” సుజాతా ! నేను రెడీ ? త్వరగా రెడీ కా! ఉయ్ నీడ్ టు బి దేర్ బై 6:30 షార్ప్ ! ” టై సర్దుకుంటూ అన్నాడు హరి. సుజాత ఇంకా మేకప్ అవుతూనే ఉంది. సమాధానం రాలేదు.
ఒక్కసారి తను వేసుకున్న సూటు అద్దం లో చూసుకున్నాడు. మేడ దిగి క్రిందకొచ్చాడు.
తండ్రి రాజారావు, సోఫాలో కూర్చునున్నాడు.
“డాడీ ! మీరు రెడీయే కద…” అంటూ ఒక్కసారి ఆగి – ” అదేమిటి డాడీ? బ్లేజర్ వేసుకోమని చెప్పాను కదా? ఇంకా ఇలా…” విసుగ్గా అన్నాడు.
“అదికాదురా, నేను కూడా సూటులో ఎందుకని? ” రాజారావు నసిగాడు.
“నాన్నా! మనం వెళ్ళబోయేది మా కంపెనీ సి యి ఓ పెళ్ళి రెసెప్షన్ కి ! ఇక్కడ అందరూ డ్రెస్ కోడ్ పాటిస్తారు. మన ఇండియాలో పెళ్ళిలా కాదు. అందరూ సూటేసుకొని వస్తారు. అంతా ఆర్గనైజుడు గా ఉంటుంది….పద వెళ్ళి సూటు వేసుకు రా.. మనం 6:30 కల్లా ఉండాలి…” అంటూ తండ్రిని కంగారు పెట్టాడు.
” అదికాదురా! ఈ డ్రెస్ కోడ్ అంటూ సూటు వేసుకోవడం నా వల్ల కాదు. అలవాటు లేని పని…అయినా మనం పెళ్ళికెళుతున్నామా లేక ఏదైనా ఇంటర్వ్యూకి వెళుతున్నామా?..పోనీ నేనూ టింకూతో ఉండిపోతాను.” రాజారావుకి సూటు వేసుకోవడం ఇష్టం లేదు.
“ఇప్పుడు రానంటే కుదరదు. ఆల్రెడీ నీ పేరు నా తరపున గెస్ట్ లిస్ట్ లో రాసేసాను. టింకూని నా ఫ్రెండ్ వాళ్ళింట్లో బేబీ సిట్టింగ్ కి దిగపెడతాను…ఇప్పుడు రానంటే బావుండదు. త్వరగా తెవిలి రా..” అంటూ తండ్రిని మేడ పైకి పంపాడు.
రాజారావు తలాడిస్తూ, తప్పదన్నట్లుగా పైకి వెళ్ళాడు.
ఇంతలో సుజాత వచ్చింది. ఎలావుంది నా డ్రెస్ అన్నట్లుగా హరి కేసి చూసింది. “బ్యూటిఫుల్ ! ” తన విస్మయాన్ని ఆపుకోలేకపోయాడు. సుజాత పెట్టుకున్న డైమండ్ నెక్లెస్ ధగ ధగా మెరిసిపోతోంది.
రాజారావు సూటు ధరించాడు. అందరూ లెక్సస్ కారులో బయల్దేరారు. వాళ్ళు వెళ్ళేది హరి పనిచేసే కంపనీ సి యి ఓ బ్రూస్ పెళ్ళి రెసెప్షన్ కి. టింకూని తన స్నేహితుడి ఇంటి దగ్గర దింపారు.
“ఇదెక్కడి పెళ్ళిరా హరీ! పిల్లల్ని తీసుకెళ్ళ కూడదు. టైముకుండాలి, డ్రెస్ కోడ్ అంటూ ఈ ఆంక్షలు చూస్తే విచిత్రం గా ఉంది!” రాజారావుకి అస్సలు అర్థం కావడం లేదు.
“అవును ఇక్కడ పెళ్ళి రెసెప్షన్ లు ఇలాగే ఉంటాయి. ఇంకో విషయం తెలుసా… మన వెళ్ళే చోట మనకి కేటాయించిన టేబిల్ దగ్గరే కూర్చోవాలి. నీ ఇష్టం వచ్చినట్లు తిరిగితే కుదరదు. మన వంతు వచ్చినప్పుడు మనం పెళ్ళి కొడుకుని, పెళ్ళి కూతుర్ని కలవాలి. చూద్దువు గాని అంతా ఎంత ఆర్గనైజ్డ్ గా ఉంటుందో ! ” హరి వివరించాడు,
“ఇదేదో చూడల్సిందే – పెళ్ళిలా అనిపించడంలేదు…ఇంతకీ పెళ్ళికూతురు ఏ దేశం అమ్మాయి? ” రాజారావు కి ఇదంతా కొత్తగా ఉంది.
” అమెరికనే! బ్రూస్ కిది రెండో పెళ్ళి. మొదటి భార్యకి విడాకులిచ్చి దాదాపు ఆరేళ్ళు కావస్తోంది. పెళ్ళి కూతురికీ ఒక కొడుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక రకంగా సెకండ్ మేరేజే ! బ్రూస్ కి చచ్చేంత ఆస్తి ఉంది. అందుకే ఈ ఆర్భాట మంతా..”
” మరీ విడ్డూరం. జరిగేది రెండో పెళ్ళి – దానికా ఈ ఆర్భాటమంతా.. !” నవ్వొచ్చింది రాజారావుకి.
” ఇక్కడ ఇలాగే ఉంటాయి మావగారూ! మన దేశం లా కాదు..” సుజాత మధ్యలో కల్పించుకుంటూ అంది.
“అవును – బ్రూస్ నాకు దాదాపు పదేళ్ళ నుండి తెలుసు. బ్రూస్ చాలా మంచి వ్యక్తి. మొదటి భార్యతో అతనికి పడలేదు. అమె అదొక టైపు. ఇతను ఎంత ఎడ్జస్ట్ అవుదామనుకున్నా విడాకులు తప్పలేదు. దాదాపు అయిదేళ్ళు ఒంటరిగానే ఉన్నాడు. ఆ నరకాన్ని భరించలేక ఇన్నాళ్ళకి తనకి తగిన వ్యక్తి దొరికిందని చాలా హాపీ ఫీల్ అయ్యాడు. ఒక్కోసారి అతను ఒంటరిగా ఉండలేక రాత్రిళ్ళు తప్ప తాగి పడిన సంఘటనలూ నాకు తెలుసు. అతనికి మనుషులు కావాలి. ఒంటరిగా జీవించలేకపోయాడు. అప్పుడు నేనే చెప్పాను. ఇలా ఒంటరిగా ఈ నరకం అనుభవించడం కంటే ఎవర్నో ఒకర్ని పెళ్ళి జేసుకోవచ్చు కదా అని…ఇన్నాళ్ళకి తనకి తగిన అమ్మాయి దొరికింది…ఐ యాం వేరీ హ్యాపీ ఫర్ హిం ! ”
“బావుంది – కథ…ఇదంతా చూస్తే నవ్వొస్తోంది….మరీ ప్రతీ దానికీ ఫార్మాలిటీస్ పాటిచండం నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది.. విషయం చెప్పద్దూ..నేకేదైనా టింకూ చిన్న హెల్ప్ చేస్తే, నువ్వు థాంక్యూ చెబితేనే నాకు మొదటి సారి ఆశ్చర్యం కలిగింది. కొడుకుకి తండ్రి ధేంక్యూ చెప్పడమేమిటి? ఇంట్లో వాళ్ళకి థాంక్యూలు చెప్పడం, అమ్మా నాన్నలు కొడుకులకి సారీ చెప్పడం..ఇవన్నీ నాకు కృతకంగా అనిపిస్తున్నాయి…వీళ్ళూ వీళ్ళ కల్చరూనూ..” రాజారావు కి ఈ తంతు విచిత్రంగా తోచింది.
“నాకూ మొదట్లో అలాగే అనిపించింది, కానీ ఏ అలవాటయినా మొదట అమ్మనాన్నలతోనే మొదలవుతుంది. మన ఇంట్లో వాళ్ళ దగ్గరే లేని సభ్యత, అలవాట్లు ఇతరుల దగ్గరెలా వస్తాయి. ఒకరకంగా నాకిది మంచి సంస్కారమే అనిపిస్తుంది…” హరి తన అభిప్రాయాన్ని చెప్పాడు.
“బావుందిరా… అమ్మా నాన్నల దగ్గర కావల్సింది కాసింత ప్రేమ, అనురాగం…ఇలా ధాంక్యూలూ, సారీలు అందిపుచ్చుకుంటే చాలా…?” రాజారావు వాదించాడు.
“ధాంక్యూ సారీలు చెప్పినంత మాత్రాన ప్రేమ లేదని ఎలా చెప్పగలవు? ఏం ? మేము టింకూని ప్రేమగా చూడడం లేదా? అవన్నీ మన కల్చరల్ మిత్ లు…ఐ డోంట్ ఎగ్రీ విత్ యూ !” హరి కొట్టి పారేసాడు.
రాజారావు కి ఇహ వాదన పెంచడం ఇష్టంలేక బరువుగా ఓ నిట్టూర్పు విడిచాడు.
వాళ్ళు పెళ్ళి రెసెప్షన్ హాలు దగ్గర్కొచ్చారు. కారు పార్క్ చేసి లోపలికెళ్ళారు. అతిధులందరూ వారికి కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. ఎంతో అందంగా అలంకరించారు.. దీపాల కాంతితో ఆ ప్రదేశం వెలిగిపోతోంది.
పెళ్ళి కొడుకు బ్రూస్, పెళ్ళికూతురు మరీనా చేయి పట్టుకుని నిలబడ్డాడు. ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వెళ్ళి విష్ చేసి వస్తున్నారు.
హరి వాళ్ళ వంతు వచ్చింది.
“విష్ యూ హాపీ మేరీడ్ లైఫ్ ! ” అంటూ హరి బ్రూస్ ని విష్ చేసాడు.
“థాంక్యూ! ” అంటూ అమెరికన్ నూతన వధూవరులిద్దరూ షేక్ హేండ్ ఇచ్చారు.
హరి తన తండ్రి రాజారావుని పరిచయం చేసాడు.
“ది సీజ్ రాజా రావు. మై ఫాదర్ ! ”
” నైస్ టు మీట్ యు. హరి టోల్డ్ మి అబౌట్ యూ! హీ లవ్స్ యూ సో మచ్! హీ టోల్డ్ మి హౌ యూ బ్రాటప్ యువర్ యంగ్ కిడ్స్ వెన్ యువర్ వైఫ్ డైడ్! యు ఆర్ రియల్లీ గ్రేట్ ! హరీ ఈజ్ ఎ వెరీ గుడ్ పెర్సన్! వేరీ ఫ్రెండ్లీ ! అఫ్కోర్స్ ! ఇంటెలిజెంట్ టూ! ” బ్రూస్ రాజారావునీ, హరినీ అభినందించాడు.
“ధాంక్యూ!” నవ్వుతూ రాజారావు అన్నాడు.
“మై డాడ్ ఈజ్ ఎ గ్రేట్ పెర్సన్! ఎనీ హౌ, – దిస్ రెసెప్షన్ ఈజ్ రియల్లీ గ్రేట్ ! వండర్ ఫుల్ అరేంజ్మెంట్స్ ! ఆసం డిన్నర్ ! ”
“ధాంక్యూ ! ఉయ్ ఆర్ వేరీ హేపీ యు లైక్డ్ యిట్ ! ఉయ్ విల్ హావ్ అ డాన్స్ టూ…” ఇద్దరూ ఒకేసారి అన్నారు.
“యా యా ! వుయ్ విల్ బి ఎంజాయింగ్ దట్ టూ ! ” హరి వాళ్ళని మరోసారి విష్ చేసి తమ టేబిల్ దగ్గరకొచ్చారు.
ఆ రాత్రి పార్టీ అయ్యే సరికి అర్ధ రాత్రి అయ్యింది. రాజారావుకి ఎప్పుడు ఇంటెకెళిపోదామా అని ఉంది. తన కళ్ళెదుటే కొడుకూ కోడలూ తాగడం అతను భరించ లేకపోయాడు.
వద్దని వారించడానికి పిల్లలు కాదు కదా! చిన్నప్పుడు సిగరెట్ పొగ, మందు వాసన భరించ లేని హరి ఇప్పుడు తన కళ్ళదుటే అవి చేస్తున్నాడు. కాలమూ, ప్రదేశమూ మనుషుల్నీ, మనస్తత్వాలనీ ఎంత మారుస్తాయో కదా! ఇంకెంత ఇంకో రెండు నెలల్లో తన వీసా ముగుస్తుంది. తను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాడు. తనూ, తన స్నేహితులూ, ఆ నేలా, ఆ నీరూ, ఆ గాలి… తలచుకుంటుంటేనే ఏదో తెలియని ఆనందం!
ఆ పెళ్ళి విందు రాజారావుకొక కొత్త అనుభవం! ఎవరో ఓ మహాకవి అన్నట్లు అనుభవాల పేజీలే కదా జీవితమంటే! తన పిల్లల ప్రవర్తనల మార్పు అనే అనుభవం అతనికి మెల్ల మెల్లగా తెలుస్తోంది. ఏ అనుభవాల అంచున ఎప్పుడు జారి పడతామో ఎవ్వరికీ తెలియదు.
తొమ్మిది నెలల తర్వాత…
“షీ యీజ్ ఆల్ రైట్! ఎవిరీథింగ్ లుక్స్ వేరీ గుడ్! ద బేబీ ఈజ్ డూయింగ్ వేరీ వెల్ ! ఎవిరీథింగ్ గోస్ వెల్, యు విల్ బి హేవింగ్ యువర్ బేబీ ఇన్ టెన్ డేస్!” డాక్టర్ ఎరికా నవ్వుతూ అంది.
“థాంక్యూ డాక్టర్ ! ఉయ్ విల్ బి లుకింగ్ ఫార్ వర్డ్ ! ” అంటూ ఆనందంగా బయటకొచ్చారు హరి, సుజాతలు.
సుజాత ఇంకో వారంలో ఆడపిల్లని ప్రసవించబోతోంది. జనరల్ చెకప్ కోసం వచ్చారిద్దరూ !
“నాకెందుకో టెన్షన్ గా ఉంది హరీ !” భయంగా అంది సుజాత.
” టెన్షన్ ఎందుకు? మీ అమ్మా నాన్నా రేపు వస్తున్నారు కదా! అయినా నేను ఉన్నాను కదా ! ఎవిరీథింగ్ విల్ బి ఆల్ రైట్ !” అంటూ సుజాతని అనునయించాడు హరి.
ఆ మర్నాడు సుజాత అమ్మా, నాన్నా వచ్చారు. వాళ్ళని ఎయిర్ పోర్ట్ నుండి తీసుకొచ్చాడు హరి. ఆఫీసు పని ఎక్కువగా ఉంది. సుజాత డెలివరీ అయ్యే ముందు తను సెలవు తీసుకుంటానని చెప్పడు బ్రూస్ కి. బ్రూస్ సరే నన్నాడు. ఇహ సుజాత డెలివరీ ఇహ రెండు రోజులే ఉంది. హరి డెలివరీ కి అన్ని ముందుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. అంతా రెడీ గా ఉంది, ఇహ అమ్మాయి పుట్టడమే తరువాయి.
ఆ రోజు అర్ధ రాత్రి దాటేక ఇండియానుండి కాల్ వచ్చింది. తన తండ్రి రాజారావు చేసాడనుకున్నాడు. కానీ కాదు.
“హల్లో ! ” అంటూ మగత కళ్ళతోనే జవాబిచ్చాడు. సుజాత పక్కనే మంచి నిద్రలో ఉంది.
“హలో ! హరీ ! దిసీజ్ డాక్టర్ అంకుల్ ! ” ఆవతలి కంఠం వినిపించింది.
“ఏమిటి అంకుల్…హౌ ఆర్ యూ? ఏమిటీ, సుజాత గురించా బాగానే ఉంది…” హరి అన్నాడు.
“సుజాత గురించి కాదు… మీ నాన్నకి ఈ ఉదయం హార్ట్ ఎటాక్ వచ్చింది. ప్రస్తుతం ఇంటెన్ సివ్ కేర్ లో ఉన్నాడు…”
“ఏంటి? డాడీ కి హార్ట్ ఎటాకా? ఎలావుంది….? ” నిద్రమత్తు వదిలింది హరికి. ఒక్క సారి తలతిరిగినట్లయ్యింది.
“నువ్వేం కంగారు పడనవసరం లేదు. జస్ట్ మైల్డ్ గా వచ్చింది…ప్రాణాపాయ స్థితేమీ కాదు. హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్!..”
“థాంక్స్ అంకుల్! మీరున్నారుకదా కాస్త ధైర్యం వచ్చింది. నేను నాన్నతో మాట్లాడొచ్చా? ”
“ప్రస్తుతం సెడెటివ్స్ మీద ఉన్నాడు. ఇంకో రెండు గంటల్లో స్పృహ రావచ్చు… మీ చెల్లెలు దివ్యకి నువ్వు కాల్ చేసి చెప్పు…”
“అలాగే అంకుల్ ! ఇప్పుడు రాత్రి రెండయ్యింది. తెల్లారేక కాల్ చేసి చెబుతాను. ఇంత రాత్రి లేపితే కంగారు పడుతుంది. ఉదయాన్నే చెబుతాను.”
“అలాగే…ఇందాకనే మీ పిన్ని వాళ్ళు వచ్చారు. మా అవిడ నేనూ దగ్గరున్నాం. కంగారు పడనవసరం లేదు. నువ్వు రావడం కుదురుతుందా?”
ఒక్కసారి ఆలోచనలో పడింది మనసు.
“ఇప్పుడా?…ఇప్పుడెలాగ అంకుల్…సుజాతకి ఇంకో రెండురోజుల్లో డ్యూ డేట్! నేను లేకపోతే కంగారు పడుతుంది..ట్రై చేస్తాను..” ఏం చెయ్యాలో పాలుపోలేదు హరికి. నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందన్న విషయం కలవరం రేపింది. తను వెళ్ళి చూడాలి…కానీ సుజాత ఒక్కతీ ఉండ గలదా…అసలే సుజాతకి టెన్షన్ గా ఉంది. ఇప్పుడెలాగ?
“అదికాదు హరీ..నువ్వు వస్తే బాగుంటుంది. మీ నాన్నకీ కాస్త ధైర్యం వస్తుంది. ”
“ట్రై చేస్తాను అంకుల్! ఒకవేళ కుదరకపోతే సుజాతకి డెలివరీ అయిన వారానికల్లా వస్తాను. లేదంటే దివ్యని పంపిస్తాను..” ఏం తోచని పరిస్థితి, హరిది.
“సరీ! మీ వీలు చూసుకొని రా! ఇంకో రెండు గంటల తరవాత కాల్ చెయ్యి. మీ నాన్నతో మాట్లాడుదువుగాని. కంగారు పడనవసరం లేదు. మేం ఉన్నాంగా !…”
“మీరున్నారనే నా ధైర్యం కూడా ! మార్నింగ్ కాల్ చేస్తాను…” అంటూ ఫోన్ పెట్టేసాడు.
అతని మాటలేవీ సుజాతకి వినిపించలేదు. దీర్ఘ నిద్రలో ఉంది. తెల్లారేక సుజాతకి చెబుదామని అనుకున్నాడు. తను ఇప్పుడు సుజాతని వదిలి వెళితే ఊరుకోదు. అసలే భయపడుతోంది. మొదటి సారి డెలివరీకే తెగ భయపడింది. ఆ నెప్పులు అవీ భరించలేక అస్సలు ఇంకో బిడ్డ వద్దనుకుంది. కానీ ఇలా డాడీకి హార్ట్ ఎటాక్ ఏమిటి? ఆరోగ్యంగానే ఉన్నాడు. రెగ్యులర్ గా డాక్టర్ చెకప్ చేయించుకుంటూనే ఉంటాడు. అంతా బాగానే ఉందని ఇంతకుముందు డాక్టర్ అంకుల్ కూడా చాలా సార్లు చెప్పినట్లు గుర్తు. ఎవ్వరిమీద ఆధారపడకుండా తన పని తను చేసుకొనే డాడీకి హార్ట్ ఎటాకా? నమ్మశక్యంగా లేదు హరికి. అయినా నాన్న కెలావుందో?
అన్నీ ఒక్క సారే వచ్చి పడతాయి.
తెల్లారేక ఇండియా ఫోన్ చేసి తండ్రితో మాట్లాడాడు. రాజారావు గొంతు నూతిలోంచి మాట్లాడుతున్నట్లుగా అనిపించింది హరికి. కంగారు పడవద్దని, ధైర్యంగా ఉండమని తను వీలు చూసుకొని వస్తానని చెప్పాడు. డాక్టర్ అంకుల్ ఎక్కువ మాట్లాడొద్దంటే ఆగిపోయాడు హరి. డబ్బు ఎంత ఖర్చయినా పరవాలేదు, నాన్న ఆరోగ్యం గా ఉండాలని చెప్పాడు. నిజానికి తన తండ్రికి తన డబ్బు అవసరం లేదని హరికి తెలుసు. రాజారావు ముందుచూపుగా ప్రతీ దానికీ కొంత డబ్బు దాచాడన్న విషయం తెలుసు. హరి తన పిన్ని వాళ్ళకీ ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఏం కంగారు పడవద్దనీ, మేమున్నాములే అన్న ధైర్యం ఇచ్చారు హరికి.
ఆ ఫోన్ అయ్యాక దివ్యకి కాల్ చేసాడు. దివ్య వాళ్ళు లాస్ ఏంజిల్స్ లో ఉంటారు. దివ్య భర్త రవి ఫోన్ ఎత్తాడు.
“రవీ ! దివ్య ఉందా? మా డాడీకి హార్ట్ ఎటాక్ వచ్చింది..దివ్యకి చెబుదామని…”
“అరె! హార్ట్ ఎటాక్ ఎప్పుడొచ్చింది? ఎలా ఉంది ఇప్పుడు?…నువ్వు మాట్లాడేవా? …” ప్రశ్నల వర్షం కురింపించాడు.
“నువ్వు ఫోన్ స్పీకర్ లో పెట్టి దివ్యని పిలు..అన్నీ వివరంగా చెబుతాను…” హరి అసహనంగా అన్నాడు.
“అన్నయ్యా…ఏమయ్యిందిరా?” దివ్య ఫోన్ లోకి వచ్చింది.
హరి అంతా వివరంగా చెప్పాడు.
“నువ్వు ఎప్పుడు వెళుతున్నావు హరీ? ” రవి అడిగాడు.
“లేదు రవీ! నాకు వెళ్ళడం కుదరదు. సుజాతకి రెండురోజుల్లో డెలివరీ. దివ్యని పంపిస్తావా?” అభ్యర్థించాడు హరి.
“దివ్య ఇప్పుడు వెళ్ళాలంటే…” నీళ్ళు నమిలాడు అవతలి వైపునుండి రవి.
“అయినా – అంత పెద్ద ఎటాక్ కాదుకదా ! పోనీ డెలివరీ అయ్యాక అయినా నువ్వు వెళ్ళచ్చుకదా..” ఉచిత సలహా పారేసాడు రవి.
“నా ఉద్దేశ్యమూ అదే…కానీ ఈ లోగా దివ్య వెళితే…”
“అదికాదు హరీ…ఈ మధ్య మా అమ్మకీ నాన్నకీ అంత బాగుండడం లేదు. అమ్మకి కాలు నెప్పి లేవడం లేదు. అదీకాక ఇంకో పదిరోజుల్ల్లో,పెద్దమ్మాయి శ్రేయాది కూచిపూడి ఆరంగేట్రం ఉంది. కార్తీగ్గాడి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నెక్ష్ట్ వీక్ ఉంది…” రవి తన బిజీ స్కెడ్యూలు హరి ముందుంచాడు.
దివ్యని పంపడానికి రవి సిద్ధంగా లేడని హరికి అర్థమయ్యింది.
“అదికాదురా ! అన్నయ్యా…నాకూ వెళ్ళాలనే ఉంది. నాన్నతో మాట్లాడనీ ముందు. అసలు ఈ విషయం వింటే నే కాళ్ళూ చేతులూ ఆడ్డం లేదు..నాన్నతో మాట్లాడి మరల కాల్ చేస్తాను…” అంటూ దివ్య మాట మార్చింది.
సరే నంటూ ఏం చేయాలో తోచక సోఫాలో చతికలబడ్డాడు రవి. సుజాత నిద్ర లేచింది. హరి విషయం చెప్పాడు.
“నువ్వు వెళ్ళాలా హరీ! నాకసలే ఈ డేలివరీ భయంగా ఉంది. నువ్వు లేకుండా నా వల్ల కాదు…”
“కంగారు పడకు..డాడీతో మాట్లాడానులే! హీ ఈజ్ ఆల్ రైట్! – హార్ట్ ఎటాక్ కదా కాస్త కంగారుపడ్డానంతే! అయినా డాక్టర్ అంకుల్ ఉన్నారు కదా, భయం లేదు… వీలయితే నీకు డెలివరీ అయ్యాక, నువ్వు నీ పనులు చేసుకునే ఓపిక వచ్చాక వెళతాను…డోంట్ వర్రీ! ” తన నిర్ణయాన్ని చెప్పాడు హరి.
మరలా ఇంకోసారి ఇండియా కాల్ చేసాడు.
అందరూ రాజారావుతో మాట్లాడారు, హరి అత్తమామలతో సహా!
ఓ రెండు రోజుల తర్వాత –
కడుపులోనున్న బిడ్డ అడ్డం తిరగడంతో సీరియస్ అయ్యింది సుజాతకి. సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఏం ప్రమాదమూ లేకుండా సుజాతకి ఆడ పిల్ల పుట్టింది.
అనుకున్నట్లుగానే దివ్య వాళ్ళమ్మాయి శ్రేయ ది అరంగేట్రం పూర్తయ్యింది. కార్తీక్ కి స్పెల్లింగ్ బీ ఫైనల్లో పదవ స్థానం లభించింది. రవి, దివ్య అది తమ ఓటమి గా ఫీల్ అయ్యారు.
సుజాత కోలుకోవడానికి నెలరోజులు పైనే పట్టింది. నెల తిరిగిన తర్వాత పుట్టిన అమ్మాయికి ఎలర్జీ వల్ల వళ్ళంతా రాష్ వస్తే హాస్పిటల్ లో జేరిపించాల్సి వచ్చింది. హరి మాత్రం ఇండియా వెళ్ళలేకపోయాడు. తరచు తండ్రితో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. రాజారావుకు హార్ట్ లో ఒక వాల్వ్ కి స్టంట్ వేసారు. హరి తండ్రిని అమెరికా తీసుకొద్దామనుకున్నా కుదరలేదు. ఆ సమయం లో ప్రయాణం మంచిది కాదని రాజారావుకి డాక్టరు సలహా ఇచ్చాడు. రోగీ అదే కోరుకున్నాడు, డాక్టరూ అదే వైద్యం చేసాడు.
ఏడాది తరువాత…
ఓ రోజున దివ్య లాస్ ఏంజిలిస్ నుండి హరికి ఫోన్ చేసింది.
“అన్నయ్యా! నీ కీ విషయం తెలిసిందా? నే విన్నది నిజమేనా? పిన్నికి ఫోన్ చేస్తే నిజమే నంది..” దివ్య ఏడవడం హరికి వినిపించింది.
“అవును ! నాకూ డాక్టర్ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు. డాడీ తో మాట్లాడదామంటే ఫోన్ దొరక లేదు. ముందు నాకు మా మావగారి తమ్ముడు ఫోన్ చేసి చెబితే నమ్మ లేదు. అయినా ఇప్పుడేం కొంపలు ములిగాయని..నాకేమీ అర్థం కావడం లేదు….నాన్నతో ఒక సారి మాట్లాడితేకానీ ఏ సంగతీ తెలియదు…”
“ఏం మాట్లాడుతాం రా? నా కయితే మా అత్తగారిముందు, మావ గారిముందూ తల కొట్టేసినట్లయ్యింది. అయినా…వినడానికే నాకు సిగ్గుగా ఉంది…”
“ఏం చేస్తాం ! నా పరిస్థితీ అంతే ! మా మావగారు, అత్తగారు నాన్న పై జోకులు వేసుకుంటున్నారు. నాన్న ముందు నోరువిప్పడానికే భయపడే వీళ్ళందరికీ మనం చులకన అయిపోయాం! అయినా ఈ వయసులో…ఇదేం పని? ” హరి కి మాటలు రావడం లేదు.
“ఇందులో నాన్న తప్పుందని నేననుకోను. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు అద్దింట్లో దిగిన ఆవిడే మనం రాకపోవడం చూసి మెల్లగా నాన్నని బుట్టలో వేసుకొందని నా అనుమానం….ముసలాయన ఎలాగూ అనారోగ్యపు మనిషే కదా, గుటుక్కుమంటే ఉన్న ఇల్లూ పొలమూ కాజేద్దమన్న ప్లాను అయి ఉంటుంది…” దివ్య తన అనుమానాలన్నీ వెళ్ళగక్కింది.
“డాక్టర్ అంకులే దగ్గరుండి ఈ పెళ్ళి జరిపించారట. పిన్ని కి కాల్ చేసి అడిగితే అదే అంది. మీ అమ్మ పోయి దాదాపు ఇరవై ఏళ్ళయ్యింది. ఎప్పుడూ పెళ్ళి ఊసెత్తని మీ నాన్న – ఇదేమిటని అందరం ముక్కున వేలేసుకున్నాం, అంటూ చెప్పింది…నాన్న తో ఏం మాట్లాడు తాం? ఏమని అడుగుతాం? నాకయితే మనసు రావడం లేదు…తలచుకుంటేనే అసహ్యమేస్తోంది…అందరి ముందూ పరువు పోయింది. మా అత్తగారూ, మావగారిముందు తల ఎత్తుకోలేకుండా అయ్యింది…ఇండియా వెళితే ఎక్కడకి వెళతాం..అందరూ పైకి బాగానే మాట్లాడిన మన గురించి, ముఖ్యంగా నాన్న గురించి…ఊహించుకుంటేనే తట్టుకోలేక పోతున్నాను…” హరి బాధగా అన్నాడు.
వాళ్ళిద్దరూ కొత్తరకం బాధలో ఉన్నారు. వాళ్ళిద్దరి బాధకి కారణం రాజారావు వివాహం. చెప్పాపెట్టకుండా, కనీసం సూచన ప్రాయంగా నయినా పిల్లల్ని సంప్రదించకుండా పెళ్ళి జేసుకున్నాడు.
హరి, దివ్య ముందు ఫోన్ చేద్దామనుకున్నారు. చుట్టూ ఉన్న అత్తమామల విరుపులకీ, వ్యంగాలకీ ఆ ప్రయత్నం మానుకున్నారు. వాళ్ళిద్దరికీ ఈ విషయం మింగుడు పడడం లేదు. ఎనిమిదో తరగతిలో ఉండగా హరి తల్లి పోయింది. అప్పటికి రాజా రావుకి ముప్పై అయిదేళ్ళు. పిల్లలకోసం ఇంకో పెళ్ళి చేసుకోమన్నా ఎప్పుడూ ఆ ఊసే ఎత్త లేదు. తల్లీ తండ్రీ అన్నీ తనే అయ్యి పిల్లలిద్దర్నీ పెంచాడు. ఇద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. తను మాత్రం వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొని – పిల్లలకి ఉచితంగా ప్రైవైట్లు చెబుతూ కాలం గడిపాడు. రెండు సార్లు అమెరికా కూడా వచ్చాడు. తనకి పెళ్ళి చేసుకోవాలన్న కోరిక ఉందని ఎవరికీ సంశయం కూడా రాలేదు. అలాంటింది..ఇప్పుడు…హరి మనసు ఎందుకో అంగీకరించలేక పోతోంది. తలలు బోడులైన తలపులు బోడులవునా అన్న సామెత గుర్తొచ్చింది. ఏ సామెత గుర్తుకొస్తే ఏం లాభం, జరగాల్సింది జరిగిపోయాక.
కొంతకాలం తర్వాత….
ఓ రోజు హరి ఆఫీసులో ఉండగా బ్రూస్ వచ్చాడు.
“హరీ ! యూ గాట్ ఎ మైల్. బై మిస్టేక్, దే కెప్ట్ ఇన్ మై ఫోల్డర్. బై ద వే, ఐ ఫర్గాట్ టు టెల్ల్ యు. మరీనా ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ బేబీ ఇన్ 5 మంత్స్ !”
” ఒహ్ ! ఐ సీ ! కంగ్రాట్యులేషన్స్ ! ” అంటూ హరి అభినందించాడు. పని ఉందని బ్రూస్ అక్కడనుండి వెళిపోయాడు. ఎవరి దగ్గరనుండా అని ఆత్రంగా ఉత్తరం చించాడు హరి. అది తండ్రి రాజారావు దగ్గరనుండి..
విప్పి చూసి, చదవడం మొదలు పెట్టాడు.
ప్రియమైన హరికీ, దివ్యకీ,
నేను మీ డాడీ ని.. ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు.
ఎప్పటి నుండో నా మనసుని మీ ముందు విప్పాలని చాలాసార్లు అనుకున్నాను. ఫోన్ లో మాట్లాడు దామనుకున్నాను. కానీ నే చెప్పబోయే విషయాలకి అందరి ప్రశ్నలు అడ్డు వస్తే నేను చెప్పబోయేదీ, నా మనసులో ఉన్న అనిశ్చిత పరిస్థితి మీకు అర్థంకాదన్న ఇదితోనే మీతో ఫోన్ లో మాట్లాడ లేక పోయాను. నేను చేసిన పని మీరిద్దరూ హర్షించరు అన్న విషయం నాకు తెలుసు. అందుకే మీకు చెప్పకుండా నేను పెళ్ళి నిర్ణయం తీసుకున్నాను. చాలా మంది దృష్టిలో నా నిర్ణయం తప్పుగా అనిపించవచ్చు. కానీ నేనేమీ తప్పు చేయలేదనే నా దృఢ నమ్మకం.
మీ అమ్మ, నేనూ ప్రేమించి పెళ్ళి జేసుకున్నాం. అందర్నీ కాదని ఎదురించి జీవించాం. మీరిద్దరూ మాకు పుట్టారు. మీ అమ్మ మరణంతో నేను సగం చచ్చిపోయాను. కానీ నా ముందు మీరిద్దరూ ఉన్నారు. మీ భవిష్యత్తు ఉంది. అది తీర్చి దిద్దడానికే నేను నా బాధని దిగమింగి మిమ్మల్ని ఏ లోటూ రాకుండా పెంచాననే అనుకుంటున్నాను. మీకు పెళ్ళిళ్ళు అయ్యాయి. మీరిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. మీ ఇద్దర్నీ చూసి నేను చాలా గర్వ పడుతూ ఉండే వాడ్ని. మీ కోసం రెండు సార్లు అమెరికాకి కూడా వచ్చాను. మీ జీవితం చూసాను. క్షణం తీరికలేని మీ జీవితాలు చూసాక ఎందుకొచ్చిన ఈ తాపత్రయం అనిపించింది. మీరున్నారు, నేను మీ దగ్గరగా ఉన్నాననే భావన తప్ప, నాకు తోడుగా ఒంటరితనమే కనిపించింది. నాకు నా వయసు వాళ్ళ స్నేహం లేదు. ఒకవేళ ఉన్నా అది పరిమితమే! మీ దగ్గర ఉన్నన్నాళ్ళూ బాగానే ఉన్నా, మనసులో వెలితిగానే ఉండేది. ఇది నేనెప్పుడూ మీకు తెలియకుండానే ప్రవర్తించాను. అమెరికా నుండి వచ్చాక నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. మీరిద్దరూ మీ మీ జీవితాల ఒత్తిళ్ళ వల్ల, మీకున్న సమస్యల వల్లా రాలేకపోయారు. నాకు అనారోగ్యం చింత కంటే మీరిద్దరూ రాలేకపోయారన్న బాధే ఎక్కువగా ఉండేది. మీరు రాలేకపోవడాని మీకున్న కారణాలు మీకున్నాయి. కాదనను. కానీ నా పరిస్థితి ఏమిటి? రోజుకొక సారి ఫోన్ లో మాట్లాడేసి, నాకు డబ్బు పంపింస్తే నాకు అనందం వస్తుందునుకున్నారా?
ఒకరకంగా మీరు నన్ను చూడడానికి రాలేదన్న బాధే నన్ను రోజూ దహించివేసేది. మిమ్మల్ని ఎంతో ప్రేమగానే చూసాను కదా..మరి నా పెంపకంలో లోపమా అన్న వ్యాకులత నన్ను దొలిచివేసింది. నాకు మీరిద్దరూ ఉన్నారు అన్న భావన నా మనసుకి దూరం అయ్యింది.
నాకు ఎటాక్ వచ్చి ఆరు నెలలు దాటినా మీరు రాలేదు. నేనూ కోలుకున్నాను కదా ఎందుకు రావడం అనుకున్నారేమో అని నేననుకున్నాను. నేనా ప్రయాణం చేసి అక్కడకి వచ్చి ఆ ఒంటరితనంతో స్నేహం చేసే కన్నా, ఇక్కడే ఉండడం నాకు శ్రేయస్కరం అనిపించింది. ఏడాది దాటింది. మీరిద్దరూ వస్తారన్న ఆశ పోయింది. ఈ వయసులో ఒంటరి తనం నన్ను బాధించింది. నాకూ ఒక తోడు లేదా ఒక మనిషి అవసరం అనిపించింది. అదే సమయం లో మన ఇంట్లో అద్దెకు దిగిన లక్ష్మి పరిచయమయ్యింది. ఆవిడ భర్త చనిపోయాడు. ఆవిడ టీచర్ ఉద్యోగం చేసుకుంటూ పిల్లాడిని పోషిస్తూ జీవితం వెళ్ళ బుచ్చుకుంటోంది.
నేను ఒక్కడినే ఉంటూ, వండుకు తింటున్నానని తెలిసి ఆవిడ రోజూ కూరలు పంపేది. మీ పిన్ని వాళ్ళూ నేను ఆసుపత్రిలో ఉండగా వచ్చి వెళ్ళారు. ఆ తరువాత వాళ్ళెవరూ మళ్ళీ రాలేదు. డాక్టర్ అంకుల్ నాకు చాలా సాయం చేసారు. ఓ నెల తరువాత వాళ్ళమ్మాయి దగ్గరకి ఆస్ట్రేలియా వెళ్ళారు. నేనొక్కణ్ణే అయ్యాను. నానుంచి ఏమీ ఆశించకుండా నాకు సేవలు చేసింది లక్ష్మి. ఆవిడకి చెయ్యాల్సిన అవసరం లేదు. నేను మీ అమ్మని ఎంతగా ప్రేమించానో, మిమ్మల్ని ఎలా పెంచి పెద్ద జేసానో అన్నీ డాక్టర్ అంకుల్ ద్వారా తెలుసుకుంది. నాకు కుంటుంబం మీదున్న మమకారమే ఆమెకు నా పైన ఏర్పడిన గౌరవానికి కారణం. లక్ష్మి భర్త అమెను ఎన్నో చిత్ర హింసలు పెట్టేవాడట. ఏనాడూ ప్రేమగా చూసిన పాపాన పోలేదని చెప్పింది. ఏదైయితేనే నా మీద లక్ష్మి కి గౌరవం నాకు ఆవిడంటే సదభిప్రాయం కలిగాయి.
ఒక సారి అనారోగ్యం చేస్తే పరిచర్యలు చేసింది. అదే చివరకి పెళ్ళికి దారి తీసింది. ఈ అనారోగ్య సమయంలో పెళ్ళి చేసుకుంటే నా అవసరం కోసమని అందరూ భావిస్తారనీ లోకం అనుకుంటుందని ముందు భావించాను. ఒకరకంగా అవసరం కంటే నా కోసం ఒక మనిషి తాపత్రయ పడుతుంది అన్న భావనే నీ ఈ నిర్ణయానికి కారణం. ఇన్నాళ్ళూ ఎప్పుడూ ఆ అవసరం రాలేదు. నా పని నేను చేసుకొని బ్రతికాను. ఇప్పుడు ఓపిక లేదు. కావాలంటే ఏ వృద్ధాశ్రమం లోనో చేరచ్చు. అక్కడైనా ఇదే ఒంటరితనం కదా ! ఈ వయసులో నా పక్కన ఒక మనిషి ఉంది అన్న భావనే నాకు శక్తి నిచ్చింది. అదే నా నిర్ణయానికి కారణం.
ఈ వయసులో పెళ్ళేమిటని మీరనుకోవచ్చు. నాకూ ఒక తోడు కావాలి. మీకు నేను కావాలి అన్న భావన నాకు పోయింది. ఎందుకంటారా, అనారోగ్యం చేస్తే మీ దగ్గరకొచ్చి ఉండమంటారు. నేను అక్కడకొచ్చి, ఆ ఒంటరి తనం భరించలేను. మిమ్మల్నీ మీ భవిష్యత్తుని తాకట్టు పెట్టి నాకోసం ఇక్కడకి రమ్మనమని అర్థించడం న్యాయం కాదు. అలా అని ఒక్కడినీ ఇక్కడ ఉండ లేను. వృద్ధాప్యంలో ఒక మనిషి తోడు లేకుండా ఇంకో మనిషి జీవించడం కష్టమని మెల్ల మెల్లగా అర్థమయ్యింది. మీతో నా మనసులో మాట చెబుదామనుకున్నాను. కానీ డాక్టర్ అంకులే వద్దన్నారు. మీరు నీ నిర్ణయం మెచ్చరనీ, అది ఇష్టమైతే తను లక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పాడు. అంతా అలా ఊహించని విధంగా జరిగిపోయింది.
మీకు నా మనసులో మాట వెంటనే చెబుదామనుకున్నాను. నా పెళ్ళి వార్త తెలిసి మీరిద్దరూ డాక్టర్ అంకుల్ దగ్గర నన్ను అస హ్యిం చుకున్నట్లు మాట్లాడారన్న విషయం తెలిసింది. మీ మావగారు వచ్చి నేనేదో నేరం చేసినట్లు మాటలని వెళిపోయాడు.
పెళ్ళెందుకు చేసుకోవడం కలిసే ఉండచ్చు కదా అని నువ్వడగొచ్చు. నాకూ, లక్ష్మి కీ ఒకరకంగా మనందరికీ సమాజపరం గా మంచిదని పెళ్ళి చేసుకున్నాను.
మీరు అసహ్యించుకునే పని నేను ఏమీ చేయ లేదనే అనుకుంటున్నాను. అయినా ఆవేశం లో ఉన్న మీకు నా మనసు అర్థం కావని మీతో మాట్లాడానికి కూడా ప్రయత్నించ లేదు. మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదా అని బాధ పడ్డాను.
హరీ, నీకు గుర్తుందా, నీ కంపెనీ సి యి ఓ పెళ్ళి కి తీసుకెళ్ళావు. అతని పేరు బ్రూస్ అనుకుంటా సరిగా గుర్తు లేదు. అతని భార్య విడాకులిచ్చి వెళిపోతే, అతను ఒంటరి తనంతో పిచ్చివాడయ్యాడనీ, పెళ్ళి జేసుకోమని నువ్వే సలహా ఇచ్చావనీ నాకు చెప్పావు. అప్పుడు నాకు ఆ పెళ్ళీ, ఆ తంతూ, అంతా అయోమయంగానూ, వింత గానూ అనిపించాయి. ఇదేం కల్చర్ రా బాబూ అనుకున్నాను. కానీ నేనూ బ్రూస్ లాగే ఇంకో పెళ్ళి చేసుకోవల్సి వస్తుందని ఆరోజు ఊహించలేదు. బ్రూస్ మేరేజ్ ని సమర్థించిన నువ్వు, నా వరకూ వచ్చే సరికి ఎందుకింత కఠినంగా మారావో నా కిప్పటికీ అర్థం కాలేదు. బహుశా నువ్వు అమెరికాలో జీవిస్తున్నా, నీకు సంబంధించనంత వరకూ అంటే నీకు నొప్పి కలగనంత దాకా వాళ్ళ ఆచారాలూ, వ్యవహారాలూ అన్నీ లాజికల్ గానే అనిపిస్తున్నాయి. కానీ నీ వాళ్ళ విషయం వచ్చే సరికి నీ లాజిక్ నీ వాళ్ళకి అన్వయించలేక పోతున్నావు. నా నిర్ణయాన్ని ఒప్పుకోలేక పోతున్నావు. ఇదే – నాకు అర్థం కానీ, జవాబు లేనీ ప్రశ్న… తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఇహ నేనుగా నా శేష జీవితం జీవించే హక్కు నాకుంది. నా నిర్ణయాలూ, నా ఒడంబడికలూ, నా స్నేహాలూ అన్నీ నా ఇష్ట ప్రకారంగా నిర్ణయించుకునే అధికారం నాకుందని అనుకుంటున్నాను.
చూసినా, చూడకపోయినా – పెట్టినా, పెట్టక పోయినా తల్లితండ్రులు పిల్లల్ని ప్రేమించడం మానరు. ఎందుకంటే వారి ప్రతి రూపాలే పిల్లలు ! అందుకే ప్రియమైన అని సంబోధించాను.
ఇప్పుడు నా మనసు తేలిక పడింది. ఎందుకంటే ఏమో, చెప్పలేను…
మీరు నన్ను నన్నుగా చూడాలనిపిస్తే ఈ ఇంటి తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి.
– నాన్న
హరి ఒక్కసారి బరువుగా కళ్ళు మూసుకున్నాడు. సంజాయిషీ ఉత్తరంలా అనిపించింది.
ఎందుకో తండ్రి నిర్ణయాన్ని అంగీకరించ లేక పోతోంది అతని మనసు.