మాండలిక వృత్తిపదకోశ నిర్మాణం: భద్రిరాజువారి మార్గదర్శకత్వం

భాషలోనూ సాహిత్యంలోనూ ఎంతో వైవిధ్యముంది. ఒక్కో కవి, రచయిత ఒక్కో ప్రత్యేక పద్ధతిలో గ్రంథ రచన చేస్తారు. ఎవరి శైలి వారిదనీ, శైలిని బట్టి రచయిత ప్రత్యేకతనో విశిష్టతనో గుర్తించవచ్చనీ భాషాభిమానులూ, సాహితీపరులూ ఇటీవలి కాలం దాకా నమ్మలేదు. అందువల్లనే సాంప్రదాయిక సాహిత్యాధ్యయనంలో శబ్ద సాధుత్వాసాధుత్వాల కున్నపాటి స్థానమైనా కవి విశిష్ట భాషాభేదాలను గమనించటానికి లేకపోయింది. రచయిత మీద సమకాలిక భాషాప్రభావం ఎంత ఉందో ఎవరూ పట్టించుకోలేదు. వ్యాకరణ గ్రంథాలు మాండలిక భేదాల విషయం ప్రస్తావించినట్లయినా లేదు. పందొమ్మిదో శతాబ్దం చివరి రోజుల్లో వేదం వేంకటరాయశాస్త్రి ‘నాగానందం, ప్రతాపరుద్రీయం’ వంటి రూపకాల్లో సంస్కృత మర్యాదలు పాటించి ‘పాత్రోచిత భాష’ను ప్రవేశ పెట్టేదాకా రచనా భాషను గురించి లాక్షణికులు అంతగా పట్టించుకొన్నట్టు లేదు. అచ్చతెనుగు, జానుదెనుగు, అన్యదేశ్యం వగైరా పదాల అర్థ విశేషాలను గూడా విమర్శకులు పరీక్షించలేదు. వేదం వారు ‘గ్రామ్య’ ప్రయోగాలు చేస్తున్నారనే అభియోగం పెద్ద దుమారం లేపింది. ఆ గాలివాన సద్దుమణగకముందే గురజాడ వారి ‘కొండు భట్టీయం, కన్యాశుల్కం’ వెలువడ్డాయి. వేదం వారు కల్పిత భాషా రూపాలనూ, వాస్తవిక మాండలికాలనూ కలగాపులగం చేసి రాస్తే, గురజాడ వారు విశేషించి కన్యాశుల్కంలో భిన్న పాత్రలచేత తమ తమ వర్గ మాండలికాలు పలికించారు. మొత్తం రచనలో విశాఖ ప్రాంతీయ మాండలికం రూపు కట్టింది.

అంతకు ముందు శుద్ధ గ్రాంథికంలో రాసిన తెలుగు కవులూ, రచయితలూ మాండలిక పదాలను ప్రయోగించక పోలేదు. ఆయా రచనల భాషా లక్షణాలను గురించి సమకాలంలోగాని, తరువాతి కాలంలోగాని ఎన్ని రకాల విమర్శలు వచ్చాయో తెలియదు. ఏ మాటలు, ఏ వృత్తివారి వాడుకలో ఏ ప్రాంతంలో ఉండేవో, ఉన్నాయో ఇరవయ్యో శతాబ్దికి ముందు పరిశీలించిన వారెవరో చెప్పలేం. కానీ వేదం, గురజాడలు తమను సమర్థించుకోటానికి చర్చల్లోకి దిగక తప్పలేదు. గిడుగు వేంకట రామమూర్తిగారి వ్యావహారిక భాషావాదం, దానికి విరుద్ధంగా జయంతి రామయ్య పంతులు వంటివారి గ్రాంథిక భాషావాదం ఉద్యమ రూపంలోకి పరివర్తన చెందుతున్న కాలంనుంచి – రమారమి 1910 ప్రాంతాలనుంచి, ‘మాండలికాల’ అస్తిత్వాన్ని గుర్తించక తప్పలేదు. మాండలిక శబ్దాల ప్రయోగం సాధువుకాదని గ్రాంథిక భాషావాదులు వాదిస్తే, పూర్వ కవులెందరో మాండలిక పదప్రయోగం చేశారని వ్యావహారిక భాషావాదులు వాదించి దృష్టాంతాలు, నిదర్శనలు, నిరూపణలు ప్రదర్శించవలసి వచ్చింది. ‘సొర / సొర్ర’ అనే మాటను కొన్ని ప్రాంతాల్లోనూ, ‘ఆనపకాయ’ అనే దాన్ని తదితర ప్రాంతాల్లోనూ వాడుతున్నారని, ఒక ప్రాంతపు భాషారూపం మరో ప్రాంతం వారికి తెలియకపోతే ‘మాండలిక నిఘంటువులు’ రాసి తెలియజెప్పాలేగాని ‘అలంబూ’ అనే సంస్కృత పదాన్ని – ఎవరికీ సరిగా అర్థంగాని పదాన్ని – వాడటం సముచితం కాదని గిడుగువారు ఓ సందర్భంలో గర్జించారు. 20వ శతాబ్ది ప్రథమ దశకంనాటికి మాండలిక పదాలను సేకరించి, మాండలిక నిఘంటు నిర్మాణం ఆరంభించాలనే వాదమయితే పుట్టింది కాని, అలాంటి ప్రయత్నం మొదలే కాలేదు. మాండలిక పదప్రయోగంవల్ల రసాభివ్యక్తికి భంగం కలక్కపోగా రససిద్ధికి అది తోడ్పడుతుందనే భావన కూడా మొదలయింది. నండూరి సుబ్బారావు గారి ‘ఎంకి పాట’ల వంటి మాండలిక రచనలు కూడా ఆవిర్భవించాయి. ఇదో సాహితీ చర్చా రూపం మార్చి కేవల భాషా శాస్త్ర విషయంగా పరిణమించటానికి మరో నలభై ఏళ్ళు కావలసి వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేర్పడిన తర్వాత, అప్పటి విద్యాశాఖ మంత్రి బులుసు పట్టాభి రామారావు గారు కేంద్రంలోలాగ రాష్ట్రంలోకూడా ఒక సాహిత్య అకాడమిని స్థాపించాలనే అబ్బూరి రామకృష్ణరావు, నార్ల వెంకటేశ్వరరావుల వాదనకు తలఒగ్గారు. ఆ సంస్థ చేయవలసిన సాహితీ కార్యక్రమాల విషయమటుంచి భాషావిషయం పరిశీలిద్దాం. సాహిత్య అకాడమి కార్యవర్గ సభ్యులైన భద్రిరాజు కృష్ణమూర్తిగారి అభిప్రాయాలతో ఏకీభవించి ఆధునికాంధ్ర భాషకు సువిస్తృత వర్ణనాత్మక వ్యాకరణం రచించాలనీ, చారిత్రక పద్ధతుల్లో బృహన్నిఘంటువు నిర్మించాలనీ సంకల్పించింది. అయితే అవి దీర్ఘకాలిక ప్రణాళికలు. కాబట్టి మహానిఘంటు నిర్మాణానికి తోడ్పడేందుకు పదప్రయోగ కోశాలూ, మాండలిక వృత్తిపద కోశాలు ప్రథమ దశలో ఆరంభించాలనుకున్నారు. అబ్బూరి రామకృష్ణరావుగారు విశాఖపట్నంలో ఆరంభించి తరవాత అకాడమి పరం చేసిన నన్నయ పదప్రయోగ కోశం తయారీలో సైద్ధాంతికానువర్తన విధానాలను భద్రిరాజు కృష్ణమూర్తిగారు రూపొందించారు. తిక్కన పదప్రయోగ కోశం కూడా భద్రిరాజువారి సమస్త సహాయ సంపదలతోనూ వెలువడింది. అప్పటికి ఇతర భారతీయ భాషల్లో పదప్రయోగ కోశ నిర్మాణం మొదలు కాలేదు.

మాండలిక వృత్తిపద కోశాల విషయం భద్రిరాజువారి మౌలిక పరిశ్రమ ఫలితం. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి 1958 లో చేపట్టింది. అప్పటికి ఇతర భారతీయ భాషల్లోనైనా రెండేరెండు మాండలిక పదకోశాలు వచ్చాయి. 1885 లో జి.ఏ.గ్రయర్సన్ ప్రచురించిన “బీహార్ పెజంట్‌లైఫ్” వర్ణనాత్మకంగా సాగిందేగాని ఒక నిఘంటువులాగా వెలువడింది కాదు. 1960 లో అంబాప్రసాద్ సుమన్ “కృషక్ జీవన్ సంబంధీ బ్రజ్ భాషా పదావలీ” వచ్చింది గాని అది భద్రిరాజు వారి “వ్యవసాయ వృత్తి పదకోశం” తరవాతిదే. మాండలికాలను భౌగోళిక వ్యాప్తిని బట్టి ప్రాంతీయ మాండలికాలనీ, వృత్తివ్యాపారాది సంబంధాలనుబట్టి వర్గ మాండలికాలనీ ప్రధానంగా విభజిస్తారు. ప్రాంతీయ మాండలిక పదపట్టికలను 1949 నుంచీ ఆంధ్రప్రభ దినపత్రిక అడపాదడపా ప్రచురిస్తూ వచ్చింది. దాదాపు ఇరవై నాలుగుమంది పరిశోధకులు పదపట్టికలు ప్రచురించారు. కాని ఈ సేకరణ ప్రచురణలు ఏ శాస్త్రీయ విధానం ప్రకారమూ జరగలేదు. సాహిత్య అకాడమి భద్రిరాజు కృష్ణమూర్తిగారి ప్రధాన సంపాదకత్వంలో వృత్తిపదాల మాండలిక వ్యాప్తిని నిరూపించే కోశ పరంపరను ప్రచురించాలని సంకల్పించింది. ఈ కార్యక్రమం చేపట్టే నాటికి సైద్ధాంతికంగా కాని, ఆచరణాత్మకంగా కాని అనుసరించదగిన నమూనాలు లేవు. నౌకాయానానికీ, నౌకానిర్మాణానికీ సంబంధించిన పదపట్టికల నిచ్చే ప్రత్యేక నిఘంటువులు పదహారో శతాబ్ది నుంచి వెలువడ్డాయని మాల్కీల్ వివరించాడు (1962:23). అలాగే వ్యవసాయ వృత్తికి సంబంధించిన పదకోశాలు పాశ్చాత్య లోకంలో ఉన్నాయని కూడా అతడు ప్రస్తావించాడే గాని, ఆ నిఘంటువులకున్న సిద్ధాంత ప్రాతిపదికలను గురించిన సమాచారంగాని అనువర్తన విధానాలను గురించి గాని ఆయనేమీ వివరించలేదు.

జర్మనీలో జార్జ్‌వెంకర్ 1876 లో మాండలిక పదసేకరణ ఆరంభించి 1926 లో ముగించాడు. ఆ తరవాత ఆ కార్యక్రమాన్ని డబ్ల్యు. మిచ్కా కొనసాగించి 1939 కి పూర్తి చేశాడు. (ఛాంబర్స్ & ట్రడ్గిల్ 1980:18,19). 1930 లో హేన్స్‌క్యూరాత్ అమెరికన్ భాషాపటరచన ఆరంభించినా 1976 నాటికి అది పూర్తికాలేదు. యూజిన్ డయెత్, హెరాల్డ్ అర్డన్లు 1948 లో ఆరంభించిన ఆంగ్ల మాండలిక పదసేకరణ 1978 నాటి గ్గాని నెరవేరలేదు. 1952 లో మొదలైన స్కాటిష్ మాండలిక పరిశీలనలో పోస్టు ద్వారా విషయ సేకరణ చేయటమనే ప్రథమదశ 1980 నాటికి పూర్తయింది. ఇలా దీర్ఘకాలం జరిగిన పరిశోధనల్లో ప్రాంతీయోచ్చారణ భేదాలనూ శబ్ద రూప భేదాలనూ సేకరించటం మాత్రమే జరిగింది గాని ఆయా వృత్తులకు సంబంధించిన పదజాలాన్ని ఉచ్చారణ రూప భేదాలతో సంపాదించటం జరగలేదు. భద్రిరాజు వారి ప్రతిపాదన వృత్తి ప్రధానంగా పదజాలంలో ఉచ్చారణలో వచ్చిన, వస్తున్న మార్పులను గుర్తించటానికి ఉద్దేశించింది. జె. ట్రయర్ వంటి వాళ్ళు అర్థ సంబంధమున్న పదాలు ఏయే అర్థచ్ఛాయల్లో ఏయే ప్రాంతాల్లో విస్తరించాయో గుర్తించే విధాన మనుసరించి ప్రత్యేక నిఘంటువులు సిద్ధం చేశారు. భద్రిరాజు వారు అవలంబించింది లాదిస్లావ్ జుగుస్తా పేర్కొన్న రెండో విధానం. ఒక్కో వృత్తిలో ప్రత్యేకంగా ఉన్న కార్యక్రమాల క్రమ వికాసాన్ని విశ్లేషిస్తూ, దానికి సంబంధించిన సాధనాల విధానాల ఏకదేశ ప్రవృత్తులను పద స్వరూప, అర్థ విశేషాదులను వాటికున్న భౌగోళిక వ్యాప్తితోసహా గుర్తించి కోశస్థం చేయటం అన్నమాట (జుగుస్తా 1971:103). ఇందువల్ల వర్గమాండలిక ప్రాంతీయమాండలిక రూప వైవిధ్యం ఒకేసారి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని భాషా మండలాలున్నాయో గుర్తించటం వీలుపడుతుంది.

ఆచార్య కృష్ణమూర్తి 1958 లో మాండలిక వృత్తి పదకోశ నిర్మాణ కార్యక్రమానికి సారథిగా, సంపాదక మండలి అధ్యక్షుడుగా నియమితులై కార్యభారం చేపట్టేనాటికి సిద్ధాంత, అనువర్తన విధానాల అభావానికి తోడుగా సుశిక్షిత భాషా శాస్త్రజ్ఞులు కూడా లేకపోవటం అనే సమస్య కూడా వచ్చింది. స్వయంగా ధ్వని శాస్త్రంలో ప్రాథమిక శిక్షణ ఇచ్చి, పర్యటన పరిశోధన పద్ధతులు నేర్పి, ప్రాథమిక సర్వేక్షణ తానే చేసి, వ్యవసాయ వృత్తిలోని విభిన్న దశలనూ కార్య విధానాలనూ సాధన సంపత్తినీ స్థూలంగా విశ్లేషించి, విషయ సేకరణ ప్రణాళికను సిద్ధం చేయవలసి వచ్చింది. జనసంఖ్య ప్రాతిపదికగా ప్రధాన వృత్తులను నిరూపించి, అత్యధిక సంఖ్యాకుల వ్యవసాయ వృత్తిని ప్రథమ వృత్తి పదకోశ నిర్మాణానికి ఎంపిక చేశారు. భూ స్వభావం నుంచి పంటను ఇంటికి తెచ్చుకొని దాచుకొనే పాత్రాదులదాకా అనేక దశల్లో వాడుకలో వున్న మాటలను పోగుచేశారు. నామ పదాలు ఏయే క్రియలతో కలిసి ప్రయుక్తమవుతున్నాయో కూడా సేకరించారు. ఒక్కో గ్రామ కేంద్రం 40-50 కిలో మీటర్ల ఎడంలో ఉండేట్లు, వ్యవహర్తలు స్థానికులై విద్యావంతులు కాకుండా ఆ వృత్తి చేస్తున్నవారుగా ఉండేట్లు సరిచూసుకున్నారు. ప్రశ్నావళిలో దాదాపు 1500 పదాల సేకరణకు చాలినంతగా ఉన్నా, వ్యవహర్త సహజ ధోరణిలో తన వృత్తిని గురించి చెప్తున్న వాక్యాలను యథాతథంగా నివేదికల కెక్కించారు. ధనాభావంవల్ల టేప్‌రికార్డింగ్ సాధ్యం కాలేదు. తాను వదిలిపెట్టే కేంద్రం నుంచి సేకరణకర్త నివేదిక పంపే ఏర్పాటు చేశారు. అందువల్ల ఎప్పటికప్పుడు పదసేకరణలోని లోపాలను గుర్తించి తెలియజెప్పటం సాధ్యమయింది. సాధ్యమయినంతవరకు వయోవృద్ధులైన వ్యవహర్తలనే ఎంపిక చేయటం వల్ల పూర్వ రూపాలు రాబట్టడం సాధ్యమయింది. వ్యవహర్తల జీవిత విశేషాలను కూడా స్థూలంగా సేకరించారు. రెండు సంవత్సరాల వ్యవధిలో 120 కేంద్రాల నుంచి విషయ సేకరణ జరిగింది.

సేకరించిన పదాలను (ఉచ్చారణ భేద, రూపాంతర, పర్యాయ పదాలతో సహా) పట్టికాబద్ధం చేసి, పరస్పర నిర్దేశం చేసి, అర్థాలను వర్ణనాత్మకంగా సమకూర్చి, అవసరమైన చోట్ల చిత్రాలద్వారా విశదపరిచి, సాంకేతిక పదాలకు అంతర్జాతీయ నామాలను కూడా సంతరించి, అకారాదిక్రమణంలోని సాంప్రదాయిక దోషాలను సవరించి, నూతన వర్ణాలకు (ఏ, ఫ లకు) వర్ణమాలలో సముచిత స్థానం కల్పించి, విపులార్థ బోధకంగా నిర్మించిన మొదటి తెలుగు నిఘంటువు వ్యవసాయ వృత్తి పదకోశం. దాదాపు 8,000 ల పదాలు – నిఘంటువుల కెక్కని రూపాలతో, అర్థాలతో ఇందులో చేరాయి. మాండలిక పదాలతో బాటు మాండలిక భేద వ్యాప్తి కూడా తెలిసింది. ఆంధ్రప్రదేశం కళింగ, తెలంగాణా, కోస్తా, రాయలసీమ మాండలిక ప్రాంతాలనే నాలుగు నిర్దిష్ట ప్రాంతాలని భాషాశాస్త్రరీత్యా నిరూపించటం సాధ్యమయింది. 1962 లో వెలువడిన ఈకోశం 1974 లో ద్వితీయ ముద్రణ భాగ్యం పొందింది. రెండో సంపుటమైన చేనేత వృత్తి పదకోశం కూడా భద్రిరాజు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే 1971 లో వెలువడింది. మూడో సంపుటంగా వాస్తు పదకోశం 1968 లో వెలుగు చూసింది. నాలుగో సంపుటంగా రావలసిన మత్స్య నౌకా నిర్మాణ పరిశ్రమ పద సంపుటి నేటికీ ప్రచురితం కాకపోవటం దురదృష్టం. అయిదో సంపుటి కుమ్మరానికి సంబంధించింది. అది 1976 లో వెలువడింది. వడ్రంగం, బంగారం పనికి సంబంధించినవి ఎప్పుడు బయట పడతాయో తెలీదు. రెండో విడతలో సాహిత్య అకాడమి వారు భద్రిరాజు వారి ప్రధాన సంపాదకత్వంలోనే వెలువరించడానికి మరికొన్ని వృత్తులను గుర్తించారు. హస్తకళలు, జంతువులూ-వేట, సారానీరా బెల్లం పరిశ్రమలు, కంచరం, కమ్మరం వగైరాలకు సంబంధించిన మరికొన్ని సంపుటాలు భిన్నదశల్లో ఉన్నాయి. కార్యక్రమం మొత్తం నత్తనడకలు నడుస్తున్నది. ప్రచురణ కర్తలూ, సంపాదకులూ తగినంత శ్రద్ధ చూపుతున్నారని చెప్పలేం. గిడుగుకాలంలో ఊహగా మెరిసి, కృష్ణమూర్తి గారి యౌవన సమయానికి కార్యరూపానికి వచ్చిన మాండలిక పదసేకరణ నేటికి నిద్రాణ పరిస్థితికి దిగజారి, ఆంధ్రజాతి ఆరంభశూరత్వానికి మరో ప్రతీకగా విలసిల్లుతున్నదన్న మాట.

మాండలిక వృత్తిపద కోశాల్లోని భాషా సాంస్కృతిక సమాచారాన్ని విశ్లేషించి ఎన్నో అపూర్వ విషయాలను ఆవిష్కరించవచ్చు. ఉచ్చారణ భేద రూపాంతరిత పదాలను పరిశీలిస్తే తెలుగు మాండలికాల్లో ఏయే ధ్వనిభేదాలు ఏయే ప్రాంతాలకు పరిమితంగా ఉన్నాయో నిరూపించవచ్చు. రాధాకృష్ణ రేఖామాత్రంగా (1972:282-89) కొన్నిటిని నిరూపించ గలిగాడు. తెలుగు శబ్ద సంపదనేగాక శబ్ద సారూప్యాన్ని గూడా దాని విస్తృతితో సహా తెలుసుకోవచ్చు. పద స్వరూప, సమాస సంఘటన విధానాలను పరిశీలించవచ్చు. ఇలా అనేకం. ఇప్పటికి అచ్చయిన వృత్తి పదకోశాలనుంచి రమారమి 25,000 కొత్త పదాలనూ, కొత్త అర్థాలనూ మహా నిఘంటువులో చేర్చవచ్చు. అంతర్గత పునర్నిర్మాణ పద్ధతిద్వారా భిన్న చారిత్రక దశల్లో తెలుగుభాషలో వచ్చిన రూప వైవిధ్యాన్ని గుర్తించవచ్చు. పదబంధ నిర్మాణ విధానాలను గ్రహించవచ్చు. అయితే ఈ దిశగా తగినంత పరిశోధన జరగటం లేదు.

మాండలిక పద కోశ నిర్మాణానికే గాక, అసలు నిఘంటు నిర్మాణానికే నియమితమైన అనువర్తన సిద్ధాంతం లేదనే ఆక్షేపణ లేకపోలేదు. నిజానికి బోధన శాస్త్రం లాగానే, నిఘంటు నిర్మాణం కూడా నిశ్చిత విధానం లేనిదే. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, నిర్మాతలూ పరిశోధకులూ అప్పటప్పటికి తగిన పద్ధతులను రూపొందించుకుంటున్నారే గాని ఏక రూప సిద్ధాంత ప్రాతిపదికను ఏర్పరుచుకోవటం లేదని వీన్రై విచారిస్తున్నాడు (1962:76). కానీ ఇప్పటికి మాండలిక వృత్తి పదకోశ నిర్మాణానుభవం ద్వారా తెలియవచ్చిన విశేషాలకు సిద్ధాంత స్థాయిని కల్పించటం దుష్కరం కాదు – కష్ట సాధ్యం కావచ్చును గాని, అసాధ్యం కాదు. వయసుతోబాటు విజ్ఞానం, అనుభవం పరిపక్వమవుతున్న ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారే వృత్తి పదకోశ నిర్మాణానికి మార్గదర్శకులైనట్లు సిద్ధాంత రచనకు కూడా ఆద్యులు కావాలని ఈ వ్యాసకర్త ఆకాంక్ష.

మాండలిక వృత్తి పదకోశ నిర్మాణానికి భారతదేశం మొత్తంలో మొట్టమొదట అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఇప్పుడు లేదు, ఆ సంస్థకు వారసత్వం తెలుగు విశ్వ విద్యాలయానికి సంక్రమించింది. దాని నిర్వాహకుల్లో వృత్తి పదకోశ నిర్మాతలు కూడా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం సత్వర పూర్తికి వస్తుందని ఆశించవచ్చేమో! నిండు యౌవనంలో ఆరంభించిన ఈ మహత్తర కార్యం ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి షష్టిపూర్తి నాటికి నెరవేరితే బాగుండేది. వారి సప్తతి పూర్తి నాటికి వృత్తి పదకోశాలన్నీ వెలుగు చూస్తాయని, వారందించే సిద్ధాంత ప్రాతిపదికతో మాండలిక, నిఘంటు శాస్త్రాలు రెండూ తెలుగునేలలో నిలదొక్కుకుంటాయని ఆశిస్తాను. విద్వాంసులకు తాము నాటిన విజ్ఞానబీజాలు అంకురించి ఫలించటమే శిష్యబృందం సమర్పించగల గురుదక్షిణ. నిజానికి కౌత్సుడిలాగా శిష్యులు నిర్బంధంగా నయినా ఈ గురుదక్షిణ సమర్పించాలి.


  1. Chambers, J.K. and Trudgil, Peter: 1980: Dialectology, Cambridge Univ. Press. Cambridge.
  2. Malkiel, Yakov : 1962 : A Typological classification of Dictionaries on the ‘Problems in Lexicography’, Edd. Fred W. House holder and Sol Saporta, Mouton & Co., The Hague.
  3. Radhakrishna, Budaraju: 1972 : Some Rare Alternations in Telugu Dialects, Proceedings of the second All India Conference of Dravidian Linguists, Tirupati, pp. 282-289.
  4. Radhakrishna Budaraju: 1988 : Methodological contributions of Telugu Dialect Dictionaries, OPiL (forth coming).
  5. Read, Allen Walker : 1962 : The Labelling of National and Regional Variation in Popular Dictionaries, in ‘Problems in Lexicography’, (Opt. Cit.).
  6. Weinreich, U. : 1967 : Lexicographic Definition in Descriptive Semantics, in ‘Problems in Lexicography’, (Opt. Cit.).
  7. Zgusta, Ladislav : 1971 : Manual of Lexicography, Muton & Co., The Hague.