ఒంటరి విహంగం

తెల్లారేక ఇండియా ఫోన్ చేసి తండ్రితో మాట్లాడాడు. రాజారావు గొంతు నూతిలోంచి మాట్లాడుతున్నట్లుగా అనిపించింది హరికి. కంగారు పడవద్దని, ధైర్యంగా ఉండమని తను వీలు చూసుకొని వస్తానని చెప్పాడు. డాక్టర్ అంకుల్ ఎక్కువ మాట్లాడొద్దంటే ఆగిపోయాడు హరి. డబ్బు ఎంత ఖర్చయినా పరవాలేదు, నాన్న ఆరోగ్యం గా ఉండాలని చెప్పాడు. నిజానికి తన తండ్రికి తన డబ్బు అవసరం లేదని హరికి తెలుసు. రాజారావు ముందుచూపుగా ప్రతీ దానికీ కొంత డబ్బు దాచాడన్న విషయం తెలుసు. హరి తన పిన్ని వాళ్ళకీ ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఏం కంగారు పడవద్దనీ, మేమున్నాములే అన్న ధైర్యం ఇచ్చారు హరికి.

ఆ ఫోన్ అయ్యాక దివ్యకి కాల్ చేసాడు. దివ్య వాళ్ళు లాస్ ఏంజిల్స్ లో ఉంటారు. దివ్య భర్త రవి ఫోన్ ఎత్తాడు.

“రవీ ! దివ్య ఉందా? మా డాడీకి హార్ట్ ఎటాక్ వచ్చింది..దివ్యకి చెబుదామని…”

“అరె! హార్ట్ ఎటాక్ ఎప్పుడొచ్చింది? ఎలా ఉంది ఇప్పుడు?…నువ్వు మాట్లాడేవా? …” ప్రశ్నల వర్షం కురింపించాడు.

“నువ్వు ఫోన్ స్పీకర్ లో పెట్టి దివ్యని పిలు..అన్నీ వివరంగా చెబుతాను…” హరి అసహనంగా అన్నాడు.

“అన్నయ్యా…ఏమయ్యిందిరా?” దివ్య ఫోన్ లోకి వచ్చింది.

హరి అంతా వివరంగా చెప్పాడు.

“నువ్వు ఎప్పుడు వెళుతున్నావు హరీ? ” రవి అడిగాడు.

“లేదు రవీ! నాకు వెళ్ళడం కుదరదు. సుజాతకి రెండురోజుల్లో డెలివరీ. దివ్యని పంపిస్తావా?” అభ్యర్థించాడు హరి.

“దివ్య ఇప్పుడు వెళ్ళాలంటే…” నీళ్ళు నమిలాడు అవతలి వైపునుండి రవి.

“అయినా – అంత పెద్ద ఎటాక్ కాదుకదా ! పోనీ డెలివరీ అయ్యాక అయినా నువ్వు వెళ్ళచ్చుకదా..” ఉచిత సలహా పారేసాడు రవి.

“నా ఉద్దేశ్యమూ అదే…కానీ ఈ లోగా దివ్య వెళితే…”

“అదికాదు హరీ…ఈ మధ్య మా అమ్మకీ నాన్నకీ అంత బాగుండడం లేదు. అమ్మకి కాలు నెప్పి లేవడం లేదు. అదీకాక ఇంకో పదిరోజుల్ల్లో,పెద్దమ్మాయి శ్రేయాది కూచిపూడి ఆరంగేట్రం ఉంది. కార్తీగ్గాడి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నెక్ష్ట్ వీక్ ఉంది…” రవి తన బిజీ స్కెడ్యూలు హరి ముందుంచాడు.

దివ్యని పంపడానికి రవి సిద్ధంగా లేడని హరికి అర్థమయ్యింది.

“అదికాదురా ! అన్నయ్యా…నాకూ వెళ్ళాలనే ఉంది. నాన్నతో మాట్లాడనీ ముందు. అసలు ఈ విషయం వింటే నే కాళ్ళూ చేతులూ ఆడ్డం లేదు..నాన్నతో మాట్లాడి మరల కాల్ చేస్తాను…” అంటూ దివ్య మాట మార్చింది.

సరే నంటూ ఏం చేయాలో తోచక సోఫాలో చతికలబడ్డాడు రవి. సుజాత నిద్ర లేచింది. హరి విషయం చెప్పాడు.

“నువ్వు వెళ్ళాలా హరీ! నాకసలే ఈ డేలివరీ భయంగా ఉంది. నువ్వు లేకుండా నా వల్ల కాదు…”

“కంగారు పడకు..డాడీతో మాట్లాడానులే! హీ ఈజ్ ఆల్ రైట్! – హార్ట్ ఎటాక్ కదా కాస్త కంగారుపడ్డానంతే! అయినా డాక్టర్ అంకుల్ ఉన్నారు కదా, భయం లేదు… వీలయితే నీకు డెలివరీ అయ్యాక, నువ్వు నీ పనులు చేసుకునే ఓపిక వచ్చాక వెళతాను…డోంట్ వర్రీ! ” తన నిర్ణయాన్ని చెప్పాడు హరి.

మరలా ఇంకోసారి ఇండియా కాల్ చేసాడు.

అందరూ రాజారావుతో మాట్లాడారు, హరి అత్తమామలతో సహా!

ఓ రెండు రోజుల తర్వాత –

కడుపులోనున్న బిడ్డ అడ్డం తిరగడంతో సీరియస్ అయ్యింది సుజాతకి. సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఏం ప్రమాదమూ లేకుండా సుజాతకి ఆడ పిల్ల పుట్టింది.

అనుకున్నట్లుగానే దివ్య వాళ్ళమ్మాయి శ్రేయ ది అరంగేట్రం పూర్తయ్యింది. కార్తీక్ కి స్పెల్లింగ్ బీ ఫైనల్లో పదవ స్థానం లభించింది. రవి, దివ్య అది తమ ఓటమి గా ఫీల్ అయ్యారు.

సుజాత కోలుకోవడానికి నెలరోజులు పైనే పట్టింది. నెల తిరిగిన తర్వాత పుట్టిన అమ్మాయికి ఎలర్జీ వల్ల వళ్ళంతా రాష్ వస్తే హాస్పిటల్ లో జేరిపించాల్సి వచ్చింది. హరి మాత్రం ఇండియా వెళ్ళలేకపోయాడు. తరచు తండ్రితో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. రాజారావుకు హార్ట్ లో ఒక వాల్వ్ కి స్టంట్ వేసారు. హరి తండ్రిని అమెరికా తీసుకొద్దామనుకున్నా కుదరలేదు. ఆ సమయం లో ప్రయాణం మంచిది కాదని రాజారావుకి డాక్టరు సలహా ఇచ్చాడు. రోగీ అదే కోరుకున్నాడు, డాక్టరూ అదే వైద్యం చేసాడు.