కథలో, నవలలో, నాటికలో, నాటకంలో కథానాయకుడున్నట్లు, మరీ personal poem కాకపోతే కవితలో కూడా కవితానాయకుడు ఉండవచ్చు. The hero of the poem is the result of the transformation of the poet’s own self to meet the needs of a poetic situation. కవితానాయకుడికి, కవికి ప్రబలమైన పోలికలుండవచ్చు, ఉంటాయి కూడా. కవితానాయకుడు కవిసంకల్పం నుండి, సృజనాత్మకశక్తి నుండి ఉద్భవించినవాడు. అయినా కవి వేరు, కవితానాయకుడు వేరు:
నా నివాసమ్ము తొలుత గంధర్వ లోక
మధురసుషమా సుధాగానమంజువాటి
ఈ నివాసం కవితానాయకుడిది, కృష్ణశాస్త్రిగారిది కాదు. కృష్ణశాస్త్రిగారి నివాసం పిఠాపురం దగ్గర పల్లెటూరు. ఎట్లయితే ఆయన నివాసం గంధర్వలోకపు మంజువాటి కాదో, కవితలో చెప్పిన విషయాలు అన్నీ కవితానాయకుడివి. కృష్ణశాస్త్రిగారివి కావు. “మనసారఁగ నేడ్వనీరు నన్ను” అనే పంక్తిని బట్టి శాస్త్రిగారికి ఏడవాలని ఉంటుంది అనలేం గదా! Poetry need not be truth, factual truth. కానీ కవితలో apparent truth, essence of truth ఉండవచ్చు. Apparent truth పూర్తిగా కవితానాయకుడికి సంబంధించినది, essence of truth పూర్తిగా కవికి సంబంధించినది. అంటే కవితలో చెప్పిన విషయాలన్నీ కవితానాయకుడివి, ఆ విషయాల మూలతత్త్వం — essence of truth — పూర్తిగా కవికి సంబంధించినది. అంటే కవితలో కూడా కొద్దిపాటి dramatic element ఉండవచ్చునన్నమాట.
‘కృష్ణపక్షం’లోని కవితానాయకుడి ప్రేయసి ఒక మహాద్భుతమైన సౌందర్యరాశైన ఊర్వశి. ఆమే తన ప్రాణం, ఆమే తన ప్రేమకు, తన జీవితానికి ఆలంబనం. ఆమె దర్శనం కోసం, ఆమె అనుగ్రహం కోసం విరహంతో, వేదనతో విలపిస్తాడు తాను. ఈ గుణవిశేషాల మూలతత్త్వం కృష్ణశాస్త్రిగారి వ్యక్తిత్వం లోనిదే. శాస్త్రిగారి మూలతత్త్వం ఒక refined creative metamorphosis కి లోనై కవితానాయకుడిగా రూపుదిద్దుకున్నాడన్నమాట. కృష్ణశాస్త్రిగారి మూలతత్త్వపు essentials అలానే ఉండి, వారి కాల్పనిక సృజన నుండి కొన్ని తత్సంబంధిత attributes సంతరించుకుని కవితానాయకుడిగా ఆవిర్భవించాడన్నమాట.
ఇప్పుడీ పరిశీలన కృష్ణశాస్త్రిగారి మూలతత్త్వానికి, కవితానాయకుడి ప్రేమాధిక్యతకు సంబంధించినది. ఒక్కొక్కప్పుడు వారిరువురికి సంబంధించిన విషయాలు overlap అయినట్లు కనిపించవచ్చు, అలా కనిపిస్తాయి కూడా.
ఇంగ్లాండ్‌లో 18 వ శతాబ్దపు ఆఖరున ప్రారంభమై 19 వ శతాబ్దపు ప్రథమార్థం వరకు వెల్లువలా సాగిన కీట్స్, షెల్లీ, వర్డ్స్‌వర్త్, బైరన్, బ్లేక్ లాంటి romantic poets ప్రభావం మన భావకవులమీద అంతో ఇంతో పడక పోలేదు. మన భావకవిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం చేసేకంటే దాని ప్రాథమికలక్షణాలని పేర్కొనటం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందనుకుంటాను. దాదాపు పూర్తిగా వైయక్తికమైన అనుభూతులు, తపనలు, విరహాలు, వేదనలు, ఆనందాలు, ఊహాసుందరిని అలౌకికమైన సౌందర్యరాశిగా కీర్తించటాలు, ప్రేమైకదేవతగా ఆరాధించటాలు, తీవ్రమైన స్వేచ్ఛాకామనలు, ప్రకృతిని చూసి పారవశ్యం చెందటాలు, దేశభక్తి ప్రబోధాలు, ఆధ్యాత్మికనివేదనలు, భగవంతునికి విన్నపాలు దాదాపు సరళసుందరమైన భాషలో వ్యక్తీకరణలను భావకవిత్వం గా భావించవచ్చని అనిపిస్తుంది. వారి కవిత్వాన్ని గురించి కవులు, విమర్శకులు, సాహితీకారులు చెప్పిన తీరుతెన్నులను పరిశీలిస్తే భావకవిత్వం గురించి ఈ భావన సమంజసమేనని అనిపిస్తుంది.
తెలుగు భావకవిత్వరచనకు కృష్ణశాస్త్రిగారు ఆద్యులు కాకపోయినా అగ్రగణ్యులుగా సాహితీ లోకం గుర్తించింది. ఆయన భావనైశిత్యం, ఆయన కవితోహల లాలిత్యం, మృదుమధురమైన శబ్దసౌందర్యం ఆయన కవితారచన లోని విలక్షణతలుగా భావించవచ్చు.
తెలుగు భావకవులు అపురూపమైన ఊహాసుందరిని ప్రేయసిగా సంభావిస్తూ ప్రణయకవిత్వం వ్రాయడం వారి రచన గుణాత్మక విశేషమని మనం చూశాం. ‘ఇన్ని కల్పాలు’లో కవితానాయకుడారాధించే ఊర్వశి సౌందర్యరసాధిదేవతగా మనకు దర్శనమిస్తుంది — ఆతనికి ఆ దర్శనభాగ్యం కలగక పోయినా! ఈ కవితంతా ఆమె అలౌకిక సౌందర్యంతో ధగద్ధగితమవుతుంది. ఆమె ప్రేమ కోసం నిరీక్షణతో వేదనాభారంతో బీటలు వారిన ఆయన అంతరంగపు నిర్వేదం, నిట్టూర్పులు పరమోత్కృష్టమైన ప్రణయగీతాలుగా ఆవిర్భవిస్తాయి. ఈ గీతిక ఆమె యెడల ఆయనకున్న ఆరాధనను, అనంతమైన ప్రేమను, ఆత్మార్పణాభావాన్ని తెలియజేస్తుంది. ప్రత్యక్షదర్శనం కోసం అనంతంగా సాగినా ఫలించని నిరీక్షణ తన హృదయాన్ని శోకానలంతో దహిస్తుంది. అయినా ఆమె యెడల ప్రేమాధిక్యతలో మార్పు లేదు. అది తరగదు. వేదన ఉంటుంది, కానీ ఆ వేదనలో కూడా ఒక రకమైన సుఖానుభూతి ఉంటుంది. అందుకే అంటారు, “నాకు ప్రాణమె యగు వేదనాసుఖమ్ము” అని.
తన ప్రేమాధిదేవత ఊర్వశి దయార్ద్రహృదయిని. ఆమె పలకరింపే ఒక మహాప్రసాదం. పలుకుకందని తన ప్రేమాధిక్యతను ప్రకృతిమాత కనికరంతో యుగయుగాల అశ్రువర్షాలతో అడ్డుగా నిలచిన మాలిన్యాలను ప్రక్షాళనం చేసి స్వయంప్రకటితం గావిస్తుంది. ఉషఃకాలపు పిల్లతెమ్మెరల మీద ప్రతిఫలించే లలితలావణ్యమైన పల్చని వెన్నెల ఊర్వశీమహాదేవి మనోహరమూర్తిగా భాసిస్తుంది. ఆ సమయాన తెలిమంచులో మరింత స్నిగ్ధమై ముందుకు సాగే సుకుమారమైన పూతీగెగా ఆమె ద్యోతకమవుతుంది
నీవు తొలి ప్రొద్దు నునుమంచు తీవె సొనవు
నీవు వర్షాశరత్తుల నిబిడ సంగ
మమున బొడమిన సంధ్యాకుమారి వీవు
నిష్క్రమిస్తున్న వర్షఋతువు, వేంచేస్తున్న శరదృతువుల సంగమదినాల ముగ్ధమోహనంగా కనువిందు చేసే సంధ్యాకుమారిలో ఊర్వశీమహాదేవిని దర్శించినట్లవుతుంది. ఆయనకు శర్వరీకపోలాల మీద నావరించిన విషాదరేఖ ఊర్వశి. ఆయనకు ఆమే నిట్టూర్పు, ఆమే కన్నీరు. సర్వవ్యాప్తమైన అమూల్యవేదనాజీవి ఆమె. ఆమె ఊరట కోసం తాను గొంతెత్తి పాడుకునే విషాద గీతికలలో పరమోత్కృష్టమైన గీతికే ఊర్వశి.
వేదనామూల్య భాగ్యమీవే, నిజమ్ము
నే గళమ్మార పాడుకొనిన యఖాత
శోకగీతమ్ములందీవె శోకగీతివి!
ఊర్వశీ! ప్రేయసీ!
దిగంతాలను తాకే తన చూపు ప్రసరించేది ఊర్వశీమహాదేవి కోసమే.
‘ఆమె కనులు’ అనే గీతికలో ఊర్వశీమహాదేవి కనుల అపురూపమైన సౌందర్యం ఆవిష్కృతం గావటం చూసి మనం ముగ్ధుల మవుతాము. ఆమె వెడద కనుదోయిలో ప్రకృతిలోని సౌందర్యం అంతా గూడు కట్టుకున్నట్లు ఉంటుంది. ఆమె కనులు విశ్వమోహనాకృతులు. అనంతమైన ఆకాశంలోని నీలిమ ఆమె కనులలో కాంతులీనుతున్నది
ఆమె కన్నులలో ననంతాంబరపు
నీలి నీడలు కలవు
వినిర్మలాంబు
పూరగంభీరశాంతకాసార చిత్ర
హృదయములలోని గాటంపు నిదురచాయ
లందు నెడనెడఁ గ్రమ్ము
స్ఫటికనిర్మలమైన నీటితో నిండిన, గంభీరంగా ఉన్న సరస్సు యొక్క రాజససౌందర్యంలోని ఆకర్షణ, మైమరపు ఆమె కనులలో ప్రతిఫలిస్తున్నాయి. సంధ్యావసానసమయాన మార్దవమైన కదంబతరుశాఖల మీద చరించే శుకపికాదులు జేసే మధురమంజులనాదాలు అపుడపుడూ ఆమె కనులలో వినబడుతున్నాయి. కురియబోయే వానలతో బరువెక్కిన నల్లని మేఘాల వెనుకనుండి లీలగా మెరిసే కాంతి పుంజాలలో దాగిన నీటి తుంపరలు ఆమె నయనాలలో దర్శించవచ్చు. ఆమె కనుల పరమోత్కృష్టమైన సౌందర్యం హృదయాన్ని మధురభావ రాగరంజితం చేస్తుంది, భాష కందని మధురభావప్రపూరితాలైన భావగీతాలలాగా!
అలానే, ‘నా హృదయమందు’ కవిత గూడా ఆయన అపరిమితమైన, అలౌకికమైన సౌందర్యానుభవకాంక్షకు అద్దంపడుతుంది. ఊర్వశి యెడల ఉన్న ఆయన ఎనలేని ప్రేమ, ఆరాధనాభావం ఈ కవితలో గూడా ఆవిష్కృతమవుతుంది. అమరమైన, మధురమైన శబ్దసౌందర్య సంవిధాన సృజనలో దశ దిశాతంత్రులు నిమగ్నమై నక్షత్రాల మెట్ల మీదుగా ఆకాశ శిఖరారోహణ చేస్తూ మైమరపుతో నృత్యోత్సవాలు జరుపుకుంటున్న వేళ, ఆకాశం వెలుగులని, అమృతాన్ని, పుష్పాలని వర్షపు ధారల్లా కురుస్తున్నపుడు కవి హృదయం ఆనందాతిరేకంతో ఎగసెగసి పడుతున్న క్షీరసాగరమవుతుంది.
వెలుఁగులో యమృతాలొ తావులొ మఱేవొ
కురియు జడులు జడులు గాఁగ పొరలి పాఱు
కాలువలు గాఁగ, పూర్ణకల్లోలములు;
కలదు నాలోన క్షీరసాగరము నేడు!
సృష్టిలోని ఈ మహోత్కృష్టమైన సౌందర్యాన్ని, మాధుర్యాన్ని కవి హృదయం తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంది ఆనందసాగరంలో.
ఈ మహదానందానుభూతులను కృతులుగా విశ్వమోహనంగా గానం చేసే రసరమ్య ఆనందోత్సవంలో తనకు తోడుగా ఉండమని తన ప్రేయసి ఊర్వశిని అభ్యర్థిస్తున్నాడు ప్రేమికుడు. మరలా తిరిగిరాని, మరలా లభ్యం కాని ఆనందపుటవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొందామని స్వాగతిస్తున్నాడు. సుందర హిమాచలసానువుల మీదుగా అత్యున్నత హిమశృంగాన్నధిరోహించి ఆనందపారవశ్య సంగీతఝరుల, గంగాజల పవిత్రకాంతుల, యమునా శీతలమధువుల సాక్షిగా ప్రవహింపజేద్దామని తన ప్రేయసి ఊర్వశిని ఆహ్వానిస్తున్నాడు, అభ్యర్థిస్తున్నాడు ఆ ప్రేమికుడు.
మంచి కవిత్వం లో రెండు పార్శ్వాలు ఉంటవి: బహిఃపార్శ్వమూ, అంతఃపార్శ్వమూ. బహిఃపార్శ్వము అక్షరరూపంలో మనకు కనిపించేది. అంతఃపార్శ్వము మనకు కనిపించనిది. అది ధ్వనిరూపంలో మనకు గ్రాహ్యమయ్యేది, అవవలసినది. రెండు పార్శ్వాలు ప్రధానమైనవే. అంతఃపార్శ్వానికి అస్తిత్వం ఇచ్చేదీ బహిఃపార్శ్వమేగా! అంతఃపార్శ్వము లేకుండా బహిఃపార్శ్వం మాత్రమే ఉన్న కవితకు ఉత్కృష్టత ఉండనేరదు. దేవులపల్లి అక్షరరూపంలో చెప్పిన దాన్ని ధ్వనిరూపంలో సూచించినదాన్ని సమన్వయపరచుకుని పరిశీలిస్తే ఊర్వశి పరమోత్కృష్టమైన సౌందర్యంయొక్క రూపరేఖావిలాసం మనకు తెలియవస్తుంది. దేవులపల్లి మూలతత్త్వపు విలక్షణత్వం అవగతమవుతుంది.
కృష్ణశాస్త్రిగారి మూలతత్త్వపు ఉపరితలం మీదనే స్పష్టంగా కనిపించేవి ఆయన అనంతమైన సౌందర్యకాంక్ష, అది తీరే పని కాదు కాబట్టి దాని మూలకంగా ఆయన అనుభవించే విషాదం. ‘నేను కూడ’ అనే కవితలో కవితానాయకుడి ముఖతః తాను వినిపించే విషాదాన్ని గమనించండి. ఆయన అంటారు, శోకతప్త హృదయభారంతో మూగబోయింది తన గళము మాత్రమే నని.
మూఁగ వోయిన నా గళమ్మునను కూడ
నిదురవోయిన సెలయేటి రొదలు గలవు
పలుకుకు నోచుకోని వేదనాభరిత హృదయస్పందనలు నిశ్శబ్దావరణంలోని సెలయేళ్ళలా నిరంతరంగా సాగుతూనే ఉంటవి. ఎంతటి సాంద్రమైన ఆనందానుభవంలో కూడా లీలగా ఒక దుఖపు జీర మనకు ద్యోతకమవుతుంది. ఆయన సౌందర్యారాధన, ఆనందానుభవాలు ఏదో తెలియరాని దుఃఖపు మంచుతెరతో పరివృతమైనట్లు తెలియవస్తుంది.
అసలు ఎందుకీ విలాపం, ఎందుకీ విషాదం? తెలుగు భావకవుల తత్త్వానికీ, వారి విలక్షణత్వానికీ దేవులపల్లి సంపూర్ణమైన, సమగ్రమైన ప్రతినిధి. వారి అపారమైన సౌందర్యతృష్ణకు, అనల్పమైన మనోనైశిత్యానికి వారి కవిత్వం అద్దంపడుతుంది. ప్రకృతిసహజమైన జరామరణాలకు పర్యవసానమైన అశాశ్వతత్వానికి కలత చెంది, దానినుండి విషాదంతో ఒక aesthetic escape గా వారి కవిత్వంలో అతిలోకసౌందర్యాన్ని, అమరమైన ప్రేమను, ఊర్వశిలాంటి ప్రేమాధిదేవతను సృజించుకొని ఉంటారని అనిపిస్తుంది. కానీ యథార్థలోకపు కఠోర సత్యాలను విస్మరించటం ఎవరి తరం?? అందుచేతే ఆయన మహదానందానుభూతిలో కూడా వేదనాధ్వని ఒక్కొక్కప్పుడు సున్నితంగా ఒక్కొక్కప్పుడు కర్కశంగా ‘నేను కూడా’, ‘మనసారగా నేడ్వనీరు నన్ను’ లాంటి కవితలలో వినబడుతూనే ఉంటుంది.
నాకుగాదులు లేవు
నాకుషస్సులు లేవునేను హేమంతకృష్ణానంత శర్వరిని,
నాకు కాలమొక్కటే కారు రూపు
వారి కవిత్వం సౌందర్యవిలసితమైన స్వప్నం లాంటిది. స్వప్నం కూడా యథార్థజీవితంలో భాగమేగా! అన్నింటికీ అంతం ఉన్నట్లే స్వప్నానికి కూడా అంతం ఉంటుంది. స్వప్నావస్థ, జాగ్రదవస్థల సంయోగానుభవం వారి కవిత్వానికి ఊపిరవుతుంది. ఈ విషయం దాదాపు ఆయన ప్రతి కవితలో ద్యోతకమవుతుంది. సౌందర్యం, ఆనందం, నిరీక్షణ, నిర్వేదం ఆయన కవిత్వంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది.
కృష్ణశాస్త్రిగారి కవిత్వంలో emotional exuberance and imaginative intensity ప్రముఖంగా ఉంటూ రవంత obscurity కూడా ఉంటుంది. మనసును సున్నితంగానో, గాఢంగానో తాకుతుంది. ఆయన కవిత్వంలో మనసును లోబరచుకునే భావాకృతి ఉన్నా, ఒక మేరకు మాటల కందని లక్షణం ఉంటుంది. చేతికి చిక్కీ చిక్కనట్లు ఉంటూ గొప్ప ఆకర్షణకు గురి జేస్తుంది. వినీలాకాశంలో ఎక్కడో కానరానంత ఎత్తులో విహరించే ఆయన కవితోహల సౌందర్యం పట్టరానంత శబ్దమాధుర్యం తో కలిసిపోతుంది. ఊహలోన, శబ్దంలోన, రూపంలోన తాను దర్శించిన సౌందర్యానికి తలమునకలయ్యే తత్త్వం గలవారు కృష్ణశాస్త్రిగారు. సందర్భోచితంగా చేసే పదప్రయోగంలోని శబ్దసారూప్యత పాఠకుడి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కృష్ణశాస్త్రిగారి రచనలన్నింటిలో కనిపించే శైలీరమ్యత ఇది.
కృష్ణశాస్త్రిగారు ఆలిండియా రేడియోకు వ్రాసిన ఆణిముత్యాలయిన పాటలలో “శ్రావణమోహన శ్యామలజలధర” తలమానికమైనది. కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి రచనలలోని ప్రేమికుడు తన ప్రేయసి ఊర్వశికి చేసే విన్నపాలు పరమోత్కృష్టమైన విరహగీతాలుగా ఆవిర్భవించడం మనం చూశాము. అలానే ప్రేమకు, రసికతకు, సమ్మోహనతకు, కరుణకు ఆలవాలమైన శ్రీకృష్ణదేవుని దర్శనభాగ్యం కోసం ఒక విరహిణి చేసే వేడుకోలు ఈ పాటకు ఇతివృత్తం:
శ్రావణ మోహన శ్యామల జలధర
స్వామీ! నీ శుభ సందర్శనమున
చిరవిరహానల శీర్ణమీ హృదయము
పురి విరిసికొనునో! పులకరించునో!
ఈ పాట పాటంతా ఆమె హృదయపరితాపంతో దుఃఖంతో నిండిపోతుంది. జాజ్వల్యమానం గా వెలిగి పోయే తెల్లని పుష్పమాల ధరించిన శ్రీకృష్ణదేవుల శుభసందర్శనభాగ్యంతో, కృశించిన తన శిథిలజీవితం కూడా నూతన జవసత్త్వాలతో ఆ దేవదేవుడు ధరించిన సుమమాలలా మెరిసిపోతుందనే ఆశతో ఆమె కాలం వెళ్ళదీస్తున్నది.
ధవళ బలాక సుందరతర మృదుసుమ
తరళ తరళ హారధారీ! హరీ!
శిథిలపత్రాగ్ర జీవితము నీ గళసీమ
పరిమళించునో! పరువమొందునో!
ఆ భాగ్యానికి ఆమె నోచుకోకపోతే తాను భరించలేని యాతనకు, దుఖానికి ఆమె విలపిస్తుంది:
అజ్ఞాత హేమంతాభీల ప్రవాసమున
కృశియింతునో! నేను నశియింతునో!
పాట గొప్పతనం చక్కని symmetrical structure కలిగి ఉండటం uniformity of style కలిగిఉండటం. మొదటి పంక్తి ఎంతటి మృదుమధురశబ్దాలతో, సంగీతాత్మకంగా సాగిందో, అంతే సౌందర్యభరితంగా పాటలోని ప్రతి పంక్తీ సాగుతుంది. ఇది సామాన్యమైన structural and stylistic beauty కాదు. ఆశా, నిరాశలతో కొట్టు మిట్టాడుతున్న విరహిణి వేదనాభరిత హృదయం ప్రతి పంక్తిలో ద్యోతకమవుతుంది. ఆమె దుఃఖం మనలను జాలితో నింపుతుంది. అలాంటి భావాక్షరశిల్పంతో పాటను చెక్కుతారు దేవులపల్లి.
ఆకాశవాణిలో వారు పని చేస్తున్న ఉద్యోగధర్మంగా గాక, తన మనఃపరిణామంలోని ఆర్తిలోంచి వచ్చిన రచనలుగా తదుపరి రచనలు కనిపిస్తాయి. ఈ క్రమంలోనే, జాతీయగీతంగా ఆలపించగలిగే గొప్ప స్థాయిలో “జయ జయ జయ ప్రియ భారతజనయిత్రీ” అనే గీతం వచ్చింది. ప్రతి పంక్తి కృష్ణశాస్త్రిగారి కవితోహల మాధుర్యం, మాతృ దేశం యెడల ఆయనకున్న పరవశింపజేసే భక్తిభావం, సాటిలేని శ్రవణపేయమైన అక్షరసౌందర్యం మన హృదయాలను పరవశింపజేస్తాయి. ఆ గీతం ఆమూలాగ్రం మంద్రంగా, సుందరంగా రసవాహినియై సాగుతుంది.
కొన్ని పంక్తులు మాత్రమే గాకుండా ఈ గీతాన్ని ఆమూలాగ్రం ఉట్టంకించాలనే కోర్కె బలీయంగా ఉంది. అది ఈ గీతం యొక్క అనుపమానమైన సౌందర్యం.
జయ జయ జయ జయ ప్రియ భారతజనయిత్రీ దివ్యధాత్రి!
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి!
జయ జయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల!
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణకుంతల!
జయ మదీయ హృదయాశయలాక్షారుణ పదయుగళా!
జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ!
జయ గాయక వైతాళిక గళ విశాలపథ విహరణ!
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా!
స్త్రీపురుషసంబంధిత మోహపరవశమైన రక్తి కృష్ణశాస్త్రిగారి వ్యక్తిత్వపు పరిణామక్రమంలో దేశభక్తిగా, అంతిమంగా ఆధ్యాత్మిక చింతనతో కూడిన ముక్తికాంక్షగా పరిఢవిల్లడం ఆయన కవనం లో కనబడుతుంది. ఆకాశవాణిలో ప్రసారితమైన భక్తి పాటలను పరిశీలిద్దాం: మొదటగా “రామచరణం, రామచరణం “ అనే పాట. ఈ గీతంలో ఎంతటి రామభక్తి, ఎంతటి ఆత్మనివేదన కనబడతాయి!
కొన్ని చరణాలు:
రామ చరణం రామచరణం! రామచరణం మాకు శరణం!
మాకు చాలును మౌనిమస్తక భూషణం శ్రీరామచరణం..
రాగయై యీ బ్రతుకు చెడి రాయైన వేళల రామచరణం
మూగయై పెంధూళి పడి మ్రోడైన వేళల రామచరణం….కోతియై ఈ మనసు నిలకడ కోలుపోతే రామచరణం!!
సేతువయి భవజలధి తారణహేతువయితే రామచరణం..
అదే క్రమంలో, ప్రగాఢమైన భక్తివిశ్వాసాలతో శివ స్వామి వారి మీద వ్రాసిన “ఎందుకయా సాంబశివా!” గొప్ప శివస్తోత్రంగా పేరెన్నిక గన్నది.
ప్రచండమైన తరంగాలతో విజృంభించే గంగా ప్రవాహాన్ని తన పిడికిలితో పట్టి, జటాజూటంగా చుట్టి, నెలవంకను కలికితురాయిగా ధరించి, తాను ధరించిన పులితోలులో కాలాన్ని నియంత్రించి, చేతిలో అజేయమైన త్రిశూలంతో ఫాలభాగాన ప్రళయాగ్నితో సృష్టిస్థితిలయాలకు కరుణాసముద్రులైనా రుద్రులయినా ఆ మహాదేవులే! నిర్వేదంతో ఆర్తితో భక్తి పూర్వకమైన వేడికోలుతో హృదయాన్ని ఆర్ద్రం చేసే ఈ పాటలో కొన్ని చరణాలు:
అలల తోటి గంగ బట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి
కేల త్రిశూలం పట్టి ఫాలమందు కీల పెట్టి
రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర
ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా!!
ఇస్మాయిల్‌గారు కవిత్వంలో అర్ధసంవిధానం, శబ్దసంవిధానాలను ప్రస్తావిస్తారు. ఆయనకు అర్ధసంవిధానం ప్రధానం. శబ్దసంవిధానం గురించి కొంచెం చిరాకు పడతారు. శబ్దసంవిధానం పుష్కలంగా ఉన్న కృష్ణశాస్త్రిగారి కవిత్వమన్నా ఆయన వ్యక్తిత్వమన్నా ఇస్మాయిల్‌గారికి అపారమైన ఇష్టం, గౌరవం. ఈ రెండు సంవిధానాల సమతుల్యత ఆయన కవితలో ఉండటమే కారణమేమో!!
‘శ్యామల మోహన శ్రావణ జలధర’ లాంటి విరహవేదనాభరిత ప్రణయకవిత వ్రాసినా, జాతీయగీతం స్థాయిలో ‘జయ జయ జయ ప్రియ భారతజనయిత్రీ’ వంటి దేశభక్తి గీతం వ్రాసినా, భక్తిభావంతో తొణికిసలాడే ప్రార్ధనలు వ్రాసినా ఆయన శైలీరమ్యత ఆయన కవిత్వాన్ని వీడదు. భావనైశిత్యం, అక్షరరామణీయత వీడవు. ఏమి వ్రాసినా ఆయన ముద్రతో అవి భాసిస్తూనే ఉంటవి.
కవిత్వం యెడల ఎంత వైఖరులు మారినా, అభిరుచులు మారినా కవితాసౌందర్యం యొక్క ఆకర్షణకు ఎవరు లోనుగాకుండా ఉండగలరు! కృష్ణశాస్త్రిగారు కవిగా చిరంజీవి.