సీ. పుష్య మాసము చాల పుణ్యకాలమ్మని
ఉదయ వేళకు కాస్త మునుపెలేచి
ఇంటి వాకిట చిమ్మి ఇంతులోపిక తోడ
ఇంపైన ముగ్గులు తీర్చు వేళ
ఆవు పేడను దెచ్చి యందాల పాపలు
గొబ్బెమ్మలను బాగ గూర్చు వేళ
పెద్దగా తల్లి గొబ్బెమ్మ యొక్కటి చేసి
పిల్ల గొబ్బెమ్మల బేర్చు వేళ
తే. నింగి గాలి పటములతో నిండు వేళ
గంగిరెద్దులు నర్తనమాడు వేళ
గుమ్మముల ముందు ముగ్గులు గొబ్బియమ్మ
బార్లు కిలకిల నవ్వెడి పర్వ వేళ
ఆ. రంగు రంగుల ముగ్గులు రంగవల్లి
పూలు గొబ్బెమ్మ బారులు భోగి మంట
గంగిరెద్దులు సన్నాయి గాలి పటము
అమెరికా దేశమందివి ప్రాప్తి లేదు!
తే. సున్నమున రంగవల్లిని సోయగమున
ఎట్టులో దిద్దుటిచటి కార్పెట్టు మీద
ఆవు పేడమ్ము గ్రోసరీ షాపు లేదె
గొబ్బియమ్మల నిచ్చట గూర్చుటెట్లొ
తే. ఎట్టులో కష్ట పడి ముగ్గు పెట్ట వచ్చు
కాని మంచది కురిసిన క్షణములోన
మాయమగు ముగ్గు, తెల్లటి మంచు తెరలె
ప్రకృతి తీర్చి కూర్చిన రంగ వల్లి ఇచట
ఆ. భోగి పళ్ళు పోయ రేగు పళ్ళవి లేవు
క్రాన్బెరీలు చాలు క్వార్టరులును
భోగి మంట లేక పోయినా హీటరు
నింపు వేడి గదుల నిండ ఇచట
సీ. న్యూయార్కు నగరపు నూత్న వీధుల మీద
బుడబుక్కలాడిని బోలినట్టి
చిత్ర వేష ధరులు ఎందరో ఉన్నారు
గంగిరెద్దు లొకటె కాన రావు
వదలక మీడియా వందల సారులు
మోనికా పై పాడు బుర్ర కథలు
నింగిని కానరావిట గాలి పటములు
డౌ జోన్సె గాలి పటమ్ముసుమ్ము
తే. కాంగ్రెసున మదగజములు గాడిదలును
గంగిరెద్దుల వేషముల్ గట్టినారు
బిల్లు క్లింటను స్టారును వేయు తాళ
గతికి గుడ్డిగ నాట్యమ్ము లాడినారు
తే. ఆంధ్ర దేశపు పల్లెల యందములకు
అమెరికా దేశమున గల యాధునికపు
జీవ గతికి సామ్యము లేదు జావళీకి,
మోనికా రిపోర్టుకు పోల్కె లేని రీతి
ఆ. చింత చిగురు చింత చెట్టున దొరకును
మల్టి ఫ్లోరు భవనమందు గాదు
సంకురాత్రి యంద చందాలు చవిచూడ
సీమ కాదు పల్లె సీమ మేలు!