విన్నకోట రవిశంకర్ కవిత్వ సంశోభ

[2025వ సంవత్సరానికిగానూ ‘ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం’ విన్నకోట రవిశంకర్‌గారికి దక్కింది. ఈ అవార్డు ప్రదానోత్సవ సభలో ఆయన కవిత్వాన్ని విశ్లేషిస్తూ ప్రధానవక్తగా దర్భశయనం శ్రీనివాసాచార్యగారు చేసిన ప్రసంగాన్ని ఈమాటలో ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. — సం.]

సభాధ్యక్షులు మృణాళినిగారు, ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మగారి పేరు మీద ఉన్న పురస్కారాన్ని ఈ సంవత్సరం అందుకుంటున్న మిత్రుడు విన్నకోట రవిశంకర్, సభలో ఉన్న ఇంద్రగంటి కుటుంబ సభ్యులు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, విజ్ఞులు, మిత్రులారా:

సభ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక “ఇవాళ ఇది అందమైన రోజు,” అని అనుకున్న సందర్భాలు కొన్ని ఉంటాయి. కానీ సభకు ముందే ప్రారంభంలోనే ఇదొక అందమైన సాయంత్రం అని, ఇదొక అందమైన జ్ఞాపకంగా ఉండిపోతుందని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. అట్లాంటి ఏర్పాటు చేసినటువంటి మోహన్‌కృష్ణగారికి, కుటుంబసభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు, అంటే నేను విన్నకోట రవిశంకర్ కవిత్వాన్ని గురించి చెప్పే ముందు ఒక స్మరణ కవిత చదువుతాను. ఈ కవిత ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు తన తండ్రి జ్ఞాపకంలో రాసింది. ఆ రకంగా మనము శ్రీకాంతశర్మగారిని స్మరించుకొని తర్వాత నా ఉపన్యాసంలోకి వెళ్దామని నా అభిప్రాయం.

ఈ కవిత పేరు “ఏరు దాటిన కెరటం”.

ఆ రోజు తెల్లవారే వేళ
లోకం తలుపు ఓరవాకిలిగా వేసి
మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్మా?
మాయ కాదు మర్మం లేదు
అంతా కళ్ళెదుట జరిగినదే.

శ్మశానంలో చితాభస్మావశేషాలని
పక్క పొదల్లోకి విసిరేసి వచ్చేసాక
చెట్టు నుంచి కాయను తెంపినప్పుడు
బహుశా చెట్టు కొమ్మకు కలిగే నొప్పి
అంతే జ్ఞాపకం.

తెల్లవారుజాము లేచీకటిలో
గుప్తంగా నందివర్ధనం చెట్టు విరగబోసినట్టు
ఆ నవ్వు గుర్తు.
ఊరు కాలువ వంపులో
కార్తీక మాసపు దొప్ప దీపాల్లాగా
ఆ పాఠాల మెరుపులు గుర్తు.

అలవి కాని కోపం వచ్చినప్పుడు
ఆ పులి కళ్ళ పదును గుర్తు
“ఏమయ్యా,” అంటూ పిలిచే
ఆ మిత్రవాత్సల్యం గుర్తు.

కొండరాళ్ళ మీద నుంచి
వర్షధారలు జారిపోయినట్టు
ఎన్నేళ్ళు గడిచాయో కదా
అయినా కొండ గొప్పు మట్టి చుట్టూ
మొలిచిన పచ్చని గడ్డి పువ్వు లాంటి జ్ఞాపకం.

జీవితంలో మీరు వదిలేసిన
ఖాళీలు పూరించడానికో,
మీ ప్రేమ వైఫల్యాలు, భువన స్వప్నాలు,
తనివి తీరని లోకాలోకనాలు సమీక్షించడానికో
బహుశా నా ఈ కొడుకుతనం.

అంతే కదా?
మీరు ఎక్కడికి వెళ్ళినట్టు?
పునర్జన్మ నిజమైతే
“ఏమయ్యా,” అంటూ
ఎవరి భుజం మీదో చేయి వేస్తూ
నడిపిస్తున్నారు కదా!

ఇది 2018లో శ్రీకాంతశర్మగారు రాసిన కవిత ఆంధ్రజ్యోతి వివిధలో అచ్చయింది. బహుశా ఆయన చివరి రోజుల్లో అచ్చు అయినటువంటి కవితల్లో ఒకటి. అంటే ఈ కవితద్వారా శర్మగారిని గుర్తు చేసుకోవడం; శర్మగారు తన తండ్రిని గుర్తు చేసుకోవడం — అంటే రెండు స్మరణలు ఉన్నాయి నిజానికి ఇక్కడ. ఇక ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే విన్నకోట రవిశంకర్ కవిత్వం గురించి నన్ను మాట్లాడమని కోరినందుకు నాకు సంతోషంగా ఉంది. ముప్పై ఏళ్లుగా అతని కవిత్వాన్ని ఇష్టంగానూ, శ్రద్ధగాను చదివాను కనుక నాకు అవగాహనాపరిథిలో ఆయన సాహిత్యవ్యక్తిత్వం ఏంటి, సాహిత్యాన్ని ఆయన ఎట్లా అర్థం చేసుకున్నాడో క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిజానికి రవిశంకర్ కవిత్వం రాసిన పద్ధతి ప్రకారం అయితే ఉపన్యాసం కూడా ఐదారు నిమిషాలే ఉండాలి. ఎందుకంటే ఆయన కవిత్వం క్లుప్తం కాబట్టి నా ఉపన్యాసం కూడా నిజంగా క్లుప్తంగా ఉండాలి. అది న్యాయం.

ఆయన ముప్పై ఏళ్లలో దాదాపుగా నూటముప్పై కవితలు మాత్రమే రాశాడు. దాంట్లో యాభై, అరవై చదవాలన్నంత అందమైన కవితలు గనుక నేను అనుకున్నట్టు నా ఉపన్యాసానికి ఐదారు నిమిషాలు సరిపోవని, నిర్వాహకులు ఎంత సమయం ఇచ్చారో అంత సేపూ మాట్లాడుదామని కోరుకుంటున్నాను. కవిత్వానికి సంబంధించి ఇలా కవిత్వం రాయాలి కవిత్వం ఇట్లానే ఉండాలి ఇది ఉంటేనే కవిత్వం అనే నిర్ధారణలు ఎవరికి వాళ్ళు చేసుకున్నవే తప్ప, సార్వకాలికంగా, సర్వజనహితంగా ఇది మాత్రం నిర్వచనం అని చెప్పిన దాఖలాలు లేవు. ఎవరెవరు జీవితాన్ని వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారు, జీవితాన్ని ఎట్లా ప్రవేశపెట్టదలుచుకున్నారు, ఎట్లా వ్యాఖ్యానించదలుచుకున్నారు… వాళ్ళ అనుభవగాఢత నుంచి ఎవరికి వాళ్ళు వాళ్ళ కవిత్వాన్ని నిర్వచించుకుంటూ వచ్చారు. ఈ రకంగా రాసే వందలాది వేలాది మంది కవుల్లో కొందరు మాత్రమే తమదైనటువంటి ప్రత్యేకముద్రతో కవిత్వం రాయగలిగారు. అట్లాంటి ఒక ప్రత్యేకమైన ముద్రతో రాసిన కొందరు తెలుగు కవుల్లో విన్నకోట రవిశంకర్ ఒకరని నా అభిప్రాయం. ఒక కవి తొలి దశలో ఒక రకంగా రాయడం, తర్వాత దశలో అందుకంటే గాఢంగా రాయడం/పేలవంగా రాయడం — ఇట్లాంటివి ఎత్తుపల్లాలు — ఇవన్నీ చాలా సహజం. అయితే, విన్నకోట రవిశంకర్ 1980లో ఏ కవిత అయితే ఎంత గాఢంగా, తనకి ఇష్టమైన పద్ధతిలో రాశాడో, ఇప్పుడు కూడా అదే ఇష్టమైన పద్ధతిలో రాస్తున్నాడు. చెప్పాలంటే ‘కన్సిస్టెన్సీ’ అని మనం ఏదైతే అంటామో, అది విన్నకోట రవిశంకర్‌లో తొలినుండి ఇప్పటిదాకా సాగుతూ ఉంది.

ఒక మాటలో చెప్పాలంటే, రవిశంకర్ వ్యక్తిగతంగా ఎలా కనపడతాడో — నింపాదిగా, నెమ్మదిగా — ఆయన కవిత్వం కూడా అట్లాగే ఉంటుంది. అక్కడ వైరుధ్యం లేదు. జీవితానికి వ్యక్తిత్వానికి కవిత్వానికి అభేదం అంటే ఇదే. అంటే కనబడటం అనే కాకుండా ఆలోచనల్లో కూడా. ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఏ ఆలోచన ఎట్లాగైతే ఉంటుందో ఆయన కవిత్వంలో కూడా అలాగే ఆలోచన ప్రసారం అవుతూ ఉంటుంది. ఇది చాలా అరుదు. కవుల ఆలోచనలకు, ధోరణులకు, వాళ్ళ కవిత్వాలకు మధ్య తేడా ఉండడం చాలామందిలో మనం చూస్తాం. రవిశంకర్ విషయంలో అట్లా జరగదు. ఆయన కవిత్వంలో ఆ దాఖలాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఒక మనిషి తన ఇష్టాలు ఏర్పరచుకొని ఆ ఇష్టాల ప్రకారం జీవించడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అట్లా జీవించడమే కాకుండా దాన్ని కళాత్మకంగా ప్రతిఫలింపచేయడం ఇంకా కష్టమైనటువంటి పని; ఈ రెండు కూడా రవిశంకర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసాడని నేను అనుకుంటాను. అసలు నిజానికి, మొత్తం మీద కళాప్రయత్నాలు అన్నీ కూడా — ఎవరో చెప్పినట్టుగా — ఫెయిల్డ్ అటెంప్ట్స్ అని అంటారు. అంటే ఎక్కడా సంపూర్ణత లేనప్పుడు, ఎంతో కొంత అసమగ్రతతోనో అసంపూర్ణతతోనో మనం మన సృజన చేస్తూ ఉంటామని దాని సారాంశం.

అయితే ఎవరి కవిత్వం అయినప్పటికీ కూడా మనం చెప్పేటప్పుడు అతని కవిత్వం ఎట్లా ఉందని ఒకటి రెండు ఉదాహరణలు చెప్పకుండా, ఆ పోకడలు ఎట్లా ఉన్నాయో చెప్పకుండా మనం అభిప్రాయాలు చెప్పడం కష్టమైన విషయం. కథా రచయితల, నవలా రచయితల విషయంలో – మొత్తం నవలలు, కథలు చదవలేము కానీ కవిత్వం విషయంలో ఒక సౌకర్యం ఏంటంటే – ఒక 20 లైన్ల కవిత చదవచ్చు. సభలో చదివి, ఇట్లా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. విన్నకోట రాసిన మొదటి కవితా సంపుటి ‘కుండీలో మర్రిచెట్టు’. అది చాలా పేరు తెచ్చింది ఆయనకు. నిజానికి, ఆ ‘కుండీలో మర్రిచెట్టు’ అన్న టైటిల్ పోయమే ఆయన రాసినటువంటి కవితల్లో చాలా విశిష్టమైనది. అది ఒక రకంగా ఇది ఆయన ప్రాతినిధ్య కవిత. రిప్రజెంటేటివ్ పోయెం. అంటే ఆయన స్థూలంగా దేని మీద రాస్తాడు? ఎట్లా రాస్తాడు? ఎట్లా నిర్వహిస్తాడు? ఆ దాంట్లో ఆ ప్రసారం ఏ రకంగా ఉంటుంది? విచ్చిన్నత ఉందా? అవిచ్చిన్నత ఉందా? దాంట్లో ఏమన్నా చెప్పదలుచుకున్నాడా? వీటన్నింటికీ ప్రాతినిధ్యం వహించే కవిత ‘కుండీలో మర్రిచెట్టు’. ఆ కవిత ఎత్తుగడతోనే దాని (బోన్సాయ్ చెట్టు) జీవితం ఎట్లా హరించుకుపోయిందో చెప్తాడు:

నిండైన దీని జీవితాన్ని
ఎవరో అపహరించారు.
దీని బలాన్ని, బాహువుల్ని,
వేళ్ళని, వైశాల్యాన్ని,
నింగిని అటకాయించే నిర్భయత్వాన్ని,
ఎవరో
నిర్దయగా, నెమ్మదిగా,
అందంగా అపహరించారు.

చాలా పారడాక్స్ కదా? అందంగా అపహరించడం అంటే.

గాలి సమ్మెటల్తో బాదినా
చెక్కుచెదరని దీని స్థైర్యాన్ని,
వేలికొసల తాకిడికి
తలవంచే వినయంగా మార్చారు.

ఇక్కడి ఈ జీవితమే
అందంగా, ఆకర్షణీయంగా ఉంటుందని
అమాయకంగా దాన్ని నమ్మించారు.

పచ్చదనంతో,
రెపరెపలాడే జవసత్వాలతో,
వందయోజనాలు,
వేయి ప్రయోజనాలుగా
విస్తరించవలసిన దీని జీవిత సామ్రాజ్యాన్ని,
కుండీలో,
రెండు పిడికిళ్ళ మన్నులో,
నీటికై వెదుకాడే కళ్ళలోకి
కుదించారు.

నిండైన దీని జీవితాన్ని
ఎవరో అపహరించారు.

మంద్రంగా ప్రవహించే ఈ కవిత్వ లక్షణం రవిశంకర్ కవిత్వమంతటా కనిపించే ముద్ర. సాధ్యమైనంతవరకు తను చెప్పదలుచుకున్న ఆలోచనలన్నిటిని సారాంశంగా వడకట్టి అతి తక్కువ పదాలతోని చెప్పాలనే ప్రయత్నం రవిశంకర్‌లో కనబడుతూ ఉంటుంది. విస్తరించి చెప్పడం ఒక పద్ధతి. విస్తరించి చెప్పడంలో కళాత్మకత లేదా కళా నైపుణ్యం లేదా అంటే ఉంది, అదొక రకమైన నైపుణ్యం అని చెప్పవచ్చు. అయితే, విస్తరించకుండా క్లుప్తంగా సాంద్రంగా చెప్పడం ఇదొక కళాత్మకత. కళాత్మకత ఒకే రూపంలో ఉంటుందని చెప్పలేం. ఎలా చెప్పినప్పటికీ కూడా కళానైపుణ్యం, ఆ శక్తి ఉందా లేదా అనేది ముఖ్యం. కానీ రవిశంకర్ తను క్లుప్తత వైపు, గుప్తత వైపు, ఆ సాంద్రత వైపే దారి ఎంచుకున్నాడు. ఎంచుకొని దాంట్లో సాధన చేశాడు. సాధన చేశాడు, కనుకనే ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి ధాటి తగ్గకుండా తాను ఈ కవిత్వాన్ని రాసుకుంటూ వచ్చాడు.

అయితే ఇంతకుముందు చెప్పారు మృణాళినిగారు, ఈ సామాజిక సిద్ధాంతాలకు, దానికి సంబంధించినటువంటి వాటికి కాకుండా, వ్యక్తి స్థాయిలో ఆలోచనలు అన్నిటిని రాసినవాడు రవిశంకర్ అని. నిజమే. రవిశంకర్ ఒక వ్యక్తికేంద్రంగా వ్యక్తి అంటే ఏంటి? వ్యక్తి జననం ఎట్లా ఉంటుంది? జీవితం ఎట్లా ఉంటుంది? ఎట్లా బాధపడతాడు? ఎందుకు బాధపడతాడు? బాధపడేటప్పుడు ఆలోచనలు ఎట్లా ఉంటాయి? ఆనందం ఎట్లా ఉంటుంది? అసలు మనిషి అంటే ఏంటి? జీవితం అంటే ఏంటి? మనిషి ఎట్లా మరణిస్తాడు? మరణించిన తర్వాత ఏమవుతుంది? ఈ రకమైనటువంటి ఒక వ్యక్తి చుట్టూ ఆలోచనలన్నీ కూడా అతని కవిత్వపరిధి. అయితే ఆయనలో ఉన్నటువంటి ఆ మాంత్రికత ఏంటి? అసలు ఆయన కవిత్వం మామూలు పదాలతోనే రాస్తాడు కదా. ఇంతకు ముందు వినిపించిన కవితలో ఎక్కడా నిఘంటువులు చూసుకోవాల్సిన శబ్దం ఒక్కటి కూడా లేదు. మరి ఆయన శక్తి ఎక్కడ ఉంది? అంటే తెలిసిన పదాలూ, తెలిసిన అర్థాలే, కానీ వాటిని సంయోజనం చేయడంలోనే ఉంటుంది కవి ప్రత్యేకత. తెలిసిన పదాల సంయోజనంలోనే మాంత్రికత ఉంటుంది. ఈ సంయోజనంలోనుండి చాలా శక్తిని తీసుకురావడం ప్రతిభావంతుడైన కవి చేస్తాడు. అంటే ఒక పదానికి ఉన్న శక్తి మళ్ళీ రెండో పదానికి ఉన్న శక్తి, రెండు కలిపితే సాధారణకవితల్లో ఈ శక్తుల కూడిక జరుగుతుంది. కానీ రవిశంకర్ రాసే కవిత్వంలో ఈ పదాల యొక్క శక్తులు మల్టిప్లై అవుతాయి. ఉదాహరణకి ఇక్కడ నేను చెప్పినటువంటి కవితలో ఆయన ఎంతో సౌందర్యాత్మకమైన పదాలను ఉపయోగిస్తూనే, అత్యంత క్రూరమైన, దుర్మార్గమైన విషయాన్ని ఎత్తిచూపాడు. ధ్వంసమైపోతున్న సౌందర్యాన్ని గురించి చెబుతూనే, అత్యంత సుకుమారమైన శబ్దాలను వాడటం వల్ల ఆ కవితా వస్తువు మనల్ని మరింత గాఢంగా తాకుతుంది. ఇటువంటి విరుద్ధమైన పద, భావ సంయోజనం వల్లనే ఆయన కవిత్వానికి అసలైన బలం చేకూరుతుంది.


‘కుండీలో మర్రిచెట్టు’ ఆయన రాసినటువంటి కవితల్లో విశిష్టమైంది. అయితే పద్యం ఎట్లా వస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన తనదైన శైలిలో వివరించాడు. పద్యం కోసం ఏం కావాలో అల్లసాని పెద్దన చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న చాటువు తెలుగువారికి తెలుసు. “నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురవిడెము,” అంటూ ఇలాంటి విలాసవంతమైనటువంటి భోగ వస్తువులు ఉంటే అప్పుడు కవిత్వం అద్భుతంగా వస్తుంది అని చెప్పాడు. కానీ పద్యం కోసం ఏం కావాలో రవిశంకర్ తన కవితలో ఒకసారి చెప్పాడు.

ముందుగా మౌనం కావాలి
నిరంతరం ఫౌంటెన్లా ఎగజిమ్మే ఆలోచనలు
ఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవాలి.

ఇస్మాయిల్ అనే మాట వినగానే మనకు బాగా గుర్తుకు వచ్చే మొదటి పదం నిశ్శబ్దం. నిజానికి, ఇస్మాయిల్‌కు చాలా సమానార్థకమైన శబ్దం నిశ్శబ్దమేనని నా అభిప్రాయం. ఇస్మాయిల్‌గారి తాత్త్వికతకు చాలా దగ్గరైన కవి విన్నకోట రవిశంకర్. అతను పద్యం కోసం ఒక కవిత రాసేటప్పుడు దాని మొదటి లైన్లోనే నిశ్శబ్దాన్ని తెచ్చుకున్నాడు. “ముందుగా మౌనం కావాలి” అంటాడు తప్ప కవిత రాయాలంటే మంచి పద్యం రాయాలంటే అల్లసాని చెప్పినట్టు బ్రహ్మాండమైన సరంజామా కావాలని చెప్పట్లేదు ఈ కవి.


గత వర్తమానాల మధ్య
లయాత్మకంగా ఊగేందుకు
మనసొక తూగుటుయ్యాల కావాలి.

ఒక కన్నీటికణం బరువుకి
చిగురుటాకులా ఒరిగిపోవాలి.
ప్రపంచభారం మొత్తాన్ని
అట్లాస్‌‌లా భుజాలకెత్తుకోవాలి.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. సామాజిక ఘర్షణలు, సామాజిక సంవేదనలు తెలియకుండా, ఒక వ్యక్తిని గురించి చెప్పగలరా ఎవరైనా? ఒక కవి ఒక వ్యక్తి గురించి చెప్పాడనుకుందాం. ఆ వ్యక్తి ఆలోచనలు పూర్తిగా అర్థం కావాలంటే, అతను ఏ సమాజంలో ఉన్నాడన్నది అర్థమైతేనే ఆ కవి చెప్పగలడు. అందుకనే మొత్తం ప్రపంచాన్ని విడదీసి “ప్రపంచంతో సంబంధం లేదు, నేను వ్యక్తినే పట్టుకుంటున్నాను” అని రాసిన కవిత్వం కాదు రవిశంకర్ కవిత్వం. ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూనే “నేను ఈ రకమైన ఆలోచనల మీద కవిత్వం రాయదలచుకున్నాను” అని నిర్దేశించుకున్న వ్యక్తి విన్నకోట రవిశంకర్. అందుకే ఏమన్నాడు ‘ప్రపంచ భారం మొత్తాన్ని అట్లాస్‌‌లా భుజాలకెత్తుకోవాలి’ అని. దీని తర్వాత ఒక మంచి మాట చెప్పాడండి, నాకు చాలా ఇష్టమైన మాట.


అప్పటివరకు వాడిన
సకలాలంకారాల్నీ
స్వచ్ఛందంగా పరిత్యజించాలి.
ఒక కొత్త అందం కోసం
కొత్త చూపుతో అన్వేషణ సాగించాలి.

‘అప్పటివరకు వాడిన సకల అలంకారాలని స్వచ్ఛందంగా పరిత్యజించాలి’ అన్నాడు. ఇది చాలండీ! మనకు కొన్ని మమకారాలు ఉంటాయి. కొన్ని మాటల మీద, కొన్ని అలంకారాల మీద, కొన్ని పోలికల మీద, కవులందరికీ వ్యామోహాలుంటాయి. ఏది రాయబోయినా అవే వస్తుంటాయి. ఆ మాటలే ముందు వస్తాయి. ఒక కొత్త కవిత తాజాగా అప్పుడే పూసిన పువ్వు లాగా రావాలంటే ముందుగా కవి అంతకు ముందు వాడిన అలంకారాలను వదులుకోవాలి. ఇది 80%-90% శాతం వరకు రవిశంకర్ పాటించాడు. నూటికి నూరుపాళ్ళు అనట్లేదు. ఎందుకంటే ఈ కవికి కూడా తనకు తెలియకుండానే కొన్ని పదాలమీద వ్యామోహం ఉంది. ఉదాహరణకు, “పారిజాతం”, “పారిజాతం” అంటూ రెండు మూడు చోట్ల ఆయన వాడాడు. అందుకే నూటికి నూరుపాళ్ళని చెప్పలేదు. “పారిజాతం” అనే మాట రవిశంకర్ వ్యామోహమే. కానీ ఆయన ఆ చెప్పిన విషయం ఏమంటే “అప్పటివరకు వాడిన సకల అలంకారాలని స్వచ్ఛందంగా పరిత్యజించాలి”. అంటే, ‘పారిజాతం’ అని గుర్తుకు వస్తే, ‘బాబూ! నేను ఇంతకుముందే వాడాను మళ్ళీ వాడొద్దు,’ అని అనుకోవాలన్నమాట. ఒక కొత్త అందం కోసం కొత్త చూపుతో అన్వేషణ సాగించాలి.


వర్షాగమనానికి సిద్ధమై
ప్రకృతి మొత్తం స్తంభించినట్టు
కవిత్వ సేచన కోసం
నవనాడులూ సమాయత్తం కావాలి.

‘వర్షాగమనానికి సిద్ధమై …’ అబ్బా, ఎంత బాగా చెప్పాడండి! వర్షాగమనానికి సిద్ధమై ప్రకృతి మొత్తం స్తంభించినట్టు కవిత్వ సేచన కోసం నవనాడులూ సమాయత్తం అయితేనే, అప్పుడు వస్తుందండీ కవిత.

వేచి ఉన్న కారుమబ్బుల దొంతరల్ని
ఒక మెరుపు విప్పుతుంది.

వేచి ఉండటం తెలుసు, కారుమబ్బులు తెలుసు. కానీ ఈ రెండింటితో జతచేసి మెరుపు విప్పుతుంది అని చెప్పడం గొప్ప. రెండు మాటలు మనకు తెలిసిన మాటలే. కానీ, ఈ పదాల సంయోజనం ఇదివరకు ఏ కవి చేయనిది. నేను మీకు ఇదివరకే వివరించినట్టు, ఈ రకమైన పదసంయోజనం నుండే తన కవిత్వంలో శక్తిని సాధిస్తాడు రవిశంకర్.

వేచి ఉన్న కారు మబ్బుల దొంతరల్ని
ఒక మెరుపు విప్పుతుంది.
కాంతి కనుగొన్న దారిలోకి
వెనువెంటనే శబ్దం ప్రవేశిస్తుంది.

ఎంత జాగరూకతతో కవి రాస్తాడో చూడండి. ఈ కవిత మొదటి పాదంలో మౌనం గురించి చెప్పాడు. ఈ కవిత చివరి పాదంలో శబ్దం గురించి చెప్పాడు. మొదటి పాదంలో ముందుగా మౌనం కావాలి అన్నాడు. చివరి పాదంలో వెలుగు, వెంటనే శబ్దం ప్రవేశిస్తుంది అన్నాడు. అంటే మౌనం నుంచి శబ్దం వరకు ఉండేటువంటి ప్రయాణాన్ని తన కవితలో చెప్పాడు.అంటే సంక్షిప్తత ఉంటుంది, కానీ చెప్పదలుచుకున్న విపులత కూడా ఉంటుంది. ఆ విపులతను అతి తక్కువ శబ్దాలతో వివరించడానికి కావలసిన సాధనే విన్నకోట రవిశంకర్ ప్రయాణం. దీంట్లో మంచి కవిత రాసే విధానం, దానికి కావల్సిన లక్షణాలు, సాధన — అన్ని ఉన్నాయి.


తల్లి గురించి రవిశంకర్ రాసిన కవిత నేను ఇక్కడ వినిపించదలచుకున్నాను. తల్లి గురించి చాలా మంది రాశారు కదా, కానీ ఈయన ఎలా ప్రత్యేకంగా చెప్పాడు తన తల్లి గురించి?

అమ్మా, నీ జ్ఞాపకం
ఫొటోలా దుమ్ము పడుతోంది.

ఒకప్పుడు
వేల చిత్రాలై
నన్ను ఉక్కిరిబిక్కిరిచేసిన జ్ఞాపకం
అంతులేని చలన చిత్రమై
నా కళ్ళల్లో కదలాడిన జ్ఞాపకం
ఒకే ఒక గమనింపబడని పటంగా మారి,
మనసులో
ఏ మారుమూల గోడకో వ్రేలాడుతోంది.

అనుక్షణం
ఆకాశంలా నోరు విప్పిన జ్ఞాపకం
ఇప్పుడు
ఏ మాటల మంత్రధ్వనికో
గుహతలుపులా తెరుచుకొంటోంది.

ఒకప్పుడు జలపాతంలా
కళ్ళల్లోంచి ఉరికిన జ్ఞాపకం
అపుడపుడు ఒక అశ్రుకణం మాత్రమై,
కనుకొనల్లో నిలుస్తోంది.

నీ మాటై, నీ చూపై, నీ నడకై
విశ్వరూపం దాల్చిన జ్ఞాపకం
ఎప్పుడో నీ గురించిన మాటగా
మరుగుజ్జు రూపంలో దర్శనమిస్తోంది.
మృత్యువు నీ స్పర్శతో
తన మార్మికతను కోల్పోయింది.

“మృత్యువు నీ స్పర్శతో తన మార్మికతను కోల్పోయింది” అన్నది చాలా గాఢమైనటువంటి వాక్యం. రవిశంకర్ కవిత్వంలో ఒక్కో పాదము కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు యోచింపచేసేలా ఉంటుంది. అలాంటి వాక్యం ఇది. వెంటనే అర్థమైనట్టు అనిపించినా, దీని అర్థం వెంటనే చెప్పలేము. దీన్ని చాలా కాలం మననం చేసుకోవాలి. ఇది గొప్ప కవిత్వంయొక్క లక్షణం. ఏది గొప్పగా మననయోగ్యం అవుతుందో అది గొప్ప కవిత్వంగా భాసిస్తుందని చాలామంది చెప్పిన మాట. దాన్ని ఇంకా పొరలు, పొరలుగా ఎంతైనా అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు మాకది
జీవితంలో భాగంగా అలవాటైపోయింది.
అందుకే, నీ గురించిన జ్ఞాపకం
మరణించినా కూడా,అమ్మా,
అది మేం గమనించమేమో !

ఇది ఒకసారి వినగానే అర్థమైనట్టు ఉంటుంది, కానీ పూర్తిగా అర్థంకాదు. అయితే అది ఆ రవిశంకర్ స్వభావంలోనే ఉందేమో. ఆయన మాట్లాడుతున్నప్పుడు మాటతో పాటు ఆయన ఆలోచన కూడా దానితోనే వస్తున్నట్లుగా ఉంటుంది. ఒక కవిత రాసినప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటామో ఆయన మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా అంతే శ్రద్ధ పాటిస్తాడు. ఆ నిదానం కూడా అట్లాంటిది. అందుకనే ఆయనే తను చెప్పుకున్నాడు:

మూత విప్పగానే
అత్తరులా గుభాళించడం
నాకు తెలియదు

తలుపు తీయగానే
ఏసీలా ఊహించని స్నేహపు చల్లదనంతో
ఉక్కిరి బిక్కిరి చేయడం నాకు తెలియదు
నాకు చేత కాదు.

మరి ఎట్లా?

శిల్పి తన శిల్పాన్ని తెలుసుకున్నట్టుగా
నెమ్మది నెమ్మదిగా
నన్ను తెలుసుకోవాలి

అని ఆ తన నెమ్మదితనాన్ని తన మాటలోనే తను చెప్పాడు.


బహుశా మొత్తం విన్నకోట రవిశంకర్ సాహిత్య జీవితంలో చాలా అందమైన అర్ధవంతమైనటువంటి కవితలో ఒకటిగా చెప్పదలుచుకున్న ఒక కవితను ఇప్పుడు వినిపిస్తాను దాని పేరు ‘రెండోపాత్ర’. అదే శీర్షికను ఇష్టంగా తన పుస్తకానికి కూడా పేరుగా పెట్టుకున్నాడు ఆయన. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలి. రవిశంకర్ కవిత్వంలో దాదాపు 80 శాతం కవితల్లో సర్జికల్ ప్రిసిషన్ ఉంటుంది. శస్త్రచికిత్స చేసేటప్పుడు వైద్యుడు ఒక సెంటీమీటర్, ఒక మిల్లీమీటర్ — ఎంత భాగం ఉండాలో నిర్ణయించుకొని ఆ మేరకే కత్తిరించాలి. అంతకంటే ఎక్కువగా కత్తిరిస్తే దేహానికి కూడా నష్టం. అందుకే సర్జికల్ ప్రిసిషన్ అంటారు దాన్ని. అదే సర్జికల్ ప్రిసిషన్ రవిశంకర్ ఎక్కువశాతం కవితల్లో కనబడుతుంది. అంటే ఈ కవితల్లో ఏ పదం తీసేయాలని మనం ఆలోచించినా, ఏదో ఒక రకమైన శబ్దభంగమో, అర్థభంగమో జరుగుతుంది, ఆ పదం గనుక తీసేస్తే. అట్లాంటి సర్జికల్ ప్రెసిషన్ ఉన్న పోయెం ఈ ‘రెండో పాత్ర’.

ఒక తల్లి, భార్య కూడానూ. అంటే ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తలతో పాటు ఒక పాప ఉన్నప్పుడు ఆ స్త్రీకి రెండు పాత్రలు. తన భార్య పాత్ర, తన బిడ్డకు తల్లి పాత్ర. ఈ రెండు పాత్రల్ని ఒక కవితగా చెప్పడం ఎట్లా ఉంటుంది? ఒక బాధ్యత, ఒక ప్రేమ — ఈ రెండింటిని ఎట్లా సంయోజనం చేయొచ్చు?

రెండోపాత్ర

పాపను పడుకోబెట్టినపుడు
తనపై పరుచుకున్న నిద్రని
దుప్పటిలా తొలగించివచ్చి
ఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడింది.

పాపను పడుకోబెట్టినప్పుడు
తనపై పరుచుకున్న నిద్రను
దుప్పటిలా తొలగించి వచ్చి
ఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడింది.

కళ్ళకి అక్కడక్కడా అంటుకొనున్న కలని
కాసిని చన్నీళ్ళతో కడిగింది.

కళ్ళకి అక్కడక్కడ అంటుకున్న కలని — ఇవన్నీ మనకు తెలిసిన పదాలే. కానీ కళ్ళకు కలలు అంటుకుంటాయా? అదీ — అక్కడక్కడ అంటుకుంటాయా? కళ్ళకి అక్కడక్కడ అంటుకున్న అంటుకున్న కలలను కాసిని చన్నీళ్లతో కడిగిందట.

పాపచేతినుంచి విడిపించుకున్న తన అస్తిత్వాన్ని
తిరిగి నడుముకు చుట్టుకుంది.
పాప ఇల్లంతా పరచిన దాని ప్రపంచాన్ని
ఒద్దికగా ఒకచోట సర్దింది.
ముడిపెట్టిన శిరోజాల్లాంటి తన ఆలోచనల్ని
సున్నితంగా విడిపించి పరుచుకుంది.

రెండు వేరు వేరు భావాల్ని ఒకే పంక్తిలో ఎట్లా ఒదిగిస్తాం? శిరోజాలని విడిపించడం, తర్వాత ఆలోచనల్నీ — ఈ రెండింటిని — కలిపి సంయోజనం చేయటంలోనే ఉంది గొప్పతనం.

పాపచుట్టూ పరిభ్రమించిన
తన సర్వశక్తుల్నీ
తిరిగి తనవైపుకు తిప్పుకుంది.

కొన్ని కొన్నిటికి నిజానికి వ్యాఖ్యానం చేయకపోతే బాగుంటుంది. ఇంకా అయిపోలేదు వినండి.

పాప ఆకర్షణలో కరిగిపోయిన
తన ఆకర్షణల్ని
ఒకటొకటిగా తిరిగి సమకూర్చుకుంది.

పాప ఆకర్షణలో కరిగిపోయిన తన ఆకర్షణల్ని ఒకటొకటిగా తిరిగి సమకూర్చుకుంది. ఇక నాకు చాలా ఇష్టమైన చివరి పంక్తి చివరి పాట వినిపిస్తాను:

పగలంతా పాల వాసనవెంట
పరుగులెత్తిన ఈమె
సగంరాత్రివేళ పారిజాతమై పరిమళిస్తుంది.

ఇన్నిన్ని ఆలోచనలను, ధారలను అతి తక్కువ పదాలతో చెప్పడం చాలా కష్టము. చెప్పొచ్చు. శక్తి లేకపోతే దేనికి అది ఒక శకలం అయిపోయి విచ్ఛిన్నం అయిపోతుంది. కానీ రవిశంకర్ ఒక ధార క్రియేట్ చేస్తాడు వాటికి అంటే ఎక్కడ తెగిపోకుండా ఒక ధారను క్రియేట్ చేయడం అనేది కవిత్వంలో కూడా చాలా గొప్ప లక్షణం. భావధార, శబ్దధార కలిసి సాగడమే అవిచ్ఛిన్నత.


మనము అబ్బాయో అమ్మాయో పుట్టినప్పుడు ఇది తాత పోలిక, తండ్రి పోలిక, అమ్మమ్మ పోలిక, నాయనమ్మ పోలిక అని అనుకోవడం మన సమాజంలో ఉంది. మరి అన్ని సమాజాల్లో దేశాల్లో ఉందో మనకు తెలియదు కానీ మన సమాజంలో అయితే పుట్టగానే మొదటి ప్రశ్న అదే ఉంటుంది — ఎవరి పోలిక? ఆ విషయమై కొట్టుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఆ పోలికల గురించి ప్రత్యేకంగా రవిశంకర్ ఒక కవిత రాశాడు.

దారితప్పిన ఒక జ్ఞాపకాన్ని
ఈ పసిపిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చింది
గతకాలపు చీకటిగదిలో పారేసుకొన్న ఒక విలువైన అనుభవాన్ని
అతి సహనంతో ఇది వెతికి తెచ్చింది.

ఎన్నాళ్ళక్రితమో బూడిదగా మారి
నీళ్ళల్లో కలిసిపోయినవాళ్ళు
దీని పాలబుగ్గల్లోంచి మళ్ళీ పలకరించారు

పటాలుగామారి, కాలంలో
ఒకచోట నిలిచిపోయిన వాళ్ళు
దీని పసికళ్ళల్లో సజీవంగా కదిలారు.

ఎంతమంది గతించినవాళ్ళ ఆనవాళ్ళని
ఇంత చిన్ని శరీరంలో దొంతర్లు దొంతర్లుగా దాచిందో
ఇది వాళ్లందరూ ప్రేమతో సంతకాలుచేసి పంపిన
బుల్లి ఆటోగ్రాఫ్ బుక్ లాగ ఉంది.

వివరణకందని దీని చిన్ని పెదవులమీది చిరునవ్వు
తమకు లభించిన ఈ కొనసాగింపుకి
వాళ్ళు తెలిపే అంగీకారం కావచ్చు
మూసిన దీని గుప్పిట్లో దాచిఉంచింది
విప్పిచెప్పలేని వాళ్ళ సందేశం కావొచ్చు


వసంతం, వసంతోత్సవము, వసంత సంరంభము ఈ మాటలు మనం సాహిత్యంలో విన్న మాటలే. కానీ, తెలుగు సాహిత్యంలో వసంత సమరం ఒక కొత్త పదబంధం. వసంత సమరం ఏంటి? వసంతానికి, యుద్ధానికి ఏమిటి అసలు సంబంధం? అంటే వృక్షాలు యుద్ధానికి సిద్ధమైనట్టుగా, వసంతం వస్తుందంటే ఆ సంరభం కూడా అట్లా ఉంటుందంట. నిజానికి విన్నకోట రవిశంకర్ కవిత్వంలో దాదాపు మూడో వంతు కవిత్వం ప్రకృతి గురించే ఉంటుంది: చెట్ల గురించి, చేమ గురించి, గాలి గురించి, వాన గురించి, మంచు గురించి, వీటన్నిటి గురించి. ఇది ఇంత ఎక్కువ వినిపించడానికి కారణం ఈయన అమెరికా జీవితం కూడా. అమెరికాలో ప్రత్యేకంగా చెట్లు, చేమలు చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ వసంతంలో ఎక్కడ చూసినా పచ్చదనం. చలికాలంలో ఎక్కడ చూసినా మంచు. అందుకనే ఆయన తన కవిత్వంలో ఈ చెట్ల మీద ఎక్కువ ధ్యాస పెట్టడానికి, మంచు మీద ధ్యాస పెట్టడానికి, వాన మీద పెట్టడానికి ఆ ప్రవాసజీవితం ఒక కారణం అనుకుంటున్నాను. ఆయన ఎంత దాకా పోతాడు అంటే, వాన అయితే ఒక బోళాపిల్లలాగా కనపడుతుందట. బాగా శబ్దం చేస్తుంది కదా వాన. మంచు మాట్లాడదు కదా. “మంచు ఇంకా మాటలు రాని ముగ్ద మోహనపు ముద్ద” అని అంటాడు. నిజానికి మంచును కూడా మానవీకరణ చేసేంతదాకా వెళ్ళాడు ఆయన. చెట్ల గురించి చాలా చాలా కవితలు రాశాడు. ఇక్కడ నేను ఒక కవితను మాత్రం ఉదాహరిస్తాను తన చెట్లను ఎట్లా ట్రీట్ చేస్తాడు అని చూపడానికి.

అక్కడెక్కడో వసంతం అడుగులు వినబడితే చాలు,
యిదే అదనని యిక్కడి చెట్లన్నీ
అకస్మాత్తుగా యుద్ధం ప్రకటిస్తాయి.

నిన్నటిదాకా చడీచప్పుడూ లేకుండా,
తెల్లారేసరికల్లా యింటినిచుట్టుముట్టిన
సైనికుల్లాగా ఉంటాయి.

అప్పుడెప్పుడో ఆకులుగా రాల్చుకున్న రంగుల్ని
పువ్వులుగా తిరిగి సమకూర్చుకుంటాయి.
రేకులతో ఆకర్షిస్తూనే
పుప్పొడితో ఊపిరితిత్తుల్ని
ఉక్కిరిబిక్కిరిచేస్తాయి.

ఇప్పుడు ప్రతి చెట్టు
అజ్ఞాతవీరులు తన దగ్గర దాచిన ఆయుధాల్ని
తానే ధరించి నిలచిన
జమ్మిచెట్టులా ఉంటుంది.

ఆయుధాలే అలంకారాలుగా చేసుకొని
వింతతేజస్సుతో వెలిగే
అమ్మవారిలా ఉంటుంది.

సౌందర్యం వెనుక
సదా దాగిన ప్రమాదాన్ని
సర్వాంగసుందరంగా సంకేతిస్తుంది.

ఏటేటా ఎదురయ్యే ఈ సంరంభానికి వెరసి,
వసంతాగమనంతో
ఒక కన్ను సంతోషించినా,
ఒక కన్ను దుఃఖిస్తుంది.

అని చెట్లకు సంబంధించి చాలా రాసినటువంటి రవిశంకర్ కవిత్వంలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

ఇటీవల అంటే ఈ 30 ఏళ్ళ ప్రయాణం తర్వాత తన అమ్మాయి వివాహం చేసిన సందర్భంలో తాజాగా రవిశంకర్ రాసిన కవిత ఏ రూపం తీసుకుంది? ఈ 30 ఏళ్ళ అనుభవం దాంట్లోకి వచ్చిందా? అన్న విషయాలను పరిశీలించడానికి ఇంకో కవితను చూద్దాము. ఈ కవిత ఆంధ్రజ్యోతి వివిధలో 2024లో వచ్చింది. తన అమ్మాయి వివాహ సందర్భంగా రాసింది దాని పేరు కన్యాదానం. దాంట్లో మొదటి పంక్తే నాకు చాలా ఇష్టం. “ఇప్పుడు ఈమె సర్వస్వతంత్ర.”

కన్యాదానం

ఇపుడీమె సర్వస్వతంత్ర
తన రూపసౌష్టవాలను తానే ఎంచుకొని
తన రెక్కలకు తానే పరిమళం అద్దుకొని
తెల్లని వెన్నెలలో వికసించిన రంగుల కలువ.

గూటిలో ఒదిగినప్పటి గువ్వతనం వదిలి
తన రెక్కలలో తానే బలం నింపుకొని
తన స్వరాన్ని తానే శ్రుతి చేసుకొని
అపుడపుడు అందంగా పలకరించే వసంతకోకిల.

కనకసంపన్న కాకపోయినా
తన ఆశలు, ఆశయాలే
ఆభరణాలుగా ధరించిన
అపరంజి బొమ్మ.

ఇవ్వటం పుచ్చుకోవటం
ఒక వేడుక మాత్రమే!
తన సర్వస్వమూ తనకే సొంతం.

ఇపుడీమె
తన దారిని తానే నిర్మించుకొని
తన జీవితాన్ని తానే నిర్వచించుకొని
ఏనాడో బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన
పరిపూర్ణ మహిళ!

తను కోరుకున్న సంసారనౌక లోనికి అడుగుపెట్టడానికి
నా చేతిని ఊతగా అందించి
ధన్యమౌతాను.

అప్రయత్నంగా, అతిసహజంగా తలెత్తే
అన్ని భయసందేహాలను
కనురెప్పల క్రిందే అదిమిపెట్టి
తన కలల తీరానికి తప్పక చేరాలని
మనసులోనే మరీమరీ కోరుకొని
నెమ్మదిగా చెయ్యి ఊపుతూ
ఈవలి ఒడ్డునే నిలిచిపోతాను.

సాధారణంగా విన్నకోట రవిశంకర్ కవిత్వంలో ఒక నిశ్చయాత్మకత (assertiveness) ఉంటుంది. తన ఆలోచనలో డోలాయమానం చాలా తక్కువ నిజానికి. ఒక ఊహ చేసినప్పటికి కూడా దాన్ని నిశ్చయాత్మకంగా చేయడం అనే పద్ధతి పాటిస్తాడని నాకు అర్థమయింది. ఈ కవితలో ఇప్పుడు ఈమె సర్వస్వతంత్ర అని, తన రూప సౌష్టవాలను తానే ఎంచుకొని తన రెక్కలకు తానే పరిమళం అద్దుకొని తెల్లని వెన్నెలలో వికసించిన రంగుల కలువ అని వివరిస్తూ, ఇవ్వడం పుచ్చుకోవడం ఒక వేడుక మాత్రమే అని చెప్పి, తర్వాత చాలా మంచి వాక్యం చెబుతాడు. చాలా అసెర్టివ్ గా. “తన సర్వస్వము తనకే సొంతం” ఒక తండ్రి తన కూతురి విషయంలో ఎలా చెప్తున్నాడు! అల్లుడి గురించి “తన సర్వస్వము తనకే సొంతం” అని ఇప్పుడు ఈమె ఇప్పుడు ఈమె తన దారిని తానే నిర్మించుకొని తన జీవితాన్ని తానే నిర్వచించుకొని ఏనాడో బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన పరిపూర్ణ మహిళ.” తను కోరుకున్న సంసార నౌకలోనికి అడుగు పెట్టడానికి నా చేతిని ఊతగా అందించి ధన్యమవుతాను. ఊహ చేసినా, విన్నకోట రవిశంకర్ వాస్తవ స్వరాన్నివ్వడానికి ఆయన చాలా చోట్ల ప్రయత్నం చేస్తాడు. అప్రయత్నంగా అతి సహజంగా తలెత్తే అన్ని భయసందేహాలను కనురెప్పల క్రిందే అదిమి పట్టి తన కలల తీరానికి తీరానికి తప్పక చేరాలని మనసులోనే మరీ మరీ కోరుకొని. “అప్రయత్నంగా అతి సహజంగా ఒక తండ్రిగా తలెత్తే అన్ని భయ సందేహాలను కను రెప్పల క్రిందే అదిమి పెట్టి” అన్న దగ్గర మనకు ఈ వాస్తవాభివ్యక్తి కనిపిస్తుంది. తన కలల తీరానికి తప్పక చేరుకోవాలని మనసులోనే మరీ మరీ కోరుకొని నెమ్మదిగా చెయి ఊపుతూ ఈవలి ఒడ్డునే నిలిచిపోతాను అని కన్యాదాన విషయంలో ఆయన.


ఒక కవిత చదివి ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఈ కవితావస్తువుతో చాలా తక్కువ మంది రాశారు. ఇంత సోషల్ మీడియా ఇంతగా విస్తరించిన రోజుల్లో ఎవరిదీ వ్యక్తిగతం అంటూ మిగలదనుకునే ఒకానొక అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో నిజానికి ఎంత అభివృద్ధి చెందిన నాగరిక సమాజంలో కూడా మనిషికి తనకంటూ ఒక వ్యక్తిగతం ఉంటుంది. దానిలోకి అతని అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించకూడదని మనం కోరుకుంటాం. “అట్లాంటి వ్యక్తిగతంలోకి ఎవరు ప్రవేశించొద్దు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది.” అనేటువంటి ఒక ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని రవిశంకర్ రాసిన ‘వ్యక్తిగతం’. చాలా క్లియర్‌గా మొదటి వాక్యంలోనే ‘కొన్నిటిని స్పృశించనే కూడదు’ అని చెబుతాడు.

వ్యక్తిగతం

కొన్నిటిని సృృశించనే కూడదు.
ముడుపుకట్టి దాచుకున్న చిరుమూటెడు దుఃఖాన్ని
యితరులెవరూ విప్పి చూడకూడదు.
మనసు గదిలో ఒక రహస్య జ్ఞాపకాన్ని
అతి జాగ్రత్తగా పదిల పరచిన అరని
పొరపాటున కూడా తెరవకూడదు.

ఏ నాటి డైరీలోనో ఒత్తిగిలి, నలిగిన
ఒక వికసించని ఆశల మొగ్గను
చటుక్కున తీసి ఆఘ్రాణించకూడదు.

ఎవరైనా, ఏ బలహీన క్షణంలోనైనా ఒకసారి,
ఈ తెరను తొలగించినా,
ఏమరపాటున జారిన పైబట్టని
మరల వెనువెంటనే సవరించుకున్నట్టు
మరుక్షణంలోనే తమనుతాము సర్దుకొంటారు.
తమదే అయిన దుఃఖనిధి నుంచి
అశ్రువులు జారిపడకుండా పదే పదే కన్నులొత్తుకుంటారు.

దానినక్కడ వదిలెయ్యటమే మంచిది.
అరుదుగా గుక్కెడు దాహాన్ని మాత్రం తీరుస్తూ,
ఏ ప్రతిబింబమూ చూపించలేని
లోతైన ఒక నూతిలోనికి
తొంగి చూడకపోవటమే మంచిది.

తన శక్తి రవిశంకర్‌కు తెలుసు; తన పరిమితి కూడా తెలుసు. నా దృష్టిలో ప్రపంచ సాహిత్యంలో అపరిమితమైనటువంటి రచయిత ఎవరు లేరు, అపరిమితమైన కవి ఎవరూ లేరు. తాను పరిమితంగా తనకు అవగాహన ఉన్న వస్తువుల మీదనే విన్నకోట రాసాడని, దాన్ని నిష్ఠతోనే రాసాడని, తాను విశ్వసించిన దాన్నే తాను రాసాడని, శబ్దాన్ని గౌరవించాడని, ఏ శబ్దాన్ని నిర్లక్ష్యంగా వాడలేదని, దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చాడని, ఆ పదాలతోనే కొత్త లోకాన్ని కూడా నిర్మించాడని, శబ్దానికి భావానికి గౌరవం ఇచ్చాడనీ, అన్నిటికంటే మనిషిలోని సున్నితమైనటువంటి ఆలోచనల్ని అతి జాగ్రత్తగా మనకోసం ప్రసరింపజేశాడని, నేను ఒక పాఠకుడిగా అర్థం చేసుకొన్నానని తెలియజేస్తున్నాను.

చెప్పడానికి ఎన్నో అంశాలున్నాయి కానీ ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పే ప్రయత్నం చేశాను. అట్లాంటి మంచి కవిత్వం రాసే విన్నకోట రవిశంకర్‌కు శ్రీకాంతశర్మ గారి పురస్కారం రావడం చాలా యోగ్యమైంది, అర్హమైనదీ. అందుకు నేను న్యాయనిర్ణేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విన్నకోట రవిశంకర్‌కు మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకొంటున్నాను.


దర్భశయనం శ్రీనివాసాచార్య

రచయిత దర్భశయనం శ్రీనివాసాచార్య గురించి:

దర్భశయనం శ్రీనివాసాచార్య (b.1961) ద్విభాషాకవి (తెలుగు, ఇంగ్లీషు), అనువాదకుడు, విమర్శకుడు. తెలుగులో 12 కవితాసంపుటులను, ఆంగ్లంలో Scents of the Soil” అనే కవితాసంపుటిని, ఒక విమర్శ గ్రంథాన్ని , ఒక లేఖాసంపుటిని వెలువరించారు. పదేళ్లపాటు (2015 నుండి 2024 వరకు ) సంపాదకుడిగా “ కవిత్వం“ వార్షిక కవితా సంకలనాలను వెలువరించారు.

 ...