“మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ

1.0 ప్రస్తావన

అమ్మాయిలకు ఉన్నతవిద్య అవసరమా? ఏ వయసులో పెళ్ళిజరిగితే బాగుంటుంది? ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీలకెంత వరకూ ప్రయోజనకరం? ఆశయాలకూ, ఆచరణకూ పొంతన కనిపిస్తుందా? జీవితంలో సర్దుబాటు తప్పదా? అయితే, అది ఎలాంటి సర్దుబాటైతే బాగుంటుంది? సర్దుబాటు స్త్రీ, పురుషుల్లో ఇద్దరికీ ఉండాలా? లేక ఒక్కరికే ఉండాలా? మొదలైన ప్రశ్నలు – వాటికి సమాధానాలు డి. కామేశ్వరి గారు రాసిన ‘ మనసున మనసై ‘ నవలలో చాలా వరకు కనిపిస్తాయి. ఆ సమస్యలను నవల లోతుగా చర్చిస్తుంది.

‘వార్త’ దినపత్రిక ధారావాహికంగా ప్రచురించిన ‘మనసున మనసై ‘నవల పుస్తకరూపంలో వచ్చింది. “ఇది వరకటి తరాల స్త్రీలయితే తమ అదృష్టం యింతేనని సరిపెట్టుకుని భర్త తిడితే బాధపడి, భర్త ఆదరించిన నాడు పొంగిపోయి కష్టమైనా, ఇష్టమైనా అదే జీవితం అనుకొని బతికేది. ఇప్పటి యువతరానికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చాక, స్వాభిమానం, ఆత్మాభిమానం, ఆభిజాత్యం ఎక్కువపాలై, మేమెందుకు సర్దుకొని బతకాలి అన్న ధోరణి తలెత్తాక దాంపత్యంలో సర్దుబాటు ధోరణి తగ్గిపోయి కాపురంలో మనస్పర్ధలు తలెత్తసాగాయి. జీవితం అంటేనే సర్దుబాటు, మేరేజీ యీజ్ నధింగ్ బట్ ఎడ్జస్ట్ మెంట్” అని గుర్తించమంటూ రచయిత్రి రాసుకున్న “ముందుమాట”లో అన్నారు.

“ఒక నెగిటివ్ క్యారెక్టర్ ద్వారా, పాజిటివ్ థింకింగ్ కి బాటవేశారు రచయిత్రి. ఆధునిక యువతి ఎలా ఆలోచించకూడదో, ప్రతీదీ వ్యతిరేక దృక్పథంలో ఎలా చూడకూడదో చెప్పారు. మనిషి ఎలా బ్రతకాలో, ఎంత ఆదర్శవంతంగా జీవించాలో చాలామంది చెబుతుంటారు. కానీ, ఎలా ప్రవర్తించకూడదో పాఠకులను పూర్తిగా కన్విన్స్ చెయ్యగల బహుకొద్ది మంది రచయితలో ఈమె ఒకరు. విద్య, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్ర్యం ఆధునిక స్త్రీని బాధ్యతాయుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలే గాని , తలబిరుసుతనానికి తావివ్వకూడదు” అని వ్యాఖ్యానించారు ఈ నవలకి అభిప్రాయం రాసిన మాలతీచందూర్.

“ఆలోచింప చేసే అలజడి చిత్రణ” పేరుతో ఈ నవలకి అభిప్రాయం రాసిన కేతు విశ్వనాథరెడ్డి గారు “స్త్రీ పురుష సంబంధాల మధ్య వస్తున్న వాంఛనీయ, అవాంఛనీయ సనాతన, ఆధునిక, శుభ, అశుభ పరిణామాలని అంతోయింతో పట్టించుకొన్న” రచనగా పేర్కొని “సమష్ఠి కుంటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, …తరాల మధ్య అంతరం పెరిగింది. ఆర్థిక స్థితిగతులు సమతుల్యాన్ని కోల్పోతున్నాయి. పెళ్ళికాని, అయిన ఉద్యోగినులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు – అమ్మానాన్నలు, అత్తామామలు, బంధువులు, స్నేహితులు, సాంస్కృతిక వారసత్వం, అధికారం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మహిళల జీవితం మీద ప్రభావం చూపుతుంది మతం, కట్నం, అందచందాలు, హోదాలు, వినియోగదారీ సంస్కృతీ, వ్యక్తిత్వాలను తారుమారు చేస్తున్నాయి. మానవసంబంధాల మధ్య అసహనం, అలజడి, ఆందోళన పెరిగిపోయాయి. పెంపకం, పెళ్ళి, ప్రేమ, దాపత్యం, సర్వస్వం ‘నిర్వహణశాస్త్ర’ పరిధిలోకి వచ్చేశాయి. ‘మనసున మనసై ‘నవల నిర్వహణ శాస్త్ర దృష్టినుంచి పరిశీలించ దగ్గ నవల” అని వ్యాఖ్యానించారు. అయితే, వీరి అభిప్రాయంలో ఒక చర్చనీయాంశాన్ని కూడా పెట్టారు అది “జీవితంలో అపజయాలు వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు . ఏ శక్తులతో పోరాడాలో తెలిసి పోరాడగలగాలి. లేదా గాలివాటుగాకాక, నచ్చిన సామాజిక జీవితంలో సేవలో శాంతిని వెతుక్కోవాలి జయంతిలాగ. ఇదీ యాదృచ్చికమేనా?” అని నవల ముగింపుని చర్చనీయాంశం చేసే చక్కని వ్యాఖ్యను కేతువిశ్వనాథరెడ్డి గారు పాఠకుల ముందుంచారు.

ఇది నవలా రచయిత్రి తన రచనను ముంగించడంలోగల ఆంతర్యాన్ని తడిమి చూడగలిగిన వ్యాఖ్య. ఇదంతా చర్చించుకునే ముందు నవల కథా సారాంశాన్ని తెలుసుకుంటే బాగుంటుంది.