ఈ ఏడు వేసవిలో దేశం వెళ్ళినప్పుడు మా కుటుంబానికి దగ్గిర స్నేహితులైన రచయిత శ్రీ చతుర్వేదుల లక్ష్మీ నరసింహ మూర్తి గారి దగ్గిర బాహాటంగా అడిగి కొట్టేసిన పుస్తకం – మధుమేహం, సమగ్ర విశ్లేషణ((ఎమెస్కో). మూర్తిగారు వృత్తి రీత్యా కెమికల్ ఇంజినీర్, CSIR, హైదరాబాద్ లో విశ్రాంత శాస్త్రవేత్త. భోజనం చేస్తున్నప్పుడు సోడియం తక్కువైంది పప్పులో అంటే, సోడియం వేరు, ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ వేరు అని విడమర్చి చెప్పగల సమర్థులు. ఈ మూడువందల యాభై పేజీల పుస్తకానికి ముందుమాట ముగ్గురు డాక్టర్లు – సి. గాంధి, డి.వి. మోహన్, మధు చిత్తర్వు – రాయడం, ఈ పుస్తకం మనకి ఎలా పనికొస్తుందో, జబ్బు గురించి అవగాహనకి ఉపయోగమో చెప్పడం పుస్తకానికి హైలైట్.
సౌత్ ఈస్ట్ ఆసియా ఖండం వాసులు అంటే, భారతం, పాకిస్తాన్, శ్రీలంక వగైరా జనాలకి మధుమేహం అంటే చెప్పడం అనవసరం. ప్రపంచంలోంచి బొద్దింకలని నిర్మూలించడం ఎంత కష్టమో మనకి మధుమేహం రాకుండా చూసుకోవడం అంతే కష్టం. వంశపారంపర్యంగా వచ్చే టైప్ – 2 అనేది అతి సాధారణంగా మనకి అంటుకునేది. ఒకప్పుడు ఎలా ఉండేదో తెలియదు కానీ ప్రస్తుతం అనేకానేక కారణాలవల్ల ఈ మధుమేహం అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది దేశంలో. డాక్టర్లు, ప్రపంచ ఆరోగ్య, మరికొన్ని సంస్థ(లు), పెరిగే ఈ కేసులని చూసి నెత్తి కొట్టుకుంటూ చెప్పేది ఒకే ఒక విషయం – మధుమేహం దేశంలో చడీ చప్పుడూ లేకుండా పేలడానికి సిద్ధమౌతున్న ఒక పెద్ద బాంబ్. అయితే మందులు వేసుకుంటే ఇంకేం చేయక్కర్లేదు, మందులన్నీ చవగ్గా, డాక్టర్ కూడా అక్కర్లేకుండా కొనుక్కోవచ్చు అనేవి దేశంలో మనకి తెల్సిన సర్వసాధారణమైన విషయాలు కనక ఎవరు ఎలా గొంతెత్తి అరిచినా ప్రస్తుతానికైతే ఎవరూ పాటించడం మాట అలా ఉంచి, వినడం కూడా లేదు. మరో విషయం ఏమిటంటే మధుమేహం వచ్చాక అది శరీరం మీద కొట్టే అసలు దెబ్బ ఎలా ఉంటుందో అనే కనీస పరిజ్ఞానం ఎవరికీ లేదూ, అఖ్ఖర్లేదు, పట్టించుకోరు ప్రస్తుతానికి. మధుమేహం వస్తే గిస్తే స్వీట్లూ, పళ్ళూ, పంచదార తినడం మానేస్తే చాలు అనుకునేదే ప్రస్తుతానికి ప్రతీ ఒక్కరికీ తెల్సిన మహా మంత్రం. దరిద్రం కొద్దీ మనకి మధుమేహం వచ్చినా, మా తాత తండ్రులకి ఉంది నాకు రాక ఛస్తుందా అనుకునే మెంటాలిటీ కూడా మనదే. అంతే కాని అది రాకుండా ఉండడానికి మనం ఏమి చేయవచ్చు అనే అవగాహన ఉందా అంటే లేదనే చెప్పుకోవాల్సిందే. కనీసం ఏడాదికోసారి ఉచితంగా చేయించుకునే ఫిజికల్ ఎగ్జాం కి కూడా వెళ్తే వెళ్తాం లేకపోతే లేదు, ఏడాదికో సారి ఫ్లూ ఇంజెక్షన్ వేయించుకోకపోయినా ఏమీ ఫర్వాలేదు అనే భ్రమలలో ఉన్న మనకి. రోడ్డుమీద అమ్మేవి, హోటళ్ళళో అమ్మేవి తినవద్దు, వ్యాయామం చేయండి, ఆకు కూరలూ, పళ్ళు తినండి అని ఎంత చెప్పినా ఎవరికీ వినే, అచరించే ఓపిక లేదు. హై స్పీడ్ యుగం బ్రదర్, డోన్ట్ యూ వర్రీ. ఏదైనా జబ్బు గురించి చెప్పేటప్పుడు అదెందుకు వస్తుందో, ఎలా చంపుతుందో అవన్నీ చెప్పాలంటే ఇంగ్లీష్ వాడకుండా చెప్పడం కష్టం. బయట పల్లెటూర్లలో మామూలు జనాలకి అర్ధమయ్యేలా చెప్పడం మరింత కష్టం. మధుమేహం పాంక్రియాస్/క్లోమగ్రంథిని ఎలా దెబ్బతీస్తుంది, అనే విషయాలు విడమర్చి చెప్పాలంటే గంటలకొద్దీ సమయం పడుతుంది. వచ్చిన జబ్బు ఎందుకొచ్చిందో, అది ఎలా దెబ్బతీస్తుందో తెలియకపోతే ఎవరూ కూడా లైఫ్ స్టైల్ మార్చుకోరు. ప్రస్తుతం దేశంలో ఉన్న సగటు మధుమేహ రోగికి ఉన్న HbA1C నెంబర్లు 9.2 లెవెల్లో ఉన్నాయిట (సాధారణం: 5-6 లోపు).
తెలుగువారికి, మధుమేహం గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఒక వరం. మూర్తిగారు అన్నీ కూలంకషంగా చర్చించారు, అసలు మధుమేహం అంటే ఏమిటి అని మొదలుపెట్టి, క్లోమగ్రంథి ఎలా పనిచేస్తుంది, మధుమేహంలో రకాలు, అది మనకి వచ్చాక కలిగే లక్షణాలు, వచ్చినట్టు నిర్ధారించి కనుక్కోవడానికి చేసే పరీక్షలు, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం వచ్చేముందు పూర్వదశ ఎలా ఉంటుంది, మధుమేహం దారిలో పెట్టడానికి లేదా కంట్రోల్ చేయడానికి ఏయే మందులు ఉన్నాయి, అవి ఎవరికి ఎలా పనిచేస్తాయి, ఎవరు వాడకూడదు అనేవన్నీ 35 ఛాప్టర్లుగా విడగొట్టి చెప్పారు. మధుమేహం వస్తే శృంగారం ఎలా అనేది చివర్లో మంచి జోకులు పేల్చుతూ, “తేనె రంగరించి” అంటూ చెప్పారు కూడా. ఈ పుస్తకంలో ఉన్న మంచి విషయం ఏమిటంటే, ప్రతీ చోటా మొగవాళ్ళకి ఇలా అని చెప్పాక స్త్రీల విషయం ఇలా అని కూడా చెప్పారు. అందువల్ల ఇది స్త్రీ పురుషుల ఇద్దరికీ సమానంగా ఉపయోగపడే పుస్తకం. పిల్లలలో మధుమేహం ఎందుకు వస్తుంది, కారణాలు అనేవి మంచి విషయాలు. మధుమేహం వల్ల కంటి ఆరోగ్యం ఎలా దెబ్బ తినవచ్చో అనేది కూడా చదువరులకి ఉపయోగపడుతుంది.
టైప్ 1, టైప్ 2 మధుమేహంలో రకాలు అని తెలుసు మనకి; కానీ ఈ పుస్తకంలో మిగతా సాధారణంగా జనాలకి తెలియని టైప్ 3, 4, 5, 6 అనేవి చర్చించి అవి ఎలా కలుగుతాయో చెప్పడం మంచి విషయం. మధుమేహం తాకడానికి కారకాలు సుమారు 60 దాకా ఉన్నాయిట. మధుమేహం వచ్చాక, లేదా వచ్చినట్టూ తెలియకపోతే మిగతా విషయాల వల్ల కూడా గ్రహించవచ్చు. అవి దంతాల సమస్య, రక్తపోటు, గుండె జబ్బు, యూరిన్ బ్లాడర్ ఇన్ఫెక్షన్, క్షీణించిన లైంగిక వాంఛ వగైరాలు; వీటి గురించి కూడా వివరంగా చెప్పారు. మొత్తానికి మధుమేహం ఒక్క క్షణంలో వచ్చి పడిపోదు, కానీ ముందు కొన్నేళ్ళు వార్నింగ్ లు ఇస్తూ నేను వస్తున్నాను జాగ్రత్త సుమా అంటూ వస్తుంది. ఆ వార్నింగులు ఎలా ఉంటాయి, వాటిని మనం – అందులోనూ తెలుగువాళ్ళమైన మనం తెల్లన్నం రెండు పూట్లా సుష్టుగా తింటాం కాబట్టి – ఎలా పట్టించుకోమూ అనేవన్నీ విశదీకరించారు. అనేక చోట్ల కొన్ని ఈనాడు, మరో పేపర్ లో వేసిన ఆరోగ్యం ఆర్టికల్స్ – డాక్టర్లు చెప్పినవి – యథాతథంగా వేసారు. మన తెలుగువాళ్ళం తినే తిండి కి ఎన్ని కాలోరీలు అనేవి చర్చించడం బాగుంది. అయితే ప్రతీచోటా కిలో కాలరీలు అనడం అనవసరం ఎందుకంటే కాలోరీ అనేది అతి చిన్న యూనిట్ అందువల్ల కిలోకాలరీనే కాలోరీ అంటున్నాం చాలాకాలం నుంచి. మన తెలుగు వంటకాలలో దోశ, ఇడ్లీ, పూరి, పుల్కా, ఊతప్పం, ఇవన్నీ చేసే నూనెలు అన్నింటికీ కాలోరీలు గుణించి చెప్పారు. స్వల్పమార్పులతోనే మనం పూర్వదశ మధుమేహం నుంచి బయటపడవచ్చు కానీ 64 శాతం మందికి ఇది చేతకావడం లేదు. దీనికి మూర్తిగారిచ్చిన చక్కటి చిట్కా – మీరు అన్నం తినండి కానీ “కంచం ప్రిన్సిపుల్” పాటించండి. ఇదే కదా తిండి తగ్గించడానికి, తినడానికి చిన్న ప్లేటూ, పోర్షన్ సైజ్ తక్కువా వాడండి అంటూ చెప్తున్నారు? మరో మంచి విషయం – భోజనం చేసేటప్పుడు కంగారుగా కుక్కేసుకున్నట్టు తినడం కాక ఒక్కో ముద్దా నెమ్మదిగా నముల్తూ మెల్లగా, ఆస్వాదిస్తూ, ప్రశాంతంగా తినండి. జీర్ణ వ్యవస్థని కంగారు పెట్టవద్దు.
మధుమేహం వస్తే మందు కొట్టొచ్చా అనేది ఒక ఛాప్టర్ లో వివరించారు. ఆల్కహాల్ వల్ల వచ్చే గొడవలు, ఏ మందు ఎలా మన ఆరోగ్యం, మధుమేహం మీద పనిచేసి శరీరాన్ని ఎలా తగలబెడుతుంది అనేవి చెప్పడం మందు బాబులకి స్ఫూర్తినిస్తుంది కనీసం తాగుడు తగ్గించడానికి లేదా పూర్తిగా మానడానికి. దీనిక్కూడా ‘గ్లాస్ ప్రిన్సిపుల్స్’ వర్తిస్తాయి తిండికి ‘కంచం ప్రిన్సిపుల్స్’ వర్తించినట్టే. మధుమేహం వచ్చాక వాడే మందులలో ఆయుర్వేదం మందుల సంగతి కూడా వివరంగా చెప్పారు. ఇదే విధంగా మధుమేహం – శృంగారం అనే ఛాప్టర్ లో ‘రామ బాణం’ లాంటి ఆయుర్వేద మందులూ (‘రామబాణం’ ఆయుర్వేద మందు పేరు కాదు, గమనించగలరు మందు పేరు పుస్తకంలో ఇచ్చారు), అవన్నీ ఎక్కడ దొరుకుతాయో (వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం లాంటివి) చెప్పాక “ఈ విషయాలన్నీ రచయిత కి తెల్సినంతలో మాత్రమే, వళ్ళు దగ్గిరపెట్టుకుని డాక్టర్లని సంప్రదించండి” అనే డిస్-క్లైమర్ ఇచ్చారు ముందు జాగ్రత్తగా.
పుస్తకంలో రచయిత చెప్పిన కొన్ని విషయాలు మాత్రం అంత సులభంగా వప్పుకోవడం కష్టం. ఉదాహరణకి ‘కాఫీ టీ లలో పంచదార మానేసి ఏస్పార్టేమ్ వాడవచ్చు దుష్పరిమాణాలు ఉండవు’ అనీ, ‘శరీరానికి BMI మంచి కొలమానికం అనీ, ‘ఛాతీనెప్పి, గుండె పోటు, గుండె వైఫల్యం అనేవి వేరువేరు సమస్యలైనా అన్నింటికీ మూలం’ ఒకటే అనీ చెప్పారు. ఇవి నిజం కాదు. వీటి మీద ఇటీవల రీసెర్చ్ ప్రకారం ఏస్పార్టేమ్ ఒకప్పుడు అనుకున్నంత మంచిది కాదు రోజూ వాడకానికి. శరీరానికి BMI కొలమానం మారాలి అని అమెరికన్ మెడికల్ అసోసియేషన్, హార్ట్ ఫౌండేషన్, వగైరాలు కొంతకాలం నుంచీ మొత్తుకుంటున్నారు. అలాగే గుండె వైఫల్యానికి కారణాలు వేరు, పోటుకి కారణాలు వేరు. అన్ని ఛాతీ నొప్పులూ గుండె పోటుకి దారితీయకపోవచ్చు కూడా. గుండె వైఫల్యానికి కారకాలు కూడా వేరు.
పుస్తకంలో తెలుగువాళ్ళ కోసం చాలాచోట్ల తెలుగుపదాలు వాడారు కానీ కొన్నిచోట్ల ఇంగ్లీష్ అనివార్యం కనక అలాగే ఉంచారు పదాలని. ఎనిమిదో తరగతి చదువున్నవారికైనా ఈ పుస్తకం సులభంగా అర్ధం అవుతుంది. చాలామటుకు అచ్చుతప్పులు లేకుండా ఎమెస్కో వారు ప్రచురించారు దీన్ని 2023 సంవత్సరంలో. వెల 250 రూపాయలు మాత్రమే. పుస్తకం చివర్లో ఇండెక్స్ లేకపోవడం రచయిత తప్పు కాదు కానీ ఎమెస్కో వారి చేతకానితనం, తొందరపాటు అని చెప్పుకోవాల్సిందే. నేను మూర్తిగారితో మాట్లాడినప్పుడు ఆయనకి ఎమెస్కో వారు ఒక్క పైసా ఇవ్వలేదని ఈ పుస్తకం ప్రచురించాక కానీ, దానికి ముందుకానీ అని చెప్పారు. ఇది అత్యంత శోచనీయమైన విషయం. అందులోనూ ఎమెస్కో అంతటి పేరున్న పబ్లిషర్ కి. ఇలా ఎందుకు చేసారో పబ్లిషర్స్ కి మాత్రమే తెలిసిన ‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుక బుర్రలో ఉన్న’ రహస్యం కాబోలు. రచయిత అంత శ్రమకోర్చి రాసిన పుస్తకానికి కనీసం డబ్బులు కానీ రాయల్టీ కానీ ఇవ్వక్కర్లేదని ఎమెస్కో ఎందుకు అనుకున్నారో? రచయిత కష్టానికి ప్రతిఫలం కొన్ని కాపీలు ఆయన మొహాన కొట్టడం కాదని ఎప్పటికి తెలుగు పబ్లిషర్స్ తెలుసుకుంటారో, ఈ దౌర్భాగ్యం ఎంతకాలం సాగుతుందో?
మీ కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఏ దశలో ఉన్నా ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా చదవండి. చదవడమే కాక, డాక్టర్ సలహా తీసుకుని దానితో పాటు ఇందులో విషయాలు కూడా డాక్టరుతో చర్చించి ఆరోగ్యవంతులు అవండి.
మధుమేహం: సమగ్ర విశ్లేషణ (Know Diabetes-No Diabetes-Else beat Diabetes)
రచయిత: చతుర్వేదుల లక్ష్మీ నరసింహమూర్తి, M.Tech (విశ్రాంత శాస్త్రవేత్త, CSIR-IICT, హైదరాబాద్)
వెల : 250 రూపాయలు (నవంబర్ 2023)
ఎమెస్కో బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్, గగన్ మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్-29

