జులై 2000

“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! ఈ మధ్య ఇంటర్నెట్‌ మీద తెలుగు సాహిత్యానికి సంబంధించిన విషయాల్ని ప్రచురించే వెబ్‌ సైట్స్‌ ఇంకొన్ని కనిపిస్తున్నాయి తెలుగుకథ, నీహార్‌ లాటివి. ఇది తెలుగు భాష, సాహిత్యాల మీద ఆసక్తి, అభిమానం ఉన్నవారికి ఎంతో ఆనందదాయకమైన పరిణామం. ఐతే ముందుముందు ఇంకా ఎన్నో రంగాలలో కృషి జరగాల్సుంది. ప్రతిభావంతులు మరింత ఉత్సాహంగా ఈ పరిణామాల్ని త్వరిత గతిని ముందుకు సాగించాలి.

ఈ వారాంతంలో జరుగుతున్న “ఆటా” సంబరాలు, ఇంకో రెండు నెలల్లో జరగబోతున్న రెండవ ఉత్తర అమెరికా సాహితీ సదస్సు, దానికి రెండు వారాల తర్వాత జరగబోతున్న “తానా” ప్రాంతీయ సభ మొత్తం మీద అమెరికాలో వచ్చే రెండు నెలలూ హడావుడిగానే ఉండబోతున్నాయి. ఈ అన్నింటిలోనూ ఎంతో కొంత సాహిత్య సంబంధమైన కార్యకలాపాలకు కూడా అవకాశం ఉంది. ఇవన్నీ కలిసి అమెరికా తెలుగు సాహిత్య రంగంలో కొంత కొత్త ఉత్తేజం కలిగించగలుగుతాయని ఆశిస్తున్నాం.

“ఈమాట” సంపాదక వర్గంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ద్వానా శాస్త్రి గారి “విమర్శ ప్రస్థానం” గ్రంథానికి ఈ మధ్యనే “విశ్వసాహితి పురస్కారం” ఇచ్చారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో విశేషకృషి చేస్తున్న శ్రీ శాస్త్రి గారు పొందిన ఈ గుర్తింపు మనకందరికీ గర్వకారణం. వారు ఇప్పుడింకా ద్విగుణీకృతోత్సాహంతో తెలుగు సాహిత్య రంగంలో కృషి చేస్తారని ఆశిస్తున్నాం.

ఈ సంచికలో ప్రఖ్యాత కవయిత్రి మహెజబీన్‌ కవిత ఒకటి ప్రచురిస్తున్నాం. వేరే పని మీద అమెరికాకు వచ్చి “ఈమాట” కోసం ప్రత్యేకంగా ఈ కవితను రాసిచ్చిన మహెజబీన్‌ గారికి మా కృతజ్ఞతలు.

మానసికోల్లాసం కలిగించే కథలు, కవితలు, కనకప్రసాద్‌ ధారావాహిక నాటికతో పాటు అన్నమయ్య సాహిత్యాన్ని గురించి, కథ కవిత , ఈ రెంటి సంబంధ బాంధవ్యాల గురించి ఆలోచనాత్మకమైన వ్యాసాలున్నాయి. సంగీత విశేషాల గురించి ఉల్లాసకరమైన వ్యాసాలు, రామాయణ కథల గురించి వేలూరి వెంకటేశ్వరరావు గారి విశ్లేషణాత్మక రచన కూడా అందిస్తున్నాం.

పాఠకులు, రచయిత(త్రు)లు ముందుముందు కూడా ఇలాగే “ఈమాట” పురోగమనంలో భాగస్వాములుగా పయనిస్తారని ఆశిస్తున్నాం.