“రూథర్‌ఫర్డ్ కేంద్రకావిష్కరణతో పరమాణువుల అత్యంత మౌలిక లక్షణాలు కేవలం సంప్రదాయ భౌతికశాస్త్రంతో అర్థం కావని స్పష్టమైంది.”
— నీల్స్ బోర్, నోబెల్ ఉపన్యాసం: ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ (The Structure of the Atom), 1922.
పాఠశాల పుస్తకాల్లో కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల బొమ్మతో నీల్స్ బోర్ పేరు మనకు సుపరిచితమే. ఆ బొమ్మ పరమాణువు గురించిన పూర్తి చిత్రం కాదని ఇప్పుడు మనకు తెలుసు. అయినా దాని వెనుక ఉన్న ఆలోచన ఇరవయ్యో శతాబ్దపు భౌతికశాస్త్రాన్ని మలుపుతిప్పింది.
ముందటి వ్యాసంలో చూసినట్లు, రూథర్‌ఫర్డ్ కేంద్రక నమూనా పరమాణువు మధ్యలో ఏముందో చెప్పింది; కానీ ఒక పెద్ద చిక్కును కూడా మిగిల్చింది. సంప్రదాయ భౌతికశాస్త్రం ప్రకారం కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోతూ చివరకు కేంద్రకంలో పడిపోవాలి. అంటే పరమాణువే స్థిరంగా ఉండకూడదు. కానీ మన చుట్టూ ఉన్న పదార్థమంతా స్థిరమైన పరమాణువులతోనే తయారైంది.
ఈ వైరుధ్యాన్ని ఎదుర్కొనేందుకు ఇంకా ముప్ఫై ఏళ్లు కూడా నిండని బోర్, సంప్రదాయ భౌతికశాస్త్రం ఇక్కడ పనిచేయదని ధైర్యంగా ప్రకటించాడు. ఆ ప్రయత్నంలోనే, హైడ్రోజన్ వెలుగు గురించి అప్పటికే తెలిసిన మరో పాత మర్మం — దాని వర్ణపట రేఖలు — అతనికి కీలకమైన సంకేతంగా మారింది.
క్వాంటం ప్రపంచాన్ని మాటల్లో కథగా చెప్పుకోవచ్చు; కానీ ప్రకృతి అంతరంగంలో దాగి ఉన్న నిజమైన క్రమాన్ని, ఆ ఆలోచనల అసలు సొగసును గుర్తించాలంటే కొద్దిపాటి గణితం కూడా తోడవ్వాలి. బోర్ క్వాంటం నమూనాలో పరమాణువు గమనాన్ని మార్చేసిన ఆ సమీకరణాలన్నీ పదో తరగతి స్థాయిలో మనం నేర్చుకునే ప్రాథమిక బీజగణితాన్ని మించవు. సంక్లిష్టమైన లెక్కల జోలికి వెళ్లకుండా, కథకు అత్యవసరమైన ఆ సూక్ష్మ గణితాన్ని కూడా చూస్తూ ముందుకు సాగుదాం.
1913లో బోర్ క్వాంటం పరమాణు సిద్ధాంతం హైడ్రోజన్ స్థిరత్వాన్నీ, దాని వర్ణపట రేఖలనూ ఒకే సిద్ధాంతంలో ఎలా వివరించిందో, ఆ ఆలోచన నాటి భౌతికశాస్త్ర ప్రపంచాన్ని ఎందుకు అంతగా కదిలించిందో ఈ వ్యాసంలో చూద్దాం.
రూథర్‌ఫర్డ్ వదిలిన అసంపూర్ణ పరమాణువు
రూథర్‌ఫర్డ్ 1911లో పరమాణువులోని ఆవేశం అతి చిన్న కేంద్ర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుందని ప్రతిపాదించాడు. అయితే అది ధనావేశమా, రుణావేశమా అన్నది అప్పట్లో అతను తేల్చలేదు; లెక్కల్లో దాన్ని ధనావేశంగా తీసుకున్నా, గుర్తు మార్చినా ప్రయోగ ఫలితాల్లో మార్పు రాదు.
తర్వాతి రెండేళ్లలో ఆ చిత్రం మరింత స్పష్టమైంది. 1913 నాటికి కేంద్రకానికి నికర ధనావేశం ఉందని రూథర్‌ఫర్డ్ నిర్ధారించాడు; దానికి సరితూగే రుణావేశం గల ఎలక్ట్రాన్లు బయట ఉండాలి. కానీ ఆ ఎలక్ట్రాన్లు అక్కడ ఎలా అమరి ఉన్నాయి, అవి ఎలా కదులుతున్నాయి అన్నది మాత్రం అతని నమూనా చెప్పలేదు.
గ్రహమండల నమూనా – పరిష్కారమా, కొత్త సమస్యా?
కేంద్రంలో ధనావేశం ఉన్న చిన్న కేంద్రకం, దాని బయట రుణావేశం ఉన్న ఎలక్ట్రాన్లు — ఈ చిత్రం సహజంగానే సౌరమండలాన్ని గుర్తుకు తెస్తుంది. సూర్యుడి గురుత్వాకర్షణ గ్రహాలను తనవైపు లాగుతుంటే, వాటి గమనమే వాటిని కక్ష్యలో ఉంచుతుంది. పరమాణువులోనూ కేంద్రకపు విద్యుత్ ఆకర్షణకు ఎలక్ట్రాన్ గమనాన్ని జోడిస్తే అదే తరహా కక్ష్యను ఊహించవచ్చు.
కానీ ఇక్కడే సౌరమండల పోలిక విఫలమవుతుంది; ఎలక్ట్రాన్‌కు విద్యుదావేశం ఉంది, గ్రహానికి లేదు. వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ వేగం మారకపోయినా, దిశ నిరంతరం మారుతూనే ఉంటుంది. అంటే అది ఎప్పుడూ త్వరణంలోనే ఉంటుంది. సంప్రదాయ విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారం త్వరణంలో ఉన్న విద్యుదావేశం విద్యుదయస్కాంత తరంగాల రూపంలో శక్తిని కోల్పోతూ ఉండాలి.
శక్తి పోతుంటే ఎలక్ట్రాన్ అదే కక్ష్యలో స్థిరంగా ఉండలేదు. క్రమంగా కేంద్రకానికి దగ్గరవుతూ, మరింత వేగంగా తిరుగుతూ, చివరకు క్షణాల్లో కేంద్రకంలో పడిపోవాలి. అంటే సంప్రదాయ భౌతికశాస్త్రం ప్రకారం రూథర్‌ఫర్డ్ తరహా పరమాణువు స్థిరంగా ఉండే అవకాశమే లేదు.
కానీ ప్రకృతిలో హైడ్రోజన్ పరమాణువులు స్థిరంగా ఉన్నాయి. పాఠశాలలో మనకు ఎంతో సహజంగా కనిపించిన ఆ గ్రహమండల బొమ్మ, భౌతికశాస్త్ర నియమాలను దానికి వర్తింపజేయగానే ఒక మౌలికమైన వైరుధ్యాన్ని బయటపెట్టింది.
ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరుగుతుంటే పరమాణువు ఎందుకు కూలిపోదు?
బోర్ మొదట ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఇదే. అయితే పరమాణువు గురించి అప్పటికే తెలిసిన మరో విచిత్రమైన విషయం కూడా ఉంది — అది వెలువరించే కాంతి.
ఒక పలుచని వాయువును వేడిచేసినా, విద్యుత్ ప్రవాహంతో ఉత్తేజపరిచినా అది వెలువరించే కాంతిని విడదీసి చూస్తే కొన్ని నిర్దిష్ట రంగులే కనిపిస్తాయి — వాటిని వర్ణపట రేఖలు అంటాం. ప్రతి మూలకానికీ వాటి అమరిక ప్రత్యేకం. హైడ్రోజన్‌కూ అలాంటి ప్రత్యేక రేఖల సమూహమే ఉంది.
కానీ బోర్ ఈ తొలి దశలో పరమాణు స్థిరత్వ సమస్యను హైడ్రోజన్ వర్ణపటంతో ముడిపెట్టలేదు. ఆ సంబంధం అతనికి తర్వాత, 1913లో బాల్మర్ సూత్రం దృష్టికి వచ్చినప్పుడు ఒక్కసారిగా స్పష్టమైంది.
హైడ్రోజన్ వర్ణపటం – పరమాణువు చెప్పే సంకేతం
పరమాణువు అంతరంగాన్ని నేరుగా పరిశీలించి తెలుసుకునే మార్గం లేదు. కానీ పరమాణువు తన గురించి బయటకు పంపే ఒక ముఖ్యమైన సంకేతం — కాంతి.
పదార్థం ఎందుకు వెలుతురు విడుదల చేస్తుందన్న ప్రశ్న కొత్తది కాదు. న్యూటన్ కూడా Opticks లో, బాగా వేడెక్కిన పదార్థాలు వెలుతురు విడుదల చేయడం వాటి అంతర్గత భాగాల కంపనాల వల్లనేనా (“is not this emission performed by the vibrating motions of their parts?”) అని ప్రశ్నించాడు. న్యూటన్ కాలంలో పరమాణు నిర్మాణం తెలియదు; అయినా పదార్థం వెలువరించే కాంతికీ దాని లోపల సాగే గమనానికీ సంబంధం ఉండాలన్న ఆలోచన అప్పటికే కనిపిస్తోంది.
పందొమ్మిదో శతాబ్దానికి వచ్చేసరికి ఆ కాంతిని చాలా జాగ్రత్తగా కొలిచే శాస్త్రం—వర్ణపట శాస్త్రం (spectroscopy)—అభివృద్ధి చెందింది. ఒక పదార్థం వెలువరించిన కాంతిని పట్టకం లేదా గ్రేటింగ్ ద్వారా విడదీస్తే, అందులో ఏ తరంగదైర్ఘ్యాల కాంతి ఉందో తెలుసుకోవచ్చు.
కాంతిని వర్ణపటంగా విడదీసి చూస్తే, అది ఎక్కడి నుంచి వచ్చిందన్నదాన్ని బట్టి వేర్వేరు రూపాలు కనిపిస్తాయి. వేడెక్కిన ఘనపదార్థం నుంచి వచ్చే కాంతిలో ఎరుపు నుంచి ఊదా వరకు రంగులు నిరంతరంగా కనిపిస్తాయి; ప్లాంక్ కథలో మనం చూసిన కృష్ణవస్తు వర్ణపటం అలాంటిదే.
పలుచని వాయువు విషయంలో మాత్రం చిత్రం పూర్తిగా మారిపోతుంది. దాన్ని వేడిచేసినా, విద్యుత్తుతో ఉత్తేజపరిచినా, అన్ని రంగులూ వరుసగా కనిపించవు. కొన్ని నిర్దిష్ట తరంగదైర్ఘ్యాల దగ్గర మాత్రమే ప్రకాశవంతమైన రేఖలు కనిపిస్తాయి.
అంతేకాదు, ప్రతి మూలకానికీ ఆ రేఖల అమరిక వేరు. ఒక రకంగా చెప్పాలంటే, వర్ణపటం ఆ మూలకానికి వేలిముద్ర లాంటిది.
హైడ్రోజన్ వర్ణపటంలో కంటికి కనిపించే ప్రాంతంలో నాలుగు ముఖ్యమైన రేఖలు ఉన్నాయి — \(656\text{ nm}\), \(486\text{ nm}\), \(434\text{ nm}\), \(410\text{ nm}\) తరంగదైర్ఘ్యాల వద్ద. అవి యాదృచ్ఛికంగా అక్కడ కనిపించడం లేదు; వాటి మధ్య ఒక అద్భుతమైన సంఖ్యా క్రమం దాగి ఉంది.
హైడ్రోజన్ బాల్మర్ శ్రేణిలో నాలుగు ముఖ్యమైన రేఖలు.
అప్పటికి దీనికి భౌతిక కారణం ఎవరికీ తెలియదు. హైడ్రోజన్ పరమాణువు లోపల ఏం జరుగుతోంది? అది ఎందుకు అన్ని తరంగదైర్ఘ్యాల్లోనూ కాంతిని విడుదల చేయకుండా కొన్ని నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలనే ఎంచుకుంటోంది?
ఈ ప్రశ్నకు మొదట సమాధానం చెప్పింది ఒక భౌతిక సిద్ధాంతం కాదు—ఒక గణిత సూత్రం. దాన్ని కనుగొన్నవాడు స్విట్జర్లాండ్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు యోహాన్ బాల్మర్.
బాల్మర్ – సంఖ్యల్లో దాగిన నియమం
యోహాన్ యాకబ్ బాల్మర్ (Johann Jakob Balmer, 1825–1898) వృత్తిరీత్యా భౌతికశాస్త్రవేత్త కాదు; 1849లో బాసెల్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందాడు. జీవితంలో ఎక్కువ కాలం బాసెల్‌లోని బాలికల సెకండరీ స్కూల్లో గణితం బోధించాడు. వర్ణపటంపై అతనికి ఎనలేని గుర్తింపు తెచ్చిన మొదటి పత్రాన్ని 1885లో, తన అరవయ్యో ఏట ప్రచురించాడు.
బాల్మర్‌కు హైడ్రోజన్ పరమాణువు లోపల ఏమి జరుగుతుందో తెలియదు. అతని లక్ష్యం చాలా పరిమితమైనది: అప్పటికే కొలిచిన హైడ్రోజన్ రేఖల తరంగదైర్ఘ్యాల్లో ఏదైనా సంఖ్యా క్రమం ఉందేమో చూడటం. సంఖ్యలతో ఆడుకుంటూ, వాటి మధ్య ఒక సరళమైన సంబంధాన్ని కనుగొన్నాడు.
అతను ప్రతిపాదించిన తరంగదైర్ఘ్యం (\(\lambda\)) సూత్రాన్ని ఇలా రాయొచ్చు:
$$\lambda = b \cdot \frac{n^2}{n^2 – m^2}$$
ఇక్కడ హైడ్రోజన్‌కు \(m = 2\), \(n = 3, 4, 5, 6, \dots\). ఇందులో \(b\) ఒక స్థిరాంకం (\(b \approx 3645.6\text{ Å}\)). \(n = 3, 4, 5, 6\) విలువలను ప్రతిక్షేపిస్తే, అప్పటికి తెలిసిన నాలుగు హైడ్రోజన్ రేఖల తరంగదైర్ఘ్యాలు ఆశ్చర్యకరమైన కచ్చితత్వంతో వచ్చాయి:
$$n = 3 \Rightarrow \lambda = b \cdot \frac{9}{5} \approx 6562.1\text{ Å} \quad \style{font-family: JIMS}{\text{(ఎరుపు రేఖ)}}$$
$$n = 4 \Rightarrow \lambda = b \cdot \frac{16}{12} \approx 4860.8\text{ Å} \quad \style{font-family: JIMS}{\text{(ఆకుపచ్చ-నీలం రేఖ)}}$$
$$n = 5 \Rightarrow \lambda = b \cdot \frac{25}{21} \approx 4340.0\text{ Å} \quad \style{font-family: JIMS}{\text{(నీలం రేఖ)}}$$
$$n = 6 \Rightarrow \lambda = b \cdot \frac{36}{32} \approx 4101.3\text{ Å} \quad \style{font-family: JIMS}{\text{(ఊదా రేఖ)}}$$
\(n = 7\) పెట్టి ఐదవ రేఖ ఎక్కడ ఉండాలో కూడా బాల్మర్ లెక్కించాడు; ఆ రేఖ అప్పటికే ఖగోళ పరిశీలనల్లో నమోదై ఉందని అతని సహచరుడు తెలియజేశాడు.
ఈ సూత్రంలో ఉన్న \(2, 3, 4, 5, \dots\) పూర్ణాంకాలకు అప్పట్లో ఎలాంటి భౌతిక అర్థమూ తెలియదు. బాల్మర్ కూడా దానికి ఎలాంటి పరమాణు నమూనానూ ప్రతిపాదించలేదు. అతని పని ఒక విధంగా సంఖ్యల్లో దాగిన సంగీతాన్ని గుర్తించడం లాంటిది — నియమం కనిపించింది, కానీ ఆ నియమాన్ని ప్రకృతి ఎందుకు పాటిస్తోందో ఎవరికీ తెలియలేదు.
రిడ్బర్గ్ – బాల్మర్ సూత్రానికి సాధారణ రూపం
బాల్మర్ సూత్రం హైడ్రోజన్‌లో ఒక ప్రత్యేక వర్ణపట శ్రేణిని అద్భుతంగా వివరించింది. కానీ ఇలాంటి సంఖ్యా క్రమం హైడ్రోజన్కే పరిమితమా, లేక ఇతర మూలకాల వర్ణపటాల్లోనూ కనిపిస్తుందా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది. ఆ ప్రశ్నను స్వీడన్ భౌతికశాస్త్రవేత్త యోహానెస్ రిడ్బర్గ్ (Johannes Rydberg, 1854–1919) విస్తృతంగా పరిశీలించాడు. బాల్మర్ సూత్రాన్ని తరంగదైర్ఘ్యాల నుంచి తరంగసంఖ్యల రూపంలోకి మార్చడమే కాకుండా, ఇతర మూలకాల వర్ణపట శ్రేణుల్లోనూ ఇదే తరహా సంఖ్యా క్రమాలు దాగి ఉన్నాయని రిడ్బర్గ్ గుర్తించాడు.
తరంగదైర్ఘ్యం \(\lambda\) అయితే, దాని తరంగసంఖ్య
$$\bar{\nu} = \frac{1}{\lambda}$$
అవుతుంది. వర్ణపట శ్రేణిలో రేఖలు ఒక హద్దువైపు దగ్గరవుతూ పోతాయని రిడ్బర్గ్ గమనించాడు. వాటి తరంగసంఖ్యలను సాధారణంగా
$$\bar{\nu} = \bar{\nu}_0 – \frac{R}{(n + \mu)^2}$$
లాంటి రూపంలో వర్ణించవచ్చు. ఇక్కడ \(\bar{\nu}_0\) ఆ శ్రేణి చేరుకునే హద్దు (series limit); \(R\) రిడ్బర్గ్ స్థిరాంకం; \(n\) పూర్ణసంఖ్య; \(\mu\) ఆయా వర్ణపట శ్రేణులకు సంబంధించిన చిన్న సవరణ — తర్వాత దీన్నే quantum defect అని పిలిచారు.
హైడ్రోజన్ విషయంలో చిత్రం విశేషంగా సరళమైంది. బాల్మర్ శ్రేణికి ఈ అదనపు సవరణ అవసరం లేదు. దాని శ్రేణి హద్దు \(R/2^2\) కాబట్టి,
$$\bar{\nu} = R\left(\frac{1}{2^2} – \frac{1}{n^2}\right), \qquad n = 3, 4, 5, \dots$$
అని వస్తుంది.
ఇదే బాల్మర్ కనుగొన్న సూత్రం — కానీ ఇప్పుడు తరంగసంఖ్యల రూపంలో. మరింత సాధారణంగా, హైడ్రోజన్‌లో ఒక పూర్ణసంఖ్య \(m\) ను స్థిరంగా ఉంచి, దానికంటే పెద్ద \(n\) విలువలను తీసుకుంటే,
$$\bar{\nu} = R\left(\frac{1}{m^2} – \frac{1}{n^2}\right), \qquad n > m$$
అనే రూపం వస్తుంది. బాల్మర్ శ్రేణికి \(m = 2\).
ఇలా బాల్మర్ కనుగొన్న నాలుగు కనిపించే హైడ్రోజన్ రేఖల వెనుక ఉన్న సంఖ్యా క్రమం, రిడ్బర్గ్ చేతిలో మరింత విస్తృతమైన వర్ణపట నియమంలో భాగమైంది.
కానీ అసలు మర్మం అలాగే మిగిలిపోయింది. ఈ సూత్రాల్లో \(2, 3, 4, 5, \dots\) వంటి పూర్ణసంఖ్యలే ఎందుకు వస్తున్నాయి? అవి కేవలం గణిత సౌలభ్యమా, లేక పరమాణువు లోపల ఏదో భౌతిక నిర్మాణాన్ని సూచిస్తున్నాయా అన్నది ఎవరికీ తెలియదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వర్ణపట సూత్రాల ఆధారంగా పరమాణు నిర్మాణాన్ని అర్థం చేసుకోవచ్చని బోర్ కూడా మొదట్లో అనుకోలేదు. తర్వాత అతనే గుర్తుచేసుకున్నట్లు, సీతాకోకచిలుక రెక్కల మీద రంగులు ఎంత అందంగా, ఒక క్రమంలో అమరి ఉన్నా, వాటిని చూసి జీవశాస్త్రంలోని మూలసూత్రాలను తెలుసుకోవచ్చని ఎవరూ అనుకోరు. బోర్‌కు మొదట్లో వర్ణపట రేఖలు కూడా అలాంటి అందమైన, ఆసక్తికరమైన నమూనాలుగానే కనిపించాయి.
అప్పటివరకు రూథర్‌ఫర్డ్ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ఎలా నిలబడి ఉండాలన్న స్థిరత్వ సమస్యతో తలమునకలవుతున్న బోర్‌కు, వర్ణపటం అకస్మాత్తుగా పరమాణువు అంతర్గత నిర్మాణపు గుట్టు విప్పే దారిగా మారింది.
యువ బోర్ – కోపెన్‌హేగన్ నుంచి మాంచెస్టర్ వరకు
నీల్స్ బోర్ (Niels Bohr, 1885–1962) 1885లో కోపెన్హేగన్లో పుట్టాడు. అతని తండ్రి క్రిస్టియన్ బోర్ ప్రసిద్ధ శరీరక్రియాశాస్త్రవేత్త; తల్లి ఎల్లెన్ అడ్లెర్, విద్యావేత్తలున్న సంపన్న యూదు కుటుంబం నుంచి వచ్చింది. ఇంట్లో సైన్స్, తత్వశాస్త్రం, సాహిత్యం మీద చర్చలు సహజంగా సాగేవి. యువకుడిగా బోర్‌కు భౌతికశాస్త్రంతో పాటు తత్వశాస్త్రంపైనా గాఢమైన ఆసక్తి ఉండేది. ముఖ్యంగా డేనిష్ తత్వవేత్త సొరెన్ కీర్కెగార్డ్ (Søren Kierkegaard, 1813–1855) రచనలు అతన్ని బాగా ఆకర్షించాయి. ఒక సమస్యను దాని తార్కిక పరిమితుల దాకా తీసుకెళ్లే కీర్కెగార్డ్ ధోరణి తనపై గొప్ప ప్రభావం చూపిందని బోర్ తర్వాత చెప్పాడు.
కీర్కెగార్డ్ మనిషి జీవితాన్ని సౌందర్యాత్మక, నైతిక, మతపరమైన దశలుగా విభజించి చూశాడు. చివరి దశలో విశ్వాసమే కేంద్రం. బోర్‌కు కీర్కెగార్డ్ ఆలోచనా పద్ధతి నచ్చినా, ఆ మతపరమైన చివరి దశను మాత్రం అతను స్వీకరించలేదు. చిన్న వయసులోనే మతవిశ్వాసాన్ని కోల్పోయిన బోర్, తన తండ్రితో కూడా ఈ విషయాన్ని నిక్కచ్చిగా మాట్లాడాడు.
1910లో బోర్ మార్గరెతె నోర్లుండ్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి సమయం దగ్గరపడేసరికి అతని అవిశ్వాసం ఒక కుటుంబ సమస్యగా మారింది. చర్చిలో పెళ్లి చేసుకోవడానికి బోర్ నిరాకరించాడు; భక్తిపరురాలైన మార్గరెతె తల్లికి అది తీవ్రమైన వేదన కలిగించింది. దేవుడిపై విశ్వాసం లేని మనిషికి అసలు సరైన నైతిక విలువలు ఉంటాయా అన్నది ఆమె భయం. దానికి బోర్ ఆమెకు లేఖ రాస్తూ చాలా ఆర్ద్రంగా నచ్చజెప్పాడు. తాను మతాన్ని నమ్మకపోయినా జీవితాన్ని కేవలం శాస్త్రంతో కొలవనని, మనిషి అనుభవమంతా శాస్త్ర పరిధిలోకి వస్తుందని తాను అనుకోవడం లేదని వివరించాడు. అన్నింటినీ లెక్కల్లో అర్థం చేసుకోగలనని అనుకుంటే జీవితం ఎంతో నిస్సారంగా అయిపోతుందన్నాడు. అంతేకాదు, మతవిశ్వాసం లేకపోయినా మనుషుల మంచితనం, ప్రేమ, బాధ్యతల మీద తనకు గాఢమైన నమ్మకం ఉందని ఆమెకు స్పష్టం చేశాడు. చివరకు బోర్, మార్గరెతె ఇద్దరూ చర్చి నుంచి తప్పుకుని, 1912 ఆగస్టు 1న పౌర వివాహం చేసుకున్నారు.
ఈ వ్యక్తిగత నేపథ్యం బోర్ శాస్త్రీయ సిద్ధాంతాలకు ప్రత్యక్ష మూలమని చెప్పలేం. కానీ ఒకే సిద్ధాంతం జీవితంలోని ప్రతిదాన్నీ వివరించలేదన్న భావన, పరస్పరం విరుద్ధంగా కనిపించే దృక్కోణాలను ఒకేసారి పట్టుకుని చూడాలన్న అలవాటు అతని ఆలోచనల్లో అప్పటికే కనిపిస్తాయి.
1911లో బోర్ కోపెన్‌హేగన్ విశ్వవిద్యాలయంలో లోహాల్లో ఎలక్ట్రాన్ల ప్రవర్తనపై డాక్టరేట్ పూర్తి చేశాడు. విదేశాల్లో పరిశోధన కొనసాగించడానికి అతనికి కార్ల్స్‌బర్గ్ ఫౌండేషన్ (Carlsberg Foundation) ఉపకారవేతనం లభించింది—అంటే, ఒక రకంగా చెప్పాలంటే, బోర్ తొలి విదేశీ పరిశోధనకు డబ్బు సమకూర్చింది బీరు వ్యాపారమే. అదే ఏడాది శరదృతువులో కేంబ్రిడ్జ్‌లోని కావెండిష్ ప్రయోగశాలకు వెళ్లాడు. అతని లక్ష్యం—ఎలక్ట్రాన్‌ను కనుగొన్న జె. జె. థామ్సన్ దగ్గర పనిచేయడం.
కానీ కేంబ్రిడ్జ్ అనుభవం అతను ఆశించినట్టు సాగలేదు. తన పరిశోధనా పత్రంలో థామ్సన్ ఎలక్ట్రాన్ సిద్ధాంతంపై తాను లేవనెత్తిన విమర్శలను అతనితో చర్చించాలనుకున్నాడు. థామ్సన్ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగానే ఉన్నా, బోర్ పరిశోధనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. భాషా సమస్య కూడా తోడైంది. ఇంగ్లీష్ సరిగా రాక బోర్ ఎంతో శ్రమపడాల్సి వచ్చింది; పక్కన నిఘంటువు పెట్టుకుని చార్లెస్ డికెన్స్ నవలలను వాక్యం వాక్యం తిరగేస్తూ ఆ భాషను నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడు. కొద్ది నెలల్లోనే కావెండిష్ వాతావరణం అతనికి ఒంటరితనాన్ని, నిరుత్సాహాన్ని మిగిల్చింది.
అదే సమయంలో కేంబ్రిడ్జ్ కావెండిష్ వార్షిక విందులో రూథర్‌ఫర్డ్ చేసిన ప్రసంగం బోర్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతని ఉత్సాహం, సమస్యలను నేరుగా పట్టుకునే తీరు, యువశాస్త్రవేత్తలతో హెచ్చుతగ్గులు లేకుండా కలిసిమెలిసి మాట్లాడే స్వభావం బోర్ మనసులో బలంగా నాటుకున్నాయి. కొద్దికాలానికే మాంచెస్టర్‌లో రూథర్‌ఫర్డ్‌ను నేరుగా కలిసే అవకాశం బోర్‌కు వచ్చింది. ఆ కలయిక తర్వాత, 1912 మార్చిలో అతని ప్రయోగశాలలో పనిచేయడానికి బోర్ మాంచెస్టర్‌కు మారాడు. కొత్త కేంద్రక నమూనా అప్పుడే రూపుదిద్దుకుంటున్న ఆ వాతావరణంలో, తన ఆలోచనలను శ్రద్ధగా వినే గురువు బోర్‌కు దొరికాడు. ఆ పరిచయం బోర్ జీవితాన్నే కాదు, పరమాణు భౌతికశాస్త్ర గమనాన్నే మార్చింది.
మాంచెస్టర్‌లో రేడియోధార్మికత, ఆల్ఫా కణాల విక్షేపణం, కొత్త కేంద్రక నమూనా — ఇవన్నీ అప్పటికప్పుడు ప్రయోగశాలల్లో పుట్టుకొస్తున్న నవీన సైన్స్. మొదట బోర్ ఆల్ఫా కణాలు పదార్థంలో ప్రయాణిస్తూ శక్తిని ఎలా కోల్పోతాయో పరిశీలించాడు. కానీ త్వరలోనే అతని దృష్టి రూథర్‌ఫర్డ్ కేంద్రక పరమాణువుపై పడింది. ఆ నమూనా పరమాణువు మధ్యలో ఏముందో చెప్పింది; ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉన్నాయి, పరమాణువు ఎందుకు స్థిరంగా ఉంది అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు.
కేంబ్రిడ్జ్‌లో తన ఆలోచనలకు సరైన స్పందన దొరకని బోర్‌కు, మాంచెస్టర్‌లో రూథర్‌ఫర్డ్ ఒక గురువుగానే కాక ఒక అండగా నిలిచాడు. సంప్రదాయ భౌతికశాస్త్రం పరమాణువు దగ్గర ఎక్కడో విఫలమవుతోందన్న బోర్ అనుమానానికి, రూథర్‌ఫర్డ్ కేంద్రక నమూనా ఇప్పుడు ఒక స్పష్టమైన భౌతిక వేదికను ఇచ్చింది.
ప్లాంక్, ఐన్స్టైన్ల క్వాంటం ప్రతిపాదనలు
బోర్ రూథర్‌ఫర్డ్ పరమాణువు మిగిల్చిన చిక్కులతో సతమతమవుతున్న సమయానికి, భౌతికశాస్త్రంలో మరో విప్లవం అప్పటికే మొదలైంది. దాని కథను మనం ముందటి వ్యాసాల్లో చూశాం.
1900లో ప్లాంక్ కృష్ణవస్తు వికిరణ సమస్యను పరిష్కరించడానికి ఒక అసాధారణమైన ఊహ చేశాడు.
పదార్థంలోని డోలకాల శక్తి ఏ విలువనైనా తీసుకోదని, \(E = n h \nu\) అనే విడివిడి విలువలకే పరిమితమని ప్రతిపాదించాడు.
ఐదేళ్ల తర్వాత, 1905లో ఐన్‌స్టైన్ ఈ ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లాడు. కాంతి పదార్థంతో కేవలం శక్తిని మార్చుకునేటప్పుడే కాకుండా, అసలు కాంతి ప్రయాణించడమే \(h\nu\) శక్తి గల విడివిడి క్వాంటాల (ఫోటాన్ల) రూపంలో ఉంటుందని ప్రతిపాదించాడు. ప్లాంక్ దగ్గర క్వాంటం శక్తి మార్పిడిలో కనిపించింది; ఐన్‌స్టైన్ దగ్గర అది స్వయంగా కాంతి స్వభావంలోకే చేరింది.
కానీ ఈ క్వాంటం భావనను పరమాణు నిర్మాణంతో విజయవంతంగా అనుసంధానించే సిద్ధాంతం అప్పటికి ఇంకా లేదు. రూథర్‌ఫర్డ్ నమూనాలోని స్థిరత్వ సంక్షోభంతో సతమతమవుతున్న బోర్ ముందు నిలిచిన చారిత్రక అవకాశం అదే: ప్లాంక్ స్థిరాంకం \(h\) కేవలం వికిరణానికే పరిమితమా, లేక పరమాణువు లోపల కూడా ఏదైనా మౌలికమైన పాత్ర పోషిస్తుందా?
బోర్ సాహసం – పరమాణువుకే క్వాంటం నియమం
రూథర్‌ఫర్డ్ కేంద్రక నమూనా బోర్ను వెంటనే ఆకర్షించింది. కానీ దాన్ని అలాగే స్వీకరించి ముందుకు సాగడం సాధ్యం కాదని అతనికి స్పష్టమైంది. 1912లో మాంచెస్టర్‌లో ఉన్నప్పుడే తన ఆలోచనలను కొన్ని పేజీలుగా రాసి రూథర్‌ఫర్డ్‌కు అందించాడు. చరిత్రలో దాన్ని “రూథర్‌ఫర్డ్ మెమోరాండమ్ (Rutherford Memorandum)” అంటారు. అందులో తర్వాత ప్రసిద్ధమైన హైడ్రోజన్ వర్ణపట సిద్ధాంతం ఇంకా రాలేదు; బాల్మర్ సూత్రం జాడే అందులో లేదు. బోర్ దృష్టి అప్పటికి పరమాణువు స్థిరత్వం, ఎలక్ట్రాన్ల అమరిక, మూలకాల రసాయన లక్షణాల మీదే ఉంది. అయితే ఒక విప్లవాత్మకమైన ఆలోచన అప్పటికే మొలకెత్తింది: సంప్రదాయ యాంత్రికశాస్త్రం చూపే అన్ని కక్ష్యలూ పరమాణువులో సాధ్యం కాకపోవచ్చు; ప్లాంక్ స్థిరాంకం \(h\) ఏదో ఒక విధంగా పరమాణువులో వీలయ్యే స్థితుల పరిమాణాన్ని నిర్ణయించాలి.
ఇది ఇంకా పూర్తయిన సిద్ధాంతం కాదు; బోర్ నిరంతరం మథనపడ్డాడు. ఒకవైపు రూథర్‌ఫర్డ్ కేంద్రకం, మరోవైపు ప్లాంక్ క్వాంటం — రెండింటినీ అనుసంధానించే మార్గం కోసం అతను వెతికాడు. 1912 వేసవిలో కోపెన్‌హేగన్‌కు తిరిగి వెళ్లిన తర్వాత కూడా రూథర్‌ఫర్డ్‌తో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగించాడు. గురువు కొత్త ఆలోచనను ప్రోత్సహించాడు; అదే సమయంలో దానిలోని లోపాలను నిర్దాక్షిణ్యంగా ఎత్తిచూపాడు.
1913 ఆరంభంలో బాల్మర్ సూత్రం బోర్ దృష్టికి వచ్చిన తర్వాత కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటివరకు పరమాణువు స్థిరత్వాన్ని వివరించడానికి వెతుకుతున్న క్వాంటం నియమం, హైడ్రోజన్ వర్ణపటంలోని సంఖ్యలతో సరిగ్గా సరిపోతుందని బోర్ గుర్తించాడు. ఇక పరమాణువు స్థిరత్వం, వర్ణపట రేఖలు రెండూ వేర్వేరు చిక్కులు కావు — ఒకే క్వాంటం నిర్మాణం రెండు వేర్వేరు రూపాల్లో బయటకు పంపుతున్న సంకేతాలు!
బోర్ తీసుకున్న అడుగు చాలా సాహసోపేతమైనది. ఎలక్ట్రాన్‌కు సంప్రదాయ భౌతికశాస్త్రం చూపే ఏ కక్ష్యైనా సాధ్యం కాదన్నాడు. కొన్ని ప్రత్యేకమైన స్థిర స్థితులు (stationary states) మాత్రమే ప్రకృతిలో వీలవుతాయి. ఎలక్ట్రాన్ అలాంటి స్థితిలో ఉన్నంతకాలం — సంప్రదాయ విద్యుదయస్కాంత సిద్ధాంతం ఏమన్నా సరే — అది శక్తిని వికిరణం చేయదు.
ఇంకా విచిత్రమైన రెండో నియమం: ఎలక్ట్రాన్ కక్ష్యలో తిరుగుతున్నంత కాలం కాంతి నిరంతరంగా వెలువడదు. పరమాణువు ఒక స్థిర స్థితి నుంచి మరొక స్థిర స్థితికి మారినప్పుడే కాంతిని బయటకు వెలువరిస్తుంది లేదా గ్రహిస్తుంది. పై స్థితి నుంచి కింది స్థితికి దిగినప్పుడు వెలువడే కాంతి క్వాంటం శక్తి:
$$h\nu = E_i – E_f$$
కాంతిని గ్రహించినప్పుడు సరిగ్గా ఇదే మార్పు వ్యతిరేక దిశలో సాగుతుంది.
(ఇక్కడ \(i\) అంటే ప్రారంభ స్థితి — initial state; \(f\) అంటే తుది స్థితి — final state).
అక్కడితో క్వాంటం కథ మరో మెట్టు ఎక్కింది:
- ప్లాంక్: శక్తి మార్పిడి — విడివిడి క్వాంటాలుగా.
- ఐన్‌స్టైన్: కాంతి — విడివిడి క్వాంటాలుగా.
- బోర్: పరమాణువు — కొన్ని నిర్దిష్ట శక్తి స్థితుల్లోనే.
ఇక్కడే బోర్ సంప్రదాయ భౌతికశాస్త్ర నియమాలను వదిలేశాడు. ఎలక్ట్రాన్ ఒక కక్ష్య నుంచి మరొకదానికి ఎలా వెళుతుంది? మధ్యలో దాని గమనం ఏమిటి? సంప్రదాయ యాంత్రికశాస్త్రంతో ఆ ప్రయాణాన్ని వివరించగలమా? బోర్ సిద్ధాంతం వాటికి సమాధానం చెప్పలేదు.
ఈ లోపం రూథర్‌ఫర్డ్ దృష్టికి వెంటనే వచ్చింది. 1913 మార్చి 20న బోర్‌కు రాసిన ఉత్తరంలో అతను ఒక “grave difficulty”ని ఎత్తిచూపాడు: ఒక స్థిర స్థితి నుంచి మరొకదానికి మారేటప్పుడు ఎలక్ట్రాన్ ఏ పౌనఃపున్యంతో \((\nu)\) వికిరణం చేయాలో ఎలా నిర్ణయిస్తుంది? చివరికి ఎక్కడ ఆగబోతోందో దానికి ముందే తెలిసినట్టుగా ఉందని — “the electron knows beforehand where it is going to stop” — చమత్కరించాడు.
ఆ ప్రశ్న చిన్నది కాదు. బోర్ సిద్ధాంతంలోని అత్యంత విచిత్రమైన అంశాన్నే అది పట్టుకుంది. సంప్రదాయ భౌతికశాస్త్రంలో ఒక వస్తువు ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎంత వేగంతో కదులుతోంది అన్నది తెలిసినప్పుడు దాని తరువాతి గమనాన్ని కచ్చితంగా లెక్కించవచ్చు (determinism). కానీ బోర్ పరమాణువులో ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి ఎలక్ట్రాన్ వేసే “క్వాంటం గెంతు”ను (quantum jump) అలా లెక్కించలేం. అయినా ఆ రెండు స్థితుల శక్తుల తేడా నుంచి వెలువడే కాంతి పౌనఃపున్యాన్ని మాత్రం కచ్చితంగా లెక్కించవచ్చు.
రూథర్‌ఫర్డ్ విమర్శించినా బోర్ను నిరుత్సాహపరచలేదు. సిద్ధాంతం అసాధారణమని ఇద్దరికీ తెలుసు; కానీ హైడ్రోజన్ వర్ణపటాన్ని అది వివరించే తీరు విస్మరించలేనంత బలంగా ఉంది. బోర్ ఈ సిద్ధాంతంపై రాసిన మొదటి పత్రాన్ని ముద్రణకు ముందే రూథర్‌ఫర్డ్‌కు పంపి సలహాలు తీసుకున్నాడు; రూథర్‌ఫర్డ్ దాన్ని జాగ్రత్తగా చదివి సూచనలు చేశాడు. గురువు ప్రయోగజ్ఞానం, శిష్యుడి సిద్ధాంత సాహసం — ఈ రెండింటి మధ్య సాగిన సంభాషణలోనే కొత్త పరమాణువు రూపుదిద్దుకుంది.
1913లో బోర్ తన సిద్ధాంతాన్ని Philosophical Magazine లో “On the Constitution of Atoms and Molecules” అనే శీర్షికతో మూడు భాగాలుగా ప్రచురించాడు. మొదటి పత్రం జూలైలో, రెండోది సెప్టెంబరులో, మూడోది నవంబరులో వెలువడ్డాయి. తర్వాత ఇవి కలిపి 1913 trilogy గా ప్రసిద్ధి చెందాయి. మొదటి భాగంలో ప్రధానంగా హైడ్రోజన్ వంటి ఒకే ఎలక్ట్రాన్ వ్యవస్థలు, వాటి వర్ణపటాలు; తర్వాతి భాగాల్లో అనేక ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువులు, అణువులు, ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక వంటి పెద్ద సమస్యలవైపు బోర్ అడుగులు వేశాడు.
ఆ మూడు పత్రాల్లోని ప్రతిపాదనల్లో కొన్ని కాలపరీక్షకు నిలబడలేదు. బోర్ ఊహించిన వృత్తాకార కక్ష్యల స్థూల చిత్రమే ఆధునిక పరమాణు నమూనా కాలేదు. కానీ ఒక విప్లవాత్మకమైన భావన మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది: పరమాణువులో శక్తి ఏ విలువనైనా తీసుకోలేదు; కొన్ని నిర్దిష్ట స్థితులనే ప్రకృతి అనుమతిస్తుంది. అక్కడితో పరమాణు భౌతికశాస్త్రం ఒక సరికొత్త దారిలోకి మళ్లింది.
కక్ష్యలకు క్వాంటం నిబంధన – బోర్ గణితం
బోర్ ప్రతిపాదించిన స్థిర స్థితులు అంటే ఏమిటి? ఎలక్ట్రాన్‌కు ఏ కక్ష్యలు సాధ్యమవుతాయి, ఏవి వీలుపడవు? ఇక్కడే క్వాంటం భావనకు గణిత రూపం వస్తుంది.
ముందుగా సంప్రదాయ భౌతికశాస్త్రాన్నే తీసుకుందాం. హైడ్రోజన్ కేంద్రకానికి \(+e\), ఎలక్ట్రాన్‌కు \(-e\) ఆవేశాలు ఉన్నాయి. వాటి మధ్య విద్యుత్ ఆకర్షణ ఎలక్ట్రాన్‌ను కేంద్రకం వైపు లాగుతుంది. ఎలక్ట్రాన్ \(r\) వ్యాసార్థం గల వృత్తాకార కక్ష్యలో \(v\) వేగంతో తిరుగుతోందనుకుంటే, దానికి కావలసిన అభికేంద్ర బలాన్ని (centripetal force) కూలాంబ్ ఆకర్షణ బలమే సమకూరుస్తుంది:
$$\frac{m v^2}{r} = \frac{1}{4\pi\epsilon_0}\frac{e^2}{r^2}$$
ఇది కొత్త భౌతికశాస్త్రం కాదు. న్యూటన్ యాంత్రికశాస్త్రం, కూలాంబ్ విద్యుత్ బలం — అంతే.
కానీ కేవలం ఈ సమీకరణంతోనే సమస్య తీరదు. \(r\) కు ఏదో ఒక ప్రత్యేక విలువ రావడం లేదు. తగిన వేగం \(v\) ఉంటే ఎన్నో రకాల కక్ష్యలు సాధ్యమే. అంటే సంప్రదాయ భౌతికశాస్త్రంలో ఎలక్ట్రాన్ కక్ష్యల పరిమాణం నిరంతరంగా మారవచ్చు.
బోర్ ఇక్కడే సరికొత్త నియమాన్ని ప్రతిపాదించాడు. బోర్ 1913లో చేసిన అసలు వాదన కొంత సంక్లిష్టమైనది. ఇక్కడ అదే ఫలితానికి తీసుకెళ్లే, ఇప్పుడు సాధారణంగా వాడే సరళ రూపంలో లెక్కను చూద్దాం. కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం (angular momentum):
$$L = m v r$$
(ఇక్కడ \(m\) ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి, \(v\) దాని వేగం, \(r\) కక్ష్య వ్యాసార్థం).
ఈ కోణీయ ద్రవ్యవేగం ఏ విలువ కావాలంటే ఆ విలువ తీసుకోదు; అది
$$m v r = n\hbar, \qquad n = 1, 2, 3, \dots$$
అనే విలువలకే పరిమితం కావాలి. ఇక్కడ \(n\) అనేది కక్ష్యను సూచించే పూర్ణసంఖ్య (క్వాంటం సంఖ్య). ఇక
$$\hbar = \frac{h}{2\pi}$$
అనేది ‘h-బార్’ \(\hbar\); \(h\) మనకు ప్లాంక్ కథ నుంచే పరిచయమైన స్థిరాంకం.
ఇప్పుడు ఈ రెండు సమీకరణాలను కలిపితే ఒక ఆశ్చర్యకరమైన ఫలితం వస్తుంది. ఎలక్ట్రాన్ కక్ష్య వ్యాసార్థం కూడా ఏ విలువ కావాలంటే ఆ విలువ తీసుకోలేదు:
$$r_n = \left(\frac{4\pi\epsilon_0\hbar^2}{m e^2}\right) n^2$$
పౌనఃపున్యంతో
ముందున్న స్థిరాంకాలన్నిటినీ కలిపిన మొదటి కక్ష్య వ్యాసార్థాన్ని ఇప్పుడు బోర్ వ్యాసార్థం \(a_0\) అంటాం:
$$a_0 = \frac{4\pi\epsilon_0\hbar^2}{m e^2} \approx 0.529\text{ Å}$$
కాబట్టి
$$r_n = a_0 n^2$$
అంటే \(n = 1\) అయితే \(r = a_0\); \(n = 2\) అయితే \(4a_0\); \(n = 3\) అయితే \(9a_0\). వాటి మధ్య ఉన్న ఏ వ్యాసార్థమూ బోర్ నమూనాలో చెల్లదు; ప్రకృతి వాటిని ఒప్పుకోదు.
ఇదే క్వాంటం నియమం తెచ్చిన మౌలికమైన మార్పు. సంప్రదాయ భౌతికశాస్త్రం “ఏ కక్ష్య అయినా సాధ్యం” అంటే, బోర్ “కొన్ని నిర్దిష్ట కక్ష్యలే సాధ్యం” అన్నాడు. నిరంతరంగా ఉన్న అనంతమైన అవకాశాల నుంచి ప్రకృతి కొన్ని విలువలనే ఎంచుకుంది.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ లెక్క ఒక్కటే ఎలక్ట్రాన్ ఎందుకు వికిరణం చేయదో వివరించదు. తాను నిర్దేశించిన కక్ష్యలో ఉన్నంతకాలం అది శక్తిని కోల్పోదని బోర్ ప్రాథమిక ఊహగా (postulate) ప్రతిపాదించాల్సి వచ్చింది. క్వాంటం నియమం ఏ కక్ష్యలు చెల్లుతాయో గణిస్తుంది; కానీ ఆ కక్ష్యలు ఎందుకు స్థిరంగా ఉంటాయో అప్పటి సిద్ధాంతం పూర్తిగా వివరించలేకపోయింది.
ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం ఎందుకు ఇలా కొన్ని నిర్దిష్ట విలువలనే తీసుకోవాలి? ప్రకృతి ఎలక్ట్రాన్ల గమనానికి ఇలాంటి విచిత్రమైన సరిహద్దులను ఎందుకు విధిస్తోంది?
నిజానికి 1913లో దీనికి బోర్ దగ్గరా సరైన భౌతిక వివరణ లేదు. బాల్మర్ వర్ణపట సూత్రం సరిగ్గా రావడానికి, పరమాణువు కూలిపోకుండా ఉండటానికి ఈ గణిత నియమాన్ని ఒక ప్రాథమిక ఊహగా (postulate) ప్రతిపాదించాడంతే. వీణ తంత్రిని మీటినప్పుడు అన్ని రకాల శబ్దాలూ రావు; ఆ తంత్రి పొడవుకు సరిపోయే కొన్ని నిర్దిష్టమైన నాదాలే (స్వరాలే) వస్తాయి. పరమాణువులోనూ ఎలక్ట్రాన్ కక్ష్యలు అలాంటి ఒక సహజ నిబంధనకు లోబడి ఉంటాయన్న ఊహ అది. ఎలక్ట్రాన్ ప్రవర్తన వెనుక దాగిన ఈ సంఖ్యల అసలు రహస్యాన్ని పూర్తిగా విప్పడానికి భౌతికశాస్త్రానికి మరో దశాబ్దం పట్టింది — ఆ కథను మనం ముందు ముందు వ్యాసాలలో చూద్దాం.
కానీ కక్ష్యల వ్యాసార్థాలు మాత్రమే తెలిస్తే సరిపోదు. హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరించాలంటే ప్రకృతి ఒప్పుకునే ప్రతి కక్ష్యలో ఎలక్ట్రాన్‌కు ఎంత శక్తి ఉంటుందో లెక్కించాలి. అక్కడే బోర్ సిద్ధాంతం అసలు బలం బయటపడుతుంది.
శక్తి స్థాయిలు – బోర్ నమూనా అసలు బలం
కక్ష్య వ్యాసార్థాలు \(a_0, 4a_0, 9a_0, \dots\) అని వచ్చాయి. ఇప్పుడు ప్రతి కక్ష్యలో ఎలక్ట్రాన్‌కు ఎంత శక్తి ఉంటుందో చూద్దాం.
కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్‌కు రెండు రకాల శక్తులు ఉంటాయి — దాని గమనానికి సంబంధించిన గతిజ శక్తి (kinetic energy), కేంద్రకపు విద్యుత్ ఆకర్షణ వల్ల వచ్చే స్థితిజ శక్తి (potential energy).
మొత్తం శక్తి:
$$E = \frac{1}{2} m v^2 – \frac{1}{4\pi\epsilon_0}\frac{e^2}{r}$$
ఇందులో రెండో పదం రుణాత్మకం. కారణం: కేంద్రకపు ఆకర్షణలో చిక్కుకున్న ఎలక్ట్రాన్‌ను పూర్తిగా విడదీసి అనంత దూరానికి తీసుకెళ్లాలంటే బయట నుంచి శక్తిని అందించాలి.
ముందు ఉపయోగించిన అభికేంద్ర బలం సమీకరణం
$$\frac{m v^2}{r} = \frac{1}{4\pi\epsilon_0}\frac{e^2}{r^2}$$
నుంచి
$$m v^2 = \frac{1}{4\pi\epsilon_0}\frac{e^2}{r}$$
వస్తుంది. దాన్ని మొత్తం శక్తి సమీకరణంలో పెడితే, గతిజ శక్తి పరిమాణం స్థితిజ శక్తి పరిమాణంలో సరిగ్గా సగం ఉంటుందని తెలుస్తుంది:
$$E = \frac{1}{2}\left(\frac{1}{4\pi\epsilon_0}\frac{e^2}{r}\right) – \frac{1}{4\pi\epsilon_0}\frac{e^2}{r} = -\frac{1}{2}\left(\frac{1}{4\pi\epsilon_0}\right)\frac{e^2}{r}$$
ఇప్పుడు \(r\) స్థానంలో బోర్ నియమం ఇచ్చిన \(r_n = a_0 n^2\) విలువలను ప్రతిక్షేపిస్తే,
$$E_n = -\frac{13.6\text{ eV}}{n^2}, \qquad n = 1, 2, 3, \dots$$
అనే చక్కని ఫలితం వస్తుంది.
అంటే హైడ్రోజన్ పరమాణువు శక్తి కూడా ఏ విలువ పడితే ఆ విలువ తీసుకోదు:
$$n = 1 \Rightarrow E_1 = -13.6\text{ eV}$$
$$n = 2 \Rightarrow E_2 = -3.4\text{ eV}$$
$$n = 3 \Rightarrow E_3 = -1.51\text{ eV}$$
ఇలా కొన్ని నిర్దిష్ట శక్తి స్థాయిలే ప్రకృతిలో సాధ్యమవుతాయి.
ఇక్కడ ఒక సహజమైన సందేహం రావచ్చు: సమీకరణంలో సంఖ్యలు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నాయి కదా, మరి లోపలి కక్ష్య కంటే బయటి కక్ష్యకే ఎక్కువ శక్తి ఎలా ఉంటుంది?
గణితంలో \(-13.6\) కంటే \(-3.4\) పెద్ద సంఖ్య; దానికంటే \(-1.51\) మరింత పెద్దది; వాటన్నిటికంటే అత్యధిక విలువ సున్నా \(0\):
$$-13.6\text{ eV} < -3.4\text{ eV} < -1.51\text{ eV} < \dots < 0\text{ eV}$$ దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక లోతైన బావిని ఊహించుకోవచ్చు. బావి అడుగున పడి ఉన్న మనిషి బయటపడాలంటే ఎక్కువ శక్తి కావాలి; అంటే అతను పెద్ద మొత్తంలో "శక్తి అప్పు"లో ఉన్నాడు. కేంద్రకానికి అత్యంత దగ్గరగా ఉండే మొదటి కక్ష్యలో (\(n = 1\)) ఎలక్ట్రాన్ సరిగ్గా అలాంటి అప్పులోనే ఉంటుంది; దానికి కేంద్రకం నుంచి విడివడటానికి \(13.6\text{ eV}\) శక్తి కావాలి కాబట్టే దాని శక్తిని \(-13.6\text{ eV}\) అంటాం. ఎలక్ట్రాన్ రెండో కక్ష్యకు (\(n = 2\)) చేరినప్పుడు దాని శక్తి అప్పు తీరి కాస్త పైకి లేచింది — ఇక దానికి కావాల్సింది \(3.4\text{ eV}\) మాత్రమే, కాబట్టి దాని శక్తి \(-3.4\text{ eV}\). చివరకు కేంద్రకపు పట్టు తప్పిన స్వేచ్ఛా ఎలక్ట్రాన్ శక్తి సున్నా (\(E = 0\)). మరో రకంగా చెప్పాలంటే, నేల మీద పడి ఉన్న రాయిని పై అంతస్తుకు తీసుకెళ్లాలంటే మనం బయట నుంచి పని చేసి శక్తిని అందించాలి. ఎత్తు పెరిగేకొద్దీ రాయికి స్థితిజ శక్తి ఎలా పెరుగుతుందో, కేంద్రకపు విద్యుత్ ఆకర్షణను ఎదిరించి ఎలక్ట్రాన్‌ను బయటి కక్ష్యలకు లాక్కెళ్లాలన్నా మనం బయట నుంచే శక్తిని ఇవ్వాలి. అందుకే బయటి కక్ష్యల్లో ఉన్న ఎలక్ట్రాన్కే ఎక్కువ శక్తి ఉంటుంది. అన్నిటికన్నా తక్కువ శక్తి గల \(n = 1\) స్థితిని భూస్థితి (ground state) అంటాం. ఎలక్ట్రాన్ దానికంటే కింది స్థాయికి దిగజారలేదు. అందువల్ల బోర్ నమూనాలో ఎలక్ట్రాన్ కేంద్రకంలోకి నిరంతరంగా పడిపోవడానికి దారే లేదు — చెల్లుబాటు అయ్యే అత్యల్ప స్థితి దగ్గర అది ఆగిపోతుంది. భూస్థితిలో ఉన్న హైడ్రోజన్ పరమాణువు నుంచి ఎలక్ట్రాన్‌ను పూర్తిగా బయటకు లాగడానికి సుమారు \(13.6\text{ eV}\) శక్తి కావాలి; దాన్నే హైడ్రోజన్ అయనీకరణ శక్తి (ionization energy) అంటాం. \(n\) పెరిగేకొద్దీ శక్తి స్థాయిల మధ్య అంతరం క్రమంగా తగ్గుతూ వస్తుంది. చివరకు \(n \to \infty\) అయినప్పుడు $$E_n \to 0$$ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ పరమాణువు బంధం నుంచి బయటపడే హద్దుకు చేరుకుంటుంది. ఇక్కడ బోర్ సిద్ధాంతం తెచ్చిన మార్పు కక్ష్యలకంటే కూడా లోతైనది. ఎలక్ట్రాన్ ఎక్కడ తిరుగుతోంది అన్నదానికంటే, పరమాణువుకు ఏ శక్తులు సాధ్యమవుతాయన్నదే అత్యంత కీలకమైంది. తర్వాత కాలంలో ఆధునిక క్వాంటం మెకానిక్స్ బోర్ ఊహించిన వృత్తాకార కక్ష్యలను తోసిపుచ్చింది. కానీ ఈ విడివిడిగా ఉండే శక్తి స్థాయిలు (discrete energy levels) మాత్రం భౌతికశాస్త్రంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇప్పుడు బాల్మర్ సూత్రంలోని \(2, 3, 4, \dots\) సంఖ్యలు దేనిని సూచిస్తున్నాయో చెప్పగలం. ఎలక్ట్రాన్ ఒక శక్తి స్థాయి నుంచి మరొకదానికి మారినప్పుడు బయటకు వచ్చే కాంతి శక్తి: $$h\nu = E_i - E_f$$ ఈ ఒక్క సంబంధాన్ని పై శక్తి స్థాయిలతో జోడిస్తే, ఎన్నో ఏళ్లుగా మర్మంగా ఉన్న హైడ్రోజన్ వర్ణపట సూత్రం తనంతట తానే ఎలా బయటపడుతుందో తర్వాతి విభాగంలో చూద్దాం.
బాల్మర్ సూత్రానికి భౌతిక అర్థం
బోర్ సిద్ధాంతంలో హైడ్రోజన్ పరమాణువుకు వీలయ్యే శక్తి స్థాయులు
$$E_n = -\frac{13.6\text{ eV}}{n^2}$$
అని వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ పై స్థాయి నుంచి కింది స్థాయికి మారితే, రెండు స్థాయుల శక్తుల తేడా కాంతి క్వాంటంగా బయటకు వస్తుందని బోర్ ప్రతిపాదించాడు:
$$h\nu = E_i – E_f$$
కాంతికి
$$\nu = \frac{c}{\lambda}$$
కాబట్టి,
$$\frac{hc}{\lambda} = E_i – E_f$$
ఇప్పుడు పై స్థాయిని \(n\), కింది స్థాయిని \(m\) అనుకుందాం (\(n > m\)). బోర్ శక్తి సూత్రాన్ని ప్రతిక్షేపిస్తే:
$$\frac{hc}{\lambda} = \left(-\frac{13.6\text{ eV}}{n^2}\right) – \left(-\frac{13.6\text{ eV}}{m^2}\right) = 13.6\text{ eV} \left(\frac{1}{m^2} – \frac{1}{n^2}\right)$$
ఇరువైపులా \(hc\) తో భాగిస్తే:
$$\frac{1}{\lambda} = \frac{13.6\text{ eV}}{hc} \left(\frac{1}{m^2} – \frac{1}{n^2}\right)$$
అంటే
$$\frac{1}{\lambda} = R \left(\frac{1}{m^2} – \frac{1}{n^2}\right), \qquad n > m$$
ఇదే రిడ్బర్గ్ సూత్రం.
ఇప్పుడు బాల్మర్ శ్రేణి కోసం కింది స్థాయి \(m = 2\) పెడితే,
$$\frac{1}{\lambda} = R \left(\frac{1}{2^2} – \frac{1}{n^2}\right), \qquad n = 3, 4, 5, \dots$$
అచ్చం బాల్మర్ కనుగొన్న అనుభవాత్మక సూత్రమే బోర్ గణితం నుంచి బయటపడింది.
కానీ ఇప్పుడు \(2, 3, 4, 5, \dots\) సంఖ్యలు కేవలం కాగితంపై కనిపించే యాదృచ్ఛిక సంఖ్యలు కావు. వాటికి పరమాణువు అంతరంగంలో నిర్దిష్ట భౌతిక అర్థం దొరికింది. ఉదాహరణకు:
\(3 \rightarrow 2\) మార్పు ఎరుపు రంగు (\(H_\alpha\)) రేఖను ఇస్తుంది;
\(4 \rightarrow 2\) మార్పు ఆకుపచ్చ-నీలం రంగు (\(H_\beta\)) రేఖను ఇస్తుంది; అలాగే \(5 \rightarrow 2\), \(6 \rightarrow 2, \dots\) మార్పులు మిగతా బాల్మర్ రేఖలను ఇస్తాయి.
బాల్మర్‌కు ఈ పూర్ణసంఖ్యలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. రిడ్బర్గ్ వాటిని మరింత సాధారణ సూత్రంలో అమర్చాడు; కానీ వాటి మూలం ఏమిటో అతనికీ తెలియదు. బోర్ దగ్గర మొదటిసారిగా ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది: అవి హైడ్రోజన్ పరమాణువులోని శక్తి స్థితులను సూచించే క్వాంటం సంఖ్యలు.
ఇంకా గొప్ప విషయం ఉంది. రిడ్బర్గ్ సూత్రంలోని \(R\) అనే స్థిరాంకం అప్పటివరకు ప్రయోగాల నుంచి వచ్చిన ఒక సంఖ్య మాత్రమే. బోర్ సిద్ధాంతంలో అది ఇక ప్రయోగశాలలో కొలవాల్సిన బాహ్య సంఖ్యగా మిగిలిపోలేదు; ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి (\(m\)), ప్రాథమిక ఆవేశం (\(e\)), ప్లాంక్ స్థిరాంకం (\(h\)), కాంతి వేగం (\(c\)) వంటి ప్రకృతి మౌలిక స్థిరాంకాల నుంచే లెక్కించగలిగిన పరిమాణంగా మారింది:
$$R = \frac{m e^4}{8 \epsilon_0^2 h^3 c}$$
ప్రయోగాల్లో ముందే తెలిసిన రిడ్బర్గ్ స్థిరాంక విలువకు (\(R \approx 1.097 \times 10^7\text{ m}^{-1}\)), ఈ సైద్ధాంతిక లెక్కింపు ద్వారా వచ్చిన విలువ చాలా దగ్గరగా ఉండటం బోర్ సిద్ధాంతానికి గొప్ప విజయంగా నిలిచింది.
ఇదే 1913 సిద్ధాంతం గొప్పతనాన్ని పూర్తిగా చాటింది. బోర్ తెలిసిన వర్ణపట రేఖలకు సరిపోయేలా ఒక కొత్త సమీకరణాన్ని బలవంతంగా అతికించలేదు. పరమాణువు ఎలా ఉండాలన్న ప్రాథమిక ఆలోచన నుంచి మొదలై, ప్రకృతి ఒప్పుకునే శక్తి స్థాయులను కనుగొని, వాటి మధ్య మార్పుల నుంచి ప్రయోగాల్లో ఎన్నో ఏళ్లుగా తెలిసిన బాల్మర్–రిడ్బర్గ్ సూత్రాన్ని రాబట్టాడు.
హైడ్రోజన్ ఎందుకు కూలిపోదన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మొదలైన ప్రయాణం, అదే పరమాణువు ఎందుకు కొన్ని నిర్దిష్ట రంగుల కాంతినే విడుదల చేస్తుందో కూడా వివరించింది.
అందుకే బోర్ బాల్మర్ సూత్రాన్ని చూసిన క్షణాన్ని తర్వాత అంత ఉత్సాహంగా గుర్తుచేసుకున్నాడు. అప్పటివరకు ఒకదానికొకటి సంబంధం లేనట్లుగా కనిపించిన పరమాణు స్థిరత్వం, వర్ణపట రేఖలు — రెండూ ఒకే క్వాంటం నిర్మాణం నుంచి వస్తున్నాయని అతనికి స్పష్టమైంది.
హైడ్రోజన్ వర్ణపట రేఖలు ఎలా పుడతాయి?
ఇంతవరకు సమీకరణాల ద్వారా బాల్మర్ రేఖల తరంగదైర్ఘ్యాలు ఎలా వస్తాయో చూశాం. కానీ ప్రయోగశాలలో ఆ రేఖలు అసలు ఎలా పుడతాయి?
తక్కువ పీడనంలో ఉన్న హైడ్రోజన్ వాయువు గుండా విద్యుత్ ఉత్సర్గం (electric discharge) పంపినప్పుడు, విద్యుత్ క్షేత్రంలో త్వరణం పొందిన స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు హైడ్రోజన్ పరమాణువులను బలంగా ఢీకొంటాయి. ఆ తాకిడిలో తగినంత శక్తి బదిలీ అయితే, పరమాణువులోని ఎలక్ట్రాన్ భూస్థితి (\(n = 1\)) నుంచి \(n = 2, 3, 4, \dots\) వంటి పై శక్తి స్థితులకు దూకుతుంది.
అలా ఉత్తేజితమైన ఎలక్ట్రాన్ సాధారణంగా ఎక్కువసేపు ఆ పై స్థాయిలో ఉండదు; తిరిగి కింది స్థితులకు చేరుకుంటుంది. ప్రతి మార్పులోనూ వెలువడే కాంతి క్వాంటం శక్తి:
$$h\nu = E_i – E_f$$
అంటే ఆ రెండు శక్తి స్థితుల మధ్య తేడాకే సమానం.
బాల్మర్ రేఖలన్నీ ఎలక్ట్రాన్ పై స్థాయిల నుంచి \(n = 2\) స్థితిలోకి దిగినప్పుడు వెలువడే కాంతి రేఖలే:
$$3 \rightarrow 2 \qquad H_\alpha \qquad 656.3\text{ nm}$$
$$4 \rightarrow 2 \qquad H_\beta \qquad 486.1\text{ nm}$$
$$5 \rightarrow 2 \qquad H_\gamma \qquad 434.0\text{ nm}$$
$$6 \rightarrow 2 \qquad H_\delta \qquad 410.2\text{ nm}$$
అందుకే హైడ్రోజన్ వర్ణపటంలో ఎక్కడపడితే అక్కడ నిరంతరంగా రంగులు కనిపించవు. పరమాణువులో సాధ్యమయ్యే శక్తి స్థితుల మధ్య తేడాలకు సరిగ్గా సరిపోయే కొన్ని నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలే కనిపిస్తాయి.
ఎలక్ట్రాన్ తప్పనిసరిగా ఒక్క గెంతులోనే భూస్థితికి రావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు \(n = 4\) నుంచి నేరుగా \(n = 1\) కి దూకవచ్చు; లేదా మధ్యలో మెట్లు దిగుతున్నట్లు \(n = 4\) నుంచి ముందుగా \(n = 2\) కి, అక్కడి నుంచి \(n = 1\) కి దిగవచ్చు. ఇందులో మొదటి మార్పు (\(4 \to 2\)) కంటికి కనిపించే బాల్మర్ శ్రేణిలోని \(H_\beta\) రేఖను ఇస్తే; రెండో మార్పు (\(2 \to 1\)) అతినీలలోహిత (UV) ప్రాంతంలోని లైమన్ శ్రేణి రేఖను వెలువరిస్తుంది.
అంటే వర్ణపట రేఖలు కేవలం కాగితంపై గణిత సూత్రాలు ఇచ్చే సంఖ్యలు కావు; పరమాణువు తనకు వీలైన ఒక శక్తి స్థితి నుంచి మరొకదానికి మారుతున్నప్పుడు అంతరిక్షంలోకి విసిరే కాంతి ముద్రలు!
(\(n = 3, 4, 5, 6\)) స్థితుల నుంచి (\(n = 2\)) స్థితికి సాగే మార్పులే బాల్మర్ శ్రేణి రేఖలను ఇస్తాయి.
హైడ్రోజన్కేనా? – పికరింగ్ రేఖల పరీక్ష
బాల్మర్ సూత్రానికి భౌతిక అర్థం చెప్పడంతో బోర్ పని పూర్తయినట్టే అనిపించవచ్చు. కానీ అదే సూత్రం అతని సిద్ధాంతానికి మరింత కఠినమైన పరీక్షను ఎదురుపెట్టింది.
1896లో హార్వర్డ్ కాలేజ్ అబ్జర్వేటరీలో విలియమినా ఫ్లెమింగ్ (Williamina Fleming), \(\zeta\text{ Puppis}\) అనే నక్షత్ర వర్ణపటాన్ని పరిశీలిస్తూ హైడ్రోజన్ రేఖలను పోలిన కొన్ని విచిత్రమైన రేఖలను గుర్తించింది. అబ్జర్వేటరీ డైరెక్టర్ ఎడ్వర్డ్ పికరింగ్ (Edward Pickering) ఆ ఫలితాలను ప్రచురించాడు; తర్వాత ఆ రేఖల సమూహం పికరింగ్ శ్రేణిగా (Pickering series) ప్రసిద్ధి చెందింది.
మొదట అవి ఏ మూలకానికి చెందినవో ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. తర్వాత పికరింగ్ వాటిని హైడ్రోజన్కే చెందిన మరో కొత్త వర్ణపట శ్రేణిగా భావించాడు. 1912లో ప్రఖ్యాత స్పెక్ట్రోస్కోపిస్ట్ ఆల్ఫ్రెడ్ ఫౌలర్ (Alfred Fowler) హైడ్రోజన్–హీలియం వాయువుల మిశ్రమంలో కూడా అలాంటి రేఖలను ప్రయోగశాలలో చూసినప్పుడు ఆ అభిప్రాయం మరింత బలపడింది. కానీ వాటిని బాల్మర్ సూత్రంలో సరిపెట్టాలంటే \(3, 4, 5, \dots\) లాంటి పూర్ణసంఖ్యల బదులు సగం సంఖ్యలను (\(n = 3.5, 4.5, \dots\)) ఉపయోగించాల్సి వచ్చింది.
బోర్‌కు అది కేవలం ఫలితాలను సరిపెట్టడానికి చేసిన బలవంతపు సర్దుబాటులా అనిపించింది. తన సిద్ధాంతం ప్రకారం ఒక్క హైడ్రోజన్ మాత్రమే కాదు, కేంద్రకం చుట్టూ ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే తిరిగే హైడ్రోజన్-సారూప్య వ్యవస్థలన్నిటికీ ఇదే నియమం వర్తించాలి. ఒక ఎలక్ట్రాన్ కోల్పోయిన అయనీకృత హీలియం, \(\text{He}^+\), సరిగ్గా అలాంటి వ్యవస్థే. హైడ్రోజన్ కేంద్రకంలో ఒకే ప్రోటాన్ ఉంటే (\(Z = 1\)), హీలియం కేంద్రకానికి రెండు ప్రోటాన్ల ధనావేశం (\(Z = 2\)) ఉంటుంది.
మొదటి అంచనాలో కేంద్రకాన్ని కదలకుండా స్థిరంగా ఉన్నట్లుగానూ, ఎలక్ట్రాన్తో పోలిస్తే అపరిమితమైన ద్రవ్యరాశి ఉన్నట్లుగానూ భావిస్తే, ఒకే ఎలక్ట్రాన్ ఉన్న పరమాణువులో వర్ణపటసూత్రంలో రిడ్బర్గ్ స్థిరాంకానికి \(Z^2\) గుణకం వస్తుంది. అందువల్ల \(\text{He}^+\) కు ఆ గుణకం హైడ్రోజన్ కంటే నాలుగు రెట్లు కావాలి.
అప్పుడు పికరింగ్–ఫౌలర్ రేఖలకు అసలైన అంతరార్థం తెలిసింది. అవి బాల్మర్ సూత్రపు పూర్ణాంక నియమాలను ఉల్లంఘిస్తున్న విచిత్రమైన హైడ్రోజన్ రేఖలు కావు; ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయిన హీలియం అయాన్ (\(\text{He}^+\)) వెలువరించే వర్ణపట రేఖలు!
ఇది ఇప్పటికే బోర్ సిద్ధాంతానికి దక్కిన గొప్ప విజయం. కానీ ఫౌలర్ మరింత కఠినమైన ప్రశ్న లేవనెత్తాడు. అతని అత్యంత కచ్చితమైన ప్రయోగ కొలతల ప్రకారం హీలియం, హైడ్రోజన్ రిడ్బర్గ్ స్థిరాంకాల నిష్పత్తి కచ్చితంగా \(4\) కాదు — అది \(4.0016\). ఈ తేడా ప్రయోగదోషం కంటే చాలా పెద్దది; బోర్ సిద్ధాంతం దాన్ని వివరించగలదా?
బోర్ తన లెక్కను మళ్లీ పరిశీలించాడు. మొదటి లెక్కలో కేంద్రకాన్ని ఎలక్ట్రాన్తో పోలిస్తే అనంతంగా బరువైనదిగా, కదలకుండా స్థిరంగా ఉన్నట్లుగా భావించాడు. కానీ నిజానికి ఎలక్ట్రాన్ మాత్రమే ఒంటరిగా కేంద్రకం చుట్టూ తిరగదు; ఆ రెండూ వాటి ఉమ్మడి ద్రవ్యరాశి కేంద్రం చుట్టూ కదులుతాయి. అందువల్ల కేవలం ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి \(m\) స్థానంలో, కేంద్రకం–ఎలక్ట్రాన్ వ్యవస్థకు సంబంధించిన సంక్షిప్త ద్రవ్యరాశిని (reduced mass, \(\mu\)) ఉపయోగించాలి:
$$\mu = \frac{m M}{m + M}$$
ఇక్కడ \(M\) కేంద్రకపు ద్రవ్యరాశి. హీలియం కేంద్రకం (ఆల్ఫా కణం) హైడ్రోజన్ కేంద్రకం (ప్రోటాన్) కంటే దాదాపు నాలుగు రెట్లు బరువైనది.
ఈ ద్రవ్యరాశి సవరణ చేసిన తర్వాత బోర్ సిద్ధాంతం ఇచ్చిన నిష్పత్తి \(4.00163\) వచ్చి, ఫౌలర్ ప్రయోగం చూపిన \(4.0016\) తో ఆశ్చర్యకరంగా సరిపోయింది.
ఇక్కడ బోర్ సిద్ధాంతం బాల్మర్ సూత్రాన్ని వివరించడం దాటి ఎంతో దూరం వెళ్లింది. అప్పటివరకు హైడ్రోజన్‌కు చెందినవిగా పొరబడిన రేఖలు నిజానికి హీలియానికి చెందినవని లోకానికి వెల్లడించింది; అంతేకాదు, కొలతల్లో కనిపించిన అతి చిన్న తేడాను కూడా పరమాణు కేంద్రకపు కదలికను పరిగణనలోకి తీసుకుని సైద్ధాంతికంగా లెక్కించి చూపింది.
బాల్మర్ సంఖ్యా క్రమం ఇక తెలిసిన రేఖలను సరిపెట్టే సూత్రం మాత్రమే కాదు; పరమాణు నిర్మాణం గురించి కొత్త విషయాన్ని ముందుగానే చెప్పగల సిద్ధాంతంగా మారింది.
అందుకే పైస్ మాటల్లో, పికరింగ్ రేఖల కథ బోర్ బాల్మర్ పనికి శిఖరం.
హైడ్రోజన్‌లో (\(n \to 2\)) బాల్మర్ మార్పులతో, (\(\text{He}^+\)) లో (\(2n \to 4\)) మార్పులు దాదాపు అదే తరంగదైర్ఘ్యాల్లో కనిపిస్తాయి; మధ్యలోని అదనపు (\(\text{He}^+\)) రేఖలే పికరింగ్ శ్రేణిని ప్రత్యేకంగా చూపిస్తాయి.
బోర్ పరమాణువుపై తొలి స్పందనలు
1913లో బోర్ పరమాణు నమూనా వెలువడగానే భౌతికశాస్త్రవేత్తల్లో గొప్ప ఆసక్తినీ, అంతే తీవ్రమైన అనుమానాన్నీ రేపింది. ప్రయోగాలతో అద్భుతంగా సరిపోయిన సంఖ్యలు ఒకవైపు, సంప్రదాయ భౌతికశాస్త్ర నియమాలనే ధిక్కరించిన వింత నిబంధనలు మరోవైపు — ఈ రెంటి మధ్య శాస్త్రవేత్తల స్పందనలు చాలా విభిన్నంగా వచ్చాయి.
బోర్ ఈ సిద్ధాంతంపై రాసిన మొదటి పత్రాన్ని ముద్రణకు ముందే చదివిన రూథర్‌ఫర్డ్‌కు ఒక మౌలిక సందేహం వచ్చింది: ఎలక్ట్రాన్ పైస్థాయి నుంచి కిందికి దూకేటప్పుడు, ఏ పౌనఃపున్యంతో కాంతిని విడుదల చేయాలో దానికి ముందే ఎలా తెలుస్తుంది? అది ఎక్కడ ఆగబోతోందో ముందే నిర్ణయించుకున్నట్లుగా లేదా? అయినా ఆ తాత్విక అభ్యంతరం బోర్ పరిశోధనను ఆపలేదు; రూథర్‌ఫర్డ్ స్వయంగా విమర్శిస్తూనే, ప్రోత్సహించి ఆ పత్ర ప్రచురణకు అండగా నిలిచాడు.
మరికొందరిలో ఈ అసౌకర్యం మరింత ఘాటుగా వ్యక్తమైంది. పాల్ ఎహ్రెన్ఫెస్ట్కు (Paul Ehrenfest) బోర్ పద్ధతి ఒక సమగ్ర సిద్ధాంతంలా కాక, బలవంతంగా అతికించిన రెండు వేర్వేరు ప్రపంచాల్లా కనిపించింది. కక్ష్య పరిమాణాన్ని లెక్కించేందుకు న్యూటన్ యాంత్రికశాస్త్రం, కూలాంబ్ ఆకర్షణ బలాన్ని వాడుతూనే, త్వరణంలో ఉన్న ఎలక్ట్రాన్ శక్తిని వెదజల్లాలన్న మాక్స్వెల్ విద్యుదయస్కాంత నియమాన్ని ఉద్దేశపూర్వకంగా తోసిపుచ్చడం అతనికి మింగుడుపడలేదు. ఇక ఒట్టో స్టెర్న్ (Otto Stern) తర్వాత గుర్తుచేసుకున్నట్లు, అతనూ మాక్స్ ఫాన్ లావె (Max von Laue) ల ఉమ్మడి స్పందన: “బోర్ చెబుతున్న ఈ పిచ్చి ప్రేలాపనలే గనక నిజమైతే, మేము భౌతికశాస్త్రాన్నే వదిలేస్తాం!”
అయితే సిద్ధాంతం చూపిన కొన్ని సంఖ్యా విజయాలను విస్మరించడం కూడా కష్టమే. పరమాణు నమూనాలపై మొదట్లో ఎన్నో సందేహాలున్న ఆర్నాల్డ్ సోమర్ఫెల్డ్ (Arnold Sommerfeld), తెలిసిన రిడ్బర్గ్ స్థిరాంకాన్ని \(h, e, m\) వంటి ప్రకృతి మౌలిక స్థిరాంకాల నుంచే బోర్ సైద్ధాంతికంగా రాబట్టడం చూసి ఆశ్చర్యపోయాడు; కొన్నేళ్లకే ఆ సిద్ధాంతాన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలకు విస్తరించడానికి స్వయంగా పూనుకున్నాడు.
అన్నిటికంటే బలమైన మద్దతు ఐన్‌స్టైన్ నుంచి వచ్చింది. అయనీకృత హీలియం (\(\text{He}^+\)) కేంద్రకపు కదలికను పరిగణనలోకి తీసుకుని, బోర్ లెక్కించిన హైడ్రోజన్, హీలియంల రిడ్బర్గ్ స్థిరాంకాల నిష్పత్తి ప్రయోగ విలువతో ఐదు అంకెల దాకా సరిపోయిందని 1913 సెప్టెంబరులో వియన్నాలో జార్జ్ డి హెవెసీ (George de Hevesy) చెప్పినప్పుడు ఐన్‌స్టైన్ విస్మయం చెందాడు. వెలువడే కాంతి పౌనఃపున్యం ఎలక్ట్రాన్ తిరిగే వేగంపై ఆధారపడదన్న బోర్ ఆలోచన నిజమేనని తేలడంతో, “ఇది అసాధారణ విజయం; బోర్ సిద్ధాంతం కచ్చితంగా సరైనదై ఉండాలి!” అని ప్రశంసించాడు.
స్టెర్న్–లావె “ఇది నిజమైతే భౌతికశాస్త్రమే వదిలేస్తాం” అన్న నిరసనకూ, ఐన్‌స్టైన్ “ఇది నిజమై తీరాలి” అన్న ప్రశంసకూ మధ్యే 1913 నాటి బోర్ పరమాణు వాస్తవికత నిలిచింది. దాని ప్రాథమిక ఊహలు ఎంత అపరిచితంగా అనిపించాయో, దాని గణితపరమైన విజయాలు అంత ఆకట్టుకునేలా ఉన్నాయి. సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్మలేకపోయినా, ఇక దాన్ని పక్కన పెట్టడం ఎవరి వల్లా కాలేదు.
ఫ్రాంక్–హెర్ట్జ్ ప్రయోగం – బోర్‌కు ఎదురుదెబ్బా?
1914లో జేమ్స్ ఫ్రాంక్ (James Franck), గుస్తావ్ హెర్ట్జ్ (Gustav Hertz) పాదరసం ఆవిరిలోకి ఎలక్ట్రాన్లను పంపుతూ వాటి శక్తిని క్రమంగా పెంచారు. తక్కువ శక్తుల దగ్గర ఎలక్ట్రాన్లు పాదరసం పరమాణువులను ఢీకొన్నా దాదాపు శక్తిని కోల్పోకుండా ముందుకు సాగి కలెక్టర్‌ను (collector) చేరాయి; అందువల్ల విద్యుత్ ప్రవాహం పెరిగింది.
కానీ ఎలక్ట్రాన్ల శక్తి సుమారు \(4.9\text{ eV}\) చేరగానే పరిస్థితి ఒక్కసారిగా మారింది. పరమాణువుతో ఢీకొన్న ప్రతి ఎలక్ట్రాన్ దాదాపు \(4.9\text{ eV}\) శక్తిని ఒకేసారి కోల్పోయింది. శక్తిని కోల్పోయిన ఆ మందకొడి ఎలక్ట్రాన్లు కలెక్టర్ ముందున్న చిన్న నిరోధక వోల్టేజ్‌ను దాటలేకపోవడంతో కరెంట్ ఒక్కసారిగా పడిపోయింది. వోల్టేజ్‌ను ఇంకా పెంచితే ప్రవాహం మళ్లీ పెరిగి, మరో \(4.9\text{ V}\) తర్వాత మళ్లీ పడిపోయింది. అంటే పాదరసం పరమాణువు బయటి ఎలక్ట్రాన్ల నుంచి శక్తిని ఏ పరిమాణంలోనైనా స్వీకరించదు; కేవలం \(4.9\text{ eV}\) మోతాదులోనే తీసుకుంటుంది.
కానీ ఫ్రాంక్, హెర్ట్జ్ దీనికి ఇచ్చిన వివరణ బోర్ నమూనాకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. \(4.9\text{ eV}\) విలువ పాదరసం అయనీకరణ శక్తి (ionization energy) — అంటే పరమాణువులోని ఎలక్ట్రాన్‌ను పూర్తిగా బయటకు లాగేయడానికి కావాల్సిన శక్తి — అని వారు భావించారు.
బోర్ సిద్ధాంతం మాత్రం పూర్తిగా వేరే సంఖ్యను చెప్పింది. పాదరసం వర్ణపట శ్రేణి హద్దు (series limit) ఆధారంగా లెక్కిస్తే దాని అయనీకరణ శక్తి సుమారు \(10.4\text{ eV}\) ఉండాలి. ఫ్రాంక్–హెర్ట్జ్ చెప్పినట్లు \(.9\text{ eV}\) నిజంగా అయనీకరణ శక్తే అయితే, అది బోర్ నమూనాకు కోలుకోలేని దెబ్బ అవుతుంది.
కానీ వారి ప్రయోగ పరిశీలనలో ఒక సూక్ష్మమైన పొరపాటు దాగి ఉంది:
ఢీకొన్నప్పుడు \(4.9\text{ eV}\) శక్తిని అందుకున్న పాదరసం పరమాణువు ఉత్తేజితమై, తిరిగి కింది స్థాయికి దిగేటప్పుడు సుమారు \(253.6\text{ nm}\) అతినీలలోహిత (UV) కాంతిని విడుదల చేసింది. ఆ కాంతి కలెక్టర్ ఎలక్ట్రోడ్ మీద పడటంతో, కాంతివిద్యుత్ ప్రభావం వల్ల కలెక్టర్ లోహం నుంచే కొన్ని ఎలక్ట్రాన్లు బయటకు ఎగిరిపోయాయి.
కలెక్టర్ నుంచి ఎలక్ట్రాన్లు బయటకు వెళ్లిపోవడం వల్ల అది ధనావేశాన్ని పొందింది. ఆ సంకేతాన్ని చూసి, వాయువులోనే పరమాణువులు విడిపోయి ధనావేశ అయాన్లు పుట్టాయని (అయనీకరణ జరిగిందని) ఫ్రాంక్, హెర్ట్జ్ పొరబడ్డారు!
1915లో బోర్ వీరికి సరైన భౌతిక అర్థాన్ని సూచించాడు: \(4.9\text{ eV}\) అనేది పాదరసం అయనీకరణ శక్తి ఎంతమాత్రం కాదు; పరమాణువులోని ఎలక్ట్రాన్‌ను భూస్థితి నుంచి మొదటి ఉత్తేజిత స్థితికి తీసుకెళ్లడానికి సరిపోయే క్వాంటం శక్తి మాత్రమే. నిజమైన అయనీకరణ మరింత ఎక్కువ శక్తి దగ్గరే జరగాలని వాదించాడు.
తర్వాత డేవిస్, గౌచర్ చేసిన నిర్దిష్ట ప్రయోగాలు కలెక్టర్‌పై కాంతివిద్యుత్ ప్రభావమే ఆ సంకేతానికి అసలు కారణమని నిరూపించాయి. మరోవైపు, తర్వాతి ప్రయోగాల్లో పాదరసం నిజమైన అయనీకరణ శక్తి సుమారు \(10.3\text{ eV}\) గా తేలింది — బోర్ వర్ణపట శ్రేణి హద్దు నుంచి ఊహించిన విలువకు అది చక్కగా సరిపోయింది.
అలా మొదట బోర్ సిద్ధాంతాన్ని కూల్చేస్తుందేమో అనిపించిన ఫ్రాంక్–హెర్ట్జ్ ప్రయోగమే, పరమాణువులో విడివిడి ఉత్తేజిత శక్తి స్థితులున్నాయన్న సత్యానికి అత్యంత స్పష్టమైన ప్రయోగ సాక్ష్యంగా నిలిచింది.
హైడ్రోజన్‌ను జయించిన బోర్ పరమాణువు
1913లో బోర్ సాధించినది కేవలం ఒక వర్ణపట సమీకరణం మాత్రమే కాదు. ప్లాంక్ దగ్గర క్వాంటం శక్తి మార్పిడిలో కనిపించింది; ఐన్‌స్టైన్ దగ్గర అది కాంతి స్వభావంలోకి ప్రవేశించింది; బోర్ దాన్ని రూథర్‌ఫర్డ్ పరమాణు నిర్మాణంతో విజయవంతంగా అనుసంధానించాడు. పరమాణువులో కొన్ని నిర్దిష్ట స్థితులే సాధ్యమని బోర్ ప్రతిపాదించాడు; హైడ్రోజన్ వర్ణపటం ఆ ఆలోచనకు అసాధారణమైన బలాన్ని ఇచ్చింది. ఒక్క హైడ్రోజన్ అన్వేషణతో మొదలైన ఈ ప్రయత్నం, శతాబ్దాలుగా భౌతికశాస్త్రం నిర్మించుకున్న సంప్రదాయ భావనలనే మౌలికంగా సవాలు చేసింది.
హైడ్రోజన్ పరమాణువు వద్ద ఈ కొత్త సిద్ధాంతం సాధించిన విజయం అసాధారణమైనది.
కానీ ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ మొదటి మూలకం మాత్రమే. హీలియం, లిథియం, కార్బన్, సోడియం — ఇలా కేంద్రక ఆవేశమూ, ఎలక్ట్రాన్ల సంఖ్యా పెరుగుతుంటే మూలకాల స్వభావం ఎందుకు అంతగా మారుతుంది? ఆవర్తన పట్టికలో ఒక్క స్థానం ముందుకు వెళ్తే — కేంద్రకానికి ఒక ప్రోటాన్, పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ అదనమైనా — ఒక మూలకం అత్యంత క్రియాశీలంగానూ, దాని పక్కనే ఉన్నది పూర్తిగా క్రియారహితంగానూ ఎలా మారుతుంది? ఆ ఎలక్ట్రాన్లన్నీ పరమాణువులో ఎలా సర్దుకుంటాయి? ఆ అంతర్గత అమరికకూ ఆవర్తన పట్టికలోని క్రమానికీ సంబంధం ఏమిటి?
హైడ్రోజన్‌ను దాటి బహుళ-ఎలక్ట్రాన్ పరమాణువుల లోకంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ క్వాంటం నియమాలు ఎలాంటి కొత్త రూపాలను తీసుకున్నాయో తర్వాతి వ్యాసంలో చూద్దాం.
మూలాలు:
- Pais, Abraham. Niels Bohr’s Times: In Physics, Philosophy, and Polity. Oxford University Press, 1991.
- J. L. Heilbron. Niels Bohr: A Very Short Introduction. Oxford University Press, 2020.
- Barbara Lovett Cline. Men Who Made a New Physics: Physicists and the Quantum Theory. University of Chicago Press, 1987.


