ఉలిక్కి పడి నిద్ర లేచాడు సుబ్బారావు. అతని ఉలికిపాటుకి కారణం ఉంది. ఆ రోజు ప్రేమికుల దినం. ఎందుకో సుబ్బారావుకి దినం అన్న పదం వినగానే, వరుసగా ఉదిత్ నారాయణ్ పాడిన పది తెలుగు పాటలు విన్నంత వికారం వస్తుంది.
చిన్నప్పుడు వాళ్ళ తెలుగు మాస్టారు వేసిన కూకలు జ్ఞాపకం వస్తాయి. “దినం, తద్దినం ఏంటోయ్? రోజు అనలేవూ?” అని.
ఐతే ఈ రోజు అదొక్కటే కాదు సుబ్బారావుకి వికారాన్ని కలిగించింది. తనకు ఈ ప్రేమికుల దినం జరుపుకోవడానికి తనదైన ఒక ప్రేమిక లేకపోవడం కూడా.
ఇరవయి నాలుగేళ్ళ సుబ్బారావుకి పెద్ద చిక్కే వచ్చి పడింది. అతను పని చేసే కంపెనీలో అందరూ కుర్రకారే. ఐతే సుబ్బారావుకి మల్లే కాకుండా వారందరికీ “ప్రేమికులు” ఉన్నారు. అసలు వాళ్ళ ఆఫీసులోనే మూడు జంటలు ఉన్నాయి. కాబట్టి, ఈ రోజంతా వారు తాము వాలంటైన్స్ డే ఎలా జరుపుకోబోతున్నామో చెప్పి హోరెత్తించడమే కాకుండా, ప్రతి పది నిమిషాలకీ సుబ్బారావుకి గర్ల్‌ఫ్రెండ్ లేదూ అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తారు.
ఈ రోజు సెలవు పెట్టడానికి కూడా లేదు. గత సంవత్సరం సెలవు పెట్టినందుకు కొలీగ్స్ అతన్ని చేసిన ఎగతాళి ఇంకా గుర్తు ఉంది అతనికి.
“ఇదేమన్నా రాఖీ పండగ అనుకున్నావా, భయపడి ఇంట్లో దాక్కోవడానికి? ఈ రోజు బయట పడకపోతే ఇంకెప్పుడు?” అంటూ తెగ ఏడిపించారు.
ఎలా అయినా అవమానం తప్పనప్పుడు వెళ్ళడమే బెటర్ అని డిసైడైపోయాడు సుబ్బారావు. ఇంకేముంది, గంటలో ఆఫీసులో ఉన్నాడు.
ఆఫీసు అంతా అతను ఊహించినదానికంటే కోలాహలంగా ఉంది. కొన్ని టేబుల్స్ మీద పుష్ప గుచ్ఛాలు, అందంగా ప్యాక్ చేయబడిన బాక్సులు ఉన్నాయి. ఇంకొన్నిటి మీద గ్రీటింగ్‌కార్డ్స్ ఓపెన్ చేయబడి ఉన్నాయి. అందరూ చాలా ఫాషనెబుల్గా తయారయి ఉన్నారు. ప్రేమికుల దినం కద!
“హల్లో సుబ్బు, ఏంటి అలా డల్‌గా ఉన్నావు? ఈ రోజు వాలంటైన్స్ డేనోయ్! ఓ అన్నట్టు మర్చేపోయా. నీకు గర్ల్‌ఫ్రెండ్ లెదు కదా! సారీ, సారీ!” అంటూ పలకరించిన సునీల్‌ని చూస్తూ, “మొదలయ్యిందిరా, భగవంతుడా!” అనుకున్నాడు సుబ్బారావు తనలో తాను.
ఒక వైపు ఆడంగులూ, ఇంకో వైపు మగంగులూ చాలా ఉత్సాహంగా తమ తమ ప్లాన్స్ చర్చించుకుంటున్నారు.
“ఈ సారి నేను సుచీని సరిగ్గా లేక్ మధ్యకు తీసుకెళ్ళి, అక్కడ తనని కళ్ళు మూసుకోమని చెప్పి, కళ్ళు తెరవగానే తనకి నేను కొన్న నెక్లెస్ ఇస్తాను,” ఎగ్జైట్ అయిపోతూ చెప్పాడు రవి.
“మా ఫ్రెండ్‌ని అడిగి హాండ్ గ్లైడింగ్ ఏర్పాటు చేశాను బాస్! గాల్లో అలా తేలుతున్నప్పుడు, కీర్తనకి నా గిఫ్ట్ ఇస్తాను,” ఆనందంగా అన్నాడు సునీల్.
“నేను మేఘూకి మినర్వాలో ట్రీట్ ఇస్తున్నా గురూ. ఈ గిఫ్ట్స్ ఇస్తే తిన్నట్టా, పాడా!” తనని తాను అందరికంటే ప్రాక్టికల్ అనుకునే పద్మాకర్ అన్నాడు.
మగంగుల సంభాషణ ఇలా ఐతే, ఆడంగుల ధోరణి ఇలా ఉంది:
“పద్మా కనుక నన్ను ఈ రోజు జస్ట్ డిన్నర్‌కి ఏ ఉడిపీ హోటెల్కో తీసుకెళ్ళితే, వాడిని అక్కడే ఇడ్లీలతో కొడతా,” అంటూంది కోపంగా మేఘూ ఉరఫ్ మేఘన.
“ఈ సారి, రవి కనుక నాకు సాలిటేర్ డైమండ్ రింగ్ ఇవ్వకపోతే వాణ్ణి వదిలేస్తా,” ముద్దుగా చెప్పింది సుచి అలియాస్ సుచిత్ర.
“లాస్ట్ టైం సునీల్ నన్ను జెయింట్ వీల్ మీద తీసుకెళ్ళి అక్కడ గిఫ్ట్ ఇచ్చాడు. నాకేమో హైట్లంటే భయం! ఈ సారి ఏం చేస్తాడో?” ఆందోళనగా అంది కీర్తన.
సుబ్బారావు ఒక వెర్రి నవ్వు నవ్వుతూ వీళ్ళందరి మాటలు వింటున్నాడు. ఆ రోజు మధ్యాహ్నానికే ఆఫీస్ ఖాళీ అయిపోతుందని అతనికి తెలుసు. ఆ తరువాత కాస్త ప్రశాంతంగా పని చేసుకోవచ్చు అనుకున్నాడు.
మెల్లగా అంతా పనిలో పడ్డారు. దాదాపు పదకొండు గంటలు కావస్తూ ఉండగా ఒక ఆగంతకుడు లోపలికి ప్రవేశించాడు. ఇరవయి మంది మాత్రమే పని చేసే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో, పొడుగాటి నల్లని శేర్వానీ, తలపాగా ధరించి ఉన్న అతడు ఆ వాతావరణంలో అస్సలు ఇమడలేదు.
“హౌ కన్ ఐ హెల్ప్ యు సర్?” అంటూ ప్రశ్నార్థకంగా చూసింది రిసెప్షనిస్ట్ రోజీ.
జవాబుగా అతను తన వీపు వెనకాలనుంచి ఒక ఏకె 47 తీశాడు…
ఒక అర గంట తరువాత ఆఫీసులో ఉన్న అందరూ కాళ్ళూ చేతులూ కట్టివేయబడి ఉన్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళకి తెలిసి వచ్చిందేమిటంటే, వాళ్ళు ఆ దుస్థితిలో ఉన్న కారణం వాళ్ళ ఆఫీసు లొకేషనే!
వాళ్ళ ఎదురుగా రోడ్డుకి అవతలి వైపు ఉన్న ఇంకో ఆకాశ హర్మ్యం (sky scraper) ఒక రియల్ ఎస్టేటు డీలర్‌కి సంబంధించింది. అతగాడిని చంపడానికి ఈ ఆగంతకుడు “సుపారీ” తీసుకున్నాడట. ఆయన అక్కడ ఉండేదే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆఫీసు టైంలో కాబట్టి, అతని మీద కాల్పులు జరపడానికి వీళ్ళ ఆఫీసే అత్యంత అనువైన చోటు అని భావించి సదరు ఆగంతకుడు తన కాంట్రాక్ట్ అక్కడ అమలు చేయడానికి నిర్ణయించాడు.
ఆగంతకుడికి కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నట్టుంది. వాళ్ళందరితో తనని “బిల్వ మంగళుడు” అని పిలవమని చెప్పాడు.
బిల్వమంగళుడు చిన్నప్పుడు ర్యాంకు స్టూడెంటట. తెలుగు సాహిత్యం అంటే మిక్కిలి మక్కువతో తెలుగులో పి.హెచ్.డి. చేసి, ఉద్యోగం రాక, ఆ తరువాత కడుపు మండి (ఆకలితోనూ, కోపంతోనూ), “అన్న”లతో చేరిపోయి యుద్ధ విద్యలు అభ్యసించి, కొన్నాళ్ళ తరువాత కమ్యూనిజం మీది నడమంత్రపు మోజు చచ్చి, చివరకు పారితోషికం బాగుంటుందని కాంట్రాక్టు కిల్లర్‌గా సెటిల్ అయ్యాడట.
“ఇంకో పది నిముషాల్లో చమన్ లాల్ తన ఆఫీసులో ప్రవేశిస్తాడని నాకు అందిన వర్తమానం. ఆ తరువాత ఐదు నిముషాల్లో నా పని అయిపోతుంది. నేను వెళ్ళిపోతాను. కొంత ప్రయత్నిస్తే మీ కట్లు మీరే ఒక పదిహేను నిముషాల్లో విడిపించుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరూ ఎలాంటి హీరో వేషాలు వేయకుండా బుధ్ధిగా కూర్చోండి. మీకెలాంటి ప్రమాదం ఉండదు,” చెప్పాడు బిల్వ మంగళుడు.
అందరూ స్పీడుగా తలూపారు. వాళ్ళలో ఎవరికీ ఎలాంటి సాహస కృత్యాలు చేయాలనే కోరిక లేదు అన్న విషయం భయంతో నిండిన వారి మొహాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
పదిహేను నిముషాలు గడిచాయి. కిటికీలోంచి చమన్ లాల్ ఆఫీసు వైపే చూస్తున్న బిల్వ మంగళుడు చిరాకుగా నిట్టూర్చాడు. అంతలో అతని సెల్ ఫోన్ మోగింది. ఒక్క నిమిషం మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అతను.
“చమన్ లాల్ ఇంకో గంట వరకు రాడట!” ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించకుండా అన్నాడు.
ఆ మాట విని అందరి గుండెలూ గుభేల్మన్నాయి. వాళ్ళ రియాక్షన్ పెద్దగా పట్టంచుకోకుండా చుట్టూతా చూశాడు బిల్వ మంగళుడు.
అతని నొసలు ముడి పడింది. “ఇది ఆఫీసా లేక గిఫ్ట్ స్టోరా? ఈ పూలు, గ్రీటింగ్‌కార్డ్స్ ఇవన్నీ ఏమిటి?” అడిగాడు.
అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు సమాధానమిచ్చేంత లోపల, “ఓ, ఈ రోజు వాలంటైన్స్ డే కద!” తానే అన్నాడు. “అంటే ప్రేమికుల దినం… ఇక్కడ ప్రేమికులు ఎవరున్నారు?” అడిగాడు. ఎవ్వరూ మాట్లాడలేదు.
“మనం ఒక ఆట ఆడదాం. దానికి నాకు ఇక్కడ ఉన్న ప్రేమికుల వివరాలు కావాలి.” అది రిక్వెస్టో ఆర్డరో ఎవరికీ అర్థం కాలేదు.
“నువ్వు చెప్పు,” సడన్‌గా ఆఫీసు మానేజర్ వైపు తిరిగి అడిగాడు. ఆయన తటపటాయించేంతలో తన గన్ తీసి ఆయన నుదిటి మీద బారెల్ పెట్టాడు. “నేను కాంట్రాక్ట్ తీసుకుంటేనే చంపుతా అనుకోకు. సరదాకి కూడా ఎంతోమందిని చంపాను. నా టైం వేస్టు చేయకుండా తొందరగా చెప్పు,” అన్నాడు.
వణుకుతున్న గొంతుతో మానేజర్ ఆఫీసులోని మూడు జంటల గురించి చెప్పేశాడు.
చిరునవ్వు నవ్వాడు బిల్వ మంగళుడు. “మూడు జంటలు! రవి, సుచిత్ర; పద్మాకర్, మేఘన; సునీల్, కీర్తన. భేష్. మీ ప్రేమ ఎంత గట్టిదో చూద్దాం. చిన్న పరీక్ష,” అంటూ కాసేపు ఆగాడు.
బిల్వ మంగళుడు గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పాడు. “గేమ్ ఇది. ఒక్కో జంటలో ఒక్కర్ని కాల్చేస్తాను. కానీ ఎవరిని కాలుస్తాను అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది.” పక్కనే ఉన్న టేబుల్ మీద నుంచి ఒక తెల్ల కాగితం తీసుకున్నాడు. దాన్ని ఆరు ముక్కలు చేశాడు. అక్కడ ఉన్న పెన్ హోల్డర్ నుంచి ఆరు పెన్నులు కూడా తీసుకున్నాడు.
“మీ ఆరుగురిలో ప్రతి ఒక్కరూ నేను మీ జంటలో ఎవర్ని చంపాలో రాయండి. మీరు వేరే వాళ్ళ పేర్లు రాయడానికి వీల్లేదు. మీ లవర్ పేరో, మీ పేరో మాత్రమే రాయాలి. కమాన్, త్వరగా!” వాళ్ళకు కాగితపు ముక్కలూ, పెన్నులూ అందించాడు.
ప్రేమికులు ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరూ మెదల్లేదు. బిల్వ మంగళుడికి వొళ్ళు మండినట్టుంది. “ఇంతకు ముందే చెప్పాను, నేను నా సరదా కోసం కూడా చంపుతాను అని,” అంటూనే తన గన్‌తో రిసెప్షనిస్టు రోజీ వాడే మానీటర్ని పేల్చేశాడు.
అందరి హాహాకారాలతో ఆ హాల్ నిండిపోయింది. ఈ సారి గన్ తమ వైపు తిప్పగానే, ఆరుగురు ప్రేమికులు గబ గబా పేర్లు రాసి బిల్వ మంగళుడికి ఇచ్చేశారు.
వాళ్ళు రాసింది చదివిన బిల్వ మంగళుడి మొహం మీద చిరు నవ్వు వెలసింది. “అందరూ వినండి. ఈ ఆరుగురూ తమ ప్రేమికుల పేర్లు రాశారు. ఎవరూ తమ ప్రాణాలు త్యాగం చెయ్యడానికి సిద్ధపడలేదు,” అన్నాడు వికృతంగా. “ఇప్పుడు ఏ ముగ్గురిని చంపాలబ్బా!” సాలోచనగా అన్నాడు.
సుబ్బారావు ధైర్యం తెచ్చుకుని, “బిల్వ గారూ. సారీ, షార్ట్ కట్లో పిలిచినందుకు ఏం అనుకోకండి. మీ పూర్తి పేరు నోరు తిరగడం లేదు. వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఎవరున్నా అలానే చేస్తారు. ప్రాణం ఎవరికైనా తీపే కద!” అన్నాడు.
బిల్వ మంగళుడు ఆశ్చర్యంగా సుబ్బారావు వైపు చూశాడు. అంతా సుబ్బారావు పని అయిపోయిందనే అనుకున్నారు. కానీ బిల్వ చిరు నవ్వు నవ్వాడు.
“నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. సరే గేమ్ రూల్స్ మారుస్తాను. చంపను, కానీ కుడి చేతి మీద పేలుస్తాను. సరేనా?” అంటూ మళ్ళీ కాగితపు ముక్కలూ, పెన్నులూ ఆ మూడు జంటలకీ అందించాడు.
ఈ సారి మానీటర్లు ఏవి పేలకుండానే పేర్లు రాసి ఇచ్చేశారు ప్రేమికులు. అవి చదివిన బిల్వ మంగళుడు పగలబడి నవ్వాడు. “మళ్ళీ సేం రిజల్ట్! ఎవరూ తమ పేరు రాయలెదు,” అన్నాడు సుబ్బారావుతో.
“బిల్వ గారూ. వాళ్ళని వదిలెయ్యండి. కావాలంటే నన్ను కాల్చండి. కానీ చేతి మీద కాదు. కాలి మీద. అసలే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. టైపు చేసుకొవడానికి చేతులు ఉండాలి,” తనకు అంత ధైర్యం ఎలా వచ్చిందో అనుకుంటూ తనలోనే ఆశ్చర్యపోతూ అన్నాడు సుబ్బారావు.
“నీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందా?” క్రూరంగా అడిగాడు బిల్వ. అడ్డంగా తలూపాడు సుబ్బారావు.
“ఐతే నోర్మూసుకో. ఈ రోజు ప్రేమికుల దినం కద. ఈ పరీక్ష, రిజల్ట్ అన్నీ ప్రేమికులకే,” గదమాయించాడు బిల్వ. సుబ్బారావు నోరు వాళ్ళ మానేజరే గట్టిగా మూసేశాడు.
“సో, మీలో ఎవరూ మీ ప్రేమకోసం ఏమీ వదులుకోవడానికి సిద్ధంగా లేరా?” ఈ సారి మూడు జంటల్నీ ఉద్దేశించి అడిగాడు బిల్వ. అతని వేలు చాలా కాజువల్‌గా ట్రిగర్ మీద బిగుసుకోవడం మొదలు పెట్టింది.
“డబ్బు కావాలంటే వదులుకోవచ్చు. ప్రాణాన్ని ఎలా వదులుకుంటాం సార్?” బిక్క చచ్చి అన్నాడు పద్మాకర్. అసలే అతను ప్రాక్టికల్ మనిషి.
“గర్ల్‌ఫ్రెండ్ పోతే మళ్ళీ దొరుకుతుంది. చెయ్యి పోతే మళ్ళీ మొలుస్తుందా బిల్వ గారూ,” చిన్నగా వణుకుతూ అన్నాడు రవి. నిజమే అన్నట్టు తలూపాడు సునీల్. కీర్తన, సుచిత్ర వాళ్ళవైపు అసహ్యంగా చూశారు. అబ్బాయిలు కూడా వాళ్ళ వైపు అంతే క్రూరంగా చూశారు.
సడన్‌గా మళ్ళీ బిల్వ సెల్ ఫోన్ మోగింది. బిల్వ ఈ సారి ఒక ఐదు నిముషాలు మంద్ర స్వరంతో మాట్లాడాడు.
“చమన్ లాల్ ఈ రోజు రాడట. ఈ కాంట్రాక్ట్ కాన్సల్అయ్యింది. నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి జెండా ఎత్తేయాలి. మీరు చాలా లక్కీ! మీతో ఆడుకునే టైం నాకు లేదు. నేను వెళ్తున్నాను. కట్లు విప్పుకున్నాక మీ ప్రేమికుల దినం హాయిగా జరుపుకోండి,” అన్నాడు.
“ఛీ!” అన్నాయి ఆరు గొంతులు ఒకే సారి.
బిగ్గరగా నవ్వాడు బిల్వ. నవ్వుతూనే డోర్ వైపు కదిలాడు. డోర్ దగ్గర ఆగి సడన్‌గా వెనక్కి తిరిగి, “ఈ రోజుకి వాలంటైన్స్ డే అన్న పేరు బాగా లేదు. మార్చెయ్యండి. ట్రై యువర్ లక్ డే అనో, లేదా ఇంకేదో పెట్టండి,” అని ఒక ఉచిత సలహా ఇచ్చి సుబ్బారావుతో , “నువ్వు పిచ్చి పిచ్చి త్యాగాలు చేయడం మానెయ్యి బ్రదర్!” అని చెప్పి అక్కడినుండి నిష్క్రమించాడు.
ఒక రెండు నిమిషాలు ఎవరూ ఏం మాట్లాడలేదు. తరువాత అందరూ తమ తమ కట్లు విప్పుకోవడం మొదలు పెట్టారు.