ఓడిస్సీ – 1: ఉపోద్ఘాతం

ఓడిస్సీ కథానేపథ్యం

పురాతన కాలపు ప్రాతఃకాలంలో, ఇంకా పొద్దు పొడవక ముందు, గ్రీసు దేశంలోని ఒలింపస్ పర్వతం పైన ఒక నిగూఢమైన ప్రపంచం ఉండేది. నిరంతరం మేఘాల ముసుగులో దాగొని ఉన్న ఈ రహస్యప్రపంచంలో వేడిగాడ్పులు కానీ, దుమ్ముదుమారాలు కానీ, వడగళ్ల వానలు కానీ, మరే విధమైన ఈతి బాధలు కానీ ఉండేవి కావు. నిర్మలంగా, నిశ్చలంగా, ఆరోగ్యప్రదంగా ఉన్న ఈ ఒలింపస్ పర్వతం మీద నివసించే వారికి జరామరణాలు లేవు. వాళ్ళు మనలాంటి మానవులు కారు. ఆ కాలపు గ్రీసు దేశపు ప్రజలకి వారు అమరులు, దేవతలు. అందుచేత ప్రాచీనకాలపు గ్రీసు ప్రజలకి ఒలింపస్ పర్వతం లోకనాభి, అనగా వారి ప్రపంచానికి అది కేంద్రబిందువు.

ఒలింపస్ పర్వతం మీదనున్న దేవతలు దిగువన ఉన్న మానవమాత్రుల జీవితాలలో కలుగజేసుకుంటూ ఉండడం, వారి మీద విశేషమైన అధికారాలు చలాయిస్తూ ఉండడం వారి నిత్య వ్యవహారం! ఒకసారి ట్రోయ్ నగరంలో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన మహావీరుడు ఒడిస్సియస్ దురదృష్టవశాత్తూ ఈ దేవతలలో ఒకరి ఆగ్రహానికి గురి అయి, తిరుగు ప్రయాణంలో సముద్రంలో తుపాను పాలయి, దారి తప్పి, పదేళ్ళపాటు పడరాని కష్టాలు పడి, చిట్టచివరికి ఇథకాలో ఇంటికి చేరుకుంటాడు.

మూడువేల సంవత్సరాల క్రితం, చరిత్రకి అందని పురాతనకాలంలో నివసించిన హోమర్ (Homer) అనే అంధుడు, ఊరూరా తిరుగుతూ, వినడానికి ఓపిక ఉన్నవాళ్లందరికీ, అప్పటికి 500 ఏళ్ళ క్రితం ట్రోయ్‌లో జరిగిన యుద్ధం గురించీ, ఒడిస్సియస్ వీరగాథల గురించీ చెబుతూ ఉండేవాడు. ఈ కథలు ఆనోటా ఈనోటా ప్రచారం చెంది, చిలవలుపలవలుగా పెరిగి, చివరికి గ్రీకుభాషలో గ్రంథస్థం అయి మనకి చేరేయి. ఈ కథలు ఎంత ప్రజాదరణ చెందాయంటే వందమందికి పైబడి ఇంగ్లీషులోకి అనువాదాలు చేసేరు. ఇలా చేతులు మారినప్పుడల్లా చిన్నచిన్న మార్పులు, చేర్పులు జరగడం సహజం! కాశీమజిలీ కథలలా, భట్టి విక్రమార్కుడి కథలలా, చందమామ పిల్లల మాసపత్రికలో దాసరి సుబ్రహ్మణ్యం రాసిన అనేక కథలలో మాదిరిగానే ఓడిస్సీలో కనిపించే సన్నివేశాలలో మానవులు ఉంటారు, దేవతలు ఉంటారు, మాంత్రికులు, విచిత్ర జీవులు కనబడతారు. ఇరవైనాలుగు పర్వాల విస్తృతి ఉన్న ఈ కథలో ముఖ్యమైన అంశం సర్వసామాన్యంగా మానవులలో కనిపించే ఈషణ – భార్యేషణ, పుత్రేషణ, ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అనే భావం! విశ్వాసం-నమ్మకద్రోహం, పాశవిక శక్తి-కుశాగ్రబుద్ధివంటి ద్వంద్వలక్షణాల మధ్య పోటీ, ‘ఎవరి కర్మకి వారే కర్తలు’ అనే భావాల చుట్టూ కథ నడుస్తుంది. చిన్నపిల్లలు ఇష్టపడే ఆహ్లాద కథలు, సాహసయాత్రలు ఉంటాయి. అందుకనే ఇది ఇక్కడ తెలుగులో తిరగ రాసినప్పుడు పిల్లలని దృష్టిలో పెట్టుకుని రాసేను.

అన్ని పురాణ గాథలలాగనే ఇది – దీని కవల కథ అయిన ఇలియాడ్ – కేవలం కల్పితాలు అని వేరే చెప్పనక్కరలేదు. ఒడిస్సియస్ సందర్శించిన దీవుల ఉనికిని ఇప్పుడు మనం నిర్ద్వందంగా నిర్ధారించలేము. కనుక ఈ దిగువ చూపిన బొమ్మకు సాధికారత లేదు.

కథాసంగ్రహం

ఒడిస్సియస్ (Odysseus; oh-DIS-yoos) ఇథకా దేశపు రాజు. ఇతని భార్య పేరు పెనలొపీ (Penelope; pen-EL-oh-pee). ఈమె స్పార్టా (Sparta; SPAR-tah) రాజు ఇకేరియస్ (Icarius), రాణి ఏస్తరోడియాల (Astherodia) కూతురు. ఈమె, హెలెన్ అన్నదమ్ముల బిడ్డలు. హెలెన్ స్పార్టా రాకుమారుడు మెనలెయస్‌ని (Menelaus; me-na-LEY-us) పెళ్లి చేసుకుంటే, పెనలొపీ ఇథకా రాకుమారుడు ఒడిస్సియస్‌ని వివాహమాడింది. ఒడిస్సియస్ కొడుకు పేరు టెలెమాకస్ (Telemachus; Tel-EM-ah-kus). భర్త ట్రోయ్ యుద్ధంలో గడిపిన పదేళ్ళూ, తిరుగుప్రయాణంలో సముద్రంలో దారితప్పి తిప్పలు పడుతూ గడిపిన పదేళ్ళూ, వెరసి మొత్తం ఇరవై ఏళ్ళూ, పెనలొపీ తన భర్త రాకకోసం ఎదురు చూస్తూ, వేరొక మగాడి వైపు కన్నెత్తి చూడకుండా కాలం గడిపిన శీలవతి.

ఈ ఇరవై సంవత్సరాల కాలంలో, యుద్ధంలో ఎప్పుడో ఒడిస్సియస్ చచ్చిపోయి ఉంటాడనుకొని, పెనలొపీని పెళ్ళాడి, తద్వారా ఇథకా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఆశతో పెక్కురు రాకుమారులు నిత్యం ఆమెను అనేక విధాలుగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి బారినుండి తప్పించుకోడానికి పెనలొపీ రకరకాల పన్నాగాలు పన్నుతూనే ఉంటుంది. చిట్టచివరికి, ఒడిస్సియస్ ప్రాణాలతో ఇంటికి వస్తాడు. వచ్చి, కొడుకు సహాయంతో పెనలొపీని వేధిస్తూన్న 108 రాకుమారులని నిర్జించి, తన రాజ్యం తిరిగి చేజిక్కించుకుంటాడు. టూకీగా ఇదీ కథ. దీనికి చిలవలు, పలవలు అల్లి ఎంత పెద్దది కావలిస్తే అంత పెద్ద కథ అల్లుకుపోవచ్చు.



ఉదాహరణకి, పదేళ్ళపాటు సముద్రం మీద సాహసయాత్రలు చేసి వచ్చిన పెద్దమనిషికి మాసిన గడ్డాలు, మీసాలు ఉండడం సహజం కదా. అటువంటి మనిషిని అమాంతం పెళ్ళాం మాత్రం ఎలా గుర్తు పడుతుంది? అందుకని ఒడిస్సియస్ నాటకీయంగా ఒక బిచ్చగాడి వేషంలో వచ్చి, మొదట కొడుకుని ఆశ్రయించి, నమ్మించి, కొడుకుతో కలిసి యుద్ధం చేసి, పెనలొపీని వేధిస్తూన్న 108 ఉపసర్పికులని (suitors) హతమార్చి, రాజ్యం దక్కించుకుంటాడు.

తానే అసలు, సిసలైన ఒడిస్సియస్ అని పెనలొపీని ఎలా నమ్మిస్తాడు? తమ శయ్యాగారంలో ఉన్న అంశం ఒకటి ఎలా అస్తిత్వం పొందిందో గుర్తు చేస్తాడు. కాళిదాసు శాకుంతలంలో చేప కడుపులో దొరికిన ఉంగరాన్ని చూసి దుష్యంతుడు శకుంతలని గుర్తుపట్టినట్లు.

పెనలొపీని 108 మంది ఉపసర్పికులు ఎటువంటి వేధింపులకి గురి చేస్తారు? ముందు ఒక్కొక్కళ్ళూ వచ్చి కోటలో పాగా వేస్తారు. కోటలో ఉన్న తినుబండారాలని గుటకాయిస్తూ ఉంటారు! సారా పీపాలు ఖాళీ చేసేస్తారు. అల్లరి చేస్తారు, రభస చేస్తారు. ఒడిస్సియస్ యుద్ధంలో చచ్చిపోయాడనిన్నీ, ఎదురుచూసి లాభం లేదనిన్నీ పుకారులు పుట్టించి నిరుత్సాహపరుస్తారు.

పెనలొపీ ఈ వేధింపులని ఎలా ఎదుర్కొంటుంది? వార్ధక్యంలో, వానప్రస్థంలో ఉన్న తన మామగారైన (అనగా, ఒడిస్సియస్ తండ్రి) లేయర్టీజ్ (King Laertes; LAY-er-teez) అంతిమ శవయాత్ర ఉపయోగార్థం ఒక దుప్పటిని అల్లుతున్నాననీ, అదొక పవిత్రమైన వ్రతం అనిన్నీ, ఆ వ్రతం పూర్తయేవరకూ తాను స్వయంవరానికి అర్హురాలిని కాదనిన్నీ అందరినీ నమ్మిస్తుంది. పగటిపూట అల్లిన అల్లికని ప్రతి రాత్రీ విడదీసి విప్పేస్తూ కాలయాపన చేస్తూ, వ్రతాన్ని పొడిగిస్తూ ఉంటుంది.

ఈ కథని తెలుగులో తిరగరాసేటప్పుడు ఏడు భాగాలుగా విభజించేను. ఒకొక్క భాగంలో 8-10 చిన్న చిన్న అధ్యాయాలు ఉంటాయి. పురాణకథ కనుక, మూలకథ మౌఖికంగా ప్రచారం పొందింది కనుక, కథ నిర్మాణంలోనే, ప్రత్యేకించి సంభాషణలలో పునరుక్తి ఎక్కువగా కనిపిస్తుంది!

ఇప్పుడు ఈ నేపథ్యాన్ని ఆసరాగా చేసుకుని ఓడిస్సీ కథ యొక్క పుట్టుపూర్వోత్తరాలతో మొదలుపెట్టి సమగ్రంగా చెబుతాను. సావధానంగా చదవండి.


ఒకటవ భాగం: ఇలియాడ్ చివరి అంకం!

1.1 యుద్ధానికి పిలుపు

పురాతన కాలపు గ్రీసు దేశంలో, ఇథకా అనే ద్వీపంలో, ఒడిస్సియస్ అనే పేరు గల ఒక ఆసామీ నివసిస్తూ ఉండేవాడు. ఆ ద్వీపానికి అతను అధినేత అయినప్పటికీ అతనిది నిరాడంబరమైన జీవితం! తన పొలాలలో పని తానే చేసుకునేవాడు. మొక్కలని పెంచడం, ఇంటికి అవసరమైన వడ్రంగి పనులు చేసుకోవడం అతని అభిరుచులు! తన కుటుంబంతో – అనగా, వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు, భార్య పెనలోపీ, పసిబాలుడు టెలెమాకస్ – కాలం గడపడం అనేది అతనికి అత్యంత ప్రీతిపాత్రమైన పని.

ఒక రోజున ఒడిస్సియస్ పొలాన్ని దున్నుతూ, భార్యనీ, కొడుకునీ ఒక కంట చూస్తూ తన్మయత్వంలో ఉన్నాడు. చెట్టు కింద కూర్చున్న భార్య ఒడిలో కొడుకు పాలు తాగుతున్నాడు. … ఒకానొక రోజున ఈ కొడుకు పెద్దవాడై పొలం పనులలో సాయం చేస్తాడు… ఇథకా చుట్టూ ఉన్న సముద్రంలో పడవలు నడపడం నేర్చుకుంటాడు…

ఒడిస్సియస్ ఇలా పగటికలలు కంటూ ఉండగా కోటనుండి ఒక సేవకుడు వచ్చి, “మహారాజు అగమేమ్నాన్ (Agamemnon; ag-ah-MEM-non) నుండి ఒక వార్తాహరుడు వచ్చేడు. ప్రవేశపెట్టమంటారా?”

ఒడిస్సియస్ మనస్సు కీడు శంకించింది. వార్తాహరుడు ఎందుకు వచ్చి ఉంటాడో అతను ఊహించగలడు. మహారాజు అగమేమ్నాన్ మధ్యధరా సముద్రంలో ఉన్న గ్రీకు ద్వీపాలన్నిటికి అధిపతి! సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్న ట్రోయ్ నగరాన్ని ముట్టడించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ట్రోయ్ నగరపు రాకుమారుడు ఒకడు స్పార్టా దేశపు యువరాణి అయిన హెలెన్‌ని – ఆమె భర్త నుండి బలాత్కారంగా అపహరించి – ట్రోయ్ తీసుకుపోయాడు.

“ఇథకాకి చెందిన ఒడిస్సియస్ రాజా!” వార్తాహరుడు బిగ్గరగా ప్రకటించడం మొదలు పెట్టేడు. “ట్రోయ్ యుద్ధంలో పాల్గొనవలసిందిగా మహారాజా అగమేమ్నాన్ జారీ చేసిన ఆదేశాలని మీకు సమర్పించుకుంటున్నాను.”

ఈ వార్తని మోసుకొచ్చిన పేలమీడీస్ (Palamedes) వైపు ఒడిస్సియస్ ఉదాసీనంగా చూసేడు. చూసి, ఏ సాకు చెప్పి తప్పించుకోవవడమా అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టేడు. యుద్ధం అంటే భయం అని కాదు. సైన్యానికి నేతృత్వం వహించడం అంటే ఇష్టం లేక కాదు. భార్యని, బిడ్డని వదలి వెళ్లడం ఎలా? యుద్ధంలోకి వెళితే తిరిగి వస్తాడో రాడో? వస్తే ఎప్పుడు వస్తాడో? ఇంటిని వదలి వెళ్లడమనే ఆలోచనే అసహ్యంగా ఉంది! అనూహ్యంగా ఉంది!

“ఒడిస్సియస్ రాజా!” వార్తాహరుడు మరల గొంతెత్తి మనవి చెయ్యడం మొదలు పెట్టేడు. “మీకు గుర్తు ఉందో లేదో! హెలెన్ స్వయంవరం వేళప్పుడు ఆమె తన పాణిగ్రహణానికి ఏ రాకుమారుని ఎన్నుకున్నా సరే, గ్రీసు సామ్రాజ్యంలో ఉన్న మిగిలిన రాజులందరూ ఉమ్మడిగా ఆమె రక్షణకి బాధ్యత వహిస్తామని ప్రమాణం చెయ్యాలని మీరే కదా ప్రతిపాదించింది!”

ఒడిస్సియస్‌కి ఆ రోజు నిన్నటిలా జ్ఞాపకం ఉంది. హెలెన్ అతిలోకసుందరి. ఆమెకు యుక్తవయస్సు రాగానే గ్రీసు సామ్రాజ్యంలో ఉన్న రాజులందరూ ఆమె పాణిగ్రహణానికి ఉవ్విళ్ళూరేరు. ఆమె ఎవరిని ఎంపిక చేసుకున్నా మిగిలిన రాజులందరూ ఈర్ష్య, అసూయలతో ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వి మొత్తం గ్రీసు సామ్రాజ్యపు మనుగడకే భంగం కలిగించే ప్రమాదం ఉందని గ్రహించి, ఒడిస్సియస్సే ఒక పథకాన్ని ప్రతిపాదించేడు. ఆ పథకం ప్రకారం హెలెన్ ఎవ్వరిని వరించినా, మిగిలిన రాజులందరూ ఆమె వైవాహిక రక్షణకి బాసటగా ఉంటామని ప్రమాణం చెయ్యాలి. ఇప్పుడు ఒడిస్సియస్ ఇరకాటంలో పడ్డాడు!

ఈ ఇరకాటంనుండి బయట పడడానికి ఇప్పుడు ఒడిస్సియస్ మరొక పథకం ఆలోచించాడు. వార్తాహరుడిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూన్నట్లు నటిస్తూ, వింతగా, పిచ్చివానిలా, ప్రవర్తించడం మొదలుపెట్టేడు. భూమిని దున్నడానికి అరకని సిద్ధం చేసుకుంటూ రెండు గుర్రాల్ని కట్టడానికి బదులు ఒక గుర్రాన్ని, ఒక గాడిదని కట్టేడు. నాగేటి చాలులో విత్తనాలు జల్లడానికి బదులు ఉప్పు బెడ్డలు జల్లడం మొదలుపెట్టేడు. ఈ రాజుకి ఏదో పిచ్చి పట్టినట్లుందనుకుని వార్తాహరుడు రిక్తహస్తాలతో తిరిగి వెళ్ళిపోతాడని ఒడిస్సియస్ ఆశించేడు!

వార్తాహరుడు నిన్న పుట్టిన ముక్కుపచ్చలారని బాలుడు కాదు కదా! ఒడిస్సియస్‌కి నిజంగా పిచ్చెక్కిందో లేదో పరీక్షించడానికి వార్తాహరుడు పెనలొపీ అడ్డాలలో ఉన్న బిడ్డని తీసుకుని నాగేటిచాలులో పడుక్కోబెట్టేడు!

ఒడిస్సియస్ ఉగ్రుడయ్యాడు! తటాలున నాగలిని ఆపి బిడ్డని ఎత్తుకున్నాడు. ఆ క్షణమే తన పాచిక పారలేదని గ్రహించేడు. ఇహ గత్యంతరం లేదు. ఒడిస్సియస్ యుద్ధంలో పాల్గొనక తప్పదు!

1.2 కొయ్యగుర్రం కథ

ఒడిస్సియస్ వెయ్యి మెరుగుమాసిన గ్రీకు పడవల దండుతో ట్రోయ్ సముద్రతీరంలో శిబిరం కట్టి ట్రోయ్ నగరపు ప్రాకారాల బయట తిష్ఠ వేసేడు! ఎటూ తేలకుండా పదేళ్ళపాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి అంతూ, దరీ కనబడడం లేదు. గ్రీకు వీరులు ట్రోయ్ వీరులని ఎంతమందినో హతమార్చేరు! వారిలో హెలెన్‌ని అపహరించిన ట్రోయ్ రాకుమారుడు పేరిస్ కూడా ఉన్నాడు. అయినప్పటికీ హెలెన్ మాత్రం ఇంకా ట్రోయ్ రాజ్యపు ఆధీనంలోనే ఉంది; విముక్తి పొందలేదు! గ్రీకు యోధులు ట్రోయ్ పట్టణపు ప్రాకారాలని ఛేదించుకుని లోపలికి వెళితే కానీ హెలెన్‌కి విముక్తి లభించదు!

పరిస్థితి ఇలా ఉండగా, ఒక రోజున విచారగ్రస్తుడైన ఒడిస్సియస్ గ్రీకు శిబిరాన్ని వదలిపెట్టి దూరంగా, ఏకాంతంగా, ఇసుక తిన్నెల మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు. తన భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్, వయస్సు నిండిన తల్లి, తండ్రి పదే పదే గుర్తుకి వస్తున్నారు. తల్లిదండ్రులు ఇంకా బ్రతికి ఉన్నారో, లేదో? వాళ్ళిద్దరినీ మళ్ళా చూడ్డం అవుతుందో? అవదో?

ఈ ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ, అకస్మాత్తుగా ఒడిస్సియస్ ఎదుట ఒక స్త్రీ మూర్తి కనబడింది. ఆమె తలపైన మెరుస్తూన్న శిరస్త్రాణం, చేతులలో శూలం, డాలు కనిపించేయి! ఆమె మరెవ్వరోకాదు! సాక్షాత్తూ దేవదేవుడు జూస్ (Zeus; zyoos) కుమార్తె అయిన అథీనా (Athena; ah-THEE-nah)! చదువుల తల్లి! జ్ఞానదేవత! యుద్ధాలకి అధినేత్రి! ధూసర వర్ణంతో ఆమె కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి! ఆ కళ్ళు తీక్షణంగా ఉన్నా ఆర్ధ్రతతో నిండి ఉన్నాయి! అథీనా కృపావీక్షణాలకి గురి అయినవారిలో ఒడిస్సియస్ ఒకడు! ఒడిస్సియస్ హస్తకౌశలాన్ని, అతని పరాక్రమాన్ని, అతని కుశాగ్రబుద్ధినీ ఆమె తరచు మెచ్చుకునేది.

ఆమెని చూసి ఒడిస్సియస్ నిశ్చేష్టుడయ్యాడు. నోట మాట రాలేదు. లేచి నిలబడి నమస్కారం చేసేడు!

“హెలెన్‌ని ట్రోయ్ చెరసాలనుండి విడిపించడానికి నీకు సహాయం చెయ్యడానికి వచ్చేను.” అని మొదలు పెట్టింది అథీనా! ట్రోయ్ పట్టణపు ప్రాకారాలని ఛేదించి లోపలికి వెళ్లే ఉపాయం చెబుతాను. సావధానంగా విను. ఒక మహత్తరమైన పెద్ద కర్రగుర్రం నిర్మించడానికి మీ వడ్రంగులని పురమాయించు. గ్రీకు సైన్యంలోని కొందరు మహావీరులని ఎంపిక చేసి ఆ కర్రగుర్రం కడుపులో దాగొనమను. మిగిలిన సైనికుల్ని ఓడిపోయినట్లు నటిస్తూ పడవలలో వెనక్కి కొంత దూరం పంపించి అక్కడ మాటు వేసి ఉండమను. గ్రీకు సైనికులు ఓడిపోయి, పారిపోయారనుకుని ట్రోయ్ దళాలు ప్రమత్తతతో ప్రవర్తించి, కుతూహలంతో కోట తలుపులు తెరచి కొయ్యగుర్రాన్ని లోపలికి తీసుకు వెళ్లి, తలుపులు మూసేసి వెళ్ళిపోతారు. చీకటి పడి, ట్రోయ్ సైనికులు నిద్రపోయిన తరువాత, మీరు కొయ్యగుర్రం కడుపులోంచి బయటకి వచ్చి కోట తలుపులు తెరచేసరికి, పారిపోయినట్లు నటించిన మీ సైనికులు తిరిగి వచ్చి, మీకు దన్నుగా నిలుస్తారు.”

ఈ మాటలు చెప్పి అథీనా అంతర్ధానం అయిపోయింది!

కర్తవ్యం తెలుసుకున్న ఒడిస్సియస్ వెంటనే పని ప్రారంభిచేడు. తన సిబ్బందిలో ఉన్న అత్యుత్తములైన వడ్రంగులని పిలిపించి ప్రత్యేకమైన హంగులతో బోలుగా ఉన్న ఒక కొయ్యగుర్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు మొదలు పెట్టేడు. గుర్రం తయారయిన వెంటనే గుర్రంమీద అథీనా పేరు స్ఫుటంగా కనిపించేలా రాయించేడు. ఆ గుర్రం కడుపు లోపలికి వెళ్ళడానికి వీలుగా తాడుతో అల్లిన ఒక నిచ్చెనని ఏర్పాటు చేసేడు. చీకటి పడగానే తన సైన్యంలో ఉన్న ప్రథమశ్రేణి సిపాయిలతోపాటు తాను కూడా ఆ నిచ్చెన ఎక్కి గుర్రం కడుపులో దాక్కున్నాడు!

బయట ఉన్న గ్రీకు వీరులు ఒడ్డున ఉన్న తమ శిబిరాలకి నిప్పు అంటించి, తగలబెట్టి, పడవలు ఎక్కి సముద్రంలోకి పారిపోయేరు.

ఒడిస్సియస్ సిబ్బంది రాత్రల్లా వంతులు వేసుకుని జాగరణ చేసేరు. తెల్లవారగానే బయట ట్రోయ్ సైనికుల సందడి వినిపించింది.

“ఏయ్! ఇక్కడ ఈ గుర్రం ఏమిటి? చూసేరా?”

“గ్రీకు సైనికులు దీనిని ఎందుకు నిర్మించినట్లు? దీనిని ఇక్కడ వదిలేసి తోక ముడిచి పారిపోయినట్లున్నారు.”

“ఎవరికి దొరికినది వారికే! మనకి దొరికింది కనుక ఈ గుర్రం ఇక మీదట మనదే! లోపలికి ఈడ్చుకుని పోదాం.”

“వీల్లేదు! గ్రీకులు మన శత్రువులు. వాళ్ళు మనకి బహుమానాలు, కానుకలు ఎందుకు ఇస్తారు? ఈ వికృతాకారాన్ని సముద్రంలో పారేయండి!”

“కాల్చేయండి!”

“ఇది కేవలం కొయ్యగుర్రం! ఇది మనని ఏం చేస్తుంది? ఉంచుకుందాం!”

ఈ వాదోపవాదాలని దూరం నుండి వింటున్న ఒక గ్రీకు సైనికుడు ముందుకు వచ్చి, ట్రోయ్ సైనికులకు కావాలని పట్టుబడ్డాడు.

“మా వాళ్ళు నా చావు నన్ను చావమని ఇక్కడ వదిలేసి పారిపోయేరు! నా జీవితం అంతా గ్రీసు దేశానికి ధారపోసేను. ఇప్పుడు నా అవసరానికి సహాయం చెయ్యకుండా నన్ను ఇక్కడ నిర్దాక్షిణ్యంగా వదలిపెట్టి వెళ్ళిపోయేరు. మీ శరణు వేడుకుంటున్నాను. మీరే నాకు దిక్కు!”

“నీకు రక్షణ ఇస్తాము కానీ ఈ కొయ్యగుర్రం సంగతి నీకు ఏమయినా తెలుసా?”

“ఈ గుర్రం అథీనా దేవతది! చూడండి ఇక్కడ! ఆమె పేరు ఉంది కదా! ఈ గుర్రానికి అపకారం చేస్తే అథీనా దేవతకి కోపం వస్తుంది. మిమ్మల్ని శిక్షిస్తుంది! ఈ గుర్రాన్ని మీ నగరంలోకి తీసుకెళ్లి ఒక పీఠం మీద పెట్టి పూజించండి. అథీనా దేవత సంతోషించి మీ కోరికలు తీరుస్తుంది!”

ఈ దేశద్రోహి మాటలని ఎంతవరకు నమ్మడమన్న విషయంపై తర్జనభర్జనలు జరిగేయి. చిట్టచివరికి రాజు ప్రయాం కలుగజేసుకున్న తర్వాత కొయ్యగుర్రాన్ని స్వీకరించడానికే నిర్ణయం జరిగింది.

“పట్టణపు తలుపులు తెరచి గుర్రాన్ని లోపలకి తీసుకెళ్ళండి!”

ఈ మాటలు వినగానే ఒడిస్సియస్‌కి కొంత ఊరట కలిగింది. అథీనా చెప్పినట్లే జరుగుతోంది! ట్రోయ్ సైనికులు కొయ్యగుర్రాన్ని ఒక చక్రాల చెక్క మీదకి ఎక్కించి, దానికి ఒక తాడు కట్టి, లోపలికి ఈడ్చుకుని వెళుతున్నారు. దాని కడుపులో దాక్కున్న సైనిక బృందం ఊపిరి బిగపట్టి, చీకటి పడేవరకు ఉగ్గబట్టి కూర్చున్నారు.

బయట చిమ్మచీకటిగా ఉంది. ఊళ్ళో సద్దుమణిగింది. ట్రోయ్ సైనికులు ఎవరి ఇళ్ళకి వారు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒడిస్సియస్ కొయ్యగుర్రం పొట్ట మీద ఉన్న తలుపులు తెరచేడు. తాడుతో చేసిన నిచ్చెనని బయటకి విసిరేడు. దానిని పట్టుకుని సైనికులందరూ, ఒకరి తరువాత మరొకరు బయటకి వచ్చేరు. పట్టణద్వారాలకు ఉన్న తలుపులకి ఉన్న అడ్డు గెడలు తొలగించి, తలుపులని బారుగా తెరచేరు. బయట చీకటిలో వేచి ఉన్న గ్రీకు సైనికులు తొంబతొంబలుగా లోపలకి జొరబడ్డారు!!

ట్రోయ్ సైనికులు ఆశ్చర్యచకితులయ్యారు! యుద్ధనినాదాలతో గ్రీకు సైనికులు విజృంభించేరు! రెండు పక్షాల మధ్య భీకరంగా పోరాటం జరిగింది. ప్రమత్తంగా ఉన్న ట్రోయ్ సైనికులు చాలామంది మరణించేరు. గ్రీకు సైనికులు రాజగృహంలో ప్రవేశించారు. స్త్రీలని, పిల్లలని దాసీలుగా చెరబట్టేరు. చిట్టచివరికి గ్రీకు సైనికులు హెలెన్ ఉన్న మందిరం చేరుకొని, ఆమెను విడుదల చేసి, ఆమె భర్త దగ్గరకి చేర్చేరు!

తెల్లారేసరికి ట్రోయ్ మహానగరం ఉవ్వెత్తున లేస్తూన్న మంటలకి ఆహుతి అయిపోయింది! విజయోత్సాహంతో గ్రీకు సైనికులు ట్రోయ్ నగరంలో దోచుకున్న ధనరాశులని పడవలలోకి ఎక్కించేరు. పదేళ్ళపాటు జరిగిన యుద్ధం ముగిసింది!

లంగరులు ఎత్తేరు. తెరచాపలు విప్పేరు. అనుకూలమైన పవనాలు వీస్తూ ఉంటే ఒడిస్సియస్ తన పన్నెండు ఓడల గుంపుతో, 130మంది ఓడంగిలతో ట్రోయ్ తీరాన్ని వదలిపెట్టి విజయగర్వంతో, అపరిమితోత్సాహంతో గృహోన్ముఖుడయ్యాడు. ఇథకాలో ఇల్లు చేరగానే ప్రజలు తనకి బ్రహ్మరథం పడతారు! పదేళ్ల తరువాత తన తల్లిదండ్రులని తిరిగి చూడబోతున్నాడు! టెలెమాకస్ తన భుజాల మీద సవారీ చేస్తాడు. మళ్ళా పెనలొపీ పరిష్వంగంలో బందీ అవుతాడు!

ఒడిస్సియస్ అంత అదృష్టవంతుడు ఎవరుంటారు? ఇహ ఒడిస్సియస్ శేషజీవితం వడ్డించిన విస్తరే!!

(సశేషం)


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి:

వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.

 ...