పద్యాలు – వాడుకభాష

ఆధునిక కాలంలో ఛందోబద్ధమైన పద్యకవిత్వం ఆదరణ కోల్పోడానికి ముఖ్యకారణాలలో ఒకటి అందులోని భాష. వ్యావహారిక భాషోద్యమం విజయాన్ని సాధించిన కాలంలోనే పద్యానికి నిరాదరణ మొదలవ్వడం కాకతాళీయం కాదు. పద్యానికి గ్రాంధిక భాషే తప్ప వ్యావహారిక భాష తగదని అప్పట్లో చాలామంది అభిప్రాయపడ్డారు. తమాషా ఏమిటంటే, పద్యాన్ని ప్రేమించినవారూ, నిరసించినవారూ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసారు. ఉదాహరణకి విశ్వనాథ “గ్రామ్యమా వాడుక భాషా” అన్న వ్యాసంలో గ్రాంధిక భాషే పద్యానికి తగినదని స్పష్టంగా చెప్పారు. అలాగే “శ్మశానాలవంటి నిఘంటువుల”ని దాటే ప్రయత్నంలోనే “ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి” వచ్చాడు శ్రీశ్రీ.

అయితే తరవాత్తరవాత, భాష కారణంగా పద్యం నిరాదరణకి గురికావడం చూసిన కొందరు పద్యప్రియులు, పద్యం వ్యవహారభాషలో కూడా రాయవచ్చునన్న వాదనని లేవదీసారు. కొంత మంది వాడుకభాషలో పద్యాలని రాసి దాన్ని నిరూపించడానికికూడా ప్రయత్నం చేసారు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. కానీ అవి సఫలమైన జాడ కనపడటంలేదు. పద్య, వచన కవిత్వాలని పోల్చి చూస్తే వచన కవిత్వంలో ఉండేంత వాడుకభాష పద్య కవిత్వంలో కనిపించదు. వాడుకభాషలో పద్యకవిత్వాన్ని రాసి ఒప్పించిన సందర్భాలు నా ఎఱుకలో ఏమీ లేవు.

ఈ నేపథ్యంలో పద్యానికి వాడుక భాష పనికివస్తుందా లేదా అనే విషయాన్ని ఎవరూ వివరంగా, సహేతుకంగా పరిశీలించినట్టుగా నాకు కనపడలేదు. ఒక్క గురజాడ మాత్రం తన “అసమ్మతి పత్రంలో” దీనిగురించి కొంత చర్చ చేశారు. విశ్వనాథ తన “గ్రామ్యమా వాడుకభాషా” అన్న వ్యాసంలో ఇలా అంటారు: “ఇది వరకు మనవాళ్ళు సృష్టించి యేర్పరచిన వృత్తభేదాలు గ్రాంధిక భాషా స్వరూపానికి తగిపోతవి. వాడుకభాషలో పద్యాలు వ్రాయాలి అంటే, ఆ వృత్తాలు మారాలి. కాదు, వృత్తాలే ఆ వాడుకభాషలో వ్రాస్తాము అంటే ఆ వృత్తాలకి ఆ భాష తగిపోయింది. మళ్ళ అంత ప్రయత్నం చేసిన కవులు ఆ వృత్తాల్లో ఆ భాషని వంచితే కాని అంత సాఫీ తిరగదు. అది కాలగర్భంలో ఉన్న పని”. ఇందులో హేతువు కన్నా విశ్వనాథ అనుభవమే కనిపిస్తుంది. ఇక్కడ వారు చెప్పిన “గ్రాంధిక భాషా స్వరూపం” ఏమిటి, వృత్తాలు దానికి తగిపోవడం అంటే ఏమిటి అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు. వాటిగురించి ఆలోచిస్తేనే, పద్యాలకి వాడుకభాష ఎంతవరకూ పనికివస్తుందన్న విషయం తేలుతుంది. ఆ ఆలోచన దిశగా చేస్తున్న చిరుప్రయత్నమే ఈ వ్యాసం.

విషయ వివరణలోకి వెళ్ళే ముందు, కొన్ని నిర్వచనాలు చేసుకోవడం అవసరం. మొదటిగా, ఈ వ్యాసంలో పద్యాలంటే, ఛందోబద్ధమైన పద్యాలనే నా ఉద్దేశం.

రెండు, ఈ వ్యాసంలో ప్రస్తావించే “గ్రాంధిక భాష”, “వాడుక లేక వ్యావహారిక భాష” ల గురించి. ప్రస్తుతానికి వీటిని నిర్దిష్టంగా నిర్వచించలేను కాని ఒక తాత్కాలిక నిర్వచనం (working definition) మాత్రం చేసి ముందుకు సాగుతాను. “గ్రాంధిక భాష” అంటే ఇంతకాలం సాంప్రదాయికంగా లిఖిత పూర్వకంగా వస్తున్న ప్రాచీన కావ్యాలలో వాడబడిన కావ్య భాష. “వాడుక భాష” అంటే ఈ కాలంలో (గత వంద సంవత్సరాలుగా) జన వ్యవహారంలో ఉన్న భాష. ఇక్కడ మరొక చిక్కున్నాది. తెలుగు భాష అనగానే – అది కోస్తా జిల్లాల తెలుగా, రాయలసీమ తెలుగా, తెలంగాణా తెలుగా అన్న సమస్య బయల్దేరుతుంది. ప్రస్తుత చర్చలో ఈ విషయాన్ని పక్కన పెడతాను. ఈ మూడు ప్రాంతాలలోనూ వాడుకలో ఉన్న తెలుగులో కొన్ని సామాన్య లక్షణాలు (common characteristics) ఉన్నాయని అందరూ ఒప్పుకుంటారనుకుంటాను. అలాంటి లక్షణాలని మాత్రమే ఈ వ్యాసంలో తీసుకుంటాను. అయితే నేను భాషా శాస్త్రవేత్తను కాదు కాబట్టి, అక్కడక్కడ కొన్ని విషయాలు ఒక ప్రాంతంలోని భాషకి మాత్రమే పరిమితమై ఉండవచ్చని మాత్రం పాఠకులకి హెచ్చరిక!

మరొక విషయం, గ్రాంధిక వ్యావహారిక భాషలకి భిన్నమైన కవిత్వ భాష ఒకటుంది. అది కవిత్వంలో మాత్రమే కనిపించే భాష. గ్రాంధిక, వ్యావహారిక భాషలు కవిత్వేతర విషయాలకి కూడా ఉపయోగించ వచ్చు. వాటిని కవిత్వంలో ఉపయోగిస్తే అవి కవిత్వ భాషగా పరిణామం పొందుతాయి. ప్రస్తుతం కవిత్వ భాష గురించి ఇంతకంటే వివరించాల్సిన అవసరం లేదు. వివరాలకు చేరాగారి “కవిత్వ భాష” అన్న వ్యాసం చదవండి. ఈ వ్యాసంలో నేను ముఖ్యంగా చర్చించేది గ్రాంధిక వ్యావహారిక భాషల గురించి కాని కవిత్వ భాష గురించి కాదు.

నేను ప్రతిపాదిస్తున్న అంశం – పద్యాలని లేదా పద్యకవిత్వాన్ని రాయదానికి అనువైనది గ్రాంధిక భాషే. వాడుకభాషకు దగ్గరగా పద్యాలు రాయాలని ప్రయత్నిస్తే, పద్యానికున్న సహజ సౌందర్యం వాటిలో లోపిస్తుంది. ఈ ప్రతిపాదనకి కొన్ని మినహాయింపులున్నాయి. అవి కూడా ప్రస్తావిస్తాను. తెలుగు పద్యాలకి ఉండే కొన్ని మౌలిక లక్షణాలని పరిశీలించి, ఆ లక్షణాలకి గ్రాంధిక భాషా స్వరూపం ఎలా అణుగుణమైనదో, వాడుకభాష ఎలా పరిమితమైనదో వివరించి, నా ప్రతిపాదనని సమర్థించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ తెలుగు పద్యాలంటే కేవలం దేశి ఛందస్సులలో ఉన్న పద్యాలు మాత్రమేకాదు. తెలుగు కావ్యాలలో మొదటినుండీ కనిపించే సంస్కృత వృత్తాలలోని తెలుగు పద్యాలు కూడా.

పద్యాలకున్న ప్రాథమిక లక్షణం ఛందస్సు. ఛందస్సు పద్యంలో వాడే అక్షరాలనీ, తద్వారా పదాలనీ కొంత నియంత్రిస్తుంది. యతి ప్రాసల వల్ల మరింత నియంత్రణ జరుగుతుంది. ఉదాహరణకి “పువ్వు”లతో ఒక చంపకమాల పద్యాన్ని మొదలుపెట్టాలనుకున్నప్పుడు, “పువ్వులు” అన్న పదాన్ని ఉపయోగించలేము. “పువులు” వంటి రూపాంతరమో, “విరులు” వంటి పర్యాయపదమో ఉపయోగించవలసి వస్తుంది. మరి వాడుక భాషలో పద్యాలు రాయాలన్నప్పుడు, వాడుక భాషలో ఉన్న పదాలనే, పద రూపాలనే వాడవలసి వస్తుంది కదా! వాడుక భాషకి ఉన్న యీ పరిమితి ఛందోబద్ధమైన పద్యాన్ని రాయడానికి మొట్టమొదటి అడ్డంకి. మరొక ఉదాహరణతో దీన్ని మరికొంత వివరిస్తాను. ఈ పద్యం చూడండి:

నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మ వంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి మా
ప్రాణము తీతువా యనుచు బావురుమన్నవి క్రుంగిపోతి నా
మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై

ఇది చాలామందికి తెలిసిన పద్యం. చాలా తేలికగానే అర్థమయ్యే పద్యం. అయితే ఇది వాడుకభాషలో ఉన్న పద్యమా? “కడ” అన్నది ఈ రూపంలో వాడుకలో లేని పదం. “గోరానెడు” అన్న పదబంధం అలాటిదే. “తీతువా” అన్నది వాడుకభాషలోని “తీస్తావా” అన్నదానికి రూపాంతరం. అలాగే “మానసము” అన్న పదం వాడుకభాషలో లేనిది. “విరులు” అన్నది పువ్వులకి పర్యాయపదం. ఇవన్నీ ఇలా ప్రయోగించవలసిన అవసరం ఛందోబద్ధంగా రాయడం కోసమే కదా. అలా రాసినంత మాత్రాన అవి అందంగా లేవా అన్నది కాదిక్కడి ప్రశ్న. అది వాడుకభాష కాదన్నదే నే చెప్పదల్చుకున్నది. ఈ పద్యాన్నే ఉదాహరణగా తీసుకోడానికి కారణం – ఇది నిజానికి చాలా తేలికగా అర్థమయ్యే పద్యం. ఇలాంటి పద్యంలోనే వాడుకభాషలో లేని పదాలు ఇన్నుంటే, ఇక ఇతర పద్యాలగురించి పాఠకులు ఊహించుకోవచ్చు.

గణ యతి ప్రాసల నియమాలని పాటించడానికి వాడుకకి భిన్నమైన వాక్య నిర్మాణం కూడా చెయ్యవలసి రావచ్చు. ఉదాహరణకి ఈ పద్యం చూడండి:

“ఎలుక జంపగోరి యింటి కగ్గిని బెట్ట
నెఱుకలేదుగాని యెలుక జాడ
కొంపలన్ని కాలి దుంపనాశన మయ్యె
ఖస్సు బుస్సు మనెడు బుష్షు బ్రదరు!” (యుద్ధోన్మాదము – కొప్పిశెట్టి సూర్యనారాయణ)

ఇక్కడ ” ఎఱుకలేదుగాని యెలుక జాడ” ఇటువంటిది. ఇది వాడుకలో “యెలుక జాడ ఎఱుకలేదు కాని” అవుతుంది, కానీ అలా రాస్తే ఛందస్సు సరిపోదు.

సాధారణంగా వృత్త పద్యాలకుండే ఒక ప్రత్యేకలక్షణం వాటిలో ప్రతిపాదం చివరి అక్షరం గురువు అవ్వాలన్న నియమం. తెలుగులో ప్రసిధ్ధిపొందిన మాలా వృత్తాలు, విక్రీడితాల ఛందస్సుని గమనిస్తే, వాటిలో ప్రతిపాదం గురువుతోనే అంతమౌతుంది. మొదటి మూడుపాదాలూ కాకపోయినా చివరిపాదంలోనైనా వాక్యానికి ముగింపు ఉండాలికదా. అది గురువుతో అంతమవ్వాలి. తెలుగులో వాక్యాలు సాధారణంగా గురువుతో అంతమవ్వవు. సంబోధన కానీ (“పావనీ!” లాగ), ప్రశ్నార్థకం కానీ (“శక్యమే?” లాగా), కాకుస్వరం కానీ (“ధర్మమే!” లాగా) ఐతేనే వాక్యం గురువుతో అంతమవుతుంది. “ఐ”తో కూడా కొన్ని వాక్యాలు అంతమవుతాయి (“నిత్యమై” వంటివి). కానీ, అవికూడ తక్కువే. పద్యాలన్నీ ఇలాంటి వాక్యాలతోనే ముగించాలంటే చాలా కష్టం కదా! మరి మన పద్యకవులీ సమస్యనెలా పరిష్కరించారు? పద్యాలతో కొద్దిపాటి పరిచయమున్న వారెవరికైనా దీని సమాధానం సులువుగా తెలుస్తుంది. తెలుగు గ్రాంధిక భాషలో, చాలా క్రియలకి “ను” అన్న ప్రత్యం వస్తుంది. “వచ్చాడు” అన్న వాడుక పదం “వచ్చెను” అవుతుంది. అలాగే “వస్తాడు”-“వచ్చును”, “వస్తున్నాడు”-“వచ్చుచుండెను” ఇలా. ఈ “ను”కారాన్ని పొల్లుగా మారిస్తే ఆ పదాలు గుర్వంతాలవుతాయి. ఉదాహరణకి “వచ్చెను” అన్నది “వచ్చెన్” గా మారడం. తెలుగు పద్యాలలో ఇలా పొల్లుతో అంతమయ్యే పద్యాలు కోకొల్లలు. ఇలాగే బహువచనంలో వచ్చే “లు” కూడా పొల్లుగా మారుతుంది. “సంపదలు” – “సంపదల్” వంటివి. ఇవి వాడుకభాషలో కనిపించని ప్రయోగాలు. అందువల్ల వాడుకభాషలో వృత్తాలు రాయడం కష్టం. దేశిఛందస్సులకి చాలావరకు, గురువుతో అంతమవ్వాలన్న నియమం లేదు. అందువల్ల వాటిలో పద్యాలను రాయడానికి పొల్లుతో అంతమయ్యే గ్రాంధిక రూపాలని వాడవలసిన అవసరం ఉండదు.

ఇంక, నియమం కాదు కానీ పద్యాలకి, అందులోనూ తెలుగు పద్యాలకి ఉండే మరొక ప్రత్యేకమైన లక్షణం ప్రవాహ గుణం, లేక ధార. తెలుగు పద్యానికి అందాన్ని తెచ్చే లక్షణాలలో ఇది ప్రధానమైనది. నన్నయ్య, శ్రీనాధుడు, పోతన, పెద్దన వంటి కవుల పద్యాలు చదివితే ఇదేమిటో అనుభవమవుతుంది. తెలుగు ఛందస్సులోని యతి, భాషాలోని సంధి సమాసాలూ – తెలుగు పద్యానికి యీ గుణాన్నిస్తున్నాయి. తెలుగు ఛందస్సులో యతి సంస్కృతంలోలాగా విరామం కాదు. అక్షరమైత్రిని నియమిస్తుంది. విరామ నియమం పద్యానికొక ప్రత్యేక లయనిస్తే, అది లేకపోవడం వలన పద్యం ప్రవాహంలా సాగే అవకాశం కలుగుతుంది. సంస్కృతంలో లాగా పాదాంతంలో విరామం కూడా తెలుగు పద్యాలకి అవసరం లేదు. తెలుగు కవులు ఈ గుణాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. అందుకే తెలుగు ఛందస్సు కవి చేతిలో దౌడుతీసే గుఱ్ఱంఅయింది. ఐతే కేవలం విరామ యతి లేకపోయినంత మాత్రాన పద్యం ప్రవాహంలా సాగదు. “సంధి” దీన్ని సమర్ధంగా నిర్వహిస్తుంది. “సారమతిన్ కవీంద్రులు” అని అనాలంటే, “సారమతిన్” అన్న పదానికీ “కవీంద్రులు” అన్న పదానికి మధ్య కొంత వ్యవధి తప్పదు. అదే “సారమతింగవీంద్రులు” అని సంధి కలిపితే ఉచ్చారణ సులభతరమౌతుంది. వినడానికి కూడా సరళంగా ఉంటుంది. ప్రవాహ గుణం పద్యాలకి ఒక ప్రత్యేక నాదాన్నిస్తుంది. ఈ నాదం తెలుగు భాష సొత్తు. ఇది కేవల శబ్దాలంకారం కాదు. పద్యాన్ని ఛందోనుగుణంగా చదివే ఒడుపు తెలిసిన వాళ్ళకి ఇదేమిటో అనుభవమైన విషయం.

ఐతే ఇక్కడ రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి ఈ ప్రవాహగుణమనేది పద్యానికి నియతమైన లక్షణమా అన్నది మొదటి ప్రశ్న. ముందుగానే నేను చెప్పినట్టు, ఇది ఛందస్సు నిర్దేశించే లక్షణం కాదు. కానీ మన తెలుగు కవులు తెలుగు పద్యానికి ఈ అదనపు సౌందర్యాన్ని అందించారు. తిక్కనగారి పద్యాలలో ఇలాంటి గుణం ఉండదని చాలమంది భావిస్తారు కాని, అది అర్ధ సత్యం. తిక్కన గారు సంభాషణల విషయంలో పద్యపు నడకని లెక్కచెయ్యక పోవడం నిజమే కాని, వర్ణనలకి వచ్చేసరికి మాత్రం చాలా చోట్ల మంచి ధార గల పద్యాలనే రాసారు. దానికొక చక్కని ఉదాహరణ: ద్రౌపది ధర్మరాజు గుణగణాలని వర్ణించే సీసం – “ఎవ్వాని వాకిట నిభమదపకంబు రాజభూషణ రజోరాజి నణగు”. అంచేత తెలుగు పద్యానికి అవిశ్రాంతమైన నడక సౌందర్యాన్నిస్తుందనడంలో సందేహం లేదు.

ఇక రెండవ ప్రశ్న, ఈ ప్రవాహగుణం కేవలం ఛందోబద్ధమైన పద్యాలకి మాత్రమే ఎందుకు వర్తిస్తుంది, వచన కవిత్వానికి మాత్రం ఇది అందం కాదా అన్నది. వచన కవిత్వం శబ్దసౌందర్యాన్ని తృణీకరించి వెలసిన రూపం. కాబట్టి అటువంటి కవిత్వానికి ధారతో పని లేదు. సూటిగా మనసుని తాకడమే దీని ధ్యేయం. అంచేత భాష పాఠకునికి ఎంత సన్నిహితంగా ఉంటే అంత గుణం.

ఇప్పుడు ప్రశ్న – వాడుక భాష పద్యానికి అవసరమైన ప్రవాహ గుణం లేక ధారని కలిగించగలదా? మనం సాధారణంగా మాట్లాడే వాక్యాలకి ధార అవసరం లేదు, ఉండదు కూడా. సంధులు సాధారణంగా జరగవు. ఉచ్చారణా సౌలభ్యానికి కొన్ని కొన్ని చోట్ల జరుగుతాయి కాని అవి తక్కువ. ఆ జరిగే సంధులు కూడా తెలుగు సంధులే కాని, సంస్కృత సంధులు కావు. సంస్కృత సంధులు జరిగినప్పుడు వినిపించే నాదం, తెలుగు సంధులు జరిగినప్పుడు వినిపించదు. ఉదాహరణకి “అ”కారానికి “అ”కారం పరమైతే, సంస్కృతంలో సవర్ణదీర్ఘ సంధి జరిగి “ఆ”కారం వస్తుంది. అదే తెలుగులో అచ్సంధి జరిగి “అ”కారం మాత్రమే మిగులుతుంది. అలాగే గుణ సంధి తీసుకున్నా, మూలపదాలలో లేని దీర్ఘం సంధి జరిగాక వస్తుంది. ఇలా దీర్ఘం తియ్యడంవలన, పదాలను వేగంగా ఉచ్చరించేటప్పుడు ఒక కొత్త నాదం వినిపిస్తుంది.

వాడుక భాషలో ప్రవాహగుణానికి ఆటంకం కలిగించే మరొక లక్షణం, ప్రధమా విభక్తి “ము” స్థానంలో బిందువు రావడం. “స్నానం”, “స్నానము” రెండూ కూడా నాల్గుమాత్రల పదాలే ఐనా, “స్నానము చేసి” అన్నప్పుడు కలిగిన ధార “స్నానం చేసి” అన్నప్పుడు కలగదు. గ్రాంధిక భాషలో “ము”కారం బిందువుగా రూపాంతరం చెందదు.

కాబట్టి తేలేదేమిటంటే, పూర్తి వాడుకభాషలో పద్యాన్ని నిర్మిస్తే, వాక్యాలు ముక్కలు ముక్కలుగా ఉండి పద్యంలోని అందం చెడిపోతుంది. ఐతే తేటగీతి, ఆటవెలది, కందం వంటి దేశి పద్యాలన్నీ చిన్న పద్యాలు. కాబట్టి వాటిలో ధార – వృత్తాలలో మాదిరిగా, మరీ అంత ముఖ్యమైన లక్షణం కాదు. అంచేత అవి వాడుకభాషలో రాసినా వాటి అందం పూర్తిగా చెడదు. పెద్దదైనా, తెలుగు ఛందస్సు మధ్యాక్కరకి కూడా ధార సాధ్యపడదు. అందుకు కారణం దాని ఛందస్స్వరూపం. సాగే లక్షణం కలిగిన రెండింద్రగణాల తర్వాత, ఆ ధారని ఠక్కున ఆపేసే ఒక సూర్యగణం, మళ్ళీ రెండింద్రగణాలూ తిరిగి ఒక సూర్యగణం – ఇది మధ్యాక్కర లక్షణం. కాబట్టి మధ్యాక్కరలో కూడా వాడుకభాష ఎక్కువగా ప్రయోగించవచ్చు.

వాడుకభాషలో పద్యాలు రాయడంలో ఉన్న మరొక కష్టం – వాడుకభాషలో పద్యకావ్యాలేవీ లేకపోవడం. ఇదేదో catch 22లా కనిపించవచ్చు కాని ఇది నిజంగా సమస్యే. ఛందోబద్ధమైన పద్యాలని, అక్షరం అక్షరం గణాలకి సరిపడా పేర్చుకొని రాస్తే అవి చాలా అసహజంగా, అతుకులబొంతలాగా తయారవుతాయి. ఈ విషయం పద్యాలు రాసే కొత్తలో చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది. ఒక ధారగా నడక సాగినప్పుడే పద్యానికి అందం వస్తుంది. మరి అలాంటి సహజ ధారతో పద్యాలు రాయడం ఎలా సాధ్యమౌతుంది? పూర్వ కవుల పద్యాలని కంఠస్థం చెయ్యడమే దీనికి సాధనం. కొన్ని వందల పద్యాలను చదివి చదివి వాటిని కంఠగతం చేసుకొని, వాటిలో ఉండే రకరకాల నడకలని మనస్సులో ముద్రించుకున్న మీదటే పద్యాలు ధారసిద్ధంగా రాయడం పట్టుపడేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇలా వందలకొద్దీ పద్యాలని కంఠస్థం చెయ్యాలంటే మనకున్నవి పద్యకావ్యాలే. అందులోని భాష కావ్యభాష. అందువల్ల వాటిని కంఠస్థం చేసి తిరిగి పద్యాలు రాయాలంటే కవులకి సహజంగా వచ్చేది ఆ కావ్య భాషే కాని, వాడుక భాష కాదు. అందమైన పద్యాలని వాడుకభాషలో రాయలేకపోవడానికి ఇది మరొక కారణం. ఉదాహరణకి చెరువు సత్యనారాయణశాస్త్రిగారని, మహా పండితులు, వాడుక యాసలో ఒక శతకాన్ని రాసారు. దాని మకుటం – “సల్లా యెంకట సుబ్బలచ్మి బతుకేలా నువ్వు లేకుండినన్”. ఇక్కడ “లేకుండినన్” అన్న గ్రాంధిక రూపం – అసహజంగా – చివరికి వచ్చిపడింది. ఏందువల్ల? రాసిన కవి పండితుడవడంవల్ల, పద్యరచనలో గ్రాంధిక భాష సహజంగా, అప్రయత్నంగా రావడం వల్ల.

కాబట్టి ఏతా వాతా తేలేదేమిటంటే, వాడుకభాషకి దగ్గరగా పద్యాలు, ముఖ్యంగా వృత్తాలు రాయడం సాధ్యమయ్యే పనికాదు. రాసినా పద్యానికుండే సొగసు చెడిపోతుంది.

మరి వాడుకభాషని వదిలేసి పూర్తిగా గ్రాంధికంలోనే పద్యాలు రాయాలా అని అడిగితే, నా సమాధానం కాదనే! వాడుకభాషకి దగ్గరగా పద్యకవిత్వం రాయడం కష్టమైన పనే అయినా, సరైన రీతిలో, సరైన పాళ్ళలో వాడుకభాషని పద్యాలలో ప్రయోగిస్తే ఆ పద్యాలకు చక్కని గుబాళింపు వస్తుంది. కవులు పద్యాలలో వాడుకభాషని ఎన్ని రకాలుగా ప్రయోగించారో కాస్త పరిశీలిద్దాం.

ఇంతకు ముందు పేర్కొన్నట్టుగా, వాడుకభాషలో పద్యాలు రాయడానికి దేశి ఛందస్సులో ఎక్కువ అవకాశం ఉంది. ఈ కిటుకు తెలుసుకొని చాలా వరకు వాడుకభాషని ఉపయోగించి పద్యాలు రాసిన వాళ్ళలో ప్రముఖంగా కనిపించేది శ్రీశ్రీ, అతని సిరిసిరిమువ్వ శతకం. ఇది పూర్తిగా కందపద్యాలలో రాసిన శతకం. చాలామటుకు వ్యవహారభాషలో రాసిన పద్యాలు. మచ్చుకో రెండు:

“ఏవేనా కొత్తవి రా
శావా? చూపించ”మంచు చంపేవాళ్ళం
తా వినడానికి నేనీ
జీవత్కృతి నాలపింతు సిరిసిరిమువ్వా!

బంగాళాఖాతంలో
సంగీతం పారవైచి సాయంకాలం
కాంగానే ఆకాశపు
చెంగావిని త్రాగెనొకడు సిరిసిరిమువ్వా!

వాడుకభాషలోని చిన్నచిన్న వాక్యాలు చిన్న పద్యమైన కందంలో ఎంత అందంగా ఒదిగాయో ఈ పద్యాలని చూస్తే తెలుస్తుంది. రెండవ పాదం చివరిలో గురువు రావడానికి, మొదటి పద్యంలో “చెప్పేవాళ్ళంతా” అన్న వాడుకప్రయోగం ఉపయోగపడితే, రెండవ పద్యంలో “సాయంకాలం” అన్న వాడుకరూపం అక్కరకు వచ్చింది. అలాగే “కాంగానే” అన్న వ్యవహార ప్రయోగాన్ని ప్రాసకి ఎంత హాయిగా ఉపయోగించుకున్నాడో చూస్తే, శ్రీశ్రీ కందాశ్వపు హృదయాన్ని ఎంత చక్కగా తెలుసుకున్నాడో అర్థమవుతుంది.

అబ్బూరి వరదరాజేశ్వర రావుగారు వాడుకభాషలో “చెరకాలం” అన్న పేరుతో పద్యాలు రాసారుకాని అవి ఎక్కడో మరుగున పడిపోయి ప్రచురణ భాగ్యం పొందలేదు.

కొంత వెనకటి కాలంలో, పూర్తి వాడుకభాషలో రాసిన కావ్యాలేవీ ప్రచారం పొందిన దాఖలాలు లేవు. గ్రామ్యభాషా పదాలతో, యాసతో రాసిన “చంద్రశేఖర శతకం” ఒకటి ఉందికాని అది ఎవరు రాసారో తెలీదు. మచ్చుకొక పద్యం:

సంగతికాడ పాడకిక సాలును, నీవది పాడినందుకున్
యింగిత మెంచి నేను మరి యిన్నదుకున్ సరిపాయె, ఇంకపై
గంగుగ నే తలూపినటి యప్పుకు తంబుర నీడబెట్టి పో!
బంగుడ బాపనోడయని పల్కును మూర్ఖుడు చంద్రశేఖరా!

ఐతే ఇక్కడ గ్రాంధిక, గ్రామ్య భాషల కలయిక పాలూ నీళ్ళలాగ కాక బియ్యం రాళ్ళలాగా ఉన్నట్టనిపిస్తుంది.

కూచిమంచి తిమ్మకవి రాసిన పార్వతీ వల్లభశతకంలోనూ, కుక్కుటేశ శతకంలోనూ గ్రామ్యభాషా ప్రయోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకి ఈ పద్యం చూడండి:

అబ్బబ్బ కిందటే డప్పయ్య తీర్తాన
జోలె జంగమ కిస్తి సోలెడప్పు
సాతాని జియ్యరు సతికితే పోయిస్తి
కొల్లగా గుల్లెడు సల్ల బొట్టు
లంక సత్తెల వాడు పొంకాన పొగిడితే
మాలదాసరి కిస్తి మానెదూడ
లేదాలు వాగితే యెల్లుబొట్టయ్యకు
కొలకుండ దోసెడు కొర్రలిస్తి

ఔర! తమకన్న కూసుగా డవలనింక
గలడె యను మూర్ఖుడిద్ధర, కామవైరి
భూనుత విలాస! పీఠికాపుర నివాస!
కుముదహిత కోటి సంకాశ! కుక్కుటేశ!

సీసానికున్న తూగు చెడకుండా గ్రామ్యభాషలో చక్కగా సాగిందీ పద్యం.

ఆధునికకాలంలో పూర్తిగా యాసలో సాగిన సీసాలు కాళ్ళకూరివారి “చింతామణి” నాటకంలో ఉన్నాయి.

ఇంటిలో కాలెట్టనిచ్చిందె శానని
యేలకు యేలు గుప్పేసినాను
పిల్ల సౌత్తాడింది పెట్టాలి తిళ్ళంటె
బళ్ళతో సావాన్లు పంపినాను
యేపూట కాపూట యెచ్చని సిరుతిళ్ళు
పట్టుకెళ్ళి మొగాన గొట్టినాను
మేలాని కెల్లొచ్చి మెదలక తొంగుంటె
బిడియవిడిసి కాళ్ళు పిసిగినాను

అరదరేతిరికాడ ఆరికీరికి సీట్లు
మొయ్యమంటే కూడ మోసినాను
యిన్ని సేసినోణ్ణి యీడ్చి పారేశారు
తక్కినోళ్ళమాట లెక్కయేంటి?
యేవి లాబ మట్టి యెదవల కొంపల
కెల్లకండి, యెల్తె తల్లి తోడు!

పద్యం చెప్పేది సుబ్బిశెట్టికావడం వల్ల, అది దేశిఛందస్సైన సీసంలో ఉండడం వల్ల ఇక్కడ వాడుకభాష అందాన్నిచ్చింది.

వాడుకభాషా పదాలు అక్కడక్కడా ప్రయోగించిన సందర్భాలు ప్రాచీన పద్యకావ్యాలలో చాలానే కనిపిస్తాయి. ఇంతకు ముందు చెప్పినట్టు, తిక్కన భారతంలో ఎక్కువ వాడుక పదాలు కనిపిస్తాయి. ఐతే వాడుక భాషలోని క్రియారూపాలు పద్యాలలో కనిపించడం అరుదు. ఈ నాటి వాడుకలో ఉన్న క్రియా రూపాలకి దగ్గరగా కనిపించే పదప్రయోగం బహుశా మొదటగా శ్రీనాథుని చాటువుగా చెప్పబడే ఈ క్రింది పద్యంలో కనిపిస్తుంది:

దస్తాలున్ మసి బుర్రలున్ గలములున్ దార్కొన్న చింతంబళుల్
పుస్తుల్ గారెడు దుస్తులున్ జెమట కంపున్ గొట్టు నీర్కావులున
అస్తవ్యస్తపు కన్నడంబును భయంబైదోచు గడ్డంబులున్
వస్తూ చూస్తిమి రోస్తిమిన్ బడమటన్ వ్యాపారులన్ గ్రూరులన్!

ఇందులోని “వస్తూ”, “చూస్తిమి”, “రోస్తిమి” అన్నవి వాడుకలో కనిపించే క్రియాపదాలు.

ఇలాగే కూచిమంచి జగ్గకవి చంద్రరేఖా విలాపంలో కూడా “వస్తాడు”, “తెస్తాడు” వంటి క్రియారూపాలు కనిపిస్తాయి.

ఇప్పటి వరకూ మనం చూసినవన్నీ భాష తాలూకు బాహిరమైన రూపానికి సంబంధించిన లక్షణాలు – పద రూపాలు, వాక్య నిర్మాణం మొదలైనవి. వాడుక భాషకి అంతస్స్వరూపం కూడా ఒకటి ఉంటుంది. దానిని ఆకళించుకొని అది పద్యాలలో నిక్షేపిస్తే, వాడుకభాషలో మహాకావ్యాలని కూడా సృష్టించవచ్చు. నిజానికి అలా చేసినప్పుడే అవి మహాకావ్యాలవుతాయి. ఆధునిక కాలంలో అలా వెలసిన మహాకావ్యమే “రామాయణ కల్పవృక్షం”. వాడుక భాష పద్యాలకి పనికిరాదన్న విశ్వనాథే రామాయణ కల్పవృక్షంలో “నాది వ్యవహార భాష” అని చెప్పుకున్నారు. ఐతే ఆ వ్యవహారభాషా స్వరూపమేమిటో కూడా ఇలా వివరించారు:

“…తెలుగు మేల్
నుడికారమ్ములు, దేశ్యముల్, పలుకుబళ్ళున్, జాతి మాట్లాడు కై
వడి సత్కావ్యములొప్పు నాంధ్రమున”.

రామాయణ కల్పవృక్షంలో కనిపించే వాడుక నుడికారమూ, పలుకుబళ్ళూ చదివితే ఒక మహాకావ్యంలో, అందులోనూ పద్యకావ్యంలో ఇటువంటి భాషకూడా ఉపయోగించవచ్చా అని ఆశ్చర్యపోతాం. ఆ భాష సందర్భోచితంగా ఉండి, గుండెకు తాకుతుంది కూడా. కల్పవృక్షంలోని తెలుగు వాడుక భాషని గురించి చెప్పాలంటే, అది పీ.హెచ్.డీకి తగిన అంశమే అవుతుంది. ఈ విషయమ్మీద పుస్తకాలు కూడా వచ్చాయి. ఈ వ్యాసంలో ఒక మెతుకు మాత్రమే రుచి చూపించగలుగుతాను.

కల్పవృక్షంలోని వాడుకభాషని ఒక మూడు దృక్కోణాలనుండి పరిశీలించవచ్చు:

 1. వాడుక భాషలోని సామెతలు, నుడికారము, పలుకుబడి
 2. తెలుగు భాషకి ప్రత్యేకమైన వాక్యవిన్యాసం
 3. తెలుగు సంభాషణల్లో కనిపించే గడుసుదనం, ఒడుపు, కాకువు

కల్పవృక్షంలో తెలుగు సామెతలు అసంఖ్యాకంగా కనబడతాయి. “ఒక చోట కురుపు మందింకొకచోటన్నట్లు” వంటి దేశిపద్యాలలో ఒదిగిన చిన్న చిన్న సామెతలూ కనబడతాయి. “మన బంగారము మంచిదైనయెడ గంసాలిన్ మరేలాయనన్” వంటివి వృత్త పద్యాలలో అతికిన పెద్ద సామెతలూ కనిపిస్తాయి.ఒక చిన్న ఆటవెలదిలో రెండు సామెతలను అపురూపంగా పొందుపరచిన సందర్భమూ కనిపిస్తుంది.

“అయినవారికేమొ ఆకులయందును,
కానివారికేమొ కంచములను
ఇంటిలోన దినుచు నింటి వాసంబుల
లెక్కపెట్టునట్టి లెక్కగాక”

ఇలాగే తెలుగు వ్యవహారంలోని నుడికారమంతా వడబోసి పద్యాలలో నింపినట్లనిపిస్తుంది. బాల రాముని ఉయ్యాలలో వేసే వేడుక సందర్భంలో అమ్మలక్కల మాటలు దీనికి చక్కని ఉదాహరణ:

“నోరు పెగలదటే నీకు నూరక తెగ
రాలిపోదువు కూనిరాగాల తోడ
బిఱ్ఱబిగిసెదు తొట్టెను బెట్టు స్వామి
నేలగా బాడగా నొక్క జోలపాట”

అలాగే విశ్వామిత్రుని కథలో, “ఫో! వశిష్ఠుని పని అయిపోయెనంచు బరువు లిడుచేగె” అని అనడంలో ఉట్టిపడే తెలుగు నుడికారపు సొగసు అనుభవైకవేద్యం.

కొన్ని సందర్భాలలో ఛందస్సుకి అనుగుణంగా జాతీయాలని కొంత మార్చి, లేదా సంస్కృతీకరించి చెప్పిన సందర్భాలు కూడా కల్పవృక్షంలో ఉన్నాయి. కాని అవి పాఠకునికి అంత స్ఫూర్తినిస్తాయా అన్నది సందేహమే. ఉదాహరణకి, “నీదయ లేక నేటికి సముద్రాలయ్యె మా గుండియల్” అన్నది “గుండె చెరువయ్యిందన్న” జాతీయానికి చేసిన మార్పు. “నా శిరమున నోరుపెట్టుకొని చెప్పిననైను విశ్వసింతురే” అన్నది “నెత్తిన నోరుపెట్టుకొని చెప్పడం” అన్న జాతీయానికి సంస్కృతీకరణ.

రామాయణ కల్పవృక్షంలో ప్రత్యేకంగా చెప్పుగోదగినవి తెలుగు వాడుకలోని పలుకుబళ్ళను యథాతథంగా పద్యాలలో పలికించడం. “గోల పెట్టు”, “కిక్కురుమనలేదు”, “దిమ్మెక్కి” మొదలైన పలుకుబళ్ళైతేనేమి, “రా అమ్మా”, “అది కాదమ్మా” మొదలైన సంబోధనలైతేనేమి పద్యాలలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఆంజనేయుడు రావణుని ప్రాసాదరక్షకులని చంపినప్పుడు, వనపాలకులు రావణుడికి ఆ వార్తను మోసుకెళ్ళిన సందర్భంలో “ఓరి బాబోయి! వీడు మహోగ్రభుజగము” అంటారు. ఆ పలుకుబడి ఎంత సహజసుందరంగా ఉందో గమనించండి. కల్పవృక్షంలో కనిపించే వాడుక పదాలలో ఊతపదాలుకూడా భాషకి సహజత్వాన్నిస్తాయి. కాకాసురుడు సీతాదేవితో మాట్లాడే సందర్భంలో “అది కాదు కాని తల్లీ! ఇది చెప్పుము” అంటాడు.

ఇక వాడుకభాషలోని వాక్యవిన్యాసాన్ని అలాగే ప్రయోగించిన సందర్భాలుకూడా అనేకం ఉన్నాయి. సుమంత్రుడు దశరథునితో, “నాతో రా!” అంటాడు! ఇది కందపద్య భాగం. ఇంతకన్నా వాడుకభాష మరెక్కడా ఉండదు. ఇక్కడ సందర్భం బట్టి అది ఎంతో సమంజసంగా కుదిరింది. సుమంత్రుడుకి దశరథుని దగ్గరున్న చనువు ఎంతటిదో ఇది స్పష్టం చేస్తుంది. అలాగే మిథిలకు వచ్చిన విశ్వామిత్రునితో జనక మహారాజు, “ఇది మీయిల్లు” అంటాడు. ఇంతటి వ్యావహారిక ప్రయోగం, ఒక మత్తేభ పద్యం మొదలని ఎవరైనా ఊహించగలరా! అలాగే విశ్వామిత్రుడు రాముణ్ణి తనతో పంపని దశరథుని అడిగినప్పుడు, దశరథుడు సందేహిస్తూంటే, “నీ కొడుకును గైకొని చని మా కాకలి యంచు దిందుమా, పిచ్చి నృపా!” అంటాడు. ఇలా విశ్వనాథ విశ్వామిత్రుడే అనగలడు!

వాడుకభాషలో కొన్నిసార్లు కొన్ని వాక్యాలని ప్రత్యేకమైన క్రమంలో ఉపయోగిస్తాం. ఆ క్రమంలో ప్రయోగించడం వల్ల ఒక ప్రత్యేకమైన ధ్వని కలుగుతుంది. అలాంటి వాక్య విన్యాసాన్ని యథాతథంగా ఛందోబద్ధం చెయ్యడం కూడా కల్పవృక్షంలో చూడవచ్చు. ఉదాహరణకి పుత్రకామేష్టి సందర్భంలో జటాయువు వచ్చినప్పుడు, దశరథునిలో కలిగిన ఉత్సాహం, “నీవు జటాయువా! సఖుడ! రా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకున్ నన్నున్ లోనదలంచినావు” అన్న వాక్యంలో ఎంత స్పష్టంగా ధ్వనిస్తోందో గమనించండి. ఇది శార్దూలంలో హాయిగా ఒదిగిపోయిన వాడుక భాషలోని వాక్యవిన్యాసం. అలాగే దశరథుడు రాముని తన వెంట పంపనన్నప్పుడు, విశ్వామిత్రుడెలా మాట్లాడతాడో చూడండి:

“అవునయ్యా! అవునిత్తునంటి మొద లీయంతంబునం దీయనం
టివి; పోనీ! రఘువింట యోగ్యమగునో నీ చేత! నీకున్ సుఖం
బవు నీ బంధులు నీవునున్ సుఖము పెల్లైయుండు డే బోదు మా
నవనాథా! సుఖమౌత నీకును బ్రతిజ్ఞాభంగ పుణ్యాబ్ధికిన్!”

పద్యాలలో వ్యవహారభాషా సౌందర్యమంటే ఇదీ!

మనం మాట్లాడేటప్పుడు, ఒకోసారి, రెండు వాక్యాలు కలిపి మాట్లాడుతూ ఉంటాం. సాధారణంగా ఎదో ఒక ఆవేశంలో ఉన్నప్పుడిది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా పద్యంలో సాక్షాత్కరిస్తుంది. లక్ష్మడు తనతో ఇలా అన్నాడని, దశరథునితో సుమంత్రుడు చెపుతున్నాడు:

“నా ప్రాణంబులలోని ప్రాణమగు నన్నన్ దండ్రి యీ రీతిగా,
నే ప్రారబ్దమొ – తండ్రికిన్ మరలదా నీ స్వామి యూహావసా
న ప్రేమాస్పదు – డిట్లె పంపె జుమి కాంతారమ్ము! నా కోపమున్
దీవ్రంబై దహియించుచున్నయది నన్నే నన్నె తానెంతయేన్”

ఇలాంటి వాక్య విన్యాసం ఒక్క తిక్కనలో కనిపిస్తుంది, మళ్ళా విశ్వనాథలో కనిపిస్తుంది.

ఇక – తెలుగు మాటల్లో కనిపించే ఒడుపు, గడుసుదనం గురించి చెప్పాలంటే, రామాయణ కల్పవృక్షమంతా ఉదహరించాల్సిందే! అందులోనూ విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకి కథలు చెప్పే విధానమంతా ఈ చమత్కారమే కనిపిస్తుంది. సాగరుల కథని ఎలా ప్రారంభిస్తాడో చూడండి:

“అసలు కథ చెప్పెదను వినుడంచు మౌని
పుడమి పడతికి బెట్టిన పునుగు బొట్టు
కలదయోధ్య యటన్న చక్కని పురంబు
మీఱెరుంగుదురే యన వారు నగుచు
మే మెరుంగుదు మన మౌని మేలు మేలు
మీరెరింగిన గథలోని మేలి సగము
నెఱుగుదురె యంట యప్పుర మేలు దొల్లి
యనగ ననగను సగరుడన్నట్టి రాజు”

ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే ఓ పెద్ద గ్రంధమై కూర్చుంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు స్వయంగా రామాయణ కల్పవృక్షం చదివి అందులోని తెలుగుదనాన్ని, వాడుక భాష సొబగును తనివితీరా ఆస్వాదించవచ్చు.

ఇలాంటి మహాకావ్యాలని చదివి, పద్య కవిత్వానికి వ్యవహార భాష ఎలా సౌరభాన్ని చేకూరుస్తుందో, రస విస్ఫూర్తి కలిగిస్తుందో తెలుసుకొని ఆ మార్గంలో పద్య కవులు పయనిస్తే, పద్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.

ఉపయుక్త గ్రంధాలు:

 1. “వ్యావహారిక భాషా వికాసము – చరిత్ర” – డా. జె. సూర్యనారాయణ
 2. “గురజాడ రచనలు – అసమ్మతి పత్రం” – గురజాడ అప్పారావు
 3. “కవిత్వ భాష” (భాషాంతరంగం నుండి) – ఆచార్య చేకూరి రామారావు
 4. “సిప్రాలి” – శ్రీశ్రీ
 5. “పద్యారామం” – బేతవోలు రామబ్రహ్మం
 6. “పద్యాల్లో పల్లెదనం” (నవ్వుటద్దాలు నుండి) – ఆచార్య తిరుమల
 7. “గ్రామ్యమా? వాడుక భాషా?” – విశ్వనాథ సత్యనారాయణ
 8. “శ్రీమద్రామాయణ కల్పవృక్షము” – విశ్వనాథ సత్యనారాయణ
 9. “రామాయణ కల్పవృక్షం – తెలుగు దనం” –
 10. “రామాయణ కల్పవృక్షం – భాష” (విశ్వనాథ సాహితీ సమాలోచనం నుండి) – డా. ఆర్. శ్రీహరి