తెలుగదేల యన్న …

నాకు అయిదు సంవత్సరాలు వచ్చేదాకా నేను చక్కని తెలుగు మాట్లాడే దాన్నట. బడిలో చేరిన తరవాత ఇంగ్లీష్‌ అలవాటైపోయి మెల్లిమెల్లిగా తెలుగు మరిచిపోయినాను. అది ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగిన సంగతి. కాని ఈ రోజుల్లో కూడ రెండు మూడేండ్ల వయసున్న పిల్లలు తెలుగు మాట్లాడుతుంటే, “ఇంకెంత కాలం మాట్లాడుతారట్లా?” అని అందరు అనుకుంటారే తప్ప, ఆ వయస్సులో ఉన్న కేపబిలిటీని ఎట్లా నర్చర్ చేయ్యాలి అని ఎక్కువ మంది ఆలోచించరు. పిల్లలు భరతనాట్యం, సంగీతం, బాలవిహార్‌ ఎన్ని చేసినా, అయిదు యేండ్లు దాటిన తరవాత, వాళ్ళ ఇష్టాలు, కష్టాలు, భావాలు, ఆశలు తెలుగులో చెప్పుకోవటం చాలా తక్కువ. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడ ఇట్లాగే నడుస్తోంది.

దీని వల్ల ఎంత నష్టం ఉంది? ఈ రోజుల్లో తెలుగు వాళ్ళు కలిసినా, ఎక్కువ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతారు. అట్లాంటప్పుడు పిల్లలకి ఎందుకు? అని అడగచ్చు. కాని, మనం మాట్లాడేదాంట్లో నాలుగోవంతు, పదోవంతు తెలుగైనా ఆ సంభాషణలు ఇంగ్లీష్‌ లో కుదరవు. కొన్ని నాజుకైన భావాలు, పలకరింతలు, ఆప్యాయతలు తెలుగు పదాలలో మాత్రమే చెప్పగలుగుతాము. అవి లేకపోతే విషయాలు తెలపగలము, కాని అల్లం పచ్చిమిరపకాయ లేని పెసరట్టు లాగా చప్పగా ఉంటుంది. అందుకని ఈమేల్‌ పంపినప్పుడు ఏవో కష్టాలు పడి తెలుగుని రోమన్‌ లిపి లోగాని, ఇలాగే యూనీకోడ్‌లో గాని ఎలాగోలా వ్రాస్తాము.

భాష మన అలోచనలని వ్యక్తపరచడానికి ఒక సాధనం మాత్రమే కాదు, మనం ఏం అలోచించగలమో, ఎట్లా అలోచిస్తామో మనకు తెలిసిన భాషా, మనకు పరిచయమున్న పదజాలం (vocabulary) నిర్దేశిస్తుందని భాషాశాస్త్రజ్ఞుల అభిప్రాయం. దాదాపు రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక భాష మరుగునపడిపోతే ఆ భాష ద్వార తెలిసే ఆ ప్రజల సంస్కృతి, చరిత్ర, ఆ భాషలోని పదాలకుండే రంగు, రుచి, వాసన, ఆత్మ, ఆ భాష ద్వారా మాత్రమే ఊహించగలిగే ఊహలు – అన్నీ మరుగునపడిపోతాయి.

నాకు పదిహేనేండ్లు వచ్చే దాకా అమెరికాలో పెరిగిన నా స్నేహితులందరి లాగే తెలుగు అర్థం అయ్యేది కాని మాట్లాడటం అస్సలు చేతనయ్యేది కాదు. అప్పట్లో ఒకసారి ఇండియాకి వెళ్ళొచ్చిన తరువాత నాకు ఎంతోమంది అత్తలు, పిన్నులు, దొడమ్మలు, పెద్దనాన్నలు, అక్కలు, అన్నలు, బావలు, వదినలు బాగా పరిచయం అయ్యారు. నాకు ఎప్పుటినుంచో ఉత్తరాలు వ్రాయటం అంటే చాలా ఇష్టం. హైస్కూల్లో చదువుతున్నప్పుడు నాకు వేరే దేశాల్లో పెన్-పాల్స్ ఉండేవారు, అందరికీ ఉత్తరాలు వ్రాసే దాన్ని. అట్లాగే మా చుట్టాలతొ టచ్ లో ఉండటానికి ఉత్తరాలు వ్రాయాలని కొరుకున్నాను. అందుకే ఆ రోజుల్లోనే నేను పట్టుదలతో కృషి చేసి తెలుగు మాట్లాడటమే కాక, చదవటం, వ్రాయటం కూడా నేర్చుకున్నాను.

చిన్నప్పుడు భాషలు చాలా సులభంగా నేర్చుకోవచ్చు. చిన్నప్పటినుండి నేను తెలుగు కూడా వాడుతూ ఉండి ఉంటే చదవటం, వ్రాయటం చాలా తొందరగా వచ్చేవి. ఇప్పటికీ నాకు ఒక్క పేజి చదవటానికి 10-15 నిమిషాలు పడుతుంది. అదే ఇంగ్లీష్‌ ఐతే గంటలో 50-100 పేజీలు చదవగలను. అదే వేగంలో నాకు తెలుగు కూడా చదవటం వస్తే నేను ఎన్నెన్నో పుస్తకాలు చదవగలుగుతాను. విద్యా దానం కన్న గొప్ప దానము లేదంటారు. ఈ విద్యని మన తరానికి, వచ్చే తరానికి ఇవ్వగలిగే శక్తి ఉందా మన దగ్గిర?

తెలుగు గురించి ఆరాటపడుతూ ఇప్పుడు ఈ వ్యాసం రాయటానికి వ్యక్తిగతంగా నాకు రెండు కారణాలు ఉన్నాయి. University of Wisconsin లో నేను M.A. thesis కి తెన్నేటి హేమలత వ్రాసిన ఒక నవల అనువాదం చేసి దాని గురించి ఒక పేపర్‌ వ్రాసాను. అప్పుడే South Asian Studies లో dissertation కోసం ఉన్నవ లక్ష్మి నారాయణ వ్రాసిన “మాలపల్లి” నవల గురించి పని చెయ్యాలనుకున్నాను. క్లిష్టమైన సమకాలీన సామాజిక సమస్యలని చిత్రీకరించడంలో మాలపల్లి అంతర్జాతీయ స్థాయిలో నిలువగలిగే ఒక గొప్ప రచన అని నా అభిప్రాయం. By translating and writing a study on the novel, I would like to bring this important voice to bear in the representation of India’s people, history, and intellectual journey.

కానీ AID అభివృద్ధి ప్రాజెక్ట్‌లపై స్వయంగా పని చెయ్యాలన్న కోర్కె బలపడి ఇండియా వెళ్ళాలని నిర్ణయించుకోవటంతో నా డిసర్టేషన్‌ పని అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఇండియా గ్రామాలలో పనిచేస్తుంటే, నేను తలపెట్టిన సాహితీ పరిశోధన పూర్తి చేయటం ఎంత ముఖ్యమో నాకు తెలిసి వచ్చింది. ఈ పరిశోధన కోసం నేను చేసే కృషి సాహిత్య పరంగానే కాకుండా నా సామాజిక లక్ష్యాలకి కూడా తోడ్పడుతుందని నాకు బాగా అర్థమైంది. My own struggle for support to complete my graduate work is but a piece of a larger puzzle.

అయితే ఇట్లాంటి ఫీల్డ్‌ లో పని చేసే వాళ్ళు ఎవరైనా, సహాయం అంతా తొందరగా దొరకదు అని చెప్తారు. ఇట్లాంటి పరిశోధనను ప్రోత్సహించే కొన్ని ప్రభుత్వ సంస్థలు,అవి ఇచ్చే గ్రాంటులు ఉన్నాయి. కొంచెం కష్ట పడితే, కొంచెం అదృష్టం కూడా ఉంటే అవి కొంత మందికి, కొన్నాళ్ళ వరకు దొరుకుతాయి. కాని ఇంకొంత మంది ఈ రంగంలో లో నిలబడాలంటే, ఇంకొన్ని sources of support ఉండాలి. The cultural, literary, and social organisations of Telugu people are natural and fitting sources, and must rise to the challenge.

తెలుగు గురించి ఇప్పుడు రాయటానికి బలమైన రెండవ కారణం: రెండు సంవత్సరాల వయస్సు ఉన్న మా అమ్మాయి. తనకి తెలుగు పద్యాలన్నా, పాటలన్నా, కథలన్నా చాలా చాలా ఇష్టం. తను ఇప్పటికే తెలుగు అక్షరాలు గుర్తు పట్టగలుగుతోంది కాని తను చదవడానికి ఉన్న తెలుగు పుస్తకాలు చాలా తక్కువ. మేము గ్రామాలలో మొదలుపెట్టిన కార్యక్రమాలలో కూడా ఇదే సమస్యని ఎదురుకుంటున్నాం. చిన్న చిన్న గ్రంథాలయాలు స్థాపించి గ్రామాల్లో ఉన్న పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచాలనుకుంటే మాకు తగినన్ని పుస్తకాలు దొరకటం లేదు. చిన్న వయస్సులో తెలుగు నేర్పడానికి కావలసిన పుస్తకాలు, వనరుల కొరత మాకు స్పష్టంగా తెలుస్తోంది. పిల్లల స్థాయిలో చదువగలిగే తెలుగు పుస్తకాల ముద్రణ ఖచ్చితంగా చాలా అవసరం.

అమెరికాలో పెరిగిన తెలుగు వాళ్ళలో కొంత మంది ఉన్న వనరులతో తెలుగు చదవటం, వ్రాయటం నేర్చుకుంటున్నారు. అంతలో కొంత మంది విశ్వవిద్యలయాల్లలో కూడ తెలుగు చదువుతున్నారు. వాళ్ళలో కొంతమంది తెలుగు నేర్పే విధానాన్ని గురించి కొన్ని ప్రయోగాలు చేయవచ్చు. దాని కోసం instructional materials తయారు చేయవచ్చు. కాని ఇది ఖాళీ సమయంలో చేసే పని కాదు. దీనికి కొన్ని సంవత్సరాలు పూర్తి సమయం పని చేస్తే మంచి పుస్తకాలు, ఆడియో ఫైల్స్‌ తయారు అవుతాయి.

ఇండియా నుండి కళాకారులని, సాహితీకారులని రప్పించి ప్రోత్సహించడంలో అమెరికా సాంస్కృతిక, సాహితీ సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమే. కానీ తెలుగు సాహిత్యాన్ని, భాషనీ కాపాడుకోవటానికి ఈ కృషి సరిపోదు. మన సంస్కృతిని, సాహిత్యాన్ని, భాషని రక్షించుకోవటం ఆ సంస్థల లక్ష్యాలలో ఒకటని చెబుతారు కాబట్టి వారు భాష, విద్యా బోధన, సాహిత్యం మొదలైన అంశాలపై విస్తృతమైన పరిశోధనకు కావలసిన వనరులని, వసతులని కల్పించాలి. తెలుగు భాషా, సాహిత్యాల మీద పని చెయ్యాలనుకున్న గ్రాడ్యువేట్‌ స్టూడెంట్లకు financial support అందజేయాలి. ఆర్థిక సహాయం కోరుకునే విద్యార్థులు ఈ సంస్థలకి సులభంగా అప్లై చేయగలగాలి. తెలుగును second language గా బోధించడానికి కావలిసిన మెటీరియల్‌ని తయారు చేయటానికి విద్యావేత్తలనుండి తెలుగు యువతీయువకుల వరకూ – ఆసక్తి ఉన్న కమ్యూనిటీ సభ్యులందరూ పాల్గొనే లాగా పథకాలు రూపొందించి అమలు చెయ్యాలి. ప్రతీ సంస్థ వారి బడ్జెట్‌లో 5-10% దాకా ఇటువంటి ప్రాజెక్టులకోసం కేటాయించగలగాలి. అ, ఆ లు నేర్చుకొనే వాళ్ళ దగ్గరనించి గ్రాడ్యువేట్‌ స్టడీ చేసే వాళ్ళ వరకూ అందరినీ సపోర్ట్‌ చేసే బాధ్యతను చేపట్టాలి. ఈ బాధ్యతలని అశ్రద్ధ చేస్తే, ఈ తరానికి, వచ్చే తరానికీ రావలిసిన ఆస్తిని పరిహరించిన వాళ్ళం అవుతాము.


రచయిత అరవింద పిల్లలమఱ్ఱి గురించి: చిన్నప్పటినుండీ అమెరికాలో పెరిగి తెలుగు సాహిత్యంపై పరిశోధన సాగించిన ప్రవాసాంధ్రులలో అరవింద మొట్టమొదటి వ్యక్తి. AID సంస్థాపకుడైన తన భర్త రవి కూచిమంచితో తో పాటు 1998లో ఇండియా వెళ్ళి ఆ సంస్థ ఎన్నో కొత్త కార్యక్రమాలను రూపొందించి, విజయవంతంగా పూర్తి చేయడంలో క్రియాశీలక పాత్ర వహించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నడుపుతూ, అడపాదడపా చేసే రచనల ద్వారా తమ ఆశయాలకు గొంతునివ్వడం ఈ దంపతుల వృత్తి, ప్రవృత్తి. ...