మన శాస్త్రీయ సంగీతం

(కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారు శాస్త్రీయసంగీతంలో, ముఖ్యంగా హిందూస్తానీసంగీతంలో, విశేషమైన ప్రతిభ ఉన్నవారు. సితార్‌ వాద్యకారులు. ఎన్నో లలితసంగీత కార్యక్రమాలు ఇచ్చారు, ఇప్పించారు. సంగీతం గురించిన అనేక విశేషాలను వివరిస్తూ వారు రాస్తున్న వ్యాసాలు సంగీతంతో ఇంతకుముందు పరిచయం లేని వారికి కూడా దాన్లో ఆసక్తిని, అభిరుచిని కలిగిస్తాయని మా విశ్వాసం.)

ప్రపంచంలో ప్రతిదేశంలోనూ రకరకాల సంగీతం వినిపిస్తూ ఉంటుంది. కాని మన దేశంలో సంగీతంలో జరిగినటువంటి పరిణామం చాలా విశిష్టమైనది. అది కళగానూ, శాస్త్రంగానూ కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఈనాడు ఎటువంటి సంగీతం పాడుకున్నా దానికి “వ్యాకరణం” తెలియాలంటే శాస్త్రీయసంగీతం నేర్చుకోవడం తప్ప మరో మార్గం లేదు. చదువూ, తెలివి తేటలూ పెరుగుతున్న ఈ రోజుల్లో, చాలా మందికి “శాస్త్రీయ సంగీతం అంటే ఏమిటో ?” అన్న కుతూహలం పెరగడం సహజం. పాశ్చాత్యులు కూడా ఆసక్తి కనపరుస్తున్న దశలో మన వాళ్ళకు తక్కిన సాంస్కృతిక విషయాలతో పాటు మన సంగీతం గురించి కూడా తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగింది. 30 సంవత్సరాలక్రితం ఇది కేవలం ఒక ఫాషన్‌గా మొదలైనా, ఆ తరవాత నిజమయిన, నికరమైన ఆసక్తి ఉన్నవారు ఈనాడు ఎందరో కనిపిస్తారు. ఈ వ్యాసం వారికోసమే!

అనాదిగా ప్రజలు పాడుకొనే జానపద సంగీతం నుంచి పుట్టి,”సంస్కృతీకరించబడి” ప్రస్తుతపు రూపాన్ని సంతరించుకున్న మన శాస్త్రీయ సంగీతం ఈనాటి “ప్రజల” సంగీతమైన సినీగీతాలనూ, “లలిత” సంగీతాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. మారుమూల పల్లెల్లో సినిమా “షోకులు” సోకనివారు మాత్రం ఇంకా తమ జానపద సంగీతం పాడుకుంటూనే ఉన్నారు. గద్దర్‌ వంటి గాయకులు ఆ బాణీలను అనుసరించి తమ భావాలను అతి సమర్ధవంతంగా ప్రకటించడం చూస్తూనే ఉన్నాం.

ఈనాడు ఎంత అశ్రావ్యమైన సంగీతం ప్రజాదరణ పొందితున్నప్పటికీ,శాస్త్రీయ సంగీతం నేర్చుకోదలచిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సంగీతం గురించి తెలుసుకొనే “హక్కు” ప్రతివారికీ ఉంది. సంగీతం వినడానికీ,నేర్చుకోడానికీ అనేక అవకాశాలున్నాయి. నేర్చుకొనేందుకు “అర్హతలు” ఏమీ అవసరం లేదు. పెద్దనగరాల్లో అనేక సంగీత పాఠశాలలు కనిపిస్తాయి. ప్రైవేటుగా నేర్పేవారున్నారు. ఈ విధంగా నేర్చుకొనే సంగీతం ఎటువంటిది? ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ హిందూస్తానీ గాయకుడు భీమ్‌సేన్‌ జోషీ సంగీత పాఠశాలలూ,కళాశాలల గురించి వ్యాఖ్యానిస్తూ అవి గొప్ప సంగీతజ్ఞుల్ని తయారు చెయ్యలేనప్పటికీ, మంచి శ్రోతల్ని తయారుచేస్తున్నాయని అన్నారు. ఇది నిజమే! విజ్ఞులైన ప్రేక్షకుల ఎదుట కచేరీ చెయ్యటానికి ఏ సంగీతకారుడైనా సంతోషపడతాడు.

సంగీతం ఎప్పుడు నేర్చుకోవాలి? సంగీతం అభ్యసించడం చిన్నతనంలో చెయ్యడం మంచిది. అందుకు కొన్ని కారణాలున్నాయి. మెదటి విషయం చిన్నప్పుడు ఏది నేర్చుకున్నా మనసుకు హత్తుకుపోతుంది. రెండోది గాత్రం నేర్చుకోడానికి గొంతూ, వాయిద్యాలకు చేతులూ, బాగా “తిరుగుతాయి”. చిన్నపిల్లలు కంఠతా పట్టినట్టు పెద్దలకు వీలుకాదు (కంఠస్థం చెయ్యడం శాస్త్రీయ సంగీతంలో చాలా అవసరం). మరొక విషయం మనస్తత్వానికి సంబంధించినది.

పిల్లలు తప్పు చెయ్యడానికీ, చేసిన తప్పును దిద్దుకోడానికీ పెద్దవాళ్ళలాగా సిగ్గుపడరు. తప్పులు చెయ్యకుండా సంగీతం నేర్చుకోలేము కనక పెద్దవారు  “మొహమాటం” వల్ల సంగీతం మానేసే అవకాశం ఎక్కువ. అంతమాత్రాన పెద్దలు సంగీతం నేర్చుకోలేరనీ, నేర్చుకోరాదనీ కాదు. అసలీ వ్యాసం పెద్దవారు సంగీతం నేర్చుకోవడం గురించే!

పిల్లలకు సంగీతం నేర్పే ముందు వారికి అందులో అభిరుచి ఉందో లేదో తెలుసుకొంటే మంచిది. సామాన్యంగా తల్లితండ్రులకు సంగీతం వినడంలో (అది ఎటువంటి సంగీతమైనా సరే!) ఆసక్తి ఉంటే పిల్లలకు అది అబ్బుతుంది (కాని ఇది అందరి తల్లితండ్రులకూ వర్తించదు. ఔరంగజేబు మనస్తత్వం గలవారి పిల్లలకు సంగీతం పట్ల ఆసక్తి ఉండడం నేను చాలా సార్లు చూశాను).  పిల్లల్ని చిన్నతనం నుండీ గమనిస్తూ ఉంటే వారికి సంగీతం, చిత్రలేఖనం, ఆటలూ, నటన వగైరాల్లో అభిరుచి ఉందో లేదో తెలుస్తుంది. సిసింద్రీల్లాంటి పిల్లల కంటే అమాయకులుగా ఉండే పిల్లలకు సంగీతం అబ్బే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వారికి మాట్లాడటం కన్నా వినే అలవాటు ఎక్కువగా ఉంటుంది.

పాడటం చాతయిన పిల్లలను విన్న ప్రతిపాటనూ పాడమని ప్రోత్సహించాలి. కానీ, వారి నుంచి అతిగా ఆశిస్తున్నామనే భావన వారికి కలగనివ్వకూడదు.పాడడం, వాయించడం అనేది ఎంతో సహజంగా సరదాగా చేసినట్టు అనిపించాలి. ఇది చాలా ముఖ్యం. పిల్లలకు అసాధారణ ప్రతిభ ఉంటే కొంత వయస్సు వచ్చాక అది వారికే తెలుస్తుంది. అంతదాకా వాళ్ళని కంగారు పెట్టడం అనవసరం. మరొక ముఖ్యవిషయం. వాళ్ళని మనకి ఇష్టమైన సంగీతమే  పాడాలని నిర్బంధపెట్టరాదు. ఏది పాడినా మంచిదే! సంగీతంలో అనుకరణ ముఖ్యం. అందుకని విని నేర్చుకొని ఏది పాడినా అది పిల్లల వికాసానికి తోడ్పడుతుంది. తల్లి తండ్రులు ప్రతివారి ఎదుటా తమ పిల్లల ప్రతిభను ప్రదర్శించబోవటం అనవసరం. చిన్నతనంలో ప్రతిభ చూపిన పిల్లలు కొందరు పెద్దయ్యాక మానెయ్యటం కూడా చూస్తూ ఉంటాం. తల్లితండ్రుల ఆశలు పిల్లలపై  తాత్కాలితంగా కలిగించే మానసిక ఒత్తిడి దీనికి కారణం కావచ్చు. ఇంట్లో పిల్లలు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు అటువంటి సంగీతం పట్ల తమ అభిరుచినీ, గౌరవాన్నీ విధిగా పెంచుకోవాలి. పెద్దలే  “బోరు” కొడుతోందని రేడియో కట్టేస్తే, ఆ సంగీతంపై పిల్లలకు ఏం గౌరవం ఉంటుంది? రేడియో, టీవీ, కేసెట్లూ, సీడీలూ వగైరాల ద్వారా మంచి సంగీతం వినవచ్చు. పిల్లలకు అటువంటివి వినిపిస్తూ ఉండాలి. కచేరీలకి వారిని తీసుకెళ్ళాలి. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అనేది ఒక శిక్షలాగా అనిపించకూడదు. అటువంటి సంగీతం అనేక మంది కచేరీలలో వినిపిస్తారనీ,వేలకొద్దీ శ్రోతలు టిక్కెట్లు కొనుక్కొని మరీ వింటారనీ, పిల్లలకు తెలియాలి. శాస్త్రీయ సంగీతం కేవలం ఎంటర్‌ టైన్‌మెంటు కాదనీ, అందులో ఇంకా ఎక్కువ విలువలున్నాయనీ వారికి తెలియాలి. పిల్లలు నేర్చుకున్నదాన్ని సంగీతపు పోటీల బహుమతులతో అంచనా వెయ్యకూడదు.

ఇక పెద్దల విషయంలో సంగీతం పట్ల అభిరుచి నాలెక్కన అనేక విషయాల, ప్రభావాల వల్ల క్రమంగా ఏర్పడుతుంది. మామూలు సినిమా పాటలతో మొదలుపెట్టి, మెలొడీ ప్రధానంగా అనిపించే పాత సినీగీతాలూ, భావ గీతాలూ,భజన పాటలూ ఇలా క్రమంగా శాస్త్రీయ సంగీతాన్ని “సమీపించేవారు” అనేకులు  కనిపిస్తారు. శాస్త్రీయ సంగీతం అంటే వారికి ఉండే భయమూ, ఏవగింపూ  రానురాను తగ్గిపోయి అభిమానం ఏర్పడుతుంది. మరి కొందరు శాస్త్రీయ సంగీతం అనేది భక్తికీ, సాంప్రదాయానికీ సంబంధించినదని గుర్తించి అందులోని “పవిత్రత” వల్ల ఆకర్షితులవుతారు. కొద్ది మంది (ఇలాటి వారు అరుదుగా కనిపిస్తారు). కేవలం ఇంటలెక్చువల్‌ ఆసక్తితో శాస్త్రీయ సంగీతంలోకి దిగుతారు. వీళ్ళకి, రాగాల్లో ఏ స్వరాలుంటాయి, ఏ మేళకర్తకి చెందుతాయి వగైరాల మీద ఆసక్తి ఉంటుంది.

శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడంలో కొన్ని కిటుకులున్నాయి. వీటిలో చాలా మటుకు నేను సంగీతం నేర్చుకొంటున్నప్పుడూ, నేర్పుతున్నప్పుడూ గ్రహించినవి. ఇవే విషయాలు తరవాత కొన్ని పుస్తకాల్లో చదివి, కొందరు పెద్దలు చెప్పగా విన్న్నప్పుడు తృప్తి కలిగింది.

సంగీతం నేర్చుకొని గొప్పవాళ్ళయిన రవిశంకర్‌ వంటి కళాకారులు తొలిరోజుల్లోనే రోజుకి 14, 15 గంటలు సాధన చేసేవారని తెలిస్తే ఈరోజుల్లో సరదా కొద్దీ సంగీతం నేర్చుకోదలచిన వాళ్ళకి గుండె జారిపోవచ్చు! ఎందుకంటే, అలాటివారంతా చదువుతోనో, ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతోనో ఒక వంక సతమతం అవుతున్నవారే. సంగీతం నేర్చుకోవడంలో కొన్ని మెళుకువలు తెలుసుకొంటే అది అంత అసాధ్యం కాకపోవచ్చు.

మొదటగా మనం ఏ రకమైన సంగీతం నేర్చుకొంటున్నామో దాన్ని గురించిన అవగాహన ఉండాలి. ఇది ఒక్క సారిగా జరిగేది కాదు. సరళీ స్వరాలు నేర్చుకుంటున్న దశలోనే పేరు మోసిన కళాకారుల సంగీతం ఎలా ఉంటుందో విని తెలుసుకుంటూ ఉండాలి. జ్ఞాపకశక్తి ఉండాలి. నేర్చిన ప్రతీదీ కంఠస్థం కావాలి. అభ్యాసం రాక్షస సాధనలాగా ఉండాలి. సాధన చేస్తున్నప్పుడు ఏ అభ్యాసం వల్ల ఏ ఫలితం కలుగుతుందో చూచాయగానైనా తెలియాలి. గాత్రం నేర్చుకోనివారు కూడా విధిగా తాము వాయించబోతున్నది పాడి చూచుకోవాలి. ఈ  పాడడం ఎంత ముఖ్యమో చాలా మందికి తెలియదు. స్వరజ్ఞానం లేనివారికి అది అబ్బే అవకాశం, పాడుకోవడం వల్ల పెరుగుతుంది. (స్వరజ్ఞానం అంటే విన్న సంగీతానికి స్వరాలు చెప్పెయ్యగలగడం ఉపయోగిస్తున్న పదాలకు స్పెల్లింగు తెలియని వాళ్ళు కూడా ఇంగ్లీషు మాట్లాడినట్టు, స్వరాలు తెలియని వాళ్ళు కూడా చక్కగా పాడగలరు. స్వరజ్ఞానం లేకుండా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అసాధ్యం. పెద్ద సినీగాయకుల్లో కిశోర్‌కుమార్‌ వంటి కొందరు స్వరజ్ఞానం లేకుండానే పాడగలిగారు. ఇటీవల గాయకుల్లో ఇటువంటి వారు మరింతగా ఉన్నారేమో! )

పాడుతున్నప్పుడు శ్రుతి, లయ తప్పుతున్నాయో లేదో తెలుసుకోవాలి. వాయించేవారు కూడా పాదాన్ని లయబద్ధంగా కదిలించి తాళం వేసుకోవాలి. ఇది సంగీత  పాఠాల తొలి దశలలోనే ప్రారంభం కావాలి. నేర్చుకొన్నదంతా అనుక్షణమూ మననం చేసుకుంటూ ఉండాలి. అతిగా అనిపించవచ్చుగాని స్నానం చేస్తున్నప్పుడూ, బస్సుకోసం వేచి ఉన్నప్పుడూ కూడా ఇది జరుగుతూనే ఉండాలి. అభ్యాసం చేస్తున్నప్పుడు రాసిపెట్టుకున్న నోట్సు చూసుకోకుండా కేవలం జ్ఞాపకశక్తి మీదే అధారపడాలి. సంగీతం అభ్యాసం చెయ్యడానికి కూర్చునే ముందు, రోజంతా మననం చేసుకున్న పాఠం అప్పుడు గుర్తుకు రావాలి. దీనివల్ల చాలా సమయం మిగులుతుంది.

మన సంగీతం అంతా రాగాల మయం. రాగాల ముఖ్య లక్షణం అందులో “పడే” స్వరాలూ, “పడని” స్వరాలూను. మనం సప్తస్వరాలంటాం, కాని నిజానికి 12 (కర్ణాటకంలో 16), మన శ్రుతుల లెక్కన 22 ఉంటాయి. సరిగమపదని లో స, ప తప్ప తక్కినవన్నీ రెండేసి ఉంటాయి. వీటిని గుర్తించటానికి సులువైన పద్ధతి హార్మోనియమో, ఎలక్ట్రానిక్‌ కీబోర్డో తీసుకొని వాయించడమే! ఈ స్వరాలను రకరకాలుగా ఉపయోగించి అనేక రాగాలు వాయించవచ్చు. (నిజానికి రాగాన్ని నిర్ణయించడానికి స్వరాలు కొంత వరకే ఉపయోగ పడతాయి. ఒకే స్వరాలు కలిగిన వేరు వేరు రాగాలున్నాయి ఉదాహరణకు కర్ణాటకంలోని ఆరభి, దేవగాంధారి. హిందూస్తానీలో మార్వా, సోహినీ, పూర్యా. రాగాలకు ఇతర “స్వభావాలు” కూడా ఉంటాయి. అవి వినికిడి మీదా, అభ్యాసం వల్లా తెలుస్తాయి.)

రాగాలను గుర్తు పట్టటానికి సులువైన పద్ధతి సినిమా పాటలు. శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించే చాలా రాగాలు సినిమా పాటల్లో వాడబడ్డాయి. సంగీతం నేర్చుకొనే వారు వాటి జాబితాలను తయారు చేసి ఉంచుకోవాలి. రాగాన్ని గుర్తు పట్టాలంటే “వరవీణా మృదుపాణీ..” లోనూ, “ననూ పాలింప.. ” లోనూ, ” లాహిరి లాహిరి…”  లోనూ, “తెలుసుకొనవే యువతి” అనే పాటలోనూ ఉన్న మోహన రాగపు  లక్షణాలను పోల్చాలి. పాడుకుంటూ ఉంటే, వీటన్నిటిలోనూ ఉన్నది ఒకే రాగపు  “స్వభావం” అని తెలుస్తుంది. అలాగే, “వాతాపి గణపతిం” కీర్తన హంసధ్వని రాగమని తెలిసిన వారికి శాంతి నివాసం సినిమా పాట “శ్రీరఘురాం జయరఘురాం” అదే రాగమని తెలియక పోవచ్చు.

సంగీతం నేర్చుకొనే వారికి ఉత్సాహం ఉండాలి. నిరాశ పనికిరాదు. మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా మంచిది కాదు. తాము నేర్చుకొంటున్న సంగీతానికీ, కచ్చేరీల్లో వినిపించే సంగీతానికీ గల సంబంధాన్నీ, తేడానూ కూడా విద్యార్ధులు అనుక్షణమూ గమనిస్తూ ఉండాలి. ఊళ్ళో జరిగే ప్రతీ సంగీత కచ్చెరీకీ వెళ్ళి, విని నేర్చుకోగలిగినది నేర్చుకుంటూ ఉండాలి. ప్రతీ దానికీ మాష్టారు మీద ఆధారపడితే లాభం లేదు. ఎటువంటి సంగీతం నేర్చుకున్నా, మిగతా రకాల సంగీతం పాడడానికి ప్రయత్నించాలి. ” మిమిక్రీ” చాలా ముఖ్యం. శంకరాభరణం సినిమాలో చెప్పినట్టు మనకి డిస్కో సంగీతం నచ్చకపోయినా మన శాస్త్రీయ సంగీతపు పునాది గట్టిగా ఉంటే మనం ఆ సంగీతాన్ని అనుకరించగలం. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వారు కూడా సినిమా పాటల్ని యధాతధంగా పాడ ప్రయత్నించాలి. అందులో “అపచారం” ఏమీ ఉండదు సరికదా, అది మన శక్తిని పెంచుతుంది కూడా! భావానికి సంబంధించిన “మాడ్యులేషన్‌”, పదాలను భావయుక్తంగా ఉచ్ఛరించడం లలిత సంగీతంలో చాలా ముఖ్యం. ఈ భావుకత శాస్త్రీయ సంగీతానికి కూడా అవసరమే!

సంగీతం వినే వారికి హిందూస్తానీ రాగాలు, కర్ణాటకం వాటికన్నా శ్రావ్యంగా ఉంటాయని అనిపించవచ్చు. దక్షిణాది సినిమా పాటల్లో కూడా హిందుస్తానీ రాగాల వాడకమే హెచ్చు. శాస్త్రీయ సంగీతం ఏదైనా దానికి ముఖ్యలక్షణం “పట్టు” అని తెలుస్తూ ఉంటుంది. శాస్త్రీయ సంగీతం విన్నప్పుడు చాలామందికి మొదట్లో విముఖత కలగడానికి కారణం ఇదే! ఎటొచ్చీ హిందూస్తానీ రాగాలను హిందూస్తానీ “పట్టు” లేకుండా పాడినా వాటి రాగ  లక్షణం దెబ్బతిన్నట్టు అనిపించదు. కాని తోడి, భైరవి వంటి కర్ణాటక రాగాలను “పట్టు” లేకుండా పాడి మెప్పించటం కష్టం. ఘంటసాల మాత్రం “కరుణశ్రీ” పద్యాలు కొన్నిటిని ముఖారి, రంజని వంటి కర్ణాటక శాస్త్రీయ రాగాలలో అద్భుతంగా పాడి రక్తి కట్టించాడు. వాటి రాగ భావం “తేలిక” అవ్వలేదు. మెలొడీ ఏ మాత్రం తగ్గలేదు. కళాకారుడు ప్రతిభావంతుడైతే, శాస్త్రీయ సంగీతంలో ఎన్నో మంచి ప్రక్రియలు సాధించగలడనడానికి ఇది చాలా ముఖ్య ఉదాహరణ.

ఒక స్థాయికి ఎదిగిన విద్యార్ధులు ప్రేక్షకుల సమక్షంలో పాడడానికి ప్రయత్నించాలి. తెలిసినవారికి పాడి వినిపిస్తే మంచి విమర్శ లభించే అవకాశం ఉంటుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నవారికి లలిత సంగీతం పట్ల ఏవగింపు పనికి రాదు. లలిత సంగీతంలో ఉన్న మెలొడీ గురించిన అవగాహన శాస్త్రీయ సంగీత విద్యార్ధులకు చాలా అవసరం. లేకపోతే వారి సంగీతం “రుబ్బుడు” పద్ధతిలో సాగుతుంది. కర్ణాటక సంగీతం నేర్చుకొనే వారు, హిందూస్తానీ వారిలాగా “మనోధర్మ” సంగీతం అభ్యాసం చెయ్యాలి. సొంతంగా స్వరకల్పన చెయ్యగలిగి ఉండాలి. లేకపోతే, వారి “క్రియాత్మకత” ఎదగకుండా ఉండే అవకాశం ఉంది.

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...