న త్వం శోచితుమర్హసి
మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర[1]తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు[2] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి[3] సూద్దామంటే మొగదాట్లో[4] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా.
యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడెగానికీ దొక్కలు[5] లేసేదాఁకా కుడితినీళ్లు తాపి మల్లా పోయి పండుకున్న్యారు. నాతోపాటు కాడి[6] గట్టేదానికని రామారం సంతలో మొన్నబట్టకచ్చినారు - వానిపేరేమో కోడెగాడంట, మా రామునికి నేనింగా లేగదూడనే. తెల్లారుఝామున రెండుగంటలు కావస్తాందనఁగా గాలి సల్లగా కదలడం మొదులుబెట్టింది. అందురూ ఆదమరిసి నిద్దట్లోకి జారుకున్న్యారు.
కాసింత కన్ను మూసినానోలేదో ఇదో ఈ గుఱ్రపీగ, దీని నారు[7]కు నట్టు[8] దగలా… అసరసంద్యాల మా నెత్తరదాగుతాయి సరే. మబ్బుబడినాంక మల్ల కనపరావు మామూలుగా. దీనెమ్మ ఇదేం జాతిదో తెల్లారుజామున నా పానందీసేదానికొచ్చింది. “దేవుడా, ఇదేందిదీ నా నోటెమ్మట ఇట్టాఁటి మాటొచ్చింది!?” అనుకొంటా ఊపిరి ఒక్కసారిగా వదులుదామంటే మొగదాటి కింద కాలు నా గొంతునొక్కుతాంది. పక్కకు దొల్లేదానికిజూస్తే యమకల్లో నొప్పి. యేమాత్రం కదిలేదానిగ్గూడా ల్యాకండా ఉండాది. నోరు దెరిసి అరుజ్జామంటే గొంతు పెగల్లా. నిజ్జంగానే నా పానానికొచ్చిందీ ఈగ. నా పాటుకు కోడెగానికి మెలకవొచ్చింది, నేను సద్దు జెయ్యకపొయ్యేతలికి మల్లా గురకదీసి నిద్దరబోతాండాడు. నిన్నపగులుగాసిన యర్రటి యండలో యకరం మడి ఇరసాలు[9] దున్తిమి. నడిరేయిదాఁక ఉక్కతో నిద్దరబట్టకపోయ. ఇప్పుడన్నా గురకబెట్టకపోతే వాడు ఎద్దా ఇంగేమన్నానా? నేనూ అట్నే నిద్దరబోతాంటి. దోమలు కుడితే మెలకవరాదు. జోరీగలు, గుఱ్ఱపీగలు కుడితే మాత్రం మహామంట వీఁటి జాతికి అగ్గిబెట్టా.
ఊపిరి అందడంల్యా. యమకల్లో నొప్పి. కాలు వూడి రాకంటే ఊపిరి బిగిసి సస్తాననిపిస్తాంది. బాగన్నా యిరక్కపాయనే. నాకు మొగదాడు కుట్టకపోతేనేమి, సెప్పినమాట యినపోతినా నేను!? మా రామునికి మెలకవొచ్చి లేస్తే బాగుండు. నన్ను కట్టేసిన మామిడిచెట్టు పక్కనే ఆరుబయట పండుకోనుండాడు. నాకు మతిబోతాన్నిట్టుగా వుండాది. మగతగా మబ్బుగమ్మినట్టు… వొగేల నిజ్జంగానే నేను సస్తే మా రాముడు తట్టుకో గలుగుతాడా! సమదాయించేదానికి వాళ్లమ్మానాయనాగూడా ఊళ్లో లేరే! నాకు మొగదాడు కుట్టొద్దని మా రాముడు యంత ఆగం[10] జేసినా “పిల్లకాయవు, నీకు తెలీదు నోరుముయ్యరా! పొయ్యి పుస్తకం బట్టి సదూకోపో” అని మూసేసిరి. దబ్బణం[11] తో నా ముక్కుకు బొక్కబెట్టి నూనెబూసిన నూలుతాడు ఆ బొక్కలోగుండా సర్రున లాగి కట్టేసిరి. శారెడు రగతం కారిపాయ. నాలుగురోజులు అవస్థబడితి. మల్ల మానిపాయ.
సరిగ్గా కనమపండగ నాడు కనింది మాయమ్మ నన్ను, సచ్చి ఏలోకంలో ఉండాదో మహాతల్లి. వర్సగా ఆరు మంది మగబిడ్డలను కనిందని మాయమ్మకు యింట్లో భలే మర్యాద. నేను ఏడోవోణ్ణి. సంకురేతిరి దినాలుగదా, అప్పుడు బడికి సెలవులు. కంటిమింద రెప్పెయ్యకండా నా సుట్టూతానే ఉండేవోడు మా రాముడు.
ఐదెకరాల మడి. అందులో సగం మామిడితోట. తోటలోనే ఆరంకణాల పూరిల్లు. దానికానుకోని నాకూ మాయమ్మకూ వసారా. వానబడితే తప్ప, మమ్మల్ని ఇంటి ముందరున్న పెద్దమామిడి చెట్టు కిందే కట్టేవాళ్లు. మడి సుట్టూ బద్రంగా కంప. నేనూ, మాయమ్మ, మా రాముడు, మా రాముని అమ్మానాయన - మాదే రాజ్యం. యేరే మనిసిగానీ, గొడ్డుగానీ మాకు తెలీకండా లోపలకొచ్చే మాటేలేదు. పుట్టిన మరుదినం నుంచి తోటంతా చెంగనాలెయ్యడమే[12] పని. నాతోపాటు దౌడుదీస్తే వాళ్లమ్మ తిడతాదని దూరం నుంచి సూస్తా వుండేవోడు రాముడు. పచ్చని తోటలో తెల్లగా మెరిసిపోయే నన్ను సూసి మావోళ్లు మురిసిపోతే సాలు, పాలుగూడా అక్కరలేదు నాకు, తోకను జెండామాదిరిగా నిటారుగా పైకినిలబెట్టి తోటంతా దౌడుదీసేవాణ్ణి నేను. మెల్లమెల్లగా గడ్డిపోసలు కొరకడం మొదులుబెట్టేటప్పుడు మెత్తని శొంఠిగడ్డలు,గరిక తెచ్చి నోటికందించేవాళ్లు. నాకు తినిపించడమంటే మా రామునికి ఇప్పటికీ ఇష్టమే. “పొద్దుగూకులూ ఆ దూడతో ఆటలేనా, పుస్తకంబట్టి పబ్లిక్ పరిచ్చలకు సదుకునేదేమన్నా వుంద్యా?” ఇంట్లో నుంచీ నాయన బెట్టిన కేకతో మొగం చిన్నబుచ్చుకొని నన్నొదిలి ఇంటికిబొయ్యేవోడు.
మల్లా మూణ్ణెల్లకు యండాకాలం శలవలకు ఇంటికొచ్చినాడు. వొచ్చినరావడం నేరుగా నాకాడికే వచ్చినాడు. మామిడిచెట్టు కింద గుంజకు నన్నుగట్టేసిన తావుకొచ్చాంటే సెప్పలేనంత సంతోసమాయె నాకు. లేసి నిబబడి మోరెత్తి పలకరిస్తి. నా యీపు మింద అరచేత్తో ఆప్యాయంగా తట్టి, గంగడోలు నిమురుతాంటే “రామూడూ నువ్వు యల్లకాలం సల్లంగుండాల”ని మనసులోనే అనుకున్యా. మొదుట్నుండీ పుస్తకాల కంటే సెట్టూచామా గొడ్డూగోదా మింద బ్రమలెక్కువ గాబట్టి, ఆ యండాకాలం శలవులతోనే సదువు యండగట్టేసినాడు. వాళ్లనాయన యంత బాద పణ్ణాడో నేను అంత సంబరపణ్ణా. మామూలుగానే చిన్నబిడ్డను సూసుకొన్నిట్టు సూసుకొంటారు నన్ను. రాముడొచ్చినాంక నాకు నా ఐదెకరాల సామ్రాజ్యం రామరాజ్యమే అయింది.
ఆ రాముని దయవల్ల మా రాముడు సంతోసంగానే ఉండాడు. ఈమధ్యనే మంచి జోడీ కుదిరింది. సదువుకున్న పిల్ల. పెద్దగా కష్టం సెయ్యలేదు గానీ, మా రామునికి కష్టం కలిగించే పని సెయ్యదు. రోంతొక్కరవ్వ నాజూకైన మనిసి. ఈ మళ్లల్లో యండలకు వానలకు అగసాట్లుబడే బదులు టౌనుకు బొయ్యి సిన్న యాపారమేదైనా బెట్టుకొని సులబంగా బతుకుదామని ఆశ. కాపోతే నేనంటే మాత్రం ఇష్టమే. ఇష్టంకన్నా జాలి ఎక్కువ. నేనేదో నా శక్తికి మించి పనిజేసి అలిసిపోతాండాననని. పిచ్చిపిల్ల.
నన్ను గుంజకు కట్టేసేటప్పుడు అట్టాయిట్టా తిరిగేదానికి, వీలుగా పొడుగాటితాడుతో కట్టేసేది. మా రాముడు మాత్రం ఎప్పుడూ కురసగా కట్టేసేవోడు పెద్దగా తల తిప్పేదానిగ్గూడా వీల్లేకండా. కానీ నా కర్మగుదికీ ఆ పొడుగుతాడే నా కాళ్లకు సుట్టుకోని కిందబడేసిందిప్పుడు. నిజ్జం జెప్తాండ్లా! మొగుడూపెండ్లాలిద్దరూ నా మింద ఈగ వాలనిచ్చేవాళ్లుగాదు. అట్టాటిది ఇయ్యాల ఈ గుఱ్రపీగ ఎంతపనిజేసిపాయ.
నా పానం బోతాందని నాకు అర్తమైతాంది. ఎప్పుడూలేనంత బయం. బయపడితే పొయ్యేది పోకమానుతుంద్యా! యెప్పుటికైనా పోవాల్సిందే, యల్లకాలం యీణ్ణే వుంటామా? నేను బోతే మా రాముడు పాపం గుండెలు పగిలేదాంకా యేడుచ్చాడు. అసలు నాది నిజంగా సావు బయమా? సచ్చినాంక నా గతేమైపోతుందో అని దిగులా? మా రాముణ్ణి మల్లా సూచ్చానో సూళ్లేనో. సచ్చినాంక నేనేమైపోతానో, నన్నెవురు జూసుకుంటారో! నా ఐదెకరాల తోటను, మా ఇంటినీ, మా రాముణ్ణీ సచ్చినా వదలగూడదు. నేను యాడికీబోను. ఈణ్ణే ఉంటా.
ఇట్టా యేందేందో దిక్కూదరీలేకండా అనుకుంటా వుండంగానే నా నొప్పి మెల్లిగా మాయమైపోయ. పక్కటెమకల్లో నొప్పిలేదు. మెల్లిగా కుడిపక్కకు పొల్లుదామని సూస్తే అంతా ఉలకంగా ఉంది. మొగదాట్లోనుంచీ కాలు ఊడొస్తుందేమో అని మెల్లిగా లాగితి. అసలు మొగదాడే లేదు. గట్టిగా ఊపిరి పీలుద్దామంటే నా చాత కాలా. అసలా అవసరమే లేనట్టుంది. లేసి నిలబడితి. రెండడుగులు పక్కకేసి సూస్తి. కోడెగాడు ఇంగా గుఱ్రుబెట్టి నిద్దరబోతాండాడు మొద్దునాయాలు. పక్కన్నే నేనూ పండుకోనుండా. మొగదాట్లో నా కాలు అట్నే చిక్కుబడుంది. నా కండ్లు బెదిరినట్టు యర్రగా పెద్దగా తెరుసుకోనే ఉండాయ్. తెల్లగా మెరిసిపొయ్యే నా ఒళ్లుమాత్రం నిగారింపు తగ్గిపొయ్యి నల్లకప్పేసింది[14]. నానుంచీ నేను పక్కకొచ్చి నన్నునేనే సూసుకోవడం కొత్తగా ఉండాది. మామిడిచెట్టు కిందినుంచి మెల్లిగా నడుసుకుంటా బైటికొస్తి.
పైకి జూస్తి ఆకాశంలోకి. ఆ దినం అమాస. సుక్కలన్నీ కండ్లు నిక్కబొడుసుకోని కిందికి సూచ్చాండాయ్. ఇంతకూ యేమి జరుగుతాండాదని సూచ్చాండాయబ్బా అని నేనూ సుట్టూజూస్తి. ఏముండాదీ, యండకాలం తెల్లారుజాము, సల్లగ గాలి, గాలికి చిన్నగా ఊగుతా కాపుతోవున్న మామిడిచెట్లు, అప్పుడోటీ అప్పుడోటీ రాలిపడే పిందెలు, సెట్లల్లో వాలి సలసలా సప్పుడు జేసే రెయ్యిపచ్చులు, తింటేతిన్న్యాయిలే అన్నిట్టు లోకమే మరిసి సల్లగా దోమతెరల్లో మంచం మింద నిద్దరబోతాండే మా సీతారాములు, మాడిసెట్టుకింద మా కోడెగాడు, అడిపక్కన్నే నేనూ… నేనా! కాదు, దిక్కులేని సావు సచ్చిన నా బొంది. ఆహా! యేమంటిని యేమంటిని? సచ్చింది నేనుగాదు నా బొంది. హహ్హ! బలే తమాసాగా వుండ్లా!?
అట్టా ఆలోశన సేసి, నాకు నేనే నవ్వుకోని, పైకి సూసీ సూసీ మెడ నొప్పిబెడుతుందేమో నని కిందికి దించితే, ఇద్దురు పెద్దమనుసులు చేతులు గట్టుకోని నా ఎదురుఁగా నిలబడుండారు. ఎందుకైనా మంచిదని నేనే వాళ్లకు నమస్కారంబెడితి. వాళ్లూ పోటీలుబడి నాకు నమస్కారంజేసిరి. యీళ్లిద్దురూ తప్ప, జన్మలో నాకు నమస్కారం జేసినోడు యెవుడేగాని లేడు, మాయమ్మతోడు. ఆకాశాన్ని సూస్తా “బయలుదేరుదామా స్వామీ” అన్న్యాడొకొకాయన. ఆ బాసకు చిరాకొచ్చింది నాకు. “యాడికి బొయ్యేది? వచ్చానని[15] ఇంతకు ముందే పిలిసి సెప్పినట్టుగా - పాండి స్వామీ - అంటాండారే! నేను యాడికీ రాను. ఇంతకూ యెవురుసామీ మీరు? రేతిరిపూట తోట్లోకి జొరబణ్ణారే!”
ఆ మాట అంటాండంగానే వాళ్లెవురో ఎందుకొచ్చినారో నా అంతట నాకే తెలిసిపొయ్యింది.
“తప్పదు స్వామీ. బయలుదేరాల్సిందే.”
“అయ్యా, రోంతసేపుంటే మా రాముడు నిద్దరలేచ్చాడు, ఒక మాట సెప్పి పోదాము”
“సూర్యోదయానికి ముందే ఈ లోకం నుంచీ నిష్క్రమించాలి మనం. ”
“ఓర్నీపాసుగలా! ఒక్క అర్థగంట తట్టుకోండియ్యా. ఠంచనుగా ఐదుగంటలకే లేచ్చాడూ” అని నిష్ఠూరమాడితే ఇద్దురూ మొగామొగాలు జూసుకోని “సరే” అన్నారు. తూరుప్పక్క మెల్లిగా తేటబడతాంది. మంచానికి నాలుగడుగుల దూరంలో నిలబడి సూచ్చాండా నేను. పెద్దమనుషులిద్దురూ చేతులుగట్టుకోని విసుగనే మాటే కనపరానీకండా నిలబడుండారు. “నువ్వెంత అజ్ఞానపుదానివో నీకు తొందర్లోనే తెలుచ్చుందిలే” అన్నిట్టు వాళ్లిద్దురూ ముసినవ్వు మొగాల్తో సూచ్చాండారు.
హాయిగా మెల్లిగా గాలి తోల్తాండాది. తెలతెలవారతాందనంగా మెలకవొచ్చింది మా రామునికి. యల్లకిలా పండుకోని పండుకోనే కండ్లు తెరిసినాడు. మెడసుట్టకారమూ చెయ్యేసి ఒత్తిగిలి నిద్దరబోతాంది పెండ్లాము. ఆ చెయి మడికట్టును మెల్లిగా పట్టుకోని, మెలకువ రానీకండా మెడపట్టు తప్పించి పక్కకు జరిగి , అంతకంటే మెల్లిగా దోమతెర తీసి మంచం దిగినాడు. తన నిద్దర చెడగొట్టగూడదనే మొగుని తాపత్రయానికి మురిసిపోతూ నిద్దర్లోనే వున్నిట్టుగా కండ్లుమూసుకోని పండుకోనుందామె. ఒక్క పెండ్లాన్నేగాదు, అమ్మానాయన్నూ, నన్నూ మాయమ్మనూ, ఆమాటకొస్తే యెవురినైనాగాని నొప్పిదగలనీకండా సూసుకొని మసలే ఓపికైన మనిసి మా రాముడు.
అట్టాంటి నా రాముడు జీవంలేని నా బొందిని సూసి తట్టుకుంటాడా? నిలువునా కుప్పగూలిపోతాడేమో. మంచందిగి నేరుగా మామిడిసెట్టుకిందికే బోయినాడు. నా పరిస్తితి సూణ్ణే సూసినాడు. బెదిరి అట్టే నీలక్కపోయిన నా కండ్లుజూసి మెరుపు మాదిరిగా కదిలి చెట్టుమొదుట్లో కొడవలి అందుకోని నా మొగదాడు కోసేశ. దొక్కమింద రెండుచేతుల్తో అదమిసూసినాడు. నా యనక్కాలు మెడకిందనుండి పక్కకు జరిగె. తల మెల్లిగా నేలకు జారిపాయ. రాముడు మల్లా నా కండ్లదిక్కు సూసినాడు. కండ్లు బెదిరినట్టు పెద్దగా తెరుసుకోని నీలక్కపోయే వుండాయ్. ముక్కల చెయ్యిబెట్టి సూశ. మల్లా నా కండ్లదిక్కు జూశ. రాముని సూచ్చావుంటే నాకు తొలిసారి భయం. ఏమైపోతాడో యేమోనని.
ఆ బుజానున్న తువ్వాలు దిగలాగి ఈభుజానికి మార్చుకొంటా, నా బొంది పక్కన్నే నేలమింద కూసుండిపోయ. నా మెడకింద తాడు బిగసకపోయిన గుర్తు జూసినాడు. పొడుగ్గా కట్టేసిన తలుగుతాడు జూసినాడు. కండ్లనిండా నీళ్లు. కిందికి జారనీలా. కోడెగాడు లేసి నిలబడి నా బొందినీ, రాముణ్ణి మార్చి మార్చి సూస్సాండాడు బయంగా. ఎప్పుడొచ్చిందోయేమో మా రాముని పెండ్లాము పక్కన్నే నిలబడి భోరుమని యేడుపెత్తుకొనింది. మొగం పైకెత్తి పెండ్లాం మొగం జూస్తే తానూ ఏడుచ్చాడనే బయ్యమేమో, తలెత్తి సూళ్లా. నా ముక్కుకు తాడుజేసిన గాయం ఆమె కంటబడింది. యేడుపు గొంతుతో “పానంబొయ్యే ముందర యంత నొప్పి బడింటుందో” అని మొగుణ్ణిజూసి బావురుమనింది. పెండ్లాం మొగంలోకి జూడకండా, లేసి నిలబడి ఆమె బుజంమింద సెయ్యేసి వూరుకోమన్నిట్టుగా తట్టి, జీరగొంతుతో “గొడ్డుమింద అంత అబిమానం … పనికిరాదే. దాన్నెట్టా కట్టెయ్యాల్నో చిన్నదానివి నీకు దెలీకపోతే, నేనన్నా జెప్పాలగదా… తప్పునాది.” అన్యాడు. ఆమెకు పొరబాటు అర్తమైనిట్టుండాది. పాపం జేసిన దాని మాదిరి బయపడిపొయ్యింది. రాముడు ఆమె మొగంలోకి జూసి, ఏం ఫరవాలేదన్నిగా ఇంగోసారి బుజం తట్టి “తప్పు నాది. వూరుకో. జరుగుతాయ్. ఒగోసారంతే.” అని యడమ చేతిలోని తువ్వాలుతో కండ్లుదుడుసుకోని, ఇంగో పక్కకు బొయ్యి ముక్కుజీది, క్యాకరిచ్చి థూప్‌మని ఊసినాడు. ఇదంతాగూడా దుక్కం దిగమింగేదానికే. చిన్నపిల్లకాయ కాదుగదా. పెండ్లాంతో బాటుగా ఏడిసేదానికి మొగమాటం.
పక్క తోటలో ఉండే మనిషిని కేకేసి పిలిసినాడు. పరుగు పరుగున బూసిగాడు వచ్చి ఎదురుగ్గా నిలబడె. “బూసిగా, రేతిరి మన కోడెదూడ సచ్చిపొయ్యిందిరా.” నేలను జూస్తా మెల్లిగా అన్యాడు. సచ్చిందాకా నేను దూడనే మా రామునికి. “బాగుండెగదప్పా… యేమాయప్పా వున్నిట్టుండి? పురుగేమన్నా మూజ్జూసింటాదా?[16] ” అడిగినాడు బూసిగాడు. ఏమయ్యిందో చెప్పేదానికి మా రామునికి మొగమెక్కలా. “పానంబొయ్యి యంతసేపాయప్పా” బూసిగాడు మల్లా అడిగె.
ఒక నిట్టూరుపు వొదిలి… “తెల్లారుజామున్నే పొయినిట్టుండాదిరా. మీ పల్లెలో ఎవురికన్నా …”
రాముడా మాట అనంగానే బూసిగాని మొగంలో వెలుగు. “ఔ ప్పోవ్, ఆలీశమైతే చర్మం పనికిరాకండా బోతాది. ఎవురికో ఎందుకుప్పా మా నాయనకే జెప్తాలే, మొగంగడుక్కోని వస్సాడు” ఆనందంగా అనేసి, నాలిగ్గరుసుకోని, “బాగుండెగదప్పా, ఏమాయె ఉన్నిట్టుండి …ప్చ్!” అంటా లేని నొప్పి యల్లగక్కె. రాముడు ఇదంతా పోదోసి, “చర్మం అమ్ముకోని లెక్క[17] సాయంత్రానికి తెచ్చియ్యాల.” అంటే “అట్నేప్పా” అంటా వాళ్ల పల్లెదిక్కుబోయ బూసిగాడు.
రాముడు నా చర్మం సొమ్ముజేసుకోవాలని మనుషులను పురమాయించినాడు. నేను అనుకున్నిట్టు పెద్దగా బాదపణ్ణిట్టు కనబళ్లా. నా పక్కనున్న పెద్దమనుషులిద్దరూ అప్పటికే నేలనొదిలి పైకి పయనమౌతూ నన్నుజూసి పొడినవ్వు నవ్వి, నన్ను పైకి రమ్మన్నారు. నేనూ మెల్లగా నేలనొదిల్తి. నాకు రాముని మీద కోపంలేదు. జాలికూడా లేదు.
అమ్మానాయన్ను ఆదరంగా సూచ్చాండాడు, పెండ్లాన్ని కంటికిరెప్పమాదిరి కాపాడతాండాడు, నేను పుట్టినప్పట్నుంచీ రాముడు నాకు ఏ లోటూ రానీలా. నా బొందిమింది తోలు అమ్ముకుంటే మాత్రం తప్పేముండాది? శివరాతిరి పండక్కు ఖర్చులకైనా వస్సాది గదా. నా బొంది ఆణ్ణేబెట్టుకోని వారంరోజులు ఏడిస్తే నాకేమొస్సాది! నా తోలుగూడా పనికిరాకండాబోతాది గదా!? జన్మమెత్తినందుకు తన ధర్మాన్ని తాను చేసుకుపోతాండాడు. మర్నేను!? నా శక్తికొద్దీ శంబడి రామునికి సాయం జేసినా. మా రాముడు సంతోసంగా ఉండాలని ఆ రామునికి దినామూ మొక్కినా. నా ధర్మం నేనూ జేసినా. సరిపోయ. రుడం తీరిపాయ. రాముడు నాకోసం రెండ్రోజులైనా యేడవలేదని బాదపడ్డమంటే యెర్రిగాక ఇంగేంది !? బతికున్నోడు తన పని తాను చేసుకుపోతాండంగా, నాకెందుకింత ఆలోచన? అయినా… రేపు పొద్దున్నేలేసి నాకు కుడితినీళ్లు తాపుదామని ఆదమరుపుగా చెట్టుకిందికొచ్చి మల్లా బావురుమనడూ …
ఇట్టా అనుకుంటా కిందికిజూస్తే ప్రపంచం ఐదెకరాలకంటే ఎంతపెద్దదో తెలిసొచ్చింది. నా పక్కన పెద్దమనుషులు లేరు. తేలికపడిన మనసుతో సూరీణ్ణి, సందమామను, సుక్కలను దాటి పోతా పోతాండా. ఇంత - అన్జెప్పేదానికే యీల్లేనంత బెమ్మాండమైన ఆకాశంలో “నేను” అనేదేదీ యేరేగా లేకండా “అంతానేనే” అనిపించబట్టింది. సావుపుటకలు చానా మామూలు సంగతులు. ఇందులో బయపడాల్సిందేమీ లేదు. ఈ పయనం ఎంతదూరమైనా ఇప్పుడు నాకు పట్టింపు లేదు.
వ్యవసాయ నేపథ్యం లేని మరియు కడపజిల్లా మాండలికం తెలియని వారికోసం:
- ముల్లుగర్ర - ఎద్దులకు చురుకు తగిలించి వేగంగా నడిపించడానికి వాడే కర్ర. దీని చివర ఒక చిన్న ఇనుప ముల్లు ఉంటుంది.
- తలుగు - పశువులను కట్టేయడానికి వాడే తాడు లేదా ఇనుప గొలుసు.
- మోర - మెడ, మెడపైని తల భాగము
- మొగదాడు - ముక్కుతాడు
- దొక్కలు - డొక్కలు
- కాడి - ఎద్దుల జత
- నారు - జాతి
- నట్టు - రోగం
- ఇరసాలు - (ఇరు = రెండు; సాలు=దున్ను) నిలువుగా ఒకసారి మళ్లీ అడ్డంగా ఒకసారి దున్నటం
- ఆగం - అల్లరి లేదా నిరసన
- దబ్బణం - సూదిలాంటిదే, కానీ సూదికన్నా చాలా పెద్దది
- చెంగనాలు - చిన్న దూడలు వేసే గంతులు
- గంగడోలు - పశువుల గొంతు కింద వేలాడే చర్మం
- నల్లకప్పేసింది - ఆనారోగ్యంతో ఉన్న పశువుల చర్మం నిగారింపు తగ్గుతుంది - దాన్ని నల్లకప్పు వేయడం అంటారు. ప్రాణం పోయాక కూడా నిగారింపు తగ్గుతుంది.
- వచ్చానని [ఇక్కడ ‘చ’ ను చాప అని పలికినట్టు చప్పగా పలకాలి] - వస్సానని - వస్తానని
- పురుగు మూజూసుంటాదా - పురుగు వాసన జూడటం - పాము కాటేసి ఉంటుందా అనడానికి భయపడి, ఈ euphemism వాడతారు.
- లెక్క - డబ్బు
Gopinadha Reddy.Y. అభిప్రాయం:
May 2, 2007 7:25 am
కధ చాలా బాగొచ్చింది. రాముని పెళ్ళాం లాగే నాకు కూడా చదువుతుంటే కళ్ళలో నీళ్ళు కదిలి అవిరైపొయె. A very beautiful presentation dear.
విహారి అభిప్రాయం:
May 2, 2007 12:45 pm
రానారె,
ఎలా వర్ణించాలో తెలియడం లేదు. చాలా చాలా బాగుంది. సంపేసినావ్ బో. కళ్ళంబడి బొట బొటా నీళ్ళు కారిపోయినాయ్ బో.
- విహారి
నేనుసైతం అభిప్రాయం:
May 3, 2007 5:55 am
రానారె,
కళ్ళముందు కదలాడే లా చెప్పావు.
-నేనుసైతం
JUBV Prasad అభిప్రాయం:
May 7, 2007 3:29 pm
ఈ కధలో వాడిన భాషా, కధ చెప్పిన తీరూ, మాటలూ, విషయాలూ చాలా బాగున్నాయి. ఎటొచ్చీ, జంతువు బదులు ఏ పాలేరు లాంటీ మనిషినో తీసుకుంటే, ఇంకా అద్భుతంగా వుండేదనిపించింది. కడప జిల్లా మాండలీకం లోని పదాలకి అర్ధాలు ఇచ్చి వుండకపోతే, కధ అందరికీ ఇంత చక్కగా అర్థం అయి వుండేది కాదు. ఈ పద్ధతి బాగుంది. జంతువు ఘోష అనేసరికి, అంతా వూహే నన్నమాట అని అనిపించి, వుసూరుమనిపిస్తుంది. మనుషుల కష్టాలు అయితే ఇంకా హృదయాన్ని కదిలిస్తాయి. మొత్తానికి కధ బాగుంది.
ప్రసాద్
మురళీకృష్ణ కూనపరెడ్డి అభిప్రాయం:
May 10, 2007 11:13 am
“నా బొంది ఆణ్ణేబెట్టుకోని వారంరోజులు ఏడిస్తే నాకేమొస్సాది! నా తోలుగూడా పనికిరాకండాబోతాది గదా!? ”
ఎంత నిజం!
మంచికథ రానారే!
kari venkataratnam babu అభిప్రాయం:
May 15, 2007 3:11 am
రానారె గారి ములకనాటీ మాండలికపు కధ చాల బాగుంది.పంచతంత్రము లో యెద్దు మాట్లాడినట్లు రాసినారు అనుకుంటున్న. యెద్దు బదులు పాలేరుతో కధ నడిపితే కొత్తదనం వుండదు.ఇది ఒక నూతన ప్రక్రియ.కొంత కాలం క్రితం RADIO 4 UK లో ఒక నాటిక విన్న.ఆ నాటిక లొ అంతా జట్ఖా గుర్రం మాట్లాడుతూ LONDON వీధుల గురించి విక్టోరియా కాలం నాటి సామాజిక పరీస్తితులు వర్ణిస్తూ రానారె కథ లొయెద్దు లా ఏకరువు పెడుతుంది తన భాధలన్ని. ఈ గుర్రము స్వగతము ఆంతా london eastend మాండలికములో సాగుతుంది.రానారె యెద్దు లా గుర్రం అంత్యదశ తో కథ అంతమవుతుంది.
Vaidehi Sasidhar అభిప్రాయం:
May 16, 2007 6:44 am
చక్కటి మాండలికంలో అద్భుతం గా ఒదిగిన భాష,ఆర్ద్రత నిండిన కధనం. ఒక జంతువు స్వగతంగా కధ నడపటం కొత్త ప్రక్రియే కాక పెంపుడు జంతువులకి తమ యజమానులతో ఉండే లేదా ఉండటానికి సాధ్యమయ్యే అనుబంధాన్ని eloquent గా ,ఉదాత్తంగా సూచించటం జరిగింది.గ్రామీణ వాతావరణాన్ని ,జీవన విధానాన్ని,జీవన్మరణాల మధ్యలో నిర్వికారం గా సాగిపోయే లోకవ్యవహారాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.
మంచి కధ!!!
నవీన్ గార్ల అభిప్రాయం:
May 16, 2007 11:57 pm
రానారె…మొత్తానికి నేను చెప్పినది చేశావన్న మాట!!! సంతోషం. ఇంకో విషయం ఏమిటంటే చాన్నాళ్ళ ముందు నేనూ సరిగ్గా ఇటువంటి కథ వ్రాశాను. కాకుంటే అందులో దూడ కాకుండా వీధి కుక్క ఉంటుంది.. పోలిక కథలో మాత్రమే, కథనం లో కాదు. అద్భుతంగా వ్రాశావు. ఇలాగే వ్రాస్రూ మమ్మల్ని అలరిస్తూ ఉండు.
Nalini అభిప్రాయం:
May 17, 2007 5:36 pm
చాలా చక్కని కథ!! బీభత్సంగా రాయగలిగిన ఇతివృత్తాన్ని ఎంతో సున్నితంగా రాశారు. అందుకనే కాబోలు హృదయానికి హత్తుకుంది. మీరు మరిన్ని మంచి కథలు యిలా అందంగా రాయాలని నా కోరిక.
రానారె అభిప్రాయం:
July 3, 2007 10:57 am
వ్యాఖ్యలు రాసి అభిప్రాయాలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పడం సంప్రదాయం. అయితే, ఈ కృతజ్ఞతలు ఒక వారం ముందు చెప్పి ఉండాల్సింది. కొత్త సంచిక వచ్చి, ప్రస్తుతం నా మాటలను అసందర్భం అనిపింపజేస్తుండవచ్చు, క్షమించాలి. ఈ కథకు మూలం ఇక్కడ మొదటి వ్యాఖ్య రాసిన వ్యక్తి. ఆరోజు ఆ గిత్తను కట్టేసింది ఆయనే. విహారి, నేనుసైతం, మురళీకృష్ణ, నవీన్‌గార్లకు ధన్యవాదాలు. ప్రసాదుగారు, మీరన్నది నిజమే కావచ్చు. కానీ పెద్దగా కదిలించి కన్నీళ్లు పెట్టించడం మాత్రమే కాదు ఈ కథ ప్రధాన ఉద్దేశం. వైదేహిగారి అభిప్రాయం ఈ కథ ఉద్దేశానికి అద్దంపట్టింది: “జీవన విధానాన్ని,జీవన్మరణాల మధ్యలో నిర్వికారం గా సాగిపోయే లోకవ్యవహారాన్ని చిత్రీకరించడం”. వేంకటరత్నంబాబుగారు, కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. “ములకనాటీ మాండలికం” అంటే ఏమిటో నాకు తెలీదు. మీకు తెలిస్తే దయచేసి చెప్పండి.
Dileep అభిప్రాయం:
August 6, 2007 3:00 pm
ఏమి చెప్పావుబ్బా భలే చెప్పావు, ఈ కథకు కథలోని పాత్రకు అలాగే నా నిజ జీవితంలోని సంఘటనకు చాలా దగ్గరి సంబంధం వుండాది. ఇది చదివినంత సేపు నాకు మావాడు కళ్లలోనే కనిపించాడు. మాకు వందపైనే అవులు వుండేవి కాని వాటికి పుట్టిన వాటిని నాటు గిత్తలు అనేవారు. వాటికంటే దేశపు ఎద్దులు బాగా నాజుకుగా వుంటాయి. అలాగే పనికూడా బాగ తొందరగా చేస్తాయి. అందుకని మా నాన్న ఒక కాడి అవి ఒక కాడి నాటు గిత్తలు పెట్టేవాడు. అందరి అలోచన కూడా అదే. అందుకే వ్యాపారము చేసే వాళ్ళు మా పక్క ఊరైన నీలకంఠరావు పేటకు ఈ దేశపు దూడలను తెచ్చి అమ్మేవారు, మా అమ్మ నాన్న కూడా ఉదయాన్నే పాలు పోయడానికి ఆ ఊరు వెళ్ళేవారు. అక్కడ మావాడి అందం, కాళ్ళు, కొమ్ములు, రంగు నచ్చి తీసుకొచ్చారు. మావాడు అన్నిటితో పాటే చాలా తెలివైన వాడు, చలాకి గాడు. మా ఇంటి కొచ్చిన కొన్ని రోజుల్లోనే మాతో బాగా కలిసి పొయాడు. వీడిని చిన్న పిల్ల వాడిలా చూసుకొనే వాళ్ళు. అన్ని అవులున్నా వాటితో పాటు మందలో తోలేవాళ్ళు కాదు, మా అమ్మ దుల్ల కు గరిక తేవడానికి మా గదగుండ్లబావి దగ్గరికి వెళ్ళేటపుడు వీడిని కూడా తీసుకెళ్ళి మేపుకొచ్చేవాళ్ళు. అలా అల్లారు ముద్దుగా పెంచాము. వీడిని మా గదగుండ్ల బావి దగ్గరికి తీసుకొని పోవడానికి పగ్గము అవసరము లేదు బుద్ధిగా మా వెనకాలే వచ్చేవాడు. నాక్కూడా తెగ నచ్చాడు. నన్ను చూస్తే అలా మెడ పైకి ఎత్తుకొని దగ్గరికి వచ్చేవాడు, ఎందుకంటే మెడ కింద నెమరించుకొవడము చాలా ఇష్టం వాడికి.
నేను కూడా అల్లరే, చదువు అంతగా ఎక్కేది కాదు, పొలం దగ్గరకు వెళ్ళడము మహా ఇష్టం. అందులొ ఆ మధ్యే మా లెక్కల్ మాస్టారును తిట్టానని మా నాన్న చెవిలో పడింది. నేను ఏమి తిట్టలేదండి - మా మాస్టారు రెండు మూడు గైడులు ముందరెట్టుకొని బోర్డు పైన అన్ని విధాల సమాధానాలు వ్రాసేవాడు. అందులో ఆ రోజు అతను ఏదో తికమక పడ్డాడు, అందుకే మార్చి మార్చి సమాధానాలు చెప్పాడు. సరే అని నేను వూరుకోకుండా నా పక్క వాడితో “ఈ గుడ్డి సారుకు కనిపించి సావలేదు అందుకే మార్చి మార్చి సమాధానాలు చెపుతున్నాడు” అన్నా నా పక్క వాడితో. అంతే, ఇంక వాడు మంచిగా చేతులు కట్టుకొని నేను అన్నమాటలు మాస్టారుకు చెప్పెసాడు. మనకు వల్లు వాగింది, విషయం ఇంటిదాక తెలిసింది. ఇంక లాభం లేదని చదువు మానిపించారు.
అప్పుడు మావాడు మంచి రంజుమీదున్నాడు, ఆ నడక ఆ ధీమా, ఎకర పొలం ఇరసాలు ఏమిటి, నాలుగు సాల్లు ముల్లు కర్ర లేకుండానే దున్నేస్తా అనేటట్టుగా. అయితే మాది రాళ్ళ చేను (అందుకే దాని పేరే “రాళ్ళచేను “). అందుకే పని ఎక్కువ అవడంతో మనవాడికి ఒక తెల్లదొర గాడిని జత తెచ్చారు. వీడు కూడా మంచి ఆరు అడుగుల అందగాడు, నాకు వీళ్ళంటే ఎంతో ఇష్టం. ఆ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. మావాడికి, ఈతెల్లదొరగాడికి, నాకు బాగా షాడకేసే పని వచ్చి పడింది. మా నాన్న సామాన్యంగా ఒప్పుకోడు. బాగా పొలం దుక్కి పట్టాలంటాడు. ఆవిధంగా ఒక నెల రోజులు రోజూ బురదలో పనే. వరి నాట్లు వేసారు. పని అయితే అయింది కాని మా వాడు బాగా మెత్తపడ్డాడు (”మెత్త కాళ్ళు పడ్డాయి”). మామూలుగా అలా బుడదలో పని వస్తే ముందే లాలాలు (కాళ్ళకు కిందా ఇనుప ముక్కలు) కొడతారు చెప్పులు లాగా. అవిలేకపొవడం వల్ల గట్టలు బాగ మెత్తపడ్డయి. ఇద్దరు నడవలేక పొతున్నారు, నాకు చాలా బాధేసింది. సరే అని ఎవరికి చెప్పకుండా నాతో వున్న డబ్బులతో మా ఊరికొచ్చిన సాయిబు దగ్గర లాలాలు కొట్టించడానికి తీసుకెళ్ళాను.
మా అమ్మ ఒక వైపు చెపుతూనే వుంది (వాటికి లాలాలు కొట్టాలంటే బలవంతంగా కింద పడుకోబెట్టాలి) ఇంతకు ముందు అవి ఎప్పుడు లాలాలు తొడిగించుకోలేదు, వద్దు నాయనా అని. కాని అప్పుడు మా అమ్మ చెప్పేదానికంటే నాకు వాటిమీద ఉన్న ప్రేమతో లేదు ఎలాగయినా కొట్టించాలని తీసుకెళ్ళాను. మన వాడు బుద్ధిగా తొడిగించుకున్నాడు. ఇంకా తెల్లదొరగారికి కొంచం భయం ఎక్కువ, పడుకోలేదు. సాయిబు, మాఊరిలో వేమయ్య ఇద్దరు కలిసి బలవంతంగా పడుకోబెట్టారు. అంతా అయిపోయింది. లేపితే లేచి ముందు కాళ్ళపైనే నిల్చుకుంది. నాకు తెలియలేదు ఎమి అయిందో. ఇంటికి తీసుకెళ్ళాను. అందరు చూశారు కాలు బెసికింది అన్నారు. మా రామయ్య పెద్దనాన్న ఏవో పసుర్లు పూసాడు. ఏమి లాభం లేదు. ఇంక ఎవరిసలహాతోనో కలిపైన వాత పెట్టారు. అయినా బాగా కాలేదు. జోడు తప్పింది. ఇద్దరినీ విడదీసారు. మా వాడిని అమ్మేసారు ఎవరికో. చాలారోజులు నేను బాధపడ్డాను, నా మూలంగానే కాలు పోయిందని. చాలాకాలం వరకూ ఇవి నా కలల్లో ఎక్కువగా కనిపించేవి. మీరు మీ కథ తో మళ్ళీ వాటిని గుర్తు తెచ్చి నా కళ్ళలోకి నీళ్ళు తెప్పించారు.
దిలీప్.
C.S.Rao అభిప్రాయం:
August 8, 2007 6:28 pm
రానారె గారి కధ మీద దిలీప్ గారి అభిప్రాయం బావుంది.కధలా విస్తరించి హృదయాన్ని జాలిగా తాకింది.మాండలిక పదాల సోయగం తో అలరించింది.
కారణాంతరాలవల్ల నైనా కూడా ,రానారె గారి కధ ను ఇప్పటి దనకా miss అయినందుకు ఒకింత regret అయ్యాను.వెంటనే చదివాను.కడప మాండలిక భాషా సౌందర్యం తో,గుండెల్ని పిండే జాలితో కధలాగా కాక,అకస్మాత్తుగా ఎదురైన జీవితానుభవం లా సాగింది రానారె గారి రచన.రైతులకు ఎడ్లు ,వ్యవసాయానికి ఉపయోగపడే సాధనాలు,మూగజీవాలు మాత్రమే కాకుండా ,కుటుంబసభ్యులుగా వారి జీవితాలతో పరస్పర ప్రేమానుబంధం కలిగి ఉంటవి.రైతులకు ఎడ్లు బహిప్రాణాలుగా ఉండటం భారతీయ గ్రామీణ సంస్కృతి లో ఒక కమనీయమైన సత్యం.యాంత్రికపరమైన పురోగతిని తిరస్కరించలేకపోయినా ,హుందాగా నడుస్తూ పొలం దున్నే కోడెల సౌందర్యం ట్రాక్టర్ల రాకతో క్రమక్రమంగా కనుమరుగైపోవటం మనసులో ఎక్కడో ఒకింత బాధాకరంగా ఉంటుంది.
రైతులకు ,ఎడ్లకు మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని రానారె గారు వారి కధ ద్వారా కండ్లు చెమ్మగిల్లేలా ,గుండె కుత్తుకలో పూడుకునిపోయినట్లుగా feel అయ్యే విధంగా చక్కగా చెప్పారు,చూపించారు.ఎద్దు చనిపోయిన తర్వాత కూడా తన
యజమానిని గురించి బాధ పడటంతో ,మనసు పై జాలి మేఘాలు ఆవరిస్తవి.
కాకపోతే ,ఇంతటి రసస్ఫోరక స్థితి ని పాఠకుడు చేరుకున్న తరవాత ,చనిపోయిన ఎద్దు చర్మం వల్ల వచ్చే డబ్బు కోసం యజమాని చేసే ప్రయత్నం కసుక్కున ముల్లులా గుచ్చుకుంటుంది.అది ఒక యదార్ధమైన విషయమే అయినా ,దానిని focus చెయ్యడం కధ సాధించిన రసానుభూతిని దెబ్బ తీస్తుంది.
మరొకవిషయం: జీవన్మరణ విషయాలమీద ఊర్ధ్వ లోకాలవైపు సాగించే మహాభినిష్క్రమణం లో ఎద్దు ఆత్మ అంత వేదాంత ధోరణి లో ఆలోచించటం కధ సాధించిన రసౌచితికి ప్రతీఘాతంగా ఉంటుందనుకుంటున్నాను.ఎద్దు ఆత్మ అయినంతమాత్రంచేత ఇలా అనడం లేదు:ఎద్దు ఆత్మ,ఆదిశంకరులవారి ఆత్మ,మనందరి ఆత్మ,విశ్వాత్మ అంతా ఒకటే అని మన వేదంతం ద్వారా మనందరికీ తెలుసు.కాకపోతే ,సృజనాత్మక సాహితీ ప్రక్రియలలో బట్ట బయలుగా ప్రబోధపరంగా ఏమి చెప్పినా వాటి కళావైశిష్ట్యాన్ని అది దెబ్బతీస్తుంది.మెసేజ్ లేదా ప్రబోధం సాహిత్యప్రక్రియ కలిగించే రసానుభూతి లో అంతర్లీనమై పాఠకుడి ఉపచైతన్య స్థితి లోకి లేదా చైతన్యస్థితి లోకి మెల్లగా ప్రవేశించాలి.కధలో సాధించిన రసజ్ఞతను మానవీయ విలువలను పదిలపరచుకుంటూనే ఏదైనా ఒక జనన మరణాతీతమైన విషయాన్ని ప్రదిపాదించదలచుకుంటే ఎద్దు ఆత్మను తీసుకపోవటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అర్ధవంతమైన మందహాసాన్ని చాలా క్లుప్తంగా,సజెస్టివ్ గా విశదీకరిస్తే సరిపోను.
అయినా రానారె గారిది నిస్సందేహంగా మంచి కధ,గొప్ప కధ,ఎప్పటికీ గుర్తుండే కధ.
అభినందనలు.
C.S.Rao
రానారె అభిప్రాయం:
September 27, 2007 10:40 am
సీ.యస్.రావుగారికి, మీ సూచనలు చాలా ముఖ్యమైనవి. ఇవే సూచనలను ఈ కథ ప్రచురింపబడే ముందు కొందరు పెద్దలు ఇచ్చియున్నారు. కానీ వాటిలోని క్లుప్తత, వారుపయోగించిన భాష వలన అవి నాకు ఎంతమాత్రమూ రుచించలేదు. మీ వ్యాఖ్యలో ముఖ్యంగా “మెసేజ్ లేదా ప్రబోధం - సాహిత్యప్రక్రియ కలిగించే రసానుభూతి లో అంతర్లీనమై పాఠకుడి ఉపచైతన్య స్థితి లోకి లేదా చైతన్యస్థితి లోకి మెల్లగా ప్రవేశించాలి.” అన్న మాటలను శిరసావహిస్తున్నాను. మీకు ధన్యవాదాలు.
దిలీప్, మీరు మీ నేపథ్యానికి సంబంధించిన అనుభవాలతో మంచి రచనలు చేయగలరు. ప్రయత్నించి చూడండి.
C.S.Rao అభిప్రాయం:
September 28, 2007 2:41 pm
రానారె గారు,
చిత్తశుద్ధితో చేసిన సూచనలను సహృదయంతో ,ఔదార్యం తో స్వీకరించిన మీ దొడ్డ మనసుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
కరుణ రసం మీ స్వభావానికి, మీ రచనాపాటవానికి తగిన creative channel గా నేను భావిస్తున్నాను.వాస్తవానికి కరుణ ను మించిన రసం వేరొకటి లేదు.
రచయితగా మీకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు నిస్సందేహంగా ఉంది.
అభినందనలతో
C.S.Rao
sandhya అభిప్రాయం:
November 7, 2007 3:15 am
నిజంగా చాలా బాగుంది