రీప్లే

“ఓటీపీ చెప్పండి సార్‌!” అర్జున్‌ క్యాబ్‌ ఎక్కగానే అడిగాడు డ్రైవర్‌. అర్జున్‌ చెప్పాడు. రైడ్‌ మొదలైంది.

రైడ్‌ మొదలైన ఆరో నిమిషం. అర్జున్‌ సైడ్‌ మిర్రర్‌ చూశాడు.

ఆబ్జెక్ట్స్‌ ఇన్‌ ద మిర్రర్‌ ఆర్‌ సేమ్‌ ఆజ్‌ దే అప్పియర్‌! అని రాసి ఉందక్కడ. డ్రైవర్‌వైపున్న సైడ్‌ మిర్రర్‌ చూశాడు. ఆబ్జెక్ట్స్‌ ఇన్‌ ద మిర్రర్‌ ఆర్‌ క్లోజర్‌ దేన్‌ దే అప్పియర్‌ అని రాసి ఉంది.

రెండూ క్రాస్‌ చెక్‌ చేసుకున్నాడు. అర్జున్‌ సరిగ్గానే చూశాడు. అవి అలాగే ఉన్నాయి, ఏం మారలేదు. నవ్వొచ్చిందతనికి, విద్య గుర్తొచ్చి.

మొబైల్లో వాట్సాప్‌ ఓపెన్‌ చేసి, విద్య కాంటాక్ట్‌ చూశాడు. ఆన్‌లైన్‌ అని చూపించింది. సెకండ్లలో టైపింగ్‌… అని వచ్చింది. అర్జున్‌ వెంటనే వాట్సాప్‌ క్లోజ్‌ చేశాడు. కొన్ని సెకండ్లలో ఫోన్‌ మోగింది. విద్య దగ్గర్నుంచి మెసేజ్‌.

వియ్‌ నీడ్‌ టు టాక్‌!


అర్జున్‌ ఆలోచిస్తున్నాడు. ‘వియ్‌ నీడ్‌ టు టాక్‌’కి అర్థం ఏమై ఉంటుందా అని. నిశ్శబ్దానికి ముందు చివరగా వినిపించే ఓ శబ్దం చప్పుడు అయి ఉండొచ్చు అది. ఏంటి ఆ నిశ్శబ్దం? బ్రేకప్‌ చెప్తుందా? పదిరోజులుగా అందుకే మాట్లాడలేదా? ఇంట్లో గొడవలని చెప్తుందేమో? ‘మనం విడిపోవాలి. ఇట్స్‌ ఓవర్‌’ అని చెప్పడానికి ఏం పదాలు వాడుతుందో?

అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. మధ్యాహ్నం 3:15. ఇంకో నలభై ఐదు నిమిషాలు ఉంది విద్య రావడానికి. చుట్టూ చూశాడు. ఎటు చూసినా మనుషులే! ఎవరెవరో ఏదేదో ఆర్డర్‌ చేస్తున్నారు. ఆఫర్‌లో బర్గర్‌. బర్గర్‌తో డ్రింక్స్‌ ఫ్రీ. మెషీన్‌ నుంచి డ్రింక్‌ కప్స్‌లో పడే శబ్దం చాలాసేపట్నుంచి వినిపిస్తోంది, ఆగకుండా. కార్నర్‌లో నలుగురు ఫ్రెండ్స్‌. గోల. బర్త్‌డే ఎవరిదో!

అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. 3:20. 2016 మార్చి 27 అది. అంటే మూడు రోజుల్లో విద్య బర్త్‌డే.

అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. 3:48. 2016 సెప్టెంబర్‌ 27. అంటే మూడు రోజుల్లో తన బర్త్‌డే.

టికెట్స్‌ దొరికే అవకాశమే లేదనుకున్నాడు అర్జున్‌. చుట్టూ చూసి, ఇంటికి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాడు. ఆర్నెల్ల తర్వాత కనిపించింది ఆ అమ్మాయి. మధు.

“హేయ్‌! నువ్వేంటిక్కడా?” అర్జున్‌ను గట్టిగా ఊపేస్తూ, ఉత్సాహంగా అడిగింది మధు.

“హే హాయ్‌!” అన్నాక ఏమనాలో తోచక ఆగిపోయాడు అర్జున్‌.

“ఏంటి బాబూ ఇలా అయిపోయావ్‌! ఆ గడ్డమేంటి పిచ్చోడిలా!?”

అర్జున్‌ విచారంగా నవ్వాడు.

“యూ ఆల్‌ ఓకే?” అడిగింది మధు.

“యా! ఆల్‌ గుడ్‌!” నవ్వాడు అర్జున్‌.

“లేదు లేదు లేదు… ఇటు చూడు. నన్ను చూడు.”

అర్జున్‌ చూశాడు.

“ఎటో కాదు! నా కళ్ళలోకి…”

మధు కళ్ళలోకి చూశాడు.

“సో దట్స్‌ యూ! నువ్‌ బాలేవ్‌ మై ఫ్రెండ్‌! నువ్‌ బాలేవ్‌!! ఇలా అయిపోయావేంటీ?”

అర్జున్‌ ఆర్నెల్లకు చూశాడు చూపు తిప్పుకోనివ్వని అలాంటి కళ్ళను మళ్ళీ.

“నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయ్‌!” అన్నాడు.

“గొప్ప కాంప్లిమెంటే ఇచ్చావ్‌! టికెట్‌ కోసం చూస్తున్నావా? ఎక్స్‌ట్రా ఉంది నాతో వచ్చెయ్‌,” అంది మధు.

“కానీ…”

“మరేం పర్లేదు… వచ్చెయ్‌…”

అర్జున్‌ సరేనన్నాడు. మధు సరే అన్నట్టు ముందుకు వెళ్ళి, ఆగింది. వెనక్కి తిరిగి అర్జున్‌ దగ్గరకు వచ్చి, “అర్జున్‌, సారీ!” అంది.

“పర్లేదు. నేను మళ్ళీ ఎప్పుడైనా చూస్తా.” అన్నాడు.

“అలా కాదు. కౌంటర్‌లో తెలిసినతని దగ్గర టికెట్‌ ఉంది కానీ, డబ్బుల్లేవ్‌! నిన్నెలా అడగాలాని…” మెల్లిగా చెప్పింది మధు.

అర్జున్‌ గట్టిగా నవ్వాడు. జేబులోనుంచి పర్స్‌ తీశాడు.

“ఎంత?” అడిగాడు అర్జున్‌. టైమ్‌ అప్పుడు 3:30.

“వన్‌ ఫిఫ్టీ నైన్‌ రూపీస్‌ సర్‌!” చెప్పింది ఫుడ్‌కోర్ట్‌ కౌంటర్‌లోని అమ్మాయి. రెండు వంద నోట్లిచ్చి, మిగతా చిల్లర, తన ఆర్డర్‌ తీసుకొని వెళ్ళి, ముందు కూర్చున్న ప్లేస్‌లోనే కూర్చున్నాడు అర్జున్‌.

టైమ్‌ 4:02. అర్జున్, మధు హాల్లోకి వెళ్ళేసరికే సినిమా టైటిల్స్‌ పడుతున్నాయి.

“సో! ఏంటి ఆ గడ్డమేంటీ? నువ్వేంటీ?” అడిగింది మధు, ఇద్దరూ తమ తమ సీట్లలో కూర్చోగానే. రిలీజ్‌ రోజే అయినా సినిమాను పట్టించుకోవట్లేదిద్దరూ. అర్జున్‌ ఏం మాట్లాడడం లేదు.

“ఎప్పుడొచ్చావ్‌ హైద్రాబాద్‌?” మళ్ళీ మధునే!

ఏం జరిగింది అర్జున్‌?” అర్జున్‌ చెయ్యి పట్టుకొని అడిగింది మధు.

“విద్య…” అని ఆగిపోయాడు.

“ఆ… విద్య? లవ్‌ ఫెయిల్యూరా?”

అర్జున్‌ తలూపాడు. మధు చిన్నగా నవ్వింది.

“పర్లేదులే! యూ విల్‌ బి ఆల్‌రైట్‌!” అంది అర్జున్‌ వైపు చూడకుండా, స్క్రీన్‌ వైపు చూస్తూ.

టైమ్‌ 3:35. బర్త్‌డే పార్టీ గోల ఇంకా తగ్గలేదు. అర్జున్‌ వాళ్ళ దిక్కు చూశాడు. అందరిలోనూ ఏదో చెప్పలేని ఆనందం. ఏమీ అనలేకపోయాడు. వాళ్ళను చూసి అర్జున్‌ నవ్వితే, సమాధానంగా వాళ్ళూ నవ్వారు.

టైమ్‌ 4:20. మధు నవ్వును చూస్తూ అర్జున్‌ కూడా నవ్వాడు. ఇద్దరూ సినిమా చూడడంలో మునిగిపోయారు. మధ్యమధ్యలో అర్జున్‌ను చూస్తూ నవ్వుతోంది మధు.

అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. 3:40. విద్య రావడానికి ఇంకా ఇరవై నిమిషాలు ఉంది. తెచ్చుకున్న ఫుడ్‌ అప్పటికే అయిపోయింది. ఎవరితోనైనా మాట్లాడాలనిపించి ఫోన్‌ తీశాడు.

టైమ్‌ రాత్రి ఏడవుతోంది. “నీ ఫోన్‌ నెంబర్‌?” అడిగింది మధు. అర్జున్, మధు అప్పుడే హాల్‌ నుంచి బయటకొస్తున్నారు. అర్జున్‌ నంబర్‌ చెప్పాడు. మధు మిస్డ్‌ కాల్‌ ఇచ్చింది.

“సో మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నాం? నువ్వెక్కడుంటావ్‌?” అడిగింది మధు.

“ఇక్కడే పక్కనే! కిలోమీటర్‌ దూరం.”

“ఓ గ్రేట్‌! అయితే పెద్ద దూరం కాదు. కలుస్తూ ఉందాం.” మధు.

“హా! తప్పకుండా!!” అర్జున్‌.

టైమ్‌ 3:50. అర్జున్‌ భయంగానే ఉన్నాడు. విద్యకు ఫోన్‌ చెయ్యాలని చాలాసార్లు అనుకొని ఆగిపోయాడు. ఆమె రావడానికి ఇంకో పది నిమిషాలు ఉంది.

టైమ్‌ 10:08. అర్జున్‌ ఫోన్‌ ట్రింగ్‌ అని మోగింది. మెసేజ్‌. మధు చేసిందది.

“నువ్వసలు ఇలా కలుస్తావని అస్సలనుకోలేదు. అన్డ్‌ బైదవే బాలేవ్‌ నువ్‌! ట్రై టు బి నార్మల్‌. నీలా ఉండు.”

అర్జున్‌ ఆ మెసేజ్‌కు స్మైలీని రిప్లైగా ఇచ్చాడు.

“రేపు ఈవినింగ్‌ ఖాళీగా ఉంటావా?” అడిగింది మధు.

“హా!”

“అయితే కలుద్దాం.”

సెప్టెంబర్‌ 28. సాయంత్రం ఆరవుతోంది. అర్జున్‌ కోసం మధు ఎదురు చూస్తోంది. అతడు వస్తా అన్న టైమ్‌ దాటి అరగంట అయింది. మధు ఫోన్‌ చేసింది.

“ట్రాఫిక్‌లో ఉన్నా. ఇన్‌ టెన్‌ మినట్స్‌” అన్నాడు అర్జున్‌. “కూల్‌! పర్లేదు” అంది మధు. పావుగంటకు కలిశారిద్దరూ.

మార్చి 27. అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. 4:15. విద్య వస్తా అన్న టైమ్‌ దాటి పావుగంట అయింది. అర్జున్‌ ఫోన్‌ చేశాడు.

“ట్రాఫిక్‌లో ఉన్నా. ఇన్‌ టెన్‌ మినట్స్‌” అంది విద్య. “కూల్‌!” అన్నాడు అర్జున్‌.

“సారీ! లేట్‌ అయిపోయింది.” అన్నాడు అర్జున్, మధును చూస్తూనే. అర్జున్‌ ఫోన్లో టైమ్‌ 6:08 అని చూపిస్తోంది.

“మరేం పర్లేదు. హౌ యూ డూయింగ్‌?” అడిగింది మధు.

“బాగున్నా… బాగుండాలింకా! పిలిచావ్‌?” అడిగాడు అర్జున్‌.

“ఊరికనే పిలిచా! నీతో మాట్లాడాలనిపించింది” అంది మధు.

“హ్మ్‌!”

“ఎన్నాళ్ళయింది?”

“సరిగ్గా ఆరునెలలు. మార్చ్‌ 27. ఆ డేట్‌ ఎప్పటికీ మర్చిపోలేను. ఆన్డ్‌ యా! నేనింకా ఎందుకు బతికున్నానో నాకే అర్థం కావట్లేదు.”

“విద్య అంటే లాస్ట్‌ ఇయర్‌ ఒక పెళ్ళిలో కలిశానన్నావ్‌? ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు కూడా పెట్టావ్‌? తనేనా?”

తనే…”

“షి లుక్స్‌ బ్యూటిఫుల్‌. ఆ రోజే అడగాలనుకున్నా. ఎందుకో అడగలేదు. కాంటాక్ట్‌లో లేకుండా పోతాం కదా మనం కొన్నిసార్లు, యాక్సెస్‌ ఉన్నా కూడా.”

అర్జున్‌ చిన్నగా నవ్వి, “ఐ మిస్‌ హర్‌. మై బిగ్గెస్ట్‌ లాస్‌.” అన్నాడు.

“కొన్ని అంతే!” నవ్వింది మధు.

మార్చి 27. అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. 4:20.

అక్టోబర్‌ 1. ఆ రోజు మొదలై అప్పటికింకా ఒక్క నిమిషమే!

“హ్యాపీ బర్త్‌డే అర్జున్‌!” ఫోన్లో మధు.

“థ్యాంక్యూ! నీకెలా గుర్తింది నా బర్త్‌డే?”

“మొన్న మనం కలిసిన రోజే నీ ఎఫ్‌బీ అంతా స్టాక్‌ చేసేశా బాబూ!”

“థ్యాంక్యూ. దట్స్‌ స్వీట్‌!”

“రేపేంటి ప్లాన్స్‌? ఓ! సారీ! ఇవ్వాళేనేమో!”

“పెద్దగా ప్లాన్స్‌ ఏం లేవు. తన కాల్‌ కోసం వెయిటింగ్‌.”

“చేస్తుందిలే!”

“నేననుకోను.”

మార్చి 27. టైమ్‌ 4:25. విద్య ఫోన్‌ చేస్తూంటే అర్జున్‌ ఫోన్‌ బిజీ వస్తోంది. అర్జున్‌ ఆ కాల్‌ను హోల్డ్‌లో పెట్టి, విద్య కాల్‌కు కనెక్ట్‌ చేసుకున్నాడు.

“అర్జున్‌, సారీ. ఇంకొంచెం లేటయ్యేలా ఉంది.”

అర్జున్‌కు ఏం అర్థం కావడం లేదు. గంటపైనే అయింది అతనొచ్చి కూర్చొని. విద్య మాట చూస్తే మామూలుగానే ఉంది. బ్రేకప్‌ చెప్పడానికే కదా వస్తోంది? అమ్మాయిలు తనకు అర్థం కారనుకున్నాడు. ఎవ్వరికీ అర్థం కారని కూడా ఆ వెంటనే అనుకున్నాడు.

అక్టోబర్‌ 1. ఉదయం 9:38. “నువ్వివ్వాళ ఇంత త్వరగా వస్తావనుకోలేదు” అంది మధు.

అర్జున్‌ నవ్వాడు. “నాకసలు బర్త్‌డే సెలెబ్రేట్‌ చేస్కోడం నచ్చదు. నీకెందుకో టైమ్‌ ఇవ్వాలనిపించింది. ఇవ్వొచ్చనిపించింది.” అన్నాడు అర్జున్‌.

ఆ రోజంతా అర్జున్‌ మధుతోనే గడిపాడు. ఆ రోజంతా అలాగే విద్య కాల్‌ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. విద్య ఎందుకో కాల్‌ చేయలేదు. అదే ఆలోచిస్తున్నాడు అర్జున్‌. రాత్రంతా అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు.

మార్చి 27. టైమ్‌ 4:30. అర్జున్‌ ఫోన్‌లో గేమ్‌ ఆడడం మొదలుపెట్టాడు.

బర్త్‌డే పార్టీ అయిపోయింది. తాను ఆ ఫుడ్‌కోర్ట్‌కి వచ్చినప్పుడున్న ఏ ఒక్క వ్యక్తీ అప్పటికి లేరు. కొత్తవాళ్ళు వస్తున్నారు, వాళ్ళూ వెళ్ళిపోతున్నారు. అర్జున్‌ ఒక్కడే విద్య కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు.

నాలుగున్నర నుంచి ఒక్కో నిమిషం కదలాలా వద్దా అన్నట్టు కదుల్తోంది.

కాలం రోజులకు రోజులు పరుగెడుతోంది. అక్టోబర్‌ పోయి జనవరి వచ్చింది. అంతా నిమిషాల్లో జరిగిపోతున్నట్టు ఉంది అర్జున్‌కు.

వారానికోసారి కలవడం దగ్గర్నుంచి, రోజూ కలుస్తున్నారు మధు, అర్జున్‌. విద్య ఆలోచనల్లోనుంచి అర్జున్‌ మెల్లిగా బయటపడుతున్నాడు. మధు దగ్గరైపోతోంది. మధు ఆలోచనలు అతణ్నిప్పుడు కొత్తగా అల్లుకుపోయాయి. ఆ ఆలోచనల్ని ప్రేమిస్తున్నాడతనిప్పుడు.

మార్చి 27. విద్య ఆలోచనల్లో పడిపోయి, సెకండ్లను లెక్కబెట్టుకుంటోన్న అర్జున్‌కు, విద్య ఎదురుగా వస్తూ కనిపించడం భయపెట్టింది. అంతసేపు విద్య రావడాన్ని ఎంత కోరుకున్నాడో, విద్య నిజంగానే రావడం అతణ్ని అంత భయపెడుతోంది.

టైమ్‌ చూసుకున్నాడు. సరిగ్గా 4:45. విద్య అర్జున్‌కు దగ్గరగా వచ్చింది. అర్జున్‌ లేచి నిలబడ్డాడు. చెయ్యి ఊపాడు. ఇద్దరి కళ్ళూ ఏవో మాట్లాడుకున్నాయి. అర్జున్, విద్య ఎదురెదురుగా కూర్చున్నారు.

2017 జనవరి 8. సాయంత్రం 6:18. మధు, అర్జున్‌ ఎదురెదురుగా కూర్చున్నారు. మధు అర్జున్‌ను చూస్తూ చాలాసేపు ఏం మాట్లాడకుండా కూర్చొంది.

“ఏంటి?” అడిగాడు అర్జున్‌.

“ఏంటో! చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది.”

అర్జున్‌ చిన్నగా నవ్వాడు. మధు అతడికి కొంచెం దగ్గరగా జరిగింది. “నీ చెయ్యివ్వు!” అడిగింది మధు.

“ఎందుకు?”

“ఇవ్వు ప్లీజ్‌!”

అర్జున్‌ చెయ్యిచ్చాడు. మధు ఆ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. పక్కనే ఉన్న నెయిల్‌ పాలిష్‌ తీస్కొని, ఉంగరం వేలి గోరుకు పెయింట్‌ చేసింది. అర్జున్‌ ఏంటని అడగలేదు.

“చూడు నీ వేళ్ళు! అచ్చం ఆడపిల్ల వేళ్ళే!” అంది మధు గట్టిగా నవ్వుతూ. మధు పెయింట్‌ చేసిన ఆ గోరును, తన వేళ్ళను చూసుకొని అర్జున్‌ నవ్వాడు. చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు.

“హేయ్‌! నవ్వుతావెందుకు? కావాలంటే తీసేస్తా. ఈజీ.” అంటూ మళ్ళీ అర్జున్‌ చెయ్యందుకుంది మధు.

“పర్లేదు ఉంచు. నీ గుర్తుగా…” అన్నాడు అర్జున్‌. థ్యాంక్స్‌, అన్నట్టుగా చెయ్యిని గుండెకు పెట్టుకొని నవ్వింది మధు. అర్జున్‌ ఏం మాట్లాడలేదు. కాసేపు మౌనంగా ఉండి…

“తనకు నా వేళ్ళంటే బాగా ఇష్టం. ‘అదేంటో నీ వేళ్ళంటే ఇష్టమర్జున్‌’ అనేది” అన్నాడు.

“తననింకా మర్చిపోలేదా?” అడిగింది మధు.

“తననెప్పటికీ మర్చిపోలేను.”

“అప్పుడు నాకింత దగ్గర కావాల్సింది కాదు” అంది మధు, ఆ మాట చెప్పడానికి ముందు అర్జున్‌ కళ్ళలోకి సూటిగా చూసి, ఆ మాట చెప్పేప్పుడు, చెప్పాక అతని వైపే చూడకుండా. మధు అప్పుడు అర్జున్‌ను చూడలేదు కానీ, అతను చాలా కొత్తగా నవ్వాడు. ఆ నవ్వుకో అర్థమంటూ లేదు.

మార్చి 27. విద్య అర్జున్‌కు ఎదురుగా వచ్చి కూర్చోవడమే అతని చెయ్యి పట్టుకొని, అతణ్నే చూస్తూ కూర్చుంది. టైమ్‌ సరిగ్గా ఐదవుతోందప్పుడు.

“చెప్పు” అడిగాడు అర్జున్‌. చాలాసేపున్న నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ.

2017 ఫిబ్రవరి 12. మధు అర్జున్‌కు పూర్తిగా దగ్గరైపోయింది. ఇద్దరి డైలీ రొటీన్స్‌లోకి ఇద్దరూ వచ్చేశారు. అర్జున్‌ ఊరెళ్ళి అవ్వాళే రావడంతో ఐదు రోజుల తర్వాత వాళ్ళ ఫేవరైట్‌ ప్లేస్‌లో, ఎవ్వరూ లేని చోట, అర్ధరాత్రి వేళ కలుసుకున్నారిద్దరూ.

“చెప్పు” అడిగాడు అర్జున్‌. చాలాసేపున్న నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ.

“నువ్వెలాంటి ఆలోచనల్లో ఉన్నావో! నువ్వు ఈ పర్టికులర్‌ టైమ్‌లో లవ్‌ని ఎలా తీసుకుంటావో నాకు తెలుసు. అయినా నీకిది చెప్పాలనుకుంటున్నా. చెప్పలేదన్న రిగ్రెట్‌ ఒకటి నాకొద్దు.” అని ఆగింది మధు.

అర్జున్‌ ఏం మాట్లాడకుండా మధునే చూస్తూన్నాడు.

అర్జున్‌…” అని మెల్లిగా పలికి మళ్ళీ ఆగిపోయింది మధు.

అర్జున్‌ కొంచెం దగ్గరగా జరిగాడు. మధు క్షణాల్లో అతడి పెదాలను తన పెదాలతో పట్టేసుకుంది. అది అర్జున్‌ ఫ్లాట్‌ ఉన్న కాలనీలోని మెయిన్‌ రోడ్డుకు పక్కన్నే ఉన్న చిన్న సందు. ఏ చప్పుడూ వినిపించట్లేదక్కడ. వాళ్ళిద్దరికీ మాత్రమే వినిపిస్తోన్న శ్వాస చప్పుడు తప్పితే!

రెండు నిమిషాలాగి… “అర్జున్‌ ఐ లవ్యూ” అంది మధు, అర్జున్‌కు దూరంగా జరుగుతూ.

“ఐ లవ్యూ టూ” అన్నాడు అర్జున్, మళ్ళీ మధుకు దగ్గరగా జరుగుతూ.

ఐ లవ్యూ అర్జున్‌! నీకిది ఇంత ధైర్యంగా, ఇంత ప్రశాంతంగా, ఇంత నమ్మకంగా చెప్పే రోజు కోసమే పదిరోజులుగా ఎదురుచూస్తున్నా…” విద్య మాట్లాడడం మొదలుపెట్టింది.

2016 మార్చి 27 అది. టైమ్‌ 5:03 అవుతోంది. అర్జున్‌ ఏమీ అర్థం కానట్లు చూస్తున్నాడు.

“అర్జున్‌! అర్జున్‌!! నాన్న మన లవ్‌ని యాక్సెప్ట్‌ చేశారు. ఇట్స్‌ ఆల్‌ గుడ్‌ నవ్‌. నీకు ఈ మాట చెప్పాలని, చెప్పినప్పుడు నీ ముఖం చూడాలని… నిన్నట్నుంచి ఎంతలా అనుకుంటున్నానో…” విద్య మాట్లాడుతూ పోతోంది. అర్జున్‌ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చిన్నగా నవ్వాడు. ఇంకాస్త నవ్వాడు. అర్జున్‌ నవ్వును చూస్తూ విద్య మురిసిపోయి, లేచి అతణ్ని గట్టిగా అల్లుకుంది.

అర్జున్‌ ఆమెను అలాగే హత్తుకొని “ఐ లవ్యూ విద్యా!” అన్నాడు. విద్య మళ్ళీ చిన్నగా నవ్వింది. అర్జున్‌ ఆ వెంటనే విద్యను కౌగిలి నుంచి విడిపించుకొని, కాస్తంత దూరం జరిగి, “ఒక్క నిమిషం” అన్నాడు, చూపుడు వేలును చూపిస్తూ.

2017 ఫిబ్రవరి 12.

“చెప్పు” అడిగాడు అర్జున్‌, చాలాసేపున్న నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ.

“నువ్వెలాంటి ఆలోచనల్లో ఉన్నావో! నువ్వు ఈ పర్టికులర్‌ టైమ్‌లో లవ్‌ని ఎలా తీసుకుంటావో నాకు తెలుసు. అయినా నీకిది చెప్పాలనుకుంటున్నా. చెప్పలేదన్న రిగ్రెట్‌ ఒకటి నాకొద్దు.” అని ఆగింది మధు. అర్జున్‌ ఏం మాట్లాడకుండా మధునే చూస్తూన్నాడు.

“అర్జున్‌…” అని మెల్లిగా పలికి మళ్ళీ ఆగిపోయింది మధు. అర్జున్‌ కొంచెం దగ్గరగా జరిగాడు. మధు మరింత దగ్గరగా జరిగింది.

“మధు! ప్లీజ్‌ నో!” అని ఆగిపోయాడు అర్జున్, మధు ఇంకా ఇంకా దగ్గరగా వస్తూంటే. అది అర్జున్‌ ఫ్లాట్‌ ఉన్న కాలనీలోని మెయిన్‌ రోడ్డుకు పక్కన్నే ఉన్న చిన్న సందు. ఏ చప్పుడూ వినిపించట్లేదక్కడ. వాళ్ళిద్దరి మధ్యా ఉన్న నిశ్శబ్దం వల్ల చీకటి చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది.

2016 మార్చి 27.

అర్జున్‌ విద్యను గట్టిగా హత్తుకొని, ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, ఆమె కళ్ళలోకి చూస్తూ చిన్నగా నవ్వాడు. వాళ్ళిద్దరి ఫోన్లలో టైమ్‌ 5:22 అని చూపిస్తోందప్పుడు.

“ఐ లవ్యూ” అంది విద్య, అర్జున్‌కు కూడా వినిపించనంత చిన్నగా!