ఒక అంతర్ముఖుని బహుముఖ రూపాలు

పాఠకుడిగా ఒక కథను చదవడమంటే ఆ రచయిత వెంట ప్రయాణించడం లాంటిది. రచయిత చెప్పాలనుకున్న వస్తువు, విషయం, ముగింపు, గమ్యం అయితే, కథని నిర్మించే తీరు, చెప్పే పధ్ధతి ప్రయాణంలాంటిది. అందుకే ఒకే విషయం మీద ఎన్ని కథలు చదివినా మన అనుభూతిలో తేడాలుంటాయి. దాన్ని శిల్పమన్నా, శైలి అన్నా, అది పాఠకుడి ప్రయాణాన్ని మనోరంజకం చేయడమే దాని ఉద్దేశం.

పూడూరి రాజిరెడ్డితో కథల ప్రయాణం అద్భుతమైన అనుభవం. మనకు విసుగు తెలీకుండా కబుర్లు చెబుతూనే వుంటాడు. తన అనుభవాలు చెబుతూనే, అందులోనుండి గ్రహించిన జీవిత సత్యాలను, తాత్త్విక అవగాహనను మనతో పంచుకుంటాడు. సమయం చూసి మంచి పంచులు విసురుతుంటాడు. కిటికీ తెరచి అందులోనుండి ప్రకృతిని చూడమంటాడు. స్టేషన్, స్టేషన్ మధ్యలో వచ్చే పొలాల వెంట తన జ్ఞాపకాలను పరుగు పెట్టిస్తాడు.

ఇదంతా ఇటీవల ఛాయ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన పూడూరి రాజిరెడ్డి ‘చింతకింది మల్లయ్య ముచ్చట – ఇతర కథలు’ గురించి.

ఈ సంపుటిలో మొత్తం 12 కథలున్నాయి. మొదటి కథ 1999, చివరిది 2016. పదిహేడేళ్ళ వ్యవధిలో రాసిన కథలవడం వల్ల అన్నీ ఒకేసారి చదివినప్పుడు దాని వెనక వున్న రచయిత అవగాహన, అతని పరిణామ క్రమం మనకు దర్శనమౌతూ వుంటాయి.

ఈ కథల్లో ఏముంది? 1950-80ల మధ్య పుట్టిన ఒక తరం ఎలాంటి మార్పులను చూసిందో, కుదుపులకూ, ఒడిదుడుకులకూ తట్టుకుంటూ నిలబడుతోందో, విలువలకూ, వాస్తవాలకూ మధ్యన నలుగుతోందో, అన్నీ ఉన్నాయి. సింపుల్ గా రాసిన 3 పేజీల కథ నుండి 16 పేజీల మంట కథ వరకూ.

కథల్లో విషయం స్థూలంగా:

ఆమె పాదాలు: మగవాడికి స్త్రీ సౌందర్యం పట్ల కలిగే సహజ యవ్వన కుతూహలం, ఆరాధనాభావం, చివరన ఒక చిన్న భంగపాటు.

కథ కాని కథ: కాలి యాక్సిడెంట్ కారణంగా బెడ్ రెస్టులో గడిపిన రెండు నెలల వ్యవధిలో కలిగిన ఆలోచనల స్రవంతిలోనుండి కొన్నిటిని మనముందుంచే ప్రయత్నమీ కథ. మనమున్న మానసిక స్థితి ఒకే విషయం మీద మన అభిప్రాయాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ కథలో పరిశీలించవచ్చు.

నాలోకి నేను: ప్రతి మనిషిలోనూ రెండు ముఖాలు-– తన బహిరంతర అనుభవాల కలబోత నుండి వ్యక్తమయ్యే పరస్పర విరుధ్ధ భావాలు-– పొసగని, పొంతన కుదరని వాదోపవాదాలు, చర్చోపచర్చలు అందరికీ అనుభవమయ్యే ఉంటాయి. అలాంటి ధోరణిలో కథకుడికి ఎదురైన, పరిశీలించిన అనుభవాల నేపథ్యం ఇది.

మరణ లేఖలు: నాలుగు లేఖల ద్వారా ఒక మిత్రుడి జీవితాన్ని పరామర్శించే కథ. 1. సౌందర్య ప్రమాణాలు 2. దాంపత్య జీవితపు అసంతృప్తి, భార్య మీద కంప్లయింట్స్ 3. ఆడవాళ్ళ ఆర్థిక స్వాతంత్ర్యం 4. వివాహేతర సంబంధం. వీటి మీదుగా చివరికి అద్భుతమైన ముగింపుని కవిత్వీకరించాడు రాజిరెడ్డి.

చింతకింది మల్లయ్య ముచ్చట: మంచి తెలంగాణ భాషలో, కరీంనగర్ యాసతో మల్లయ్య కథని బాగా రక్తి కట్టిస్తాడు. సామాన్యతను సెలెబ్రేట్ చేసే కథ. కథలో డ్రామా ఉండాలంటూ చేసే వాదనని, వ్యంగంగా తిప్పి కొట్టే ముచ్చట కథంతా పరచుకుని ఉంటుంది. చివరికి మల్లయ్యను హీరో చేస్తుంది.

చినుకు రాలినది: సిద్దిపేట నుండి సిరిసిల్లకి ఆటోలో ప్రయాణం. మానవ స్వభావాలను మార్చగలిగే అవసరాలు, మనుషుల ప్రవర్తనలోని వైచిత్రితో పాటు, మనమాశించే ముగింపు, అసలు ముగింపు ఒకలాగే ఉండవనే భావనతో కథ ముగుస్తుంది.

రెండడుగుల నేల: సఫాయీ కర్మచారుల సమ్మెకు సిటీ స్పందన. ఉన్న కథల్లో హాస్యకథ అనదగ్గ కథ. చాలా విషయాలు, సెన్సెక్స్, క్రికెట్, వీటి మీద విసుర్లు వేస్తూ, సిటి నుండి దూరంగా పల్లెకు తీసుకెళ్లే ప్రయత్నం.

తమ్ముడి మరణం: నచ్చనిది నచ్చింది అని చెప్పడం, నచ్చుతుందేమో అని వేచివుండటం, తీరా నచ్చే అవకాశం లేదు అని తెలిసినపుడు, తనకి తానే నచ్చక నిష్క్రమించడం. తన తమ్ముడి మరణానికి అన్న పడ్డ ఆవేదన.

రెక్కల పెళ్ళాం: ఆమె పాదాల దగ్గర మొదలైన సౌందర్య ఆరాధన , దాని పరిణామాలు, మరణలేఖల మీదుగా, తమ్ముడి మరణం సాక్షిగా రెక్కల పెళ్ళాం దగ్గర పరాకాష్ఠకు చేరుతుంది. ఎక్కడో ఏదో దొరుకుతుందని ఆశపడి తీరా అది తన పక్కనే ఉందని తెలిసినప్పుడు – వస్తువు తప్పేమీ లేదు, మనం చూసే దృష్టిబట్టీ ఉంటుంది, అనిపిస్తుంది.

శ్రీమతి సర్టిఫికెట్: నాగరిక కథ. వీడియో చిత్రీకరించినట్లుగా సంఘటనల వివరాలు చెబుతుంటే, స్లో మోషన్‌లో తీసిన వీడియో లాగా వుంటుంది. మరో మగవాళ్ళ కథ.

కాశెపుల్ల: గడచిన బాల్యపు గుర్తుల వెలితీత ఈ కథ. బూరుగుపల్లి సారు రాయమన్న డైరీ, బాపమ్మ చావు, చింతకుంట రాజన్న వైద్యం, కూరాట్లో దాచుకున్న బురుక గుడ్లు గోళీలనుకోవడం, బాపు బతుకమ్మ అలంకరణ, కాశెపుల్ల ఆట, భాష-యాస, అనుభూతి తన అనుభూతిని కోల్పోవడం, బాల్యపు నవలలు, మొగుల్ సాబ్-– వేటికవే ఒక ఎపిసోడ్‌గా రాయదగిన అంశాలు.

మంట: ఈ కథలన్నిటిలోనూ కనిపించే ఏదో ఒక అంశం, మంటలో మళ్ళీ మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ఆదర్శాలూ-వాస్తవాలకీ మధ్య అగాధం పెరిగినప్పుడు ప్రపంచం మీద, మనలోని మనిషి మీద కసి పరాకాష్ఠకు చేరుకుని ఆ తీవ్ర ప్రకంపనల నుండి తనను విముక్తుణ్ణి చేసుకోవడం.

ఇవి స్థూలంగా కథాంశాలు. కానీ, ఇలా ఏవో రెండు మూడు వాక్యాల్లో పరిచయం చేసే కథలు కావివి. ఒక్కో కథలో లీనమౌతూ, చెప్పిన తీరుకు ముగ్ధులౌతూ, ఆ విరుపులకూ విస్తుపోతూ, అలవోకగా చేసే వ్యాఖ్యానాలకు అబ్బురపడుతూ చదవాల్సిందే.


వచనం రాయడం కష్టం. అందులోనూ సున్నితంగా, సుకుమారంగా రాయడం మరీ కష్టం. పాండిత్య ప్రకర్ష లేకుండా, సిద్ధాంతాల జోలికి పోకుండా, జార్గాన్ వాడకుండా రాయడం ఇంకా కష్టం. ఇంత కష్టమైన పనిని అతి సులువుగా చేసినట్టు కనిపిస్తుంటుంది రాజిరెడ్డి వచనం. గుడ్డు నుండి పిల్ల బయటకొచ్చినంత సహజంగా, మొగ్గ నుండి పువ్వు పూసినంత లలితంగా, పెరుగు నుండి వెన్న తీసినంత లాఘవంగా, సూదిలోకి దారమెక్కించినంత కౌశలంగా ఉంటుంది. తాను చెప్పదలచుకున్న భావాన్ని, చాలా స్పష్టంగా, సూటిగా, తగిన పదాలను ఎన్నుకుని, అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా వాక్యాలని తీర్చిదిద్దుతాడు. వాళ్ళ బాపు కాశెపుల్ల కథలో బతుకమ్మను తీర్చినంత తీరుగా రాజిరెడ్డి వాక్యాలు పేర్చుతాడు.

మచ్చుకు కొన్ని…

రాయడం వేదన అని, మంచి రచన చేయడాన్ని ప్రసవ వేదన అని చెప్పగా విన్నాము. ఈ రచయిత ఒకడుగు (ఒక్కడుగేనా?) ముందుకెళ్లి మంట కథలో, ఆనందమూ, నొప్పీ ఒకటే కాగలిగే స్థితి రతి లోనూ, రాయడంలోనూ మాత్రమే సాధ్యపడుతుంది అని అద్భుతంగా వక్కాణిస్తాడు.

మనం సులభంగా పలికే చాలా పదాలు రాతకి లొంగవు. వాటి గురించి తత్వశాస్త్ర గ్రంథం రాయొచ్చు గానీ, యాసని యథాతథంగా పట్టుకోలేం. వినడంలో దాని సొగసు తెలుస్తుంది. రాయడంలో? అని ప్రశ్నిస్తాడు.

ఒక స్టేజిలో జీవితం మీద వీరోచితంగా పోరాడిన వాళ్ళు నచ్చుతారు. మరోస్థాయిలో జీవితంతో రాజీ పడినవాళ్ళు నచ్చుతారు. ఇది బయటి నచ్చడమా? మన లోపలి మార్పు మనకు నచ్చేలా చేసుకోవటానికి బయటి వారిని ఆసరాగా చేసుకోవటమా? అని ఆత్మావలోకనం చేసుకుంటాడు.

ఎంతటి సంక్లిష్ట భావననైనా ఎంత సులభంగా చెప్పొచ్చో, తమ్ముడి మరణం కథలోని ఈ వాక్యం చూడండి: ఒక అపరిచితే కావచ్చు, వద్దని సున్నితంగా చెప్పడానికైనా కొంత కాఠిన్యం అవసరమే. అలాగే అదే కథలో చనిపోయే ముందు తమ్ముడి పాత్ర చేసిన ఫోన్ గురించి, రేపటినుండి ఉండబోని వాడు, ఇవ్వాళ ఉన్నానని గుర్తు చేయడం దేనికి? లాంటి వాక్యాలు రచయత సాధనని అర్థంచేయిస్తాయి.

జంతువుకి మాత్రం జ్ఞానం లేదని ఎట్లా అంటాం? ఈ జ్ఞానం కూడదన్న జ్ఞానం ఉందేమో! అందుకే సాధారణంగా బతికేస్తున్నాయేమో అంటూ జ్ఞానవంతులమని చెప్పుకుంటూ ప్రవృత్తి రీత్యా జంతువుల కంటే హీనంగా బతికే మనుషుల మీద వ్యంగ్యోక్తులు విసురుతాడు.

ఏ కవీ స్త్రీ సౌందర్య వర్ణనలో వాడని వీపుని ఈ రచయిత కనీసం నాలుగైదు చోట్ల ప్రస్తావించడం కొత్తగా వుంటుంది. మంట కథలో, వీపులుగా మోహం కలిగించి ముఖాలుగా మోసం చేసేవాళ్ళు -అని, సన్నని నూగు గల చక్కని వీపు! ఏ యాదగిరి ఆ వీపు మీద ముక్కును ఆన్చగలడో!– అనీ చిలిపి ఊహలు చేస్తాడు.

చలం స్త్రీల గురించి చెప్పిన మాటలను, తనదైన శైలిలో, మనుషులందరికీ వర్తింపచేస్తూ, శరీరానికి ఆకలి, మెదడుకు ఆలోచన, అంగానికి కోరిక ఉండాల్సిందే! అని ప్రవచిస్తాడు.

ఇలాంటివే మరికొన్ని సూత్రీకరణలు:

– తిరగడం అంటే, రోజూ చూసే దానికి భిన్నమైన దృశ్యాన్ని కంట్లో వేసుకోవడం.

– మన కాళ్ళేమో పల్లెలో ఉంటాయి, చేతులేమో పట్నాన్ని కౌగిలించుకుంటాయి.

– తల్లి కడుపులోంచి బయట పడ్డానికి బొడ్డుతాడు కోయడంతోనే కృత్రిమత మొదలైంది కదా!

– పదార్థం వల్ల భావన కాదు. భావన కోసం పదార్థం.

– ఉద్వేగపూరితమైనదేదో జత కూడనిదే నగ్నత్వంలో ఆకర్షణ ఉందా?

– వర్తమానంలో చాలా చిన్న విషయంగా కనిపించేది, ఎప్పటికోగానీ విలువైన విషయమని అర్థం కాదు.

– ఇంకొకరి కష్టాన్ని భూమ్మీది మరే మనిషీ పూర్తిగా అర్థం చేసుకోలేడు. మనకు అది జస్ట్ ఒక వార్త, అంతే.

– అందరిలాగే ఉన్నాను అంటే, అతి సాధారణంగా కనిపించి బాధ. అందరిలా నేను లేను అంటే అసాధారణంగా కనిపించి బాధ.


రాజిరెడ్డి కథల్లో ఒక బైరాగి తత్వం కనిపిస్తుంటుంది. ఎంతో జీవితానుభవంతో, ఎన్నో జీవితాల సహానుభూతితో , జీవిత సారాన్ని క్రోడీకరించి చిన్న చిన్న పదాలలో పాటలు కట్టి పాడుకుంటూ దారమ్మట తాంబూరా మీటుకుంటూ పోతున్న బైరాగులు గుర్తొస్తారు. ఆటవెలది పద్యాలలో, అందరూ పలికే మాటలతో అనంతమైన భావాన్ని వ్యక్తీకరించిన వేమన గుర్తొస్తాడు. చిన్న చిన్న ప్రాపంచిక విషయాలు మొదలుకుని మహా మహా సిధ్ధాంతాల వరకూ ఎడతెగని తాత్త్విక చింతన, హేతు పరిశీలన ఈ కథల నిండా అవసరమైనంత మేరకు పరచుకుని ఉంటుంది. ఒక్క జీవితాన్ని గురించే ఈ కథల్లో కొన్ని పదుల వ్యాఖ్యానాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని చెయ్యీ జీవితంలో మిగిలేది చివరికి దుఃఖమే; జీవితం కూడా దేవుడి లాంటిదే, ఎలాగైనా వ్యాఖ్యానించుకోవచ్చు; జీవితంలో ఉన్నది కళలో ఎన్నటికీ రాదు; సీతాకోకలా ఉండాలనుకుంటే జీవితం బొద్దింకలా ఎదురొస్తుంది— ఇలాంటివి మచ్చుకు కొన్ని.

ప్రపంచవ్యాప్తంగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో వస్తున్న మార్పుల గురించి, ఆ మార్పులకు ప్రజలతో ఉండే సంబంధం గురించీ ఏ కథా నేరుగా ఒక వస్తువుగా మాట్లాడదు. కానీ అన్ని కథల్లో ఏదో మేరకు ఆ వస్తుగత చర్చ, సూక్ష్మపరిశీలన, కొండకొచో తీర్మానాలు కనబడుతూనే ఉంటాయి. మధ్యతగతి జీవితాలపై దాని ప్రభావాలు, వాటి పర్యవసానాలు చాలా కథల్లో మార్మికంగా, వ్యంగ్యంగా చురకల్లా వినబడుతూనే ఉంటాయి. రెక్కల పెళ్లాం కథలో, ప్రపంచం కొత్తగా బాగుపడేదీ లేదూ, చెడిపోయేదీ లేదు. బాగుపడినా దాని నియమాల మేరకే, చెడిపోయినా దాని నియమాల మేరకే! అని చెప్పినా, మంట కథలో, పొట్లపల్లా, ఆయనెవరు? అంటే నేను నొచ్చుకోవడానికి కారకమయ్యేదేదో నాలో రూపుదిద్దుకుంటూ ఉందా! అని అన్నా అవి రచయిత చైతన్యాన్ని పట్టిస్తాయి.

గత ముప్పయేళ్లలో అస్తిత్వవాద సాహిత్యం, వామపక్ష భావజాలం, ప్రాంతీయ స్పృహ, ఈ కాలాల్లో రాసిన, రాస్తున్న సృజనకారులను ఏదో ఒక మేరకు ప్రభావితం చేశాయి. కాని రాజిరెడ్డి ఏ ‘వాది’గా కూడా ముద్ర పడకుండా ఉండగలగడం అతను నమ్మిన అభిప్రాయాల పట్ల అతని నిజాయితీని సూచిస్తుంది. అలా అని తను వాస్తవాలను గుర్తించలేని రంగుటద్దాలను ధరించి లేడు. మనుషుల మీద పరిశోధన చేసినవాడు. మనుషులను గుంపులో చూడకూడదు, ఎవరిని వారినే పక్కకు విడదీసి అపురూపంగా తడుముతూపోతే నిర్మలమైన సౌందర్యం కనిపించవచ్చని ఆశ కలిగినవాడు; దానికి కావలిసినదల్లా కొంచెం సమయం, కొంచెం ఓపిక అని కారణాలు తెలిసిన వాడు. ఎంత కాలుష్యంలోనైనా పూలచెట్టు తన పరిమళపు అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది కదా, అలాగే ఎలాంటి పరిస్థితులలోనైనా మనిషికి తన మనిషితనాన్ని నిలబెట్టుకునే అవకాశం లేదా? అని ప్రశిస్తూ ఆ ప్రశ్నలోనే ‘ఉంది’ అనే ఆశనూ కల్పించేవాడు.

అందుకేనేమో రాజిరెడ్డి తనని తాను బహిర్గతం చేసుకోవడానికి కథ రాస్తానని, సత్యాన్వేషణలో భాగంగా తనని తాను పునర్నిర్వచించుకుంటూ పునర్నిర్మించుకుంటాననీ చెప్పుకున్నాడు.