వానలో తడిసినప్పుడు
పాత గాయాలేవో సలపరించినట్టు
నీ పాటలో తడిసినప్పుడు
మానిన జ్ఞాపకాలు
మళ్ళీ బాధ పెడతాయి.
అందంగా,
స్వచ్చంగా,
అప్రయత్నంగా కురుస్తుంది వాన.
చెట్లన్నీ పూలదోసిళ్ళుపట్టి
ఆనందంగా ఆ చినుకులతో ఆడుకుంటాయి.
నాకు మాత్రం ఎందుకో
దాని చలిగాలి మాత్రమే తాకుతుంది.
మెత్తపడ్డ మనసుని
నిర్దయగా, మరింతగా కోస్తుంది.
నీ పాట కూడా అంతే.
జలజలమంటూ కురిసే వాన
కిటికీ పై నీటిపరదాలు జార్చినట్టు
నీ పాట నా కంటిమీద
కన్నీటి తెరలు దించుతుంది.
వెలిసిన వాన వేరే ఊరు
వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది.
ముగిసిన నీ పాటమాత్రం
కొన్నాళ్ళ వరకు
తలపుల్లో గూడుకట్టుకొని
కలలో కూడా వెంటాడుతుంది.