“ఇప్పుడు అక్కడికి వెళ్లడం అంత అవసరం అంటావా డాడ్? అంటే… ఫోన్లో మాట్లాడితే సరిపోతుందేమో కదా!” కొంచెం ఇబ్బంది పడుతున్నట్టే వస్తున్నాయి శ్రావ్య మాటలు.
“శ్రావ్యా! ఇది నీ లైఫ్‌లో జరుగుతున్న పెద్ద ఈవెంట్. అంతేకాక ఇది మీ ఇద్దరికీ ఇష్టమైన కామన్ థింగ్. సో ఈ విషయాన్ని నువ్వు డైరెక్ట్ గా ఆవిడతోనే చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎలాగూ నాకు మూడు రోజులు ఆఫీసులో మీటింగ్స్ ఉన్నాయి. హోటల్లో ఒక్కదానివి కూర్చొని ఏం చేస్తావు చెప్పు? కొంచెం సరదాగా ఆమెతో గడిపినట్టు ఉంటుంది కదా!”
అతను ఎంత నచ్చచెప్పినా, శ్రావ్య ముఖంలో ఇబ్బంది కనబడుతూనే ఉంది.
“డోంట్ వర్రీ. యూ విల్ బి ఫైన్,” అంటూ కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు శ్రీధర్.
అనుకున్నదానికన్నా అరగంట ఆలస్యంగా విమానం న్యూయార్క్‌లో దిగింది. తండ్రీ కూతుళ్ళిద్దరూ తమ లగేజీలు తీసుకొని బయటికి వస్తుండగానే ఎదురుగా కనబడింది పావని.
“హాయ్ పావనీ! ఎలా ఉన్నావు?” అంటూ ఆమెను మామూలుగానే పలకరించాడు.
“బానే ఉన్నాను,” అని అతనికి చెప్పి వెంటనే “నువ్వెలా ఉన్నావు స్వీటూ?” అంటూ దగ్గరికి తీసుకుంది శ్రావ్యని.
ఓకే అన్నట్టుగా తల ఊపింది శ్రావ్య.
“సరే నేను హోటల్ కి వెళ్తాను. మీరు బయలుదేరండి,” అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు శ్రీధర్.
“మనం వెళుతూ వెళుతూ దారిలో అక్కిని స్కూల్‌నుండి పిక్ చేసుకుని ఇంటికి వెళదాం,” అని డ్రైవ్ చేస్తూ పావని అన్న మాటకి ఏ సమాధానం ఇవ్వకుండా కార్‌లోంచి పక్కకి చూస్తూ ఉండిపోయింది శ్రావ్య.
అక్కిని ఎత్తుకొని తీసుకువచ్చి వెనకాల ఉన్న బూస్టర్ సీట్లో కూర్చోబెట్టి ప్రేమగా వాడి నుదుటిపైన ముద్దు పెట్టింది. ఇదంతా ఆ పక్క సీట్లోనే కూర్చున్న శ్రావ్య చూస్తూనే ఉంది.
“అక్కి! నీకు తను తెలుసు కదూ? అదే శ్రావ్య… ఫొటోస్‌లో చూపించాను కదా! నీ స్టెప్ సిస్టర్”.
“హా గుర్తుంది. హాయ్ శ్రావ్య అక్కా!” అంటూ ముద్దుగా పలకరించాడు నాలుగేళ్ల ఆకాష్.
ముగ్గురూ కలిసి ఇంటికి వచ్చారు. లోపలికి అడుగుపెడుతూనే గోడల మీద ఉన్న పావని, తన హస్బెండ్, ఫ్యామిలీ ఫోటోలని చూస్తోంది శ్రావ్య.
ఆమె వెనకాలగా వచ్చిన పావని “విలియం, నీకు తెలుసు కదా! డోంట్ వర్రీ… తను ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు. వచ్చే వారం వస్తాడు. నాతో నువ్వు ఫ్రీగా మాట్లాడొచ్చు అని చెప్తున్నా”.
“సర్లే, బాగా ఆకలి వేస్తోందేమో కదా! పద, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో. నీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను,” అంటూ ఎప్పుడో దూరమైన తల్లి ప్రేమను శ్రావ్య మీద చూపిస్తోంది.
“నీకు ఏది నచ్చితే అది తిను. అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది కూడా నీ ఇల్లే అనుకొని ఫ్రీ గా ఉండు,” అని శ్రావ్యకి చెప్తూనే, ఇంకోపక్క ప్రేమగా ఆకాష్‌కి గోరుముద్దలు కలిపి పెడుతోంది పావని.
తింటున్నంతసేపూ శ్రావ్య శ్రద్ధ అంతా పావని ఆకాష్‌మీద చూపిస్తున్న ప్రేమమీదే ఉండిపోయింది. ఏదో తెలియని బాధ ఆమె ముఖం మీదకి వచ్చినట్టు అనిపించింది.
“ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషాలు?” అంటూ సోఫాలో ఒంటరిగా కూర్చున్న శ్రావ్య పక్కకి వచ్చి కూర్చుంది పావని. “శ్రీధర్ చెప్పాడు. అరంగేట్రం చెయ్యబోతున్నావట కదా?”
“అవును. టూ వీక్స్ తర్వాత,” ఎవరో కొత్త వాళ్లతో మాట్లాడుతున్నట్టుగా వస్తోంది శ్రావ్య జవాబు.
“నీకు గుర్తుందా? చిన్నప్పుడు నాకు కూడా భరతనాట్యం అంటే చాలా ఇష్టం అని చెప్పేదాన్ని. కానీ మా నాన్న దగ్గర… అదే, మీ తాత దగ్గర అంత డబ్బు లేకపోవడంవల్ల నేర్చుకోలేకపోయాను. అందుకే చిన్నప్పటినుంచే నీకు నేర్పించాలి అనుకున్నాను. నువ్వు కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది,” అంటూ సంబరపడుతోంది పావని.
“ఇవి చూడు, నీ అరంగేట్రం అని ఇండియానుండి ఈ డాన్స్ చీరలు తెప్పించాను. ఇందులో నీకు ఏది నచ్చితే అది తీసుకో,” అంటూ ఎంతో ప్రేమగా చీరల్ని చూపిస్తోంది.
“ఏంటి అలా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా? ఇందులో ఏది నచ్చింది చెప్పు?”
“నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం. అదే తీసుకుంటా,” అని నచ్చిన నీలిరంగు చీరని దగ్గరకు తీసుకుంది శ్రావ్య.
“నిజానికి ఇవన్నీ కూడా నీకోసమే తెప్పించాను. నువ్వు అన్నీ తీసుకోవచ్చు,” అంటూ పదేపదే తల్లి ప్రేమని చూపిస్తోంది పావని.
“నాకు ఎప్పుడన్నా ఒక్కటే నచ్చుతుంది. అలా ఎక్కువగా నచ్చిన దాన్నే నేను నా దగ్గర ఉంచుకుంటాను. మిగిలిన వాటిని చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యే రకాన్ని కాదు”.
13 ఏళ్ల శ్రావ్యనుండి వచ్చిన ఆ ఘాటైన సమాధానం, కొన్నేళ్ల క్రితం తనకీ శ్రీధర్‌కీ మధ్య వచ్చిన మనస్పర్ధలకు కారణమైన అతని మాటల్ని గుర్తు చేసింది.
“శ్రీధర్ మాట్లాడినట్టే మాట్లాడుతోంది. ఎంతైనా అతని పెంపకంలో పెరుగుతోంది కదా!” అని మనసులో అనుకుని, “నువ్వు చెప్పింది కరెక్ట్ స్వీటూ! లైఫ్ లో ఏ విషయంలో అయినా క్లారిటీ ఉండడం చాలా అవసరం. ఒకప్పుడు ఆ క్లారిటీ లేకపోవడంవల్లే నేను శ్రీధర్‌తో చాలా ఇబ్బందులు పడ్డాను. అవన్నీ నీకు అర్థం కావులే కానీ, ఇంకేంటి? నెక్స్ట్ ఇయర్ నుండి హై స్కూల్ అనుకుంటా. నీ చదువు, స్కూల్ అంతా బానే ఉందా?”
“అంతా బాగానే ఉంది. నా అరంగేట్రానికి నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు” కొంచెంకొంచెంగా ఓపెన్ అయి మాట్లాడుతోంది శ్రావ్య.
“ఫోటో షూట్ కూడా చేశాం,” అని తన అరంగేట్రం ఇన్విటేషన్‌ని చూపించింది.
“ఆరు పాటలు చేస్తున్నాను. ప్రాక్టీస్ చాలా కష్టంగానే ఉంది. కాళ్లు బాగా నొప్పి పుడుతున్నాయి. నేను దీన్ని ఎలాగైనా సరే చేయాలనుకుంటున్నాను,” అంటూ తన ఇష్టాన్ని వ్యక్తపరచింది.
“నువ్వు తప్పకుండా చేయగలవు స్వీటూ!” అంటూ తనని దగ్గరికి తీసుకొని నుదుటిమీద ముద్దు పెట్టింది పావని.
ఆ రాత్రంతా శ్రావ్యకి నిద్ర పట్టలేదు. మర్నాడు పొద్దునే నిద్ర పట్టని ముఖంతో లేచి వచ్చింది.
డల్ గా ఉన్న ఆమె ముఖాన్ని చూసిన పావని “నిద్ర పట్టిందా?” అని అడిగింది.
పట్టింది అన్నట్టుగా అలాగే తల ఊపింది శ్రావ్య. మిగిలిన ఆ రెండు రోజులు కూడా శ్రావ్యకి నచ్చినవన్నీ చేసి పెట్టడం, ముగ్గురూ కలిసి బయటికి వెళ్లి తిరిగి రావడంతో గడిచిపోయింది. “ఇంక ఈ ఒక్క రాత్రీ ఇక్కడ గడిస్తే రేపు మార్నింగ్ డాడ్ వచ్చి నన్ను తీసుకెళ్లిపోతారు,” అన్న ఆలోచనలో ఉంది శ్రావ్య.
గత రెండు రోజుల్లాగానే తన గదిలోనే ఒంటరిగా పడుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె వల్ల కాలేదు. వెంటనే లేచి పావని, ఆకాష్ పడుకున్న బెడ్ రూమ్ తలుపు తట్టింది.
“ఏంటి ఇలా వచ్చావు? ఇంకా పడుకోలేదా? లోపలికి రా,” అంది పావని.
ఏమీ మాట్లాడకుండా వచ్చి బెడ్ మీద కూర్చొని ఉన్న శ్రావ్యని తన దగ్గరికి తీసుకుని పడుకోబెట్టుకుంది. తల్లి దగ్గరికి తీసుకోగానే ఎక్కడలేని కన్నీళ్లు బయటికి వచ్చేశాయి. 13 ఏళ్ల అమ్మాయి కాస్తా ఐదారేళ్ల చిన్నపిల్లలా మారిపోయి ఆపుకోలేనంతగా ఏడుస్తోంది.
అది కొన్నేళ్ళుగా తల్లి ప్రేమకు దూరమవడంవల్ల బయటకి పొంగుకొస్తున్న బాధ అని పావనికి అర్థం అవుతూనే ఉంది. కాసేపటివరకూ ఇద్దరి మధ్య ఎటువంటి మాటలూ లేవు. కేవలం వాళ్ళిద్దరిలో ఉన్న బాధాతరంగాలు కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చాయి. కొంచెంసేపు అయ్యాక పావని “బాధపడకు స్వీటూ! అంతా బానే జరుగుతుందిలే,” అంటూ ఓదారుస్తోంది కూతుర్ని.
“నో, నాకేమీ బాలేదు. డాడ్ అసలు నన్ను ఇక్కడికి పంపించకుండా ఉండాల్సింది. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డాడ్‌కీ నీకూ తెలిసిన ఒక కామన్ ఫ్రెండ్ పార్టీలో నిన్ను కలిశాను. ఆ తర్వాత చాలా బాధపడ్డాను. నిద్ర పట్టేది కాదు. చీకట్లో భయంగా అనిపించేది. నా హార్ట్ చాలా ఫాస్ట్‌గా కొట్టుకుంటున్నట్టు అనిపించేది. మీ ఇద్దరూ ఒకచోట ఎందుకు కలిసి ఉండట్లేదో అర్థమయ్యేది కాదు. మెంటల్లీ బాగా ఇబ్బందిపడ్డాను. అదంతా చూసిన డాడ్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మళ్లీ ఇక్కడికి వచ్చిన టూ డేస్‌నుంచీ అలానే ఉంటోంది”.
వింటోంది పావని.
“ఇప్పుడు ఇదంతా మళ్లీ కొత్తగా ఉంది. ఇక్కడికి వచ్చిన మొదటి రోజు ఎవరో కొత్త వాళ్ళ ఇంటికి వచ్చానన్న ఫీలింగ్ వచ్చింది. బట్, టూ డేస్ లో నాకిష్టమైన ఫుడ్ చేసి పెట్టావు, నాకు ఇష్టమైనవన్నీ కొనిపెడుతున్నావు. ఇప్పుడు ఇంత ప్రేమగా ఇలా దగ్గరికి తీసుకున్నావు. నాకు తెలుసు, ఇదంతా ఇవాల్టితోనే మళ్లీ ఆగిపోతుంది,” పెద్ద పెద్ద వెక్కిళ్ళ మధ్య వస్తున్నాయి ఆమె మాటలు.
“ఇదంతా ఇక నావల్ల కావట్లేదు. డాడ్ నిన్ను కలిసి డైరెక్టుగా నీతో అరంగేట్రం విషయాలన్నీ షేర్ చేసుకుంటే మన ఇద్దరికీ హ్యాపీగా ఉంటుంది అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు. కాని నాది ఒక చిన్న రిక్వెస్ట్… దయచేసి నా అరంగేట్రం ప్రోగ్రాంకి నువ్వు రావద్దు. నువ్వు వస్తే నా ఫోకస్ డాన్స్ మీద పెట్టలేను అనిపిస్తోంది. యాంగ్జైటీ ఎక్కువవుతుంది. నా కలని నేను నెరవేర్చుకోలేను. సో ప్లీజ్… కావాలంటే తరువాత నీకు ఫుల్ ప్రోగ్రాం వీడియో పంపిస్తాను,” అంటూ మనసులో ఉన్న బాధనంతా బయటపెట్టేసింది తల్లి ముందర.
అలా ఏడుస్తూ ఏడుస్తూ ఒకసారి తల పైకెత్తి తన తల్లి కళ్ళల్లోంచి కూడా కారుతున్న కన్నీరుని చూసిన శ్రావ్య, “నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు నీ హస్బెండ్‌తో, ఆకాష్‌తో హ్యాపీగా ఉన్నావని డాడ్ చెప్పారు”.
“ఆకాష్ కన్నా నా లైఫ్‌లోకి ఫస్ట్ వచ్చింది నువ్వే కదమ్మా! సో, నువ్వు బాధపడుతుంటే నేను ఎలా హ్యాపీగా ఉండగలను చెప్పు,” అని కూతురి కన్నీళ్లను తుడుస్తూ మాట్లాడుతోంది పావని. “సరే, నువ్వు చెప్పినట్టుగానే నీ ప్రోగ్రాంకి నేను రాను. బట్, నీ ప్రోగ్రాంని నువ్వు చక్కగా కంప్లీట్ చేయాలి. సరేనా?”
‘సరే’ అన్నట్టు తల ఊపి తల్లి దగ్గరే హాయిగా ఆదమరిచి నిద్రపోయింది శ్రావ్య.
“విడాకుల తరువాత శ్రావ్య పేరెంటింగ్ గురించి నేనూ ఒకసారి ఆలోచించి ఉండాల్సిందేమో. అతని మీద ఉండిపోయిన కోపంవల్ల శ్రావ్యని దూరంగా ఉంచి తప్పు చేశాననిపిస్తోంది. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ శ్రావ్యా. లైఫ్ లో ఏ విషయంలో అయినా సరే, క్లారిటీ చాలా అవసరం,” మనసులోనే అనుకుంది పావని.
మర్నాడు పొద్దునే శ్రీధర్ వచ్చి శ్రావ్యని పిక్ చేసుకున్నాడు. ఇద్దరూ ఫ్లైట్లో వాళ్ళ ఊరికి తిరిగి వెళ్లిపోయారు. ఎంతో యాక్టివ్‌గా ఉన్న శ్రావ్యని చూసిన శ్రీధర్, తల్లి దగ్గరకి వెళ్లి రాగానే ఆమెకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చిందన్న భావనలో ఉన్నాడు.
అరంగేట్రానికి ఒక రోజు ఉందనగా, ముందు రోజు రాత్రి టెన్షన్ పడుతున్న ఆమెను చూసి శ్రీధర్, “టెన్షన్ పడకు శ్రావ్యా! ప్రోగ్రాం అంతా సరిగ్గానే జరుగుతుందిలే,” అని ధైర్యం చెప్పబోయాడు.
“అది కాదు డాడ్. మామ్ ఇంతవరకు రాలేదు. నేను ఆమెని రావద్దని చెప్పాను. కానీ తను నిజంగానే ఇలా రాకుండా ఉంటుందని అస్సలు అనుకోలేదు,” అంటూ ఏడుపు ముఖం పెట్టింది శ్రావ్య.
కూతురి బాధని అర్థం చేసుకున్న శ్రీధర్ ఆమెను దగ్గరకు తీసుకొని… “సరే, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇది నీ ప్రోగ్రాం టైం. అస్సలు ఏడవకూడదు, అర్థమైందా! ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మనిద్దరం హవాయి ట్రిప్‌కి వెళ్తున్నాం గుర్తుంది కదా!” అంటూ ఆమెను మరిపించే ప్రయత్నం చేశాడు.
ఆమె పడుకోగానే శ్రీధర్ తన ఫోన్ చూసుకుంటుండగా పావనినుండి వచ్చిన మెసేజ్…
“ఆకాష్‌కి బాగా ఫీవర్ గా ఉంది. మే బీ, రేపు శ్రావ్య అరంగేట్రానికి నేను రాలేకపోవచ్చు”.
మెసేజ్ చదవగానే “ఇది నిజమే అయ్యుంటుందా, లేదంటే ఇక్కడికి వస్తే నన్ను కలవాల్సి వస్తుందని ఒక సాకు చెబుతోందా?” అని మనసులోనే అనుకోని “ఓకే” అని రిప్లై ఇచ్చాడు.
మర్నాడు పొద్దునే అరంగేట్రానికి తన తల్లి తనకి గిఫ్ట్‌గా ఇచ్చిన నీలం రంగు డాన్స్ చీరని కట్టుకొని చక్కగా తయారైంది శ్రావ్య. అంతా బానే ఉంది కానీ తన తల్లి కూడా వస్తే బాగుండేది అన్న చిన్న వెలితి ఆమె మనసులో ఉండిపోయింది.
అందరూ వచ్చి ‘బాగా పెర్ఫార్మ్ చేయాలి, ఆల్ ద బెస్ట్’ చెప్పి వెళ్తున్నారు. ఆ జనాల మధ్యలోంచే ఏదో తెలిసిన గొంతులా వినిపించింది. ఆ వ్యక్తి, ఎవరో తెలిసిన ఆంటీతో అటువైపు తిరిగి మాట్లాడుతోంది. ఆమె భుజం మీద ఒక పిల్లాడు తలవాల్చి డల్‌గా పడుకొని ఉన్నాడు. ఆ పిల్లాడిని చూసిన శ్రావ్య…
“ఆకాష్! అంటే మామ్! మామ్ వచ్చింది!” అనుకుంటూ ఎంతో ఆనందంతో ఆమె దగ్గరికి వెళ్ళింది.
“మామ్! చూడు, నువ్వు ఇచ్చిన చీరే ఇది. ఎలా ఉంది?” అంటూ ఎంతో ఆనందంగా అడుగుతోంది శ్రావ్య.
“చాలా అందంగా ఉన్నావు స్వీటూ!” అంటూ ప్రేమగా కూతురిని దగ్గరికి తీసుకుంది పావని.
పావని వచ్చిందన్న విషయాన్ని గమనించిన శ్రీధర్, శ్రావ్య దగ్గరికి రాగానే “చూశావా డాడ్! మామ్ వచ్చింది,” ఆనందంతో వెలిగిపోతోంది శ్రావ్య ముఖం. ఇంతలో ఫ్రెండ్స్ పిలవడంతో పక్కకి వెళ్లింది.
“నేను రాలేనన్న విషయాన్ని శ్రావ్యకి చెప్పకుండా మంచి పని చేశావు. లేదంటే తను ఇప్పటికే చాలా డిసప్పాయింట్ అయి డల్ అయిపోయి ఉండేది,” శ్రీధర్‌తో అంది పావని.
“నిజమే…” అని శ్రీధర్ అనగానే, ఏంటి అన్నట్టు అతని వైపు చూసింది.
“నువ్వు రావని తెలిస్తే తను డిసప్పాయింట్ అవుతుందని తెలుసు. అలాగే నువ్వు తప్పకుండా వస్తావని కూడా తెలుసు. మన విడాకుల అగ్రిమెంట్ ప్రకారం శ్రావ్యని మొత్తం నేనే చూసుకుంటానని చెప్పి తప్పు చేశాను అనిపించింది. మనం ఈ విషయం గురించి ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో? అంటే… నా దగ్గర కొన్ని రోజులూ, కుదిరినప్పుడు నీ దగ్గర కొన్ని రోజులూ… ఏమంటావు?”
“అప్పట్లో శ్రావ్య పేరెంటింగ్ మొత్తం నువ్వే తీసుకుంటాననేసరికి, ఆ విషయం గురించి కూడా నీతో వాదించడం అనవసరం అనుకోని వదిలేసి తప్పు చేశాను. శ్రావ్యని అప్పుడప్పుడూ నా దగ్గర ఉంచుకోవడానికి నాకేమీ ఇబ్బంది లేదు. నిజానికి విలియమ్ కూడా ఈ విషయం గురించి నీతో మాట్లాడి రమ్మన్నాడు” అంది పావని.
అనుకున్నట్టుగానే తల్లిదండ్రులిద్దరి సమక్షంలోనూ అరంగేట్రం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగింది శ్రావ్య. అంతేకాక, తనకోసం వాళ్ళ ఊరికి వచ్చిన తల్లి, ఆకాష్‌లతోటి మరో నాలుగు రోజులు ఆనందంగా గడపగలిగింది.