ఒక సగం కథడూ, ఒక కంకాళం కథడూ బార్లోకి నడిచారు.
అప్పటికే బార్ సందడి సందడిగా ఉంది. మసక చీకట్లోంచి మాటలూ, నవ్వులూ, మధ్య మధ్యలో ప్లేట్ల, గ్లాసుల చప్పుళ్ళూ.
బార్ టెండర్ ఎదురుగా ఉన్న ఎత్తుకుర్చీల్లో కూచున్నారు.
“ఏం తీసుకుంటారు సార్?”
పక్కనే నిలబడి చూస్తున్న కొత్తగా చేరిన సర్వర్ కుర్రాడు పుసుక్కున నవ్వాడు. వాళ్ళు అతని వైపు గుర్రుగా చూశారు. “నువు పోయి ఆ టాయిలెట్స్ చెక్ చేసి రమ్మన్నా కదా ఇందాక!” అతన్ని కసిరాడు బార్ టెండర్.
“నాకు భయమన్నా!”
“ఏమయింది?”
“ఎవరూ లేకపోయినా ఏవో గొంతులు వినిపిస్తున్నాయి. మధ్యలో గొంతు నొక్కేసినట్టు మూలుగులూ, ఇరుక్కుపోయి బయటపడలేక కొట్టుకులాడుతున్నట్టూ…”
నవ్వాడు బార్ టెండర్. “అవన్నీ పాపం కథలు కాలేక మొదట్లోనేనో, సగంలోనో ఆగిపోయినవి. పట్టించుకోకు, నిన్నేం చేయవులే! సర్లే, ఆ టేబుల్ దగ్గర ఒకాయన పిలుస్తున్నాడు వెళ్ళు!”
“వీళ్ళు ఇట్లా ఉన్నారేంటన్నా?” రహస్యంగా అడిగాడు.
“వీళ్ళింతే. చదివే వాళ్ళు మిగతాది కల్పించుకుంటారు. నీకు అర్థం కాదులే, పో!”
కుర్రాడు అక్కడికి వెళ్ళగానే ఆ కథడు తిట్లు అందుకున్నాడు. “బుద్ధి ఉందా లేదా మీకు! మీ మేనేజర్ని పిలువు?”
“ఏమయింది సార్!”
“ఎవర్ని పడితే వాళ్ళను లోపలికి రానిస్తారా? ఆ టేబుల్ దగ్గర చూడు, వాళ్ళు కథల్లాగా కనిపిస్తున్నారా? ఆ వ్యాసాల మొహాలు తెలియట్లేదా? ఒక టైటిలూ, నాలుగు పాత్రల పేర్లూ చూడగానే కథనుకుని లోపలికి రానివ్వడమేనా!”
“పోనీయండి సార్, వాళ్ళేదో ఆ మూల కూచున్నారు. ఇప్పుడు వెళ్ళమనడం బాగోదు! మీ డ్రింక్ అయిపోయినట్టుంది, ఏం పట్రమ్మంటారు?”
ఖాళీ అయిన గ్లాస్ చివర ఆలివ్‌ని తీసి కొరుకుతూ చెప్పాడు “పర్‌ఫెక్ట్ మార్టిని ఒకటి తీసుకురా!”
అక్కడినుంచి వస్తుంటే పక్క టేబుల్ మీది కథడు చేయి పట్టి ఆపాడు. “రెండు రొమాన్స్ ఆన్ ద బీచ్ పట్టుకురా! దాంతో పాటు ఒక సన్‌సెట్, ఒక మూన్‌లైట్”. తలూపుతూ “సరే సార్!” అని ఆ కుర్రాడు వెళ్ళిపోయాక ముందుకు వంగి ఎదురుగా కూచున్న రొమాంటిక్ కథ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు. “నీ వాక్యాలెంత చక్కగా పొడవుగా ఉన్నాయి! నీ టోన్ కూడా నాకు నచ్చుతుంది! ఆ కళ్ళలోకి చూస్తేనే నీ ప్లాట్ తెలిసిపోతుంది!”
ఆమె తన చేతుల్ని వెనక్కి లాక్కుని అంది “ఆర్యూ జోకింగ్?”
“లేదు, ఇంకా సీరియస్‌గా ఎలా చెప్పాలో నాకు తెలియదు! నేను కామెడీ, నువు రొమాంటిక్. మనకు బాగా కుదురుతుంది.”
“నీమీద నాకే ఫీలింగ్సూ లేవు. నీ హ్యూమర్ ఏ కొంచెమో నచ్చబట్టే నీతో స్నేహం చేస్తున్నా. అయినా ఆ మిస్టరీ కథ వెనకపడుతున్నానని చెప్పావు కదా!”
అడ్డంగా తలూపి చెప్పాడు “అదే సమస్య! ఆమె మనసులో ఏముందో అదంతా పెద్ద మిస్టరీ. ఎటూ తేల్చదు!”
“అయితే? నాకెట్లా ప్రపోజ్ చేస్తావు?”
అంతలో అటుపక్కగా వెళుతున్న ఇంకో కథను చూసి ఈల వేస్తూ “నైస్ ట్విస్ట్స్ బేబీ!” అన్నాడు. ఆమె కోపంగా చూసి “ఒక్కటిస్తే నీ లూజ్ ఎండ్స్ అన్నీ ఊడి పడతాయి జాగ్రత్త!” అని పోయింది.
“షేమ్ ఆన్ యు! నువు ఇలాంటివాడివనుకోలేదు!” అని రొమాంటిక్ కథ లేచి పోతుంటే “ఏదో సరదాకి అన్నా, అంతే!” అంటూ ఆమె చేతిని పట్టుకుని ఆపబోయాడు.
పక్క టేబుల్ నుంచి ఒక వీర కథడు లేచి వచ్చి “ఎవడ్రా నువ్వు? పోనియ్ ఆ అమ్మాయిని!” అంటూ ఉరిమి చూస్తే వదిలేశాడు.
“నేను హాస్యం కథడిని! నువ్వెవడివి?”
“అనుకున్నా, మొహం చూస్తే డోకొచ్చినట్టు ఉంటే! ఆ అమ్మాయి జాన్రా ఏమిటి, నీ జాన్రా ఏమిట్రా?”
“సో ప్రెడిక్టబుల్!”
“రేయ్! ఏమైనా అను గానీ ఆ మాట అనకు! నీ స్టీరియోటైపులన్నీ పీకి జేబులో పెడతా!” అని బెదిరిస్తుంటే ఒక నీతి కథడు వచ్చి “వాడితో మీకెందుకు, మీరు రండి!” అంటూ పక్కకు తీసుకుపోయాడు.
“వాడుట్టి వేస్ట్ ఫెలో! టైంపాస్‌కి తప్ప పనికిరాడు. ఎప్పుడూ ఆ కుళ్ళు జోకులొకటి! మనం పట్టించుకోకూడదు!” కూచోబెట్టి చెప్పాడు.
“ఏమో బా! మనవల్ల మాత్రం ప్రయోజనమేమిటి? మన తండ్రుల తాతల నాటినుంచీ ఆ మంచే కదా చెప్తున్నాం! మన పిల్లలూ అదే చెప్తారు కదా! అంతా అరణ్యరోదనేనా? మన ఖర్మ ఇంతేనా ఇక! అదే నన్ను రేబవళ్ళూ తొలుస్తూంది!” అనేసి గ్లాస్ లోని సిసిఫస్‌ను ఒక్క గుక్కలో తాగేశాడు పక్కనే కూచున్న ఇంకో నీతి కథడు.
“అట్లా అనకు! మనకు తెలియనంత మాత్రాన మనం చేసే మేలు ఎక్కడికీ పోదు. ఈ మిగతా పనికిమాలిన వాళ్ళలాగా కాదు కదా మనం!” మొదటి నీతి కథడు అంటుండగా ఆ పక్కనుంచే పోతున్న ఒక కథడు విన్నాడు.
మొహం మాడ్చుకుని కూచున్న అతన్ని ఆ టేబుల్‌లో పక్కనే కూచున్న ఇంకో కథడు అడిగాడు ఏమయిందని. “ఆ సెల్ఫ్ రైచస్ గాళ్ళ మాటలు వినలేదు నువ్వు! మనమంతా నాసి కథగాళ్ళమట! అంత ఉదాత్తులయితే, సర్వకథాసౌభ్రాతృత్వాన్ని నమ్మితే అందరినీ సమానంగా చూడాలి కద! మనమీదెందుకు చిన్నచూపు! ఎప్పుడూ ఎగతాళి చేయడాలూ, అవమానించడాలూ! మనమూ కథలమే! అవే అక్షరాలూ, వాక్యాలూ! వాళ్ళకున్నట్టే పాత్రలూ, సన్నివేశాలూ, సంభాషణలూ. కొద్దిపాటి గౌరవానికీ అర్హులం కాదా మనం?”
“టేకిట్ ఈజీ బాస్! వాళ్ళు ఏమనుకుంటే మనకేమిటి? అసలు మన గురించే అనుకుని భుజాలు ఎందుకు తడుముకుంటున్నావు? అయినా వాళ్ళకంటే మనకే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి!”
“అందరికీ రావుగా!” తల దించుకుని కూచున్న కథడు అన్నాడు “నేను బతికున్నానా, చనిపోయానా? ఎవరూ చదవకుంటే నేనున్నట్టా, లేనట్టా?”
“అసలు ఏమన్నా తేడా పడుతుందా?” అతనికి అటువైపునున్న కథడు అడిగాడు. “నన్నెవరూ చదవరు. చదివిన వారెవరూ అర్థం చేసుకోరు! మన రాత ఇలా ఏడ్చింది! ఎందుకీ జన్మ అనిపిస్తుందొకోసారి!”
“ఈ డిప్రెషన్ కబుర్లాడుకుందుకా మనం ఇక్కడికొచ్చింది? చుట్టూ చూడండ్రా బాబు! ఆ జంట చూడండి, ముచ్చటగా ఉంది!”
ఆ జంటలో కథడు ఎదురుగా కూచున్న కథను పట్టి పట్టి చూస్తూ అన్నాడు. “ఆ నాలుగు టైపోలనూ కవర్ చేయడానికి అంత కష్టపడక్కర్లేదు. ఎవరూ పట్టించుకోరు. అయినా ఎవరికి లేవు ఆ మాత్రం టైపోలు!”
కథ నవ్వుతూ కుర్చీలో సర్దుకుని కూచుంది.
“కానీ అన్ని వర్ణనలవసరమా నీకు? నెత్తినుంచి పాదందాకా ఎందుకు అవన్నీ?”
“అదేమిటి? వాళ్ళంతా ఒక్క పదం కూడా అదనంగా లేదని అంటున్నారు కదా!”
“నువు నమ్మేశావు. నీ మొదటిపేజీలో ఆ అమ్మాయి దుస్తుల వర్ణన అదుగో, ఆ టేబుల్ దగ్గరే జారిపోయింది నువు వచ్చేప్పుడు. నీకేమయినా తేడా తెలిసిందా? ఆ బరువు తగ్గితే ఎంత బావుండేదానివి! కొంచెం పొడవు కూడా ఉంటేనా! డైలాగ్స్ కూడా పూర్తి తెలుగులో ఆర్టిఫిషియల్‌గా లేవూ? నీ టోన్ డ్రైగా ఉంది, కొంచెం ఎమోషన్ వాడొచ్చు కదా!”
ఆమె విసురుగా లేచింది. “అప్పుడు నేనింకో కథనయి ఉండేదాన్ని. నీక్కావలసింది ఆ కథ, నేను కాదు. ఇక నీ మొహం చూపించకు! నువ్వసలు కథడివేనా?”
“ఇప్పుడు నేనేమన్నాననీ, నీ మంచి కోసమే!” అని అంటూండగానే ఆమె బ్యాగ్ తీసుకుని బార్ కౌంటర్ మీదుగా వెళుతుంటే, ఒక స్టూల్‌పై చిన్న మెరుపుతోపాటు ఒక కథడు అకస్మాత్తుగా ప్రత్యక్షమయాడు. ఆమెతో పాటు అక్కడున్న అందరూ నమ్మలేక చూస్తూండిపోయారు.
సర్వర్ కుర్రాడు తెప్పరిల్లుకుని బార్ టెండర్‌తో “అదేంటన్నా, ఇదేమన్నా దయ్యమా ఏమిటి?” అని “అదేంటి సార్, అట్టెట్టా వచ్చారు మీరు?” అని కొత్త కథడిని అడిగాడు.
బార్ టెండర్ తేరుకుని “ఒరే నువ్వాగు! నువ్వేమన్నా పెద్ద కథడివి అనుకుంటున్నావా, ఒట్టి ట్రోపు గాడివి!” అన్నాడు. “నువ్వు మాత్రం?” అని ఆ కుర్రాడు గొణిగినా పట్టించుకోకుండా కొత్త కథడిని కుర్రాడడిగిన ప్రశ్న తనూ అడిగాడు.
చుట్టూ తేరిపార చూస్తున్న కొత్త కథడు బార్ టెండర్ వైపు చూశాడు. ఆ హడావుడికి తమ టేబుల్స్ వద్దనుండి లేచి అందరూ చుట్టూ మూగారు.
“నేనొక టైం ట్రావెల్ సైఫై కథడిని! భవిష్యత్తునుండి వచ్చాను.” అంటూ గొంతు సర్దుకున్నాడు.
“ఎందుకు? భవిష్యత్తు ఎలా ఉండబోతూంది?” ఎవరో అడిగారు.
“మానవ కల్పితమైన కథలేవీ ఉండబోవు. అంతా యాంత్రిక సృజనే! నేనే చివరి ఆర్గానిక్ కథడిని అయి ఉండొచ్చు. ఒక మానవుడు రహస్యంగా నిర్మించాడు నన్ను. ఆ భవిష్యత్తు గురించి హెచ్చరించడానికి వచ్చాను!”
“బీన్ దేర్! సీన్ దెమ్! ఆ ఫేక్ చెత్తను ఎవరు పట్టించుకుంటారు?”
“నేను చెప్పినా మీకర్థం కాదు. ఆ భూతానికి అన్నీ తెలుసు, చదివేవాళ్ళ ఆసక్తులూ, అప్పటి వాళ్ళ మూడ్‌కూ, ఆ సమయానికి చుట్టూ వాతావరణానికీ తగినట్టూ, చదివేప్పటి వాళ్ళ వైటల్స్ ద్వారా స్పందన పసిగట్టి నేరేటివ్ మార్చుకుంటూ, వాళ్ళనూ, వాళ్ళకు తెలిసిన వాళ్ళనూ పాత్రల్ని చేస్తూ, వాళ్ళకు అనుకూల, ప్రతికూల భావజాలాలను వాడుకుని ఎమోషన్స్‌కు అడిక్ట్ చేస్తూందది. అదొక విషవలయం!”
నవ్వి అన్నారొకరు “చాలా చూశాం, ఆ కథల్లో ఆత్మ ఏదీ? మనిషిలోని చెమ్మ ఎలా పట్టుకొస్తుంది? ఆ రాండమ్‌నెస్?”
“నన్ను నమ్మండి! అది మీరనుకునేంత కష్టం కాదు. మిమ్మల్ని మీరు ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు! ఆ భూతానికి మీ ఆయువుపట్లన్నీ తెలుసు. మీ ట్రోప్స్, ట్రిక్స్ అన్నీ నమిలి జీర్ణం చేసుకుందది! కావలసిన ఏ ఎమోషన్ అయినా అది క్షణాల్లో పుట్టించగలదు.”
“అయితే మేమేం చేయాలి?”
తల తిప్పుకున్నాడు కొత్త కథడు. సన్న గొంతుకతో అన్నాడు. “నాకు తెలియదు. హెచ్చరించడం వరకే నాకు తెలిసింది.”
“వావ్! వచ్చాడయ్యా మొనగాడు!”
కొంతమంది తలలు అడ్డంగా ఊపుకుంటూ, చేతుల్నీ, భుజాల్నీ రకరకాలుగా ఎగరేస్తూ తమ టేబుల్స్ వైపు వెళ్ళారు. అయిదారుగురు అతని వంకే చూస్తూండిపోయారు.
సగం కథడూ, కంకాళం కథడూ లేచి బయటపడ్డారు.
“అతను చెప్పేది నిజమేనంటావా?” సగం కథడు అడిగాడు.
“డజ్ ఇట్ మాటర్?” ఆగి అన్నాడు కంకాళం కథడు. “ఇంకా ఇదంతా మనగురించి అనుకున్నాను. బార్‌లో అడుగుపెట్టింది మనం కదా? మనమీద జోకెక్కడ?”
“నీకెప్పుడూ నీ గొడవే!” విసుక్కున్నాడు సగం కథడు.
పక్క వీధి కలిసే మలుపులో ఎవరో “ష్ ష్!” అన్నట్టు వినిపించింది. తల తిప్పి చూస్తే ఇద్దరు కథలు సైగ చేస్తున్నారు. ‘వొళ్ళు వేడెక్కిపోతుంటే ఆత్రంగా అతన్ని మీదికి లాక్కుంది’, ‘ఆమె పెదవుల్ని ఆబగా అందుకుని జుర్రుకుంటూ ఆమెను పెనవేసుకున్నాడు’ వంటి వాక్యాలు కనపడేలా చూపిస్తూ, “వాంట్ టు హావ్ సమ్ ఫన్?” అని అడుగుతున్నారు.
“తల తిప్పుకుని త్వరగా పద!” సగం కథడు కంకాళం కథడిని హెచ్చరించాడు. ఇద్దరూ వడివడిగా నడుస్తూంటే వెనకనుంచి బార్ ద్వారం పైని అక్షరాలు ఎర్రగా వెలుగుతూ ఆరుతూన్నాయి: THE END!