అల్లసాని పెద్దన “ఆంధ్రకవితాపితామహుడు”. అంటే అంతకుముందు ఆంధ్రకవిత్వం లేదని కాదు, అతని సమకాలీనకవుల్లో పెద్దన పెద్దతలకాయ అని; ప్రబంధ సాహిత్యానికి అతను అంకురార్పణ చేశాడని.
పెద్దన చేసిన ఒక సాహసం వరూధిని అనే పాత్రను సృష్టించటం. అదివరకు ఎన్నో స్త్రీపాత్రలు వచ్చాయి కాని వరూధిని వంటి వ్యక్తిని సృష్టించే పరిస్థితులు, కవులు అంతవరకు రాలేదు. కృష్ణదేవరాయల పాలన నాటి రాజకీయ, సాంఘిక స్థితిగతులు పెద్దనవంటి వారు విలాసభరితమైన సాహిత్యాన్ని, విలాసులైన స్త్రీపాత్రలను నిర్మించటానికి అనుకూలమయ్యాయి.
ధిషణ, వాదనాపటిమ వున్న స్త్రీపాత్రలు అంతకుముందు వచ్చారు, పురుషుల్నెదిరించి వాదించి సాధించారు. ద్రౌపది, దమయంతి, భారత ఉపాఖ్యానాల్లో ఇంకొందరు – ఇందుకు ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఐతే, ‘నాకు నీమీద కోరిక వుంది; అది నువ్వు తీర్చాల్సిందే’ అని పట్టుపట్టినవారు భారతంలో ఒక్క దేవయాని తప్ప మరెవరూ కనిపించరు. ఆమె గారాబాల పట్టి. అంటే, ఇప్పటి భాషలో చెప్పాలంటే స్పాయిల్డ్ చైల్డ్ (spoiled child). తండ్రికి ఆమెమీద వున్న అమితప్రేమతో వయసు పెరిగినా లోకం తెలియని వ్యక్తి. వరూధిని అలా కాదు.
అని ధాటిగా, సూటిగా తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగలిగిన వ్యక్తి.
అంటూ అతనికి “ప్రాజదువుల” అంతరార్థాలు వివరించగల వ్యక్తి. ఆమెను తర్కంతో ఎలా ఓడించాలో తెలియక చివరికి ప్రవరుడు ఆమెకి “కామశాస్త్రోపాధ్యాయిని” అంటూ పేర్లుపెట్టటం చూస్తాం – తర్కం దొరకనప్పుడు తిట్టే దిక్కన్నట్టు. (గమ్మత్తేమిటంటే, ఆమె మాటలేవీ కామశాస్త్రానికి సంబంధించినవి కావు; ప్రవరుడికి వేదవేదాంగాలు తెలుసునేమో గాని కామశాస్త్రం తెలియదని ఇక్కడ పెద్దన సూచిస్తున్నాడని నా అనుమానం. ఏమైనా, ఇది రామాయణంలో పిడకల వేట.)
ఆ తరవాత వచ్చిన భట్టుమూర్తి (రామరాజభూషణుడు) ప్రబంధప్రక్రియని అత్యున్నతస్థితికి ఎత్తి భవిష్యత్ కవులందర్నీ అయోమయంలో పడేశాడు. అతని భాషావైదుష్యాన్ని, పదకల్పనాసామర్థ్యాన్ని, సంప్రదాయపాండిత్యప్రకర్షని అందుకోగలిగిన స్థాయి వున్న కవులెవరూ ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో రాలేదు.
మరి ఆ తర్వాత వచ్చిన కవుల గతేమిటి? వాళ్లు ఏం రాయాలి? ఎలా రాయాలి?
ఈ చిక్కుప్రశ్నకు ఒక సమాధానం కనుక్కున్న తొలికవి చేమకూర వెంకటకవి. అతని సారంగధర చరిత్రము పెద్దన-భట్టుమూర్తుల మార్గాల కలయిక. పెద్దన వరూధిని ఒక దేవవేశ్య ఐతే చేమకూర నాయిక చిత్రాంగి, రాజరాజుకి ఉంపుడుగత్తె. ఆమెకి రాజరాజు కొడుకు సారంగధరుడి మీద కోరిక. రాజు వేటకువెళ్లిన వేళ, అతను తన ప్రియమైన పావురం కోసం ఆమె మందిరంలోకి వెళ్తాడు. వాళ్లిద్దరి మధ్య జరిగే సుదీర్ఘ సంభాషణని చేమకూర శ్లేషోపకరణంతో ఎంతో చాకచక్యంగా సాగిస్తాడు. ఐతే ఆమె వరూధినిని బాగా వంటబట్టించుకున్న ప్రౌఢ.
పెద్దన వరూధిని వాదం ద్వారా ప్రవేశపెట్టిన ఒక తర్కమార్గం (వక్రమార్గమైనా చమత్కారకారకం) “నీకంటే గొప్పవాళ్లు ఈ పని చేశారు, నువ్వు చెయ్యటంలో తప్పులేదు” అనేది. ఇది వరూధిని గొంతులో ఇలా పలుకుతుంది:
చిత్రాంగి ఈ తర్కాన్ని దొరకబుచ్చుకుని ఇంకో మెట్టు పైకెక్కుతుంది:
అలాగే, వరూధిని చాలా తాపీగా:
“ప్రాంచద్భూషణ బాహుమూలరుచితో పాలిండ్లుపొంగార పై
యంచుల్ మోవగ కౌగిలించి యధరంబాసింప”
చిత్రాంగి అతన్ని “అలమి బలిమి నొడిసి” పట్టింది. ఎంత గట్టిగా పట్టిందంటే ఆమెని తప్పించుకుని సారంగధరుడు పైపంచెను వదిలేసి “సాము సేసినగతి దట్టిచల్లడంబుతో” పారిపోవల్సొచ్చింది!
చేమకూర తర్వాత కొద్దికాలానికి వచ్చిన వారు సముఖము వేంకటకృష్ణప్ప నాయకుడు, శేషము వేంకటపతి. వాళ్లిద్దరూ మంచి మిత్రులని వేంకటకృష్ణప్ప చెప్పుకున్నాడు కూడ. వీళ్లు చేమకూరని దాటేసి అతని పై పద్యంలో వున్న ఇంద్రుణ్ణీ, చంద్రుణ్ణీ తమ నాయకులుగా ఎంచుకున్నారు – వేంకటకృష్ణప్ప “అహల్యాసంక్రందనము”, వేంకటపతి “శశాంకవిజయము”. చేమకూర దారిలో పెద్దన-భట్టుమూర్తుల మార్గాల కలయికని అనుసరించారు.
అహల్య కథకి మూలం ఋగ్వేదంలో ఇంద్రుణ్ణి “అహల్యాజారుడి”గా కీర్తించటం దగ్గర్నుంచి ఉంది. “అహల్య కథ” గురించి ఎన్నో పరిశోధనా పత్రాలు వచ్చాయి. ఓ రెండు ముఖ్యమైన వాటిని కింద సూచించాను.
ఇక్కడ మనక్కావలసిన విషయం వేంకటకృష్ణప్ప ఆ కథని ఎలా మలిచాడనేది.
అహల్య గురించిన చాలా కథనాలలో ఇంద్రుడు ఆమెను బలాత్కరిస్తాడు; అతను ఆమె భర్త గౌతముడి వేషంలో వెళ్లి ఆమెను కలవటం వల్ల ఆమెకి అతను ఇంద్రుడని తెలియదు. నదికి వెళ్లిన గౌతముడు తిరిగి వచ్చాకే తెలుస్తుంది. ఐనా అతని శాపానికి గురికాక తప్పదు.
వేంకటకృష్ణప్ప ఆలోచన వేరు: మొదటగా, ఇంద్రలోకంలో ఒక సభ జరుగుతుంది. అక్కడ, (వేరే మాట్లాడుకోవటానికి ఏమీ లేనట్టు) దేవవేశ్యల్లో ఎవరు అందరికన్నా అందమైన వాళ్లు అన్న విషయం మీద దేవతలు, ఋషులు తిట్టుకుని తన్నుకునే స్థితికి వస్తారు. అప్పుడు ఇంద్రుడు అందర్నీ వారించి “బ్రహ్మ దగ్గరకు వెళదాం, ఆయనే మన సందేహం తీరుస్తాడు” అని తీసుకెళ్తాడు. వెళ్లి ‘నీ సృష్టిలో అందరికన్నా అందమైన స్త్రీ ఎవరు?’ అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ అన్నిలోకాల్లో వున్న స్త్రీలందరికీ ఏదో ఒక వంక పెట్టి , “ఇప్పుడే నేను అందానికి ప్రతిరూపం ఐన స్త్రీని సృష్టిస్తాను చూడు” అంటూ అహల్యను సృష్టిస్తాడు. ఆ వెంటనే ఇంద్రుడు ఆమెను తనకివ్వమని అడుగుతాడు; అహల్య కూడ అప్పటికప్పుడే అతనితో ప్రేమలో పడుతుంది. అతని కథనం ప్రకారం అలా వాళ్లు తొలినుంచీ పరస్పర ప్రేమికులు.
బ్రహ్మ అతన్ని కాదని ఆమెకి గౌతముడితో వివాహం చేస్తాడు.
ఈ నిర్మాణంతో వచ్చే ఒక చిక్కు – చిత్రాంగిలా అహల్య ఇంద్రుణ్ణి తన కోరిక తీర్చమని అడగటం, అతన్ని ఒప్పించటానికి వరూధిని వంటి తర్కాన్ని వాడటం కుదరదు. ఐతే ఇలాటి చిన్న చిన్న చిక్కుల్ని దాటటం వేంకటకృష్ణప్పలాటి ప్రతిభావంతుడికి కష్టం కాదు: అతనొక యోగిని పాత్రని అందుకోసం తయారుచేస్తాడు. ఆ యోగిని అహల్యని ఒప్పించటానికి వరూధిని తర్కాన్ని వాడుతుంది –
అంతేకాదు,
అని వరూధిని అందించిన “ఆనందో బ్రహ్మ” విశ్లేషణని అందిపుచ్చుకుని విశాలపరుస్తుంది. భార్య ఏం తప్పుచేసినా దాని పాపఫలితం ఆమె భర్తకే చెందుతుందని ఘంటాపథంగా చాటుతుంది.
వేంకటకృష్ణప్ప మిత్రుడు శేషము వేంకటపతి తన “శశాంకవిజయము”లో ఇంకా ముందుకు అడుగేసి, తార చేత ఇలా అనిపిస్తాడు:
లోకములోన కొందరబలుల్ సతులం దనియింపలేక య
స్తోకమనీష నన్యపురుషుల్ తమకాంతల నంటకుండ తా
టాకులలోన వ్రాసిరి పరాంగన గూడిన పాపమంచు న
య్యాకుల పాటు జూచి యిపు డాకులపాటెనయంగ నేటికిన్
అసలు ధర్మశాస్త్రాలే అంతా తుస్సు; ఎందుకూ పలికిమాలినవాళ్లు తాటాకులు చెడగొట్టటానికి రాసిన రాతలే తప్ప పాటించవలసినవి కావని కుండబద్దలు కొడుతుందన్నమాట.
వేంకటపతి కూడ వరూధిని మార్గాన్ని వదలకుండా తార చేత ఇలా అనిపిస్తాడు:
అలా, ఒక దేవవేశ్యతో మొదలైన ఈ మార్గం కొత్తపుంతలు తొక్కి గురుపత్నులు, సవతితల్లులు (సారంగధరుడు చిత్రాంగిని తనతల్లితో సమానగా చూస్తాడు గనక), కట్టుబాట్లు దాటిన ఋషిపత్నుల శృంగార వ్యవహారాల చుట్టూ (erotic transgressions) చుట్టూ కథలల్లటం లోకి పరిణమించింది. ఎలాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులు ఇలాటి రచనలకి దారితీశాయో తెలియాలంటే నారాయణరావు, షుల్మన్, సుబ్రహ్మణ్యంల సింబల్స్ ఆఫ్ సబ్స్టాన్స్ (Symbols of Substance) పుస్తకం చదవాల్సిందే. ప్రపంచ సాహిత్యవిమర్శక లోకానికి అధునాతనపూర్వ తెలుగు సాహిత్యాన్ని పరిచయం చెయ్యటమే కాదు, తెలుగు సాహిత్యానికి ప్రత్యేకమైన స్వయంప్రతిపత్తి వున్నదని, అది సంస్కృతసాహిత్యానికి అనువాదం కాదని సహేతుకంగా, సశాస్త్రీయంగా నిరూపించిన ఈ ముగ్గురు పరిశోధకులు అత్యంత అభినందనీయులు.
ఇదివరకే ఈ వ్యాసపరంపరలో అన్నట్టు విక్టోరియన్, పాశ్చాత్య భావాల బానిసత్వంలో పడిపోయిన ప్రముఖ తెలుగు విశ్లేషకులకు విజయనగరోత్తర సాహిత్యంలో బూతు తప్ప మరేమీ కనిపించలేదు. కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగారెడ్డి – వీరిలో అత్యంత ప్రభావం చూపించిన వాళ్లు. అప్పటి కావ్యాల్లో విషయాల్ని పైపైన తిరగేసి తమకు అప్పటికే వున్న అభిప్రాయాల దృష్టికోణంలోంచి (through the prism of prejudice) చూసి వాటిని ఆరడుగుల లోతున పాతెయ్యకపోతే సంఘానికి ప్రమాదమని హడావుడిగా నిషేధించడానికి కంకణం కట్టుకున్న మహానుభావుల వల్ల వందల యేళ్ల తెలుగు సాహిత్యాన్ని కట్టకట్టి అవతల పారెయ్యటం జరిగింది. వీళ్ల తరవాత వచ్చిన వాళ్లు చాలాభాగం వీళ్లభావాలకి వంతపాట పాడిన వాళ్లే కావటం తెలుగు సాహిత్యం దురదృష్టం. దీని పర్యవసానంగా షుల్మన్ లాటి వాళ్లు చెప్తేగాని దక్షిణాంధ్రసాహిత్యం గురించి ప్రపంచానికి తెలియని దుస్థితి దాపురించింది.
ఈ ప్రబంధసాహిత్యంలో గుర్తించాల్సిన మరో విషయం ఏమిటంటే – ఈ కవులు తమ నాయికల చేత చాలా అతివేల శృంగారాన్ని గట్టిగా సమర్థించే వాదనలు చేయించారు కాని చివరకు “అబ్బే, ఇదంతా ఉత్తిత్తినే!” అని తేల్చిపారేశారు. ఇందుకు వాళ్లు మూడు రకాలైన పద్ధతుల్ని వాడారు. ఒక మార్గం, వాళ్ల మాటల దూకుడుకి అసలు కారణం “మదనతాపం” అని, అందువల్ల వాళ్లేం మాట్లాడుతున్నది వాళ్లకి తెలియదని ఒక మాటతో కొట్టిపారెయ్యటం. చేమకూర, వేంకటపతి ఇందుకు ఉదాహరణలు. ఒకరకంగా ఇది కూడ పెద్దన పెట్టిన భిక్షే.
మరో మార్గం వాళ్లపని తీరాక, అంటే వాళ్లచేత మాట్లాడించాల్సినవి మాట్లాడించాక, ఆ పాత్రల్ని తెరమరుగు చెయ్యటం. చిత్రాంగి విషయంలో ఇది చూస్తాం. మరొకటి, ఎంత విప్లవాత్మకభావాలు వాళ్లచేత పలికించినా చివరికి వాళ్ల ఖర్మకి వాళ్లని వదిలెయ్యటం: అహల్య కథలో, ఎప్పటిలాగానే ఆమెకి శాపం తప్పదు. ఇక తార విషయం మరీ ఘోరం – ఆమె చంద్రుడితో వెళ్లిపోయి వుంటుంటే, ఆమెకోసం బృహస్పతి ఇంద్రుడి దగ్గరికి వెళ్లి తనగోడు చెప్పుకుని చంద్రుడి మీదికి యుద్ధానికి పంపుతాడు. అలా ఇంద్రుడి వైపు దిక్పాలకులందరూ, చంద్రుడివైపు ఇదే సందని దేవతలమీద పగతీర్చుకోవటానికి రాక్షసులందరూ – యుద్ధం చేస్తారు. (దేవదానవ యుద్ధాల్లో ఇదీ ప్రముఖమైందిగా విశ్లేషకులు లెక్కేస్తారు.)
చివరకు బ్రహ్మ వచ్చి సంధిచేసి తారని బృహస్పతితో పంపుతాడు. అలా, ఎక్కడినుంచి పారిపోవటానికి ప్రయత్నించిందో అక్కడికే ఆమెని మళ్లీ పంపటం జరుగుతుంది. ఆ తర్వాత ఆమెకి బుధుడు పుడితే వాడు నా కొడుకని చంద్రుడు, కాదూ నా కొడుకని బృహస్పతీ వాదించుకుంటే మళ్లీ బ్రహ్మ వచ్చి తారని అడుగుతాడు. ఆమె బుధుడి తండ్రి చంద్రుడే అని చెబుతుంది. దాంతో బుధుణ్ణి చంద్రుడికిచ్చి పంపుతారు. మొత్తానికి, ఆమెకి ప్రియుడూ మిగలడు, కొడుకూ మిగలడు. వదిలించుకుందామనుకున్న బృహస్పతే మిగుల్తాడు.
ఇలా ఈ పెద్దనగారి ప్రశిష్యకవులు తమ నాయికలు తెగువలో, మాటల తెంపరితనంలో వరూధినిని మించేట్టు చేసినా వాళ్లకు దానివల్ల కలిగే పర్యవసానాల్ని మాత్రం మార్చటానికి సాహసించలేకపోయారు. తమ నాయికల ద్వారా విప్లవాత్మక భావాల్ని పలికించి ఆ తర్వాత వాటికి పెద్ద విలువ ఇవ్వకుండా వాళ్లు ఆ నాయికలను సాధనాలుగా (proxies) వాడుకున్నారనుకోవచ్చు – “చూడండి మేం ఎంత కొత్తభావాల్ని ప్రజల్లోకి తీసుకువచ్చామో!” అని ఒకవంక చూపుతూ మరోవంక “అబ్బే అవి మదనతాపంతో రగిలిపోతున్న ఉన్మత్తుల ప్రలాపాలు; అవి ఎంత ప్రమాదకరమైనవో చూపటమే మా ఉద్దేశ్యం” అనటానికి అవకాశం కల్పించుకున్నారు.
ఈ కథలన్నిటికి ఒక సామాన్యాంశం – “ముసలి భర్త, పడుచు భార్య” చట్రం. అలాటి సందర్భంలో స్త్రీ తనకిష్టమైన మరో మగవాణ్ణి చూసుకోవటంలో తప్పులేదు అని చెప్తున్నట్టు ఈ కవులు నటించారా అని నా అనుమానం.
ఇందుకు భిన్నంగా ప్రబంధాల్ని రాసినవారు ఇద్దరు – రంగాజమ్మ, ముద్దుపళని. ఇద్దరూ కవయిత్రులే కావటం విశేషం. రంగాజమ్మ ఉషాపరిణయం, ముద్దుపళని రాధికాసాంత్వనం రాశారు. మనకు వెంటనే కావ్యాల పేర్లలోనే తేడా కనిపిస్తుంది – మగకవుల కావ్యాలు సారంగధర చరిత్రము, అనిరుద్ధ చరిత్రము (ఇది రంగాజమ్మ రాసిన ఉషాపరిణయ కథే), శశాంకవిజయము ఐతే స్త్రీల కావ్యాలు ఉషాపరిణయం, రాధికాసాంత్వనం!
ఉషాపరిణయం మూలకథలో అనిరుద్ధుడికి కథాప్రారంభంలో పెళ్లవుతుంది. వసంతకాలం వస్తుంది. ఉషలో కొత్త ఊహలు మొదలౌతయ్. అప్పుడామె అనిరుద్ధుణ్ణి కల్లో చూసి ప్రేమలో పడుతుంది. ఆమె స్నేహితురాలు వెళ్లి అనిరుద్ధుణ్ణి ఉష దగ్గరకు తీసుకురావటం, వాళ్ల గాంధర్వవివాహం, ఆ తర్వాత ఉష తండ్రికి ఈ విషయం తెలియటం, ఇంతలో కృష్ణుడు ఈ విషయం తెలిసి సైన్యాల్తో వెళ్లి యుద్ధం చేసి అనిరుద్ధుణ్ణి విడిపించుకుని తీసుకురావటం జరుగుతయ్.
ఈ కథనంలో మనం గుర్తించవలసిన కొన్ని విషయాలు – అనిరుద్ధుడికి అప్పటికే పెళ్లయింది కనుక ఉష అతని భార్యల్లో ఒకరుగా వెళ్తుందన్నమాట; రెండవది ఉష అనిరుద్ధుణ్ణి కల్లో చూడటానికి కారణం – వసంతఋతువు. అంటే ఆమె తన స్నేహితురాలి చేత అతన్ని తెప్పించటానికి కారణం యథావిధిగానే “మదనతాపం” అన్నమాట.
రంగాజమ్మ దీన్లో ఎన్నో మార్పులు చేస్తుంది. మొదటిది – అనిరుద్ధుడి పెళ్లి ప్రస్తావనే తేవకపోవటం. ఆమె కథనంలో అనిరుద్ధుడు బ్రహ్మచారే. ఇక ఉష అనిరుద్ధుణ్ణి కోరుకోవటానికి చాలా బలమైన, సంప్రదాయబద్ధమైన కారణాన్ని తయారుచేస్తుంది రంగాజమ్మ: ఆమె తండ్రి బాణాసురుడు శివుడి గురించి ఘోరతపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. వాడు శివుణ్ణి వచ్చి తన కోటగుమ్మం దగ్గర కాపలాగా ఉండమంటాడు. అలా శివపార్వతులు కోటవెలుపల తోటలో శృంగారక్రీడలో వుండగా ఉష వాళ్లని చూస్తుంది. పార్వతి ఉషని ఆదరించి, “నీకు త్వరలో వివాహం ఔతుంది, వైశాఖ శుక్ల ద్వాదశి రాత్రి నీకు ఎవరు కలలో కనిపిస్తాడో, అతనే నీకు భర్త” అని చెప్తుంది. ఆ తర్వాత మిగిలిన కథ ఒకటే. కాని ఈ రెండు మార్పులతో రంగాజమ్మ ఉష పాత్రని చాలా ఉదాత్తంగా తీర్చిదిద్దింది. ఆమె కథనం ప్రకారం అనిరుద్ధుణ్ణి ఆమె కోరుకోవటం అనేది పార్వతీదేవి వరం వల్ల జరిగిందన్న మాట. మగకవులు “వసంతకాలం వల్ల వచ్చిన మదనతాపం” గా చూపించిన కారణాన్ని ఆమె అలా దేవీవరప్రభావంగా మార్చటం సాహసం. అలాగే అనిరుద్ధుడికి అప్పటికే వివాహం అయివుండటాన్ని కూడ మార్చి వాళ్ల ప్రేమకి పవిత్రతని సమకూర్చింది.
ముద్దుపళని విషయానికి వస్తే, ఆమె రాధా-కృష్ణుల సంబంధాన్ని విష్ణులీలగా చిత్రిస్తుంది. ఆమె కథనంలో రాధ నందుడి చెల్లెలు, కృష్ణుడికి మేనత్త. అతనికన్న వయసులో పెద్దది. అతనికి శృంగారరహస్యాలు నేర్పించినది. కనుక పాఠకులు “ఈ వ్యవహారమేదో సరిగా లేదే” అనుకునే ప్రమాదం ఉంది. అందుకు విరుగుడుగా ఆమె రెండు పనులు కథ మొదల్లోనే చేసేస్తుంది – ఒకటి, రాధాకృష్ణుల లైంగికసంబంధంలో ఎలాటి రహస్యమూ లేదని, వ్రేపల్లెలో అందరికీ ఆ విషయం తెలుసునని చెప్పటం, రెండవది – కృష్ణుడు బాలరూపంలో వున్న విష్ణువని అక్కడే స్పష్టం చెయ్యటం. ఆమె వాడిన మరో సాధనం, ఆమె ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందో చూపిస్తుంది – కావ్యం అంతటా, వాళ్లిద్దరి శృంగారసందర్భం వచ్చినప్పుడల్లా కృష్ణుడిని విష్ణువుకున్న పేర్లతో సంబోధించటం. అలా, రాధ సంబంధం విష్ణువుతోనని, కృష్ణుడు కేవలం విష్ణుని మానవరూపం అని రంధ్రాన్వేషకుల్ని ముందుగానే హెచ్చరించటం అన్నమాట.
ఇలా ఈ ఇద్దరు కవయిత్రులు వరూధిని ప్రభావాన్నుంచి తమ నాయికల్ని కాపాడుకోవటమే కాదు, చేమకూర, వేంకటపతి, వేంకటకృష్ణప్పల లాగా అతివేలశృంగారకథనాలనుంచి (from erotic transgressive narrative) తమ కథనాల్ని కాపాడుకున్నారు. వాళ్ల రచనల్లో శృంగారం వున్నా (ముద్దుపళని విషయంలో అది శ్రుతి మించినట్లనిపించినా) దాన్ని సంసారపక్షంగానే ఉంచారు తప్ప విపరీతమార్గాలకు మళ్లించలేదు. ఒకమాటలో చెప్పాలంటే, మగకవులు పెద్దనని అనుసరిస్తూ తమ నాయికలు వరూధినిని మించిపోవటానికి నానాతిప్పలూ పడితే, కవయిత్రులు తమ రచనలకి పెద్దన గాలి తగలకుండా జాగ్రత్తపడ్డారు.
ముద్దుపళని గురించి మరో విశేషం — ఆధునికపూర్వ కాలంలో ఇంత స్వతంత్రంగా, విశృంఖలంగా రాసిన రచయిత్రి నాకు తెలిసినంతవరకూ భారతీయసాహిత్యంలో మరొకరు లేరు!
ఆధారగ్రంథాలు
- Söhnen-Thieme, Renate. “The Ahalya Story Through the Ages.” Myth and Mythmaking: Continuous Evolution in Indian Tradition, edited by Julia Leslie, Curzon Press, 1996, pp. 39–62.
- Doniger, Wendy. “Sita and Helen, Ahalya and Alcmena: A Comparative Study.” History of Religions, vol. 37, no. 1, 1997, pp. 21–49.
Both are available online.