సిలికాన్ సెమీకండక్టర్ పై సాంకేతిక పరిశోధన నా వృత్తి. 2002 సంవత్సరంలో, ఆస్టిన్, టెక్సస్‌లో నేను పని చేస్తున్న మోటరోలా కంపెనీ, యూరప్‌లో రెండు పెద్ద కంపెనీలయిన ఫిలిప్స్ సెమీకండక్టర్, ఎస్. టి. మైక్రోఎలెక్ట్రానిక్స్ లతో పొత్తు కుదుర్చుకొని, అత్యాధునికమైన సిలికాన్ చిప్స్ తయారీ కోసం ఫ్రాన్స్‌లో ఒక పెద్ద రిసెర్చి భవనాన్ని నిర్మించింది! మోటరోలా తరఫున ఒక అరవై మందిని ఎంపికచేసి నన్నూ అందులో ఒకడిగా అక్కడకి కుటుంబంతో సహా పంపించారు. ఫ్రాన్స్ వెళ్ళే విషయంలో నా భార్య (కల్యాణి) ఉత్సాహం చూపించటంతో, మా పిల్లలు రమ్య (12 ఏళ్ళు), అనూజ్ (8 ఏళ్ళు) వాళ్ళ, వాళ్ళ స్నేహితులని విడిచిపెట్టి వెళ్ళటానికి వీలుకాదని కొంచెం గొడవపెడుతున్నా, మూడేళ్ళపాటు ఫ్రాన్స్‌లో ఉండటానికే నిశ్చయించుకున్నాం! కుటుంబంతో సహా ఒక దేశాన్నించి మరొక దేశానికి బదిలీ అవ్వటం చాలా కష్టమైన పని! అయితే, కంపెనీ పనిమీద వెళ్ళటం కాబట్టి, అన్ని విషయాల్లోనూ మోటరోలా సహకారం అందించింది. ఆస్టిన్‌లో మా ఇల్లు మోటరోలా కి అమ్మేసి, అందరం అక్టోబర్ 2002లో ఫ్రాన్స్‌కి బదిలీ అయ్యాము. అక్కడి మా జీవితంలోని కొన్ని అనుభవాలను “ఈమాట” పాఠకులతో పంచుకోవాలని ఈ వ్యాసం రాస్తున్నాను. ఇవి రాయటానికి రెండు కారణాలున్నాయి. మొదటిది, ఈమాట వంటి అంతర్జాతీయ వెబ్ పత్రిక నడపటంలో ఒక ముఖ్య ఉద్దేశ్యం – ప్రవాసాంధ్రుల అనుభవాలు అందరితోటీ పంచుకోటం కాబట్టి, ఈమాటను ఒక వేదికగా తీసుకొని మా అనుభవాలు పంచుకోవాలని. రెండవది, మేము ఫ్రాన్స్ నుంచి అమెరికా తిరిగి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. మా జ్ఞాపకాలు, అనుభవాలు మరిచి పోకముందే వాటిని రాతపూర్వకంగా పొందుపరచాలని!
ఆస్టిన్ వదలి ఫ్రాన్స్ వెళ్ళబోతుంటే, స్నేహితులందరూ, “అమెరికా వదలి ఫ్రాన్స్ వెళ్ళటం మీకు సరదాగా ఉందా?” అని అడిగారు. ఒక పక్క ఫ్రాన్స్‌లో జీవితం గడపబోతున్నామనే ఉత్సాహం ( అంతకు మూడు వారాల ముందే, నన్ను, కల్యాణిని ఒక వారం రోజులపాటు, నేను ఫ్రాన్స్‌లో పనిచెయ్యబోయే ఊరికి మా కంపెనీ పంపింది. “మీకు అక్కడి వాతావరణం నచ్చితేనే వెళ్ళండి” అని నచ్చచెప్పాలని మా కంపెనీ వారి ఆలోచన. ఆ ప్రయాణంలో నాకూ, కల్యాణికి ఫ్రాన్స్ చాలా బాగా నచ్చింది!), స్నేహితుల్ని, తెలిసిన ఊరు, ఇల్లు, అన్నీ వదలి వెళ్ళటం వల్ల కొంత దిగులు, రాబోయే మూడు సంవత్సరాల్లో ఎటువంటి అనుభవాలు ఉంటాయో అని ఒక భయం – ఇలా రకరకాలైన ఆలోచనలతో ఆస్టిన్ వదిలాం. ఇలా మా కుటుంబం అంతా కలసి అమెరికా వదలి ఇంకో దేశంలో మూడేళ్ళు గడపటం, ( ఎప్పుడన్నా ఇండియా వెళ్ళినా, మూడు, నాలుగు వారాల మించి ఉండలేదు) ఇంతకు ముందు ఎప్పుడూ చెయ్యకపోటం వల్ల, ఉన్న దిగుల్ని పోగొట్టుకోటానికి, వెడుతూ, వెడుతూ నా కవల సోదరుడు రామన్న కుటుంబంతో, డెట్‌రాయిట్‌లో ఒక పది రోజులు గడిపి, ఫ్రాన్స్ చేరుకున్నాం! కొన్ని ముఖ్యమైన సామాన్లు మా వెంట తీసుకెళ్ళినా, ఇంటి సామానుల్లో ఎక్కువభాగం sea shipment ద్వారా పంపాము. అవి ఫ్రాన్స్ చేరటానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని తెలిసి, కంపెనీ వాళ్ళిచ్చిన అపార్ట్‌మెంట్‌లో మూడు వారాలు ఆస్టిన్‌లో మరో మూడు వారాలు ఫ్రాన్స్‌లో అపార్ట్మెంట్‌లో ఉన్నాం! ఫ్రాన్స్‌లో ఇళ్ళన్నీ చిన్నవని ముందే తెలియటం వల్ల, మా మాష్టర్ బెడ్ లాంటివి హ్యూష్టన్‌లో స్టోరేజీ లో పెట్టి వెళ్ళాం.
టెక్సస్‌లో ఆస్టిన్ చాలా అందమైన నగరం. అంతకన్నా అందంగా అనిపించింది, ఫ్రాన్స్‌లో గ్రెనోబుల్ అన్న చిన్న పట్టణం!ఈ ఊరి జనాభా అంతా లక్షన్నరకి మించదు. ఇది ఫ్రాన్స్ ముఖ్య పట్టణమైన పారిస్ నగరానికి దాదాపు 600 కిలోమీటర్లు దక్షిణ – తూర్పు దిశలో ఉంది. యూరప్‌లో అతి పెద్ద పర్వతశ్రేణి అయిన ఆల్ప్స్ పర్వతాలు ఫ్రాన్స్‌లో మొదలయ్యేది గ్రెనోబుల్ ఊరి దగ్గరే! వెళ్ళిన మొదటి వారంలో పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్పించటం, ఇంట్లోకి కావలసిన సామాన్లు కొనుక్కోటం, ఊరులో ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేం కొనుక్కొవచ్చో తెలుసుకోటం లాంటి పనులతో సరిపోయింది. మొదటి రెండు వారాలు, పనికి కూడా వెళ్ళలేదు.
మా ఇంటి నుంచి కనపడే మంచు కప్పిన ఆల్ప్స్ పర్వతాలు
నెమ్మదిగా మా కుటుంబం అంతా మేం ఎటువంటి మార్పులకి సిద్ధపడ్డామో తెలియటం మొదలయింది. కల్యాణి, మా పిల్లలు — వాళ్ళ, వాళ్ళ ఆస్టిన్ స్నేహితుల్ని ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు. దానికి తోడు ఫ్రెంచి భాష రాకపోటం మరింతగా బాధపెట్టింది. ఫ్రెంచి వారికి, వారి భాష మీద చాలా అభిమానం అని తెలుసుగాని, మరీ అంత “వీరాభిమానం” అని మేం ఫ్రాన్స్ వెళ్ళే దాకా తెలియలేదు. నాకు అక్కడి వాతావరణం కొత్తల్లో ఇబ్బంది పెట్టినా, నేను కూడా బాధ చూపిస్తే, కల్యాణి, పిల్లలు మరీ బెంబేలు పడతారని తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో ఉండేవాణ్ణి. కల్యాణి నన్ను ” మీకు ఎటువంటి ఫీలింగ్సు ఉండవేమిటండీ? మీరు ఇంత నిబ్బరంగా ఎలా ఉంటున్నారు?” అని దెప్పేది! మా ఇంట్లో అందర్లోకి ఎక్కువగా ఇబ్బంది పడ్డది మా అబ్బాయి అనూజ్. రోజూ స్కూల్ నుంచి వచ్చి, మర్నాడు స్కూల్‌కి పోనని ఏడ్చేవాడు. అనూజ్ చదువుతున్న ఎలిమెంటరీ స్కూల్‌లో అంతా అనూజ్‌తో ఫ్రెంచ్‌లోనే మాట్లడేవారు. అనూజ్ నుంచి ఫ్రెంచిలో సమాధానం రాకపోయేసరికి, ఫ్రెంచి రాదని స్కూలు పిల్లలు ఏడిపించేవారు! నాకు, కల్యాణికి మా సమయం అంతా అనూజ్‌ని వోదార్చడానికే సరిపోయేది. ఒక్కొక్కప్పుడు, ఎందుకు చక్కని ఆస్టిన్ జీవితాన్ని వదిలి ఈ ఫ్రాన్స్ వచ్చామా అని బాధపడేవాళ్ళం. రమ్య హైస్కూల్‌లో ఉండటం, పైగా ఆ స్కూల్లో ఇంగ్లండ్, జర్మనీ, మొదలైన యూరోపియన్ దేశాల పిల్లలే కాక, ఆసియా, అమెరికా, ఆఫ్రికా ఖండాలలోని దేశాల పిల్లలు కూడా చదువుతుండటం వల్ల, ఫ్రెంచ్ భాష రాకపోటం మరీ అంతగా రమ్యను బాధపెట్టలేదు.
ప్రపంచంలో ఇలా ఒక దేశాన్నుంచి మరో దేశానికి పని కోసం వెళ్ళే కుటుంబాలకి, ఆ పై దేశంలో రాబోయే సవాళ్ళను ఎదుర్కొనడానికి, పెద్ద పెద్ద కంపెనీలు ఆ కుటుంబం అంతటికీ, ఆ కొత్త సంస్కృతికి అలవాటుపడే శిక్షణ (“Cultural Training”) పేరిట ఒక ట్రైనింగ్ ఇస్తారు. మోటరోలా కూడా మాకు అదే ఏర్పాటు చేసింది! ఇందులో భాగంగా, ఫ్రెంచి భాష నేర్చుకోటం, కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో, అక్కడ ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో అన్న విషయాల మీద మాకు శిక్షణ ఇచ్చారు. అది కొంత వరకు ఉపయోగపడింది కుడా! మాకు ఈ శిక్షణలో ముందే చెప్పినట్టు, వెళ్ళిన మూడు నుంచి ఆరు నెలల్లో అతి ఎక్కువ స్తబ్ధత (డిప్రెషన్) కి మేమందరం గురి అయ్యాం. ముఖ్యంగా కల్యాణికి స్నేహితులూ, వాళ్ళతో సరదా కబుర్లూ చాలా ఇష్టం. ఒక్కసారిగా, ఫ్రాన్స్ రావడంతో, కల్యాణి ఈ కొత్త వాతావరణం లో ఇమడలేక ఉక్కిరిబిక్కిరి అయింది. దీన్ని తట్టుకోడానికి రోజూ ఒక 45 నిమషాలు విష్ణు సహస్ర నామం చదివేది (ఎం. ఎస్. సుబ్బులక్ష్మి టేప్ వింటూ). ఇందువల్ల జరిగిన మంచి ఏమిటంటే, రమ్య, అనూజ్ ఇద్దరికీ మొత్తం విష్ణు సహస్ర నామం కంఠతా వచ్చింది.
మేము మూడేళ్ళు సెంటిమియే (Saint-Ismier) అన్న పల్లెటూరులో ఉన్నాం! ఈ ఊరు గ్రెనోబుల్‌కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెంటెమియే ఊరుకు, చిన్నప్పుడు ఆంధ్రాలో నా బాల్యం, హైస్కూలు చదువు వరకూ గడిపిన పశ్చిమ గోదావరి జిల్లాలోని “సరిపల్లె” అన్న చిన్న పల్లెటూరుకూ చాలా దగ్గర పోలికలున్నాయి. సెంటెమియేలో మా ఇంటి ముందు రోడ్డు ఎంత చిన్నది అంటే, రెండు కార్లు ఎదురెదురుగా వస్తూ ఒకదాన్ని దాటి మరొకటి వెళ్ళాలంటే, చాలా కష్టపడాలి. అంత ఇరుకైన రోడ్లు! మా ఇల్లు చిన్నదైనా, ఇంటి వెనకనున్న జాగా చాలా పెద్దది. మా ఇంటి నుంచి తూర్పు దిశగా చూస్తే, మంచుతో కప్పబడిన ఆల్ప్స్ పర్వతాలు కనపడతాయి. ఈ పర్వతాలు దాదాపు రెండు కిలోమీటర్లు ఎత్తుగా ఉంటాయి. జూన్ నెలలో, పర్వతాల పైనున్న మంచు కరగటం మొదలై, ఆగస్టు నెలాఖరకి, ఉన్న మంచంతా కరిగి పోతుంది. మళ్ళీ, అక్టోబర్ చివర్లో, ఈ కొండల మీద మంచు కురవటం మొదలవుతుంది! మేం ఉన్న ఇల్లు, ఆల్ప్స్ పర్వతాలకి పశ్చిమ దిశగా ఉన్న ఒక కొండ వాలులో కట్టారు. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆల్ప్స్ కొండల వెనకాల నుంచి వచ్చే కిరణాలు లోయ అంతా నెమ్మదిగా పరుచుకొని ఒక వింత అందాన్నిస్తుంది. మా ఇంటి నుంచి కొంచెం దిగువగా చూస్తే, కొండల మధ్య ఉన్న లోయ ప్రాంతం అంతా చక్కగా కనపడుతుంది. మార్చి రెండో వారం నుంచి మొదలయ్యే వసంత కాలానికి, మొత్తం ఈ లోయలో ఉన్న మంచంతా కరగిపోయి, రకరకాలైన రంగులతో పూల మొక్కలు చిగురించి, ఏప్రెల్ నెలకల్లా, లోయ అంతా రకరకాలైన రంగులున్న తివాసీలా కనిపిస్తుంది. అప్పటికి చలి కొంచెం తగ్గటంతో, చాల మంది ఫ్రెంచి వాళ్ళు రోడ్ల మీద సైకిళ్ళతో కనిపిస్తారు. అన్నట్టు, ఫ్రాన్స్‌లో కార్లలో ప్రయాణించే వాళ్ళు, చిన్న చిన్న ఊర్ల గుండా వెడుతున్నప్పుడు, సైకిళ్ళపై ప్రయాణిస్తున్న వారితో జాగర్తగా ఉండాలి! ఈ సైకిల్‌వాలాలకు రోడ్లపై ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. రోడ్డు ప్రమాదంలో, కారు వెళ్ళి, ఒక సైకిల్‌వాలాకు కొడితే, అది అతి పెద్ద ప్రమాదంగా ఫ్రెంచి వారు చూస్తారు! అలాంటి సందర్భాలలో, కారు డ్రైవర్‌కి అతి పెద్ద శిక్షపడుతుంది!
ఫ్రాన్స్‌లో మా ఇల్లు, ఊరు పరిచయం
ఇంతకు ముందే చెప్పినట్టు, మా కుటుంబం అంతా ఫ్రాన్స్‌కి బదిలీ అవ్వక పూర్వం, నేనూ కల్యాణి ఒక వారం రోజులు మేం వెళ్ళబోయే ప్రదేశం బాగుందా లేదా చూసుకోటానికి వెళ్ళాం! దీన్నే Look-see-trip అంటారు. పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయో చూసిన తరవాత, ఇళ్ళ వేటలో పడ్డాం. మోటరోలా కంపెనీ ద్వారా ఏర్పాటు చెయ్యబడ్డ relocation agents మాకు అక్కడ ఖాళీగా ఉన్న ఇళ్ళు చూపించారు. అందులో కొత్తగా కట్టడం పూర్తి కాబోతున్న ఇల్లు ఒకటి కల్యాణికి బాగా నచ్చింది. ఇళ్ళ సెలెక్షన్‌లో పూర్తిగా ఆడవాళ్ళ అభిప్రాయాలకి ఎక్కువ విలువ ఇవ్వటం మంచిదని నాకు అనిపించింది (రోజులో ఎక్కువ కాలం ఇంట్లో గడిపేది వాళ్ళే కదా!). ఒక ఎకరం పైగా విస్తీర్ణం ఉన్న జాగాలో చాలా అధునాతనంగా కట్టిన ఇల్లు అది. అందులో, ఆ ఇల్లు ఆల్ప్స్ పర్వతశ్రేణికి ఎదురుగా, చిన్న చిన్న పర్వతాల మధ్యలో, సారవంతమైన కొండవాలు నేలపై ఉంది. మొత్తం ఇంటి జాగా అంతా కలిపితే, 2000 చదరపు అడుగులు కూడా ఉండదు (మేం టెక్సస్ నుంచి వచ్చామని, ఈ మాత్రం వైశాల్యమున్న ఇళ్ళను అతి చిన్న ఇళ్ళుగా తలుస్తామని గుర్తుంచుకోవాలి!). పైగా, రెండు అంతస్తులున్న ఈ ఇంటికి ఏర్ కండిషనింగ్ లేదు! కానీ, కొండ వాలుపై ఉన్న ఇల్లు కాబట్టి, వేసవిలో ఎంత వేడిగా ఉన్నా (2003 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో ఎండ వడ దెబ్బకు అతి ఎక్కువ సంఖ్యలో జనాలు చనిపోయారు!), సాయంత్రానికి చల్లబడి, చాలా ఆహ్లాదంగా ఉండేది! ఆ ఇంటి నిర్మాణ శిల్పంలో (archtecture) రెండు విషయాలు మమ్మల్ని బాగా ఆకర్షించాయి. మొదటిది, ఇంటి కిటికీలన్నింటికి ఉన్న ఎలక్ట్రానిక్ తెరలు. ఈ తెరలకి వాడిన మోటార్లు ఎలాంటివో గానీ, ఉన్న మూడేళ్ళలో ఒక్కసారి కూడా వాటి శబ్దం మాకు వినపళ్ళేదు. అంత నిశ్శబ్దంగా పనిచేసేవి. అంతేకాకుండా, వేసవిలో మిట్ట మధ్యహ్నం ఎండ ఇంట్లోకి రాకుండా, ఈ తెరలు పూర్తిగా వేసి, ఇంటిని పూర్తిగా చీకటిమయం చెయ్యచ్చు! రెండోది, చలి కాలంలో ఆ ఇంటికి కావలసిన వెచ్చతనం అంతా, ఇంటిలోపల ఫ్లోర్ మీద ఉన్న టైల్స్ నుంచే వస్తుంది! నీటిని వేడి చేస్తూ వాటి ద్వారా ఇంటికి కావలసిన వేడినిచ్చే ఎలెక్ట్రిక్ హీటర్లన్నీ ఆ టైల్స్ కింద ఉండేవి!
స్నోలో పూర్తిగా కప్పడిన మా ఇల్లు
పనిలో నా అనుభవాలు
నేను మోటరోలా కంపెనీలో పని చెయ్యక ముందు, ఎస్. టి. మైక్రో ఎలెక్ట్రానిక్స్ కంపెనీలో, డాలాస్, టెక్సస్‌లో పనిచేసాను. ఆ అనుభవంతో, మళ్ళీ ఎస్. టి. మైక్రో ఎలెక్ట్రానిక్స్ కంపెనీతో పని చెయ్యటం తేలికే అన్న భావన కూడా నన్ను ఫ్రాన్స్ రప్పించడానికి ఒక కారణం. పనిలో నాకు ఎదురైన అనుభవాలు అంతకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. మా మూడు కంపెనీలు కలిసి, పనిలో ఒకరికొకరు ఇంగ్లీషులో మాట్లాడుతూ బిజినెస్ చేయ్యాలని రాత పూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నా, అందరూ ఫ్రెంచిలోనే మాట్లాడేవారు! మా మీటింగులన్నీ ఫ్రెంచిలోనే జరిగేవి! ఏ మీటింగుకి వెళ్ళినా ఏమీ అర్ధంకాక, తిరిగి వచ్చేవాణ్ణి. నా అమెరికన్ సహోద్యోగులకీ, నాకయిన అనుభవమే ఎదురయ్యింది. విచిత్రం ఏమిటంటే, మా మీటింగుల్లో ఏదైనా స్లైడ్స్ చూపిస్తున్నప్పుడు, ఫ్రెంచి వారి స్లైడ్స్ అన్నీ ఇంగ్లీషులోనే ఉండేవి! కానీ, మాట్లాడటం అంతా ఫ్రెంచిలోనే. దీనికి కారణం తెలియాటానికి నాకు దాదాపు రెండేళ్ళు పట్టింది. ఫ్రెంచి పిల్లలంతా, స్కూళ్ళల్లో ఇంగ్లీషు బాగానే నేర్చుకుంటారట! అందువల్ల వాళ్ళకి, ఇంగ్లీషు బాగానే వచ్చు. కానీ, ఇంగ్లీషు రాయటం వచ్చినంత బాగా, ఫ్రెంచి వాళ్ళకి ఇంగ్లీషు మాట్లాడటం రాదు. అందుకని, ఇంగ్లీష్ మాట్లాడితే, తప్పులు దొర్లుతాయని, ఫ్రెంచిలోనే మాట్లాడతారు. దానికి తోడు, వాళ్ళ భాషాభిమానం కూడా ఇందుకు తోడయ్యింది! అందుకని, మమ్మల్ని ఫ్రెంచి నేర్చుకోమని ప్రోత్సహించే వాళ్ళు! భాషాపరంగా ఇటువంటి ఇబ్బందుల వల్ల, ప్రతిరోజు, పని పూర్తయి ఇంటికి వెడుతున్నప్పుడు ఎంతో అలసటగా ఉండేది! పని పెద్దగా చెయ్యకపోయినా, ఇలా ఫ్రెంచివారితో కలసి, ఫ్రెంచి అర్ధం చేసుకోటానికి ప్రయత్నించటం ఎంత కష్టమో అనుభవంలోకి వచ్చింది! భాష బాధలు పక్కనపెట్టి, మిగిలి విషయాల్లో నైనా కాస్త పని తేలికగా అవుతుందని అనుకుంటే, అక్కడ కూడా చుక్కెదురే! ఇందుకు కారణం, ఫ్రెంచి వారి ఆలోచనా పద్ధతి, బిజినెస్ విషయాల్లో ఫ్రెంచివారి సంస్కృతి, అమెరికన్ల కన్నా పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఫ్రెంచివారు, తెలివైనవారే కాని, అమెరికన్లంత గట్టిగా పని చెయ్యరు (అక్కడక్కడా గట్టిగా పనిచేసిన ఫ్రెంచి వారు కనపడినా!). ఏడాదిలో నలభై రోజులు శలవ తీసుకోటం తప్పని సరి! అది ఫ్రెంచి ప్రభుత్వపు రూలు! (చిన్నప్పుడు ఎవరైనా ఎక్కువ రోజులు కనపడకపోతే, వాడు ఫ్రెంచ్ లీవు మీద వెళ్ళాడని ఎందుకనేవారో నాకు ఫ్రాన్స్ వెళ్ళిన తరవాత అర్ధమైంది) వారానికి, 35 గంటలు పని మాత్రమే చేస్తారు. వారాంతరాల్లో, సాధారణంగా ఫ్రెంచివారు ఎవ్వరూ, ఆఫీసులకి రారు. నా పని అనుభవాల్లో, అమెరికన్లు చాలా మంది, శని, ఆది వారాల్లో పనికి వచ్చేవారు. ఏడాదికి ఉన్న 40 శలవు దినాల్ని, ఫ్రెంచి వారు చక్కగా ఉపయోగించుకొని, కుటుంబాలతో విహార యాత్రలకి, దేశాలు చూడటానికి వెడతారు. నిజానికి, ఒక శలవు నుంచి ఫ్రెంచి వారు పనికి రాగానే చేసే మొదటి పని – రాబోయే శలవుల్లో ఎక్కడకి వెళ్ళాలో, ఏమి చూడాలో ప్లాన్6 చేసుకొని దానికి తగ్గ సన్నాహాలు చేసుకోటం! ఆగస్టు నెల మొత్తం అంతా, మొత్తం ఫ్రెంచి దేశం, శలవులో ఉంటుందంటే, అది అతిశయోక్తి కాదు. మేం ఫ్రాన్స్ వెళ్ళిన తరవాత వచ్చిన మొట్టమొదటి ఆగష్టు నెలలో, మా పనిలో దాదాపు 60 – 70 శాతం ఫ్రెంచి ఉద్యోగులు శలవు తీసుకోటం చూసాను.
ఫ్రెంచి వారి ఆలోచనా పద్ధతి
ఐఫిల్ టవర్ ముందు కల్యాణి, రమ్య, అనూజ్
“ఒక గదిలో ఒక బల్లమీద ఒక అందమైన వస్తువుని పెట్టి, పది మంది ఫ్రెంచి వారిని ఆ వస్తువుని వర్ణించమంటే, ఏ ఒక్కరు చెప్పింది మరొకరు చెప్పకుండా, పది మంది పది రకాల వర్ణనలు ఇవ్వగలరు!” ఫ్రాన్స్ వెళ్ళక ముందు ఫ్రెంచి వారి గురించి ఒక పుస్తకంలో చదివిన వాక్యమిది. ఇది అక్షరాలా సత్యమని మా మూడేళ్ళ ఫ్రాన్స్ జీవితంలో తేలింది! ఇందుకు కారణాలు చాలా ఉండవచ్చు. ప్రతీ వారు, మిగిలిన వారి కన్నా ప్రత్యేకంగా ఉండాలన్న తహ తహ కావచ్చు. లేదా, ప్రతి విషయాన్నీ ఫిలసాఫికల్‌గా చూడాలన్న ఆలోచన కావచ్చు. ఏది ఏమైనా ఫ్రెంచి వారు చాలా విషయాల్లో ప్రత్యేకంగా ఉంటారు. వారికి, ప్రపంచ రాజకీయాలు, మనుష్యులు, సంస్కృతులు మొదలైన విషయాల్లో చాలా లోతైన అవగాహన ఉంది. వీరితో పోలిస్తే, అమెరికన్లకు చాలా విషయాల్లో, ఫ్రెంచి వారికున్న లోతైన అవగాహన లేదేమోననిపిస్తుంది.
ఐఫిల్ టవర్ పై నుంచి పారిస్ నగరం
మార్చ్ 2003లో అమెరికా దేశపు నేతృత్వంలో, ఇరాక్‌తో యుద్ధాన్ని ఖండించిన దేశాల్లో ఫ్రెంచి దేశం ఒకటి. మామూలుగానే, ఫ్రెంచివారికి అమెరికన్స్ అంటే కొంచెం కోపం (అమెరికన్స్‌కి పొగరు అని ఫ్రెంచివారి అభిప్రాయం). అందుకు తోడు, ఇరాక్ యుద్దంతో మరీ మండిపడ్డారు ఫ్రెంచివారు. లంచ్ టైంలో ప్రతిరోజు తప్పకుండా, అమెరికా యుద్ధ వైఖరి మీద చర్చలు జరిగేవి. అమెరికన్ పౌరులుగా పారిస్‌లోని అమెరికన్ ఎంబసీతో మా కుటుంబ అంతా రిజిస్టర్ చేసుకున్నాము (ఇలా చెయ్యమని మా కంపెనీ ఇచ్చిన సలహా మేరకు). ఈ ఎంబసీ నుంచి మాకు తరచు ఈమైల్స్ వచ్చేవి. వీటి సారాంశం ఏమిటంటే, ఇరాక్‌తో యుద్ధం కారణంగా విదేశాల్లో ఉన్న అమెరికన్ పౌరుల ప్రాణాలకి ఎక్కువ ప్రమాదముంది కాబట్టి, అమెరికన్ పౌరులు విదేశాల్లో గుంపులు గుంపులుగా తిరగొద్దని, ఎప్పుడు బయట తిరగాల్సి వచ్చినా అందరికీ “తాము అమెరికన్ పౌరులం” అని తెలిసేలా ప్రవర్తించ వద్దని. మోటరోలా కూడా మా భద్రత గురించి హెచ్చరించేది. ఇందుకు కారణం – కంపెనీ పని మీద విదేశాల్లో ఉంటున్నాం కాబట్టి, మా భద్రతకు పూచీ మా కంపెనీదే!
నేను కలిసి తిరిగిన నా ఫ్రెంచి స్నేహితులకి, అమెరికన్లు అంటే ఎలాంటి అభిప్రాయాలున్నాయో చెపుతాను. అమెరికన్లు: రెస్టరెంట్లలో గట్టిగా మాట్లాడతారు. వ్యాపార సబంధిత విషయాల్లో, అధికారం తమకే కావాలనుకుంటారు. డబ్బు సంపాయించాలన్న కసి, పట్టుదల అందుకు శ్రమించే ఓర్పు ఉన్నవారు. అమెరికన్ కుటుంబ బంధాలు ఒక పద్ధతి లేకుండా కంగాళీగా ఉంటాయి. ఒక ఐదు నిమషాలు ఒక అమెరికన్‌తో మాట్లాడితే, అది అనాసక్తిగా ఉండి, అమెరికన్లకి లోతైన విషయ పరిజ్ఞానం లోపించినట్టు అనిపిస్తుంది. ఇన్ని ఉన్నప్పటికీ, ఫ్రెంచివారికి అమెరికన్లు అంటే ఒక రకమైన ఇష్టం. వేషభాషల్లోనూ, మనుష్యులతో సాదర సంబంధాలు ఏర్పటు చేసుకోటంలో అమెరికన్లు చాలా కలుగోపుగా ఉంటారని. అసలు చిక్కేమిటంటే, అమెరికన్లు అంటే ఇష్టం లేదని ఫ్రెంచివారు అనుకుంటారని అమెరికన్లు ఎందుకు అనుకుంటారో, ఫ్రెంచివారికి తెలియదు!
ఫ్రెంచి భోజనాలు – వైన్
అసలైన ఆంధ్రా భోజనం ఇష్టపడేవారికి, ఫ్రెంచి వంటకాలు బహుశా చప్పగా ఉంటాయి! ఎందుకంటే, ఫ్రెంచి వారు, మనలాగా కారాలు ఎక్కువ తినరు. ఫ్రాన్స్‌లో మేం ఉన్న మూడేళ్ళలో, ఎప్పుడు ఇండియన్ రెస్టరెంట్‌కి వెళ్ళినా అన్ని వంటకాల్లో కారాలు తక్కుగా ఉండేవి. ప్రత్యేకించి కారం కొంచెం ఎక్కువ వెయ్యమనే వాళ్ళం. ఫ్రెంచి వారు తమదని ప్రత్యేకంగా గర్వంగా చెప్పుకొనేది, భాష తర్వాత, భోజనమే అనుకోవచ్చు. పని రోజుల్లో, ప్రతీ రోజూ మధ్యహ్నం భోజనం టైంలో దాదాపు ప్రతి ఒక్కరు, ఠంచన్‌గా 12 గంటలకు కెఫెటీరియాకి వెళ్ళి, కబుర్లు చెప్పుకుంటూ కలసి భోజనం చేసేవారు. ఆ తరవాత, అందరు కాఫీ మెషీన్‌ల దగ్గర గుమిగూడి, కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ మధ్యహ్నం 2 గంటల దాకా గడిపి తిరిగి పనికి వచ్చేవాళ్ళు. అమెరికన్ల లాగా ఏదో లంచ్ ఇంటి నుంచి పట్టుకు రావడం గాని, ఆఫీస్‌లో టేబుల్ దగ్గరే హడావిడిగా భోజనం చెయ్యటం గాని ఫ్రెంచివారు చెయ్యగా నేను చూడలేదు. వారి జీవితాల్లో భోజనం ఎంత ముఖ్యమో, అందరు కలసి భోజనం చెయ్యటం కూడా అంతే ముఖ్యం. మనుష్యుల మధ్య సంబంధాలు ఏర్పరుచుకోడానికి, పెంచు కోడానికి ఇలా సామూహిక భోజనాలు చాలా ఉపయోగపడతాయి. ఇక భోజనాల్లో సామాన్యంగా వైన్ లేకుండా భోజనం ఉండదంటే అది అతిశయోక్తి కాదు! వైన్ కూడా భోజనంలో ఒక భాగమే! ఫ్రెంచి వాళ్ళంతా వైన్ అంటే అంత ఇష్టం చూపించినా, వైన్ ఇచ్చే నిషా వల్ల తూలి పడిన వారిని నేను చూడ లేదు. అంటే, ఒకటి, రెండు గ్లాసుల వైన్ మాత్రమే భోజనం తోటి పుచ్చుకుంటారు. ఈ వైన్‌లలో తెల్ల వైన్, ఎర్ర వైన్ రెండూ చాలా ముఖ్యమైనవే! భోజనంలోకి ఎటువంటి పదార్ధాలున్నాయి అన్న దానిపై ఎటువంటి వైన్ ఎన్నుకోవాలన్నది ఆధారపడుతుంది. మా ఇంటి యజమాని ఒక సారి, నన్ను, కల్యాణిని, మేం ఉంటున్న ఇంటి పక్కనే ఉన్న తన ఇంటి నేలమాళిగలో దాచిన వైన్ సీసాలు చూపించాడు. నేను, కల్యాణి ఆశ్చర్యంగా ఆ సీసాలకేసి చూస్తూ ఉండిపోయాం. అవి సుమారు 1500 లేక 2000 సీసాలు ఉండి ఉంటాయి! అందులోని ప్రతి ఒక్క సీసా మా ఇంటి యజమానికి గుర్తే! ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ వైన్ తాగాలో, దానికి తగ్గట్టు ఎటువంటి భోజన పదార్ధాలు ఉండాలో వివరంగా ఒక గంట సేపు చెప్పాడు. అలాగే, సెప్టెంబర్ నెలలో, ప్రతి ఏటా చవకగా జరిగే వైన్ అమ్మకాల సీజన్‌లో, రకరకలైన వైన్‌ల పేర్లున్న ఒక పెద్ద చిట్టా పట్టుకొచ్చి మాకు ఎటువంటి వైన్‌లు ఇష్టమో కనుక్కొని ఏంఏం కొనాలో సలహాలిచ్చేవాడు. మాకు కూడా రాను, రాను రకరకాలైన వైన్ రుచుల్లో తేడాలు తెలియసాగాయి. దానికి తోడు, మేం వైన్ రుచులు తెలుకొనటం మీద కొన్ని క్లాసులు కూడా హాజరయ్యాము. సాధారణంగా ఈ వైన్‌లలో 10 నుంచి 13 శాతం మద్యసారం ఉంటుంది! మామూలుగా ఎర్ర వైన్ రూం టెంపరేచర్‌లోనూ, తెల్ల వైన్ కొంచెం చల్లగానూ తాగుతారు. మాకు, ఫ్రాన్స్ వెళ్ళిన తరవాత, “కీర్” అన్న ఒక కొత్త పానీయం పరిచయమయింది. ఒక రకమైన బెర్రీలనుంచి 40 శాతం మద్యసారం ఉన్న ఒక లిక్కర్ (కెసిస్)ను తయారు చేసి, దాన్ని తెల్ల వైన్‌లో కలిపి “కీర్” గా తయారు చేసి తాగుతారు. ఇది కొంచెం తియ్యగా ఉంటుంది! కొంచెం తీపి వైన్‌లను ఇష్టపడేవారికి కీర్ బాగుంటుంది.
ఫ్రాన్స్ దేశాన్ని 21 ప్రదేశాలుగా విభజించవచ్చు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన భోజన, వైన్ ప్రత్యేకతలున్నాయి. ఫ్రాన్స్ దేశంలో ఉత్తర – పశ్చిమ ప్రాంతాలయిన బ్రిటనీ, నార్మండీ ల నుంచి దక్షిణ – తూర్పు ప్రాంతంలో ఒక చిన్న ద్వీపంగా ఉన్న కోర్సికా వరకు, ఆ ఆ ప్రాంతాల భోజన ప్రత్యేకతలు వాటికున్నాయి. ఆలివ్ నూనె ఫ్రెంచి వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. రకరకాలైన ఛీజ్ వీరి భోజనాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రెంచి వారంతా మాంసాహారులే. వీరు అన్ని రకాలైన మాంసాలని తింటారు.
ఫ్రాన్స్ దేశంలో “కెఫే”లు (మన కాఫీ హొటేల్సు వంటివి) చాలా ముఖ్యమైనవి. చైనా దేశంలో టీ దుకాణాలు ఎంత ప్రసిద్ధమో, ఈ కెఫేలు ఫ్రాన్స్‌లో అంత ప్రసిద్ధం. కాకపోతే, ఈ కెఫేలు ఎప్పుడూ సిగరెట్ పొగతో నిండి ఉంటాయి! గంటలు తరబడి కెఫేలలో కూర్చుని తింటూ, స్నేహితులతో మాట్లాడుతూ కాలం గడపటం ఫ్రెంచివారికి అతి ఇష్టమైన పనులలో ఒకటి. కొంచెం వాతావరణం బాగుంటే, కుర్చీలు కెఫే లోపలనుంచి బయటకు తెచ్చుకొని, వచ్చేపోయే వారిని చూస్తూ కాలక్షేపం చేస్తారు. ఇలాంటప్పుడు దేశ, ప్రపంచ రాజకీయాలు మాట్లాడుకోటం ఒక పెద్ద కాలక్షేపం! సిగరెట్ పొగ పడనివారికి, ఫ్రాన్స్‌లో కెఫేల్లోనూ, రెస్టరెంట్స్‌లోనూ కష్టంగానే ఉంటుంది. ఇలా బయట కెఫేలకి, రెస్టరెంట్స్లకి వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకోవలసిన సంగతి ఒకటుంది. మీ సర్వర్‌తో మీరు సఖ్యంగా ఉండి, భోజనంలో మీ ఇష్టాఇష్టాలు ఓపిగ్గా చెప్పండి! ఏ కారణం చేతనయినా మీరు సర్వర్‌తో గొడవ పడ్డారో, మీరు జీవితంలో ఆ రోజు అతి చెత్త భోజనం రుచి చూస్తారు. మేం పారిస్‌లో రెస్టరెంట్‌కి వెళ్ళినపుడు, శాకాహారులకి భోజనంలో ఎక్కువగా ఏమీ దొరకవు కాబట్టి, మా సర్వర్ మాకు ఏం ఇష్టమో కనుక్కొని ఆ రెస్టారెంట్ హెడ్ కుక్‌ని మా దగ్గరకు తీసుకొచ్చి, కల్యాణి, పిల్లలకు, ఆఖర్న నాకు ఏమేం కావాలో కనుక్కొని ప్రత్యేకంగా శాకాహారపు వంటకాలు తయారుచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే, ఆ వంటకాల రుచి అద్భుతంగా ఉండటం! ఫ్రాన్స్ దేశంలో అతి చిన్న చిన్న పల్లెటూర్లలో, బయట నుంచి చూస్తే ఏ మాత్రం గొప్పగా కనిపించని రెస్టరెంట్స్‌లో బ్రహ్మాండమైన భోజనాలు మేం రుచి చూశాం.
నా డ్రైవింగ్ పరీక్షలు
నా 15 ఏళ్ళ అమెరికా జీవితంలో ఒక్క సారి మాత్రమే ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు టిక్కెట్ వచ్చింది. ఫ్రాన్స్‌లో కూడా అమెరికాలో ఉన్నట్టుగా రోడ్డుకి కుడి వైపు డ్రైవ్ (బ్రిటన్‌లో రోడ్డుకి ఇండియాలోలా ఎడమవైపు డ్రైవ్) చేస్తారు. అందువల్ల అమెరికాలో డ్రైవింగ్ అనుభవం ఉన్నవారికి ఫ్రాన్స్‌లో డ్రైవ్ చెయ్యటం అంతకష్టం కాదు. కష్టాలన్నీ, డ్రైవింగ్ లైసెన్సు తెచ్చుకోటంలోనే ఉన్నాయి. మేం ఫ్రాన్స్ వెళ్ళిన తరవాత, అక్కడి డ్రైవింగ్ సిస్టంలో ఉన్న బాధలు అర్ధమయ్యాయి! ఫ్రెంచి ప్రభుత్వం అమెరికాలో ఐదు రాష్ట్రాలతో ఒక పొత్తు కుదుర్చుకొంది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన అమెరికన్‌లు ఫ్రాన్స్‌లో ఏడాది కన్నా ఎక్కువ కాలం ఉండాలని తలిస్తే, వారి అమెరికన్ డ్రైవర్ లైసెన్స్ కి బదులుగా ఫ్రెంచి డ్రైవర్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఈ లైసెన్స్‌తో యూరోపియన్ యూనియన్ లో అన్ని చోట్ల డ్రైవ్ చెయ్యచ్చు. అమెరికాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, మొదటి ఏడాదిలోపల ఫ్రెంచి డ్రైవింగ్ రాత పరీక్ష, తరవాత రోడ్డు పరీక్ష కూడా పాస్ అయితే, అప్పుడు ఫ్రెంచి డ్రైవర్ లైసెన్స్ ఇస్తారు. ఇది జీవితాంతం ఉపయోగించవచ్చు.
మేము టెక్సస్ నుంచి వచ్చాం కాబట్టి, మొదటి సంవత్సరం అవుతుండగా, డ్రైవింగ్ పరీక్షలకి చదవటం ప్రారంభించాము. కల్యాణి మూడు సార్లు ఈ పరీక్షలో ఫెయిల్ అయ్యి, నాలుగో సారి పాసయి, రోడ్డు పరీక్షలో కూడా పాస్ అయి లైసెన్స్ తెచ్చుకుంది! నేను ఆరు సార్లు రాత పరీక్షే ఫెయిల్ అయ్యి, ఇంక మళ్ళీ పరీక్ష రాసే ఓపిక లేక ఏం చెయ్యాలో ఆలోచించటం మొదలుపెట్టాను. ఈ పరీక్షలు ఇంత కఠినంగా ఉండటానికి ముఖ్యంగా రెండు కారణాలు. ఒకటి. ఈ పరీక్షలు ఫ్రెంచిలో ఉండటం! రెండు. మొత్తం ఇచ్చిన నలభై ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నలో ఇచ్చిన నాలుగు ఛాయిస్‌లలో, ఒకటి కన్నా ఎక్కువ సరైన సమాధానాలు ఉండవచ్చు. అంటే, ఒక ప్రశ్నలోని అన్ని సరైన సమాధానాలు రాస్తే తప్ప, ఆ ప్రశ్నకు మార్కులు పడవు! ఇలా ఇచ్చిన నలభై ప్రశ్నల్లో కనీసం ముప్ఫై ఐదు సమాధానాలు సరిగ్గా ఉంటే, అప్పుడు రాత పరీక్ష పాస్ అయినట్టు లెక్క. నాకున్న ఫ్రెంచి భాషా జ్ఞానానికి తోడు, ఇలాంటి పరీక్ష నాకు కొరుకుడు పడలేదు. ఈ పరీక్షలకి ఒక్కొక్క సారి, రాత్రి 12, 1 దాకా చదివినా, పరీక్షలు పాస్ కాలేకపోయాను. అలాంటి పరిస్థితుల్లో, ఒక చక్కని ఆలోచన వచ్చింది. అమెరికాలో, మిచిగాన్ రాష్ట్రానికి ఫ్రెంచి ప్రభుత్వానికి ఉన్న ఒప్పందం వల్ల, నాకు మిచిగాన్ డ్రైవర్ లైసెన్స్ వస్తే, ఫ్రెంచి డ్రైవర్ లైసెన్స్ వచ్చినట్టే! ఈ ఆలోచన రాగానే, వెంటనే అమెరికా, మిచిగాన్ రాష్ట్రం, డెట్రాయిట్‌లో రామన్న దగ్గరకి వెళ్ళి, మిచిగాన్ లైసెన్స్ సంపాయించి, దాని ద్వారా ఫ్రెంచి డ్రైవర్ లైసెన్స్ సంపాయించాను. అమెరికా వీసా సంపాయించుకోటానికి మరో దేశం వెళ్ళిన వాళ్ళు తెలుసు నాకు! కాని, ఫ్రెంచ్ డ్రైవర్ లైసెన్స్ కోసం ఫ్రాన్స్ నుంచి అమెరికా వచ్చి తెలుగు వాణ్ణి బహుశా నేను ఒక్కడినే అనుకుంటా!
ఫ్రాన్స్‌లో రైలు ప్రయాణాలు
నాకు రైలు ప్రయాణాలంటే సరదా. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన సంస్థ “భారతీయ రైల్వే” అంటే ఇష్టం, గౌరవం కూడా! నేను అమెరికాకు వలస రాక మునుపు ఇండియాలో రైలు ప్రయాణాలను ఆనందించే వాడిని. ఫ్రాన్స్ వెళ్ళక ముందు చాలా కాలం అమెరికాలో ఉన్నా, ఎక్కువ రైలు ప్రయాణాలు చెయ్యలేదు, కొన్ని చేసినా అవి గుర్తుంచుకో దగ్గ అనుభవాలు కావు. ఫ్రాన్స్‌లో నా రైలు ప్రయాణ అనుభవాలు మరచిపోలేనివి. ఫ్రాన్స్‌లో రైళ్ళు శుభ్రంగా ఉండి చాలా వేగంగా ( గంటకు 300 కిలోమీటర్లు దాకా) వెడతాయి. సామాన్య పౌరుడికి అందుబాటులో ఉండేలా ప్రయాణ టిక్కట్ల ధరలు చవకగా కూడా ఉంటాయి. 12 ఏళ్ళ లోపు పిల్లలకి, 65 ఏళ్ళు దాటిన పెద్దవారికి, 25 నుంచి 40 శాతం తక్కు ఖర్చులో టిక్కెట్లు దొరుకుతాయి. 12 ఏళ్ళ లోపు పిల్లలకు ఏడాది సరిపడ పాస్ తీసుకొంటే, ఆ పిల్లలతో ప్రయాణించే నలుగురు పెద్దలకు 15% టిక్కెట్టులో ధర తగ్గిస్తారు. ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, యూరప్ ఖండం అంతా, ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రభుత్వం Public Transportation ని ప్రోత్సహిస్తుంది. లీటర్ పెట్రోల్ ఒకటిన్నర యూరో (దాదాపు రెండు అమెరికన్ డాలర్లు, అంటే గాలన్ పెట్రోల్ ధర ఎనిమిది డాలర్లు), అదీకాక ఫ్రాన్స్‌లో రోడ్లు చాలా చక్కగా ఉన్నా, ఆ రోడ్ల మీద ప్రయాణించటానికి టోల్ కట్టాలి. ఈ కారణాల వల్ల, ఎక్కువ మంది రైళ్ళలో వెళ్ళటానికే ఇష్టపడతారు. గ్రెనోబుల్ నుంచి పారిస్ 600 కిలోమీటర్ల దూరాన్ని, సరిగ్గా మూడు గంటల్లో పూర్తి చెసే ఈ రైలుని TGV ( Trains a Grande Vitesse) అంటారు. గ్రెనోబుల్ కొంత కొండ ప్రాంతం కాబట్టి, అక్కడనుంచి ఫ్రాన్స్‌లో రెండవ పెద్ద పట్టణమైన లియాన్ దాకా ఉన్న 100 కిలోమీటర్లు వెళ్ళటానికి ఒక గంట పడుతుంది. అక్కడ నుంచి పారిస్‌కి మిగిలిన 500 కిలోమీటర్లు రెండు గంటల లోపు పూర్తి చేస్తుంది. ఏ కారణాన్నయినా, మీ రైలు 30 నిమషాలకన్నా ఆలశ్యంగా గమ్యం చేరుకుంటే, మీ వచ్చే ప్రయాణంలో 25 శాతం టిక్కెట్టు తక్కువ ధరకు ఇస్తారు. ఫ్రెంచి వారు గర్వంగా చెప్పుకొనే మరొక విజయం TGV రైలు. చార్ల్స్ డి గల్ ఫ్రెంచి ప్రెసిడెంటు కాలంలో మొదలైన ఫ్రాన్స్ దేశపు పురోభివృద్ధి, 80 దశాబ్దంలో బాగా విస్తరించి రైళ్ళు, టెలిఫోన్, రోడ్ల నిర్మాణం వంటి పనులతో అభివృద్ధి చెంది, ఈ నాడు పశ్చిమ దేశాల్లో ఒక ముఖ్యమైన దేశంగా రూపొందింది.
TVG Train
ఫ్రాన్స్‌లో TGV రైళ్ళు చూసిన తరవాత, ఇప్పటికీ నాలో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది. TGV లాంటి రైళ్ళు ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి ఉన్న 650 కిలోమీటర్లు, రెండు గంటల 15 నిమషాల్లో వెళ్ళచ్చు! హైదరాబాద్ నుంచి ముంబైకి (711 కిలోమీటర్లు) రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. హైదరబాద్‌లో పనిచేస్తూ, ఏ విజయవాడలోనో, రాజమండ్రిలోనో కాపరముంటూ లోకల్ ట్రైన్‌లో వెళ్ళినట్టు ప్రతి రోజూ పనికి హైదరాబాద్ వెళ్ళి రావచ్చు. ఈ ఆలోచన నాకు రావడానికి కారణం ఇది! లియాన్ (ఫ్రాన్స్‌లో పారిస్ తర్వాత అతి పెద్ద పట్టణం) నుంచి పారిస్ రోజూ పనికోసం వెళ్ళి వచ్చే వాళ్ళను నేను చూసాను. అలాగే, ఇండియాలో పూణేలో కాపరముంటూ, ముంబైలో పనిచేసే వాళ్ళున్నారు. ఇప్పటికీ, TGV రైళ్ళు ఇండియాలో ఎప్పటికి సాధ్యమవుతాయా అని ఆలోచిస్తూ ఉంటాను!
ఇంతకీ ఫ్రాన్స్‌లో రైళ్ళు, జపాన్‌లో లాగ magnetic levitation (రైళ్ళ చక్రాలు రైలు పట్టాలకి ఒక అంగుళం పైగా గాలిలో తేలుతూ నడిచే) సూత్రం పై ప్రయాణించే బుల్లెట్ రైళ్ళు కావు! TGV రైళ్ళు మనకి ఇండియాలో బాగా పరిచయమైన ఎలక్ట్రిక్ రైళ్ళ వంటివే! 2007 సంవత్సరం, మార్చ్ నెలలో ఫ్రెంచి వారు TGV రైలు పై గంటకి 574 కిలోమీటర్ల వేగాన్ని సాధించారు. రైళ్ళ నిర్మాణంలోనూ, రైలుకట్టలను వేయటంలోనూ ఫ్రెంచి వారి సాంకేతిక పరిజ్ఞానం వల్లే ఇది సాధ్యమయింది. రైలు వేగం గంటకు 300 కిలోమీటర్లు దాటితే, అందుకు కావల్సిన విద్యుత్ శక్తి (electricity) ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. రైలు టిక్కెట్టు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచడం కోసం, గరిష్ట వేగాన్ని 300 కిలోమీటర్లకు పరిమితం చేసారు.
ఫ్రాన్స్‌లో తోట పని
మాకున్న సరదాల్లో తోట పని ఒకటి. ఫ్రాన్స్ వెళ్ళిన కొత్తల్లో, మాకు బాగా అలవాటయిన మన కూరగాయలు దొరక్క చాలా ఇబ్బంది పడ్డాం. చివరకి, పర్చిమిరపకాయలు కూడా దొరికేవి కావు! ఎప్పుడన్నా పారిస్ వెళ్ళి, అక్కడ ఉన్న ఇండియన్ గ్రోసరీ షాపుల్లో రెండు మూడు వారాలకి సరిపడ కూరగాయలు కొనుక్కొచ్చే వాళ్ళం. ఆష్టిన్‌లో ఉన్నప్పుడు, కొన్ని కూరగాయలు మేం పండించే వాళ్ళం. మిగిలినవి కొనుక్కునే వాళ్ళం. ఫ్రాన్స్ వచ్చిన తరవాత ఈ కూరగాయలు ఒక పెద్ద సమస్య అయిపోయింది. సెంటెమియేలో మా ఇల్లు చిన్నదయినా, ఇంటి వెనక ఉన్న స్థలం చాలా పెద్దది. సుమారు ఒక ఎకరం ఉంటుంది. ఆస్టిన్ నుంచి వస్తూ వస్తూ తెచ్చిన మన కూరగాయల విత్తనాలు, చిన్న చిన్న ముంతల్లో ఏప్రెల్ నెలాఖరికి పెట్టాం. మే నెలాఖరికల్లా, మొక్కలు రావడం మొదలయ్యాయి. బీర, ఆనప, బెండ, చిక్కుడు, దోస, తియ్య గుమ్మడి, కాకర, బూడిద గుమ్మడి లాంటి కూర మొక్కలే కాకుండా గోంగూర, తోటకూర, బచ్చలి కూర లాంటి ఆకు కూరల మొక్కలు కూడా వేశాం. ఇది కాకుండా, ఫ్రాన్స్‌లో చాలా ఎక్కువగా దొరికే వంగ (Aubergines) మొక్కలతో పాటు, టమేటో మొక్కలు కూడా పెట్టాం! నాకున్న అనుభవంలో, ఆష్టిన్‌లో పది మొక్కలు పెడితే అందులో ఐదు మొక్కలు బతికితే చాలా గొప్పే! కాని, ఇక్కడ నేను పెట్టిన మొక్కలన్నీ బతికాయి. బతకటమే కాకుండా, జూన్ నెలాఖరకి ఈ మొక్కలన్నీ కాపు కాయటం మొదలయ్యింది. ఈ కాపు ఎంత ఉధృతంగా ఉందంటే, ఒక్కొక్క టొమేటో మొక్క, 50, 60 కాయలు ఇచ్చేది. నేనేమో ఒక పాతిక మొక్కలు పెట్టాను. ఇక చూడండి. తోటంతా విరగ కాసాయి. గోంగూర మొక్కలు తొమ్మిది, పది అడుగులు పెరిగాయి. ఈ కూరగాయలన్నీ ఏంచేసుకోం? అప్పటికీ ఈ కూరగాయల్ని నిలవ చేసి, శీతాకాలంలో ఏమీ దొరకనప్పుడు వాడుకోటానికి వీలుగా ఒక పెద్ద ఫ్రీజర్ కూడా కొన్నాము. అది, మూడు రోజల్లో వచ్చిన కూరలతో నిండి పోయింది. ఇక మిగిలినవి ఏం చేసుకోవాలో తెలియక, అక్కడ పరిచయిమయిన తెలుగు కుర్రాళ్ళకి, ఇండియన్ స్నేహితులకి, గ్రెనోబుల్‌లో బాగా పరిచయమయిన బోంబే రెస్టరెంట్‌కి ఇచ్చే వాళ్ళం. ఆఫీసు పని మీద వచ్చిన ఒక తమిళ స్నేహితుడు మా తోట చూసి నాతో “నువ్వు తోటమాలివి కాదు. పెద్ద రైతువి!” అని ప్రశంసించాడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అసలు రహస్యం ఏమిటంటే, మేం ఉన్న ప్రాంతం అంతా, ఆల్ప్స్ పర్వతాల వాలులో ఉన్న, అతి చక్కని సారవంతమైన భూమి. దానికి తోడు, వేసం కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) మేం ఉన్న లోయ ప్రాంతంలో సూర్యుడు పొద్దు చాలా బాగుంటుంది. రోజూ చీకటి పడే సరికి రాత్రి పది దాటిపోయేది. సారవంతమైన భూమి, ఎక్కువగా ఉండే సూర్యుడి పొద్దు, సమృద్ధిగా నీరు. ఇంకేం కావాలి? నా జీవితంలో మళ్ళీ అలాంటి తోట మేం బహుశా పెట్టలేమేమో!
చీరల పార్టీ
దాదాపు అరవై కుటుంబాలు మాలాగే ఆస్టిన్ నుంచి ఫ్రాన్స్ వచ్చారని ముందే చెప్పాను కదా! మా అందరికోసం తరచు మా కంపెనీ ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసేది. అప్పుడు అన్ని కుటుంబాలు సరదాగా కలిసి గడిపే వాళ్ళం. ఇటువంటి పార్టీల్లో, ఒక పది కుటుంబాలు మా కంపెనీ కోసం పని చేస్తున్న ఫ్రెంచి వాళ్ళు! ఇలాంటి సందర్భాల్లో, కల్యాణి మన పద్ధతిలో ఉండేట్లు చీర కట్టుకొని వచ్చేది. ఒక నలుగురైదుగురు ఫ్రెంచి, మరొక అయిదు అమెరికన్ ఆడవాళ్ళు ఎప్పుడూ కల్యాణి కట్టుకున్న చీర కట్టు గురించి, “మన సాంప్రదాయంలో బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? మంగళసూత్రం ఎందుకు?” లాంటి ప్రశ్నలతో సంభాషణలకు దిగేవారు! ఒకరిద్దరు ఫ్రెంచి ఆడవాళ్ళు, నా దగ్గరకి వచ్చి, “మీ ఆవిడ చీర కట్టులో బాగుంది?” అని నన్ను ప్రశంసించే వాళ్ళు. నా అమెరికన్ స్నేహితుల భార్యలు కొన్ని చీరలు కొనుక్కున్నారట! కానీ అవి ఎలా కట్టుకోవాలో తెలియక పోవటం చేత, వాటిని, వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో, ఇంటిని అందగా అలంకరించడంకోసం కర్టెన్లుగా, లేదా మరొక విధంగా అలంకరించే వారుట! మొత్తం మీద, ఈ పార్టీల్లో చీర, అది కట్టుకొనే పద్ధతి మొదలైనవి, ఆడవారి మధ్య ప్రధాన చర్చలయ్యాయి. ఇవన్నీ చూసి, కల్యాణి మాకు బాగా తెలిసిన ఒక పది అమెరికన్, ఫ్రెంచ్ కుటుంబాల్లోని ఆడవారిని, ఒక చీరల పార్టీ కోసం మా ఇంటికి పిలిచింది. నన్ను నా స్నేహితుని ఇంటికి పంపించి, మొత్తం ఆడవాళ్ళు, యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లలు, పద్ధెనిమిది మంది కలసి ఒక మూడుగంటల పాటు, మా ఇంట్లో చీరల అలంకరణలో పడ్డారు. కల్యాణి, తనకున్న చీరలు చూపించి, ఎవరికి ఏం కావాలో తీసుకో మన్నది.
చీరలలో ఆడవాళ్ళు (వరుసగా మెక్సికన్ అమెరికన్ లూసీ, అమెరికన్ లీసా, కల్యాణి, ఆస్ట్రియన్ సబీన్, అమెరికన్స్ లారెల్ -అలీస్, ఫిలిప్పియన్ క్రిస్టీనా, ఈజిప్షియన్ అమాని)
ఇలా మూడు, నాలుగు గంటలు నడిచింది చీరల పార్టీ! ఆ తరవాత, ముందు అనుకున్నట్టు, మా పది కుటుంబాలు కలిసి గ్రెనోబుల్‌లో బాంబే రెస్టరెంట్‌లో డిన్నరికి కలిసాం. భోజనాలు చేస్తూ, ఆ వేళ మా స్నేహితులకి, వారి కుటుంబాలకి ఇండియా గురించి చాలా విషయాలు చెప్పాం! దాంతో, చాలా మందికి ఉత్సాహం వచ్చి, ఇండియా వెడితే, ఏ ఏ ఊర్లు చూడాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఇండియా వెళ్ళటానికి వీసాలు ఎలా తీసుకోవాలి లాంటి ప్రశ్నల తరవాత, ఒక నాలుగు కుటుంబాలు 2004 సంవత్సరం క్రిస్‌మస్ శలవుల్లో మాకుటుంబంతో కలసి ఇండియా రావటానికి సిద్ధపడ్డారు. ఈ యాత్రా విశేషాలు మళ్ళీ ఎప్పుడైనా మీకు చెప్పాలి!
డాలర్ – యూరో
2002 సంవత్సరం మొదట్లో, 12 యూరోపియన్ దేశాలు (ఇంగ్లెండు, స్విర్జలాండ్ దేశాలు మినహా) కలిసి యూరో కరెన్సీని ప్రవేశపెట్టాయి. అప్పట్లో ఒక యూరోకి 90 అమెరికన్ సెంట్లు వచ్చేవి. అంటే, అమెరికన్ డాలరు కన్న యూరో విలువ తక్కువే! మేం ఫ్రాన్స్ వెళ్ళిన కొత్తల్లో చాలా షాపుల యజమానులు, ఇంకా యూరోకి అలవాటు పడలేదు. ఏ వస్తువు ధర అడిగినా ఇంకా ఫ్రెంచి ఫ్రాంక్స్ లోనే చెప్పే వారు. అమెరికా నుంచి వచ్చిన మాకు, ఫ్రాన్స్‌లో వస్తువులు ధరలన్నీ చాలా ఎక్కువగా అనిపించాయి. ఇండియా నుంచి అమెరికా వచ్చిన కొత్తల్లో, అమెరికన్ డాలర్లలో వున్న వస్తువుల ధరల్ని రూపాయల్లోకి మార్చి చూసుకొని, “అమెరికాలో వస్తువుల ధరలన్నీ చాలా ఎక్కువ” అని అనుకునేవాళ్ళం. ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి అనుభవమే మాకు ఎదురయ్యింది!
మాకు రోజూ వాడుకోటానికి మా కంపెనీ ఒక వాన్ ఇచ్చింది. రెండో కార్‌ను నేను 13 వేల డాలర్లకి కొన్నాను. అప్పటి డాలర్ విలువ (2002 సంవత్సరం) యూరోకి సమానం కాబట్టి మా రెండవ కార్ 13 వేల యూరోలు అన్నమాట. మేం తిరిగి అమెరికా వచ్చే టైంకి ఆ కారును పది వేల యూరోలకి అమ్మాం. ఈ మూడేళ్ళలో డాలర్ విలువ యూరో విలువలో 35 శాతం పడిపోటం వల్ల, పది వేల యూరోలు డాలర్లలోకి మార్చేసరికి అది పదమూడువేల ఐదువందల అమెరికన్ డాలర్లు అయ్యాయి. కార్‌ని కొన్న ఖరీదు కన్న (మూడేళ్ళ వాడకం తరవాత) ఎక్కువధరకి అమ్మటం నేను నమ్మలేకపోయాను! ఈ అనుభవం కూడా ఒక చిత్రమైన అనుభవమే!
తిరిగి అమెరికా ప్రయాణం
ఇన్ని అనుభవాలు అవుతుండగానే, మాకు ముందు ఇచ్చిన మూడు సంవత్సరాల కాలం అయిపోసాగింది. కావాలంటే, ఇంకొక సంవత్సరం ఫ్రాన్స్‌లోనే ఉండచ్చని మా కంపెనీ (అప్పటికి, మోటరోలా కంపెనీలో సెమీకండక్టర్ విభాగం పూర్తిగా మోటరోలా నుంచి విడిపోయి, ఫ్రీస్కేల్ సెమీకండక్టర్ గా మారింది) వారు అన్నారు. ఈ విషయం కల్యాణికి, పిల్లలకి చెప్పి, పోనీ ఇంకొక సంవత్సరం ఫ్రాన్స్‌లోనే ఉందామా అని ఊగిసలాడాం! ఫ్రాన్స్ వచ్చినప్పటి నుంచి, పిల్లల స్కూల్ విషయాల్లో మాకు చాలా అసంతృప్తిగా ఉండేది. ముందు, ఫ్రెంచి స్కూల్ పద్ధతులు, అమెరికన్ స్కూల్ పద్ధతులకి చాలా భిన్నంగా ఉండటం! తరవాత, మా పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్ ఫ్రెంచిలో తప్పనిసరిగా చేయ్యటం! ఈ గందరగోళంలో వాళ్ళు ఎలా చదువుతున్నారో మాకు అర్ధమయేది కాదు. కొన్ని సబ్జెక్ట్స్‌లో నూటికి 70, 80 మార్కులే వచ్చేవి. ఫ్రాన్స్ వెళ్ళక ముందు ఆస్టిన్‌లో వాళ్ళకి నూటికి 90 మార్కుల పైనే వచ్చేవి. అలాంటిది, ఫ్రాన్స్‌లో వీళ్ళకి ఎప్పుడోకాని 90 శాతం పైన మార్కులు వచ్చేవి కాదు. ఇదేంటని మా పిల్లల్ని అడిగితే, “ఫ్రాన్స్‌లో 70 శాతంకన్నా ఎక్కువ మార్కులొస్తే, అవి మంచి మార్కులే” అని వాళ్ళ సమాధానం! ఇందులో కొంత నిజం లేకపోలేదు. ఆఫీసులో, ఒక ఫ్రెంచి మేనేజర్ తాను తన కింద పనిచెసే ఉద్యోగులెవ్వరికీ తన మేనేజర్‌గా ఉన్నంత కాలం, ప్రమోషన్ల విషయంలో A+ గ్రేడ్ ఇవ్వలేదని చెప్పటం నాకు గుర్తు. మొత్తం మీద, పిల్లల చదువు దృష్టిలో పెట్టుకొని, జులై, 2005 లో తిరిగి ఆస్టిన్ రావాలని నిశ్చయించుకున్నాం! ఫ్రాన్స్ వదిలి వెళ్ళే తారీకు దగ్గిరపడుతున్న కొద్దీ, ఏదో తెలియని వెలితిగా అనిపించడం మొదలైంది. ఇంత చక్కని దేశం, పరిసరాలు, చాలా అందమైన అనుభవాలు మళ్ళీ సాధ్యమా అని అనిపించింది. ఈ మూడేళ్ళలో ఫ్రాన్స్‌తో ఇంత బంధం ఎలా ఏర్పరచుకున్నామో అర్ధం కాలేదు. అమెరికాలో ఉండగా ఎప్పుడూ, తెలుగువారితోనే తిరుగుతూ ఉండే మేం, ఫ్రాన్స్ రావటం వల్ల తప్పనిసరిగా మిగిలిన అమెరికన్ కుటుంబాలతో కలిసి తిరిగే పరిస్థితి వచ్చింది. దానికి తోడు, ఆస్టిన్ నుంచి వచ్చిన అమెరికన్ కుటుంబాలు కూడా, మాలాగే వంటరిగా ఫీల్ అవటం వల్ల, సులభంగా స్నేహితులయ్యాం!
ఫ్రాన్స్ నుంచి డెట్రాయిట్ మీదుగా ఆస్టిన్ వెడుతుంటే, డెట్రాయిట్ – ఆస్టిన్ ఫ్లైట్‌లో రమ్యకి ఆస్టిన్‌లో పాఠాలు చెప్పిన ఒక పాత టీచర్ కనపడి, మేం మూడు ఏళ్ళు ఫ్రాన్స్‌లో ఉన్నామని తెలుసుకొని, మా పిల్లలతో “మీకు ఇంత చక్కగా ఫ్రాన్స్‌లో మూడేళ్ళు గడిపే అవకాశం ఇచ్చిన మీ అమ్మా, నాన్నలు ఎంత మంచి పని చేసారో మీకు పెద్దయ్యాకా అర్ధమవుతుంది!” అంది. ఈ మాటల్లో ఎంత నిజముందో తెలియటానికి ఇంకా టైం పడుతుంది కానీ, ఈ మూడేళ్ళ ఫ్రెంచి జీవితం వల్ల రమ్య, అనూజ్ ఇద్దరూ ఫ్రెంచ్ చాలా బాగా మాట్లాడతారు. నా ఫ్రెంచి మాత్రం అంతంత మాత్రమే!