ఎన్నటికీ మూగవోని కవితాగానం

సంప్రదాయ పథాన యుగాలపాటు నడచిన తెలుగు కవిత్వం 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో ఒళ్ళు విరుచుకొని లేచి కొత్తదారులు వెతుక్కొంది. ఆ నూతనోత్సాహంలో ఎన్నో క్రొత్త గళాలు వైతాళిక గీతాల్ని పాడాయి. ఆ గొంతులన్నిటా రెండు గళాలు విస్పష్టంగా వినిపించి మిగతా అందరికీ మార్గదర్శకాలైనాయి. ఆ రెంటిలో ఒక గొంతుక మహాకవి శ్రీశ్రీదైతే, రెండవది కొన్నాళ్ళు శ్రీశ్రీకే ఆదర్శమైనది, భావకవిత్వపు బావుటాని పైపైకి ఎగుర వేసినది, విలక్షణమైనది, విశిష్టమైనది.

‘జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ’ అంటూ స్వాతంత్రోద్యమం రోజుల్లో జాతీయ గీతాన్ని ఆలాపించి ప్రజల్ని ప్రభావితం చేసిన ఆ కంఠమే, ‘పాడనా తెలుగుపాట’ అని తెలుగువారందరినీ పరవశింపచేసి ‘కోవెల గంటల గణగణలో, గోదావరీ తరంగాల గలగల’లతో ఆంధ్రగీతాల్ని పాడించింది.

‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్ఛయేగాక నాకేటి వెరపు’ అని నిస్సంకోచంగా స్వేచ్ఛాగానం చేసిన ఆ గళం ‘ఆకులో ఆకునై, పూవులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై’ అడవిలో దాగిపోతానన్నా ఎంతటి ఘోరారణ్యం మాత్రం ఆ కవితా పరిమళాల్ని దాచగలుగుతుంది? పక్షి ఐనా, ఋక్షమైనా, మధుపమైనా, చందమామ ఐనా, మేఘమైనా, వింత మెరుపు ఐనా, ఆ గొంతులోని మధురిమను గుర్తుపట్టలేని తెలుగు పాఠకుడుంటాడా?

‘నా నివాసమ్ము తొలుత గంధర్వలోక మధుర సుషిమా సుధాగాన మంజువాటి’ అంటూ పరిచయం చేసుకున్న ఈ కంఠం ‘సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికల నేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అన్న నిత్యప్రేమికునిది. అయితేనేం, ఆ ప్రేమ భగ్నమయినపుడు ‘కన్నీటి కెరటాల వెన్నెలేలా? నిట్టూర్పు గాడ్పులో నెత్తావి యేలా?’ అని బాధపడుతూ, ‘మీరు మనసారగా నేడ్వనీరు నన్ను — నన్ను విడువుడు! ఒకసారి నన్ను విడిచినంత నేకాంత యవని కాభ్యంతరాన వెక్కివెక్కి రోదింతును’ అని బ్రతిమాలి తన బాధను ప్రపంచానికి బాధగా చేసిన గద్గదారావం కూడా ఆ కంఠానిదే.

‘ఎవ్వరని యెంతురో నన్ను? — ఏ ననంత శోకభీకర తిమిర లోకైక పతిని’ అని చెప్పుకున్నా, ‘నా కుగాదులు లేవు, నా కుషస్సులు లేవు, నాకు కాలమ్మొక్కటే కారు రూపు నా శోకమ్ము వలెనె, నా బ్రతుకు వలె, నా వలెనె’ అని అప్పుడప్పుడూ వెనుదీసినా, నిజానికి ‘శీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు, ఎద లోపల పూలకారు ఏనాటికి పోనీయకు’ అని చాటిచెప్పిన నిరంతర ఆశావాదిదీ గళం. ‘దూరాకాశ వీధుల్లో తారాదీపాలు, భారమైన గుండెల్లో ఆరని దీపాలు, ఆరక ఊరక ఊగాడే ఆశాదీపాలు’ చూస్తూ ‘ఎంతైన బరువు ఈ బ్రతుకు — ఏమైనా వరమే ఇది మనకు, ఈ రాత్రి ఎలాగో దాటేవరకూ దూరాన వేగుచుక్క తోచేవరకూ’ అని నిశ్చయం చేసుకొన్న ఈయన నాయకుడు ‘నా పేరు బికారి, నా దారి ఎడారి’ అని చెప్పుకున్నా, ‘సంకల్పము నాకు ధనము, సాహసమే నాకు బలము, ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు’ అన్న విశ్వాసం కలవాడే.

ఆ గళంలో ఎన్ని ఛాయలో, ఎన్ని తీరులో, మరెన్ని రకాల పాటలో! ‘శారద శర్వరీ మధుర చంద్రిక, సూర్యసుతా స్రవంతికా చారు వినీల వీచిక, ప్రశాంత నిశాపవనోర్మి మాలికా చారిత నీప శాఖికా కృశాంగిని గోపిక’ను వర్ణించిన గళమే గున్నాసారి గున్నమ్మ కోరమీసం కోటయ్యతో ఆడే సరసాల్ని కూడా అవలీలగా వర్ణించగలదు. ‘జోరు సెయ్, బారు సెయ్ కోరంగి రేవుకీ, కోటిపల్లి రేవుకీ’ అంటూ హుషారు చేసే పడవపాట, ‘ఆడుంది, అలిసుంది అది రొయ్య, అది జెల్ల, అది బొచ్చి — ఆడ వల ఎయ్యరా! ఇది ఇలస, ఇది పొలస, ఇది గిలస ఈడ వల ఎయ్యరా!’ అంటూ హడావుడి పెట్టే బెస్తపాటా, ‘మెల్లగా, ఆఁ, మెల్లగా, మేనాపల్లకి మోయరా… పెళ్ళికూతురు కళ్ళనుంచీ త్రుళ్ళి రాలే సుక్కరా, మోయరా దారాన ముత్యం మోస్తరు’ అంటూ నెమ్మది చెప్పే పల్లకీ బోయి పాటా అన్ని పాడగలదు. ఇది ఏరువాక పాటలూ, బారసాల పాటలూ, గొబ్బిళ్ళ పాటలూ, పురుళ్ళూ పుణ్యాల పాటలూ, శ్రావణ శుక్రవారం పాటలూ, వెన్నెల పువ్వొత్తి పాటలూ, ఏ పాటైనా సరే అచ్చతెలుగులో అందంగా పాడగల కవి గొంతుకే.

‘ప్రతిరాత్రి వసంత రాత్రి ప్రతిగాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి’ అని పాడిన ఈ కవికి వసంతమంటే ఎంత ఇష్టమో చెప్పాలా! ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా’ అంటూ చమత్కారానికి అడిగినా, సమాధానం తెలియనివాడు గాదు. ‘గుమ్మము ముంగిట కో-యని కోయిల ఆర్చె! కోయిలకన్నా మున్నె గున్నమావి ఊర్చే! మావికన్న మున్నె మలయమారుతమ్ము వీచె! మలయానిలు కన్న మున్నె మల్లెపొదలు లేచె!’ అని ఎప్పుడో చెప్పినవాడే!

మనసున మల్లెల మాలలూగించి, మల్లెలవేళల్నీ, వెన్నెలమాసాల్నీ కాలం కాని కాలంలో అందరికీ చూపించి కోకిలలను తొందరపెట్టి ముందే కూయించగల కవితావసంతుడిదీ గళం. ‘మధూదయంలో మంచి ముహూర్తం, మాధవీ లతకు పెళ్ళి! మాధవి పెళ్ళికి మల్లీ మాలతి మందారం పేరంటాళ్ళు!’ అంటూ చక్కటి చిత్తరువులు చిత్రిస్తూ, ‘మామిడి చిగురెరుపు, మంకెన పువ్వెరుపు, మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు, సందె ఎన్నెల్లోన సాగే మబ్బెరుపు, తానెరుపు అమ్మాయి తనవారిలోన’ అని వర్ణించగలదు ఆ గళం. ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మరెమ్మకు’ అంటూ అబ్బురపడుతూనే కొమ్మలేకుండా పూచిన గోరింటతో ‘మురిపాల అరచేత’ మొగ్గ తొడిగించి ‘ఎంచక్కా పండిన ఎర్రని చుక్క — చిట్టి పేరంటానికి శ్రీరామరక్ష’ అంటూ దీవించేది ఆ కలమే. ‘చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమవెన్నెలలు, ఏకమైన హృదయాలలో పాకే బంగరు రంగులు … అందీ అందని సత్యాలా? సుందర మధుర స్వప్నాలా?’ అంటూ ప్రశ్నించేది ఆ కలమే.

‘విశ్వమంతా ప్రాణవిభుని మందిరమైన వీధివాకిలి ఏది చెల్లెలా’ అంటూ అమాయకంగానే గడుసుప్రశ్న అడిగిన రాధదీ గొంతుకే. ‘ముందు తెలిసెనా ప్రభు! ఈ మందిర మిటులుంచేనా’ అన్న భక్తురాలు, ‘నాకన్నా నిరుపేద నా మహారాజు’ అని జాలిపడుతూ ‘అసలే ఆనదు చూపు! ఆ పయి ఈ కన్నీరు, తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో’ అంటూ అలమటిస్తూ ‘కొలను నడిగి తేటనీరు, కొమ్మనడిగీ పూలచేరు, చెట్టునడిగి, పుట్టనడిగి, పట్టుకొచ్చిన ఫలాలు, పుట్టతేనె రసాల’లో దోరవేవో కాయలేవో అంటూ తబ్బిబ్బయిన శబరి, ‘ఘనాఘన సుందరా! కరుణారస మందిరా! అది పిలుపో, మేలు కొలుపో, అతి మధుర మధుర మధురమౌ ఓంకారమో’ అని తన్మయుడయిన తుకారాం, ‘మ్రోయింపకోయ్ మురళి, మ్రోయింపకోయ్ కృష్ణ! తీయ తేనియ బరువు, మోయలేదీ బ్రతుకు! మ్రోయింపకోయ్!’ అని వెతలు పడే విరహగోపిక, ఇంకా గుహుడు, ఆండాళ్ళు, ధనుర్దాసు అందరి భక్తీ వెలువడింది ఆ గళంతోనే!

‘మనిషైతే మనసుంటే, కనులు కరగాలిరా! కరిగి, కరుణ కురియాలిరా! కురిసి, జగతి నిండాలిరా!’ అన్న మానవతావాదం ఆ కలానిది. ‘వాడ వాడల వాడే! జాడలన్నిట వాడే! ఇంటి ముంగిట వాడే! ఇంటింటిలో వాడే!’ అని దైవాన్ని అన్నిచోట్లా చూస్తూ ‘అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది’ అని విశదీకరించింది ఆ కలమే. ‘మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నీ మనసుకు మబ్బైతే, మతం వద్దు, గితం వద్దు, మాయా మర్మం వద్దు’ అని సర్వమత సమైక్యతావాదాన్ని పెంపొందిస్తూ ‘నారాయణ నారాయణ! అల్లా అల్లా! మాపాలిటి తండ్రీ, మీ పిల్లల మేమెల్లా’ అని పాడిందీ ఆ గళమే.

‘కోతీబావకు పెళ్ళంట కోవెల వీధిలో విడిదంట’ అంటూ మల్లీశ్వరితో మొదలైన ఆయన సినిమాపాట పిలచిన బిగువుగా ఎన్నో వయ్యారాలు మరెన్నో నయగారాలు పోతూ ఔరౌర అనిపించుకుంది. ‘గట్టుకాడ ఎవరో సెట్టు నీడ ఎవరో, నల్లకనుల నాగసొరమూ ఊదేరు ఎవరో?’ అంటూ వెదుక్కున్నా, ‘పగలైతే దొరవేరా, రాతిరి నా రాజువురా! పక్కన నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమిరా!’ అంటూ పరవశించిన ప్రేమిక ఆ కలం స్పష్టే. బడలి ఒడిలో పవ్వళించిన ప్రియుని నిద్రను భగ్నం చేస్తున్న అల్లరి గాలిని ‘సడి సేయకో గాలి, నడి సేయబోకే’ అని కోరుతూనే ‘రత్నపీఠిక లేని రారాజు నా స్వామి, మణికిరీటము లేని మహారాజు గాకేమి, చిలిపి పరుగులు మాని కొలిచి పోరాదే’ అని అదిలించినది కలమే.

‘నేలతో నీడ అన్నది నను తాకరాదని, పగటితో రేయి అన్నది నను తాకరాదని’ అంటూ బాధపడుతూనే ‘రానిక నీకోసం సఖీ, రాదిక వసంతమాసం… ప్రతి గాలి సడికి తడబడకు, పదధ్వనులనీ పొరబడకు’ అన్న నాయకుడిది, ‘రానైనా రాలేను, నిదుర పోనైనా పోలేను, నిశిరాత్రియైనా నీ పిలుపే నా ప్రియా, ఆ నావ దాటిపోయిందీ, ఆ వొడ్డే చేరిపోయిందీ’ అన్న భగ్ననాయికది కూడా ఆ గళమే. మేడంటే మేడా, గూడంటే గూడూ కాకపోయినా పదిలంగా నేసిన పూసిన పొదరింట్లో అతనైతే ఆకుకొమ్మా, ఆమేమో వెన్నెల వెల్లా అంటూ అన్నా చెల్లెళ్ళ ఆత్మీయతని వర్ణించింది ఆ కలమే.

కూచిపూడి నాట్యకళా పునరుద్ధరణకు వ్రాసిన మొదటి ఆధునిక యక్షగానం క్షీరసాగరమథనంలో ‘తరవండి క్షీరాబ్ధి, తరవండి క్షీరాబ్ధి, అటు లాగే అసురు లహిఫణము, ఇటు లాగే వాలము సురగణము,’ అంటూ మొదలయ్యే ఈ దరువులో దేవదానవులు వాసుకిని అలిత్రాటిగా చేసుకొని ‘చటుల గతి గిరి గిరగిర తిరుగగ, పటుకూర్మము మూపటు నిటు నొరయగ,’ సముద్రమథనం గావిస్తుంటే ‘తరిత్రాటీ మై పొరలివిగో, ఉరికేటి నాలుకలివిగో, గిరినుండీ చెదరేటి తరులవిగో శిలలవిగో, వెరచి కడలి కడుపడుగున గల జల చరములు విలయమ్మని పై వెడలగ’ అంటూ కవ్వపు లయ తప్పకుండానే తబ్బిబ్బవుతున్న సర్పాన్నీ, కంపిస్తున్న మందరపర్వతాన్నీ, అల్లకల్లోలమవుతున్న సముద్రాన్ని బహువొడుపుగా వర్ణించింది ఆ గళమే కాదూ!

‘గుత్తునా యని జాతి ముత్యాల్ గుచ్చినాడే మేలి సరముల, ఇత్తునా యని తెలుగుతల్లికి ఇచ్చినాడే భక్తితో” అని గురజాడను మెచ్చుకొన్నా, ‘సంస్థలన్నీ ఆయనే! ఉద్యమాలన్నీ ఆయనే! జనం అంతా కలసిన జనశక్తి ఆయనే’ అని వీరేశలింగాన్ని వర్ణించినా, వ్యాసం వ్రాసినా, ప్రసంగం చదివినా, రేడియోకి నాటిక వ్రాసినా, సినిమాకి పాట వ్రాసినా, పద్యం వ్రాసినా, గద్యం వ్రాసినా ఆ కలానికి ప్రవాహంలా పరిగెట్టటమే తెలుసు. ఆ గళానికి మధురంగా పాట పాడటమే తెలుసు.

‘మూగవోయిన నా గళమ్మునను గూడ నిదురవోయిన సెలయేటి రొదలు కలవు’ అని చెప్పిన కవి స్వర పేటికను కేన్సర్ వ్యాధి కబళించినా ఆ గొంతుక మూగపోలేదు. ఆ సెలయేటి రొదలు ఆగని కవితాధారగా రేడియో నాటికలూ, వ్యాసాలుగా ఆయన చనిపోయేవరకూ సాగుతూనే ఉన్నాయి. ‘ఉదయాన కలత నిదర చెదరిపోవు వేళ, మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ, ముసలి తనపు అడుగుల సడి ముంగిట వినబడెనా వీట లేడనీ చెప్పించు, వీలు కాదనీ పంపించు’ అని చెప్పిన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మాటలు మృత్యువు చెవిన బెట్టలేదు. అయితేనేం, ఆయన వాణి ఎప్పటికీ మూగవోదు. కేన్సరే కాదు, మృత్యువు కూడా దానికి ముగింపు చెప్పలేదు. తెలుగు కవితాభిమానులున్నంతవరకు ఆ గొంతు వినిపిస్తూనే ఉంటుంది.

ఆ నిత్య నూతన వైతాళిక సుమధుర కవితా గానానికి, అమర కవి వాణికి జన్మదినోత్సవ నివాళి.

[దేవులపల్లి కృష్ణశాస్త్రి శతజయంతోత్సవ వేడుకల సందర్భంగా 1998 తానాపత్రిక ప్రత్యేకసంచికలో ప్రచురించిన ఈవ్యాసం ఈమాటలో పునర్ముద్రితం చేసుకోవడానికి అనుమతినిచ్చిన రచయితకు, తానా సంపాదకులకు కృతజ్ఞతలు — సం.]


జంపాల చౌదరి

రచయిత జంపాల చౌదరి గురించి:

డా. జంపాల చౌదరి వృత్తిరీత్యా మానసిక విద్యానిపుణులు. తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తెలుగు సాహిత్య చర్చల్లో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కు అధ్యక్షుడిగా పనిచేశారు. గత మూడున్నర దశాబ్దాలుగా తానా సంఘం, తానా ప్రచురణలు తెలుగు భాషకు, సాహిత్యానికి చేస్తున్న అనేక సేవల వెనుక ప్రధానపాత్ర వహిస్తున్నారు.

 ...