అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 5

2014 అక్టోబర్ నాటి థోరాంగ్ లా కనుమ విషాదాల పునశ్చరణ, కనుమ దగ్గరిలోని టీ హౌస్ చేరుకున్న 35మంది బృందపు సభ్యులలో ముందుకు సాగి గమ్యం చేరుకోవాలని పొంగిపొరలుతోన్న ఉత్సాహం – ఈ నేపథ్యంలో అందరం టీ హౌస్‌కు వీడ్కోలు పలికి మెల్లగా జాగ్రత్తగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. శారీరక-మానసిక ప్రయాసలతో కూడిన, ఐదువేల మీటర్లు దాటిన ఎత్తుకు చేరే ప్రయత్నం కొనసాగించాం. మాది బహు పెద్ద బృందం కదా – ఈ చివరి ఘట్టంలో ఎవరి వేగం వారిదనీ, ఎవరి కష్టం వారిదనీ మాకు తెలుసు. బృందపు సమన్వయకర్తలుగా ఎవరికి వారు తమ తమ వేగాలు నిర్ణయించుకోవడాన్ని గమనిస్తూనే నేనూ బాబూ గురంగ్ చిట్టచివరి కొద్దిమందితోపాటు నడిచాం. అది మా బాధ్యత – బృందపు రక్షణ దృష్ట్యా మేమలా ఆగి, చివర నడుస్తున్న వారితో నడవడం అవసరం. ఆ దశలో ప్రతి అడుగూ ఒక సాహసక్రీడలా పరిణమించింది. మామూలుకన్నా పది రెట్లు శ్రమా పట్టుదలా అవసరం అయ్యాయి.



థోరాంగ్ లా పాస్

థోరాంగ్ హై క్యాంప్‌నుంచి తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకు, చీకట్లు విడనే విడని సమయంలో, శ్రుతి మించిన చలిలో, 536 మీటర్లు ఎగువన ఉన్న కనుమకేసి, అనుభవం ఉండీ లేని 35మంది ట్రెకర్లు పళ్ళబిగువున ముందుకు సాగుతున్నారూ అంటే అది చిన్న విషయం కాదు. మన తోటివారంతా మనలానే సంకల్పబలంతో పది రోజుల శ్రమకు ఫలితంగా లభించే విజయం కోసం అడుగులు వేస్తున్నపుడు, ఆ అడుగుల్లో మన అడుగులూ కలిపి వ్యక్తిగత విజయాన్ని బృందపు విజయంగా పరిణమింపజేద్దాం అన్న ఆలోచన అందర్నీ ముందుకు నడిపించింది. వ్యక్తిగత శారీరక శక్తికన్నా సామూహిక సంకల్పబలం ఘనమైనది అని అడుగడుగునా నిరూపితమవుతోన్న సమయమది. ఎన్నోసార్లు గమ్యం చేరిపోయాం అనిపించినా మళ్ళా ఎదురుగా ఎక్కవలసిన ఎత్తులు కనిపించేవి.



అలాంటి సంక్లిష్ట సమయంలో కాస్తంత దూరాన ఉన్న బృందమొకటి మాకేసే చూస్తూ మమ్మల్ని కేరింతలతో పిలవడం కనిపించింది. తీరా చూస్తే వాళ్ళంతా మాకన్నా కాస్తంత ముందుగా థోరాంగ్ లా కనుమ చేరుకున్న మా బృందపు సభ్యులే! చిట్టచివరికి, నాలుగు గంటల ట్రెక్ తర్వాత, మేమంతా 5416 మీటర్లు ఎత్తున ఉన్న థోరాంగ్ లా కనుమ చేరుకున్నామన్నమాట. మాటలకందని అనుభూతి మనసునిండా పరచుకొంది. నెలల తరబడి ప్రణాళికలు వేసుకున్న యాత్ర సఫలమయింది. ఆ ఉన్నతబిందువు దగ్గర నిలబెట్టి ఉన్న ఫలకం దగ్గర బృందమంతా చేరి ఫోటోలు దిగినపుడు కలిగిన సంతోషం, సంబరం మా అందర్నీ పసివాళ్ళను చేసి కేరింతలు కొట్టించింది.


కనుమ చేరిన సంతోషాలను మనసులో నింపుకుని, అక్కడి స్వచ్ఛమైన చల్లని గాలిని గుండెల్లో నింపుకుని నింపాదిగా ముక్తినాథ్ వేపు అడుగులు వేసాం. ఐదారు గంటల అవరోహణ…

దారిలో థోరాంగ్ శిఖరం, యాక్ వకాంగ్ శిఖరం, థోరాంగ్ గ్లేషియర్ కనిపించి మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసాయి. దూరాన థోరాంగ్ శిఖరం వేపు సాగిపోతోన్న పర్వతారోహకులు కొంతమంది కనిపించారు. ఆ ఉన్నత శిఖరసీమలో అంత దూరంనుంచి వాళ్ళను చూసినపుడు ఈ కొండలూ శిఖరాల ముందు మనమెంత? మన ఉనికి ఎంత? అన్న భావన మరోసారి కలిగింది. నమ్రతతో మనసు నిండింది.



అన్నట్టు థోరాంగ్ లా కనుమ దాటి రావడమూ అంటే అన్నపూర్ణ శిఖరశృంఖలను వదిలి ధవళగిరి శిఖరాల వేపు వెళ్ళడం అన్నమాట. మనంగ్ జిల్లాను దాటి ముస్తంగ్ జిల్లాలోకి వెళ్ళడం అన్నమాట. దూరాన కనిపిస్తోన్న ధవళగిరుల హిమశిఖరాలు రారమ్మని పిలుస్తున్నట్టు అనిపించింది – మళ్ళా ఆ శిఖరాల దిగువన పరచుకుని ఉన్న మేఘాల సముద్రం… అంటే మేము మేఘాల సీమకు ఎగువన ఉన్నామన్న మాట. దీనిని క్లౌడ్ ఇన్వెర్షన్ అంటారు. విమానాలలో ప్రయాణం చేస్తున్నపుడు మేఘాలకు ఎగువన నిలబడి చూడటం జరుగుతూ ఉంటుందిగానీ మనం మన కాళ్ళ మీద నిలబడి క్లౌడ్ ఇన్వెర్షన్ చూడటం అన్నది అరుదుగా జరిగే ఘటన.

ఎక్కడంతో పోలిస్తే కొండలు దిగడం సులువు అనిపించవచ్చు. అది కొంతవరకు నిజమే. గాలి చిక్కనవుతుంది. శ్వాస సులభం అవుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. కానీ దిగేటపుడు మోకాళ్ళ మీద అదనపు భారం పడుతుంది. కాలు జారడానికీ బెణకడానికీ అవకాశం ఎక్కువ. దిగడమే కదా అని అజాగ్రత్తగా ఉండలేం. దృష్టిని దిగువనున్న బాట మీద కేంద్రీకరించి, ఎప్పటికి అవసరమైన నైపుణ్యాన్ని అప్పుడు సంతరించుకుంటూ దిగవలసి ఉంటుంది. కొంతమంది ఎక్కేటప్పటికన్నా దిగేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉండటం కూడా కద్దు.

మా బృందంలోని సభ్యులంతా ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలనగా చూసాను. లలిత చీలమండల దగ్గర నొప్పితో మెల్లగా దిగుతోంది. బాబూ గురంగ్ ఆమెకు సహాయం చేస్తున్నాడు. తన కజిన్ శైలజ ఆమెకు తోడుగా నడుస్తోంది. అనితారాణి, ఉమ, విను, శాంభవి ఏ ఇబ్బందీ లేకుండా నింపాదిగా నడుస్తున్నారు. వనతి మాత్రం తనకు కాస్తంత నలతగా ఉండటంవల్ల మెల్లగా నడుస్తోంది. సుమతి ఆమెకు సాయంగా ఉంది. అనితారాణి వనతికి ఏదో మందు అందిస్తోంది. విను ఆ ప్రక్రియలో పాలు పంచుకుంటోంది. మెల్లగా నేను వాళ్ళ దగ్గరకు చేరాను. అందరం ఒక ఉపబృందంగా ఏర్పడి మా నడక కొనసాగించాం. బాగా దిగుడుగా ఉన్న చోట్ల ఒకరికొకరం సాయపడుతూ సాగాం. మాతోపాటు అప్పటికే ఉన్న బాబూ గురంగ్‌కు తోడుగా రేషమ్ కూడా చేరాడు. అరగంటకోసారి నిలబడి, ఆగుతూ వెళ్ళాం. ‘మరేం పర్లేదు. మీకు అవసరమైనంతసేపు ఆగుతూ వెళదాం. తొందరేం లేదు’ అంటూ బాబు భరోసా ఇవ్వసాగాడు. తొందరగా వెళ్లాల్సిన అవసరం లేని మాట నిజమే – సాయంత్రమవడానికీ చీకటి పడడానికీ ఇంకా ఎంతో సమయం ఉంది. బృందమంతా క్షేమంగా ముక్తినాథ్ చేరుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.

కాస్తంత చదునైన ప్రదేశం చేరేసరికి మా మధ్య ముచ్చట్లు మొదలయ్యాయి. నేనూ, శాంభవి, వినూ కలసి కబుర్లు చెప్పుకోవడం మొదలెట్టాం. నాలాగే వాళ్ళిద్దరూ సైకియాట్రీ వైద్యులు. శాంభవి అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో జనరల్ సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తోంది. విను యూకేలోని బర్మింగ్‌హామ్‌లో చైల్డ్ సైకియాట్రిస్ట్. నాదేమో ఫోరెన్సిక్ సైకియాట్రీ విభాగం. స్థూలంగా చూస్తే సైకియాట్రీ అన్నది ఒకే వైద్యవిభాగం అనిపించినా సూక్ష్మవివరాల్లోకి వెళితే ఆ సైకియాట్రీలోనే కనీసం ఎనిమిది ప్రత్యేక విభాగాలున్నాయి. మేము ముగ్గురం సైకియాట్రీకి చెందిన విషయాలూ అనుభవాలూ పంచుకుంటూ ముందుకు నడిచాం. మా బృందంలోని ఇతర వైద్యులకు ఈ విషయాలు అంతగా ఆసక్తి కలిగించకపోవచ్చుగానీ ఒకే జాతి పక్షులం కదా – మా మాటలు చురుగ్గా సాగాయి.



కాలీగండకి లోయలో ప్రవేశం

అలా అయిదు గంటలసేపు దిగుతూ సాగాక 4100 మీటర్ల ఎత్తున ఉన్న ఫేడి అన్న గ్రామం దగ్గర భోజనవిరామం తీసుకున్నాం. నిజానికి అప్పటికే భోజనసమయం బాగా దాటిపోయింది. దానికి తోడు ఉన్నతశ్రేణులలో నడవడంవలన అందరికీ ఆకలి మందగించింది. అయినా, బలవంతాన అయినా అందరం ఏదో ఒకటి తిన్నాం. నా వరకూ నాకు మనంగ్ చేరుకోగానే ఈ ఆకలి మాంద్యం పట్టుకుంది. బలవంతాన తినగలిగినంత తింటూ వచ్చాను. భోజనాలతోబాటు ఎనర్జీ బార్‌లు ఆరగించాను. మధ్యమధ్యలో చాక్లెట్లూ పంచదార బిళ్ళలూ చప్పరిస్తూ వచ్చాను… భోజనం తర్వాత అందరం వేడివేడి టీ తాగాం. కొత్త శక్తి వచ్చినట్టనిపించింది. మా యాత్రలో అతి ముఖ్యమైన ఘట్టం – దాన్ని సవాలు అనాలి, దాటుకుని వచ్చిన సంతోషం, సంతృప్తి ఉండనే ఉన్నాయి. ట్రెక్ ముగించి అంతిమగమ్యం చేరుకోబోతున్నామన్న ఉపశమనం ఉండనే ఉంది.

ఫేడి నుంచి ముక్తినాథ్ సుమారు రెండు కిలోమీటర్ల దూరం. 300 మీటర్లు దిగువకు చేరాలి… కాలీగండకి లోయలో నడక… గంటన్నర పట్టేసింది. మా చిట్టచివరి ఉపబృందం ముక్తినాథ్ మందిరం చేరినపుడు మా బృందపు ఇతర సభ్యులందరూ మాకు స్వాగతం పలికారు. మాకోసం బాగా ఎదురుచూస్తున్నారేమో, మమ్మల్ని చూడగానే కేరింతలు కొట్టారు. శారీరకంగానూ, మానసికంగానూ బాగా అలసిపోయిన మాట నిజమే అయినా మా యాత్రను విజయవంతంగా ముగించి ముక్తినాథ్ చేరుకున్నామన్న సంగతి ఎంతో సంతృప్తి కలిగించింది. అలసటలు మెల్లగా జారుకున్నాయి. రోజంతా అనుకూల వాతావరణం అందించిన ప్రకృతి మాతకు మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాం.

ఆ రోజు మేమంతా ‘లో ముస్తంగ్ హిమాలయన్ రిసార్ట్’ అన్నచోట బస చేసాం. కాస్తంత విలాసవంతమైన ప్రదేశమది. బేసిషహర్ దాటిన తర్వాత నాగరిక ప్రపంచం అందించే కనీస సౌకర్యాలు మాకు మళ్ళా అక్కడ లభించాయి. నాగరిక ప్రపంచం అంటున్నానేగానీ అది పోలికలకు సంబంధించిన విషయం – ‘పాశ్చాత్య సదుపాయాలు’ అంటే సబబు అనుకుంటాను.



థోరాంగ్ లా కనుమ

అసలు హిమాలయసీమలోని నిర్మలగ్రామాలను అనాగరిక ప్రదేశాలు అనడమే పెద్ద పొరపాటు. తరతరాలుగా యుగయుగాలుగా అక్కడి వాళ్ళంతా తమదైన ఒక జీవనసరళిని సంతరించుకొని మనుగడ సాగిస్తున్నారు. అలాంటి చోట్లకు మనం వెళ్ళినపుడు వారి సంస్కృతినీ జీవనసరళినీ గ్రహించి, స్వీకరించి, గౌరవించడం సరైన పని. అలా చేయగలిగితే వారిలో కలసిపోవడం, ఆ సంస్కృతిలో కాసేపయినా భాగమవడం జరుగుతాయి.

ఇపుడంటే మా బృందంలోని వాళ్ళమంతా పాశ్చాత్య సౌకర్యాలకు అలవాటు పడ్డాంగానీ చిన్నపుడు మేమంతా ఇండియన్ టాయ్‌లెట్లు వాడిన వాళ్ళమే. అలాంటి అలవాట్లు వదిలిపెట్టి, మరికాస్త సౌకర్యంగా ఉంటాయన్న భావనతో మరో ప్రాంతపు అలవాట్లను మనవిగా చేసుకున్నాం. అంతమాత్రం చేత ఇదివరకటి అలవాట్లూ సంప్రదాయాలకు ఇంకా కట్టుబడి ఉన్న వాళ్ళను చిన్నచూపు చూడటం ఏ విధంగా సమంజసం? అసలది అహంకారం కాదూ?! భారతదేశంలో విద్యా ఉద్యోగావకాశాలు పెరిగిన 1970లు, 1980లలో ఎంతోమంది మధ్యతరగతి కుటుంబీకులు పాశ్చాత్య సౌకర్యాలను, జీవనసరళిని అనుసరించడం మొదలుపెట్టారు. వీరితో పోల్చి చూస్తే వారి ముందు తరాల వాళ్ళు వ్యవసాయ కేంద్రిత జీవనశైలిని అనుసరించిన మాట వాస్తవం. ఆ ముందు తరాల వాళ్ళ శ్రమ ఫలితమే ఇప్పటి తరాల వాళ్ళు అలవాటు పడిన సౌకర్యాల పరంపర… మా ట్రెకింగ్‌నూ, మాకు అంతగా అలవాటు లేని జీవనసరళికి అలవాటుపడడాన్నీ మా పూర్వీకుల పద్ధతులతో పునఃసంబంధం ఏర్పరచుకొనే చక్కని అవకాశం అని కూడా భావించుకోవచ్చుగదా…

ఆ రోజు అందరం సగటున పది గంటలు నడిచాం. ఇరవై కిలోమీటర్లు దాటుకుని వచ్చాం. 536 మీటర్ల ఎత్తుకు చేరాం. మళ్ళా 1600 మీటర్లు దిగివచ్చి ముక్తినాథ్ చేరుకున్నాం…




ముక్తినాథ్ క్షేత్ర దేవాలయం

ముక్తినాథ్ క్షేత్రం హిందువులూ బౌద్ధులూ ఇరువురికీ పవిత్రమైనది. భారత ఉపఖండంలో అత్యంత ఉత్తరాన ఉన్న హిందూమందిరంగా పేరుపొందిన వైష్ణవ క్షేత్రమది. హిందూమతపు ప్రాచీనగ్రంథాలలో ఈ క్షేత్రపు ప్రస్తావన కనిపిస్తుందట.

ముక్తినాథుడంటే మోక్ష ప్రదాత… భౌతికప్రపంచంలోంచి అలౌకిక ప్రపంచంలోకి మనిషిని చేర్చే శక్తి గల దేవుడు. హిందువులందరూ జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలనుకొనే క్షేత్రమిది. కానీ హిమాలయాల లోలోపల ఉండటంవల్ల అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. భక్తులు చాలావరకు పొఖారానుంచి జోమ్‌సోమ్ దాకా విమానంలో వచ్చి అక్కడనించి ఇరవై పాతిక కిలోమీటర్లు జీపు మార్గాన ముక్తినాథ్ చేరుకొంటూ ఉంటారు. గుడి అక్కడి కొండచరియలో ఉంది. ఎన్నెన్నో మెట్లు ఎక్కి పైకి చేరాలి. శారీరక శక్తి ఉన్నవాళ్ళు మెట్ల మార్గం తీసుకుంటే పెద్దవాళ్ళూ శక్తి లేనివాళ్ళూ గుర్రం ఎక్కో పల్లకీలోనో చేరుకుంటూ ఉంటారు.


అక్టోబర్ పదకొండో తారీఖు. మా ప్రయాణం మొదలెట్టి పదకొండు రోజులయింది. ఉదయం ఆరుగంటలకే మరికొంతమంది స్నేహితులతో కలసి ముక్తినాథ మందిరంకేసి నడక సాగించాను. మందిరానికి దారితీసే ప్రధాన మార్గాలన్నీ పూజాద్రవ్యాల దుకాణాలతో నిండి ఉన్నాయి. ఆ దుకాణాల్లో సాలిగ్రామాలు కూడా లభిస్తున్నాయి. ఈ సాలిగ్రామాలన్నవి కోట్లాది సంవత్సరాలనాటి డివోనియన్, క్రిటేషియస్ యుగాల నడుమ కాలానికి చెందిన సముద్రజీవుల శిలాజాలు. ఈ శిలాజాలు కాలీగండకి నదీగర్భంలో విరివిగా దొరుకుతాయట. ప్రపంచంలోకెల్లా అతి ఉన్నత శిఖరాల నిలయమయిన హిమాలయ ప్రాంతం, చరిత్ర పూర్వపు కాలంలో సముద్రగర్భంలో ఉండేది అన్నది నమ్మశక్యం కాని వాస్తవం!

మెట్లన్నీ ఓపిగ్గా ఎక్కి ముక్తినాథ్ క్షేత్రం చేరాం. ఆ క్షేత్రంలోని ముఖ్యమైన విష్ణుమందిరం నేపాలీ శైలిలో నిర్మించబడి ఉంది. ఆనాటి ఉదయం ఆ గుడిని చేరుకున్న తొలి సందర్శకులలో మేమూ ఉన్నాం. గుడి ప్రాంగణంలో, ఆ వెనుక ఉన్న కొండలోంచి పారి వస్తోన్న 108 చిరు జలధారలు కనిపించాయి. వాటిని ముక్తిధారలు అంటారట. వైష్ణవ సంప్రదాయం ప్రకారం 108 ‘దివ్యదేశాలు’ అని పిలవబడే పవిత్రమందిరాలు ఉన్నాయట. అందులో ముక్తినాథ్ ఒకటి. భారతదేశం వెలుపల ఉన్న ఒకే ఒక్క దివ్యదేశం ఈ ముక్తినాథ్ మందిరం. అలాగే అక్కడి 108 జలధారలు ఈ 108 దివ్యదేశాల ప్రతీకలట. ఒళ్ళు గడ్డ కట్టే చల్లని నీళ్ళతో కూడిన ఆ జలధారల దిగువనుంచి భక్తులు గబగబా నడచి రావడం గమనించాం. నేను ఆ సాహసానికి పూనుకోలేదు.

ముక్తినాథ్ క్షేత్రం బౌద్ధులకు కూడా పవిత్రమైనది అని చెప్పుకున్నాం కదా, కారుణ్యానికి ప్రతీక అయిన అవలోకితేశ్వర బుద్ధుని ఆలవాలమా ప్రదేశం అని బౌద్ధుల నమ్మిక. అలాగే 8వ శతాబ్దంలో వజ్రయాన బౌద్ధానికి పునాది వేసిన గురు పద్మసంభవుడు తాను టిబెట్‌కు వెళ్ళే ముందు ఈ ప్రదేశంలో ధ్యానం చేసాడట. టిబెట్ ప్రాంతంలో ఆయనను రింపోఛె అని వ్యవహరిస్తారు.

గుడి ప్రాంగణమంతా పెద్ద పెద్ద వృక్షాలు. ఆకురాలు కాలం కదా, ఆ వృక్షాల నిండా బంగారు వర్ణపు పత్రాలు. ఆవరణలో ఓ చిన్నపాటి శివాలయం కూడా ఉంది. నన్ను నేను పెద్ద భక్తుడిగా భావించుకోను. అయినా ఆ క్షణాన ఆ ప్రాంగణమంతా ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి ఆవరించి ఉంది అన్న భావన కలిగిన మాట మాత్రం నిజం. ఎనిమిది రోజులు ఎడతెగని కాలినడకలో నిమగ్నమై ఉండిన నాకు అక్కడి ఆ శక్తి గొప్ప ఉపశమనం. ఎంతోమంది హిందువులు, బౌద్ధులు ‘జన్మలో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి’ అని తపించే ఆ ముక్తినాథ్ క్షేత్రంలో కొంతసేపు గడపగలిగినందుకు ఎంతో సంతోషమనిపించింది.



ముక్తినాథ్‌లో బృహత్తర బుద్ధ విగ్రహం

ముక్తినాథ్ ప్రాంగణానికి దగ్గరలో ఉన్న చిరు శిఖరాన బృహత్తర బుద్ధ విగ్రహం కనిపించింది. అక్కడనించి ధవళగిరి, థాపా పీక్, తిలిచో పీక్, నీలగిరి శిఖరాలను ఏ అడ్డంకీ లేకుండా చూసి ఆనందించాం. వాతావరణం అనుకూలంగా ఉండటం, మేఘాలేవీ అడ్డు రాని నిర్మలాకాశం పర్వతాలను చక్కగా చూసి ఆనందించడానికి ఎంతో అనుకూలించాయి.

ధవళగిరి శిఖరం ప్రపంచంలో 8000 మీటర్ల ఎత్తును దాటిన 14 శిఖరాలలో ఒకటి. ఆ శిఖరపు దృశ్యం అంత చక్కగా ఆ ఉదయపు పూట చూడగలగడం అదృష్టమనే చెప్పాలి. ఇదే కోవకు చెందిన మనస్లు శిఖరాన్ని కూడా చూద్దామని ట్రెకింగ్ చేసిన మొదటి రోజుల్లో ఆశపడ్డాంగానీ మేఘాలూ వర్షాలవల్ల ఆ కోరిక తీరలేదు. బహుశా మేము పొఖారా చేరుకున్నప్పుడు ఆ శిఖరపు దర్శనమూ జరుగుతుందేమో – అదో ఆశ…

తిరిగి మా హోటల్ చేరుకుని తీరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేసాం. ఆ పూట ముక్తినాథ్‌కు వీడ్కోలు పలికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న జోమ్‌సోమ్ వరకూ నడిచి వెళ్ళి మా ట్రెక్ ముగించాలన్నది మా ఆలోచన. జోమ్‌సోమ్‌నుంచి విమానంలో ఖాట్మండూ చేరుకుని అక్కడినుంచి ఎవరి దేశాలకు వాళ్ళు వెళతారన్నమాట. మాలో కొంతమంది ఆ పూట కూడా ముక్తినాథ్‌లో ఉండిపోయి అక్కడ జీపులు పట్టుకుని సాయంత్రానికి జోమ్‌సోమ్ చేరుకోవడానికి ఇష్టపడ్డారు. అలా అయితే వారి పూర్వీకుల కోసం సంప్రదాయసిద్ధమైన పూజలూ ప్రార్థనలూ చేసే సమయం దొరుకుతుందని వారి ఆలోచన. నా వరకూ నాకు జోమ్‌సోమ్‌లో యాత్ర ముగించకుండా మరో మూడు రోజులపాటు ఇంకా ఉత్తరానికి వెళ్ళి అప్పర్ ముస్తంగ్ జిల్లాలో, టిబెట్ సరిహద్దుల్లో ఉన్న లొమాన్ థాంగ్ అన్న చిన్న పట్టణం చూసి రావాలన్న ప్రణాళిక ఉంది.



ఒక బౌద్ధ లామాతో

బ్రేక్‌ఫాస్ట్ ముగించి హోటల్ లాబీలోకి వెళ్ళినపుడు అక్కడ ఉన్న మా బృందపు సభ్యులతో మాట్లాడుతున్న ఓ బౌద్ధ లామా కనిపించాడు. ఆయన దలైలామా పరివారంలోని మనిషట. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివాసం. ముక్తినాథ్ క్షేత్రానికి తీర్థయాత్రలో వచ్చాడట. మా వాళ్ళంతా నన్ను తమ బృందపు నాయకునిగా ఆయనకు పరిచయం చేసారు. మా బృందాన్ని సమర్థవంతంగా థోరోంగ్ లా కనుమ దాటించినందుకు ఆయన నన్ను అభినందించాడు.

నేను లొమాన్ థాంగ్ ప్రయాణం పెట్టుకున్నానని విని ఆయన ఎంతగానో సంతోషించాడు. పదే పదే అభినందించాడు. అది నా అదృష్టం అని అన్నాడు. ఆయనకూ ఎగువ ముస్తంగ్ వెళ్లాలనీ అక్కడి టిబెట్ బాణీ బౌద్ధమఠాలు చూడాలనీ ఎంతగానో కోరిక అట. అందుకు అనుమతుల కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా నేపాల్ ప్రభుత్వం ఆ అనుమతులు ఇవ్వలేదట. తాను దలైలామా పరివారానికి చెందిన మనిషి అవడం వల్ల ఆ అనుమతులు ఇవ్వడం విషయంలో నేపాల్ ప్రభుత్వం మీద చైనా ప్రభుత్వపు ఒత్తిడి ఉందట. “నాకు అక్కడికి వెళ్ళాలని ఎన్నాళ్ళనుంచో ఎంతగానో కోరిక. తీరలేని కోరికలు మనసును మరింత మరింత మురిపిస్తాయి కాబోలు,” అంటూ నవ్వేసాడాయన. ‘నాకు ఇంకా ఆశ ఉంది. ఏనాటికో ఒక నాటికి అక్కడికి వెళతాను,’ అనీ అన్నాడు. నేను ఏయే మఠాలు చూద్దామనుకుంటున్నానో ఆ వివరాలు అడిగాడు. నేనా విషయం పెద్దగా ఆలోచించనే లేదని నిజాయితీగా ఒప్పుకున్నాను. మఠాల విషయంలో తనకు తెలిసిన విషయాలు చెప్పుకొచ్చాడాయన. తప్పకుండా చూసి రావలసిన వాటి గురించి మరింత వివరంగా చెప్పాడు. ‘నేను వెళ్ళలేకపోయినా నువ్వు వెళుతున్నావు. నీ ద్వారా నేను ఆయా భావోద్వేగాలను అందిపుచ్చుకుంటాను,’ అన్నాడు. ఇద్దరికీ మరి కాసేపు కలసి ఉండాలనీ, అనుభవాలు పంచుకోవాలనీ అనిపిస్తున్నా – అలా ఉండే అవకాశం లేదని తెలుసు. వీడ్కోళ్ళు చెప్పుకుని విడివడ్డాం.

దిగువ ముస్తంగ్ జిల్లాలోని కాగ్‌బెని అన్న పట్టణంకేసి మేమంతా నడక సాగించాం. కాలీగండకి నదీతీరం వెంబడే ఆ నడక సాగింది. మాతోపాటు రేషమ్, సంజయ్ కూడా వచ్చారు. కబుర్లు, చెణుకులు, కేరింతలు, ఉల్లాసాలతో మా నడక సాగింది. రోజుల తరబడి ఉన్నత పర్వతశ్రేణిలో ట్రెక్ చేసిన వత్తిడినుంచి మేమింకా బయట పడకపోయినా – అదంతా గడచిన దినాలకు చెందిన విషయం, ఆ శ్రమలూ ఒత్తిడులూ దాటి వచ్చేసాం అన్న ఎరుక అందరిలోనూ చోటు చేసుకుంటోన్న సమయమది. అప్పటిదాకా నవ్వడమన్నది లేకుండా ట్రెక్ చేసినవాళ్ళు కూడా ఇపుడు నవ్వు మొహాలతో, సేద తీరుతోన్న శరీరాలతో మనోహరంగా కనిపించారు.

మా నడక చిన్న చిన్న గ్రామాలగుండా సాగింది – వాటిల్లో రాణీ పౌవా అన్నది కాస్తంత పెద్ద గ్రామం. అక్కడి ఇళ్ళ మీద వంటచెరుకు కట్టలు కట్టి కనిపించింది – ఆ ప్రాంతాల్లో అది తరచూ కనిపించే దృశ్యం. ఆ ఇళ్ళ ముందూ వెనుకలనుంచి సాగిపోయే చిన్నపాటి కాలిబాటల మీద నడిచాం. ఆడవాళ్ళూ మగవాళ్ళూ తమతమ పనుల్లో మునిగిపోయి కనిపించారు. పిల్లల సంగతి సరే – ఆటలే ఆటలు. వాళ్ళంతా మాకేసి కుతూహలంతో చూసారేగానీ ఇలా డజన్ల కొద్దీ ట్రెకర్లు తమ ఊళ్ళగుండా సాగిపోవడమన్నది వాళ్ళకి చిరపరిచిత దృశ్యమనే అనిపించింది.

ఊళ్ళు దాటి నడచినపుడు ముక్తినాథ్-జోమ్‌సోమ్‌లను కలుపుతూ విమానాశ్రయందాకా సాగే తారురోడ్డు కనిపించింది. ఆ రోడ్డుకు రెండు పక్కలా యాపిల్ చెట్లు కనిపించాయి. అదంతా యాపిల్ పళ్ళు పండే ప్రదేశం అన్నమాట. యాపిల్ అనగానే మనకు అవన్నీ యూరప్‌నుంచి వచ్చిన పళ్ళు అనే అనిపిస్తుంది. నిజానికి యాపిల్ పండు ఆసియా ఖండానికి చెందినది. మధ్య ఆసియాలోని కజకస్థాన్ దాని జన్మభూమి. అక్కణ్ణించి యూరప్‌కూ, యూరప్‌నుంచి ప్రపంచపు నలుమూలలకూ విస్తరించిన పళ్ళవి.

తారురోడ్డు మీద నడక అనగానే అదేదో సుఖవంతం అనుకున్నాంగానీ ఆ ముక్తినాథ్-జోమ్‌సోమ్ రోడ్డు మాత్రం ఇక్కట్ల దారే! అసలే సన్నటి రోడ్డు, ఆపైన వచ్చే పోయే వాహనాలు – అనుక్షణం అతి జాగ్రత్తగా రోడ్డుకూ కొండచరియలకూ మధ్య ఉన్న కొద్దిపాటి స్థలంలో ఇరుక్కుని నడవాల్సి వచ్చింది. అంత ఇరకాటంలోనూ కొంతమంది స్థానిక యువతులు రోడ్ల పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టి ఉన్ని బట్టలు, హస్తకళారూపాలు, యాపిల్ పళ్ళతో చేసిన వంటకాలు అమ్ముతున్నారు.



కాగ్‌బెని

కాగ్‌బెని పట్టణం అందమైన లోయ నడుమ సుందరంగా నిలచి మమ్మల్ని పలకరించింది. కాలీగండకి నది ఒడ్డున, అటూ ఇటూ చిక్కని పచ్చదనం, ఆ పచ్చదనాన్ని దాటుకుని వెళితే ఎడారి రంగుల పర్వతసీమ – విలక్షణ సౌందర్యం ఆ పట్టణానిది. అన్నట్టు కాలీగండకి నదిని మేమంతా మొదటిసారి కాగ్‌బెని లోయకు చేరిన తర్వాతే చూసాం. అది బౌద్ధులకూ హిందువులకూ పవిత్రమైన నది. దిగువకు వెళ్ళి త్రిశూలి నదిని తనలో కలుపుకున్న తర్వాత నేపాల్ దేశంలో దాన్ని నారాయణి నది అని పిలుస్తారు. నేపాల్‌లో నారాయణిగా వ్యవహరించబడే ఆ నది భారతదేశంలో మాత్రం గండకిగానే పిలవబడుతుంది. బిహార్ రాష్ట్రంలో ప్రవేశించాక పట్నా నగరం దగ్గరి సోనేపూర్ అన్న పట్టణంలో గంగానదిలో కలుస్తుంది.

220 కిలోమీటర్లు సాగే క్లాసికల్ అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ ఈ కాలీగండకి నదీలోయ వెంబడే మరో 80-90 కిలోమీటర్లు సాగి పొఖారాకు చేరువన ఉన్న నయాపూల్ దగ్గర ముగుస్తుంది. మొత్తం 16 రోజులు పట్టే నడక అది. మేమంతా కాగ్‌బెని వరకే నడిచే కార్యక్రమం పెట్టుకున్నాం. స్థూలంగా బేసిషహర్‌లో మొదలెట్టి, మర్శియాంగ్దీ నదీలోయ వెంట నడచి, థోరాంగ్ లా కనుమ దాటి, ముక్తినాథ్-కాగ్‌బెని చేరడమన్నది క్లాసికల్ అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ మార్గంలో మూడింట రెండువంతులయితే ఈ కాలీగండకి నది వెంబడే కాగ్‌బెనినుంచి నయాపూల్‌వరకూ వెళ్ళడం ఆ మూడవ భాగం అన్నమాట. జీపులు నడిచే రోడ్లు పడటంలాంటి అనేక కారణాలవల్ల ఈ రోజుల్లో క్లాసికల్ మార్గం అంతా పూర్తిగా నడిచే ట్రెకర్లు ఎంతో అరుదు.

ముక్తినాథ్‌నుంచి కాగ్‌బెని చేరుకోడానికి నాలుగు గంటలు పట్టింది. 14 కిలోమీటర్లు. జోమ్‌సోమ్ దాకా నడచి వెళ్ళి అక్కడ ట్రెక్ ముగించాలని ముందు అనుకున్నాం. కానీ బాబూ గురంగ్ మరో సలహా ఇచ్చాడు: “చూస్తున్నారు గదా – ఈ దారంతా జీపుల హడావుడి. పోనీ కాగ్‌బెని దాకా నడిచామూ అంటే దారంతా అందమైన ప్రకృతి తోడుగా ఉంది. ఈ కాగ్‌బెని జోమ్‌సోమ్ దారిలో దుమ్మూ ధూళీ హడావుడీ తప్ప అందాలూ సౌందర్యాలూ లేవు. మేము మీ అందరికీ బస్సు మాట్లాడి పెడతాం. చక్కగా అందులో జోమ్‌సోమ్ చేరుకోండి,” అన్నాడు. మరో మాట లేకుండా మేమంతా ఒప్పుకున్నాం.



కాగ్‌బెని వెళ్ళేదారిలో

జోమ్‌సోమ్ చేరేసరికి మధ్యాహ్నం రెండయింది. వెళ్ళగానే భోజనాలు. అవి ముగిసాక మా పోర్టర్లందరూ సెలవు తీసుకునే సమయం వచ్చింది. వారందరికీ, వారితోపాటు మా గైడ్‌లకూ అభినందనలూ కృతజ్ఞతలూ చెప్పుకునే సమయమది. ప్రతి ఒక్కరినీ ముందుకు పిలిచి బృందమంతా చేసే హర్షధ్వానాల మధ్య వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించి వీడ్కోళ్ళు చెప్పాం.

భోజనాలూ వీడ్కోళ్ళూ ముగిసి అంతా సేదదీరుతోన్న సమయంలో నేనో టీ కప్పు చేతబట్టి బాబూ గురంగ్ దగ్గరకు చేరాను. మా ప్రయాణాలన్నింటికీ మూలాధారం ఈ బాబూ అన్న మనిషి. మా అందరి గౌరవం, అభిమానం పొందిన మనిషి. ఖాట్మండూలో ప్రయాణానికి ముందు రోజు యాక్సిడెంట్ జరిగి గాయాలు తగిలినా లెక్కపెట్టకుండా మాతోబాటు పది రోజులు నడిచి మా అందరికీ దిశానిర్దేశం చేసిన మనిషి. ఇపుడా గాయాలన్నీ పూర్తిగా మానిపోయి చక్కని ఆరోగ్యం సంతరించుకుని ఉన్నాడు. అవి మానడంలో మా వైద్యుల బృందం అందించిన సహాయ సహకారాలకు ధన్యవాదాలు చెప్పాడు. ఏదో అంటున్నాడేగానీ ఆ పర్వతపుత్రునికి అక్కడి చల్లని కొండగాలిని మించిన ఔషధం మేమిచ్చామని నేను అనుకోను. మా అందరి తరఫునా నేను అతనికి ధన్యవాదాలు చెప్పి వీడ్కోలు పలికాను.




ఆ రాత్రి భోజనాలు ముగిశాక అందరం వీడ్కోలు సమావేశానికి కూర్చున్నాం. మా అందరి అనుభవాలూ ఒకటే అయినా అనుభూతులు వేరువేరు. అంతా మనసు విప్పి మాట్లాడటం ఆరంభించాం. కలా నిజమా అనిపించే ట్రెకింగ్ గురించిన మా భావాలు పంచుకున్నాం. అసలీ యాత్రలో చేరాలన్న ప్రేరణ ఎలా కలిగిందో ఒక్కొక్కరూ చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఒక్కో నేపథ్యం. అంతా కలసి చేసిన ట్రెకింగ్ గురించి ఎవరి కథనాలు వారివి. ఆ అనుభవాన్ని అర్థం చేసుకోవడంలో ఎవరి బాణీ వారిది. అయినా అందరి నేపథ్యాలనూ, ప్రేరణలనూ, అనుభవాలనూ, అనుభూతులనూ కలిపి నిలిపి ఒకే ఒక్క అనునాదం వెలువడడం, ఆ అనునాదమే ఏకతాటిన అందరినీ థోరాంగ్ లా కనుమ దాటించడం – అలా అందరి అనుభవాలకూ పరిపూర్ణత ఏర్పడటం… ఆ పరిపూర్ణత ఆనాటి రాత్రి మధురసంగీతంలా పరిసరాలను ముంచెత్తి వదలడం… మరచిపోలేని సమావేశమది.

థోరాంగ్ లా కనుమ దాటడమన్నది అందరికీ ఒక అధివాస్తవిక అనుభవం. అనుభవరాహిత్యాన్నీ, అనారోగ్య సూచనలనూ, వాతావరణ సమస్యలనూ దాటుకుని ప్రతి ఒక్కరూ ఆ కనుమ దాటి రావడమన్నది బృందమంతటికీ సంతృప్తి కలిగించిన విషయం. ఈ నేపథ్యంలో పది రోజులపాటు హిమాలయాల్లో కలసి గడపడం అన్నది అందరి మధ్యా పటిష్టమైన అనురాగ బంధాలను నెలకొల్పింది. అలాంటి నిర్మల వాతావరణంలో ఏర్పడిన స్నేహాలు చిరకాలం నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.

అలాగే మాలో చాలామందికి స్థానికంగా లభించే సౌకర్యాలు అంతగాలేని టీ హౌసుల్లో ఉండటం, అందరితో గదులు పంచుకోవడం అన్నది అరుదైన అనుభవం. ఆ అనుభవంవల్ల అలా జీవితమంతా గడుపుతోన్న స్థానికుల మీద మా గౌరవాభిమానాలు పెరిగాయి. పరిమిత ఆర్థిక వనరులతో అపరిమిత వాతావరణ క్లిష్టతల మధ్య మర్యాద మన్ననలు మరచిపోకుండా వాళ్ళంతా జీవిస్తున్న తీరు మాకు అబ్బురం కలిగించింది.

మా అందరిదీ ఇలాంటి నడకలకు అంతగా అనుకూలించని నడివయసు. అంచేత శారీరకంగానే కాకుండా మానసికంగానూ మా మీద వత్తిడి ఎక్కువ. ఆ వత్తిడులకు లొంగకుండా మాలో ఉందని మాకే తెలియని దీక్షాపటిమతో యాత్ర ముగించడం – కలకాలం నిలచిపోయే జ్ఞాపకం.

ఇలాంటి ప్రయాణాలలో గమ్యంకన్నా గమనం ముఖ్యం. పరస్పర సహకారం, ఉమ్మడి దీక్ష అత్యవసరం. ఈ హిమాలయాల నడక మా అందరికీ మా దైనందిన జీవనవిధానంనుంచి కాస్తంత ఎడంగా నిలబడి మమ్మల్ని మేమే ఆవిష్కరించుకునే అవకాశం ఇచ్చింది. రొటీన్‌కు భిన్నంగా వెళ్ళి మాలోకి మేము తొంగిచూసుకునే అవకాశం ఇచ్చింది. ప్రకృతికీ, విశాలవిశ్వానికి దగ్గర అయ్యే అవకాశం ఇచ్చింది. ఆ ఎరుక అందరి మనసులనీ తాజాపరచి స్ఫూర్తివంతం చేసింది.

దారి పొడవునా – పది రోజుల పాటు, హిమాలయ శిఖరాలు మాకు తోడుగా వచ్చాయి. అన్నపూర్ణ 2, 3, 4 శిఖరాలు; లామ్‌జంగ్, పశ్చిమ తిలిచొ, పిసాంగ్, గంగపూర్ణ, పశ్చిమ చులు, ధవళగిరి, నీల్‌గిరి – దేనికదే బృహత్తర శిఖరం. అన్నీ ఆరువేల మీటర్లు దాటినవి; కొన్ని ఎనిమిది వేల మీటర్లు కూడా దాటినవి. ప్రతి ఒక్కటీ ఒక విశిష్ట రూపం. ప్రతి శిఖరానిదీ ఒక విలక్షణ వ్యక్తిత్వం. మంచు నిండిన విరాట్ శిఖరాలవి. వాటన్నిటినీ ఒకే ఊపులో చూడటం, వాటితో చెలిమి చేస్తూ గంటలకు గంటలు, రోజులకు రోజులు గడపటం – ఎంత గొప్ప అనుభవమది! హిమాలయ శిఖరాలను దేవతల ఆవాసమని ఎందుకంటారో బోధపడిన సమయమది.

శిఖరాలే అనుకుంటే వాటికి దీటుగా నిలిచిన లోయలూ ఊళ్ళ సంగతీ మరచిపోలేం. శిఖరాలు దూరపు చందమామలయితే ఇవి దగ్గరనుంచి కౌగలించుకునే తోబుట్టువులు. పిసాంగ్, హమ్దే, మనాంగ్, కాగ్‌బెని – అవన్నీ మా అందరినీ అక్కున చేర్చుకుని సేదదీర్చాయి. అక్కడి నదులూ, అవి ప్రవహించే కొండల నడుమ ఉన్న అఖాతాలు, వాటి మీద ఉండే ఊయల వంతెనలు – వాటిగుండా వెళ్ళడం; అదంతా ఒక మరపురాని అనుభవం. మేము దాటుకుంటూ వెళ్ళిన ఛామె, పిసాంగ్, తిమాంగ్, ఘయరు గ్రామాలు; రెండు రోజులు బస చేసిన మనాంగ్ గ్రామం – అవన్నీ మా స్వగ్రామాలే అనిపించాయి.

అన్నపూర్ణ ప్రాంతమంటేనే సాంస్కృతిక వైవిధ్యానికి అతి చక్కని వేదిక. రకరకాల తెగలకు అనాదినుంచీ ఆదరణ అందించిన ప్రదేశం. గురాంగ్‌లు, థకాలీలు, మనంగీలు – ఒక్కొక్కరిదీ ఒక్కో జీవన విధానం, సంస్కృతి. సంప్రదాయం. భాష. వీటన్నిటితోనూ పరిచయం ఏర్పరచుకొనే అవకాశం మాకు వారి వారి గ్రామాలగుండా వెళ్ళినపుడు కలిగింది. వారి ఆహారపుటలవాట్లను పర్వతశ్రేణి ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోగలిగాం. ఉదాహరణకు దిగువ ప్రాంతాలలో వరి ముఖ్యమైన పంట అయితే, నాలుగు రోజుల దూరాన ఉన్నతశ్రేణి ప్రాంతాల్లో బక్‌వీట్ ప్రధాన ఆహారం అవడం గమనించాం.

సాటి మనుషుల సహాయ సహకారాలు అన్నపూర్ణలాంటి సాహసయాత్రలకు ఎంత అవసరమో మాకు ప్రత్యక్షంగా తెలిసిన సమయమది. పోర్టర్లు, గైడ్‌లు, సూర్యశ్రేష్ఠలాంటి ట్రావెల్ ఏజెన్సీ మానేజర్లు – వీరిలో ఏ ఒక్కరు లేకపోయినా మేము చేసినలాంటి ప్రయాణాలు ఎంత అస్తవ్యస్తం అవగలవో, వారందరినీ బరువులు మోసే-దారులు చూపే పరికరాలుగా కాకుండా మనలాంటి మనుషులుగా, అనుభవం నిండిన స్నేహితులుగా పరిగణించిన పక్షంలో యాత్ర ఎంత నిర్దుష్టంగా, ఆహ్లాదకరంగా, అర్థవంతంగా, విజయవంతంగా సాగగలదో తెలిసి వచ్చిన సమయమది.

మా సంబరాలు అర్ధరాత్రి దాకా సాగాయి. కొంతమంది ముందుగానే నిద్రాదేవి ఒడిలోకి చేరినా చాలామంది చివరిదాకా ఉండి స్థానికంగా లభించే ‘ద ఓల్డ్ దర్బార్’ అన్న మదిరా సేవనంలో నిమగ్నమయ్యారు. ఉన్నతశ్రేణి పర్వతసీమల్లో ట్రెకింగ్ చేసేటపుడు ఆల్కహాల్ సేవనాన్ని నేను నిషేధిస్తాను. అది ఆరోగ్యరీత్యా సరైన పనిగాదని మా వైద్యులందరికీ తెలుసు. అయినా ఆ రోజు అలాంటి నిషేధాలు వర్తించవని కూడా మా అందరికీ తెలుసు. పైగా థోరాంగ్ లాతో పోల్చితే సగానికి సగం ఎత్తు ఉన్న కాగ్‌బెనిలో ఆల్కహాల్ చేసే హాని అతి తక్కువ.

అర్ధరాత్రికి చేరగానే అందరం సంబరాలు ముగించాం. నాకూ, నాతోపాటు వస్తోన్న సోమేశ్‌కూ మరో మూడు రోజుల ఎగువ హిమాలయాల యాత్ర ఉంది. అంచేత ఆ రాత్రి చక్కని నిద్రను సంతరించుకోవడం ఎంతైనా అవసరం. అలా అనుకుని సంబరాలు ముగించి పడక ఎక్కానేగానీ నిద్ర పట్టేదెక్కడ?! మనోయవనిక మీద మేమంటే మేమంటూ పోటీ పడి పరుగులు పెడుతోన్న అనేకానేక దృశ్యాలు నిద్ర పట్టనివ్వవు గదా… మంచుకొండల దొంతరలు, పచ్చని ప్రకృతి, పచ్చిక బయళ్ళు, మంచు నిండిన మైదానాలు, వృక్షాలతో క్రిక్కిరిసిన అడవులు, చంద్రమండలసీమను తలపించే ఎడారి భూములు, పచ్చల రాశుల్లాంటి వరి పొలాలు, గులాబీరంగు బక్‌వీట్ పంటలు, యాపిల్ తోటలు, ధగధగల గ్లేషియర్లు, విశాలంగా పరచుకున్న లోయలు, గలగల పారే సెలయేళ్ళు, శిఖరాలను హత్తుకుని సాగే కాలిబాటలు, ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపించే వంతెనలు, తీరిగ్గా గడ్డి మేసే జడల బర్రెలు, నింపాదిగా సాగిపోయే గ్రామాలు, భిన్నసంస్కృతులు, జూనిపర్‌లాంటి తుప్పల్లోంచి వచ్చే గాఢమైన సువాసనలు, రంగురంగుల మణికుడ్యాలు, వాటిలోని ప్రార్థనాస్థూపాలు, గొంపాలు, ఛోర్టన్లు, ఓం మణిపద్మేహమ్ అంటూ వినిపించే బౌద్ధమంత్రాలు, అడుగడుగునా కనిపించి పలకరించే సహృదయ గ్రామీణులు – ఇన్నిన్ని విషయాలు ఇబ్బడిముబ్బడిగా కళ్లముందు కదులుతూ ఉంటే ఇహ నిద్ర పట్టడం ఎలా…


అన్నపూర్ణ ట్రెక్ చెయ్యడానికి సరిగ్గా ఏడాది ముందు అక్టోబర్ 2022లో ఎవరెస్ట్ బేస్ కాంప్ ట్రెక్ చేసాను. రెండూ నేపాల్ హిమాలయాల్లో చేసిన ట్రెక్‌లేగానీ ఈ రెండు అనుభవాల మధ్యా ఎన్నో తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏమిటీ? అని స్నేహితులూ, వాటి గురించి నేను రాసిన వివరాలు చదివే పాఠకులూ తరచూ అడుగుతూ ఉంటారు. వీలయినంత స్పష్టంగా క్లుప్తంగా ఆ విషయాలు చెపుతాను.

అన్నపూర్ణ విషయంలో మా ట్రెక్ ఆరంభబిందువు ధారాపానీ చేరుకోవడానికి దాదాపు రెండు రోజులు రోడ్డు మీద ప్రయాణం చేసాం. ఎవరెస్ట్ విషయంలో మేము తిన్నగా ఆరంభబిందువు లుక్లాకు హెలికాప్టర్లో వెళ్ళిపోయాం. అలాగే అన్నపూర్ణ నడక మొదలెట్టిన ధారాపానీ 1860 మీటర్ల ఎత్తున ఉంటే లుక్లా ఏకంగా 2860 మీటర్ల ఎత్తున ఉంది.

అన్నపూర్ణ ప్రయాణం రెండు రోజులపాటు రోడ్డుమీద సాగడంవల్ల హిమాలయాల పాదచ్ఛాయలలోని లోయలు, పంటపొలాలు, హిందూ సంప్రదాయపు గ్రామాలు చూసుకుంటూ వెళ్ళే అవకాశం లభించింది. ఎవరెస్ట్ విషయంలో హెలికాప్టర్లు మమ్మల్ని తిన్నగా బౌద్ధ ప్రపంచంలో దింపాయి. ఆ తర్వాత మాకు తటస్థపడిన షెర్పా గ్రామాలూ, నామ్చె బజార్‌లాంటి పట్టణాలు ప్రధానంగా బౌద్ధసంస్కృతికి చెందినవి.

అలాగే ఎవరెస్ట్ ట్రెక్‌లో చిట్టచివరన తటస్థపడే నామ్చె బజార్ పట్టణం, అన్నపూర్ణ ప్రయాణంలో అదే బాణీలో నిలిచే మనాంగ్ పట్టణాల సంగతే తీసుకుందాం. ఇవి రెండూ వేరు వేరు అంతిమ గమ్యాలకు ప్రవేశద్వారాలవంటివి. రెండూ చూడచక్కనివి. సాంస్కృతికంగా ప్రాధాన్యం కలవి. నామ్చె బజార్ పట్టణం షెర్పా తెగల సంస్కృతికి దర్పణం పడితే మనాంగ్ పట్టణంలో మనకు మనంగ్‌ల సంస్కృతి కనిపిస్తుంది. ఈ రెండు పట్టణాలూ సుమారు మూడున్నరవేల మీటర్ల ఎత్తున ఉండి ఇంకా ఎగువన ఉండే చొరరాని ప్రాంతాలకు దారి తీస్తాయి. కానీ నామ్చె బజార్ చేరాలంటే రోడ్డు ముగిసే చోటినుంచి నాలుగైదు రోజులు ట్రెక్ అయినా చేయాలి, లేదా తిన్నగా లుక్లా దాకా ఆకాశమార్గాన్నైనా చేరుకోవాలి. మనంగ్ విషయంలో, అక్కడికి చివరిదాకా జీపుల్లో వెళ్ళే సౌకర్యం ఉంది. అంచేత నామ్చె బజార్‌తో పోల్చితే మనంగ్ పట్టణంలో ప్రధాన జీవనస్రవంతి ఛాయలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి.

ఎవరెస్ట్ ట్రెక్ మార్గంలో ప్రకృతి సౌందర్యం తక్కువ. నడక చాలావరకు పచ్చదనమెరుగని కొండలూ గ్రామాలగుండా సాగుతుంది. అలాగే సాంస్కృతికంగా షెర్పా బౌద్ధ సంస్కృతి ఒక్కటే కనిపిస్తుంది. అన్నపూర్ణ విషయంలో మొదటి రెండు మూడు రోజులు హిందూ సంస్కృతి, మనంగ్ దాటిన తర్వాత కూడా గురాంగ్, తమంగ్, మనంగ్, థకాలీలాంటి తెగల భిన్నసంస్కృతులు మనకు పరిచయమవుతాయి. అలాగే అన్నపూర్ణ మార్గంలో మనంగ్ వరకూ పచ్చని ఆడవులూ పంటపొలాలూ, కూరగాయలు, పళ్ళతోటలూ కనిపిస్తూ ఉంటాయి. ఎవరెస్ట్ మార్గంలో పొలాలూ పంటలూ అతి పరిమితం. అడపాదడపా బంగాళాదుంపలు, రెండు మూడు రకాల కూరగాయల పెంపకం మాత్రం కనిపిస్తుంది.



అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్

ఈ రెండు ట్రెక్‌లలో ఏది కఠినం అని అడిగితే ఎవరెస్టే కఠినం అని చెప్పాలి. ఆ ట్రెక్‌లో ఉన్నతశ్రేణి పర్వతాల నడుమ నడక ఎక్కువ. అక్కడ ఆరు రోజులపాటు 4000 మీటర్లు ఎత్తు దాటిన ప్రదేశాలలో బస చేసాం. మళ్ళా అందులో గోరక్షెప్ అన్న 5000 మీటర్లు దాటిన చోట రెండు రాత్రిళ్ళు గడిపాం. పోల్చి చూస్తే అన్నపూర్ణ మార్గంలో రెండు రాత్రులు మాత్రమే 4000 మీటర్ల ఎత్తును దాటిన ప్రదేశంలో గడిపాం.

స్థూలంగా చెప్పాలంటే ఎవరెస్ట్ విషయంలో శ్రమ ఎక్కువ. సాంస్కృతిక వైవిధ్యం, ప్రకృతి సౌందర్యం తక్కువ. స్థానిక సంపర్కాలు తక్కువ. అక్కడి గ్రామాలు చాలావరకు ట్రెకర్లు, టూరిస్టులకోసమే నెలకొని ఉన్నాయి. సీజన్ ముగిసాక మూతపడతాయి.

నన్ను వ్యక్తిగతంగా ‘నువ్వు ఏ ట్రెక్‌ను ఎక్కువగా ఇష్టపడ్డావు’ అని అడిగితే ఖచ్చితంగా ఇదీ అని చెప్పలేను. దేని ప్రత్యేకత దానిది. కానీ నాకు అన్నపూర్ణ ట్రెక్‌ను సమన్వయం చెయ్యడం ఎవరెస్ట్‌కన్నా పెద్ద సవాలుగా నిలిచిందని చెప్పుకోవాలి. 35మందిని తీసుకువెళ్ళడం సవాలే గానీ, బృందమంతా విజయవంతంగా ట్రెక్ ముగించినపుడు కలిగే సంతృప్తి ముందు ఆ సవాలు ఏపాటిదీ? ఆ అద్భుతయాత్ర అందించిన మరపురాని అనుభవాలు వెలలేనివి.

(సమాప్తం)