వామన చరిత్రలో దృశ్యీకరణం
వామన చరిత్ర పోతన భాగవతంలో అష్టమస్కంధంలోని ఒక కథ.
హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఐదవ అవతారం వామనుడు.
దేవేంద్రునితో యుద్ధంలో ఓడిపోయిన బలిచక్రవర్తి, రాక్షసుల గురువైన శుక్రాచార్యుల ఉపదేశంతో విశ్వజిత్ యాగం చేసాడు. యాగఫలంగా శక్తివంతమైన ధనుస్సును, బంగారు రథాన్ని, అక్షయతూణీరాలను, కవచాన్ని, శంఖాన్ని పొందాడు. గర్వం పెరిగింది.
బలి చక్రవర్తి దేవలోకం పైకి మరలా యుద్ధానికి వెళ్ళాడు. అప్పటికే దేవేంద్రుడితో సహా దేవతలందరూ దేవలోకం వదలి పారిపోయి, తమను బలి చక్రవర్తి నుంచి రక్షించమని విష్ణువును ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు వామనుడిగా భూలోకంలో అదితికి, కశ్యపునికి జన్మించారు.
ఒకసారి వామనుడు బలి చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. అశ్వమేధయాగం చేస్తున్న బలి చక్రవర్తి ‘నీకేమి కావాలో కోరుకో’ అని వామనుడిని పదే పదే అడిగిన మీదట, ‘మూడడుగుల నేల ఇమ్మ’న్నాడు వామనుడు.
వామనుడి రూపంలో వచ్చింది విష్ణువు అని చెప్పి, మూడడుగుల నేల ఇమ్మనడంలో మర్మమేదో ఉందని, అది తమకు హాని చేస్తుందని బలికి చెప్పాడు శుక్రాచార్యులు. ‘సాక్షాత్తు శ్రీమహావిష్ణువే దానం స్వీకరించడానికి చేయి చాస్తున్నప్పుడు ఇవ్వకుండా ఎలా ఉండను. శరీరం శాశ్వతం కాదు కదా’ అని మూడడుగుల నేలను దానమివ్వడానికి ఉద్యుక్తుడై, తన భార్య వింధ్యావళి తెచ్చి ఇచ్చిన హేమ ఘటంలోని జలంతో ‘త్రిపాద ధరిణిం దాస్యామి’ అంటూ నీటిధారను వామనుడి చేతి లోనికి విడిచాడు బలి చక్రవర్తి. అప్పటికీ శుక్రాచార్యుడు, బలి చక్రవర్తిని కాపాడడానికి నీటిని ఆపడానికి, సూక్ష్మ రూపంలో నీటి కలశంలో దూరి నీటి ధారను ఆపబోయాడు. దర్భతో వామనుడు కలశరంధ్రంలో పొడవగా శుక్రాచార్యుడు కన్ను పోగొట్టుకుని బయటపడ్డాడు. నీటి ధార వామనుని హస్తాన్ని తాకింది. ‘ఇంతలా’ వుండే వామనమూర్తి, ‘అంతంతై, మరింతై, ఇంకొంతై’ తన విరాడ్రూపాన్ని సాక్షాత్కరింపజేసి, రెండు పాదాలతో భూమిని, ఆకాశాన్ని ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ అని అడిగి, బలిచక్రవర్తి ‘నా శిరమున పెట్టు’మనగా, అట్లే అనుగ్రహించాడు. స్థూలంగా వామన చరిత్ర కథ ఇది.
కథలు ఎవరు పడితే వారు ఎలా పడితే అలా చెబితే రక్తి కట్టవు. కొందరు కథ చెబుతుంటే పొడిపొడిగా ఉంటుంది. కథలో ఉండే వాతావరణం మన ఊహకు అందదు. పాత్రలు మనకు కనిపించవు. కానీ మరికొందరు కథ చెబుతుంటే మన కళ్ళ ముందే కథ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కథ అనేకాదు, ఏ సాధారణ విషయం చెప్పినా ఆసక్తికరంగా ఉంటుంది.
కథను కళ్ళకు కట్టేలా చెప్పడం ఒక కళ. వ్రాతలో వచ్చే కథల్లో కొందరు రచయితల కథలు చెబుతున్నట్లనిపిస్తే, కొందరు కథకుల కథలు చూపిస్తున్నట్లనిపిస్తుంది. కథాశిల్పం కోణంలో ఆలోచిస్తే కథను చూపించే కథకులు మెరుగైన కథకులు.
ఈ అధ్యాయంలో వామన చరిత్ర కథలో పోతన చేసిన దృశ్యీకరణలను స్థూలంగా పరిశీలిద్దాం.
భాగవతం భగవంతుని కథల సమాహారం. ఈ కథలను పోతన భక్తి, తన్మయత్వాలతో చెబుతుంటే కథలు కళ్ళముందు ప్రత్యక్షం కావడమే కాదు, మనసులో భావోద్వేగాలు ఉవ్వెత్తున లేస్తుంటాయి. శబ్దార్థాలంకారాలతో సుందరంగా తీర్చిదిద్దిన పద్యాలలో, రంగులో ముంచిన చిత్రకారుడి కుంచె కదలికలతో ఏర్పడే దృశ్యంలాగా, పోతన ఘంటం వ్రాసిన ఒక్కోపదం ఒక్కో చిత్రాన్ని వేగంగా గీసుకుంటూ పోతే – పదాల ప్రవాహంలో ఒక చిత్రం తర్వాత మరో చిత్రం తేలియాడి, పదాలతో కూర్చబడ్డ పద్యం ఒక దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.
వామనుడు యాగశాలను చూసిన సందర్భంలోనూ, బలిచక్రవర్తికి వామనుడుగా వచ్చింది శ్రీమహావిష్ణువు అని తెలిసినప్పుడు, దాన స్వీకార సమయంలో వామనమూర్తి విరాడ్రూపాన్ని చూపించినప్పుడూ పోతన చేసిన దృశ్యీకరణలు ఎన్నదగ్గవి. వాటినిప్పుడు పరిశీలిద్దాం.
3.1 వామనమూర్తి విరాడ్రూపం
వామనుడికి బలిచక్రవర్తి సంతోషంగా మూడడుగుల భూమిని దానం చేసిన తర్వాత, పొట్టి బ్రాహ్మణుడైన వామనమూర్తి విశ్వరూపం ప్రదర్శించిన విధానాన్ని ఈ క్రింది పద్యంలో చూపించారు పోతన.
శా. ఇంతింతై, వటుఁడింతయై, మరియుఁ దానింతై, నభోవీధిపై
నంతై, తోయద మండలాభ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై నంతై, మహర్వాటిపై
నంతై, సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
(పోతన భాగవతము, అష్టమస్కంధం – 622)
ఏ విశేషణాలూ ఉపయోగించకుండా, సాధారణ పాఠకులకు, సామాన్య శ్రోతలకు తెలిసిన పదాలతో చెప్పిన పద్యమిది. వడివడిగా పెరుగుతున్న వామనమూర్తిని ‘ఇంతై, అంతై, ఇంతింతై, అల్లంతై’ అంటూ సన్నివేశాన్ని దృశ్యమానం చేస్తూ, చదివేవారికి ఊపిరి తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా పద్యం నడకలోనూ వేగాన్ని చూపించారు పోతన.
ఇంత వుండేవాడు అంతయ్యాడు. అంతవాడు మరింత వాడయ్యాడు. చూస్తుండగానే క్రమక్రమంగా పెరిగిపోసాగాడు. మేఘమండలం కంటే ఎత్తుగా పెరిగాడు. ఆకాశం కంటే ఇంకా పైకి పెరిగాడు. వెలుగుల రాశికంటే పైపైకి పెరిగాడు. చంద్రుడిని దాటి, ధ్రువతారను మించి, మహర్లోకం పైకి, సత్యలోకం వరకూ పెరుగుతూ పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండిపోయాడు! సమస్త లోకాలను మించి వామనమూర్తి పెరిగాడు!!
క్రింద నుంచి నివ్వెరపోయి చూస్తున్న బలిచక్రవర్తీ, శుక్రుడూ, మునులు తదితరుల దృష్టికోణంలోంచి పెరుగుతున్న వామనమూర్తిని చూపించారు. ఒక్కొక్క పరిమితిని దాటుతూ, అంచెలంచెలుగా పెరుగుతున్న త్రివిక్రముడి రూపాన్ని ఇక్కడ వర్ణించారు. పాఠకుల మనోనేత్రం వారి వారి ఊహాశక్తి మేరకు ఈ సన్నివేశాన్ని ఒక సినిమాటిక్ దృశ్యంగా దర్శించడానికి అవసరమైన మేరకు ఈ పద్యంలో వివరాలున్నాయి.
వామనమూర్తి ఆకాశంకంటే పెరిగిన తర్వాత మేఘమండలాన్ని దాటాడు. అలాగే సూర్యమండలాన్ని మించిపోయిన తర్వాత, చంద్రుడిని, ఆ తర్వాత ధ్రువ నక్షత్రాన్ని దాటాడు. వాస్తవానికి మేఘాలు భూమి నుండి గరిష్టంగా పది మైళ్ళ ఎత్తులోపలే ఉంటాయి. ఆకాశానికి అవధులు లేవు. అలాగే చంద్రుడు భూమికి ఉపగ్రహంగా దగ్గరగాను, సూర్యుడు అత్యంత దూరంలోనూ ఉంటాడు. వ్యాసుని భాగవతంలో పై పద్యానికి మూల శ్లోకం లేదు కనుక తెలుగు భాగవతం వ్రాసే కాలానికి ఖగోళశాస్త్రం గురించి అందుబాటులో వున్న సమాచారం ప్రకారం పోతన ఈ పద్యాన్ని నిర్మించి ఉండవచ్చు. ఇప్పటి శాస్త్ర విజ్ఞానంతో పరిశీలించినప్పుడు ఈ పద్యంలోని వర్ణనలు సత్యదూరం అనిపిస్తాయి.
సినిమాటోగ్రఫీ పరిభాషలో డాలీ జూమ్ షాట్ (Dolly Zoom Shot) అని ఒక ప్రత్యేక చిత్రీకరణ పద్ధతి ఉంది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ వర్టిగో(Vertigo) సినిమాలో పతాక సన్నివేశం లోనూ, స్టివెన్ స్పీల్బెర్గ్ Jaws(1975) లో ‘Get out of the water’ గా ప్రసిద్ధికెక్కిన సన్నివేశంలోనూ, తర్వాత వచ్చిన మరికొన్ని సినిమాల్లోనూ ఈ ‘డాలీ జూమ్ షాట్’ ను వాడిన విధానాన్ని గమనించవచ్చు.
ప్రధానమైన వస్తువును కేంద్రంగా చేసుకుని, ఎలాంటి కుదుపులూ లేకుండా ఒక డాలీ(ట్రాలీ లాంటిది) మీద కెమెరాను వస్తువు వైపుకు తీసుకెళుతూ కెమెరా లెన్స్ ను నెమ్మదిగా జూమ్ ఇన్/జూమ్ అవుట్ చేసుకుంటూ చిత్రీకరించడాన్ని డాలీ జూమ్ షాట్ అంటారు. ఈ రకమైన చిత్రీకరణలో జూమ్ ఇన్ చేసినప్పుడు వస్తువు చుట్టూ వున్న పరిసరాలు క్రమక్రమంగా మసకబారి మాయమై, చివరకు వస్తువు మాత్రమే తెరనంతా ఆక్రమిస్తుంది. జూమ్ అవుట్ చేసినప్పుడు ప్రధాన వస్తువు పరిమాణం తగ్గిపోతూ, పరిసరాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
‘ఇంతింతై…’ పద్యాన్ని చదువుతున్న పాఠకులు కూడా పైన వివరించిన ‘డాలీ జూమ్ షాట్’ కలిగించే అనుభూతికి లోనౌతారు. డాలీ జూమ్ షాట్ తో పాటు, టిల్టప్ షాట్ కూడా ఈ పద్య వర్ణనలో కనిపిస్తుంది. పోతన ఒక నిష్ణాతుడైన ఛాయాచిత్ర గ్రాహకుడిలాగా ఈ పద్యాన్ని దృశ్యీకరించాడు. సమర్థుడైన చలన చిత్ర దర్శకుడు, ఛాయాచిత్రదర్శకుడు ఈ పద్యాన్ని చిత్రీకరిస్తే పైన వివరించినట్లు చిత్రీకరిస్తారని నా ఊహ, అలా చిత్రీకరిస్తే బాగుంటుందని నా నమ్మకం.
పై పద్యం తర్వాత వచ్చే సన్నివేశాన్ని పోతన ఇలా వర్ణించారు.
మ. రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవిమ త్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండము న్నిండుచోన్
(పోతన భాగవతము, అష్టమస్కంధం – 623)
సూర్యబింబాన్ని ఒక స్థిర ప్రమాణంగా తీసుకుని, క్రమక్రమంగా పెరుగుతూన్న వామనమూర్తి పరిణామాన్ని చూపించిన పద్యం. మొదట వామనుడికి సూర్యబింబం గొడుగు లాగా, తరువాత తలమీద మణి లాగా, పిమ్మట చెవికి పోగు గాను, అటు పిమ్మట కంఠాభరణం గాను, పిదప సువర్ణ భుజకీర్తిగాను, పిమ్మట చేతికి కాంతులీను మురుగు గాను, అటు తరువాత మొలకు కట్టిన గంటగాను, తదుపరి కాలికి అందె గాను, చివరకు వామనమూర్తికి పాద పీఠంగాను కనిపించింది.
‘ఇంతింతై…’ పద్యంలో పెరుగుతున్న త్రివిక్రముడిని చూపడానికి చుట్టూ వున్న పరిసరాలను స్థిరంగా వుంచి, ‘ఇంతలా అంతలా’ త్రివిక్రముడు పెరిగాడు అని చెప్పి, ‘రవిబింబంబు…’ పద్యంలో ఎదుగుతున్న వామనుడి పెరుగుదలను ఆకాశంలో స్థిరంగా ఉన్న సూర్యబింబంతో కలిపి చూపించి, వామనమూర్తి ఎదుగుతూంటే సూర్యబింబం క్రిందికి దిగివస్తున్నట్లు కనిపించిందని చెప్పారు. ఇది ఒక అద్భుత చిత్రీకరణ!
డాలీ జూమ్ షాట్ పద్ధతిలో ప్రధాన వస్తువు నుంచీ జూమ్ అవుట్(Zoom out) అవుతూ దృశ్యీకరించడానికి అనువైన పద్యం ఇది. త్రివిక్రముడిని స్థిరంగా ఉంచి, సూర్యబింబాన్ని ప్రధాన వస్తువుగా తీసుకుని, జూమ్ అవుట్ చేస్తూ పోతే – పెద్ద ఛత్రంగా వున్న సూర్యబింబం, క్రమక్రమంగా క్రిందకు దిగుతూ శిరోరత్నం, చెవి పోగు, కంఠాభరణం…చివరగా పాద పీఠం అవుతుంది.
పోతనకు డాలీ షాట్ల గురించీ, అస్సలు కెమెరాల గురించి తెలియదు కదా! అయినప్పటికీ ఇలాంటి Uహ చేశారంటే ‘కవయః క్రాంత దర్శినః’ అన్న లోకోక్తి పోతనకు అక్షరాలా అన్వయిస్తుంది. సామాన్యులు కూడా చూడలేని విషయాలను పోతన తన మనోనేత్రంతో చూసాడు. వామనమూర్తి విరాడ్రూపం గురించిన పై పద్యాలు పోతన క్రాంతదర్శిత్వానికి, నిశితపరిశీలనాదృష్టికి నిలువెత్తు నిదర్శనాలు.
తాను “విన్నంత కన్నంత” తేట పరుస్తానని భాగవతం అవతారికలోని కృతిపతి నిర్ణయంలో చెప్పినట్లుగానే, తాను మనోదృష్టితో దర్శించిన వాటిని పాఠకులకు చూపించడంలో పోతన మాట తప్పలేదు!
పైన వివరించిన రెండు పద్యాలు సినిమాటిక్ దృశ్యాలే! పోతన కవిత్వంలో దృశ్యీకరణానికి ఇవి మంచి ఉదాహరణలు.
3.2 బలి చక్రవర్తికి వామనుడుగా వచ్చింది శ్రీమహావిష్ణువు అని తెలిసినప్పుడు
బలిచక్రవర్తి వామనుడికి దానమివ్వడానికి నిర్ణయించుకున్న సందర్భంలో శుక్రాచార్యుడు, వామనుడుగా వచ్చింది విష్ణుమూర్తి అని చెప్పి దానం ఇవ్వవద్దని చెప్పారు. దానం ఇస్తే నువ్వు సర్వనాశనం అయిపోతావని హెచ్చరించారు. శుక్రాచార్యుని బోధనతో పాటు, బలిచక్రవర్తికి కూడా వామనుడి రూపంలో సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి తన ఎదుట చేయిసాచబోతున్నాడు అన్న విషయం అర్థమైంది. ఆ సందర్భంలో బలిచక్రవర్తి చేత చెప్పించిన పద్యం:
శా. ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!
(పోతన భాగవతము, అష్టమస్కంధం – 592)
లక్ష్మీదేవి కొప్పును సవరించిన విష్ణుమూర్తి చేయి. ఆమె శరీరాన్ని నిమిరిన చేయి. పైటకొంగును లాగిన చేయి. లక్ష్మీదేవి పాదపద్మములను పట్టుకున్న చేయి. చెక్కిళ్ళను స్పృశించిన చేయి. పాలిండ్లతో ఆడిన చేయి. ఆ చెయ్యి విష్ణుమూర్తిది! అలాంటి చెయ్యి దానం తీసుకోడానికి తన చేతి క్రింద వుండడం ఎంతటి అదృష్టమో కదా! ఆ అదృష్టం ముందు ‘రాజ్యము, గీజ్యము’ శాశ్వతం కావు. ఈ శరీరం మాత్రం పోకుండా ఉంటుందా? అన్నాడు బలిచక్రవర్తి.
పద్యం నడక, చెప్పిన భావం ఒకెత్తైతే, పద్యంలో కళ్ళకు కట్టినట్లు చూపించిన సన్నివేశం మరో ఎత్తు.
ఇక్కడ మరో విశేషం వుంది. ఇంతకు ముందు ‘ఇంతింతై’, ‘రవిబింబంబుపమింప’ పద్యాలలో వివరించిన దృశ్యీకరణకు విరుద్ధమైన దృశ్యీకరణను ‘ఆదిన్ శ్రీసతి కొప్పుపై’ పద్యంలో చూడవచ్చు. ‘ఇంతింతై’, ‘రవిబింబంబుపమింప’ పద్యాలలోనే దృశ్యం ఉంది. ‘ఆదిన్ శ్రీసతి కొప్పుపై’ పద్యంలో ప్రత్యేకంగా చలిస్తున్న చిత్రం లేదు. ఈ పద్యంలోని పదాలన్నీ విశేషణాలు మాత్రమే. కానీ ప్రత్యేక దృశ్యస్వభావం లేని సన్నివేశంలోనూ దృశ్యం చేయడం పోతన కవిత్వశిల్పానికి పరాకాష్ట!
విష్ణువు చేయి గొప్పదనం గురించి చెప్పిన వాక్యాలను ఒక్కొక్కటి ఒక చిన్న దృశ్యంగా చూపిస్తూ, వరస క్రమంలో చెప్పాడు పోతన. ఈ రకమైన దృశ్యీకరణ సినిమాటోగ్రఫీలో ‘మాంటేజ్ షాట్’(Montage Shot) కు దగ్గరగా ఉంది.
మాంటేజ్ షాట్ అంటే చిన్న చిన్న దృశ్యశకలాలను, క్రమబద్ధంగా పేర్చి ఒకే దృశ్యంగా చూపించడం.
శ్రీమహావిష్ణువు చేతిని అతి దగ్గరగా(Close up లో) చూపించి, అదే చెయ్యి లక్ష్మీదేవి కొప్పును సవరించడాన్ని ఒక దృశ్యశకలంలాగా, లక్ష్మీదేవి శరీరాన్ని ఆ శరీరంపై కదులుతున్న చేతిని మరో దృశ్యశకలంగా, పైటను సవరించడాన్ని ఇంకో దృశ్యశకలంగా…ఈ విధంగా పద్యంలో చెప్పిన వరసలో మిగిలిన దృశ్యాలను చిన్న చిన్న దృశ్యాలుగా చిత్రించి, దృశ్యశకలానికి దృశ్యశకలానికి నడుమ అతిదగ్గరగా తీసుకున్న విష్ణువు చేతిని కలిపి ఒకే దృశ్యంగా అంటే మాంటేజ్ షాట్ గా చూపించారు పోతన.
ఇలా ఒక పద్యాన్ని గానీ, ఒక వర్ణన గానీ కవి దృశ్యీకరణ చేస్తే పాఠకులు ఊహాశక్తితో పద్యాన్ని విభజించుకుని, మాంటేజ్ షాట్లుగా నిర్మించుకుని చూస్తారు. అందుకే పోతన నాకు ఒక ‘పొయటోగ్రాఫర్ (Poetographer)’ గా దర్శనమిస్తారు.
3.3 వామనుడు యాగశాలను దర్శించినప్పుడు
దృశ్యీకరణ ఛాయలు కనిపించే మరో పద్యం ఇది.
శా. చండస్ఫూర్తి వటుండుఁ గాంచె బహుధాజల్పన్నిశాటంబు, ను
ద్దండాహూత మునీభ్యబిభ్యదమృతాంధస్సిద్ధకూటంబు, వే
దండాశ్వధ్వజినీ కవాటము, మహోద్యద్ధూమ సంఛన్న మా
ర్తాండస్యందన ఘోటమున్, బలిమఖాంత ర్వేదికావాటమున్.
(పోతన భాగవతము, అష్టమస్కంధం – 531)
వామనుడు బలిచక్రవర్తి యాగశాలను చూసిన సందర్భంలోని పద్యమిది.
యాగశాల దగ్గర వాతావరణం ఎలా ఉందో చూపించే పద్యం. యాగశాల వాకిలికి ముందువైపున్న స్థలం ఏనుగులతో, గుఱ్ఱాలతో, సైన్యాలతో నిండిపోయి ఉంది. యాగశాలలో రాక్షసులు ప్రేలాపనలతో సందడి చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న గొప్ప మునులను చూసి దేవతలూ, సిద్ధులూ భయపడుతున్నారు. యజ్ఞకుండాల పొగలు సూర్యుని రథంలోని గుఱ్ఱాలను పూర్తిగా కప్పేసాయి.
పోతన ఈ పద్యంలో పాఠకులు తమ ఊహల్లో యాగశాలను నిర్మించుకోవడానికి అవసరమైన వివరాలను పొందుపరిచారు. రాక్షసులు, మునులు, దేవతలు, సిద్ధులు ఏయే స్థితుల్లో ఉన్నారో వివరించారు. సూర్యుని రథానికుండే గుఱ్ఱాలు పూర్తిగా యజ్ఞకుండాల పొగలతో కప్పబడ్డాయని చెప్పడంతో ఆకాశంలోకి పొగలు ఎంత ఎత్తుగా వెళ్ళాయో కూడా చెప్పారు.
ఇక్కడ ప్రత్యేకమైన దృశ్యీకరణ పద్ధతులేవీ కనిపించక పోయినా, ఒక పానొరామిక్ దృశ్యంగా మన ఊహకొచ్చే వివరాలున్నాయి ఈ పద్యంలో. దృశ్యీకరణలో ఇదొక పద్ధతి!
ఈ పద్యంలో నాకగుపించిన మరో విశేషం – భాష గురించి. ఈ పద్యంలోని భాష పోతన భాషలా అనిపించదు. సంస్కృతం పాలు ఎక్కువగా ఉండి, దీర్ఘసమాసాలతో నిర్మించిన పద్యం ఇది. బలి చక్రవర్తి యాగశాలను అత్యంత గొప్పగా చూపించడానికి పోతన ఇలాంటి శిల్పాన్ని ఎంచుకున్నారేమో!
వామన చరిత్రలో చాలా పద్యాలలో దృశ్యీకరణ ఛాయలు కనిపించినా, వ్యాస పరిమితుల దృష్ట్యా స్థూలంగా కొన్ని పద్యాలను మాత్రమే ఈ అధ్యాయంలో వివరించాను.
ప్రపంచ వాఙ్మయంలోనే ఎన్నదగ్గ కథగా ప్రశంసలందుకున్న గజేంద్ర మోక్షణంలో దృశ్యీకరణ అంశాలను తరువాతి అధ్యాయంలో చూద్దాం.