కాలం జ్ఞాపకాల చిత్రిక

మా నాన్న అసంపూర్ణ ప్రణాళిక : లల్లేశ్వరి అనుసృజన

1993 వేసవికాలం
భటియాల్ గృహం
బరాయన్, ఉదాంపూర్
జమ్మూ & కాశ్మీరు జిల్లా

నాన్న ఇంకా తన సుదీర్ఘమైన నడక నుండి ఇంటికి తిరిగి రాలేదు. నాన్న నిర్ణీత సమయానికి తిరిగి రాకపోతే నాయనమ్మ బబికి కంగారు మొదలైపోతుంది. నాన్న ఇవాళ ఒంటరిగా తిరిగి రాలేదు. తనతోపాటు ఇద్దరు పని వాళ్ళూ ఉన్నారు. మేము అద్దెకుంటున్న ఈ ఇంటి గేటు ముందర ఒక తోపుడు బండి ఆగి ఉంది. నాన్న పని వాళ్ళకు ఏవో సూచనలు ఇస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఒక దుంగను లాన్ లోకి మోసుకొచ్చారు. “ఇక్కడ కాదు. పైకి పట్టుకెళ్ళండి,” నాన్న మిద్దెను చూపిస్తూ అన్నాడు.

పని వాళ్ళిద్దరూ మిద్దెపై నాన్న తన అవసరార్థం తయారు చేసుకున్న సగం సగం తయారైన స్టూడియోలోకి ఆ దుంగను మోసుకెళ్లారు. మేడ పైకి ఆ దుంగను తీసుకెళ్తున్న దృశ్యానికి బబి, అమ్మ ఇద్దరూ నిర్ఘాంతపోయారు. ఇంతవరకూ ప్రతిసారీ నాన్న తన ఆలస్యపు నడకల నుండీ తిరిగి వచ్చేటప్పుడు తన వెంట తెచ్చుకునే చిన్న చిన్న కొమ్మలు, చితుకులు, రాళ్ల ముక్కలకు వాళ్లు ఓపికతో ఎప్పుడో అలవాటు పడిపోయి ఉన్నారు. కానీ, ఈసారి నాన్న తన వెంట ఒక సగం చెట్టునే తీసుకొచ్చేశాడు.

“తర్వాత ఏంటి? ఒక మొత్తం చెట్టే వస్తుందేమో?” అనుకుంటూ వాళ్లు ఆలోచనలో పడ్డారు.

నాన్న వాళ్లకు ఏ విషయమూ వివరించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడతడి నేస్తం నీటిలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన కొయ్య ముక్క(drift wood). దానితో, ఇంకా ఉలులు, చెక్క సుత్తులు, సుత్తులు, ఆకురాయి, రంపాలు, సాండ్ పేపర్, వార్నిష్, పెయింట్ కొన్ని బ్రష్‌లతో మాత్రమే ఇప్పుడతడి సహవాసం. రోజులో కొంత భాగాన్ని అలా ఆ స్టూడియోలో గడపడం అతడికొక ఆనవాయితీ అయిపోయింది.

కానీ నాయనమ్మ బబికి ఈ విషయమై కోపంగానీ, విచారంగానీ రాలేదు. ఎందుకంటే, ఇది కొడుకు మంచి కోసమేనని ఆమెకు తెలుసు! ఇదొక్కటే, నాన్నను ఏడవకుండా, క్రితం సంవత్సరం కమ్ముకున్న నిరాశ (డిప్రెషన్) కబంధహస్తాలలోకి వెళ్లకుండా కాపాడి ఆపగలిగేదని ఆమె గ్రహించింది. చెప్పాలంటే, ఇంతవరకూ ఈ చెక్కడం వ్యాపకం బాగానే పని చేసింది. బహుశా తన కళాత్మక సృష్టి ద్వారా మాత్రమే నాన్న మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టుంది. నాన్న ఎక్కువగా ఏడవడం లేదు, అలాగే మాట్లాడడమూ లేదు.

ఆ కొయ్యముక్కల కుప్పలోంచి కొన్ని ఆకారాలు ఒకటొకటిగా రూపుదిద్దుకుంటూ బయటపడ్తున్నాయి. ఒకదాని నుండి నేనైతే దృష్టిని మరల్చలేకపోయాను.

“ఇది నీ పూర్తయిన మొదటి పనా?” నాన్నను కుతూహలంగా అడిగాను.

“ఇంకా పూర్తి కాలేదు! దానికింకా చాలా శ్రమించాలి.”

“దీన్ని ఏమని పిలవవచ్చు?”

“నిర్వాసితుడంటే ఎలా ఉంటుంది?” నాన్న ముక్తసరి సమాధానం.

బహిష్కరణ, శరణార్థి జీవనం అతడి మీద ప్రభావాన్ని చూపడం వల్లనేమో, నాన్న దేహమంతా ఇప్పుడు పూర్తిగా వంగిపోయి ఉంది.

జనాలు ఈ బహిష్కృతుడిని చూడగానే ఇతడు మనందరి లాగే ఉన్నాడనుకుంటారు. ఇతడు నిర్వాసితులైన 5 లక్షల కాశ్మీరీ పండిత శరణార్థుల ప్రతిరూపం మరి!

అక్కడ ఒక సిలువ పైనున్న క్రీస్తు, ఒక నాట్యగత్తె కూడా ఉన్నారు. రెండూ కూడా ఇంకా పూర్తికాలేదు.


రోజూ నాన్న ఇలా నీటిలో కొట్టుకొచ్చే కర్రల కోసం అడవికి క్రమం తప్పక వెళ్లేవాడు. అడవిలో ఎన్నో నీటి ప్రవాహాలున్నాయి. నాన్న తనకు కావలసిన సరైన వాటి కోసం గంటలకొద్దీ అన్వేషిస్తూ ఉండేవాడు. నాన్న ఏం వెతుకుతున్నాడో అతనికే తెలుసు! కొన్నిసార్లు ఏమీ దొరకక ఒట్టి చేతులతో వెనుతిరిగి వచ్చేవాడు.

ఎంతో శ్రమతో కూడిన పనైనా, తన సమయాన్ని అలా అడవికి, స్టూడియోకి విభజించుకుని వెచ్చించేవాడు నాన్న. ప్రతిసారీ ఆయన స్టూడియోలో ఉన్నప్పుడు ఏదో ఆవహించినట్టుగానే పనిచేస్తుండేవాడు.

“ఈ చెట్టు మొదలుతో ఏం చేస్తావ్? నిన్ను జనాలు ఒక పిచ్చోడనుకుంటారు!” అమ్మ అనేది. నాన్న నిశ్శబ్దంగా నవ్వి బదులిచ్చేవాడు కాదు.

లాన్లోనూ, మిద్దె మీద పేరుకుపోతున్న ఈ తెచ్చిన కర్రలతో నాన్న ఏం చేయబోతారోనని, మా ఇరుగుపొరుగుకు, నాన్న స్నేహితులకు, ఇంటికి వచ్చి పోయేవారికి అందరికీ ఆశ్చర్యమే!

ఇవన్నీ చెలమలలోంచి, నది నుంచి, అడవిలోంచి వచ్చినవని నేను వాళ్లకు వివరిస్తూ ఉంటాను.

నాన్న పైన స్టూడియోలో పని చేసుకుంటున్నప్పుడు వాళ్లు నాన్న కోసం గంటల తరబడి వేచి చూస్తుంటారు.

నాన్నకు అడవిలోనూ, పెకిలించి వేయబడ్డ చెట్ల శిథిలాలతోనూ సాంత్వన దొరుకుతుందని వాళ్లకు తెలియదు. నిజానికి వాళ్లూ నాన్నకు విషాదాన్ని కలిగించే వాళ్లే! బహుశా, మమ్మల్ని మేమంతా ఈ చెట్లతో పోల్చుకుంటూ, ఒక పేగు బంధాన్ని పంచుకుంటుంటాం!

మిద్దె పైన నాన్న స్టూడియో ఉన్న మూల వెచ్చగా ఉంటుంది. ఆ చోటు ఎందుకూ పనికిరాని పాత న్యూస్ పేపర్లు, విరిగిన గిన్నె-ముంత, పాత కంబళ్ళు, చిరిగిపోయిన దుస్తులు లాంటి పారేయవలసిన వస్తువులు పెట్టే ప్రదేశం. “ఇది మీ సొంత ఇల్లే అనుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి” అని ఎంతో దయగల ఇంటి ఓనర్లైన భాటియాల్స్ మాకు ప్రతీ ఒక్క దానికి అనుమతినిచ్చారు.

పీకే గోజా, పి ఎల్ గోజా, భూషణ్ లాల్ కౌల్, విజయ్ జుట్సి, అర్జన్ దేవ్, మజ్బూర్‌లు సాయంకాలాలు మాతోనే గడిపే వాళ్ళు. కప్పులకు కప్పుల టీ, సిగరెట్లు విపరీతంగా తాగేవాళ్లు. కొన్నిసార్లు విస్కీ బాటిల్ను కూడా కొనుక్కొని తెచ్చేవాళ్ళు.

గాజు పలకలు కప్పి ఉన్న గదిలో వాళ్ళు ఎక్కువగా కూర్చునే వాళ్ళు. అక్కడి నుండి లాన్ స్పష్టంగా కనబడుతుంది. ఆ గదిలో, ఒక మూల ఒకదానిపై ఒకటి నీట కొట్టుకొచ్చిన దుంగలన్నీ పేర్చి ఉండేవి. మా ఇల్లు ఒక కట్టెల అడితిలా అనిపించేది.

మజ్బూర్ కాశ్మీర్ లోని అతని ఊరు జైనాపూర్ ఇంకా అనంత్ నాగ్ లోని స్టాండర్డ్ రెస్టారెంట్ గురించి తెగ మాట్లాడుతున్నాడు. కాశ్మీర్ అతని హృదయాన్ని పూర్తిగా ఆక్రమించేసుకుంది. జుట్సి చిత్రకారుడే కాకుండా ఒక శిల్పి కూడా. అతడి చిత్రాలు దగ్గర్లోనే ఉన్న అతడింటి గోడల్ని అలంకరించి ఉంటాయి. అందులో ఒక చిత్రం పేరు మార్తాండ్ శిథిలాలు (మార్తాండ్ రూయిన్స్).

తాను కాళిదాసు మేఘదూతానికి చేసిన అనుసృజన ఒబ్రా షెక్ (Obra Shech) లోంచి మజ్బూర్ పెద్ద ఖండికలను చదివి వినిపిస్తున్నాడు. వాళ్లు గాలిబ్, మజాజ్, ఫయాజ్, హెర్మాన్ హెస్సై ఇంకా లల్లేశ్వరీలను కూడా అడపా దడపా పఠిస్తున్నారు. తన సొంత కవితలను నాన్న అనువదించాలని మజ్బూర్ కోరిక. “నీ కవితలలో వాడబడిన ఎన్నో కాశ్మీరీ పదాల అర్థం నాకు తెలియదు,” నాన్న తన అసహాయతను వెలిబుచ్చాడు.

“నాకు ప్రాచీన పదాలను వాడడమంటే ఇష్టం!” మజ్బూరు సమాధానం.

“నిన్ను ఏ కాశ్మీరీ కవి ప్రభావితం చేశాడు?”

“ఎవ్వరూ లేరు!”

“మరి నీకు ప్రేరణ?”

“ఎవ్వరూ కాదు, నాదంతా స్వయంకృషి!”

“నీ ప్రవాస కవితలలో ప్రకృతిని ఎంతగానో వర్ణించావు కానీ, మనిషి ఏమయ్యాడు?”

“ప్రకృతిలో ఉన్న విషయాలే కదా మనిషికి ప్రతీక!”

నాన్న, హబ్బా ఖాతూన్ ఇంకా దీనానాథ్ నదీమ్ కవితల అనువాదం చేశాడు. మోతిలాల్ సాకి మా ఇంటికొచ్చినప్పుడు వలస, ఆశ్రయం కోల్పోవడం, ఇంటిని పోగొట్టుకోవడం మీద ఒక కవితను చదివి గుండె పగిలేలా ఏడ్చాడు.

మజ్బూర్ తన దీర్ఘ కవిత త్యోల్ ను చదివి విన్పించాడు. ఆ కవిత కొన్ని దృశ్యాల కూర్పు. లయబద్ధమైనది. సంగీతానికి అనుగుణమైనది. ఒక హంస కాశ్మీరుకు ఎగురుతుంది. అది ఆఖరు సారిగా ఒక్కసారి తన ఇంటికి వెళ్లాలనుకుంటుంది!


నాన్న లల్లేశ్వరీని చదువుతున్నాడు. కొన్ని వాఖ్‌లను (vaakh) వల్లించడం మొదలుపెట్టాడు. వాటిని వినడం ఒక చికిత్సతో సమానం. ప్రతీ వాక్కు భావచిత్రాలతో నిండి చెంప ఛెళ్ళుమనేలా తడుతుంటుంది.

నాన్న మిద్దె పైకి వెళ్లడం తగ్గించేసాడు. అతడ్ని ఆమూలాగ్రం కట్టి పడేసే ఇంకొక పిపాస మొదలైంది. నాన్న, లల్లేశ్వరీ వాక్కులను ఇంగ్లీషులోకి తర్జుమా చేయడం మొదలుపెట్టాడు.

మొదటిది- నాలుగే వాక్యాలు! రోజులకు రోజులు తీసుకుంటోంది. రోజులు, వారాలవుతున్నాయి. వారాలు, నెలలవుతున్నాయి.

“లల్లేశ్వరీ ఒక జెన్ యోగి” నాన్న చెప్పాడు. “ఆమె ప్రపంచాన్ని చూసే దృష్టిని పరికిస్తే నాకు బాషో (Basho) ప్రపంచపు దృష్టే గుర్తుకు వస్తుంది.”

నేను నాన్నకు ఆ అనువాదం పూర్తి చేయడానికి ఒక్క సంవత్సరం గడువు విధించాను. ఎందుకంటే, ముగింపు ఎప్పుడనేది తెలియడం ఎప్పుడూ మంచిదే! ఆ గడువులోగా పూర్తి చేయాలన్న ఉత్సుకత ఆసక్తిని కోల్పోకుండా చేస్తుంది. పైగా, నాన్నకు ఏ విషయం పైనైనా అనురక్తి కోల్పోవడానికి పెద్ద సమయం పట్టదు. అలాగైతే అతడు మరోసారి నిరాశలో మునిగి పోతాడేమోననే భయమూ నాకు లేకపోలేదు. నేనింకా గడిచిన దారుణమైన సంవత్సరాన్ని మరిచిపోలేకపోతున్నాను. అసలు నాన్న ఎప్పటికీ ఆ నిరాశలోంచీ బైటకు రాలేడనే అనుకున్నాను. కానీ, లల్లేశ్వరీ అతనికి ఆ చీకట్లో దారిదీపంలా మార్గదర్శనం చేయడం మొదలుపెట్టింది.

వచ్చే సంవత్సరం అతడి అనుసృజనను ముద్రించాలని తండ్రీకొడుకులిద్దరం ఒక నిర్ణయానికొచ్చాం.


దాదాపుగా రెండు డజన్ల నోట్ పుస్తకాలు నాన్న బల్లను ఆక్రమించాయి. ఈ ఐదేళ్లలో వాటి ఆవాసం ఆ టేబులై కూర్చుంది. లల్లేశ్వరీ ప్రాజెక్టు, ప్రేమతో కూడిన శ్రమై, అవిశ్రాంతంగా ఒక సాహసంగా సాగింది. దాన్ని పూర్తి చేయడం, పబ్లిష్ చేయటం అనేవి నాన్నకస్సలు పట్టని విషయాలు.

“అసలిలాంటివి ఎప్పటికీ పూర్తి కావు! మూలం లో ఉన్న పారదర్శకమైన దయ, లయ, సంగీతం, తత్వం, భావావేశం అనుసృజనలో ప్రతిబింబించడం అసాధ్యం!” అనేవాడు నాన్న.

ఈలోగా నాన్న మజ్బూర్ 40 కవితలని ఇంగ్లీషులోకి అనువదించాడు. ఇందుకు నాన్నకు కొన్ని నెలలు పట్టింది. పదేపదే, వ్రాసినవి తిరగరాస్తూ, మెరుపులద్దుతూ, మెరుగుపరుస్తూ ఉండేవాడు నాన్న.

మొత్తం మీద అప్పటికే సహనాన్ని కోల్పోతున్న మజ్బూరుకు ఒక 26 కవితల్ని అందించాడు.

నాన్న లల్లేశ్వరీ వాక్కులతో ప్రేరణ పొంది భక్తి కవిత్వం రాసిన బిమ్లారైనా కవిత్వాన్ని కూడా ఇంగ్లీషులోకి అనువాదం చేశాడు.

ఒక్కొక్కళ్ళుగా నాన్న స్నేహితులు ఉదాంపూర్ నుంచి జమ్మూకు మారడం మొదలెట్టారు. మజ్బూర్, సంతోషి, ఆర్ ఎల్ భట్, శైవం, శివ సూత్రాలు, అభినవ గుప్తుడు, శంకరాచార్యులు ఇంకా ఓషో గురించి తీవ్రంగా చర్చించేవారు.

“శైవమెప్పుడూ నాకర్థం కాలేదు. కానీ, లల్లేశ్వరీని చదవడం వల్ల నాకు శైవం, జెన్ బౌద్ధం అవగాహనలోకి రావడం మొదలుపెట్టాయి. లల్లేశ్వరీ నిజమైన శైవురాలు!” అన్నాడు నాన్న.


“కుండ, కుమ్మరి రెండూ ఒకటే” నాన్న చెప్పాడు.

లేహ్ లోని స్కూల్ ఆఫ్ బుద్ధిష్ట్ ఫిలాసఫీ, నాన్నకు టీచరుగా 1973లో ఉద్యోగమిచ్చింది. నాన్న అక్కడి విద్యార్థులకు ఇంగ్లీష్ చెప్పేవాడు. అక్కడున్న లామాలతో సాహిత్యాన్ని, తత్వశాస్త్రాన్ని విపులంగా చర్చించే అవకాశం నాన్నకు దొరికింది. చెప్పాలంటే, ఈ రెండు విషయాలు జీవితానికి ఉన్న రెండు పార్శ్వాలు లాంటివే కదా! నాన్న బౌద్ధ పాఠాలను చదివాడు. తత్వశాస్త్రంలో అతడి ఆసక్తి మరింతగా పెరిగింది. ఎందరో జెన్ మాస్టర్స్ ఉపదేశాలు నాన్నకు పూర్తిగా కంఠోపాఠమయ్యాయి. చెల్లాచెదరై కనుమరుగైన ఎన్నో బౌద్ధ కథలకు ప్రాచీన జ్ఞానంతో, మేధాశక్తితో పునర్నిర్మాణం చేశాడు.

ఉదాంపూర్ లో లల్లేశ్వరీని పదేపదే నాన్న పఠిస్తున్నప్పుడు ఆమె అతడి అన్వేషణకు సమాధానమిస్తున్నట్టుగా మాట్లాడుతోందా అనిపించేది. ఆమె అతనితో అనేకమైన రూపాలలో సంభాషిస్తుండేది. ఒకసారి కుమ్మరి చక్రంపై మట్టి ముద్దలా ఉండేది. ఇంకొకసారి తానే ఆ మట్టిముద్దను మలిచి కుండకు జన్మనిచ్చే కుమ్మరి అవతారం ఎత్తేది.

వర్షంలో కొట్టుకుపోతున్న పచ్చి మట్టి కుండ గురించి మాట్లాడేది. ఆమె తనను తాను త్యజిస్తున్నట్టు మాట్లాడేది. ఆమె ఒక శూన్యంగా మారడం గురించి మాట్లాడేది. ఆ శూన్యం గుండా మరో మహాశూన్యం లోకి ప్రవేశించే పరిణామం గురించి మాట్లాడేది.

ఆమె తన మార్గాన్ని కోల్పోయి మళ్లీ ఒక అనుమానంతోనే దాన్ని పొందడం గురించి మాట్లాడేది. ఈ పద్ధతి సరైనదేనా?

రావడమెప్పుడూ ఋజుమార్గం
మరలడమే సంక్లిష్టం …

ఆమె బాధ గురించి ఆనందం గురించి మాట్లాడేది. ఆమె ప్రభువు పలుకు గురించి మాట్లాడేది.

నా దేహం ఒక చాపం!
ప్రభువు పలుకు
దాని వంపు తీర్చే అగ్ని!

ఆమె చేతిలో ఉన్న తాడు ఇసుకతో చేసిందైతే? ఏం సాధించగలదామె? ఆమె తన దేహాన్ని ఒక బహిష్కృతుడి భూభాగంగా చేసి మాట్లాడేది!

ఆమె ఒక కల్లోలిత సాగరాన్ని, నదిని ఎదుర్కొంది. ఆవలి ఒడ్డున ఆమె ఇల్లు. ఆమె ఒక పడవ కోసం ప్రార్థించగానే, పడవ వచ్చింది. జలధిని దాటడం ఎలా? నావను నడిపే మాలి కోసం ప్రార్థించింది. ఆమె చేతిలో ఉన్నదంతా ఒక సన్నని తాడు. ఆ తాడుతోనే ఆమె ఈ పడవను లాగాలి. అదెంతో కష్టసాధ్యం. ఉన్నట్టుండి తాడు తెగిపోతే?

లల్లేశ్వరీ ఈ లాగడం గురించే మాట్లాడేది. ఈ పట్టు, ఆత్మదా? లేదూ, ఇంటిదా? ఇంటి వైపుకు వెళ్ళాలన్న తలంపుదా? ఇల్లెప్పుడూ నది అవతలి తీరం వైపే ఉంటుంది! అది, అద్భుతమై, శాశ్వతము, సతతము అయిన కాంతితో నిండిన చోటు, జీవితపు, ప్రపంచపు రహస్యాలన్నీ బహిర్గతమయ్యే చోటు, నీ దేహము, బుద్ధి, ఆత్మ సంగమించి ఒక్కటయ్యే చోటు!

ఆమె ఇంటికి చేరే ఆ ఒక్క కోరికనే స్పష్ట పరిచేది.

సత్యం ఒక పెరటితోట!
నిశ్చలమైన తపస్సనే పగ్గాలతో
దానికి కంచె వేయ్!

సంపూర్ణతకు ఇంకా పరిశ్రమిస్తూ, అన్వేషణ ఎప్పటికీ అణగక అనుభవశూన్యుడైన సృష్టికర్త గురించి ఆమె మాట్లాడేది. ఎటువంటి విభిన్న విశ్వాసాల, నమ్మకాల జనులూ సహితం, అదే తాడును లాగాలనే సమన్వయం కోసం పాటుపడుతున్న సృష్టికర్త గురించి ఆమె మాట్లాడేది.

మనం అన్వేషిస్తున్న ఈ పాటుకు నామకరణం ఎన్నటికీ జరగదు, మనకు దాని పేరూ తెలియదు. బహుశా, ఆమె ప్రభువుకు మాత్రమే ఆ పేరు తెలుస్తుంది. మనల్ని మనం దగ్ధం చేసుకునే అగ్నిపరీక్షను పూర్తి చేసుకోలేకపోతే ఆ పేరు మనకెప్పటికీ స్ఫురించదు కూడా.

లల్లేశ్వరీ శాశ్వతమైన జ్వాలలలో కప్పబడి, హద్దులు లేని నృత్యాన్ని చేస్తోంది. ఆమె అనాచ్ఛాదిత కాదు. ఆమె స్వర్ణ వస్త్రాలను ధరించి ఉంది.

ఒక్క పలుకు
ఈ నగ్న నృత్యానికి ప్రారంభం!

ఆమె కలకండకు బదులు కాలకూట విషాన్ని, నాభికి బదులు నేతి మిఠాయిని ఎంచుకుంది. ఆమె రెండును ఒకటి అని చెప్తోంది. ఇంకా మూడు, ఆరు కూడా ఒకటేనని చెప్తోంది. అంతా ఒకటేనని చెప్తోంది!

… అంతా ఒకటే అయినప్పుడు
ఒక్కటే ఉండి రెండు కానప్పుడు

అతడు కన్పించాడు!


2023 వేసవికాలం

జమ్ము — ఫరీదాబాద్

అమ్మా, నాన్న జమ్ములో, ఫరీదాబాద్ లో ఉన్న రెండు ఇళ్ల నడుమ కాలాన్ని గడుపుతున్నారు.

“చెక్కడం, రాయడం అనువాదాలు మాత్రమే చేస్తూ ఉండిన ఆ రోజులు నీకు గుర్తున్నాయా?” నేనడిగాను. “ఇప్పటికి మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. నీ లల్లేశ్వరీ అనుసృజన ఎలా వస్తోంది?” చిలిపిగా మళ్లీ అన్నాను.

ఈ 30 సంవత్సరాలలో అతడి అనుసృజనను నేనెన్నోసార్లు క్షుణ్ణంగా చదివాను. ఎన్నో ప్రశ్నలు వేశాను. వయోభారంతో కొన్నింటికి శబ్దాలతో, కొన్నింటికి నవ్వుతో మరికొన్నింటికి నిశ్శబ్దంతోను సమాధానమిచ్చాడు నాన్న.

నా ఒక ప్రశ్నకు జవాబిస్తూ, లల్లేశ్వరీ తన వాక్యాలను ఇంగ్లీషులో రాసి ఉంటే ఎలా రాస్తుందో అన్న ఒక ఊహ పైనే తన అనువాదమంతా చేశానని చెప్పాడు నాన్న.

మా నాన్న చేసిన అనువాదమంతా లల్లేశ్వరీ తన వాక్కులలో ఉపమానంగా వాడుకున్న ఉల్లిపాయ లాంటిదే! ప్రతి ఉల్లిపాయకి ఒలిచి చూడడం కోసం ఎన్నో పొరలు వేచి ఉంటాయి. కానీ, ఆ అభ్యాసం సంఘర్షణతో కూడుకున్నది. ఆధ్యాత్మిక, తాత్వికతల గల సృజన యొక్క కేంద్రానికి, గర్భానికి చేరుకుని, ఆ అస్తిత్వాన్ని నిలుపగలిగే అనుసృజన చేయడం నల్లేరుపై నడక కాదు.

మా నాన్న చేసిన ఈ అనుసృజన పై కాలం ధూళి, మా నాన్న సృజనాత్మక స్ఫూర్తి, మార్మికత, గుహ్యము-గోప్యము అయిన జ్ఞానాన్ని క్లుప్తమైన నాలుగు వాక్యాలలోనే అందించగలిగే లల్లేశ్వరీకి మాత్రమే చెందిన ప్రజ్ఞ, పొరలు పొరలుగా కప్పుకుపోయి ఉన్నాయి.

“30 సంవత్సరాలు దాటినా నీ అనువాదం అసంపూర్ణంగానే ఉండిపోయింది నాన్నా!” నేనింకా వెక్కిరిస్తూ ఉన్నాను.

నాన్న నవ్వేడు!

“లల్లేశ్వరి తత్వం శాశ్వతమైనది. దాని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం, ఇంకా ఎక్కువైనా పట్టొచ్చు,” నాన్న బదులు పలికాడు. “అందుకే నా అనుసృజన ఎప్పటికీ అసంపూర్ణమే!”

[తాక: లల్లేశ్వరి (లల్ల-ద్యద్ అన్నది ఆమెకు ముద్దుపేరు) 14వ శతాబ్దంలో కాశ్మీరీ శైవానికి చెందినటువంటి ఒక నగ్న యోగిని, సంచార అన్వేషిణి. ఈమెకు మన అక్కమహాదేవికి చాలా పోలికలు ఉంటాయి. 12 సంవత్సరాల వయసులోనే వివాహమైన లల్లేశ్వరి భర్త వల్ల అనేకమైన ఆరళ్ళను పొంది చివరికి 26వ సంవత్సరంలో ఇల్లు పూర్తిగా వదిలి ప్రపంచాన్వేషణను మొదలుపెట్టింది. సెద్ బోయ లేదా సిద్ధా శ్రీకాంతా అనబడేటటువంటి గురువు ద్వారా కాశ్మీరీ శైవం లోకి ఈమె అడుగు పెట్టిందిట. కాశ్మీరీలో వాఖ్‌లనబడే నాలుగే వాక్యాలున్న చిరుగీతాల ద్వారా ఈమె తన ఉపదేశాలను, ప్రబోధాలను కొనసాగించింది. ఆమె నడయాడిన అప్పటి కాలమాన పరిస్థితులు బట్టి ఈమె ప్రబోధాలలో సూఫీ తత్వం తాలూకా ఛాయలు కూడా కొన్ని ఉన్నాయని విజ్ఞుల మాట. నా దగ్గర శ్రీ అరవింద్ గిగో రాసిన ఇంగ్లీషు అనుసృజన మాత్రమే ఉన్నది. శ్రీ రంజిత్ హోస్కోటే అనువాదం ఇంకా ప్రామాణికమైనదని ఇంటర్నెట్ సమాచారం. — రచయిత.]