కొంతమంది చెవులకు ఇంపుగానూ ఉంటుంది, కొంచెం ముఖం తిప్పాడతను. చక్కని నీలి సి్ల్కు స్కర్ట్, చిన్నిచిన్ని పూల నీలి బ్లౌజ్ వేసికొని ఉంది నిసీ . అతను తల తిప్పగానే స్నేహపూర్వకంగా నవ్వింది. చూట్టానికి ఆకర్షణీయమైన రూపం ఆమెది.

“మీకేం తెలుసు వేరేదేశం నించి వచ్చినవాళ్ళు ఇక్కడి చెట్ట్లూ పొలాలూ గురించి. అసలు ఆడవాళ్ళకేం తెలుస్తుంది దేన్ని గురించయినా?”

“అదీ నిజమేలెండి. ఐనా అంతెత్తున ఆ బల్ల మీదెందుకు కూర్చోడం ఎలాగా పరీక్ష చేయించుకోడం ఇష్టం లేనఫ్ఫుడు. నాకు నర్సు చెప్పిందిలెండి. ఇలావచ్చి కాసేపు కుర్చీలో కూర్చోండి కాసేపు మాట్లాడు కోవచ్చు. మీకేం భయంలేదు . మీకెప్పుడు కావాలంటే అప్పుడు వేరే డాక్టర్ తో పరీక్ష చేయించే పూచీ నాది.”

ఏమనుకున్నాడో ఆర్థర్ దిగి వచ్చి బల్ల పక్కగా నిసీకి కొద్దిగా ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నాడు. మా క్లినిక్ లో స్టాఫ్ కి కూడా మతి ఉండదండీ. మీరు పెద్దాయన . ఆడ డాక్టరుతో పరీక్ష చేయించుకోవాలంటే మీకు ఇబ్బంది కాదూ . నేను మీవైపే. అసలు వేరే వాళ్ళతో ఆయన అడిగినట్ట్లు అప్పాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అన్నా. ఆడ డాక్టర్ అంటే నమ్మకం ఉండక పోవచ్చు కూడా కదా మగవాళ్ళకు.

ఆర్థర్ ముఖం కొంచెం కందింది.

“అట్లాంటిదేమీ లేదు. ఆడ డాక్టర్లు ఆడ రోగుల రోగాలు బాగానే చూడగలరేమో. మగవాళ్ళ జబ్బులు, అందులోనూ ప్రోస్టేటు జబ్బు మగవైద్యులు చూడ కూడదా?”

“నేనూ అదే అనుకుంటాను. కానీ రోగాల గురించి మనకు సరిగా తెలియాలంటే మొత్తం శరీరంలో వచ్చే జబ్బులన్నీ అందరు డాక్టర్లు ఆడా మగా అనకుండా అందరూ చదవాల్సిందేనండీ . మాతాత ఆయన వ్యవసాయదారుడండీ . ఆయన ఎప్పుడూ మగ డాక్టరు దగ్గరకే వెళ్ళే వాడు.”

“అమ్మా! ఇండియా లో ఆడ మగా తారతమ్యం ఎక్కువ గాబట్టి అట్లా వెళ్ళేవాడా మీ తాత. ఎలా టి వ్యవసాయం మీ తాతది. ఎన్ని ఎకరాల భూమి?”

“అక్కడి వ్యవసాయం ఇక్కడి లాగా ఎక్కడండి మిస్టర్. ఆర్థర్! ఇక్కడలాగా వందల వందల ఎకరాలు కాదండి. పెద్ద పెద్ద పరికరాలు కాదండి. ఏదో పదెకరాలు . నాగలి అని ….”నిసీ చెబుతుంటె విన్న ఆయన

“అయ్యో పదెకరాలు. అందులో ఏం పండుతుంది. ఏం తింటారు .” అన్నాడు

“నిజమే. ఐనా వాళ్ళ కు భూమి అంటే గొప్ప ప్రేమండి . మాతాత రైతు అని మాక్కూడా రైతులంటే మహా ఇష్టమండి. ఇలా ఎన్ని కబుర్లయినా మీతో చెప్పాలని ఉంది కాని .. నేను వేరే పేషెంటుని చూస్తా పోయి . ఇంతకూ ఎలాగా మీకు నాతో పరీక్ష చేయించుకోవాలని లేదు కదా.”

లేవబోయింది నిసీ.

చెయ్యి జాపి కొద్దిగా చెయ్యడ్డం పెట్టాడతను ఆగమన్నట్లు.

“నేను చూపించుకోపోతే మీబాస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడూ?”

 

“మంచివారు. మీరు చెప్పింది నిజమేనండి. కొంచెం ఇబ్బంది రావచ్చు. మగరోగులు ఎవరూ ఆడ డాక్టర్లను చూడరనుకోండి. వాళ్ళింట్లో ఆడవాళ్ళను అసలు వైద్యానికే పంపరనుకోండి వాళ్ళ తండ్రులు గాని మొగుళ్ళూ కాని . అప్పుడు నా ఉద్యోగం ఊడాల్సిందేగా? ఐనా గాని మీరు మీ బాగోగులు గురించి, మీ వైద్యం గురించి ముందు ఆలోచించు కోవాలి . నేను గట్టిగా నా గురించి చెప్పగలను. మీకు మంచి వైద్యం చెయ్యగలననీ మంచి సలహా చెప్పగలనని. ఐనా మీ ఇష్టానికి విరుద్ధంగా మిమ్మల్ని చూస్తం మాత్రం జరగదు. వస్తాను మరి మిమ్మల్ని కలిసి ఎంతో సంతోషమయ్యింది.”

మళ్ళి లేవ బోతే మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టాడతను.

“నా జబ్బు అదే కాన్సర్ ముదిరిందా. నేను చచ్చిపోతానా అమ్మా?” అతని గొంతు వణికింది.

నిసీ అతని చెయ్యి మీద చెయ్యి వేసింది . మెత్తగా నొక్కింది. అతను కొద్దిగా సర్దుకుని అతని ధైర్యాన్నీ, పౌరుషాన్ని కూడదీసు కునేదాకా, అతని చేతి వేళ్ళలో తన వేళ్ళు దూర్చి కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుంది. అతని చేతి వణుకు తగ్గటం గమనించాక, అప్పుడు ఎంతో ఉత్సాహంగా అంది .

“మీకు వచ్చిన భయమేం లేదు. మీ రిపోర్ట్లన్నీ చూశాను. స్కానులన్నీ చూశాను. చాలా చాలా లేత దశలో ఉంది కాన్సర్ .మీకేభయం లేదు.”

కొంచెంసేపు అతని జబ్బు గురించి కొన్ని పశ్నలడిగాడు. నిసీ సమాధానాలిస్తూ వచ్చింది. తను కూడా తనంత తను కొంత సమాచారం వివరంగా ఇచ్చింది వ్యాధి గురించి.

“రేడియేషన్ తీసుకోవాలంటారా డాక్టర్ ?”

“అది ఖచ్చితంగా తీసుకోవాలన్నా అవసరంలేదని చెప్పాలన్నా కొంచెం మొత్తం వళ్ళంతా పరీక్ష చేసి చెబితే మంచిదండి. లేకపోతే నేను తప్పు సలహాలివ్వొచ్చు. అది నేను చెయ్యను. ప్రాస్టే్ కాన్సర్ కి రెక్టల్ పరీక్ష చెయ్యక తప్పదు. దానికి మీరు మీపాంటు జార్చాలి. ఆ పరీక్ష తప్పదు.”

ఆర్థర్ ఒక్కసారి ఉవ్వెత్తున లేచి నుంచున్నాడు.

“నువ్వు తప్పితే నేనింకెవ్వరితోనూ ఆ పరీక్ష చేయించుకోనమ్మా. చదువుకోని మా మాటలు ఎక్కువ చదూకున్న వాళ్ళు పట్టించుకోకూడదు. రేడిఏషన్ ఇవ్వాల్సినా నువ్విస్తేనే నే వస్తా ఇక్కడకు. ఏం చెయ్యమంటావో చెప్పు. ఈ బల్లెక్కాలా . ఈ చొక్కా ఎక్కడ పెట్టమంటావు. పాంటు సాంతం ఊడదియ్యాలా?”

“మీరు నిదానంగా ఆ పనులు చేస్తూ ఉండండి. నర్సును కూడా పిలుచుకు వస్తాను. తొందరగా పరీక్ష పూర్తి చేసి ఇంటికి పంపిస్తా ఏమంటారు.? ”

“మీరెలా చెపితే అలానే ” అన్నాడు డేవిడ్ ఆర్థర్.

నిసీ షామల్ గది బయటకు నడిచింది. తలుపు బయటే కుర్చీలో కూర్చుని ఉన్న బెట్టీ నవ్వుతూ అడ్డంగా తల నాలుగు తిప్పులు తిప్పి ఛార్టుతో డాక్టరు షామల్ నెత్తిన మెల్లిగా మొట్టి గది లోనికి నడిచింది.

*

ఒక రెండు వారాల తర్వాత సెలవు నుండి వచ్చిన డాక్టర్ షామల్ కు తన ఆఫీసు బల్ల మీద స్టాఫ్ నుండి ‘వెల్ కమ్ బాక్ నిసీ ‘ పువ్వుల్తో పాటు ఓ చిన్నబుట్టలో టొమాటోలు దోసకాయలు, వంకాయలు ,మిరపకాయలు కనిపించాయి. పక్కనే ఒక చక్కని చెక్కడం చేసి రంగులు వేసిన ముద్దులొలికే పెద్ద బాతు (mallard duck) చెక్క బొమ్మ ఉంది. దాని మెళ్ళో వేలాడే ఒక చిన్న కార్డు విప్పితే ‘డేవిడ్ ఆర్థర్ నుండి ప్రేమతో’ అని ఉంది.

*