ఓడిస్సీ (ఒడిస్సియస్ సాహస యాత్రలు) — ముందుమాట

ఓడిస్సీ (Odyssey) అని పిలవబడే ఈ గ్రంథాన్ని “ఒడిస్సియస్ సాహసయాత్రలు” అని కూడా పిలుస్తారు! ఆంగ్లభాషలో ఓడిస్సీ (odyssey) అంటే తెలుగులో మహాప్రస్థానం అని అర్థం.

మనకు రామాయణం, మహాభారతం ఎలాంటివో, గ్రీసు దేశస్థులకు — ఆ మాటకొస్తే పాశ్చాత్యులకు — ఇలియాడ్, ఓడిస్సీ అనేవి అటువంటి గ్రంథాలు. స్థూలంగా ఇలియాడ్‌ని భారతం తోటీ, ఓడిస్సీని రామాయణం తోటీ పోల్చవచ్చు. రామాయణ, మహాభారతాలు చదవకుండా భారతీయ మనస్తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అలాగే ఇలియాడ్, ఓడిస్సీ గ్రంథాలు చదవకుండా గ్రీసు దేశపు సాంప్రదాయాలనే కాకుండా పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య కళలనూ, పాశ్చాత్య ఆలోచనా సరళిని అర్థం చేసుకోవడం కష్టమే.

భారత కథలో దైవాంశ సంభూతులైన వీరులు, అక్కడక్కడ అవతార పురుషులు, దేవతలు కనబడినట్లే ఇలియాడ్, ఓడిస్సీలలో కూడా మానవులు, దేవతలు కలగాపులగంగా కనబడతారు. భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగితే ఇలియాడ్‌లో ట్రోయ్ యుద్ధం పది సంవత్సరాలపాటు జరుగుతుంది. ట్రోయ్ యుద్ధం ముగిసిన తరువాత ఆ యుద్ధంలో పోరాడి, బ్రతికి బయటపడిన ఒక వీరుడు ఇంటికి తిరుగుముఖం పట్టినప్పుడు, మరొక పదేళ్లపాటు కష్టాలు పడుతూ చేసిన సాహసయాత్రలోని భయంకరమైన అనుభవాలే ఓడిస్సీలోని కథ. ఈ వీరుడి పేరు ఒడిస్సియస్. ఇతను ఇథకా దేశపు (పట్టణపు) రాజు. ఒడిస్సియస్ అంటే గ్రీకు భాషలో “అరివీర భయంకరుడు” అని అర్థం చెప్పుకోవచ్చు. సముద్రంలో తుపానులు, ద్వీపాలలో మహాకాయులు, నరమాంస భక్షకులు, మంత్రగత్తెలు వగైరాలంతా ఒక వైపు పీడిస్తూ ఉంటే, అరివీరభయంకరుడు, ధీరుడు, సాహసుడు అయిన ఒడిస్సియస్ వారిని యుక్తితో ఎదుర్కుంటూ ఉంటాడు. ఒడిస్సియస్ ఇంటిని, సంసారాన్ని విడచిపెట్టి, తుపానులో చిక్కుకుని ఎక్కడో సముద్రం మధ్యన, పోరాటం జరపడం ఒకటైతే, ఒంటికన్ను రాక్షసుడి కోపానికి గురి అయి అష్టకష్టాలు పడడం మరొకటి. తన భార్యని, పిల్లడిని తిరిగి చూడాలనే కోరిక ఏ కోశాన్నయినా ఉంటే అతను ఆకలితో నకనకలాడుతూన్న నరమాంస భక్షకులని ఎదిరించగలగాలి, అందాలు విరజిమ్మే మంత్రగత్తెని తన యుక్తితో ఓడించగలగాలి, ఆరు తలకాయల రాక్షసి బారినుండి తప్పించుకోవాలి. ఇవన్నీ అతని సమయస్పూర్తికి, సహనశీలతకి అగ్నిపరీక్షలు!

ఈ ఒడిస్సియస్ అన్న పేరే లేటిన్ భాషలో యులిసెస్‌గా (Ulysses) రూపాంతరం చెందింది కనుక ఇంగ్లీషు అనువాదాలలో యులిసెస్ పేరు ఎక్కువగా కనిపిస్తుంది. విక్టోరియా రాణి కాలంలో ఆస్థాన కవిగా ప్రసిద్ధి చెందిన టెన్నిసన్ (Tennyson) యులిసెస్ పేరుతో ఒక ప్రముఖమైన పద్యం రాసేడు. ఈ పద్యంలో వయస్సు మీద పడుతూన్నప్పటికీ జీవితంలో కొత్త అనుభవాల కొరకు ఎదురు చూసే వ్యక్తిగా యులిసెస్ చిత్రీకరించబడ్డాడు. ప్రఖ్యాత ఐర్లండు దేశపు రచయిత జేమ్స్ జోయిస్ (James Joyce) రాసిన యులిసెస్ (Ulysses) అనే నవల గ్రీకు యోధుడి సముద్ర ప్రయాణానికి ఇరవైయవ శతాబ్దపు ప్రతీక అనుకోవచ్చు. జేమ్స్ జోయిస్ పుస్తకం నిర్మాణంలో అధ్యాయాల పేర్లు హోమర్ ఓడిస్సీలోని అధ్యాయాల పేర్లతో సరిపోలి ఉండడమే కాకుండా ఈయన కథలోని పాత్రలు లియోపాల్డ్ బ్లూమ్ (Leopald Bloom) ఒడిస్సియస్‌కి, మాలీ బ్రౌన్ (Molly Brown) పెనలొపీకీ, స్టీఫెన్ డెడాలస్ (Stephen Dedalus) టెలెమాకస్‌కి ప్రతీకలు!

ఈ గ్రంథానికి వందకి పైగా ఇంగ్లీషు అనుకరణలు, అనువాదాలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు, వాటిని చదివి విద్యార్థులు అర్థం చేసుకోడానికి అనేక ఉపకరణ గ్రంథాలు ఉన్నాయి. వీటిలోని అంశాలని ఆధారంగా చేసుకుని అనేక భాషలలో సినిమాలు తీసేరు. విమానంలో ప్రయాణం చేస్తూన్నప్పుడు వారు చూపించిన ఒక చిన్న ‘వీడియో’ చూసిన తరువాత నాకు గ్రీకు పురాణ గాథలపై ఆసక్తి కలిగింది. అదే ఈ గ్రంథరచనకి ప్రేరణ కారణం అయింది. ఈ గ్రంథం మీద పని ప్రారంభించే ముందు గ్రీకు పురాణాలలో కథలు చదివేను. ఒలింపస్ కొండ మీద ఉండే గ్రీకు దేవుళ్లు ఎలా వచ్చేరో అర్థం చేసుకున్నాను. పాశ్చాత్య దేశాలలో ఉన్నత పాఠశాల స్థాయిలో విద్యార్థులకి ఈ కథలతో కొద్దో గొప్పో పరిచయం ఉంటుంది! కనుక ఇక్కడ నేను చెప్పేదాంట్లో కొత్తేమీ లేదు.

ఈ గ్రంథాన్ని ఇదివరకు ఎవ్వరైనా తెలుగులో అనుకరణ చేసేరో లేదో నాకు తెలియదు. నాకు ఈ గ్రంథం యొక్క ఉనికి తెలిసి ఉన్నా, ఈ గ్రంథంలోని ముఖ్యమైన ఒకటి, రెండు సంఘటనలతో పరిచయం ఉన్నా, దీన్ని సమగ్రంగా అధ్యయనం చేసినది ఇటీవలి కాలంలోనే. కనుక నాలాంటివాళ్ళు ఇంకా ఉంటారనే భావనతో, వారికి ఈ గ్రంథాన్ని పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో దీనిని తేలికైన తెలుగు వచనంలో, సంక్షిప్తపరచి రాయడానికి ఉపక్రమించేను. ఎంతవరకు కృతకృత్యుడనయ్యానో పాఠకులే నిర్ణయించాలి.

తెలిసినది కొద్దిగా ఉన్నప్పుడు సర్వమూ తెలిసినట్టే ఉంటుంది. ఒకించుక తెలుసుకున్నాక తెలియనిది తెలుస్తుంది! నేను రాసిన చిత్తుప్రతిని జాగ్రత్తగా చదివి, కేవలం అచ్చుతప్పులనే కాకుండా, భాషాదోషాలని, అంతర్గతంగా చోటు చేసుకున్న పరస్పర వైరుధ్యాలని ఎత్తి చూపి, సహాయం చేసిన మిత్రుడు ఇంద్రగంటి శర్మకి నా ధన్యవాదాలు. ఇంకా తప్పులు కనిపిస్తే వాటికి నేనే బాధ్యుడను!

వేమూరి వేంకటేశ్వరరావు
ప్లెజంటన్, కేలిఫోర్నియా

సంప్రదించిన మూలాలు

1. Samuel Butler, The Odyssey: by Homer, April 2025, Available at Barnes & Noble Classics, and other publishers and online bookstores.
2. Mary Pope Osborne, Tales from the Odyssey, Part 1, Disney-Hyperon, Los Angeles, CA, 2010
3. Mary Pope Osborne, Tales from the Odyssey, Part 2, Scholastics, New York, NY, 2011
4. వేమూరి వేంకటేశ్వరరావు, గ్రీకు పురాణ గాథలు, ఈమాట, జనవరి – డిసెంబరు 2020
5. వేమూరి వేంకటేశ్వరరావు, గ్రీసు దేశపు పురాణ కథలు, సైన్సు వ్యాసాలు-పుస్తకాలు
6. Cliff Notes, The Odessey
7. Wikipedia
8. Encyclopedia Britannica


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి:

వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.

 ...