సాయము శాయరా డింభకా!

ఆ శనివారం నాడు సతీష్ వాళ్ళింట్లో వాళ్ళ పాప మూడో పుట్టిన రోజు పార్టీ. ఆ పార్టీకి వెళ్ళటం శ్రీదేవికి అంతగా ఇష్టం లేదుగానీ, నేనే బయల్దేరదీశాను.

“ఐనా చిన్న పిల్లల పుట్టినరోజుకి ఆ వయసు పిల్లల్ని పిలుచుకోవాలి గానీ మనల్నెందుకు పిలవడం?” అంది శ్రీదేవి.

“అదేంటి, ఇంట్లో ఏదన్నా శుభకార్యమైతే మనవాళ్ళని పదిమందినీ పిలుచుకోమా? ఇలాగే కదా అభిమానాలూ సంబంధాలూ నిలబడేది?” అనేశాను.

“ఆ, నిలబడతాయి మీ బాదరాయణ సంబంధాలు!” అంటూ తను విసురుగా లేచి లోపలికి వెళ్ళిపోయింది.

మనవాళ్ళంటే నాకున్న వీరాభిమానాన్ని మా ఆవిడ చారులో కరివేపాకులా ఇలా తీసిపారెయ్యడం నాకు బొత్తిగా నచ్చలేదు. సతీష్ ఖచ్చితంగా మనవాడే. మా ఉద్యోగాల తీర్లు వేరైనా .. ఏ ముహూర్తాన మా స్థానిక గుడి కమిటీ మీటింగులో పరిచయమయ్యామో .. మా అభిప్రాయాలు అభిరుచులు కలవడం వల్లనేమీ, ఇంచుమించు ఒకే వయసు వాళ్ళం అవడం వల్లనేమీ, మా స్నేహం బాగా ధృఢపడింది. సతీషుక్కూడా నాకులాగానే మన సాంప్రదాయాలన్నా, మన భాషన్నా, మనవాళ్ళన్నా గొప్ప అభిమానం.

దానికి తోడు ఇదిగో ఇలా అప్పుడప్పుడూ పార్టీలు, ఒకళ్ళింటికి ఒకళ్ళు పిల్చుకోవటాలు. అసలు సంగతేవిటంటే, ఆ సాయంత్రం పైరేట్స్ ఆఫ్ ది కరిబ్బియన్ మూడో సినిమా చూడాలని ముందు అనుకున్నాం శ్రీదేవీ నేనూ. శనివారం కుదరకపోతే మళ్ళీ కుదర్దు. ఆదివారం శలవన్న మాటే గానీ వారమంతా వాయిదా వేస్తూ వచ్చిన ఇంటిపనులు చేసుకోడానికీ, రాబోయే పని వారానికి తయారవడానికే సరిపోతుంది గద. ఈ సతీశుడేమో ఏంటో ఆఖర్నిమిషంలో పిల్చాడు. శ్రీదేవికి ఒళ్ళుమండటానికి ఇది కూడా ఒక కారణమనుకోండి. ఐనా సంఘజీవుల మైనందుకు, మనది కాని దేశంలో ప్రవాసమున్నందుకు కాస్త మనవాళ్ళతో రాకపోకలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలని నా ఉద్దేశం. రేపేదన్నా అవసరం పడితే మన అన్నవాళ్ళు తోడుండాలి కదా. ఎప్పుడో రాబోయే అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్నేహాలు చేస్తామని కాదు, మాటవరసకి చెబుతున్నా.

“పార్టీనించి తొందరగా బయటపడి రాత్రి ఆటకి వెళ్దాంలేవోయ్. రేపు కొంచెం ఆలస్యంగా నిద్ర లేచినా ఇబ్బంది లేదు,” అన్నాను. నాక్కూడా సినిమా మిస్సవ్వాలని లేదు.

పార్టీనించి తొందరగా బయటపడాలని ఎంత ప్రయత్నించినా తొమ్మిది దాటింది. పార్టీ తరవాత సినిమాకెళ్ళే ముందుచూపుతో శ్రీదేవి జీన్స్ వేసుకొచ్చింది. పట్టుచీరల ఆంటీలు తనని ఎలా వెలేసినట్టు చూశారో కారెక్కిన దగ్గిర్నించీ ఏకరువు పెడుతోంది. ఎంత చెడ్డా అర్ధాంగి గనక నేను ఒక చెవ్వు మాత్రం అప్పగించి తను చెప్పేది సగం సగం వింటూ కారుని మల్టీప్లెక్స్ దారి పట్టించాను.

పార్కింగ్ లాట్‌లోకి తిరుగుతున్నప్పుడు శ్రీదేవి సెల్ మోగింది.

“హలో!”

“హాయ్ సిరీ! హయ్యూ డూయింగ్?” నాక్కూడా చక్కగా వినబడుతోంది .. ముక్కుతో రాగాలు తీసుకుంటూ కెంటక్కీ యాసతో తన సహోద్యోగిని ఆండ్రియా గొంతు. ఈ టైములో ఈవిడెందుకు కాల్చేస్తున్నట్టు?

“హాయ్ ఆండ్రియా! నేను బానే ఉన్నా. ఏంటి విశేషం?”

“సిరీ! నీతో ఒక పేద్ద సాయం కావాలీ. శనివారం రాత్రీ, నాకు తెల్సూ, కానీ ఇంకెవర్ని అడగాలో నాకు తెలీలా. నీకు ఏమాత్రం ఇబ్బందైనా చెప్పేసెయ్. నేనర్ధం చేసుకుంటా. కానీ ఈ సాయం చేస్తే మాత్రం నేను చాలా ఛ్ఛాలా ఆనందిస్తా!”

“ఆండ్రియ! ఆండ్రియాఆఆ!! అసలు విషయమేంటో చెప్పు.”

విషయమేంటంటే ఆమె గతవారం వెకేషన్ తీసుకుని తన మగస్నేహితుడు, కాబోయే మొగుడు ఐన హార్లీ గారితో సహా కెంటకీలో అతని అమ్మా నాన్నలని చూడ్డానికి వెళ్ళింది. విమాన ప్రయాణానికి కారుని విమానాశ్రయంలో పార్క్ చేసి వెళ్ళడం మామూలేగా. ఇప్పుడే తిరిగి వచ్చారు. ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ లాట్‌లో తమ కారుదగ్గిరికి వచ్చి చూసుకుంటే కారు తాళాలు లేవు. ఆ మహానుభావుడికి అప్పుడు గుర్తొచ్చింది .. అక్కడ కెంటకీలో దిగంగానే తాళాలు జేబులోంచి తీసి వాళ్ళమ్మావాళ్ళింట్లో టీవీ మీద పెట్టాడనీ, తిరిగి బయల్దేరే హడావుడిలో మర్చిపోయాడనీ. అతను ఊరికి కొత్త .. ఇక్కడెవరూ స్నేహితులు లేరు. అపార్టుమెంటు తాళం అదృష్టవశాత్తూ ఆండ్రియా దగ్గరుంది, కారు మారుతాళం అపార్టుమెంట్లో ఉంది, కానీ ఈ రాత్రికి ఇల్లు చేరాలి .. అదీ సమస్య. ‘నువ్వు ఎయిర్‌పోర్టుకొచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళ గలవా?’ అని ఆమె వేడికోలు.

ఆమెని ఒక్క నిమిషం ఉండమని (నాకు అంతా వినిపిస్తూనే ఉన్నా) శ్రీదేవి టూకీగా విషయం చెప్పి,

“పద, పాపం ఎయిర్‌పోర్టుకెళ్దాం” అంది.

“గాడిద గుడ్డేం కాదూ. ఈ వారం దాటితే ఈ సినిమా వెళ్ళిపోతుంది. మనకి వేరే పనుందని చెప్పి, వాళ్ళని కేబ్ తీసుకుని ఇంటికెళ్ళమను.”

“ఛ, ఊరుకో. సినిమాని థియెటర్లో కాకపోతే డిస్కొచ్చాక చూడొచ్చు. పాపం వాళ్ళెంత ఇబ్బంది పడతారో. యాభై మైళ్ళ దూరమంటే యాభై డాలర్లేం? కేబ్‌కి ఇంకా బాగా ఎక్కువే పడుతుంది. వాళ్ళకి మాత్రం ఎందుకా అనవసరపు ఖర్చు. పద పద.”

“వెళ్ళి తీసుకురావాలంటే మనకి మాత్రం కాదా ఖర్చు? రానూ పోనూ వంద మైళ్ళంటే టాంకు మూడోవొంతు ఖాళీ అవుతుంది. ఎంత లేదన్నా పదిహేను డాలర్లు.”

“ఆండ్రియా దగ్గర వసూలు చేద్దువు గానిలే.”

“మరి తిరిగిరాని ఈ శనివారపు సాయంత్రపు విలువ? నా అందాల సతీమణితో గడపాల్సిన అపురూప క్షణాల విలువ?”

“నీ అందాల సతీమణి ఎక్కడికీ పోలేదు, నీతోనే ఉంది. ఎయిర్‌పోర్టుకి గంట ప్రయాణం ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇక సోది ఆపి పద, పాపం ఇప్పటికే వాళ్ళు చలికి బిగుసుకు పోతుండి ఉంటారు.”

జోరుగా హుషారుగా షికారు పోదమా అని ఈలేసుకుంటూ, ఊసులాడుకుంటూ ఒక గంటలో ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాం. ఆండ్రియా గుర్తులు చెప్పిన గేస్ స్టేషన్ నాకు పరిచయమే. అప్పటిదాకా గేస్ స్టేషన్లో కాఫీ తాగుతూ చలికాగుతూ ఉన్న వారి జంట మా కారు చూసి బయటికొచ్చారు.

“హాయ్ సిరీ, హాయ్ నావీన్! థాంక్యూ సో స్సోమచ్ ఫర్ గెటింగస్ మేన్!” అని మొదలెట్టింది ఆండ్రియా.

“ముందు కారెక్కండి తల్లీ, సొల్లు తరవాత!” అన్నాను నవ్వుతూ.

గబగబా వాళ్ళ పెట్టెలు ట్రంకులో పెట్టి ఇద్దరూ వెనక సీట్లో ఎక్కారు. కారులోపలే అందరూ పరిచయాలు కానిచ్చి వెనక్కి బయల్దేరాం. ఆండ్రియా వరుడు హార్లీ చక్కగా కొబ్బరిబోండాం లాగా గుండ్రంగా, పొత్రంరాయిలాగా దిట్టంగా ఉన్నాడు.

శ్రీదేవి కబుర్లు మొదలెట్టింది .. అంటే ఇంటరాగేషనన్న మాట. సీఐఏ వాళ్ళు పాఠాలు నేర్చుకోవచ్చు నా ఉత్తమార్ధభాగం దగ్గిర. అవతలి వాడికి నెప్పి తెలీకుండా లాగుతుంది సమాచారం.

ఆండ్రియా చెప్పింది సమాధానం .. ఏవిటంటే వాళ్ళ పెళ్ళి ఫిక్సయిందని. ఆ వివరాలు మాట్లాడుకుని పెళ్ళి అరేంజిమెంట్లు చేసుకు రావడానికే వాళ్ళు కెంటక్కీ వెళ్ళి వస్తున్నారు .. అంటే పెళ్ళి కెంటక్కీలో హార్లీ తలిదండ్రుల వూళ్ళో జరుగుతుందిట. కబుర్ల సందడిలోనే వాళ్ళ ఇల్లు చేరాం. దిగేప్పుడు ఇద్దరూ మహా ఇదైపోయారు మా సహాయానికి. హార్లీ ఒక పదిసార్లైనా చెప్పుంటాడు ఈ సహాయం మరిచిపోలేమని. మేం వాళ్ళని తీసుకురావడానికి పైరేట్స్ సినిమా వొదులుకున్నామని తెలిసి ఆండ్రియా చాలా నొచ్చుకుంది కూడా. వాళ్ళని దింపి మా అపార్టుమెంట్ చేరే సరికి టైము పదకొండున్నర.

పడుకోబోయే ముందు పళ్ళుతోముకుంటుంటే శ్రీదేవి అంది, “ఐతే ఆండ్రియా ఒక రెణ్ణెల్లలో పప్పన్నం పెడుతుందన్న మాట మనకి.”

“వాళ్ళసలే కెంటక్కీ హిల్లిబిల్లీ లాగున్నారు. అచ్చమైన సీమపంది మావసం పెడతారు బార్బెక్యూ చేసి మరీను.” నోట్లో పేస్టు నురగని ఉమ్మేసి సమాధానం చెప్పి మళ్ళీ బ్రష్షు నోట్లో పెట్టుకున్నా.

“ప్రతి మాటకీ పెడర్ధాలు తియ్యకు. మనకి ఒక అచ్చమైన కేథలిక్కు చర్చి పెళ్ళి చూసేందుకు ఆహ్వానం వస్తుంది గదా అన్నాను.”

ఈ ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళకి హాజరవడమంటే, అవి ఏ రకమైన పెళ్ళిళ్ళైనా సరే, ఇంత ఆసక్తీ, సరదా ఎందుకో నాకు అర్థం కాదు. దంతధావనం హడావుడి నటించి సమాధానం చెప్పకుండా దాటవేశాను అప్పటికి. కానీ పక్క ఎక్కేప్పటికి ఏవో ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతున్నై. పెళ్ళి కెంటక్కీలో. ప్రయాణానికీ హోటలుకీ ఖర్చు తప్పదు. సినిమాకెళ్ళే వంకతో సతీష్ ఇంట్లో పార్టీకే చీరకట్టుకోకుండా జీన్సులో ప్రత్యక్షమైన నా ఉత్తమార్ధభాగం ఈ చర్చి పెళ్ళికి చీర కడుతుందని అనుకోను. అలాగని జీన్సు వేసే సందర్భం కాదు. కచ్చితంగా ఒక ఫార్మల్ గౌనుకి టెండరు పెడుతుంది. ఆ పైన వధూవరులకి గిఫ్టు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనుకుంటూ నిద్రలోకి జారుకున్నా.

నిద్రలో కల. నేనొక బోనులో బందీగా ఉన్నా. నా కాళ్ళకింద నేల ఎగిసి ఎగిసి పడుతోంది. చుట్టూ సముద్రపు హోరు. నేనున్నది ఒక పాతకాలపు చెక్కల ఓడ! చుట్టూ గాఢాంధకారం, ఆకాశంలో చెప్పలేనన్ని నక్షత్రాలు .. ఎక్కడో భూమికి దూరంగా సముద్ర మధ్యంలో ఉన్నట్టున్నాము. నేనెందుకు బందీగా ఉన్నానో అర్ధం కాలేదు. దాహంతో నాలిక పిడచకట్టుకు పోతోంది. పిలిచినా ఎవరన్నా పలుకుతారా? ఇంతలో ఒక కాగడా నా బోను వేపుకి వస్తోంది. పాత హాలీవుడ్ సినిమాల్లో సముద్రపు దొంగ గెటప్‌లో ఆ ఆకారం .. నెమ్మదిగా దగ్గరవుతోంది. బాగా దగ్గిరకొచ్చాక మొహం స్పష్టంగా కనబడింది .. కేప్టెన్ జాక్ స్పార్రో గెటప్‌లో బోండాం హార్లీ పళ్ళికిలిస్తూ. దిగ్గున లేచి కూర్చున్నాను.


చలికాలం రోషం తెచ్చుకుని వసంతమైంది. అప్పుడప్పుడూ శ్రీదేవి చెబుతూ ఉంటుంది ఆఫీసులో ఆండ్రియా తమ పెళ్ళి ఏర్పాట్ల ముచ్చట్లు చెబుతూనే ఉన్నదని. ఒకసారి కేటరింగ్ వాడు ఏదో మెలిక పెట్టాడుట. ఇంకోసారి పూలు సప్లై చెయ్యాల్సిన ఆమెతో ఫోనులో గంటన్నర వాగ్యుద్ధం చేసి జయించిందిట. కానీ ఎక్కడా మనల్ని పెళ్ళికి పిలిచారన్న మాట మాత్రం చెప్పదు. నేననుకున్నట్టుగానే శ్రీదేవి పెళ్ళి డ్రెస్సు కోసం ఒక రోజు షాపింగ్ ట్రిప్పు పెట్టింది. ముందసలు మనల్ని పెళ్ళికి పిలవనీ అన్నా. ఏంటీ వీళ్ళు ఇంకా ఇన్విటేషన్ ఇవ్వరు అని తను కూడా చిరాకు పడింది. పెళ్ళికింకా నెలరోజులే ఉందని చాలా హడావుడి కూడా పడిపోయింది. అటు నించి మాత్రం కిమ్మిన్నాస్తి. మళ్ళీ తనకి తనే సమర్ధించుకుంది .. పాపం అన్ని పనులూ వాళ్ళే చేసుకోవాలి గదా, మనకిలాగ తల్లిదండ్రులు చేసి పెట్టరు గదా, బయటి ఊళ్ళ వాళ్ళందరికీ ముందు పోస్టులో పంపించేశాక మనకి చేత్తో ఇస్తుందిలే ఇన్విటేషన్ .. అని నాకు నచ్చ చెప్పింది. మధ్య నాకెందుకూ నచ్చజెప్పడం?

ఇంతలో ఒక రోజు సతీష్ ఫోన్ చేసి వాళ్ళింట్లో సత్యనారాయణ వ్రతమని చెప్పి రమ్మని పిలిచాడు. అది సరిగ్గా ఆండ్రియా హార్లీ పెళ్ళి రోజునే. ఇంక వాళ్ళ నించి పెళ్ళి పిలుపు రాదని నాకెందుకో అకస్మాత్తుగా జ్ఞానోదయమైంది. సతీష్‌కి వస్తామని చెప్పేశాను. అలా చూస్తూ ఉండగానే ఆండ్రియా రెండు వారాలు శలవు పెట్టి కెంటక్కీ వెళ్ళింది పెళ్ళి చేసుకోడానికి. శ్రీదేవీ నేనూ సతీష్ వాళ్ళింటికి వెళ్ళాం సత్యనారాయణ వ్రతం చూడ్డానికి. ఏమైనా, మనవాళ్ళ మర్యాదలు వేరు. వ్రతం పూర్తైనాక భోజనాల మధ్యలో కెంటక్కీలో కేథలిక్కు పెళ్ళికి వెళ్ళే ఛాన్సు కొద్దిలో ఎలా మిస్సయిందో సరదాగా చెప్పి నవ్వించాను.

ఒక పెద్దాయన “అంతేనండీ, ఈ అమెరికా వాళ్ళంతా అంతే” అన్నాడు. ఆ పైన అందరూ తలో మాటా అన్నారు. సతీష్ అన్న మాట నన్ను ఆకట్టుకుంది.

“అమెరికన్లకి మనలాంటి విదేశీయుల్ని చూసి వీడు మనవాడు అని ఎప్పటికీ అనిపించదనుకుంటా. ఉద్యోగ ధర్మంగా ఏదో స్నేహంగానే ఉంటారు గానీ ..”

“సరిగ్గా చెప్పావ్” అన్నాను.

మేం బయల్దేరి వచ్చేస్తుంటే సతీష్, అతని భార్య రశ్మి మా కారు దాకా వచ్చారు. వాళ్ళు ప్రవేటుగా చెప్పిన విషయం: సతీష్‌కి ఎక్కడో టెక్సస్‌లో ప్రాజెక్టు వచ్చిందిట. భార్యా పిల్లల్ని ఇక్కడే ఉంచి అతను రెండువారాల కొకసారి వచ్చి చూసి వెళ్ళేందుకు ప్లాన్. ఈ విషయం మళ్ళీ పదిమందికీ తెలియడం ఇష్టం లేదు. అవును పాపం ఏం చేస్తారు. కొన్న ఇల్లు ఈ డౌన్ మార్కెట్లో అమ్మే పరిస్థితి కాదు. అదీ కాక అక్కడ ప్రాజెక్టు మాత్రం ఎన్నాళ్ళుంటుందో. ఇతని పరిస్థితి ఇంకా నయం .. రెండు వారాలే బెంచి మీద ఉన్నది, మళ్ళీ కొత్త ప్రాజెక్టు దొరికింది. ఇవ్వాళ్టి వ్రతం ఒక పాలు దేవుడికి ధన్యవాదాలు, ఒక పాలు వేడికోలు అనిపించింది నాకు. ఏ మాత్రం సహాయం కావలసినా పిలవమని రశ్మికి చెప్పి శ్రీదేవీ, నేనూ ఇల్లు చేరాం.


వసంతం కాస్తా కన్నెర్రబడి గ్రీష్మమై నిప్పులు చెరగటం మొదలు పెట్టింది. ఒక రాత్రి పది దాటాక పడుకో బోతున్న టైములో ఫోను మోగింది. సతీష్ వాళ్ళ నెంబరు. రశ్మి చేసింది .. వాళ్ళ పాపకి తీవ్రమైన జ్వరం, వాంతులూ అని. తనకి కాళ్ళూ చేతులూ ఆడటల్లేదని ఏడ్చెయ్యడం మొదలు పెట్టింది. ఇదిగో, ఇప్పుడే బయల్దేరుతున్నామని చెప్పి ఇద్దరమూ బయల్దేరాం. మేము వాళ్ళింటికి చేరేలోగా శ్రీదేవి తన సెల్‌లో రశ్మితో మాట్లాడుతూ ధైర్యం చెబుతూనే ఉంది. పది నిమిషాల్లో వాళ్ళింటికి చేరాం. పాపని నేనెత్తుకొచ్చి వెనక సీట్లో పడుకో బెట్టాను. రశ్మి కావలసిన వస్తువులు గబగబా ఒక సంచీలో సద్దుకుని వచ్చింది. మళ్ళీ బయల్దేరి దగ్గర్లోనే ఉన్న ఎమర్జెన్సీ రూంకి చేరాం. వాళ్ళ పుణ్యమా అని తొందరగానే చూశారు.

ఈ లోపల సతీష్ నాకు ఫోన్ చేశాడు. పాపం అతని ఆదుర్దా అతనిది. ఆ సాయంత్రమే అతను తిరిగి టెక్సస్ వెళ్ళాట్ట. పాప అతని కోసం బెంగ పెట్టుకున్నట్టుంది. నాకు జాలేసింది .. ఏంటో ఈ ఉద్యోగాలు, సంపాదనలు .. పిల్లల ముచ్చట్లు చూసుకోకుండా, వయసులో ఉన్నప్పుడు భార్యా భర్తా కలిసుండి జీవితాన్ని ఆనందించకుండా .. నెలకి రెండుసార్లు కలుసుకోవటంలో ఏమానందం ఉంటుంది? మిస్సై పోయిన పిల్లల ముచ్చట్లు మళ్ళీ మళ్ళీ రావుగదా. తరవాత ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుట్టినరోజులు ఎంత ఘనంగా జరిపినా అప్పటికప్పుడు ఆ పాప బెంగ తీరదు కదా? అరగంట కోసారి అతను ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నాకు చేతనైనట్టు ధైర్యం చెబుతూ వచ్చాను. పన్నెండింటికల్లా పాప పరిస్థితి కుదుటపడిందని ఇంటికి తీసుకెళ్ళిపొమ్మన్నారు. సతీష్ కోరిక పైనా, రశ్మి అభ్యర్ధన పైనా మేము ఆ రాత్రికి వాళ్ళింట్లోనే ఉండిపోయాం.

“మనవాళ్ళంటూ మీరున్నారు కనక సరిపోయింది,” అన్నాడూ సతీష్ కృతజ్ఞత నిండిన గొంతుతో.


ఆ నెలాఖరుకి మేము అపార్టుమెంటు మారాల్సి వచ్చింది. ఆ రోజే చాలా మందికి ఇళ్ళు మారే రోజో ఏమో, మూవింగ్ కంపెనీ దేన్ని పిలిచినా, ఆరోజుకి కుదర్దని చెప్పేశారు. అతి ప్రయత్నం మీద ఒక ట్రక్కు మాత్రం దొరికింది ఒక పూటకి. విధిలేక మేమిద్దరమే సామానులు సద్దటం మొదలు పెట్టాం. సామాన్లైతే సర్దేస్తున్నాం కానీ వాటిని ట్రక్కులో ఎక్కించి దింపటానికి కనీసం ఇంకో జత చేతులు సహాయం కావాలి. ఎవడు మాత్రం శనివారం శలవు పూట వస్తాడు ఒక చెయ్యి వెయ్యడానికి? ఆ ముందు శనివారం సతీష్‌కి కాల్ చేశాను

“హలో సతీష్, వచ్చే వారం ఊళ్ళోకొస్తున్నారా?”

“ఆ వస్తున్నా, గురువారం నించే రెండ్రోజులు శలవు తీసుకుని వస్తున్నా. ఏంటి విశేషం, ఏమన్నా పార్టీనా, ప్రోగ్రామా?”

“అది కాదు. మేం శనివారం నాడు మూవ్ అవ్వాలి. మాకొక మూణ్ణాలుగ్గంటలు సాయం చెయ్యగలరేమోనని ..”

“ఎప్పుడు? పొద్దునా, మధ్యాన్నమా, సాయంత్రమా?”

“మధ్యాన్నం. ట్రక్కు రెండు నించీ ఆరు దాకా మనదగ్గిరుంటుంది.”

అటు నుంచి నిశ్శబ్దం.

“హలో సతీష్?”

“సారీ, నవీన్ గారూ! మధ్యాన్నం మా బావమరిది ఫేమిలీ వస్తున్నారు న్యూజెర్సీ నించి. పోనీ పొద్దునైతే .. లేకపోతే ఆదివారమైనా ఓకే!”

“లేదులెండి. ఆ ఒక్క పూటకే దొరికింది ట్రక్కు. ఆ టైములోనే జరగాలి.”

“వెరీ సారీ!”

“నో నో! ఇట్సోకే!”. పెట్టేశాను. పక్కనే పుస్తకాల్ని పెట్టెలో సర్దుతున్న శ్రీదేవికి అంతా వినిపిస్తూనే ఉంది.

“బాదరాయణ సంబంధం” అని చప్పుడు కాకుండా నోటితో అభినయించి నవ్వింది. నాకు వొళ్ళు మండి వెళ్ళి వంటగది సామాన్లు సర్దటం మొదలెట్టాను.

చూస్తుండగా ఆ శనివారం రానే వచ్చింది. నాకు టెన్షనుగా ఉంది, ఈ ఇల్లు మార్పిడి ఎలా తెములుతామురో బాబోయ్ అని, కానీ శ్రీదేవికి చీమకుట్టినట్టైనా లేదు. “ఎందుకూ ఊరికే హడావుడి పడి సాధించేదేవుందీ? మనకి చేతనైనట్టు చేసుకుంటాం.” అంది పైగా.

నేను రెండింటికి వెళ్ళి ట్రక్కు తీసుకొచ్చాను. మా అపార్టుమెంటు తలుపు తీస్తుంటే లోపల్నించి ఏవో ఆడా మొగా గొంతులు కలగా పులగంగా వినిపిస్తున్నై. తలుపు తీస్తే .. ఆండ్రియా, హార్లీ, కాక ఇంకో తెల్ల జంట .. షికాగో నించి ఈ కొత్త దంపతుల్ని చూడ్డానికొచ్చిన వాళ్ళ స్నేహితులట! ఆడ పిల్లలు కూడా ఆ మగవాళ్ళతో పోటీపడి పని చేస్తుంటే నాకు బలే ఆశ్చర్యమై పోయింది. అసలు తలకెత్తుకో గలనా అని నేను భయపడ్డ పని రెండు గంటల్లో సునాయాసంగా పూర్తైపోయింది. కొత్త ఇంట్లో సామాన్లు సర్దుకోవాలి మొర్రో అన్నా వాళ్ళు వదిలి పెట్టలేదు. “రేపు సర్దుకోవచ్చులే, ఈ పూటకి ఏం తింటారు” అని బలవంత పెట్టి వాళ్ళింటికి తీసుకు పోయారు. డిన్నర్ చేశాక ఆండ్రియా “మీ కోసం స్పెషల్ ట్రీట్” అంటో డీవీడీ ప్లేయర్లో ఏదో డిస్కు పెట్టింది. “బాబోయ్, ఇప్పుడు వాళ్ళ పెళ్ళి విడియో చూపించి చంపుతారు కాబోలు, తప్పదు గదా” అనుకున్నా.

“పైరేట్స్ ఆఫ్ ది కరిబ్బియన్ – ఎట్ వళ్డ్స్ ఎండ్!”
.. సినిమాలో లీనమైపోయాను.


“నన్ను శరణు జొచ్చినవాడే నావాడు,” అన్నాడు మా పెద్దన్న ఘటోత్కచడు. జనాలు లైనుకట్టి నన్ను శరణు కోరడానికి నేను ఆనాటి ఘటోత్కచుణ్ణీ కాను, ఈనాటి (రాజ)శేఖర్ దాదానీ కాను గనక, “మనకి అక్కరకి వచ్చిన వాడే మనవాడు,” అని మా పెద్దన్న తీర్మానాన్ని కాస్త ఎమెండ్ చేశాను. ఏమంటారు?

ఎస్‌. నారాయణస్వామి

రచయిత ఎస్‌. నారాయణస్వామి గురించి: కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.  ...