ఎంతదారి తప్పి
ఎక్కడెక్కడో తిరిగినా
ఎట్టకేలకు నీటి జాడ
అడవిలో మరొక సారి
తప్పిపోవాలనుంది
దట్టమైన అడవి
ఆకుల్లోంచి దూరి
లోయల్లోకి ప్రాకి
కిరణాలు తమని
ముద్దాడుతుంటే
గలగలలాడే
సెలయేటి
అలలన్నీ
వెలిగిపోతూ…
తనలో మునిగిన
ప్రతి గులకరాయికీ
ఓపిగ్గా సెలయేరు
ఒక రూపాన్నిస్తోంది
చూడ్డానికి ఒకేలా ఉన్నా
దేని అందం దానిదే!
ఏ సెలయేటిని చూసినా
ఆ గలగలలు
నాలోనూ వినిపించేవి.
కొన్నాళ్ళకి నేను
కవిత్వం మొదలు పెట్టాను
ఒకరితో
నిమిత్తం లేదు
పూస్తాయి
రాలిపోతాయి
అడవిలో పూలు.