భారతీయ భాషలలోని సాహిత్యానికి మూలకందాలైన రామాయణ మహాభారతేతిహాసాలూ, ఉపనిషత్తులూ, వివిధ శాస్త్రాలూ, దర్శనాలూ అన్నీ తెలుగు సాహిత్యావిర్భావానికి ముందే ఉన్నతస్థితిని అందుకొని ఉన్నాయి. వాటిలో అలంకారశాస్త్రం కూడా ఒకటి, అలంకారశాస్త్రానికి శాస్త్రత్వం ఉన్నదా? లేదా? అన్న చర్చలూ అక్కడక్కడ వినిపించినా, ఇతర వ్యాకరణాది శాస్త్రాల వలె అలంకారశాస్త్రం కూడా విస్తృతంగానే వర్ధిల్లింది, భరతునితో ప్రారంభించి దాదాపు మమ్మటుని దాకా అందరూ నన్నయ్యకన్న ముందువారే, అయితే, అంత విశాలపరిధిలోని అలంకారశాస్త్రంలో తెలుగువారి వరివస్య మనకు కనిపించదు. అసలు లేదో, కనిపించటం లేదో తెలియదు. తెలిసినంత మేర ఏదీ లేదు. తెలుగు సాహిత్యం అవిర్భవించిన తరువాతనే అలంకారశాస్త్ర విషయం మీద తెలుగు పండితులూ, కవులూ దృష్టిని సారించారు. సాహిత్యావిర్భావానికీ అలంకారశాస్త్రావిర్భావానికి కార్యకారణ సంబంధమైతే లేదు. కేవలం కాలపరిగణన మాత్రమే. అలంకార శాస్త్రాన్నే క్వాచిత్కంగా సాహిత్య శాస్త్రమని కూడా వ్యవహరిస్తారు.
సంస్కృతంలోని అలంకారశాస్త్రంలో కావ్యవిషయకంగా కావ్యాంగాలుగానో, కావ్యాత్మలుగానో పరిగణనకు నోచుకున్న సిద్ధాంతాలన్నీ నన్నయకు పూర్వమే రూపుదిద్దుకొన్నవి. అంటే ఆంధ్ర సాహిత్యావిర్భావానికి ముందువే. కావ్యాత్మ పదాన్ని మొదటగా వాడిన ఆలంకారికుడు వామనుడు (రీతిరాత్మా కావ్యస్య), అయితే ప్రాథమికుడైన భరతుడు రసానికీ, భామహుడు అలంకారాలకూ, దండి గుణాలకూ ఆత్మపదాన్ని వాడకపోయినా, తమ తమ సిద్ధాంతాలైన రస-అలంకార-గుణాలకు ఆ స్థానాన్ని ఇచ్చినవారే. వామనుడు ఆత్మపదాన్ని ప్రయోగించియే రీతిని కావ్యాత్మ అన్నాడు. ఆపై ఆనందవర్ధనుడు “కావ్యస్యాత్మా ధ్వనిరితి బుధైః యః సమామ్నాతపూర్వః” అంటూ మొదలుపెట్టి ధ్వనిని, అందునా రసధ్వనిని కావ్యాత్మగా సిద్ధాంతీకరించాడు. ఆ తరువాత మహిమభట్టు ధ్వనిని కాదని అనుమానాన్ని ప్రధానం చేసినా, కుంతకుడు వక్రోక్తిని కావ్యజీవితమన్నా నామ్నీకరణంలో భేదమే తప్ప, రసధ్వనిని వ్యతిరేకించినవారు కారు. మమ్మటుడు రసధ్వనిని రసానుమితి అంటే, కుంతకుడు పద తదేకదేశాదులలో రసానుకూలంగా పాటించవలసిన వక్రతను ప్రతిపాదించినవాడే. క్షేమేంద్రుడు ఔచిత్యమే కావ్యజీవిత మన్నాడు. ఇవన్నీ నన్నయ్యకన్న ముందు ఆవిర్భవించినవే. ఇక మిగిలినది చమత్కార మొక్కటే. అది తెలుగువారికి దక్కింది. ‘చమత్కారచంద్రిక ద్వారా విశ్వేశ్వరుడు దానిని సాధించి మనముందు నిలిపాడు. పరిణామక్రమంలో ప్రకృతవ్యాసంలో మనం అలంకారశాస్త్రానికి తమదైన వరివస్యను అందించిన తెలుగువారి గురించి-తెలుగువారి గ్రంథాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అందుబాటులో వున్న గ్రంధాల ఆధారంగా-
సంస్కృతంలో తెలుగువారి రచనలు
కాకతీయ చక్రవర్తులలో కడపటివాడైన ప్రతాపరుద్రుని ఆస్థాన కవిపండితుడు విద్యానాథుడు, ఆ విద్యానాథుడు ప్రతాపరుద్రదేవుని నాయకునిగా సంభావించి, తదుదాహరణంగా రచించిన అలంకారశాస్త్ర గ్రంథం ‘ప్రతాపరుద్రీయం’ లేదా ‘ప్రతాపరుద్రయశోభూషణం’. అంతవరకు వెలువడిన అలంకారశాస్త్ర గ్రంథాలలో ఆయా లక్షణాలకు ఉదాహరణలుగా చూపించిన శ్లోకాలు వివిధ కావ్యాలలోనివి, వివిధ వ్యక్తుల నుద్దేశించినవి మాత్రమే. గ్రంథకర్త శ్లోకాలు క్యాచిత్కంగా ఉంటే ఉండవచ్చును గానీ దాదాపు అన్నీ ఇతరులవే. విద్యానాథుడు తొలిసారిగా ప్రతాపరుద్రుని నాయకునిగా చేసి, సర్వలక్షణాలకూ ప్రతాపరుద్రపరంగా శ్లోకాలను కూర్చి (తానే రచించి) ప్రతాపరుద్రీయాన్ని పూర్తిచేశాడు.
పుణ్యశ్లోకస్య చరిత ముదాహరణ మర్హతి॥
న కశ్చిత్తాదృశః పూర్వై: ప్రబన్ధాభరణీకృతః॥
(ప్రతాపరుద్రీయం: నాయక-6)
కావ్య-నాయక-నాటక-రస- దోష- గుణ-శబ్దాలంకార-అర్థాలంకార-మిశ్రాలంకార ప్రకరణాల పేరుతో తొమ్మిది ప్రకరణాలలో వున్న అలంకారశాస్త్ర ప్రకరణ గ్రంథమిది. దీనిలో ‘నాటక ప్రకరణం’లో నాటక లక్షణాలతో పాటు ఉదాహరణంగా ఒక నాటకాన్నే వ్రాయటం విశేషం. ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, రూపకం మొదలైన అలంకారాలు పుష్కలంగా ఉండే చక్కని శ్లోకరచన విద్యానాథుని సొంతం. ప్రచురంగా పఠన పాఠనాల్లో ఉన్న అలంకారశాస్త్ర గ్రంథమిది. విశేషించి ఆంధ్రదేశంలో. గ్రంథారంభంలోని వాగ్దేవిని స్తుతించే శ్లోకమే ఈయన కవితాతత్త్వానికి సాక్షిగా నిలుస్తుంది:
విద్యాకైరవకౌముదీం శ్రుతిశిరస్సీమన్తముక్తామణిం
దారాన్ పద్మభువస్త్రీలోకజననీం వన్డే గిరాం దేవతామ్ ।
యత్పాదాబ్జనమస్క్రియాః సుకృతినాం సారస్వతప్రక్రియా-
బీజన్యాసభువో భవన్తి కవితానాట్యైకజీవాతవః ॥
విద్యానాథుని కవితలోని అత్యుక్తులూ, అతిశయోక్తులూ స్వభావోక్తులయితే ఎలా ఉంటుందో అని సంభావించి కథాకల్పన చేసి డా.వి. రాఘవన్ ‘విద్యానాథ విడంబనం’ లేదా ‘ప్రతాపరుద్రవిజయం అనే పేర నాలుగంకాల నాటకాన్ని వ్యంగ్యానుకరణ రూపకంగా (Parody)- రచించి విద్యానాథుని మీద తనకున్న గౌరవాన్ని ప్రకటించాడు.
సింగభూపాలుని ఆస్థానకవి అయిన విశ్వేశ్వరుడు ‘చమత్కారచంద్రిక’ను రచించినాడు. ఈయన అభిప్రాయమే ‘చమత్కారం కావ్యాత్మా’ అని అలంకారశాస్త్ర విమర్శకులను ఆకర్షించింది.
చమత్కారస్తు విదుషా మానన్దపరివాహకృత్ । గుణం రీతిం రసం వృత్తిం పాకం శయ్యామలఙ్కృతిమ్ ॥
సప్తైతాని చమత్కారకారణం బ్రువతే బుధాః ।
-అంటూ ప్రారంభించి విశ్వేశ్వరుడు గుణ-రీతి-రస-వృత్తి-పాక-శయ్యా-అలంకారాలను చమత్కారానికి హేతువులనుగా ప్రకటించాడు. దీనితో గుణ, రీతి, రస, అలంకార సిద్ధాంతాలను ఇతడు చమత్కారాంగాలుగా భావించటం స్పష్టమవుతోంది. వాస్తవానికి అభినవగుప్తుడే అభినవభారతిలో చమత్కార పదాన్ని రస పర్యాయపదమని ప్రకటించాడు. “సకలవిఘ్న వినిర్ముక్తా సంవిత్తిరేవ చమత్కార నిర్వేశరసనాస్వాదన భోగసమాపత్తి లయ విశ్రాంత్యాదిశబ్దారభిధీయతే” అని అభినవభారతి వచనం. ఇతరాలంకారికులు కూడా చమత్కారపదాన్ని ప్రస్తావించినా దానిలోనే గుణరీత్యాదులను అంతర్భవింపజేసి చమత్కారాన్ని మకుటాయమానం చేసిన ఆలంకారికుడు విశ్వేశ్వరుడే.
చమత్కారం, చమత్కారతరం, చమత్కారతమం అని చమత్కారాన్ని మూడుగా విభజించి, ఉత్తరోత్తరం ఉత్మష్టమని ప్రవచించి, రసం చమత్కారాంతర మన్నాడు విశ్వేశ్వరుడు. అంటే వస్తుధ్వని, అలంకార ధ్వని, రసధ్వని అని ధ్వనిని మూడుగా విభజించి రసధ్వనియే ప్రధానమన్న ఆనందవర్ధనుని మార్గాన్నే విశ్వేశ్వరునికీ అనుసరించక తప్పలేదు, చమత్కారం (వస్తువు), చమత్కారతరం (అలంకారం), చమత్కారతమం (రసం) ఈ భేదాలు ధ్వనిభేదాలే, పేరులోనే మార్పు, అయితే, అలంకారశాస్త్రానికి చెందిన అనేక విషయాలలో విశ్వేశ్వరుడు స్వీయాభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించి, విషయవిభాగంలోనూ తనదైన విధానాన్ని పాటించి ‘చమత్కారచంద్రిక’ను అందగింపజేశాడు.
పదమూడవ శతాబ్దానికి చెందిన మన్మసిద్ధి (భక్తిభూమిపతి కుమారుడు) అస్థానంలో వుండిన అమృతానందయోగి అలంకారసంగ్రహ మనే ప్రకరణ గ్రంథాన్ని విరచించాడు. దీనిలో పదకొండు ప్రకరణాలు, వర్ణగణవిచారం, కవిభేదాలు, నాయికా నాయక భేదాలు, రసం, వృత్తి, రీతి, గుణదోషాలు, అలంకారాలు, నాటకలక్షణం. దశరూపకాలు, ఉపరూపకాలు, నాట్యాలంకారాలు, బాటు ప్రబంధాలు మొదలుగా గల అలంకారశాస్త్ర విషయాలు అనేకం ఈ గ్రంథంలో ప్రస్తావింపబడ్డాయి.
ఆత్మనో మనసా యోగే మనసస్విన్ద్రియైస్సహ
ఇన్ద్రియాణాం తదర్థై రితి జ్ఞానోదయక్రమః॥
-అంటూ అమృతానందయోగి తార్కిక ప్రత్యక్షాన్ని కూడా దీనిలో ప్రస్తావిస్తారు. పరిచ్ఛేదప్రారంభంలో,
పదునాల్గవ శతాబ్దిలో రాచకొండను రాజధానిగా చేసికొని తెలుగు నేల నేలిన సింగభూపాలుడు మహాకవి, గొప్ప పండితుడు. ఈయన అనపోతారెడ్డి కుమారుడు, అగ్రగణ్యులైన రాజకవులలో ఈయనొకరు.
దానేన కర్ణో దయయా దిలీపో
నయేన కావ్యో, వినయేన రామః ।
యది ప్రసిద్ధిం దధతా మమీభిః
శ్రీసింగభూపో నిఖిలైః ప్రసిద్ధిః ॥
‘దానంతో కర్ణుడు, దయతో దిలీపుడు, నీతితో శుక్రుడు, వినీతితో రాముడు ప్రసిద్ధులైతే, శ్రీ సింగభూపాలుడు ఈ (సకల) గుణాలతో ప్రసిద్ధుడు’ అని ఖ్యాతి గడించినవాడు సింగభూపాలుడు. సర్వజ్ఞుడని ప్రసిద్ధికి ఎక్కినవాడు.
సర్వజ్ఞ నామధేయము
శర్వునికే రామసింగ భూపాలునికే
యుర్విం జెల్లును…
అని శ్రీనాథుని పొగడ్తలను పొందినవాడు. సింగభూపాలుని అలంకారశాస్త్ర గ్రంథం ‘రసార్ణవ సుధాకరం’. ఇది రసార్ణవ సుధాకరం కాబట్టి నిర్వహింపబడిన విషయాలన్నీ రసానికి సంబంధించినవే. మూడు విలాసాలు (ఉల్లాసాలు) గల ఈ గ్రంథంలో మొదటి విలాసం- రంజకోల్లాసం’లో నాయికానాయక లక్షణభేద విభాగాదులైన రసాలంబనాలను గురించి వివరించాడు. ద్వితీయ విలాసం- ‘రసికోల్లాసం’లో- రస, రసభేద, రసవిరోధ, రసాభాసాది విశేషాలు ప్రస్తుతాలు, మూడవ విలాసం ‘భావకోల్లాసం’లో నాటక, నాటక (రూపక) భేదాలు విషయాలు. మొత్తం మీద గ్రంథమంతా రసనిర్భరమే.
సింగభూపాలుని ఆలోచన ఆదర్శప్రాయమైనది. ఆయా విషయాలపై చర్చించే సమయంలో తన గంభీర దృష్టి స్పష్టమవుతుంది. రసాభాస విషయంలో ఆలంకారికుల భావాలను చాలామటుకు వ్యతిరేకించినవాడు సింగభూపాలుడు. స్త్రీకి అనేక పురుషులపై అనురాగం రసాభాసమని ప్రాచీనుల వక్కణ. దానిని పురుషులకూ వర్తింపజేసినవాడతడు. వేశ్యను ప్రకరణంలో నాయికగా అంగీకరించి కూడా లాక్షణికులు వేశ్యానురాగాన్ని వ్యతిరేకించారు. కానీ సింగభూపాలుడు సామాన్యను (వేశ్యను) కూడా రక్త, అరక్త అని రెండు విధాలుగా విభజించి చూపాడు. వాదనలను ప్రతిపాదించేటప్పుడు సింగభూపాలుని నిశిత పరిశీలనాదృష్టి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
పెదకోమటి వేమారెడ్డి కొండవీడును రాజధానిగా చేసికొని తెలుగు నేలను పరిపాలించిన రెడ్డిరాజులలో అన్యతముడు, పదిహేనవ శతాబ్ది ప్రారంభం ఇతని కాలం, ‘సాహిత్య చింతామణి’ అలంకారశాస్త్రానికి సంబంధించిన అద్భుత గ్రంథం.
‘సాహిత్య చింతామణి’లో పదమూడు ప్రకరణాలు ఉంటాయి. ధ్వని-శబ్దార్థ-ధ్వనిభేద-వివేక-గుణీభూత వ్యంగ్య నిరూపణ-దోషవివేక-గుణవివేక-శబ్దాలంకార నిర్ణయ-అర్థాలంకార నిర్ణయ-నేతృనిరూపణ-వృత్తినిరూపణ-వస్తు నిరూపణ-రూపకనిరూపణ-శ్రవ్యకావ్యనిరూపణ ప్రకరణాలు.
భరతుడు “రసానాధర్వణాదపి” అని అథర్వవేదంనుండి బ్రహ్మ రసాలను స్వీకరించాడు అని చెప్పాడు. అయితే, పెదకోమటి వేమారెడ్డి సామవేదం నుండి శృంగారం, ఋగ్వేదం నుండి వీరం, అథర్వవేదం నుండి రౌద్రం, యజుర్వేదం నుండి బీభత్సం గ్రహింపబడినట్లు వివరించాడు. కావ్యావతారికలో తెలుగు కవులకు అభ్యాసమైన పూర్వకవిస్తుతి, కుకవినిందలను తన గ్రంథంలో పాక్షికవిధిగా నిబంధించి చూపాడు పెదకోమటి వేమారెడ్డి:
మహాకవీనా మాద్యానాం ప్రశంసా చాత్మనస్తథా ।
ప్రతిపాద్యా ప్రతిజ్ఞా చ కుకవీనాం చ దూషణమ్ ॥
వారణాసి ధర్మసూరి పదిహేనవ శతాబ్ది పూర్వభాగంలో ‘సాహిత్యరత్నాకర’మను అలంకారశాస్త్ర గ్రంథాన్ని విరచించారు. అనేక కృతులతో పాటు. బ్రహ్మసూత్ర శాంకరభాష్యానికి ‘రత్నప్రభ’ పేర వ్యాఖ్యానాన్ని కూడా ధర్మసూరి రచించాడు. అయితే, అప్పటికి ఆయన సన్యసించాడు.
‘సాహిత్యరత్నాకరం’లో పది తరంగాలు-పరిచ్ఛేదాలు ఉన్నాయి. గ్రంథారంభ సమర్థనం, అభిధ, లక్షణ, వ్యంజన, గుణం, శబ్దాలంకారం, అర్థాలంకారం, దోషం, ధ్వని, రసం-ఇవి తరంగాల పేర్లు. మొదటి తరంగంలోనే వేదాలలోనే గుణారసాలంకారాదులు సూచింపబడ్డాయని సూచించే ప్రయత్నం మొట్టమొదటగా ‘సాహిత్యరత్నాకరం’లోనే కనిపిస్తుంది.
తెలుగులో ‘కావ్యాలంకార సంగ్రహ’మని నామాంతరంతో ఒక ‘నరసభూపాలీయ’ముంది. అదే పేరుతో – ‘నరసభూపాలీయం’ – ఒక అలంకార శాస్త్రగ్రంథం సంస్కృతంలో ఉంది. సంస్కృతాంధ్ర నరసభూపాలీయ గ్రంథాలకు కృతిభర్తలు నరసభూపాలులే. ఇద్దరూ పెదతల్లి, పినతల్లి పిల్లలూ, సమకాలికులూ, అందువల్ల ఏది ముందో, ఏది తదుపరో తెలియటం కష్టంగా ఉంటుంది.
మానవల్లి రామకృష్ణ కవి దీనిని గురించిన విశేషాలు బయటకు తెచ్చారు. ఇది ఏడు ఉల్లాసాల గ్రంథం. చివరిదైన అలంకార ప్రకరణం అలభ్యం. విద్యానాథుని ప్రతాపరుద్రీయాన్ని అనుసరించియే ఈ నరసభూపాలీయ రచన కనిపిస్తుంది.
షాజహాన్ చక్రవర్తి ద్వారా ‘పండితరాజ’ బిరుదాన్ని పొందిన జగన్నాథుడు 17 వ శతాబ్దికి చెందినవాడు. ఆంధ్రుడు ఢిల్లీవరకు తన పేరుప్రఖ్యాతులను వ్యాపింపజేసుకొనగలిగిన గొప్ప పండితకవి, కవిపండితుడు, అనేక కృతులతో పాటు “రసగంగాధర’మన్న అలంకారశాస్త్ర గ్రంథాన్ని రచించి అలంకారశాస్త్రులలో పేరెన్నిక గన్నవాడు.
‘రసగంగాధరం’ అలంకారశాస్త్ర గ్రంథాలలో ఒక ప్రామాణిక గ్రంథంగా కీర్తిని పొందింది. విద్యానాథుని ‘ప్రతాపరుద్రీయం వలె పఠనపాఠనాలకూ నోచుకొన్నది. జగన్నాథుని పద్యాలలోనూ, గద్యాలలోనూ కూడా ప్రౌఢసరసశైలి మనస్సులను ఆకట్టుకొంటుంది. గద్యకావ్యశైలిలాగా సాధారణ వచనం కూడా స్పష్టంగా, సుందరంగా కనిపిస్తుంది.
నిర్మాయ నూతన ముదాహరణానురూపం
కావ్యం మయాత్ర నిహితం న పరస్య కించిత్ ।
కిం సేవ్యతే సుమనసాం మనసాపి గంధః
కస్తూరికాజననశక్తిభృతా మృగేణ ॥
అంటూ ఉదాహరణానురూపంగా తానే పద్యాలను రచించి, లక్షణ సమన్వయం చేస్తూ ‘కస్తూరిపిల్లి’ అన్న ఖ్యాతిని పొందాడు జగన్నాథుడు, ఆయా సందర్భాలలో లక్షణ పరిష్కరణలను నిర్దుష్టంగా, నిర్దిష్టంగా చేస్తూ తనదైన వరివస్యను అలంకారశాస్త్రానికి అందించినవాడు. ఇతరు లెందరో ఎన్ని పరిష్కారాలను సూచించినా, అవి తిమింగలాలు సముద్రాన్ని కలవర పరచటం వంటివనీ, తన పరిష్కారాలు మాత్రం మందరపర్వతం సముద్రాన్ని తరచటం వంటిదనీ తానే ప్రకటించాడు (పరిష్కుర్వన్తస్త్యర్థాన్…. ఇత్యాది శ్లోకం అవతారికలో). అంతటి ఆత్మవిశ్వాసం ఆయనది. ఒక ఉదాహరణను చూద్దాం:
శబ్దవృత్తులలో లక్షణావృత్తి ఒకటి, అభిధావృత్తి (శక్తి) కుదరనిచోట లక్షణ ప్రవర్తిస్తుందని ఆలంకారికమైన పరిపాటి. మమ్మటుడు ‘ముఖ్యార్థబాధే తద్యోగే రూఢితో ప్రయోజనాత్’ అని లక్షణాకారణాన్ని నిర్వచించాడు.
- ముఖ్యార్థబాధ
- ముఖ్యార్ధ సంబంధం
- రూఢి లేక ప్రయోజనం
ఈ మూడూ లక్షణాబీజమని స్పష్టపరిచాడు. దాదాపు అలంకారికులు అందరిదీ అదే మాట. కానీ జగన్నాథుడు ముఖ్యార్థబాధను సవరించి తాత్పర్యబాధను ముందుకు తెచ్చి “తాత్పర్యానుపపత్తిరేవ లక్షణాబీజమ్” అని పరిష్కరించాడు. ముఖ్యార్ధబాధ లేకపోయినా తాత్పర్యార్థబాధ ఉంటే లక్షణ అవసరమవుతుందని పరిష్కారం.
ఒడియాలు ఎండబెట్టి “కాకులు రాకుండా చూడండి” అని అమ్మ ఆదేశించిన దనుకుందాం. కాకుల నుండి ఒడియాలను కాపాడాలని ముఖ్యార్థం. కాబట్టి కాకులు వస్తే తోలుతారు. ముఖ్యార్థానికి బాధలేదు. ఒకవేళ మరే పక్షులైనా లేదా ఏ కుక్కా అయినా వస్తే ఆ పిల్లలు ఏం చేయాలి? కుదిరిన ముఖ్యార్థంలో ఇతర పక్షులు లేవు గదా! కాబట్టి తాము వాటిని తోలవలసిన అవసరం లేదు గదా! అంటే కుదరదు. తోలవలసినదే. ఎందుకంటే ‘కాకులు రాకుండా’ అంటే కాక పదం ఔపచారికం. కాకుల వలె ఒడియాలను పాడు చేసేవి ఏవైనా రాకుండా చూడాలన్నది అక్కడ తాత్పర్యం. కాబట్టి ముఖ్యార్థబాధ లేకపోయినా తాత్పర్యబాధ ఉంటే లక్షణ ప్రవర్తిస్తుందని పరిష్కారం, ఇలాగా చాలా సందర్భాలలో, రసాభాసాన్ని ‘అనుచిత విభావాలమ్బనత్వమేవ రసాభాసత్వ’మని మధ్యకాలీనులైన ఆలంకారికుల మార్గంలో రసాభాస లక్షణాన్ని పరిష్కరించాడు. అయితే, ఆ లక్షణానికి ఇంకా మెరుగులు పెట్టవలసిన అవసరమున్నదనుకోండి.
రెండు అననాలుగా ఈ గ్రంథాన్ని విభజించాడు జగన్నాథుడు. ప్రథమాననంలో కావ్యలక్షణ, కావ్యహేతు, కావ్యభేద, రసలక్షణ, రసవిషయంలోని వివిధ మత, స్థాయి, రసధ్వనులను పరిష్కరించాడు తన ఉదాహరణలతో. ద్వితీయాననంలో శబ్దశక్తి, అర్థశక్తి, ఉభయశక్తి మూలధ్వనులను (సంలక్ష్యక్రమ ధ్వనులను), అభిధాలక్షణాలను సోదాహరణంగా నిర్వచించి అపై 70 అలంకారాలను సలక్షణంగా నిరూపించాడు.
గ్రంథ రచనలో అద్యంతమూ పరాభిప్రాయ ఖండనమూ, స్వీయాభిప్రాయ ప్రకటనమూ రెండూ మనస్సును కట్టి పడేసేటట్లు ఉంటాయి.
‘శృంగారమంజరి’ తెలుగువారి మరొక కృతి బడే సాహెబ్ అని నామాంతరం గల హజరత్ సయ్యద్ అక్బర్షా హుసేని రచించినదీ అలంకారశాస్త్ర కృతి. పదిహేడవ శతాబ్దికి చెందిన ఈయన హైద్రాబాద్ నివాసి.
గురుం గణపతిం దుర్గాం వటుకం శివమచ్యుతమ్।
బ్రహ్మాణం గిరిజాం లక్ష్మీం వాణీం వన్దే విభూతయే॥
ఇది ‘శృంగారమంజరి’ లోని ఆదిమ శ్లోకం. రసానికి ప్రధానంగా శృంగారానికి ఆలంబనభూతులైన నాయికానాయకుల స్వరూప నిరూపణం ఇందులో ప్రధానాంశం. స్వతంత్రమైన ఆలోచనలు ఈ ‘శృంగారమంజరి’కి వన్నె తెచ్చాయి. “ఏవం విధానరాగోదయే దైవయోగ ఏవ కారణం. న సౌందర్యాదిగుణా:” అంటూ అనురాగోదయంలో సౌందర్యాదిగుణాలకన్న దైవయోగానికే కారణత్వాన్ని ప్రకటించిన ఆలంకారికుడు అక్బర్షా.
ఈ ‘శృంగారమంజరి’లోని అవతారికలోని వచనాలను బట్టి ఈ రచయిత ‘శృంగారమంజరి’ని మొదట తెలుగులోనే వ్రాశాడనీ, దాని అనువాదమే ‘సంస్కృత శృంగారమంజరి’ అని తెలుస్తోంది. కానీ, ఆ తెలుగు శృంగారమంజరి ఇంతవరకు. లభింపలేదు.
అణివిళ్ళ వేంకటశాస్త్రి రచించిన మరొక అలంకారశాస్త్ర గ్రంధం ‘అప్పారాయ యశశ్చంద్రోదయం. 18వ శతాబ్దానికి చెందిన ఈ కవి నూజివీడు నరసప్పారావుగారికి అంకితంగా ఈ ‘అప్పారాయ యశశ్చంద్రోదయా’న్ని రచించాడు. ‘ప్రతాపరుద్రయశోభూషణం’ వంటిదే ఇది. మేకా నరసింహ అప్పారావు నూజివీడు ప్రభువులలో ప్రసిద్ధులు, తదంకితమైనదీ గ్రంథం.
దీనిలోని ప్రకరణాలు పదహారు, చంద్రోదయం కాబట్టి కళల సంఖ్యను పాటించాడు. గ్రంథారంభసమర్ధనం, వర్ణగణవివేచనం, నాయక నిరూపణం, అభిధ, లక్షణ, వ్యంజన, దోష, గుణ, శబ్దాలంకార, అర్థాలంకార, ఉత్తమకావ్య, మధ్యమకావ్య, అధమకావ్య, వృత్యాది, శ్రవ్యకావ్య, దృశ్యకావ్య నిరూపణలే ఈ ప్రకరణాలు.
నాయక వర్ణనలో ‘కాదంబరి’లో వలె వచనాన్ని కూడా రచించాడు కవి ఈ గ్రంథంలో, ప్రతి ప్రకరణం చివరా ఒకే శ్లోకముంటుంది ఈ గ్రంథంలో.
కాళిదాస కృతులకు వ్యాఖ్యలు రచించిన మల్లినాథసూరి, ప్రతావరుద్రీయానికి ‘రత్నాపణ’ మను పేర వ్యాఖ్య వ్రాసిన కుమారస్వామి సోమపీథి, ‘సంగీతరత్నాకరా’నికి వ్యాఖ్య వ్రాసిన కల్లినాథుడు, కావ్యప్రకాశగ్రంథానికి ‘బుధజనమనోరంజని’ వ్యాఖ్యను వెలయించిన మల్లాది లక్ష్మణశాస్త్రి, ధర్మసూరి విరచితమైన సాహిత్యరత్నాకరానికి ఆయనే (మల్లాది లక్ష్మణశాస్త్రి) వ్రాసిన మందర వ్యాఖ్య, చర్ల వెంకటసూరి సాహిత్యరత్నాకరానికి రచించిన నౌకావ్యాఖ్యా – ఈ పండితులందరూ, ఈ గ్రంథాలన్నీ అలంకారశాస్త్రానికి ఆంధ్రులు అందించిన వరివస్యలో భాగాలే.
తెలుగువారి లక్షణ గ్రంథాలు తెలుగులో
తెలుగులో నన్నయ రచనగా భావింపబడే ‘ఆంధ్రశబ్ద చింతామణి’, దానికి ఎలకూచి బాలసరస్వతి రచించిన ‘బాలసరస్వతీయ’ వ్యాఖ్య, ఆంధ్రశబ్ద చింతామణికే అహోబలుడు రచించిన ‘కవిశిరోభూషణ’మను పేర వెలసిన విస్తృత వ్యాఖ్య – ఇవన్నీ అలంకారశాస్త్ర స్పర్శ గలవే, అప్పకవి వ్రాసిన ‘అప్పకవీయం’ కొన్ని విషయాలలో నిర్హేతుకవ్యాఖ్యలు చేసినా అలంకార శాస్త్రాన్ని, ఛందోవిశేషాలనూ ప్రస్తుతించేదే.
తెలుగువారు తెలుగులో సంస్కృత గ్రంథాలను అనుకరిస్తూ కూడా వ్రాసిన లక్షణ గ్రంథాలలో మనకు లభిస్తున్నవాటిలో విన్నకోట పెద్దన రచించిన ‘కావ్యాలంకార చూడామణి’ యొకటి. ఈ విధమైన లక్షణ గ్రంథాలలో ఇదే మొదటిది. ‘పెద్దిరాజు అలంకార’ మని కూడా ఈ గ్రంథానికి వ్యవహారనామం. ఏడు. ఉల్లాసాల గ్రంథమిది. ప్రథమ ద్వితీయోల్లాసాలలో భావరసాలను గురించీ, తృతీయంలో నాయికానాయకులను గురించీ, చతుర్ధంలో కావ్యస్వరూప భేదాలను. గురించీ, పంచమంలో అర్థాలంకారాలను గురించీ, షష్టోల్లాసంలో శబ్దాలంకారాల గురించీ, గుణదోషాల గురించీ, సప్తమోల్లాసంలో ఛందస్సు గురించీ విస్తృతంగా చెప్పిన గ్రంథం కావ్యాలంకార చూడామణి’. కృతిభర్త అయిన చాళుక్య విశ్వభూపుని నాయకుని చేసి సర్వోదాహరణపద్యాలనూ రచించినాడు విన్నకోట పెద్దన విద్యానాథుని ప్రతాపరుద్రయశోభూషణం’లాగా.
అలంకారశాస్త్ర గ్రంథ రచయితలు తెలుగులో వ్రాయటమే కానీ ఆలోచనా, అనుసృజన అంతా సంస్కృత గ్రంథాలలోని లక్షణాల కనుగుణంగానే. సంస్కృతంలో అనుష్టుప్ ఛందస్సు లక్షణ నిర్మాణానికి చక్కగా సహకరిస్తుంది. తెలుగు విషయానికి వస్తే ఉపజాతులు అందుకుపకరిస్తాయి. తేటగీతి, కందం, ఆటవెలది ఛందస్సులు అందువలననే లక్షణగ్రంథ రచయితలకు ప్రథమోపాదేయాలయ్యాయి.
బహిరర్థాలంబనమై
విహరించు మనోవికార విలసితము సుమీ
విహిత మగు భావ మన; నది
మహి విజ్ఞానంబునా సుమతులం బరగున్.
ఇలా భావలక్షణం చెప్పటంతో ‘కావ్యాలంకార చూడామణి’ మొదలవుతుంది. ‘నిర్వికారాత్మకే చిత్తే భావః ప్రథమ విక్రియా’ అన్న భావలక్షణానికి ఇది ఆంధ్రీకృతి. బహిరర్థాలంబనమై అన్నది ఆ లక్షణానికి అదనపు జోడింపు. ఉదాహరణ పద్యాలలో ఇతరచ్ఛందస్సులు వాడినా, లక్షణపద్యాలలో కందాన్నే విరివిగా వాడాడు విన్నకోట పెద్దన.
అలంకారాలను నిరూపించే క్రమంలో విన్నకోట పెద్దన రసవదలంకారాన్ని విలక్షణంగా నిర్వహించాడు. రసం మరొక రసానికో భావానికో అంగమైతే, అది రనవదలంకారం, భావం మరొక రసానికో భావానికో అంగమైతే అది ప్రేయోలంకారం. ఇది అనాదిగా ఉద్భటాదులతో ప్రారంభించి అప్పయ్యదీక్షితుల వరకు అలంకారికులు పాటించిన లక్షణం. అయితే విన్నకోట పెద్దన –
ప్రేయోలంకారంబు వి-
ధేయంబగుఁ, బ్రియతరాభిధేయోక్తులచే
నౌయగ్గు లేక కర్ణర-
సాయనమై యుండెనేని సత్కవికృతులన్.అసితం బగు రత్నాది
ప్రసరణములం దేజరిల్లి ప్రథమరసాదుల్
పొసగుబడు నెచట నది వో
రసనదలంకార మనగ రసికుల కెక్కున్.
ప్రేయోలంకార లక్షణం సుస్పష్టం, కానీ, పూర్వాలంకారికలక్షణ విరుద్ధం. ఇక రసవదలంకార లక్షణం అస్పష్టం, రసం అసంలక్ష్యక్రమమై ధ్వనించటాన్నే రసవదలంకారంగా భావించాడేమో అనిపిస్తోంది. ఇది కూడా ప్రాచీన లక్షణభిన్నమే… ఉదాహరణాలు చూసినా రసభావాల సువ్యక్తతనే రసవత్, ప్రేయోలంకారాలుగా తాను భావించినట్లనిపిస్తుంది.
శృంగారరసవదలంకారం –
ఇల నలరాజు రూపునకు నెక్కువ యయ్యెడు విశ్వమేదినీ
లలనుని రూపయౌవనవిలాసములం జెలిమాటు చేరి య-
గ్గలికపు సిగ్గు వేడుకల క్రందున కడ్డపడంగ నిమ్ములన్
మెలఁతుక నాలుఁజూపులకు మేపులు వెట్టెడుఁ జూచితే సఖీ!
తెలుగులో ‘అనంతుడు’ ఒక ఛందశ్శాస్త్ర గ్రంథాన్ని, ఒక రసశాస్త్ర గ్రంథాన్నీ రచించాడు. ఇతర లాక్షణికులు ప్రతాపరుద్రీయం’ ధోరణిలో సంకీర్ణ గ్రంథాలు రచించినవారే తెలుగులో, అనంతుడు మాత్రం ‘ఛందోదర్పణం’ పేర ఛందశ్శాస్త్రగ్రంథాన్నీ, రసాభరణం పేర కేవలం రసవిషయక గ్రంథాన్ని రచించాడు.
నవరసాలనూ, వాటి స్థాయిభావాలనూ ఉటంకించటంతో ‘రసాభరణం’ ప్రారంభమవుతుంది. స్థాయిభావాలు రసాలకు మూలమని ఇతని వక్కణ.
ఇట్లు నవరసములకు నూహింపఁగలిగి
యంచితస్థాయిభావంబు అతిశయిల్లుఁ
బ్రసవఫలరాసులకుఁ బాదపంబులట్లు.
పూలకూ, పండ్లకూ చెట్లు మూలమైనట్లు రసాలకు స్థాయిభావాలు మూలమని భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పిన భావాన్ని కుదించి చెప్పాడు అనంతుడు. ఆలంబన విభాగం రససమవాయ కారణమనీ, ఉద్దీపన విభాగం నిమిత్త కారణమనీ తార్కిక దృష్టితో వివరించాడు. రసవిషయకమైన సమస్తవిషయాలనూ తనదైన భావుకతతోనూ మేళవించి సమగ్రసుందరంగా తీర్చిదిద్దబడినది ‘రసాభరణం’.
అలంకార శాస్త్రగ్రంథాలలో మరొక విశిష్ట గ్రంథం ‘నరసభూపాలీయం’ లేదా ‘కావ్యాలంకార సంగ్రహం’. రచయిత భట్టుమూర్తి, రామరాజభూషణుడుగా ఈ కవికే. లాక్షణికునికే మరొకపేరు. ‘వసుచరిత్ర రచనతో ఆంధ్రసాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవిలాక్షణికు డీయన.
‘నరసభూపాలీయం’ అయిదు అశ్వాసాల గ్రంథం, ప్రథమాశ్వాసం కృత్యవతారిక, నాయకగుణ, నాయక స్వరూప వర్ణనతో ముగుస్తుంది. ద్వితీయాశ్వాసంలో నాయికానాయక లక్షణభేదాలూ, కావ్యస్వరూపం, శబ్దవృత్తులు, కావ్యభేదాలు వివరింపబడ్డాయి. తృతీయాశ్వాసం రసస్వరూపం, చతుర్థాశ్వాసం గుణదోషవర్ణనాత్మకం. పంచమాశ్వాసంలో అలంకారాలు లక్షణోదాహరణ నిరూపణ.
రామరాజభూషణుడు. పద్యవిద్యలో చేయితిరిగినవాడు. ప్రౌఢకవి. ఆ ప్రతిభాసంపద ‘కావ్యాలంకార సంగ్రహం’లో స్ఫుటంగా కనిపిస్తుంది. అక్కడ కూడ అదే కొంత అసౌకర్యంగా కూడా కనిపిస్తుంది. విన్నకోట పెద్దన ధీరోదాత్త, ధీరోద్ధత, ధీరశాంత, ధీరలలితులు లక్షణాలను నాలుగు పద్యాలలో వివరించాడు. కానీ, భట్టుమూర్తి ఒకే పద్యంలో బంధించాడు. చూడండి:
ధీరాత్మం డవికత్థనుండు కరుణోద్వేలుండు సత్త్వాఢ్యుఁ డా
ధీరోదాత్తుఁడు; శౌర్యదర్పకుహనాధీరుండు ధీరోద్దతుం-
డారూఢిన్ సముధీప్రసన్నుఁడు ద్విజుండౌ ధీరశాంతుండు; వృ-
త్రారిం బోలిన భోగి ధీరలలితుండై పొల్చు నిశ్చింతతన్.
ఈ ధారాధోరణులు క్వాచిత్కంగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి కూడా. రసస్వరూపాన్ని వివరిస్తూ:
పులకండంబులు గలిపిన
నలువగు సలిలము రసాయనంబగు పగిదిన్
లలితవిభావాదులచే
నలఘుతరస్థాయీభావ మమరున్ రసమై.
ఈ నిర్వచనం మనోహరమే, కానీ స్థాయిపదానికి ‘అలఘుతర’ విశేషణం అపార్థాలకు దారితీస్తుంది. దండి రసస్వరూపాన్ని వివరిస్తూ “రూపబాహుళ్యయోగేన రతిః శృంగారతాం గత”, “అధిరుహ్య పదాం కోటిం క్రోధో రౌద్రాత్మనా గతః” అని శృంగార, రౌద్రాలను నిర్వచించాడు. ఈ అలఘుతరవిశేషణం అక్కడ తాకుతుంది. కానీ, వాస్తవానికి అది భట్టుమూర్తి వివక్షించిన భావం కాదు.
ఇటువంటి స్వల్పసన్నివేశాలున్నా, తన శైలితో పాఠకులను ఆకట్టుకొన్న గ్రంథం- ఈ ‘నరసభూపాలీయం’, ఇది పఠనపాఠనాదుల్లో ప్రసిద్ధం కూడా.
సంస్కృతంలో భానుదత్తుడు ‘రసమంజరి’ అనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని రసప్రధానంగా రచించాడు, రసమంజరికి తెలుగులో కొన్ని అనువాదాలు వచ్చాయి. గుడిపాటి కోదండపతి ‘రసమంజరి’ని అనువదించాడు. అది ముద్రితమే, కానీ లభించటం లేదు. వాటిలో ఒకటి శృంగార రసాలవాలము, రచయిత వెణుతుర్ల వడ్డికవి. 17 వ శతాబ్ది ప్రారంభంవాడని విమర్శకుల తలంపు.
ఇది మూడాశ్వాసాల గ్రంథం. ప్రథమాశ్వాసంలో రసస్వరూపం, ద్వితీయాశ్వాసంలో నాయికాలక్షణ భేదాలూ, తృతీయాశ్వాసంలో నాయకలక్షణ భేదాలు వివరింపబడ్డాయి.
నవరసాలలోనూ శృంగారం శ్రేష్ఠమని వడ్డికవి నిర్ణయం. కావ్యాత్మ రసమే అని సుస్పష్టంగా ప్రకటించాడీ కవి.
ధర శబ్దార్ణాత్మకమై
పరగెడు కావ్యమున జీవభావస్ఫురణన్
గరమొప్పు రసము తారటు-
లెరిగి నిరూపింపఁ గవుల కష్టము వానిన్.
నాయికా స్వరూపభేదాలను నాయకభేదాల కన్న ముందు చెప్పటానికి గల కారణాన్ని తానౌక సీసంలో వివరించాడు ఈ కవి. చూడండి:
అలంబన విభావనారూఢి శృంగార
మునకు స్త్రీపురుషులు ముఖ్యకార-
ణము, వేట మున్నుగా నాయికాఖ్యానంబు
సేయక శృంగార చేష్టలు పదు-
నెనిమిది గలది నాయిక గావున రహస్య-
సౌఖ్యకాలమున నే సార్వభౌముఁ-
డైన పదానతుఁడై వేడికొనఁజేయు
చెల్వంబు శోభిల్లి శ్రేష్ఠ యగుచుఁగోపమునఁబాయ వేడినఁగూర్మి డాయ
మోహనోపాయ యగు గాన మొదట నిచట
నాయికారీతు లెల్ల వర్ణన మొనర్ప
నిష్టమగు గానఁ దచ్చేష్ట లెట్టి వనిన.
నరసభూపాలీయానుకరణ మీ శృంగార రసాలవాలంపై సుస్పష్టం.
***
ఆధునికులలో రాయప్రోలు సుబ్బారావు రచన ‘రమ్యాలోకం’ కావ్యరసాది లక్షణాలను నిర్వహిస్తూ సాగిన ఒక లఘుకృతి. అమలిన శృంగారమనే పేర ఒక విశిష్టబంధాన్ని నిర్వచించటానికి రాయప్రోలువారి ప్రయత్నమే ఈ ‘రమ్యాలోకం’!. అయితే భావుకతనుండి వాస్తవికత వైపు రావాలని ప్రబోధించే వీరి వ్యక్తీకరణ విధానంలోనూ భావుకత్వమే చోటు దక్కించుకోవటం గమనింపదగిన అంశం. ఒక ఉదాహరణ గమనిద్దాం:
పార్వతీపరమేశ్వర బాంధవమున
భారతీబ్రహ్మదేవ దాంపత్యమందు
విషయసురత ప్రసక్తి భావింపఁగలమె?
రస మనౌచిత్యమున మలీమసమయగుట
యామినీచంద్రులకు మిథునానురక్తి
పద్మినీమిత్రులకు వధూవరుల వలపు
గారవించిరి కవులు శృంగారకృతుల
సురతమేది? ఆ ప్రకరణాంతరములందు
అంటూ దేవాదివిషయక శృంగారంలో సురతప్రసక్తినీ, కవిసమయాలలోని భావుకతాప్రసక్తినీ ప్రశ్నించిన వీరే తరువాతి పద్యాలలో:
భువనసంమోహనుండైన పురుషు నరసి
ఇతని కిచ్చిన తల్లి యమృతకలశము
లెంత ధన్యములో యని నిచ్చమెచ్చు
సతుల నెఱుగ మెందఱిని వాత్సల్యరతల.
ఈ అమృతకలశము లెంత ధన్యములో అంటూ ఆ భావుకతనే సముచితంగా భావించాడు కవి, రమ్యాలోకం కళా, కళాతత్త్వవిషయాలను తనదైన శైలిలో, ఆలోచనాశైలిలో, ఆధునికతగా సంభావింపబడుతున్న శైలిలో, తాత్త్విక కవికి సహజమైన శైలిలో ప్రకటించి, నైజభావనాబలాన్ని ప్రకటించిన అలంకారిక కృతి.
డా. సూరం శ్రీనివాసులు రచన ‘రసవిద్య’ (కవన శిల్పసమీక్ష) కూడా ఆధునికంగా వెలువడిన అలంకారశాస్త్ర సమీక్షాగ్రంథం, 20 విభాగాలు ఉన్న ఈ అలంకారిక కృతి పూర్తిగా పద్యరూపం, విషయ ప్రస్తావనను బట్టి ఇది వివరణాత్మకంగానూ, సూచనాత్మకంగానూ, నిర్దేశాత్మకంగానూ ఉంటుంది. తత్తద్విషయానుగుణంగా ఆ విధంగా ఆదరింపబడింది. రసానుభూతి-కళాశిల్పము-కవితాశిల్పము-ఇతివృత్తం-ఎత్తుగడ-ముగింపు-కథనము-భాష-పదం-లయ-భావము-గుణదోషాలు-కవితాతత్త్వం-కవిపాఠకుడు-నవకథాదృతి-కథ-నవల-కవితృష్ట-కవినిష్ఠ ఉపసంహారం అని ఇరవై విభాగాలలో ఆయా విషయాలకు సంబంధించిన స్వరూప స్వభావాలు స్వీయదృష్టికోణంలో నుండి పరిశీలించి ప్రకటించిన గ్రంథమిది.
పుట్టుకలతోడ నాకలి పుట్టినపు-
డేడ్వఁ బసికూన కెటుతోచె? నెవడు నేర్పె?
నొక్కడైనను నవ్వడీ లెక్క యేమి?
కనుచు లాలనలన్ నవ్వగలుగు టేమి?
– అంటూ ప్రాణి మనుగడపై సహజాతాల ప్రభావబలాన్ని నిర్ధారిస్తూ ప్రారంభమైన ఈ కవితా శిల్పసమీక్ష.
ధర్మబద్ధత ప్రగతికి దారి; ప్రగతి
కరణశీలతవలననే కలుగుఁ బనుల
మాని కేవలదైవసంభావనమున
శాంతి విచికిత్సితమ్మె, విభ్రాంతి ఘనము
అని ధర్మబద్ధమైన పురుషకార ప్రాధాన్యాన్ని నిర్దేశిస్తూ ముగుస్తుంది.
అలంకార గ్రంథాలకు అనువాదాలు
తెలుగులో అస్వతంత్రంగా అలంకార శాస్త్ర గ్రంధ రచన పందొమ్మిదవ శతాబ్దిలో ప్రారంభమై నేటికీ అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంది. ప్రారంభంలో కేవలం అలంకార విభాగం మీదనే ఉన్న దృష్టి క్రమంగా అలంకారశాస్త్రం మొత్తం మీదకు మళ్ళింది. ఆ క్రమంలో సంస్కృతంలో ప్రసిద్ధాలైన అనేక లక్షణ గ్రంథాలకు యధాతథానువాదాలు, సంక్షిప్తీకరణలు, స్వల్పవివరణలతో కూడి గ్రంథాలూ, విస్తృత వ్యాఖ్యానాలూ, వచనంలో సమగ్ర శాస్త్రగ్రంథాలు విరివిగా ఆవిర్భవించాయి.
ఆ క్రమంలో భరతుని నాట్యశాస్త్రంతో ప్రారంభించి ప్రసిద్ధాలంకారశాస్త్ర గ్రంథాలకు దాదాపు అన్నింటికీ తెలుగు రూపాలు ఏర్పడ్డాయి. జమ్మలమడక మాధవరాయశర్మ ‘అభినవభారతి’తో సహా ‘నాట్యవేదమనే పేరుతో అనువదించారు. ఇది నాట్యశాస్త్రానికి కానీ, ‘అభినవభారతి’కి (అభినవభారతి నాట్యశాస్త్రానికి అభినవగుప్తుడు సంతరించిన వ్యాఖ్య) గానీ యథాతథానువాదం గాదు. అందలి. విషయాలను స్వాభీష్ట విధానంతో రచయిత ప్రకటిస్తాడు. తరువాత పోణంగి శ్రీరామ అప్పారావు యథామూలకంగా, అభినవ భారతితో పాటు స్వీయ విశేషాలతో సహా ‘నాట్యశాస్త్రము’ ప్రకటించారు. మాధవరాయశర్మ నాట్యవేదమే కాక. ‘నవరస గంగాధరము, ఆంధ్రప్రతాపరుద్రీయము, ధ్వనిసారము, కావ్యప్రకాశము, రసగంగాధరమణి, అలంకారసూత్రము, వక్రోక్తి జీవితము. భావప్రకాశనము, శృంగార ప్రకాశం, ఏకావళి’ గ్రంథాలను కూడా ఆవిష్కరించారు. వీటిలో ‘ఆంధ్రప్రతాపరుద్రీయమూ, భావప్రకాశనమూ, ఏకావళి’ సంపూర్ణగ్రంధాలు సమూలానువాద వ్యాఖ్యారూపాలు.
సంస్కృతంలో ప్రసిద్ధమైన మరొక గ్రంథం ఆనందవర్ధనుని ‘ధ్వన్యాలోకం’. అది కూడా తెలుగులో నాలుగు అనువాదాలను పొందింది. పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి ‘లోచనం’తో సహా (లోచనం ధ్యన్యాలోకానికి అభినవగుప్తుని వ్యాఖ్య) అనువదించి ప్రకటించారు. అనందవర్ధనుని మూలానికి మరొక అనువాదం బొడ్డపాటి కుటుంబరాయశర్మది, వేదాల తిరువేంగళాచార్యులు ఉదాహరణలుగా తెలుగు పద్యాలను కూడా స్వీకరిస్తూ ధ్వన్యాలోకాన్ని అనువదించాడు. పుల్లెల శ్రీరామచంద్రుడు ధ్వన్యాలోకాన్నే కాక ‘కావ్యాదర్శం, కావ్యాలంకార సూత్రవృత్తి. కావ్యమీమాంస, ఔచిత్యవిచారచర్చ’ మొదలయిన గ్రంథాలను అనువదించారు. వారి కృషి శ్లాఘనీయం అత్యాధునికులలో,
మరొక ప్రముఖ గ్రంథమైన ప్రతాపరుద్రీయాన్ని ‘ఆంధ్ర ప్రతాపరుద్రీయం’ పేర మాధవరాయశర్మ, ‘ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణం’ పేర చెలమచర్ల రంగాచార్యులు అనువదించారు.
ఇదే క్రమంలో ‘కావ్యాదర్శం, కావ్యమీమాంస, కావ్యాలంకార సూత్రవృత్తి.. దశరూపకం, కావ్యప్రకాశం, సరస్వతీకంఠాభరణం, సాహిత్యదర్పణం, రసగంగాధరం, కువలయానందం’ మొదలగు గ్రంథాలు తెలుగులో ప్రవేశించాయి. ‘రసార్ణవ సుధాకరానికి బులుసు వెంకట రమణయ్య అనువాదం, సరస్వతీకంఠాభరణా’నికి స్ఫూర్తిశ్రీ (తోకల భాస్కరరావు) అనువాదం యథామూలకాలు, కావ్యాదర్శా’నికి అవ్వారు సుబ్రహ్మణ్యశాస్త్రి అనువాదమూ యథామూలకమే. ‘రసగంగాధరా’నికి రెండు అననాలనూ వేదాల తిరువేంగళాచార్యులు అనువదించగా, ధరణికోట వేంకట సుబ్బయ్య ప్రథమాననాన్ని మాత్రం అనువదించారు. ఇది యథామూలకమే అయినా, వ్యక్తీకరణవిధి పాఠకుడికి అనాయాసంగా విషయాన్ని అందిస్తుంది. వేదం వేంకటరాయశాస్త్రి ‘సాహిత్యదర్భణా’న్ని ఆంధ్రీకరించారు. ఇవన్నీ ప్రసిద్ధాలే. ఇది మచ్చుకు ప్రదర్శించటమే కానీ, ఇలా ఎన్నో వున్నాయి. ఆంధ్రులకు కవిత్వంలో అలంకారాలపై మోజు, కాబట్టి అలంకారాలకు సంబంధించిన గ్రంథాలు చాలా వెలువడ్డాయి. (బులుసు వేంకట రమణయ్య గారి ‘ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్ర’లో మరిన్ని విశేషాలు చూడవచ్చు. ఆ తర్వాతి కాలంలో వెలువడినవి కూడా చాలా ఉన్నాయి).
స్వతంత్ర వచన రచనలు
ఇవిగాక వచనరూపంగా అలంకారశాస్త్ర విషయాలను అందించిన రచనలూ చాలా ఉన్నాయి.
శేట్లూరి రాఘవయ్య కావ్యాత్మ పేరుతో ఆంగ్లంలో S.K.De రచించిన History of Sanskrit Poetics (Vol II) ను ఆంధ్రీకరించారు. కురుగంటి సీతారామయ్య ‘అలంకార తత్త్వవిచా’రాన్ని ప్రకటించారు. డా. కట్టమంచి రామలింగారెడ్డి ‘కవిత్వతత్త్వ విచారము’ పేర సోదాహరణ ప్రసంగ మన్నట్లుగా ఒక మంచి గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించారు. కేవల సంప్రదాయవాదులు కొందరు దీనిని మెచ్చకపోవచ్చు.
పింగళి లక్ష్మీకాంతం రచన ‘సాహిత్యశిల్పసమీక్ష’ కొంత స్వతంత్రాలోచనలతో సాగే అలంకార శాస్త్ర పరామర్శ. విన్నకోట మాధవరావు రచించిన ‘కావ్యశిల్పము’ కావ్యతత్త్వాన్ని స్పృశిస్తుంది. దివాకర్ల వేంకటావధాని ‘సాహిత్య సోపానాలు’ పేర సూక్ష్మంగా అలంకారశాస్త్ర సిద్ధాంత పరామర్శ చేశారు. కె.వి.ఆర్.నరసింహం రచించిన సాహిత్యదర్శనము, చర్ల గణపతిశాస్త్రి రచన సాహిత్య సౌందర్య దర్శనమూ బృహద్గ్రంధాలూ, సమగ్రాలూ. ఇటువంటి గ్రంథాలలో ‘సాహిత్య సౌందర్య దర్శన’మే సంపూర్ణ బృహద్గ్రంథం.
‘కావ్యాలంకార సంగ్రహానికి సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి వ్యాఖ్యానం ఒక సమగ్రమైన అలంకారశాస్త్ర విన్యాసం.
‘చంద్రాలోకాన్నీ, జయదేవుని కారికలను అనుసరించి వ్రాసిన ‘కువలయానందా’న్నీ తెలుగు పాఠకులు ఇష్టపడతారు. చంద్రాలోకానికి అడిదము సూరకవితో ప్రారంభించి ఎన్నో అనువాదాలూ, వ్యాఖ్యానాలూ వెలువడ్డాయి. స్ఫూర్తిశ్రీ రచించిన ‘చంద్రాలోకసమున్మేషం’ ప్రత్యేకాదరణను పొందింది.
ఆధునికుల గురించి వ్రాయటంలో ఇది అసమగ్రం. మరెందరినో గురించి, గ్రంథాలను గురించే చెప్పవలసి ఉంటుంది. ప్రస్తుత పరిధి వ్యాసమే, కానీ గ్రంథం కాదు. కాబట్టి చెప్పలేకపోతున్నాను. అంతేకానీ, చెప్పాలని లేక కాదు.
సంస్కృతంలో నాటకాలకు ప్రాధాన్యం. తెలుగువారు సంస్కృత నాటకాలను కూడా తెలుగు ప్రబంధాలుగా వ్రాసుకొన్నవారు. అయినా అలంకారశాస్త్రంపై తెలుగువారి మక్కువ అంత స్వల్పమేమీ కాదు. అన్ని భాషలలోని విశేషాలనూ ఆదరించి, సొంతం చేసుకోగల తెలుగు కవిపండితులు సంస్కృతంలోని అలంకారశాస్త్ర విషయాలను చిన్నచూపు చూడరు గదా!