నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం

ఇప్పటి తరానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటే కొన్ని బాగా గుర్తుండే సినిమా పాటలు రాసిన కవిగా మాత్రమే ఎక్కువగా తెలిసి ఉండి ఉండవచ్చు. ఈనాడు కవిత రాస్తున్నటువంటి చాలామంది ఆధునిక కవులకు కృష్ణశాస్త్రి 20వ శతాబ్ద ప్రారంభంలో ఒక గొప్ప కవిత్వ ఉద్యమానికి దారి తీసిన వాడని, భావకవుల్లో అగ్రగణ్యుడని చాలా సుకుమారమైనటువంటి భావుకత్వం కలిగినవాడని అస్పష్టంగా తెలుసు; కానీ, కృష్ణశాస్త్రి కవిత్వంలోని సారాంశం ఏంటి? ఆయన కవిత్వం దేనికి ప్రతీకగా నిలబడుతుంది? దేన్ని ప్రతిపాదించింది? దేనికోసం ఆయన జీవితం అడుగడుగున తన కవిత్వాన్ని ఒక దివిటీగా తీసుకుని ప్రపంచంలో ముందుకు నడిచాడు? అన్న విషయాల గురించి ఇప్పటి కవులకి పాఠకులకు కూడా ఎక్కువగా తెలియదని నా ఊహ. సాధారణంగా ఇప్పటి కవిత్వ చర్చల్లో కానీ, సాహిత్య చర్చల్లో కానీ కృష్ణశాస్త్రి గురించిన ప్రస్తావనలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే తన సమకాలీన ప్రపంచంలో తను కవిత్వం రాస్తున్న రోజుల్లో గొప్ప సంచలనంగా ఒక వెలుగుగా ఒక ఉజ్జ్వలమైన ఉద్యమంగా వెలిగినటువంటి మహాకవి నెమ్మదిగా కాలం గడుస్తున్న కొద్దీ అతికొత్త కవితా ధోరణులు సాహిత్య ప్రపంచంలో ప్రవేశించడం మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా ఆయన స్థానాన్ని నవీన కవిత్వోద్యమ నాయకులు ఆక్రమించారని, ఆయన ప్రభ కొద్దిగా మసకబారిందని అనిపించడం సహజం.

కానీ ఒక్కసారి కృష్ణశాస్త్రి కవిత్వంలోనికి గాని మనం తొంగి చూసినట్లయితే అది నిత్యనవీనమని ఆ కవిత్వం నిత్యవసంతమని ఆ పువ్వులు ఎప్పటికీ వాడవని ఆ కవిత్వాన్ని మనం సమీపించకపోవడం ఒక్కటే మనం ఆ కవిత్వం తాలూకు వెలుగుకి దూరం కావడానికి కారణమని అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక్కసారి ఆ కవిత్వాన్ని పునఃపరిశీలించడం ద్వారా, ఆ కవిత్వాన్ని చేరడం ద్వారా, ఆ కవిత్వానికి కైమోడ్చడం ద్వారా మనం మరొకసారి ఆ మహాకవికి నివాళిని అర్పించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ఈ వ్యాససమర్పణ.

ఆధునిక కవిత్వానికి పునాది కృష్ణశాస్త్రి కవిత్వం

కృష్ణశాస్త్రి 1920 నుంచి దాదాపుగా 1950 దాకా కూడా కవిత్వంలోనూ, 1950ల తర్వాత చలనచిత్ర రంగంలో, రేడియోలో, వివిధ రకాల ప్రసార మాధ్యమాల ద్వారా ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించారు. అయితే 1950లకు పూర్వం కృష్ణశాస్త్రి కవిత్వం — అంటే మొదటి ప్రపంచయుద్ధానికి రెండో ప్రపంచయుద్ధానికి మధ్య వచ్చిన కృష్ణశాస్త్రి కవిత్వం — ఒక ధోరణి లోనూ, రెండవ ప్రపంచ యుద్ధానంతరం — ముఖ్యంగా 1950 తర్వాత కృష్ణశాస్త్రి కవిత్వం — మరొక ధోరణిలోనూ కొనసాగిందని అనుకోవాలి. మొదటి దశలో ఆ కవిత్వం అంతా ఒక అన్వేషణ, ఒక తపస్సు, ఒక ఉద్యమస్వభావం, తక్కిన ప్రపంచాన్ని అంతటిని కూడా ఉర్రూతలూగించి ముందుకు తోసి ముందుకు నడిపించేటటువంటి ఒక గుణంతో, జ్వాజ్వల్యమానమైన లక్షణంతో నడిచింది. ఆ తరువాత కాలపు కవిత్వం? అప్పటికి కృష్ణశాస్త్రి 50 ఏళ్ళు దాటాయి. ఒక ఉన్నతస్థితికి చేరుకున్నాడు. కవిగా, ఒక ఋషితుల్యుడిగా ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా కవిత్వంగా, వినిపించినదంతా సంగీతంగా, పలికినదంతా అమృత ప్రాయంగా పర్యవసించడాన్ని మనం చూస్తాం.

అయితే రెండవ దశ కవిత్వంలో ఆ కవిత్వం ప్రబోధించేది కానీ, ముందుకు తోసేది కానీ, నడిపించేది కానీ, లేదా మనల్ని ఉద్రేకించేది కానీ, ఉద్వేగించేది కానీ కాదు. అది మనలను ఆహ్లాదపరిచేది వెన్నెల్లాగా; సంతోషపరిచేది చల్లని పాటలాగా. మొదటి దశ కవిత్వంలో ఈ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ కూడా దానిలో ముందుకు తోసే గుణం ఏదో ఉంది. దాన్ని చదివే ప్రతి పాఠకుడిని, వినే ప్రతి శ్రోతనూ నిలవనివ్వని, ఒక చోట ఆగనివ్వని గుణం, ఒక ఉద్వేగం ఏదో ఆ మొదటి దశ కవిత్వంలో ఉంది. ఈ ఉద్వేగపు కవిత్వంనుండే మొదటితరం భావకవులంతా పుట్టుకొచ్చారని చెప్పవచ్చు. నిజానికి ఈ కవిత్వంనుండే అభ్యుదయ కవిత్వోద్యమం, దాన్నుంచే శ్రీశ్రీ, దాన్నుంచే తరువాతి విప్లవ, దిగంబర, అనుభూతి కవిత్వోద్యమ పంథాలు పుట్టుకొచ్చాయని కూడా వాదించవచ్చు.

ఎముకలు కుళ్ళిన వయస్సు
మళ్లిన సోమరులారా చావండి రక్తం మండే
శక్తులు నిండే సైనికులారా రారండి

అని శ్రీ శ్రీ అంటున్నప్పుడు అది భావనలో సారాంశంలో భావ కవిత్వానికి విరుద్ధమని మనకు అనిపించినప్పటికీ దాని యొక్క అంతస్సారంలో, ఆ ముందుకు తోసే గుణంలో, నడిపించే గుణంలో ప్రబోధించే గుణంలో అది అక్షరాల కృష్ణశాస్త్రి అడుగుజాడలో నడిచినటువంటి గేయమే.

ఆ రకంగా విప్లవ కవిత్వానికీ, దిగంబర కవిత్వానికీ, అంతకు ముందు అభ్యుదయ కవిత్వానికి, దాని ముందు భావ కవిత్వానికి వీటన్నిటికీ కూడా ఆలంబనగా, పునాదిగా కృష్ణశాస్త్రి కవిత్వంలోని ముందుకు నడిపించే గుణం, సంచలింపజేసే గుణం ఇతర ఆధునిక కవులకు పునాది అయ్యింది.

కదిలేది కదిలించేది మునుముందుకు నడిపించేది
పెనునిద్దుర వదిలించేది కావాలోయ్ నవకవనానికి

అని శ్రీ శ్రీ రాసిన నవకవితలో ‘కదిలేది’, ‘కదిలించేది’ అనే మాటలు ఆయన కృష్ణశాస్త్రి నుంచే పట్టుకున్నాడని మనం అనుకోవాలి. ఆ మాట ఈ రోజు చాలా ఆశ్చర్యకరంగా వినిపిస్తుంది కానీ ఒక వందేళ్ల తర్వాత ఈ కవిత్వాన్ని మనం నిర్మమత్వంతో ఆనాటి సమకాలీన రాగ ద్వేషాలకు దూరంగా మనం పరిశీలించినప్పుడు చాలా స్పష్టంగా కృష్ణశాస్త్రి నుంచే ఆధునిక తెలుగు కవి ప్రతి ఒక్కడు కూడా ప్రభవించాడని మనం నిశ్చయంగా చెప్పుకోవచ్చు.

తొలితరం ఆధునిక కవుల ధోరణి — కృష్ణశాస్త్రి ప్రత్యేక స్వరం

దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదటి దశ కవిత్వంలో ప్రధానంగా మూడు సంపుటాలుగా వచ్చినటువంటి ఆయన కవితలు ఉన్నాయి. కవితలు అంటే పద్యాలు. ముఖ్యంగా తేటగీతి, ఆటవెలదులవంటి దేశి ఛందస్సులలో కూర్చిన పద్యాలు. అవి ‘కృష్ణపక్షం’, ‘ప్రవాసం’, ‘ఊర్వశి’ అని మూడు కవితా సంపుటాలుగా వచ్చాయి. ఇందులో ముఖ్యంగా ‘కృష్ణపక్షం’ కవితా సంకలనం ఆయన 1921లో ప్రారంభించి ఆ తరువాత 1926 దాకా ఉన్న రాసినటువంటి కవితలు. 1929లో అప్పుడు నవ్యసాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఉన్నటువంటి శివశంకరస్వామి ఒక చక్కటి ఉపోద్ఘాతంతో దాన్ని ‘కృష్ణపక్షం’ అనే పేరుతో వెలువరించారు.

‘కృష్ణపక్షం’ అనే ఈ కవితా సంకలనం వెలువడక ముందు తెలుగులో ఆధునిక వైతాళికులుగా చెప్పబడే వాళ్ళు – గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావులు. గురజాడ అప్పారావు ఆధునిక కవితా ప్రవర్తకుడు. ఆయన్ని కృష్ణశాస్త్రి పరిపూర్ణంగా అనుసరించాడని చెప్పడానికి లేదు. గురజాడ పూర్తిగా మాత్రా ఛందస్సులు స్వీకరించినటువంటి కవి. కృష్ణశాస్త్రి కూడా గురజాడ ధోరణిలో రాసిన రెండు మూడు ముత్యాలసరాలు ఆ మొదటి సంపుటాల్లో ఉన్నాయి, కానీ ఆయన పరిపూర్ణంగా ఆయన తోవ నడిచిన కవి కాదు. కానీ గురజాడ అప్పారావు ప్రధానమైన లక్షణాలు ఏవి ఉన్నాయో వాటిని కృష్ణశాస్త్రి యుగధర్మాలుగా పుణికి పుచ్చుకున్నాడు. కానీ వాటిని నేరుగా గురజాడ నుంచే తీసుకున్నాడు అని చెప్పడానికి లేదు. అసలు 1920ల నాటికి కృష్ణశాస్త్రి మీద గురజాడ అప్పారావు విస్పష్టమైన ప్రభావం ఏది లేదని మనం నిస్సంశయంగా చెప్పవచ్చు.

మరొక ముఖ్యమైన కవి రాయప్రోలు సుబ్బారావు. అప్పటికే, రాయప్రోలు అమలిన శృంగారభావనలతో, ఒక ప్రణయ కవిత్వాన్ని — తెలుగులో ఒక కొత్త రకం కవిత్వాన్ని — ఆత్మాశ్రయమైన కవిత్వాన్ని తీసుకువస్తున్నారు. కానీ ఆ కవిత్వానికి కృష్ణశాస్త్రి కవిత్వానికి మధ్య చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. దీన్ని తర్వాత రోజుల్లో చాలామంది విమర్శకులు ముఖ్యంగా ఆర్. ఎస్. సుదర్శనం లాంటి వాళ్ళు చాలా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. రాయప్రోలు సుబ్బారావు కూడా ప్రేమ గురించి ప్రణయం గురించి మాట్లాడారు కానీ ఆయన ప్రేమకి, ప్రణయానికి ఉన్న నేపథ్యం చాలా భిన్నమైనటువంటిది.

రాయప్రోలు సుబ్బారావు పద్యాల్లో ఒకచోట ప్రియురాలు ప్రియుడి కోసం వేచి ఉన్న దృశ్యాన్ని వర్ణిస్తూ:

హేమపాత్రల జందన మెండిపోయె
ద్వారములు మ్రోయుచున్నవి హారములను
సానలందింకె స్నానకషాయగంధ-
మబల యెవనికోసము సగమయి కృశింతు

ఈ చందనం ఎండిపోవడం, హారములను ద్వారాలు మోయుచున్నవి అనడం, ఈ స్నానకషాయగంధం, హేమపాత్రలు, హారాలు, తోరణాలు ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే సామంతయుగ సంస్కృతి – జమీందారు యుగసంస్కృతి; వెనక కాలపు సంస్కృతి; ఈ వెనకకాలపు సంస్కృతిలో వెనకకాలపు కవితాసామగ్రిలో అంతరించిపోతున్నటువంటి కులీనయుగపు సామగ్రి మధ్యలో, ఆ సుబ్బారావు ఒక కొత్త భావనను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు. సారాంశం కొత్తది, భావన కొత్తది, అభివ్యక్తి కొత్తది, కానీ కవితాసామగ్రి మాత్రం ప్రాచీన యుగాన్ని సూచించేటువంటి కవితాసామగ్రి.

ఆ రకంగా చూసినట్లయితే కృష్ణశాస్త్రి కవితాసామగ్రి నవీనయుగం తాలూకు కవితాసామగ్రి. అందువల్ల “రాయప్రోలు సుబ్బారావు తాలూకు నేపథ్యంలో, ఛత్రఛాయలో కృష్ణశాస్త్రి కవిత్వం రాశారు” అని చెప్పడానికి లేదు. అసలు ఆ మాటకొస్తే కృష్ణశాస్త్రి తన యవ్వన కాలంలో సుబ్బారావుని చదివి, ఆయన యొక్క ఉద్బోధ వల్ల ప్రేరితులై రాశారు అని మనం ఏ విధంగా చెప్పడానికి ఆధారాలు లేవు.

మరి మూడవ కవి – ఇటువంటి భావనా బలంతో రాసిన కవి – అబ్బూరి రామకృష్ణరావు. ఆయన కూడా ఒక కొత్త రకపు ధోరణితో కవిత్వం రాసాడు. అంతేకాక, ఆయన సామంతయుగానికి చెందినటువంటి కవితా సామగ్రిని వాడలేదు. కానీ అబ్బూరి ప్రభావం కూడా కృష్ణశాస్త్రి మీద నేరుగా ఉందని చెప్పడానికి లేదు. ఎందుకంటే అబ్బూరి కవిత్వం చాలా సున్నితమైనటువంటి మృదువైనటువంటి కవిత్వం. అది కదులుతుంది, కానీ కదిలిస్తుంది అనడానికి లేదు. అందువల్ల దానిలో పెనునిద్ర వదిలించే లక్షణాలు లేవు. అది చాలా కాంతాసమ్మితంగా, చాలా మృదువుగా, ఒక హితవాక్యంలా వినిపించేటువంటి కవిత్వమే తప్ప, నిన్ను కుదిపి, నిన్ను ముందుకు తోసి, నిన్ను నిలవనివ్వకుండా ఉండేటువంటి గుణం దానిలో లేదు. దానికి కారణం ఏంటంటే – అబ్బూరి రామకృష్ణారావు వ్యక్తిత్వంలోనే అటువంటి ఒక సంచలిత మనస్కుడు, ఉద్విగ్నమనస్కుడు లేడు. ఆయన కవిత్వం ఒక గాఢతప్తతలోనూ ఒక అన్వేషణలోనూ దగ్ధమైపోయినటువంటి హృదయంతో రాసినటువంటి కవిత్వం కాదు. అది చాలా సుకుమారమైనటువంటి సుకోమలమైనటువంటి అనుభూతితో పొగడ పువ్వుల్లాగా, ఆ పువ్వులమీది తెలిమంచులాగా, ఆ మంచుమీద పడుతున్న సూర్య కిరణాలలాగా మృదువుగా హాయిగా మెత్తగా ఉన్నటువంటి కవిత్వం. శ్రోతని నిలవనివ్వకుండా ముందుకు తోసేటువంటి కవిత్వ లక్షణం దానిలో లేదు.

తన ముందు కాలం నాటి తిరుపతి వెంకట కవులు గాని, గురజాడ అప్పారావు కానీ రాయప్రోలు సుబ్బారావు కానీ అబ్బూరి రామకృష్ణరావు కానీ అసలు ఆ మాటకు వస్తే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రముఖ పద్య కవులు ఎవరి లక్షణాలు లేనటువంటి ఒక కొత్త గుణంతో, కొత్త లక్షణంతో కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’ కవిత్వాన్ని పలకడం ప్రారంభించారు. దాన్ని ఈరోజు మనం యుగధర్మంగా గుర్తిస్తున్నాం.

ఆనాటి యుగ ధర్మం ఏమిటంటే –

1920 నాటికి ఒక కొత్త విద్యావంతుల వర్గం ఒకటి ఏర్పడింది. విద్యావంతులు, ముఖ్యంగా, గ్రామాల నుంచి వచ్చారు. నగరాల్లో చదువుకోవడానికి వచ్చారు. కొత్తగా అప్పుడప్పుడే బలపడినటువంటి యూనివర్సిటీ విద్యలో యూనివర్సిటీ తరగతి గదుల్లో వీళ్ళు ఇంగ్లీష్ కవిత్వాన్ని – ఇంగ్లీష్ రొమాంటిసిస్ట్ కవిత్వాన్ని – చదవడం మొదలుపెట్టారు. వీళ్ళ నేపథ్యంలో సాంప్రదాయికమైనటువంటి ప్రాచీన సంస్కృతాంధ్ర కవిత్వాల యొక్క అధ్యయనం ఉంది. అయితే కేవలం సంస్కృతం కవిత్వాల అధ్యయనమే ఉండి ఉంటే ఆ కవిత్వం మరొక రకంగా ఉండి ఉండేది. అలా కాకుండా వీళ్ళు కాళిదాసుని, భవభూతిని, నన్నయ్యని, తిక్కననూ వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో తల్లిదండ్రుల దగ్గర గురుకులపద్ధతిలో చదువుకొని యూనివర్సిటీకి వెళ్లి, యూనివర్సిటీ తరగతి గదుల్లో ఒక్కసారిగా వర్డ్స్‌వర్త్‌ని, కిట్స్‌ని, షెల్లీని చదవడం మొదలుపెట్టగానే వీళ్ళలో ఒక విచిత్రమైనటువంటి అనుకంపన ఒక విచిత్రమైనటువంటి సంచలనం చెలరేగాయి.

ఆ సంచలనం ఎటువంటిది అంటే ఈ కొత్త కవులు – ఈ షెల్లీ కానీ, కీట్స్ కానీ, వర్డ్స్‌వర్త్ కానీ లేదా షేక్స్పియర్ నాటకాలు కానీ, అసలు కొత్త భావాలు కానీ – ఇవన్నీ కూడా వీళ్ళల్లో అప్పటికే పాదుకొని ఉన్నటువంటి, సువ్యవస్థితమైనటువంటి ప్రాచీన కవిసంప్రదాయం యొక్క ప్రాచీన కవితా రీతుల యొక్క జ్ఞాపకాలను, అసోసియేషన్స్‌ని అవి వాళ్ళ మీద వదిలినటువంటి ముద్రల్ని కలవరపరచడం మొదలుపెట్టాయి. వాళ్ళు కేవలం ఒకే సంప్రదాయం నుంచి వచ్చినటువంటి కవులై కవితారచనకు పూనుకుని ఉంటే ఆ ప్రాచీన సంప్రదాయాల పరిధిలోనే, ఆ ప్రాచీన కవిసమయాలకు అనుగుణంగానే వీళ్ళు కూడా కొత్త కవితను సృజించి ఉండేవారు. అక్కడ భావుకుడికి శ్రోతకి మధ్య, కవికి సామాజికుడికి మధ్య భావ ప్రసారం చాలా స్పష్టంగా జరుగుతూ ఉండి ఉండేది. అలా కాకుండా వీరి మీద పాశ్చాత్య కవుల యొక్క ఒక కొత్త ప్రభావం పడింది. పాశ్చాత్య కవితాగానాలు వీళ్ళల్లో అప్పటికే ఉన్నటువంటి ప్రాచీన సంగీతాలని మేల్కొలుపుతూ వున్నప్పుడు ఒక రకమైన కొత్త కలవరం వీళ్ళలో చెలరిగింది. ఈ కలవరపాటుకు స్పష్టమైన రూపురేఖలు లేవు. అటువంటి ఈ కొత్త కలవరపాటు ఇతరుల కంఠంలో పలికిన దానికన్నా కూడా మిన్నగా, చాలా స్పష్టంగా, చాలా ఉద్విగ్నంగా కృష్ణశాస్త్రి కంఠంలో పలికింది. కాబట్టే కృష్ణశాస్త్రి ఆనాటి యుగానికి యుగకర్తగా ఈరోజు మనకు మిగిలిపోయాడు.

కృష్ణశాస్త్రి బి. ఏ. చదువుకుంటున్నప్పుడు మొదటిసారిగా ఆయన పాశ్చాత్య కవులని వింటున్నప్పుడు షెల్లీనీ, కీట్స్‌నీ పాఠ్యాంశాలుగా చదివి ఉంటాడు. ఉదాహరణకి ‘ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఏ జాయ్ ఫర్ ఎవర్’ అనే ఒక ఇంగ్లీష్ కవి వాక్యాన్ని ఆయన విన్నాడు అనుకోండి. ఇది ఆయనలో సుప్త చైతన్యంలో లేదా చైతన్యంలో ఉన్నటువంటి భావనసీమలో ప్రాచీన కవులందరి యొక్క కవితా వాక్యాలను ఒక్కసారిగా మేలుకొలిపింది. ఈ మేలుకొల్పు కలిగించిన కలవరంలో నుంచి ఆయన కవితాగానం వెలువడింది. ఆ రోజుల్లో ఆయన నల్లమల అడవిలో మొదటిసారి ప్రయాణిస్తున్నప్పుడు చుట్టూ అడవిని చూడగానే ఆయనలో కలిగిన సంచలనం నుంచి వెలువడిన మాటలు:

ఆకులో నాకునై పూవులో బూవునై
కొమ్మలోఁ గొమ్మనై నునులేఁత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైన
నిచటనే యాగిపోనా

ఈ ‘ఆకులో నాకునై’ అనే మాట ప్రాచీనకవి వాడగలిగే మాట కాదు. ప్రాచీనకవి అడవి తాలూకు సౌందర్యాన్ని ద్రష్ట నుంచి కొద్దిగా పక్కకు తీసుకువెళ్లి చూస్తూ వర్ణించగలడు. చూస్తూ అడవి తాలూకు వర్ణనలు, వసంత వర్ణనలు ఎందరో కవులు చేశారు. నన్నచోడుడు చేశాడు, వాల్మీకి చేశాడు. చెయ్యని కవి లేడు. కానీ ఆ కవిత్వానికి దీనికీ తేడా ఏంటంటే — అక్కడ కవులు శ్రోతకి వినిపిస్తున్నప్పుడు ద్రష్టకు — చూసేటువంటి కవికి — చూస్తున్న సౌందర్యదృశ్యానికి మధ్య ఒక ఎడం ఉంది. కవి శ్రోతకు అర్థమయ్యే భాషలో శ్రోతకి తెలియపరిచే విధంగా, శ్రోతకు సుపరిచితమైన కవిసమయాల ఆధారంగా అడవిని వర్ణించడానికి పూనుకుంటాడు అన్నమాట. అంటే అక్కడ అడవి, శ్రోత, కవి ముగ్గురు వేరువేరు స్థానాల్లో ఉంటారు. ముఖ్యంగా శ్రోతను దృష్టిలో పెట్టుకొని కవి తనకు అలవాటైనటువంటి పదబంధాల పద్ధతిలో అడవిని వర్ణిస్తాడు. అంటే కవి శ్రోత భాషలో అడవిని వర్ణిస్తాడు. ఆ శ్రోత భాష తను నేర్చుకున్న భాష అయి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి ఈ పొలిమేరలు సరిహద్దులు ఏమీ లేనటువంటి కొత్త పరిస్థితిలో ‘ఆకులో నాకునై’ అంటూ మొదలుపెట్టడంతోనే నేను ఆకులో ఆకుగా మారిపోతున్నాను. ఇక్కడ శ్రోత లేడు, కవి లేడు, అడవి వేరే లేదు. అడవిలో ఒక భాగంగా కవి అయిపోతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది అసలు ఒక శ్రోతను ఉద్దేశించి చెప్పే కవిత్వం అని అనడానికి లేదు.

ఈ యడవి దాగిపోనా
ఎట్లైన నిచటనే ఆగిపోనా

ఈ “ఎట్లైన” అన్న దానిలో కవిత్వం అంతా ఉంది. “ఎట్లైన” అనేది యథార్థానికి ఒక విశేషణాత్మక పదమే. దీనిలో ఏ విధమైనటువంటి కొత్త సమాచారం ఏమీ లేదు. “ఎలాగైనా ఇక్కడ ఉండిపోనా” అన్నప్పుడు, “ఎలాగైనా” అన్న దాంట్లో ఏముందంటే — అనిర్వచనీయమైన ఒక గాఢోద్విగ్నత అంతా ఆ “ఎట్లైన” అనే మాటలో ఉన్నది.

పగడాల చిగురాకు తెరచాటు తేఁటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైన
నిచటనే ఆగిపోనా

ఈ చెప్పడంలో కవి ఎంతసేపు కూడా తన దృష్టిలోనుంచి తను మాట్లాడుకుంటున్నటువంటి భావాలే.

తరు వెక్కి యల నీలగిరినెక్కి మెలమెల్ల
జదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఇట్లా అంటూ:

ఆకఁలా దాహమా చింతల వంతలా
ఈ కరణి వెర్రినై యేకతమ తిరుగాడ
ఈ యడవి దాగిపోనా
ఎట్లైన
నిచటనే యాగిపోనా

ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కవిత్వం సంభాషణ కాకుండా స్వగతంగా మారిపోయింది అన్నమాట.

కృష్ణశాస్త్రి తన కవిత మొదలు పెట్టినప్పుడే — తన భావాల అభివ్యక్తి మొదలు మొదలుపెట్టినప్పుడే — అది ఒక ప్రబోధరీతిలోనో, ప్రసంగరీతిలోనో కాకుండా స్వగతంగా మారింది. కవిత్వం గురించి ఒక పాశ్చాత్య విమర్శకుడు చెబుతూ, “Eloquence is heard; poetry is overheard” అని అన్నాడు. (ప్రసంగం వినిపించేది అయితే, కవిత్వం వినబడేది).

ప్రసంగం చేసేటప్పుడు “శ్రోత ఒకడు ఉన్నాడు” అన్న ఒక స్పృహ ఉంటుంది. అది శ్రోత కోసం మాట్లాడేది అవుతుంది. అప్పుడు అది మనం చాలా బాహాటంగా, స్పష్టంగా శ్రోతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. కానీ కవిత్వం అనేది శ్రోతను దృష్టిలో పెట్టి మాట్లాడేది కాదు. కవి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అది శ్రోత చెవిన పడుతుంది అన్నమాట. ఇట్ ఇస్ ఓవర్‌హర్డ్. అంటే అక్కడ కవికి ఒక శ్రోత ఉన్నాడు అని ధ్యాస లేకుండా చెప్తున్నటువంటిదే కవిత్వం. ఈ రకమైన కవిత్వాన్ని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టి కృష్ణశాస్త్రి శ్రోతనుంచి లేదా సామాజికుడినుంచి కవిని విడుదల చేశాడు. అందువల్లే భావకవుల్లో స్వేచ్ఛ ప్రధానవస్తువు. యథార్థానికి, “ఎవరి నుంచి స్వేచ్ఛ?” అంటే “సామాజికుడి నుంచి స్వేచ్ఛ”. అందుకని నీకోసం నేను పాడడం కాదు, నాకోసం నేను పాడుకుంటాను అని చెప్పడంలో కవి శ్రోత, సమాజం ఉద్దేశించిన ఆకాంక్షల మేరకు కాకుండా, తన ఆకాంక్షల మేరకు, తన అంతరాత్మ ప్రబోధం మేరకు తన లోపలనుండే శక్తులు ఏ విధంగా నడిపిస్తాయో, ఆ మేరకు తనను తాను నడుపుకుంటాడు అని చెప్పడం. అందుకనే ‘స్వేచ్ఛాగానము’ అన్న కవితలో ఆయన అంటున్నాడు:

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
నా ఇచ్చయే గాక నాకేటి వెరపు

ఇది చాలా ప్రసిద్ధమైన వాక్యం. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?” ఎవరు నవ్విపోయే వాళ్ళు? శ్రోతలు. ఇంతవరకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కవులు కవితలు చెప్పారు. ఇప్పుడు ఇతను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పదలుచుకోవట్లేదు. స్వగతంగా చెప్పాలనుకుంటున్నాడు. ఈ స్వగతాన్ని చూసి/విని కవిని హేళన చేయవచ్చు. “ఇతను పిచ్చివాడు” అనొచ్చు, “ఉన్మాది!” అనొచ్చు లేదా “వెర్రివాడు!” అనొచ్చు. “అనండి నాకు అభ్యంతరం లేదు” అని అంటున్నాడు కవి.

తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ
జతగూడి దోబూచి సరసాల నాడి
దిగిరాను దిగిరాను దివినుండి భువికి
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

ఈ దివి ఏమిటంటే కవి యొక్క అంతర్లోకం. అతని అంతరాంతరాల జ్యోతిస్సీమలు. ఆ అంతరాంతరాల జ్యోతిస్సీమలో అతడు తనకోసం తను జీవిస్తున్నప్పుడు, తను తనుగా జీవిస్తున్నప్పుడు, “దాని నుంచి నాకోసం చెప్పు, నన్ను ఉద్దేశించి చెప్పు, నా బాధలు చెప్పు, నాకు అర్థమయ్యే భాషలో చెప్పు.” అని మీరు పిలుస్తూ ఉంటే, “నేను మీరు ఉండే భువికి రాను. భూమి శ్రోత ఉన్న స్థానం. శ్రోత ఉన్న స్థానానికి నేను రాదలుచుకోవటం లేదు, నేను నా స్థానంలోనే ఉండాలనుకుంటున్నాను” అని చెబుతున్నాడు కవి. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. ఇక్కడ కవి సాంప్రదాయికంగా వస్తున్నటువంటి కవి-సామాజిక బంధాన్ని మొట్టమొదటిసారిగా ఛిన్నాభిన్నం చేశాడు. “కృష్ణశాస్త్రి భావకవిత్వాన్ని మొదలుపెడుతున్నప్పుడు కవికి సామాజికుడికి మధ్య ఉన్న గతానుగతమైన బంధాన్ని తుంచేసాడు.” అని మనం అంటున్నప్పుడు “ఇద్దరు మనుషులమధ్య బంధాన్ని తుంచేశాడు” అని కాదు ఆ మాటకు అర్థం. ఈ బంధం సాంప్రదాయిక బంధం అన్నమాట. ఈ బంధంలో కవికి, శ్రోతకి మధ్య ఒక నైతికబాధ్యతతో కూడిన బంధం, ఒక సాంప్రదాయపు చట్రంతో కూడిన బంధం ఉన్నది. ఒకవేళ కవి తన ఆనందాన్ని చెప్పదలుచుకుంటే, ఆనాటి సమాజం దేనిని శ్రేయస్సని అనుకుంటుందో, దేనిని హితమని అనుకుంటుందో, ఏది చెప్పాలని అనుకుంటుందో, ఏ రకంగా మాత్రమే చెప్పాలో నిర్దేశించే చట్రం ఒకటి ఉన్నది. “కవి ఏ బంధాన్ని తుంచుతున్నాడు?” అంటే ఆ చట్రంలో ఇరికించబడ్డ బంధాన్ని తుంచుతున్నాడు. అంతే తప్ప, శ్రోతతో కవి తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంటున్నాడు అని కాదు.

యథార్థానికి, ఒక రకంగా చెప్పాలంటే, ఆ పాత బంధాన్ని తెంచడం ద్వారా కవి ఒక కొత్త బంధాన్ని, ఒక కొత్త రూపాన్ని శ్రోతకు ఇస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కవి ఆ పాత బంధం నుంచి విడివడం ద్వారా శ్రోతను కూడా ఆ పాత కాలపు బంధం నుంచి విడుదల చేస్తున్నాడు అన్నమాట.

అందుకనే ఆయన ‘నేను పాడడం ఎందుకు పాడుతున్నాను?’ అన్నదానికి సమాధానంగా:

సౌరభము లేల చిమ్ముఁ పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదఁజల్లు జందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసురు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

మావిగున్న కొమ్మను మధుమాసవేళఁ
బల్లవము మెక్కి కోయిల పాడు టేల?
పరులఁ దనియించుటకొ? తన బాగు కొరకొ?
గాన మొనరింపక బ్రతుకు గడవఁ బోకొ

ఇది చాలా ముఖ్యమైన వాక్యం. కవి కవిత చెప్పడం దేనికోసం? ఇతరులని ఉద్దేశించడానికా? ఇతరులని ఉద్ధరించడానికా? లేదా తనని తాను ఉద్ధరించుకోవడానికా? “అసలు ఈ రెండు మాటల్లోనూ కూడా ఒక సాంప్రదాయిక భావన ఉంది” అని భావకవిగా కృష్ణ శాస్త్రి అంటున్నాడు అన్నమాట. ఇతరులను ఉద్ధరించాలి అనుకోవడం కానీ, తనను ఉద్ధరించాలి అనుకోవడంలో గానీ ఒక ప్రయోజనశీల మనస్తత్వం ఉంది. అసలు ఉద్ధరించడం అన్న దానిలోనే ఒక కృత్రిమత్వం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కవిత్వం ప్రయోజనానికి వ్యతిరిక్త దిశలో సాగుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రయోజనం అనేది వ్యవహారికమైన మాట. కవి కవిత్వాన్ని ఒక వ్యవహారిక, ప్రయోజన స్థాయి నుంచి పైకి తీసుకువెళ్తున్నాడు. ఎలా అయితే పరిమళ పుష్పానికి సౌరభాన్ని విరజిమ్మడం సహజగుణమో, ఎలా అయితే మందానిలానికి వీయడం సహజ గుణమో, ఎలా అయితే నదికి ప్రవహించడం సహజగుణమో, కోయిలకి పాట పాడడం సహజగుణమో, అలాగే పాట పాడడం తనకు సహజగుణమని, పాడకపోతే తన జీవితం కొనసాగదని చెబుతున్నాడు.

“నా జీవితపు జీవలక్షణం పాటలో ఉంది. ఆ పాటలో ఉంది అనేది గ్రహించాను కాబట్టి, దాన్ని నేను పాడడానికి సిద్దపడుతున్నాను కాబట్టి ఈ పాటని నాకు అనువైన రీతిలో, నాకు సహజమైన రీతిలో నా జీవితం పూర్తిగా వికసించే రీతిలో పాడనివ్వు. దీని మీద నిర్బంధం పెట్టకు. మీకు నచ్చినట్లుగా నీకు ఉపకరించినట్లుగా నీ సూత్రాలకు నీ నిర్ణయాలకు నీ కొలబద్దలకు నీ కొలమానాలకు నీ తక్కెళ్ళకు తగ్గట్టుగా నన్ను పాట పాడమని అడగవద్దు.” అని చెప్పడం ద్వారా మొట్టమొదటిసారి ఆయన కవిని తత్కాలీన సామాజిక నిబంధనల నుంచి సామాజిక నిర్దేశాల నుంచి విడుదల చేశాడు.

అయితే ఈ సామాజిక నిర్దేశాలు ఏ సమాజం తాలూకు నిర్దేశాలు? పాత సమాజం తాలూకు నిర్దేశాలు. పాత సమాజం తాలూకు నిర్దేశాల నుంచి తనను తాను విడుదల చేసుకోవడం ద్వారా అతడు తన శ్రోతను విడుదల చేయడానికి ప్రయత్నించాడు. తన శ్రోతని విడుదల చేయడం ద్వారా మొత్తం ప్రపంచాన్ని పాత సమాజం నుంచి విడుదల చేసి కొత్త సమాజానికి అనువుగా తయారు చేయడానికి ప్రయత్నించాడు.

కృష్ణ పక్షం: ఏకాంత వేదన

స్వేచ్ఛాలక్షణం కలిగిన తన కవిత్వానికి ఆయన ‘కృష్ణపక్షం’ అని పేరు ఎందుకు పెట్టారు? దానిలో ఒక రకమైన దిగులు, ఒక రకమైన వేదన, గాఢాతిగాఢమైన ఒక సెన్స్ అఫ్ లాస్ ఉంది. ఈ కవి — “స్వేచ్చగా నేను దివిలో ఉంటాను, భువికి దిగిరాను” అంటున్నవాడు — ఎందుకు ఇంత దుఃఖపడుతున్నాడు? ఈ దుఃఖం ఏమిటి? కృష్ణపక్షానికి శివశంకర స్వామి రాసిన చాలా చక్కటి పరిచయంలో ఆ కవితల్లో నాలుగు ప్రధాన లక్షణాలను గుర్తించారు. మొదటిది స్వేచ్ఛావర్తన. రెండోది దుఃఖం. మూడోది ప్రేమ భావన. నాలుగోది ఈశ్వరారాధన. ఇలా నాలుగు రకాలుగా విడగొట్టడం మనకు అర్థం చేసుకోవడం సులభంగా అనిపిస్తుంది, కానీ కవి నాలుగు రకాలుగా ఆలోచన చేయలేదు. అందులో ఆ ‘కృష్ణపక్షం’లో ప్రధానంగా కనిపించేది ఏంటంటే — పాత సమాజం నుంచి, పాత సామాజిక సందర్భం నుంచి తనను తాను విడుదల చేసుకుంటున్న క్రమంలో కవికి ఒక రకమైన ఏకాకిత్వం, ఒక రకమైన పరాయీకరణ సంభవించింది. ఇది సెన్స్ ఆఫ్ లాస్ అన్నమాట.

ఈ సెన్స్ ఆఫ్ లాస్ ఏంటంటే — తక్షణం తన హృదయానికి సహృదయంగా, బాసట నివ్వగలిగిన, తనను అర్థం చేసుకోగలిగిన మనిషి ఎవ్వరూ అతనికి కనపడకపోవడం.దాన్ని ఆయన రకరకాలుగా ‘కృష్ణపక్షం’లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు:

నా విరులతోఁటఁ బెంచికొన్నాఁడ నొక్క
పవడపు గులాబి మొక్క నా ప్రణయజీవ
నమ్ము వర్షమ్ముగా ననయమ్ముఁ గురిసి.

కొన్నినాళ్ళాయె, సుకుమార కుసుమ మొకటి
నవ్వె కిలకిలమని నా వనమ్ములోన.

అంత దానినె, నా జీవితాశయమ్ము
పూవుగా వింతగా మారిపోయినటులు
వలచికొన్నాడ;
నా ప్రసూనమ్ము నేను
నన్ను మనసార నా ప్రసూనమ్ము కనులు
విచ్చి కాంచుచుఁ గాలము పుచ్చినాము
ఎదల నిశ్శబ్దముగఁ బల్కరించుకొనుచు

ఇది అతనిలో కలిగినటువంటి తొలి స్పందన. ఈ పుష్పం అతని స్వేచ్ఛ కావచ్చు. అతని కవితాభావన కావచ్చు. అతని అభివ్యక్తి కావచ్చు. అతని ప్రథమ ఉత్తేజం (primeval inspiration) కావచ్చు. దాన్ని ఆయన తన జీవితాశయంగా మారిపోయినటువంటి దానిగా, ఆ పువ్వునే తన జీవితాశయంగా భావించినట్లుగా దాన్ని ప్రేమించాను అంటున్నాడు.

కృష్ణశాస్త్రి తన స్వేచ్ఛాగానాన్ని వినిపిస్తున్నప్పుడు మొదటి రోజుల్లో తన ఉత్తేజాన్ని తన ఒక పువ్వుగా పోలుస్తూ తనకు కలిగినటువంటి ఆ ప్రథమస్పందనని ఒక పుష్పంగా తీసుకుంటూ దాన్ని తన జీవితాశయమే పువ్వుగా మారిపోయిందా అని అనుకుంటున్న సమయంలో

ఎట్టు లది దాపురించెనో యేమొ యంత
నాకుసందులత్రోవల నల్ల దిగియె
నొక్క క్రూరార్కకిరణమ్ము; ఉర్వి వాలి
నా గులాబి సోలి తూలి నన్ను వీడె.

ఈ క్రూరార్క కిరణము అనేటువంటిది కేవలం సూర్య కిరణము అని అనలేము. ఒక బాహ్యమైనటువంటి అడ్డంకి, అవరోధం, ఆంక్ష ఏదైనా కానివ్వండి. ఈ ప్రథమస్పందన పైన, ఈ తొలి మెలకువ పైన ఈ తొలి స్వప్నం పైన ఒక బలమైనటువంటి వేటుగా పడింది. అప్పుడు:

అపుడు నా వైపు చూచి నా యలరు లేని
శూన్యమౌ మ్రోడు మ్రాకును జూచి, యొక్క
కోకిలమ్ము కో యని యేడ్చె, గొంతు నెత్తి!
మాకొరకు దారిబోయెడు మందపవను
డొకఁడు జాలిగ నొక్క నిట్టూర్పు విసరె!

తనకి కలిగిన ఈ నష్టం ఒక ‘పారడైజ్ లాస్ట్’ లాంటిది. దీన్ని చూసి తనతో బాధ పంచుకోవడానికి మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే, ఒక కోకిల, ఒక మందపవనం తప్ప ఒక సజాతీయమైన తోటి మానవ కంఠస్వరం ఏదీ కూడా ఆయనకు తోడు లేదన్నమాట. ఈ సెన్స్ ఆఫ్ లాస్ అనేది కృష్ణపక్షం తాలూకు ప్రధానమైన లక్షణం.

ఇక్కడ ఈ విధంగా “ఒక కోకిల, ఒక మందపవనుడు పలికారు.” అని చెప్పిన దాన్నే శ్రీశ్రీ భిక్షువర్షీయసీ కవితలో వేరే విధంగా, వేరే సందర్భానికి అన్వయించి చెప్పుకున్నాడు.

“ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరి”దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ
వెళ్లిపోయింది!
ఎముక ముక్క కొరుక్కుంటు
ఏమీ అనలేదు కుక్క.
ఒక ఈగను పడవేసుకు
తొందరగా తొలగె తొండ
క్రమ్మె చిమ్మచీకట్లూ,
దుమ్మురేగె నంతలోన.
“ఇది నా పాపం కా”దనె
ఎగిరి వచ్చి ఎంగిలాకు.

శ్రీశ్రీ కవితలో కూడా ఎవరూ లేకపోవడం, ఆ ఏకాకిత్వం ఒక నిష్ఠురమైన సత్యం. దేవులపల్లి కవిత ఈ కవితకు మాతృక అని చెప్పొచ్చు. కృష్ణశాస్త్రి చెప్పిన సెన్స్ అఫ్ లాస్‌ని శ్రీశ్రీ వేరే రకంగా ఒక సామాజిక సెన్స్ ఆఫ్ లాస్‌గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు.

‘కృష్ణపక్షం’లో ఉన్నటువంటి ప్రధానమైనటి గుణం ఈ ఏకాకిత్వం. ఈ వినష్టం — ఏదో పోగొట్టుకున్నటువంటి భావన, ఒక స్వర్గాన్ని కోల్పోయిన భావన. దాని యొక్క దుఃఖాన్ని భూతద్దంలో పెట్టి చూపించాడు కృష్ణశాస్త్రి. దాన్ని చాలా తీవ్రాతితీవ్రమైన, గాఢాతిగాఢమైన బలమైన రంగులతో చిత్రించాడు. ఆయన ప్రభావంతో ఇతర భావకవులు కూడా ఇటువంటి పంథానే అనుసరించారు. అందువల్ల “భావకవులందరూ ఒక రకమైన దుఃఖపూరితమైన అనుభూతి కలిగించే కవులు” అన్నట్లు ఒక ముద్ర మనమీద పడింది. కానీ అంత బలంగా చెప్పడంలో తక్కిన సమాజం తాలూకు ఉత్సాహం నుంచి, తన తాలూకు ఏకాకిత్వాన్ని, వాటి మధ్య వైరుద్ధ్యాన్ని చాలా తీవ్రంగా చూపించడానికి తమ దుఖాన్ని చాలా తీవ్రతరమైన పదాల్లో వారు చెప్పుకుంటూ వచ్చారు.

నన్నుఁ గని యేరు జాలిఁ జెందంగ వలదు —
నాకు నిశ్శ్వాస తాళవృంతాలు కలవు,
నాకుఁ గన్నీటిసరుల దొంతరలు కలవు,
నా కమూల్య మపూర్వ మానంద మొసఁగు
నిరుపమ నితాంతదుఃఖంపునిధులు కలవు —

ఇలాగ —

కంటకకిరీట ధారినై, కాళరాత్రి
మధ్యవేళల, జీమూతమందిరంపుఁ
గొలువుకూటాల, నేకాంతగోష్ఠి దీర్చి,
దారుణ దివాంధ రోదనధ్వనుల శ్రుతులఁ
బొ గి యుప్పొంగి యుప్పొంగి పొరలి పోవు
నా విలాప నిబిడగీతికావళీ వి-
రావముల నర్ధరాత్రగర్భమ్ము, మరియు
మరియు భీషణకాళికోన్మత్తఁ గాఁగఁ
జేయుతరి, నన్ను మీరు వీక్షింప లేదొ!

అంటూ “ఏ ననంతశోకభీకరతిమిరలోకైకపతిని”! అంటూ చెప్పుకొంటాడు. చాలా తీవ్రపదజాలం అన్నమాట.

మరోచోట:

మీరు మనసారఁగా నేడ్వనీరు నన్ను —
నన్ను విడువుడు! ఒక్కసారి నన్ను విడిచి-
నంత నేకాంతయవనికాభ్యంతరమున
వెక్కి వెక్కి రోదింతును — విసువు లేక
విరతి లేక దుర్భరశోక విషమగీతు
లేడ్చివైతు; ఎలుం గెత్తి యేడ్చివైతు

ఇది! ఇటువంటి దుఃఖంలో — కృష్ణశాస్త్రి యొక్క కవిత్వం! ‘కృష్ణపక్షం’ మొత్తాన్ని ఆయన ఈ దుఃఖంలో తడిపి, ముంచి, తీసి మనకు చూపించాడు. ‘కృష్ణపక్షం’ మొత్తం ఒక ఒంటరితనంలో, దుఃఖంలోమ్ వేదనలో ముంచి తేల్చినప్పటికీ దానిలో సన్నని ఆశ ఒకటి తళుకుమంటూ ఉంటుంది. కవి వదిలిపెట్టిన ఆ ‘ఆశ’ ఆనవాళ్ళను అనుసరిస్తూనే మనం తరువాతి కవితల్లోకి ప్రయాణిస్తాము.

కృష్ణపక్షంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆ ‘ఆశ’ అన్న కవిత ఇది:”

కన్నీటి కెరటాల వెన్నెలేల?
నిట్టూర్పు గాడ్పులో నెత్తావి యేలా?

ఇది చాలు. ఈ పదగుంఫనకే మొత్తం ఆంధ్రదేశం అంతా కూడా మురిసిపోయింది. ఆ నిట్టూర్పు గాడ్పు అన్న దానిలో ట కింద టా ఒత్తు, డ కింద ప ఒత్తు ఇవి చాలా కఠినమైన పదాలు. నెత్తావి యేల అన్నప్పుడు, ఈ నెత్తావి అనేది చాలా మృదువైన పదం.

ప్రళయకాలమహోగ్రభయదజీమూతోరు-
గళ ఘోర గంభీర పెళపెళార్భటులలో
మెర పేలా?

ఇది, కావ్యశిల్పం!

గళ ఘోర గంభీర పెళ పెళలార్భటులలో — ఈ మాటలే ఇక్కడ కవిత్వం. ఈ శబ్దాలు ఇచ్చే సంగీతమే మనకు ఏదో తెలియజేస్తూ ఉంటుంది. దీని అర్థం కోసం మనం చూడనవసరం లేదు. అలాగని ఇది ప్రాబంధిక ఛాయలో రాసిన కవిత కాదు ఇందులో వాడి పదాలన్నీ కూడా కొత్త పదాలు. ఈ పదగుంఫన కొత్త. ఇతఃపూర్వ ప్రాచీన కవి ఎవరు ఇటువంటి పదబంధాలని ఇటువంటి పద్ధతిలో గుంఫించలేదు. అంత భయంకరమైన అర్ధరాత్రి ఆ భయంకరమైన పిడుగుల మధ్య ఉరుముల మధ్య ఈ మెరుపేల అని అడుగుతున్నాడు. ఆ మెరపు అనేది చిన్న పదం. ఒక్కసారి తటిల్లున విరిసి వెళ్ళిపోయే పదం. మెరిసి వెళ్ళిపోయే మెరుపు. కానీ ఒక్కసారిగా ఆ మెరపు కాంతిని ఇచ్చినట్లుగా మెరపన్న ఆ సన్నని సుతిమెత్తని ఆ పదం వినిపిస్తుంది.

ప్రబలనీరంధ్రాభ్రజనిత గాఢ ధ్వాంత
నిబిడ హేమంత రాత్రీకుంతలములలో
చుక్కేలా?
వికృత క్రూర క్షుధాక్షుభిత మృత్యు కఠోర-
వికటపాండురశుష్కవదనదంష్ట్రాగ్నిలో
నవ్వేలా?

ఒక మెరపులాగా, చుక్కలాగా, ఒక నవ్వులాగా ఆశ ఉంది.

ప్రవాసం: భావావేశ ప్రయాణం, అన్వేషణ

‘కృష్ణపక్షం’ తరువాత కృష్ణశాస్త్రి కవితలన్నీ కూడా ‘ప్రవాసం’ అనే సంపుటిగా వచ్చాయి. ‘ప్రవాసం’ అనేదే చాలా విశిష్టమైన మాట. అసలు, ప్రవాసానికి లోను కాని వీరుడు ఉండడు. ‘ప్రవాసం ఒక యుద్ధ రహస్యం’ అని నేను కూడా కవిత రాశాను. ప్రతి వీరుడి కవితలో, ప్రతి శూరుడి కవితలో, ఒక ఉద్యమ నాయకుడి కవితలో, కొత్త వెలుగు తీసుకొచ్చిన ప్రతి ఒక్క ప్రవక్త జీవితంలో కూడా ప్రవాసం ఉంటుంది. రాముడు అరణ్యవాసం చేశాడు. పాండవులు అరణ్యవాసం చేశారు. నలుడు అరణ్యవాసం చేశాడు. ప్రతి నాయకుడు, ప్రతి ధీరోదాత్తుడైన నాయకుడు, విలువల కోసం, సత్యం కోసం నిలబడ్డ ప్రతి ఒక్కడు కూడా ఒక ప్రవాసానికి లోనవుతాడు. ప్రవాసం అంటే ఏమిటంటే తన వాళ్ళ మధ్య జీవించే అవకాశం లేకపోవడం. తన వాళ్లకు దూరంగా జీవించడం. మరొక చోట జీవించడం. ఇది భౌతిక ప్రవాసమే కానక్కర్లేదు.

కృష్ణశాస్త్రి యొక్క ప్రవాసం భౌతిక ప్రవాసం కాదు. మానసిక, భావావేశ ప్రవాసం. తక్కిన వాళ్ళ యొక్క భావావేశాల్లో పాలుపంచుకోలేనటువంటి ప్రవాసం. తక్కిన వాళ్ళ యొక్క క్షణిక, తాత్కాలిక, సమకాలీన ఆనందాల్లో ఇతరులు కూడా పాలుపంచుకోలేకపోవడం. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా బంగారం ధరల గురించి, లేదా వస్తుసంచయం గురించి, ఫర్నిచర్ గురించి, ఇల్లు కట్టుకోవడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నీ ఆనందం అక్కడ లేదు. నీ హృదయం అక్కడ లేదు. నీకు కావాల్సిన సుఖం వేరు. నీకు కావల్సిన సంతోషం వేరు. నువ్వు కోరుకుంటున్నది వేరు. అప్పుడు నువ్వు ఏమవుతున్నావు? తాత్కాలికంగా నువ్వు ఒక ప్రవాసానికి లోనవుతున్నావు. అటువంటి ప్రవాసాన్ని కృష్ణశాస్త్రి కవితల్లో చిత్రించాడు.

అందువల్ల ఈరోజు కూడా అటువంటి నీకు అటువంటి భావోద్విగ్నత ఉంటే నువ్వు తక్కిన వాళ్ళ యొక్క సాధారణసంతోషాల్లో పాలుపంచుకోలేనటువంటి లక్షణమే నీకు ఉంటే నీకు ఈనాటి కూడా ప్రవాస కవితలు అంతా గాఢాతిగాఢంగాను కూడా వినిపిస్తాయి.

ఉదాహరణకు చూడండి:

దారులన్నియు మాపె దశదిశలు ముంచెత్తె
నీరంధ్రభయదాంధకారజీమూతాళి;
ప్రేయసీ, ప్రేయసీ, వెడలిపోయితివేల
ఆ అగమ్యతమస్వినీగర్భకుహరాల

ఈ ప్రేయసి ఎవరు? ఇదే ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట.

అపుడు గొంతెత్తి యేడ్చినాను; అప్పుడు నన్ను
గాంచఁగా నోపఁగా లేక కన్నులట్టె
యార్చుకునినవి తారకలు

నన్ను ఓదార్చలేక తారకలు అలా — రెప్పలు ఆర్పినట్లుగా — కన్నులట్టే ఆర్చుకొనినవి తారకలు.

అపుడు మొగిళు
లల్లనల్లన నలనల్లనై భరమ్ము
లైన నిట్టూర్పుదొంతర లైనవి; అపుడు
కుంచుకొని కుంచుకొని కుహూకుహరవాటి
నను తొలగి దవ్వు దవ్వులు చని శిరాలు
వాల్చికొనినవి తిమిరాలు భయవశాన

ఈ ప్రవాసం ఎంత గాఢంగా ఉందంటే ఇతన్ని చూసి చివరికి చీకట్లే తలవంచుకున్నాయంట

అపుడు బ్రతు కొక్కటే యేడుపైన గాలి
రిచ్చవడి వట్టి పసిపాపలీల మౌన
యానమునఁ బారి సుప్తపత్రాళి నొదిగి
పొంచి చూచుచు చలియించి పోయినాడు;

అప్పు డీ విశ్వమే నిత్యయాత్ర నాఁగి
శ్రవణములు మూసికొనినది; రాక రాక
నా గళతమఃపథమ్ముల రేగి రేగి
రోదనోచ్చలితోచ్చగీతా దురంత
దుస్సహార్చులు వెడలి రాఁగా …

ఈ కవిత ఇక్కడ ఆగుతుంది అసమాపకక్రియతో. ఏ ప్రాచీన కవీ ఇట్లా రాయలేదు. కవిత ఆగిపోతుంది అక్కడితో. అంటే ఇంకా అంతకుమించి చెప్పగలిగింది ఏమి లేదు. ఏడుపుతో బాధతో ఇంకా గొంతు పెగలకపోవడం అన్నమాట. ఇది శ్రోత కోసం ఉద్దేశించి ఇలా చెప్పాలి అని శిల్పరహస్యంతో రాసింది కాదు. ఆ కవి సహజలక్షణం తోటే ఆ కవి అక్కడ దాకా చెప్పగలిగిన తర్వాత, “నా గళతమఃపథమ్ములు రేగి రేగి రోదన ఉచ్చలిత ఉచ్చ గీతా దురంత దుస్సహార్చులు వెడలి రాగా…” అనడంతో ఆగిపోయాడన్నమాట. ఈ రకమైన ప్రవాసం తాలూకు తీవ్రాతితీవ్రమైనటువంటి ఏకాకితనం, ఈ గాఢాతిగాఢమైనటువంటి లక్షణం ఈ కవితల్లో మనకు కనబడుతుంది.

‘కృష్ణపక్షం’లో ఉన్నటువంటి ఆశ ‘ప్రవాసం’లో కూడా ఉంది. యథార్థానికి ‘ప్రవాసం’ అనే మాట వెనకాతల పునరాగనం ఉంటుంది. ప్రవాసం తర్వాత తిరిగి మళ్ళా రావడం ఉంటుంది. ఆ రావడానికి ఒక ఆలంబన, ఒక ఆశ, ఒక సూచన ఉంటుందన్నమాట. అటువంటిది ‘ప్రవాసం’ కవితల్లో కూడా కనబడుతుంది.

వెదకి వేసారి నా వెర్రి బ్రతుకెపుడేని
తుదిరేయి కనుమూయునా,
బేలయై
నిదుర బరువుల క్రుంగునా,
మరపు మసకల దారి తెరచుకొని కల యేదొ
విసిరికొని పరతెంచును,
కారు రా
తిరి కొనల మెరపించును
కలగి తొట్రిలిచు నాఁకలి తొందరల సోలు
కరములట్టే చాతునో
నా మంచు
కనులనట్టే తెరతునో
అంతలో నింతలో నడుగుజాడయె లేక
వింతకల కరగి చనును,
నాకు నా
వంత కథయే మిగులును

ఆ కల ఇలా కరిగిపోతుంది. చివరికి నాకు నా వంత కథ — నా బాధ తాలూకు కథ/నా దుఃఖం తాలూకు కథే — నాకు మిగులుతుంది.

వనరు చేడ్వఁగలేను చచ్చిచావఁగ లేను
కనలేని వెలుఁగు కొరకై
ఎన్నడును
కనరాని దాని కొరకై.

ఒక క్రొత్త బరువుతో ఒక క్రొత్త యాసతో
ఒకఁడనే పడిపోదును
శూన్యమున
ఒకఁడనే కృశియింతును.

ప్రవాసంలో కృశిస్తున్నాడు గాని నిరాశతో నిస్పృహతో కృశించడం లేదు. “ఒక క్రొత్త బరువుతో”… ఆ కొత్త బరువు అనేది చాలా అందమైన పదం. ఆ బరువు దేని యొక్క బరువు? కల యొక్క బరువు. మెలకువ యొక్క బరువు. ఆశ యొక్క బరువు. లేకపోతే పూర్తిగా అతడు గాలిగా, ధూళిగా మారిపోయి ఉండేవాడు. ఒక ఆశ రావడం వల్ల — నీళ్ల వల్ల ఎలా అయితే మేఘం బరువెక్కుతుందో, పువ్వు వల్ల లత ఎలా బరువెక్కుతుందో, గర్భం వల్ల స్త్రీ ఎలా బరువెక్కుతుందో, అట్లాగా — “ఒక క్రొత్త బరువుతో ఒక క్రొత్త యాసతో ఒకఁడనే పడిపోదును” ఈ పడిపోవడం అంటే కింద పడిపోవడం కాదు. ఆ “ఒకఁడనే పడిపోదును” అంటే “నేను దాంట్లోనే ఉండిపోతాను, దాంట్లోనే నిలబడిపోతాను, అక్కడ ఆగుతాను” అని అర్థం. “శూన్యమున ఒకఁడనే కృశియింతును”.

కృష్ణశాస్త్రి అభిప్రాయంలోనే ‘కృష్ణపక్షం’ కన్నా ‘ప్రవాసం కవితలు, ‘ప్రవాసం’ కన్నా ‘ఊర్వశి’లోని కవితలు ఉత్తరోత్తరా బలీయమైనటువంటి కవితలు. అయితే ‘ప్రవాసం’లోని పద్యాలన్నీ తెలుగు జాతిని ఉర్రూతలూగించి తెలుగు జాతి మీద చాలా తీవ్రమైన భావముద్ర వేసినటువంటి పద్యాలు. అటువంటిదే

ఏను మరణించుచున్నాను; ఇటు నశించు
నా కొరకు చెమ్మగల నయనమ్ము లేదు

ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం. నేను ఒక చోట రాశాను, “‘ఏను మరణించుచున్నాను’ ఇదొకటే గొప్ప కవితా వాక్యమయ్యింది. ‘పారడైస్ లాస్ట్’ లాంటి వాక్యం ఇది.” అని అన్నాను. ఈ “ఏను మరణించుచున్నాను” అనేది మామూలు వాక్యం కాదు. ఈ వాక్యంలో జీసస్ వెప్ట్ (Jesus Wept) లాంటి ఒక అద్భుతమైనటువంటి కవిత్వం ఉంది. నేను మరణిస్తున్నాను అనే స్పృహ నాకు కలగడంలో దుఃఖం ఉంది. “ఏను మరణించుచున్నాను” — దీనికంటే దుఃఖం ఏముంటుంది?

‘ఇట నశించు నా కొరకు చెమ్మగిలు నయనము లేదు.’ ఇది ఉత్తరోత్తరా బలీయమైనటువంటి బాధాకరమైన వాక్యం. శ్రీశ్రీ ‘గతమంతా తడిసె రక్తమున’ అని వెంటనే ‘కాకుంటే కన్నీళ్లుతో’ అంటాడు. ఆ రెండవ వాక్యం ఇంకా తీవ్రాతీవరమైనటువంటి బాధను కలిగించే అంశం. అలాగే, ‘నేను మరణించుచున్నాను’ అన్నదే దుఃఖపూరితమైన వాక్యం. దానికంటే దుఃఖతరమైన వాక్యం ఏమిటంటే ‘ఇట నశించు నా కొరకు చెమ్మగిలు నయనము లేదు’ అని.

ఒక పోలిక తీసుకొస్తాడు. ఎటువంటి పోలిక?

పసిడి వేకువ పెండ్లిండ్లఁ బడిన యెవరు
కరఁగనేర్తురు జరఠాంధకారమృతికి?

అని. ఆ పసిడి వేకువను పెళ్ళి ఇంటితో పోల్చడంలోని కవిత్వాన్ని చూడండి. ఆ పసిడి వేకువ ఎలా ఉందంటే పెళ్లి ఇల్లులా ఉందట. అటువంటి పసిడి వేకువ పెళ్లింట్లో పడ్డ తర్వాత ఆ అంధకారం నశిస్తోందని బాధపడే వాళ్ళు ఎవరు ఉంటారు? అందరి సంతోషం కూడా ఉత్సవం వైపు వెళుతుంది. పెళ్లి పందిరి వైపు వెళ్తారు. అన్ని హస్తాలు అన్ని పాదాలు, అన్ని హృదయాలు, అన్ని నేత్రాలూ ఆ పెళ్లి పందిరి వైపే సాగిపోతాయి

నా మరణశయ్య పరచుకొన్నాను నేనె!
నేనె నాకు వీడ్కొలుపు విన్పించినాను!
నేనె నాపయి వాలినా, నేనె జాలి
నెదనెద గదించినాను, రోదించినాను!

బ్రతికియున్న మృత్యువునై ప్రవాసతిమిర
నీరవసమాధిఁ గ్రుళ్ళి క్రుంగినపు డేని
నిను పిలిచినాన, నా మూల్గునీడ ముసిరి
కుములునేమొ నీ గానోత్సవముల ననుచు?

ఈ “నువ్వు” ఎవరో చాలా ఆశ్చర్యకరమైనటువంటి నువ్వు! నువ్వు ఎవరో మనకి నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది. ఈ నువ్వు ఎవరో కవికి కూడా ఆరోజు అర్థం కాదు. ఆ నువ్వు ఎవరు? అస్పష్టమైన నువ్వు. కానీ ఎవరో ఒక నువ్వు ఉన్నారు. కవి కాక మరొకరు ఉన్నారు. అతన్ని నేను పిలిచానా? అతనో, ఆమెనో నేను పిలిచానా? పిలవలేదు. నాకు నేనే బాధపడుతూ ఉన్నాను నేను.

ఇదియె నా చితి, పేర్చితి, నేనె దీని
వదలిపోని నా యవసానవాంఛ గాఁగ;
వడఁకని కరాలు రగులుచు దుడుకుచిచ్చు
లాలనల నింత నుసి గాఁగ కాలు త్రుటినె;

అలయు వాతెర యూర్చుగాలులు కదల్చి
రేపు నంతె నా కాష్ఠాల రేగు మంట
మును బ్రతుకునట్ల నా దేహమును దహింపు!

అద్భుతమైన వాక్యం! ఇంతకుముందు నా బతుకుని ఎట్లా దహించిందో, ఈ అగ్ని ఇప్పుడు నా దేహాన్ని కూడా దహించాలి అని చెప్తూ “పడదులే ఆర్పఁగా నొక బాష్పమేని అంటాడు.

ప్రవాస గీతాల్లో తన తన మరణశయ్య తనే పరుచుకున్నాడని, ముందు జీవితాన్ని దహించినట్లుగా ఇప్పుడు దేహాన్ని కూడా దహించే విధంగా ఒక అగ్ని రగులుతుందని దీని కోసం ఒక బాష్పం కూడా వేచి లేదని చెప్తున్నప్పటికీ ఆయనలో ఈ ప్రవాసం గొప్ప స్ఫురణని, ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఏమి ఇచ్చింది అంటే — “నేను తక్కిన ప్రపంచంతో భాగం కాకపోయినప్పటికీ దాన్ని నేను చింతించవలసింది లేదు. ఎందుకంటే…”

ఇది చాలా ప్రసిద్ధి చెందిన వాక్యం:

నా నివాసమ్ము తొలుతగంధర్వలోక
మధురసుషమాసుధాగానమంజువాటి
ఏనొక వియోగీతిక
నేను నిదుర
వెన్నెలల దారి నొక రేయి వెడలిపోతి
నొక విపంచి విరహకంఠ మొరసి యెగసి.

“ఏనొక వియోగశాలినీ హృదయ రాగ వేదనారేఖ(ను)” అని అన్నాడు ఆ తరువాత.

ఏనొక వియోగశాలిని హృదయరాగ
వేదనా రేఖ నాఁకలి వేగు నామె
యంగుళీకిసలయ చంచలాంచలముల
విడివడి అనంతవిశ్వానఁ బడితినాఁడు.

అదియె మొద లేను సకల దిశాంతరాల
మెల్లెడల నెందుకో పర్వులెత్తిపోవ!
ఆ సమయమాదిగా అప్సరోంగనాను
రాగవీథుల కిన్నరీరమ్యకంఠ
సీమలో శ్రావణాంబుదాశ్లేషపాళి,
తారకాలోకపంక్తుల…

ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో చూడండి! అప్సర అంగనల యొక్క అనురాగ వీథుల్లో తిరుగుతున్నాడు. శ్రావణ మేఘాల మధ్యలో తిరుగుతున్నాడు. నక్షత్రసముదాయాల మధ్య తిరుగుతున్నాడు.

మారుతోరు
పక్షముల తిరుగాడుచు పవలు రేలు,
కన్ను మోడుపు మెయి వాల్పు గాని లేక

కళ్ళు మూయడం కానీ, శరీరం విశ్రమించడం కానీ లేనట్లుగా అనంత విశ్వంలో తిరుగుతూనే ఉన్నాడన్నమాట.

ఇది ముగియబోని ఏ యర్థమెరుఁగరాని
వేసటే లేని వెర్రి అన్వేషణమ్ము

ముగియబోని అన్వేషణము! “అన్వేషణ వల్ల ప్రవాసం ప్రారంభమైందా? ప్రవాసం వల్ల అన్వేషణ ప్రారంభమైందా? అని చెప్పలేము కానీ అన్వేషణ లోకి కవి అడుగుపెడుతున్నాడు.

ఈ ప్రవాస యాత్రారతి …

ఇది చాలా అద్భుతవాక్యం! ప్రవాస యాత్రారతి అంటే ప్రవాస యాత్ర పట్ల కలిగిన కోరిక. ప్రవాస యాత్ర వల్ల కలిగే ఆనందం. ప్రవాస యాత్రలోనే సంతోషాన్ని పొందడం నేర్చుకోవడం. ఈ ప్రవాసం:

ఈ ప్రవాస యాత్రారతిని … ఇటులే నేను
కదలిపోదును ఆశావకాశములను
ఒక్క నిటూర్పు వోలిక ఒక్క మౌన
బాష్పకణమటు, ఒక్క గాఢవాంఛ పగిది.

ప్రవాసజీవితం, ప్రవాస కవితలు ముగుస్తున్నటువంటి దశలో కృష్ణశాస్త్రికి ఎవరో తలుపు తడుతున్నటువంటి ఒక భావన, ఒక మెలకువ, ఒక సాక్షాత్కారం యొక్క తొలి స్పందన వినిపిస్తూ ఉండింది. దాన్ని ఆయన ‘ఎవరోహో’ అనే కవితలో చెప్తున్నాడు:

ఎవ రోహో, ఈ నిశీథి నెగసి, నీడవోలె నిలిచి
పిలుతు రెవరొ, మూగకనులు మోయలేని చూపులతో
ఎవ రోహో! ఎవరోహో!

‘మూగ కనులు మోయలేని చూపు’ — కృష్ణశాస్త్రి పద ప్రయోగాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఒక క్రొత్త బరువుతో” అన్నట్లు. ‘ఒక మౌనబాష్పకణమటు,’ ‘ఒక గాఢవాంఛ పగిది,’ ‘ఒక వియోగశాలినీ విరహ వేదనారేఖను’ అన్నట్టు.

ఇపుడా ననుఁ బలుకరింతురు!
మ్రోయలేని నీరవగళమునఁ జలించు కోరికతో
ఇపుడా ననుఁ బలుకరింతురు!

“గుండె గొంతుకలోన కొట్లాడుతాది” అని నండూరి సుబ్బారావు అంటే, “మోయలేని నీరవగళమున చలించు కోరికతో” అని కృష్ణశాస్త్రి అన్నాడు. “ఇపుడా” అన్న మాటకు అర్థం ఏమిటంటే — నేను ప్రవాసయాత్రలో ఉన్నప్పుడు ఆమె నన్ను పలకరిస్తుందా? నేను మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టేసి, ఈ వెర్రి అన్వేషణే నా జీవిత లక్ష్యంగా ప్రవాసయాత్ర చేయాలని నేను నిర్ణయించుకొన్న ఈ సమయంలోనా? ఇప్పుడా? ఈ క్షణంలోనా?

ఎవరని ఈ రేయి నిదుర హృదయ మదర, వేయి చేయి
చాయలాడ పెనుచీకటి సైగలతో నా కన్నుల
రక్త మురల లాగికొందురు!

ఇది సాధారణమైనటువంటి అభివ్యక్తి కాదు. ఇది కేవలం ఇంద్రియాలతో — ఒక ఇంద్రియంతో చూసి ఒక ఇంద్రియంతో, ఒక ఉపమానాన్ని ఒక ఉపమేయంతో “ఆమె ముఖం చంద్రుడిలా ఉంది” అని — చెప్పేటటువంటి కవిత్వం కాదు. ఇక్కడికి వచ్చేటప్పటికీ సకలేంద్రియాలు, సకలభావనలు — దృశ్యం, శబ్దం, స్పర్శ — అన్నీ కలగలిసి పోయినటువంటి ఒక మహత్తరమైన సమగ్ర సంచలిత అనుభవం అన్నమాట.

ఇటువంటి కవితలోనుంచే శ్రీశ్రీ “కోరకి కన్ను కొమ్ముకి కన్నూ/కర్కాటకకర్కోటకులో?/దారుణ మారణ దానవ భాషలు/ఫేరవ భైరవ భీకర ఘోషలు/ఘోషల భాషల ఘంటల మంటల కంటక కంఠపు గణగణలో? చిటికల మెటికల చిటపటలో?” అని వేరే సందర్భంలో తన ఆకలి బాధను వర్ణించడానికి రాశాడు కానీ ఆ సారాంశం ఆ అభివ్యక్తి మాత్రం కృష్ణశాస్త్రి తెచ్చుకున్నటువంటివే.

ఎవరో, నా హృదయనాళ మేలా తునియలుగా నా
నిర్జీవపు జీవితమ్ము నిట వదలుదురా!
ఎవ రోహో! ఎవ రోహో!
ఇపుడా ననుఁ బలుకరింతురు?

ఈ తలుపు తట్టడంతో, ఈ తలుపు తట్టిన చప్పుడు వినడంతో ప్రవాసం ముగిసిపోతుంది. కృష్ణ పక్షపు చీకటి రాత్రులు గడిచిన తర్వాత ప్రవాసయాత్రలోని దుఃఖపూరితమైనటువంటి జీవితం గడిచిన తర్వాత ఎవరో ఆయన్ని పలకరిస్తూ ఆయన హృదయనాళాన్ని తునియలుగా చేస్తూ ఆయన్ని మ్రోయలేని నీరవగళమున చలించు కోరికతో ఆయన పిలుస్తున్న చప్పుడు వినబడిన తర్వాత ఆయనలో నెమ్మదిగా మెలుకువ మొదలైనది.

ఊర్వశి: విశ్వ ప్రేయసి సాక్షాత్కారం

‘ప్రవాసం’ అనేది డాంటే రచించిన ‘డివైన్ కామెడీ’లోని పర్గేటరీతో పోల్చదగినదని అనుకుంటే, ‘ఊర్వశి’ని ‘డివైన్ కామెడీ’లోని పారడైజ్‌తో మనం పోల్చవచ్చును. ఇక్కడ, పూర్తిగా నిజమైన స్వర్గలోకం ఆయన ముందు ఆవిష్కృతమైంది. డాంటేకి బియాట్రిస్ కనబడినట్లుగా ఆయనకి ఊర్వశి కనబడింది. ఆ ఊర్వశి ఒక్కసారి కనబడలేదు ఆయనకి. అనేక రకాలుగా అనేక పద్ధతుల్లో ఆయనకి కనబడుతూ వచ్చింది. మొట్టమొదట ఆమె కనబడ్డప్పుడు ఆయనకి ఇతమిత్థంగా చెప్పలేనటువంటి స్ఫురణ కలిగిందన్నమాట. దాన్ని ఆయన చాలా అందమైనటువంటి, అమరమైనటువంటి కవితలో ఆయన చెప్పాడు:

ఆమె
కన్నులలోన అనంతాంబరపు నీలి నీడలు కలవు

మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళడం సాధ్యమే. ఒక దేశం దానిని సాధ్యం చేసుకుంటే, ఆ టెక్నాలజీని తెలుసుకొని మరొక దేశం కూడా సాధ్యం చేసుకోవచ్చు. కానీ “ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలి నీడలు కలవు” అనే వాక్యం మాత్రం ఒక కవిని చూసి మరొక కవి రాయగలిగేది కాదు. ఒక కంప్యూటర్ ముందు 500 ఏళ్ళు ఒక చింపాంజీని కూర్చోబెట్టి టైపు చేయమంటే, అది టైపు చేసుకుంటూ వెళితే చిట్టచివరకు ఒక అర్థవంతమైన వ్యాసం తయారు కావచ్చు కానీ పరమ శక్తివంతమైన కంప్యూటర్ల నుంచి కూడా — ఎటువంటి అద్భుతమైన ప్రోగ్రాంలు మనం తయారు చేసినప్పటికీ, గొప్ప కవులతో ప్రోగ్రాములు రాయించి సాఫ్ట్వేర్ రూపొందించినప్పటికీ కూడా — ‘ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలి నీడలు కలవు’ అనే వాక్యం రాదు. ఆ వాక్యం రాసేందుకు కవి సజీవ మానవుడై ఉండాలి. అతడు ఒక కృష్ణపక్షపు చీకట్లో తిరుగాడి ఉండాలి. ప్రవాసయాత్రలో ఒక ధూళికణంగా ఎగిరిపోయి ఉండాలి, దుఃఖపడి ఉండాలి, కిందపడి ఉండాలి, నలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే — ఆ చిట్టచివర — ఒక భయంకరమైన వర్షం కురిసిన తర్వాత, ఒక కాళరాత్రి ముగిసిన తర్వాత ఉండే తొలి వేకువలోని ఆ సుషుప్త్యానంతర ప్రశాంతి సాధ్యం కాదు. ఆమె కనులలోన అనంతాంబరపు నీ నీడలు కల’వనే వాక్యం ఊర్వశి యొక్క తొలి సాక్షాత్కార వాక్యం.

వినిర్మలాంబు
పూరగంభీరశాంతకాసారచిత్ర
హృదయములలోని గాటంపు నిదురచాయ
లందు నెడనెడఁ గ్రమ్ము;

సంధ్యావసాన
సమయమున నీపపాదపశాఖికాగ్ర
పత్రకుటిలమార్గముల లోపల వసించు
ఇరుల గుసగుసల్ వానిలో నిపుడు నపుడు
వినఁబడుచు నుండు;

సాయంకాలపు సమయంలో ఆ కడిమిచెట్ల శాఖోపశాఖల వంకర దారుల్లో ఉండే చీకట్ల గుసగుసలు ఆ కళ్ళల్లో అప్పుడప్పుడు వినబడుతూ ఉంటాయట.

మరికొన్ని వేళ లందు
వానకారు మబ్బుల మెయివన్నె వెనుక
దాగు బాష్పమ్ము లామె నేత్రముల లోన
పొంచుచుండును;

ఎదియొ అపూర్వ మధుర
రక్తి స్ఫురియించుగాని అర్థమ్ము కాని
భావగీతమ్ము లవి …

అసలు ఈ వాక్యం మొత్తాన్ని భావకవిత్వానికి ప్రతిపాదిక వాక్యంగా లక్షణ వాక్యంగా స్వీకరించారు మన వాళ్ళు. భావ కవిత్వం అంటేనే “ఎదియొ అపూర్వమధురరక్తి స్ఫురించు కాని అర్దము కాని భావగీతములవి”.

అర్థం కాకుండా అపూర్వమధురరక్తి స్ఫురించడంలోనే భావ భావకత్వం తాలూకు లక్షణం ఉందన్న మాటకు అర్థం ఏంటంటే:
అర్థం అనేది ఒక సామాజిక సందర్భానికి సంబంధించిన అంశం. నీకు నాకు మధ్య ఆనాడు నిశ్చయమైనటువంటి సందర్భం ప్రకారం, సామాజిక సూత్రాల ప్రకారం నేను మాట్లాడే మాట నీకు అర్థం అవుతూ ఉంటుంది. అసలు, ఆ ప్రాచీన సమాజాన్ని ఆ సామాజిక సందర్భాన్ని తోసిరాజు అంటున్నప్పుడు, నీకు నాకు మధ్య సరాసరి మన హృదయానుభవమే చేరడమే ప్రధానంగా ఉండే ఒక మానవతా సంబంధాన్ని నిలబెడుతున్నప్పుడు, మొట్టమొదట నీకు నా బాధ అనుభవం అవుతుంది. ఆ తర్వాత అర్థమవుతుంది అన్నమాట.

గొప్ప కవిత గురించి ఒక పాశ్చాత్య కవి కూడా ఇదే మాట అన్నాడు, అది అర్థం కావడానికి ముందు అనుభవం అవుతుందని. అలాగే, కృష్ణశాస్త్రికి ఊర్వశి అర్థం కావడానికంటే ముందు అతని అనుభవంలోకి ప్రవేశించింది అన్నమాట. ఊర్వశి అంటే ఎవరు అని కృష్ణశాస్త్రిని అడిగితే ఆయన చాలా చక్కటి మాటలు చెప్పాడు:

ఈ ఊర్వశి ఎవరనీ, ఏ స్థలాన ఉన్నదనీ, పేరెవ్వరనీ, స్వకీయా పరకీయా? అనీ అడిగేవారు ఎక్కడ చూడాలో, ఎలాగ చూడాలో తెలియక అడుగుతున్నారు. ఊర్వశి కవిలో ఉంది! కవి హృదయం లాంటి హృదయమూ, కవి భావన వంటి భావనా సంపాదించు ! నీకూ దర్శన మవుతుంది; నీవూ ధూళి దాకా శిరస్సు వంచుతావు.

సీతమ్మ లోకైక మాత అయితే ఊర్వశి “విశ్వ ప్రేయసి.” అనగా నిజంగా ఎవరి కైనా ప్రేయసి ఉంటే ఆ ప్రేయసి వానికి ఊర్వశి అన్నమాట ! కనుక “అమ్మా! అమ్మా!” అంటే సీతమ్మా అన్నమాట! “ప్రేయసీ! ప్రేయసీ !” అంటే ఊర్వశీ అన్నమాట!

[…]

ఇలాగ నేటి తెలుగుకవికి ఎన్ని స్వర్గ స్వప్నాలో ఉన్నాయి లోపల. నేటి తెలుగుకవికి ఊర్వశి అంటే లోపం లేని ఆనందం! కలత లేని శాంతి! అమృతం! ఊర్వశిని ప్రేమిస్తే లోకంలో ఎవరినీ ప్రేమించ లేకుండా ఉండలేమంటాడు నేటి తెలుగు కవి! కనుక ఊర్వశి కోసమే లోకంలో మంటా, వేదనా, బాధా, ఈర్ష్యా, ద్వేషమూ, ఏడుపూ ఉంచలేనంటాడు నేటి తెలుగుకవి! కనుక ఊర్వశీ, సుధర్మాస్థానంలో నీవేమూల తెలుసు! నందనారామంలో నీ పారిజాతచ్ఛాయ నాకు తెలుసు! నీ ఇల్లు వెనకాలే ఒరుసుకుని, ఊర్వశీ, మందాకిని పరుగెత్తుతుందని నాకు తెలుసును. ఒకసారి దాని ఒడ్డున కూర్చుండి నీళ్లల్లో నీ కాళ్లు ఆడిస్తూ, ఇంకోసారి నీ కిటికీ లోంచి స్వప్నభరాలైన కళ్లతో దాని నురుగులకేసి చూస్తూ నీ వొక్కతెవే ఉంటావని నాకు తెలుసు. ఎప్పుడూ నీ వొకతెవే ఉంటావని నాకు తెలుసు. అప్పుడు రంభ, మేనక, తిలోత్తమ వేలకు వేలు అమరావతి వీథుల్లోనో, చింతామణి సాన్నిధ్యంలోనో ఆడిపోతూ ఉంటారని అందరికీ తెలుసును. ఊర్వశీ, కవి నిన్ను త్రిభువనాల పైన దివ్యపతాకలాగ ఎగరవేశాడు. నీవక్కడ నుండి జారిపోకు. త్రిభువనాలూ కళ్లనీ, చేతులనీ ఆరాధిస్తూ నీ కోనము ఎత్తనీ ఊర్వశీ! రవీంద్రుడన్నట్లు ప్రవాళ పర్యంకిక మీద నిద్రపోయావో, వ్యాసుడన్నట్లు నారాయణదేవుని ఊరుమందిరంలో ఇమిడి ఉన్నావో, ఆర్య ఋషి అన్నట్లు కేవలము నిరవధి కానందానివో! ఊర్వశీ! ఊర్వశీ! అది నీ చరణ శోణిమా? పారాణా? నా హృదయ రక్తమా?

ఊర్వశీ, నా కావ్యానివి నీవు. నీవు నక్షత్రాలలో! నేను ఈ లోకాన్ని స్వర్గలోకం చేస్తాను. “నువ్వు పక్క నుండు, నే నీ లోకాన్ని వైకుంఠము చేస్తాను” అంటాడు నవకవి.

ఒక రకంగా చెప్పాలంటే, ఆయనకు ఒక ఈశ్వరీయమైనటువంటి నారాయణుని యొక్క ఊరువులో జన్మించిన సౌందర్యరాశిగా, సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సౌందర్య స్ఫురణకు ఒక గాఢాతిగాఢమైన, నిష్కలంకమైన, పరిపరిపూర్ణమై ఒక భావనకి చిహ్నంగా ఆ ఊర్వశి సాక్షాత్కరించింది.
అందువల్లే ఆ ఊర్వశి సాక్షాత్కారం తర్వాత ఆయన రాసిన కవితలు సాక్షాత్తు భగవంతుని మీద రాసిన కవితలే. ‘ఊర్వశి’లో ఉన్న కవిత చాలా ప్రసిద్ధమైన కవిత:

నా వలెనె యాతడున్మత్త భావశాలి
ఆగికోలేడు రేగు నూహల నొకింత!
ఎట్టి నిశినే నదరిపోవు నెగసిపడును
ఎన్ని చుక్కలపాటు లెన్నెన్ని మెరపులు!

అన్న ఈ కవితలో ఆయన సాక్షాత్తు భగవంతుని గురించే చెప్తూ భగవంతుడు కూడా నావలనె ఉన్మత్త భావశాలి ఆ ఊర్వశి రూపంలో భగవంతుని సాక్షాత్కారం కలిగిందని మనం చెప్పుకోవచ్చు.

పల్లకి — సంపూర్ణ దర్శనం, ముగింపు

కవి — భావకవి కానీ, ప్రణయకవి కానీ, సూఫీకవి కానీ, బ్రహ్మసమాజకవి కానీ, మధురభక్తికవి కానీ — ఏ కవికైనా కూడా కవిదర్శనం యొక్క పరాకాష్ట ఏమిటంటే అతని జీవితాన్ని ఎట్లా ప్రేమించాడో మృత్యువును కూడా అట్లా ప్రేమించడమే. అదే అతని సౌందర్యదర్శనానికి పరాకాష్ట అవుతుంది. ఈ లోకాన్ని పరలోకాన్ని జీవించడాన్ని, జీవించలేకపోవడాన్ని; ఉండటాన్ని, లేకపోవటాన్ని కూడా సమానంగా స్వీకరించగలగడమే కవిదర్శనాన్ని పరిపూర్ణం చేస్తుందని అనుకున్నట్లయితే కృష్ణశాస్త్రి యొక్క ‘పల్లకీ’ కవితలో కృష్ణశాస్త్రి యొక్క సంపూర్ణ సాహిత్య వికాసం సంపూర్ణ సాహిత్య వైభవం అంతా కూడా కనబడుతుంది.

ప్రాణ సఖుడె నా కోసమై పంపినాడు
పల్లకీ యన హృదయమ్ము జల్లుమనియె
వీడని వియోగమున వేగు మ్రోడు మేను
తలిరు తోరణమై సుమదామమాయె!

చెదరు చేతుల నెటొ కయి సేసుకొంటి
మొయిలు వసనమ్ములో, ప్రొద్దు పొడుపు నగలొ
ఏదొ కాలుచు హాయియో, యేదొ తేల్చు
భారమో, యేమొ సైరింప నేరనైతి!

కొసరు యొడల తూగాడుచు కూరుచుంటి
పూల పల్లకీలో పూలమాల నేను!
ఓ యనగ ఓహొహో యన బోయవాండ్రు
దారి బడి నిల్చి చూచె యూరూరు నాడు!

ఓ యనగ ఓహొహో యన బోయవాండ్రు
వీటివెలుపల మేల్కొనె తోటతెరువు
ఓ యనగ ఓహొహో యన బోయవాండ్రు
తోట పొలిమేర కాలువ తొనకె నిదుర!

ప్రణయ వల్లకి పల్లకీ! ప్రసవ భర వ
సంత వల్లిక పల్లకీ! శక్రచాప
వక్రరేఖ పల్లకి! మధుస్వప్న శాఖ
పల్లకీ!

ఈ పల్లకి చాలా కాలం పాటు నేను పల్లకి అనే అనుకున్నాను ఇది ప్రాణసఖుడు తన ప్రియురాలి కోసం పంపిన పల్లకి అని అనుకున్నాను. కానీ కృష్ణశాస్త్రికి జీవితకాలపు మిత్రుడు, నెచ్చెలి అయిన మా మాస్టారు శరభయ్య మాతో చర్చిస్తూ, ‘ఈ పల్లకి ప్రియుడు ప్రియురాల కోసం పంపిన పల్లకి కాదు. దేవుడు కవి కోసం పంపించినటువంటి స్వర్గలోక పల్లకి’ అని వివరించాడు. అందుకే కృష్ణశాస్త్రి:

నానివాసమ్ము తొలిత గంధర్వ లోక సుషమా సుధాగాన మంజువాటి

అని అన్నాడు. ఆ మంజువాటిలో ఆయన శాశ్వతంగా అమరంగా జీవిస్తూ ఉన్నాడు. ఆ కవిత్వ పరిమళాలు మనకి వదిలిపెట్టి వెళ్ళాడు.