సోల్జర్ చెప్పిన లోగుట్టు: కరవాలానికి కులమా?

స్వదేశ్ దీపక్ రచించిన ‘కోర్ట్ మార్షల్’ అనే ఒక నాటకంలో (తెలుగు అనువాదం – దాసరి అమరేంద్ర), తక్కువ కులానికి చెందిన వాడన్న సాకుతో ఒక సైనికుడిని అధికారులు వేధించినట్లు, ఆ వేధింపులు తట్టుకోలేక అతను తిరగబడి వారి మీద దాడి చేసినట్లు, అతన్ని కోర్ట్ మార్షల్ చేసిన సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించినట్లు కథ సాగుతుంది. ఈ నాటకంలో రచయిత తీసుకున్న సృజనాత్మక స్వేచ్ఛ కొద్దీ, కులం పేరుతో సాటి సైనికుడిని అవమానించడం, మరణశిక్ష పడిన సైనికుడిని ఆఫీసర్ మెస్‌కు తీసుకువచ్చి ఒక బ్రిగేడియర్ స్థాయి అధికారితో మాట్లాడినట్లు చూపడంవంటివి సన్నివేశాలున్నాయి. నిజానికి అలా ఎంతమాత్రమూ జరగదని ఘంటాపథంగా చెప్పగలను. నేను రెండు దశాబ్దాల పైచిలుకు సైన్యంలో పని చేశాను. కులం పేరుతో ఒక సైనికుడి పట్ల వివక్షతో సాటి సైనికులు ప్రవర్తించినట్లుగానీ, అవమానించినట్లుగానీ ఒక్క రోజు కూడా, ఒక్క సంఘటన కూడా నేను వినలేదు, చూడలేదు. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన – ఒక మాజీ సైనికుడైన నన్ను చాలా ఆశ్చర్యపరచింది.

ఇటీవలనే ఒక సైనికాధికారి, తాను ఫలానా మతానికి చెందినవాడిని కాబట్టి, తన రెజిమెంట్లో జరిగే మరొక మతానికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొననని ప్రకటించారు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం సైనిక దళాల్లో నిర్ద్వంద్వంగా అమల్లో ఉండే మౌలిక క్రమశిక్షణకు వ్యతిరేకమని సర్వోత్తమ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆయనను కోర్ట్ మార్షల్ చేశారు. అయితే, భారత రాజ్యాంగంలోని ఆర్టికిల్ 25 ప్రకారం భారతీయ పౌరుడిగా తనకు లభించే ప్రాథమికహక్కుల్లో భాగంగా, తన వ్యక్తిగత స్వేచ్ఛను బట్టి, నచ్చిన మతాన్ని అవలంబించే హక్కు తనకు ఉందని, ఆ హక్కును దృష్టిలో ఉంచుకుంటే ఆయన వాదన సమంజసమేనని కొందరు బలంగా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద నాకున్న అవగాహన కొద్దిపాటిదే అయినా, బలమైనది. దాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను:

  1. సైనిక దళాల్లో చేరి, యూనిఫారం ధరించిన క్షణంనుంచీ పదవీవిరమణ చేసేంతవరకూ, భారత పౌరులకు లభించే కొన్ని ప్రాథమిక హక్కులు (సమ్మె చేసే హక్కును కోల్పోవడం వంటివి) సైనికుల విషయంలో లుప్తమై పోతాయి. క్రమశిక్షణతో తమ విధులను నిర్వర్తించవలసిన బాధ్యత సైనికులమీద ఉంటుంది కాబట్టి, ఆ మేరకు వారి ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం నిలిపివేస్తుంది. ఇటువంటి నిబంధనలకు ఆర్టికిల్ 33 దన్నుగా నిలుస్తోంది.
  2. భారతీయ సైనిక దళాలన్నిటిలో కలిపి పధ్నాలుగు లక్షలమంది సైనికులున్నారు. వారిలో ప్రతి రాష్ట్రంనుంచీ, కేంద్రపాలిత ప్రాంతాన్నుంచీ వచ్చిన వారున్నారు. అనేక మతాలకు, అనేక కులాలకు, అనేక తెగలకు చెందినవారున్నారు. సైన్యంలో చేర్చుకునేటప్పుడు వారికి వుండాల్సిన కనీసార్హతల్లో ముఖ్యంగా శరీర దారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని మాత్రమే పరీక్షిస్తారు. ఆఫీసర్ల ఎంపిక విషయంలో మానసిక స్థైర్యాల అంచనా కూడా వేస్తారు. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారే ఎంపికవుతారు. రికార్డుల్లో నమోదు చేయడం కోసం మాత్రమే వారి కులమతాల ప్రస్తావన వస్తుందికానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి ప్రాతిపదికననే వారిని చేర్చుకోవడం జరగదు. ఒకసారి చేరిన తర్వాత, తమ తమ విధుల్లో వారు చూపే ఆసక్తీ నైపుణ్యాలను బట్టీ, సాధించవలసిన రకరకాల సైనిక విద్యార్హతలనుబట్టీ వారికి పదోన్నతులు దక్కుతాయి. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ, సైనికోద్యోగులందరికీ, తమ తమ హోదా (రాంక్) ను అనుసరించి అందవలసిన రేషన్ లలో గానీ, అవకాశాలలోగానీ ఎటువంటి – రిపీట్ చేస్తున్నాను – ఎటువంటి వివక్ష చూపడం జ-ర-గ-దు.
  3.  ఎందుకంటే, నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలోని అనేక మతాలు, కులాలు, జాతులు, తెగలకు చెందిన వారిని, వేర్వేరు ఆర్థిక స్థాయిలకు చెందిన వారిని సైనికదళాల్లో వారు నిర్వర్తించవలసిన బాధ్యతలపట్ల నిరంతరంగా – 24/7 కార్యోన్ముఖులుగా ఉంచాలి కాబట్టి, ఆ ఫోకస్ ను చెదరగొట్టేందుకు దోహదపడగల విషయాల ప్రస్తావననే నిర్మూలించడం జరుగుతుంది.
  4. మరి వేర్వేరు ధార్మిక ధోరణులకు చెందిన వారు, తమ మతపరమైన ఆసక్తులని సైనిక దళాల్లో ఉన్నన్ని సంవత్సరాలూ అణచి పెట్టుకుని కూర్చోవాలా? ఆ సమస్యే లేదు. ప్రతి రెజిమెంట్ లోనూ, మన దేశంలోని ప్రముఖ మతాలైన హిందూ, శిఖ్, ఇస్లాం, క్రైస్తవ మతాల ప్రతీకగా, ‘సర్వ ధర్మ స్థల్’ అనేది ఉండి తీరుతుంది. పెద్ద పెద్ద యూనిట్లలో గుడి, గురుద్వారా, మసీదు, చర్చి – ఈ నాలుగూ ఉంటాయి. వాటిలో ‘రెలిజియస్ టీచర్’ – అంటే ఆయా మతాలకు చెందిన పురోహితుడు, గ్రంథి సాబ్, మౌల్వీ, పాస్టర్ కూడా ఉంటారు. వారు కూడా సైనికులే. అయితే, వారి ఎంపిక విషయంలో మాత్రం, మతవిద్యార్హతల ప్రాతిపదికణ పరీక్షలు జరుగుతాయి. ప్రతి ఆదివారమూ, హోదాలతో సంబంధం లేకుండా ‘మందిర్ పెరేడ్’ లో భాగంగా రెజిమెంట్ లోని వారందరూ అందులోని గుడికీ, గురుద్వారాకూ, మసీదుకూ, చర్చికీ వెళతారు. తాము నమ్మే భగవంతుడిని దర్శనం చేసుకుంటారు. తిరిగి తమ బాధ్యతల్లో నిమగ్నమవుతారు.

ఇక, సైనికదళాల్లో అతి కీలకంగా భావించే విషయం మరొకటి ఉంది. ‘లీడ్ బై ఎగ్జాంపుల్’. ఎంపికై వచ్చిన వారి రక్తంలోకి ఇంకిపోయేలా వంటబట్టించేది, క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే డ్రిల్ చేయడం కాదు. సైనిక దళాలకు నిర్దేశించిన సత్ప్రవర్తన నియమావళి. నడక, కూర్చోవడం, నిలబడడం, తినడం, పడుకోవడం, సమయపాలన, సీనియర్ల పట్ల, రాజ్యాంగబద్ధమైన ఆదేశాల పట్ల, బాధ్యతల పట్ల అతి ఖచ్చితమైన ప్రమాణాలను, స్థాయిని పాటించేలా ఆఫీసర్లను తీర్చిదిద్దుతారు. అంటే ఆఫీసర్లు కాని వారికి క్రమశిక్షణ అంత ప్రధానం కాదని అర్థం కాదు. తమ కింద పని చేసే వారందరికీ ఆఫీసర్లే మార్గదర్శకులు కాబట్టి, ప్రతి క్షణమూ, అహరహమూ ఆఫీసర్లు తమ క్రమశిక్షణ రవ్వంతయినా బెసగకుండా జాగ్రత్త పడుతుండవలసిందే. ఈ మాట చదువుతుంటే వింతగానో ఆశ్చర్యంగానో అనిపించవచ్చుగానీ ఆఫీసర్లకు మాత్రం, యూనిఫారం ధరించడం మొదలుపెట్టిన కొద్ది సంవత్సరాలలోపే, ఇదే వారి జీవితవిధానంగా మారుతుంది.

అందుచేత, తమ క్రింది వారు తమను చూసి అనుసరిస్తారు కనుక, ‘నా మతం వేరు కాబట్టి నేను వారి మతారాధన స్థలంలోకి రాను’ అనడం సైన్య క్రమశిక్షణ ముఖ్యసూత్రాలకు పూర్తిగా విరుద్ధం. అందుకే సుప్రీమ్ కోర్ట్ ఆ అధికారిని సైన్యంలో విధి నిర్వహణకు అనర్హుడిగా తీర్మానించి బహిష్కరించింది.

అగ్రకులాలకు చెందిన 10% మాత్రమే భారతీయ సైన్యంలో మిగిలిన 90 శాతాన్నీ శాసిస్తున్నారని ఈ మధ్య ఒక రాజకీయ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. అది కూడా పూర్తిగా అసమంజసమే. కులమతాల ప్రసక్తి లేకుండా ఎందరో అధికారులు సైన్యాధినేతలయారు. ఉదాహరణలు అనేకం. ఫీల్డ్ మార్షల్ మానెక్ షాది పార్శీ మతం. జనరల్ ఎస్ ఎఫ్ రోడ్రిగ్స్ క్రైస్తవుడు. జనరల్ జెజె సింగ్ శిక్ఖు. లెఫ్టినెంట్ జనరల్ స్టాన్లీ లెస్లీ మెనిజస్ ఉప సైన్యాధ్యక్షుడిగా పని చేశారు. లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ ఆతా హుసేన్, లెఫ్టినెంట్ జనరల్ పి. ఎమ్. హారిజ్, లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా వంటి వారు సైన్యంలో ఉన్నత పదవీ బాధ్యతలు నిర్వర్తించారు.

సైనికదళాల్లోని వృత్తి వాతావరణాన్ని గురించిగానీ, యూనిఫారం ధరించిన వారి జీవన విధానాల గురించిగానీ ప్రజాబాహుళ్యంలో తెలిసింది చాలా తక్కువ కావడం వల్లనే ఇటువంటి కొన్ని అపోహలు చలామణీ అవుతున్నాయి. అవన్నీ త్వరలోనే సమసిపోతాయని ఆశిద్దాం.


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

దిల్లీలో స్థిరపడిన విజయవాడ వాసి శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...