ఒక అసహనం
ఒక తెలియనితనం
తోడుగా అశాంతి
తప్పని సరిగా
బరువుగా కళ్ళు విప్పితే
మాసిక పడిన చూపుల నుంచి
మెల మెల్లగా రంగులు విడుతూ
అస్పష్టమైన జ్ఞాపకాలు
మసకమసకగా
నలుపు తెలుపుల్లోకి కరుగుతూ…
ఆడుతూ పాడుతూ
నవ్వుతూ తుళ్ళుతూ
అంతలోనే అకస్మాత్తుగా
మాయమైపోయిన
చిన్ననాటి గురుతులు
కాలువలో ముణిగిపోయినవి
రోడ్డు దాటుతూ ముగిసిపోయినవి
ఏ మహమ్మారికో దొరికిపోయినవి
గుర్తుకొస్తాయి ఓ క్షణం
ఒక అచేతనపు క్షణం.
ఎక్కడో స్తబ్ధత
అక్కడే నిశ్శబ్దం
అంటు కట్టుకుని
ఒక చిన్న జ్ఞాపకం
జస్ట్ ఎ లిటిల్ థాట్,
ఎంత పెద్ద బరువు?
గుండె మోయలేనంతగా
ఇదా జీవితం అనిపించేంతగా…
శూన్యం నిజంగా శూన్యమేనా?!
నిరాశానిస్పృహల నిట్టూర్పులకు
అంతులేని అనేకానేక అవ్యక్తాలకు
ముగింపు
ఎక్కడో? ఎప్పుడో?