ముగ్గురు ముసలమ్మలు

‘ఈ రాత్రికి ఈ ఒక్క అడ్మిషన్‌ చాలు నాలో వుండే శక్తి అంతా హరించుకుపోవడానికి,’ అని అనుకుంటూ కాల్‌రూమ్‌ చేరింది డాక్టర్‌ సునీత.

తన కొలీగ్‌ మార్క్ తీరిగ్గా, తదేకంగా టీవీలో స్టార్‌ట్రెక్ నెక్స్ట్ జెనరేషన్‌ చూస్తూ అందులో లీనమైపోయాడు. సునీత మనస్సులో ‘ఈ అబ్బాయిల పనే హాయి. చకచక పని పూర్తి చేసుకుంటారు, దాని గురించి విపరీతంగా ఆలోచించి మథనపడిపోకుండా ఏదో సైన్స్ ఫిక్షన్‌, డిటెక్టివ్‌ షోస్‌ చూసుకుంటూ అన్నీ మరిచిపోగలరు. నాలా అనవసరంగా అవస్థలు పడరు,’ అనుకుంటూ మార్క్ పై కాస్త అసూయ, తన mentor డేవిడ్‌పై కొంచెం కోపం తెచ్చుకుంది. ” ప్రతి పేషంట్‌ ను biopsychosociospiritual modelలో చూడాలి,” అని డేవిడ్ ఇచ్చిన ట్రెయినింగ్. ఆ ట్రెయినింగ్ ప్రభావం చాలా ఉంది సునీతపై. ప్రతి కేస్‌నీ అదే దృష్టితో చూసి, క్లిష్టమైన కేసులన్నీ ఛాలెంజ్‌గా తీసుకునే సునీతకు, ఎందుకో ఈరోజు రాత్రి మిసెస్‌ జేమ్స్‌ అడ్మిషన్‌ విషయంలో తన అనుభవం కొంచెం కొరకరాని కొయ్యే అయింది!

మిసెస్‌ జేమ్స్‌కు ఎనభై ఏళ్ళకు పైనే ఉండిఉంటాయి.. ఆవిడకు వచ్చిన చిన్న చిన్న హార్ట్‌ అటాక్స్‌తో గుండె చాలా బలహీనమైపోయి, congestive heart failure(CHF) స్థితి లో కొచ్చింది. ఊపిరి పీల్చుకోవడానికి ఆవిడపడే అవస్థ చెప్పలేం. దానికి తోడు ఆయాసం! మాట్లాడడానికి కూడా వీలులేకుండా! – ఆవిడ గుండె ఆమె రెండొందల పౌన్ల శరీరాన్ని ప్రాణంతో నిలపడానికి మాత్రమే పనిచేస్తున్నట్లుంది. ఆవిడ పరిస్థితి చూస్తే పరమ కర్కోటకుడికైనా జాలి పుట్టకమానదు.

ప్రతి రెండు వారాలకీ ఆమె ఇలా విపరీతమైన ఆయాసంతో అడ్మిట్‌ కావడం – ఒక రాత్రిలో 10 లీటర్ల నీరు diuresis చేసి, ఇంకో రెండు రోజులు మందులన్నీ కొంత అడ్జస్ట్ చేసి ఇంటికి పంపడం – మళ్ళీ కొద్ది రోజుల్లో అదే కంప్లైంట్‌తో ఆమె తిరిగి రావడం. ఇదే వరస; కొన్ని నెలలుగా రొటీన్‌లా సాగుతోంది. మెడిసిన్‌ సర్వీస్‌లో ఉండే ప్రతి రెసిడెంట్‌ ఆవిడను కనీసం ఒకటి రెండు సార్లు అడ్మిట్ చేసి ఆ కేస్‌ ద్వారా CHF management ఎలా చేయాలో నేర్చుకోవడం పరిపాటి. ఆ రాత్రి అది సునీత వంతు. సునీత మెడికల్ ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని, ఎప్పటిలా మామూలుగా అడిగే ప్రశ్న అడిగిందామెను, “code status ఏమిటి” అని. Full code అంటే breathing machineపై పెట్టడం, ఎలెక్ట్రిక్‌ షాక్‌తో గుండెను తిరిగి పనిచేయించడం, అన్నీ ఉంటాయి. సునీత అడిగిన ప్రశ్నకు మిసెస్‌ జేమ్స్‌ తడుముకోకుండా “ఫుల్‌ కోడ్ కావాలి” అంది. సునీతకు కొంత అనుమానం వచ్చింది పెద్దావిడ గాలి సరిగ్గా పీల్చలేకపోతూంది, బుర్రకి సరిగ్గా ఆక్సిజన్‌ అందక ఆలోచించలేక పోతున్నదేమో అని. రూమ్‌ బయట ఆదుర్దాగా చేరిన ఆవిడ కుటుంబసభ్యుల్ని అడిగింది అదే ప్రశ్న. తిరిగివచ్చిన జవాబు మళ్ళీ అదే, “ఫుల్‌ కోడ్‌” అని.

సునీత ఓపిగ్గా వాళ్ళకి ఫుల్‌ కోడ్‌ అంటే ఏమిటో వివరించింది. కొంతసేపయ్యాక వాళ్ళు మనసు మార్చుకునేటట్లుగా లేరని, ఇంకొంత వివరంగా ఈసారి కొంచెం భయంకర ఊహాచిత్రం వచ్చేలాగా mechanical ventilation గురించి, ఆక్సిజన్‌ లేకపోతే మెదడుకొచ్చే హాని గురించి, ఛాతీపై వత్తిడి చేసేటప్పుడు పక్కటెముకలు విరగడంగురించి, ఆ వయసులో కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళే అవకాశం ఎంత తక్కువగా ఉంటుందో అన్నీ కళ్ళకు కట్టేలా చెప్పింది. అంతా విని ఆమె కూతురు “మా అమ్మకు, మాకు దేవుడిపై చాలా భక్తి, నమ్మకం. ఆ దేవుడే మా అమ్మని చూసుకుంటాడు. కానీ, ఏ లోపం లేకుండా మా అమ్మ ప్రాణం నిలపడానికి మీ ప్రయత్నం మాత్రం మీరు చేయండి,” అంది. అంతవరకు ఎంతో సహనం చూపించిన సునీతకు ఒక్కక్షణం విసుగుపుట్టి, తనకు తెలియకుండానే కాస్త కటువుగా “మీ అమ్మకు కావాల్సింది heart transplant, అంటే ఆరోగ్యంగాఉన్న ఒక కొత్త గుండె. అలిసిపోయిన ఆమె గుండెను ఇంకా ఎన్ని రోజులు కష్టపెడతారు, కొన్నిసార్లు మనుషులకు కూడా దేవుడిపై కొంత జాలి ఉండాలి” అని, చటుక్కుమని చర్చ పూర్తిచేసుకుని, వాళ్ళ జవాబుకోసం కూడా ఎదురు చూడకుండా ఛార్ట్‌మీద ఫుల్‌ కోడ్‌ అని రాసి వికలమైన మనసుతో కాల్‌రూమ్‌ చేరింది.

సునీతకు బొత్తిగా అంతుపట్టని విషయం ఇది. ఆమె ఆలోచనలు ఈమధ్యనే ఇండియాలో చనిపోయిన తాతయ్య మీదికి తిరిగాయి. తాతయ్యకు మిసెస్‌ జేమ్స్‌ వయసే ఉంటుంది. ఒంటరిగా, ప్రశాంతంగా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా పల్లెటూరిలో ఉండేవారు తాతయ్య. ఆయన జీవితంలో ఒక్క cataract ఆపరేషన్‌ తప్పించి డాక్టర్లు, మందులు, హాస్పిటళ్ళు ఎరగరు. ఒకరోజు సాయంత్రం ఆవుపాలు పిండటానికి వెళ్ళిన తాతయ్య పదినిమిషాలలో లోపలికి వచ్చారు, ఎడమచేయి నొప్పి పుడుతున్నాదంటూ. ప్రక్కింట్లో ఉన్న తన చిన్నకొడుక్కి కబురంపి, ఒక గంట తర్వాత కొన్ని దశాబ్దాలుగా ఆ ఇంట్లోనే తాను ఊగిన ఉయ్యాలబల్లమీద పడుకుని “శివ శివా” అంటూ కన్నుమూశారు. ఆ మరణంలో ఒక డిగ్నిటీ. ఆయన చుట్టూ హాస్పిటళ్ళు, డాక్టర్లు, మెషీన్లు, గందరగోళం ఏవీ లేవు. సునీతకు తాతయ్యతో చిన్నప్పటినుంచీ ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఇంతదూరంలో ఉన్నా, తాతయ్య చనిపోయిన వార్త, ఎలా పోయారో విన్నప్పుడు మనస్ఫూర్తిగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది తాతయ్య సుఖంగా పోయారని. ఇక్కడ మిసెస్‌ జేమ్స్‌ పరిస్థితి దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఆవిడకు జీవితంపై మమకారమో, చావంటే భయమో సునీత ఊహలకు అందని విషయం. ఆవిడ పిల్లలకు ఆమెపై బంధించే ప్రేమ ఉన్నట్లుంది. సునీతకు ఈ అనుభవమూ కొత్తగానే ఉంది. ఒకవైపు దేవుడు, భక్తి, నమ్మకం అంటున్నా జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి ఎన్నో కారణాలు దోహదం చేస్తాయి. టెక్నాలజీ, అది వాడటానికి మన చేతి డబ్బు పడనక్కరలేదన్న ధీమా లేకపోతే వీళ్ళకి ఈ టెంప్టేషన్ ఉండదేమో! అందరమూ మరణాన్ని ఒక డిగ్నిటీతో ఒప్పుకుంటామేమో! సునీత ఈ ఆలోచనలు కట్టిపెట్టి దేవుడికి మనస్సులో దండం పెట్టుకుంది. ‘నీకు మిసెస్‌ జేమ్స్‌పై దయ ఉందో లేదోగానీ, నాకోసమైనా ఈ రాత్రి ఆవిడ గుండె ఆగిపోకుండా చూడు. దాన్ని resuscitate చేసి ఆ హంగామా భరించే శక్తి, ఓపికా రెండూ లేవు నాకిప్పుడు’ అనుకుంటూ కాస్సేపు నడుం వాల్చింది కాల్‌రూమ్‌ లో మంచం మీద.

రెసిడెన్సీ పూర్తిచేసుకుని సునీత అమెరికాలో ఒక చిన్న ఊరిలో ప్రాక్టీసు మొదలుపెట్టింది . కొండ ప్రాంతాలు, కొంత వెనుకబడిన మనుషులు, కొత్త అనుభవాలు. ఆమెకు శని, ఆదివారాల్లో హాస్పిటల్‌ రౌండ్స్‌ అంటే ప్రత్యేకమైన ఇష్టం. వీకెండ్‌ కోసం ఎదురు చూసేది. ‘మామూలు రోజుల్లాగా హడావిడి పడనక్కర్లేదు. తీరిగ్గా పేషంట్లు, వాళ్ళ కుటుంబాలతో కబుర్లు చెప్పుకోవచ్చు’ అని.

అలాగే ఒక శనివారం ఆమె serviceలోకి అడ్మిట్‌ చేశారు ఒక ముసలామెని – కారణం ‘mental status changes’ అని. సునీత హాస్పిటల్‌కి వెళ్ళేసరికి మిసెస్‌ గ్రీన్‌, ఒక పండు ముసలి – తెల్లటి జుట్టు భుజాలమీదుగా వదులుగా వ్రేలాడుతూ – ముఖమంతా పరుచుకున్న చిరునవ్వుతో ఎంతో ఆత్మీయంగా పలకరించి కబుర్లు చెప్పింది. చాలా ఏళ్ళుగా ఒంటరిగా ఒక ఇంట్లో ఉండేదట. పిల్లలు లేరట. ముందు రాత్రి తనకు ప్రాణం పోతూన్నట్టు ఒక అపురూపమైన అనుభూతి కలిగితే, అది పంచుకుందామని ప్రక్క ఇంటివాళ్ళకు ఫోన్‌ చేసిందట. వెంటనే వాళ్ళు Ambulanceని పిలిచి హాస్పిటల్‌కి తెచ్చిపడేశారట. ఆవిడకు వాళ్ళమీద చాలా కోపం వచ్చిందట, ఒక మంచి అనుభూతిని మధ్యలోనే చెడగొట్టారని. “నాకేం మతి చలించలేదు, నేను ఇంటికి పోతా” నని పట్టుబట్టింది. ‌ఆమెను ఇంకో రెండ్రోజులు హాస్పిటల్లోనే ఉంచుకుని పరీక్ష చేద్దామని సునీతకు ఎంతగా ఉన్నా, ఆ ముసలామె మరీ పంతంబట్టి, అవసరమైతే సునీత సహాయం తప్పకుండా తీసుకుంటానని మాట ఇచ్చి మరీ ఇంటికి వెళ్ళిపోయింది ఆరోజే!

రెండు నెలలు గడిచాక ఒక మధ్యాహ్నం, మిసెస్‌ గ్రీన్‌ appointment తీసుకుని వచ్చింది క్లినిక్‌కు. ఈసారి కారణం – “నాకు చావంటే భయంలేదు, కానీ ఒంటరిగా చనిపోవాలని లేదు. ఆ ఇంట్లో నేను ఒంటరిగా చనిపోతే కొన్నిరోజులపాటు ఎవ్వరికీ తెలియక పోవచ్చు. నాకు ఆ ఆలోచనే చాలా బాధాకరంగా ఉంది. అందుకని నన్నేదైనా నర్సింగ్‌ హోమ్‌లో పెట్టు. ఇప్పుడు నాకు నీ సహాయం కావాలి” అని అడిగింది. పైగా “నా ఇల్లు అంతా శుభ్రంగా తుడిచి, అన్ని సామాన్లూ సర్దేసి నా బైబిల్‌ మాత్రం నాతో తెచ్చుకున్నాను” అంది. తటాలున తాతయ్య కూచునే ఉయ్యల బల్ల సునీత మనసులో మెదిలింది.

సునీతకు ముందు ఏంచెప్పాలో అర్థంకాలేదు. ఈ ముసలామె ప్రవర్తన కొంచెం విచిత్రంగానే వుంది. తన ఇంటికే పిలుచుకు వెళ్దామన్న ఆలోచన కట్టిపెట్టి, “ఉన్న పళాన నిన్ను నర్సింగ్ హోమ్‌లో చేర్చడం కష్టం. ముందు హాస్పిటల్లో పెట్టి, సో్షల్ వర్కర్‌ సహాయంతో నిన్ను నర్సింగ్ హోమ్‌కి మార్పించాల్సి ఉంటుంది” అని చెప్పి, అడ్మిషన్‌ ఆర్డర్స్‌ రాసేటప్పుడు డయాగ్నోసిస్‌లో ‘మెంటల్‌ స్టేటస్‌ ఛేంజస్‌’ అని రాస్తూ తనలో తనే నవ్వుకుంది. రెండు నెలల క్రితం ఈ డయాగ్నోసిస్‌ ఇచ్చేఆమెను హాస్పిటల్లో పెట్టారు. ముసలామె కబుర్లూ కథలూ చెప్పి తనని బుట్టలో వేసుకుందేమోనని కొంత అపనమ్మకం ఒక ప్రక్క, ఆమెపై ఎందుకో తనకి తెలియకుండానే ఒక గౌరవం ఇంకొక ప్రక్క. ఇలాంటి ప్రవర్తన చూపించే ముసలామె మాటల్లో నిజమెంతుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో సునీత ఆతర్వాత, సోషల్ వర్కర్‌ద్వారా ఆమె ఇంటికి వెళ్ళి తనిఖీ చేసింది. ఆవిడ చెప్పినట్లే ఇల్లంతా శుభ్రంగా తుడిచి ఉంది. బెడ్‌రూమ్‌లో క్లాసెట్‌లో అన్ని బట్టలూ నీట్‌గా తగిలించి ఉన్నాయి. ఎక్కడి సామాను అక్కడ భద్రంగా ఉంది. ఆమె అన్నట్లే కొన్ని దశాబ్దాలుగా బ్రతికిన ఆ ఇంటితో, అమర్చుకున్న అన్ని వస్తువులతో, అన్ని బంధాలు ఒక్కసారి తీర్చుకుని, సొంతంగా తన జీవితంపై – మరణంపై నిర్ణయాలు తీసుకుంది. ప్రేమ-బంధం పేరుతో ఆమెను వెనక్కి లాగేవాళ్ళు లేరు. ఆమెలో దేవుడిపై అంతులేని భక్తి, నమ్మకంతో పాటు ఒంటరితనమూ లేదు. ఒక నిండుతనం, స్పష్టమైన ఆలోచనలు, వాటికి కార్యరూపం ఇవ్వగలిగే ధైర్యం. అదృష్టవంతురాలు, స్వతంత్రజీవి, అచ్చం తాతయ్యలాగానే! ఆమె కోరిక ప్రకారమే ఆమెకు అందుబాటులో ఉండే నర్సింగ్‌ హో్మ్‌కి మార్చింది సునీత, మిసెస్‌ జేమ్స్‌ విషయంలో ఒకరాత్రి తను పడిన మనోవేదనను గుర్తు చేసుకుంటూ. రెండు నిండు జీవితాలు – అస్తమిస్తున్న సమయంలో తీసుకునే నిర్ణయాలు రాత్రి, పగలులా ఎంత తేడా అనుకుంది మనసులో, మిసెస్‌ గ్రీన్‌కు ప్రేమతో సంకెళ్ళు వేసే పిల్లలు లేకపోవటం ఆమె అదృష్టమా కాదా అని ఆలోచిస్తూ.

ఇంకొన్ని నెలలు గడిచాక సునీతకు ఇంకో కొత్త అనుభవం – తొంభై ఏళ్ళు పైబడ్డ ఒక ముసలామె ఒంటరిగా తన ఇంట్లో ఉంటుంది. ఒకరోజు సాయంత్రం ఆయాసంగా ఉంది అని emergency roomకి వచ్చింది. కూతురు ఆ ఊర్లోనే ఉంటుందటగానీ, కాలు విరిగి ఇంట్లోఉందని, మనవడిని పిలిచిందట హాస్పిటల్‌కి తీసికెళ్ళమని. అడ్మిట్‌ చేశాక తన రూమ్‌కి వెడుతూ nurses station దగ్గర ఆగి, నర్సులతో “నన్ను సుఖంగా దేవుడిదగ్గరకు పోనీయండి. వీరోచితంగా, అనవసరంగా, అన్నీచేసి నా ప్రాణం పొడిగించకండి” అని స్పష్టంగా “నో కోడ్‌” అని చెప్పుకుని మరీ వెళ్ళింది తన రూమ్‌లోకి. సునీత పరీక్ష చేస్తున్నప్పుడు ఆయాసంగా మాట్లాడుతూ, ఊపిరి గట్టిగా పీలుస్తూ కబుర్లు చెప్పింది – ఒక ప్రక్క తన ప్రేయర్స్‌ చెప్పుకుంటూ.

ఇంకొక రెండు గంటల్లో ఆవిడ పరిస్థితి విషమించడంతో సునీత మనవడిని ఇంటికి పంపింది కూతుర్ని పిలుచుకురమ్మని. ఇంతలోగా సునీత, నర్సులూ చూస్తుండగానే అందరి మధ్యా, ప్రశాంతంగా దేవుడిని ప్రార్థిస్తూ ప్రాణం విడిచింది ముసలమ్మ. చనిపోవడంలోని ఉదాత్తత మొదటిసారి అనుభవానికి వచ్చింది సునీతకు. హాస్పిటల్లోకి నడిచి వచ్చిన మనిషి, అంతవరకు స్వతంత్రంగా బ్రతికిన మనిషి, రెండుగంటల్లో తన కోరిక ప్రకారమే భగవంతుడిలో కలిసిపోయింది. చుట్టూ ఏ హడావిడీ లేదు. తన తాతయ్య ఉయ్యాలబల్ల మీద “శివ శివా'” అంటూ పోయినట్టే. తాను అక్కడే ఉండి తాతయ్యను చూస్తున్న అనుభూతి. నిశ్శబ్దంగా ఆమెను పరీక్షచేసి, pronounce చేసి, తాతయ్య గురించిన ఆలోచనలతో ప్రశాంతమైన మనస్సుతో గది బైటకు నడిచిన సునీతకు ఎదురుగా wheel chairమీద వస్తూ పేషంట్ కూతురు కనబడింది. తల్లి మరణవార్త విని కూతురు భోరుమని ఏడవడం మొదలెట్టింది – అనుకోకుండా సునీత కళ్ళలో నీరు తిరిగింది. ఇంత ప్రశాంతమైన మనస్సులో ఎక్కడినించి వచ్చాయో ఈ కన్నీళ్ళు – ఒకరి కన్నీళ్ళు పంచుకునే కన్నీళ్ళు.

కారు డ్రైవ్‌ చేసుకుంటూ ఇంటికి పోతున్న సునీతకి మనస్సులో ఒకదాన్నొకటి తరుముకుంటూ ఆలోచనల వరవడి. ‘మిసెస్‌ జేమ్స్‌ విషయంలో ఒక రాత్రి అంతా సతమతమయ్యాను చేతకానితనంతో. మిసెస్‌ గ్రీన్‌కు ఆమె కోరినట్లే ఆమె నిర్ణయాలతో సహకరించగలిగాను. ఈ మూడో ముసలామె నా అనుభవానికి ఒక సంపూర్ణతనిచ్చి నన్ను నా తాతయ్య దగ్గరికి తీసికెళ్ళింది మానసికంగా! ఈవిడకు ప్రేమించే కూతురుంది. దేవుడిపై భక్తి ఉంది. జీవితకాలం పొడిగించటానికి అన్ని సదుపాయాలు గల దేశంలోనే ఉంది. అయినా ఇండియాలో తాతయ్యలాగే ఆమెకూ జీవించడంలో ఉన్న హుందా చావులో కూడా ఉంది. బంధాలు, అనుబంధాల మధ్య సంబంధాన్ని ముచ్చటగా ముగ్గురు ముసలమ్మలూ కలిపి నేర్పుతున్నారు’ అనుకుంది సునీత.