నేను అనుకున్నట్టే స్వర్గలోకం చేరుకున్నాను.
స్వర్గంలో మీరు వూహిస్తున్న దానికంటే యెక్కువే సుఖాలు అనుభవిస్తూ వస్తున్నాను. పుణ్యం ఖాతాలో వేసుకుంటే, వడ్డీతో సహా వడ్డిస్తున్నట్టే వుంది. రోజులు యెలా గడుస్తున్నాయో తెలియడం లేదు. అది పగలు అనుకుంటే పగలు. రాత్రి అనుకుంటే రాత్రి. ఏది కావాలంటే అది. ఊ… చెప్పాలంటే అది చెప్పేది కాదు, అనుభవించి తీరాల్సిందే. దేవతల లోకమా? మజాకా?
భూలోకంలో వున్నప్పుడు దేవతలు విగ్రహాల్లా కనిపిస్తే, యిప్పుడు యిక్కడ లైవ్లో కనిపిస్తున్నారు. తెల్లవారిలేస్తే దేవుడి గదికి వెళ్ళి కళ్ళు విప్పక్కర్లేదు. కళ్ళు తెరిస్తే చాలు, దేవతలు అటూ యిటూ తిరుగుతూ కనిపిస్తూ వుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే దేవలోకంలో దేవుళ్ళు మనుషుల లోకంలో మనుషులు కనిపిస్తున్నట్టే కనిపిస్తున్నారు. అంతఃపుర వీధుల్లోనూ నగరంలోనూ. ఎక్కడపడితే అక్కడ. మన దగ్గరకంటే రద్దీగా వుంది. ముక్కోటి దేవతలు మరి!?
నా ఆనందపు అనుభూతుల్లో నేను వూరేగుతుండగా స్వర్గాధిపతినుండి పిలుపు వచ్చింది. వారి ముందు హాజరై చేతులు జోడించాను. అప్పుడే వచ్చిన యిద్దరు భటులు నా చెరో రెక్కా పట్టుకున్నారు. నాకు అర్థం కాలేదు. వెర్రి చూపులు చూస్తుంటే-
“నిన్ను స్వర్గలోకంనుండి నరకలోకమునకు బదిలీ చేయడమైనది,” అని స్వర్గాధిపతి మాట వినేసరికి నా గుండె గొంతులోకి కాదు, యేకంగా నోట్లోకి వచ్చేసింది. మళ్ళీ మింగేశాను.
“ఎ… యె… యెందుకు?” అని అడిగాను.
మౌనంగా చూశారు స్వర్గాధిపతి. నా వైపు కాదు. దర్పణంలోకి. బహుశా నా గత వర్తమాన భవిష్యత్తు కాలాలను ఆ లిప్త కాలంలో చూశారేమో చూసి తలాడించారేమో నాకర్థం కాలేదు. అయినా నా ట్రాక్ రికార్డ్కేముంది? అనుకొని, నమ్మకంగా “నరకానికి యెందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా?” అడిగాను. అది నా హక్కు. కాని ఆమాట పైకి అనలేదు. కాని నా మనసు చదివేసినట్టున్న స్వర్గాధిపతి పెద్దగా నిట్టూర్చారు.
ఆ నిశ్శబ్దం నన్ను భయపెట్టింది. అందుకే మనసులోకి వస్తున్న ఆలోచనల్ని లోపల అదుముకోలేక బయటికే అన్నాను. “నేను నా కష్టార్జితంతోనూ… యింకా యెందరినుండో సేకరించిన కష్టార్జితంతోనూ పుణ్యాన్ని పోగుచేసుకున్నాను. విరాళాలతో గుడులు గోపురాలు కట్టించాను… అందుకు ఫలితమా యిది? చేసిన పుణ్యం పాపం అయ్యిందా?” అని కూడా అడిగాను.
“ఔను, వొక్కోసారి పుణ్యం కూడా పాపం అవుతుంది” అన్నారు స్వర్గాధిపతి.
నేను నా జీవితగతంలోకి వెళ్ళి క్షణాల్లో సమీక్షించుకున్నాను. “స్వర్గాధిపతీ… మనుషులు యెటువంటి వారో మీకు తెలియంది కాదు. దేవుడి గుడి కడతామంటే యెవరూ ముందుకు వచ్చి ‘యిదిగో నా వంతు’ అని తెచ్చి చేతిలో పెట్టి యివ్వరు. కొన్నిసార్లు బలవంతం చేయాలి. భయపెట్టాలి. లక్కీలాటరీలు వేసి తీసి ఆశ చూపాలి. తప్పదు. అప్పుడే వారికి దేవుడిమీద మనం కోరుకున్నంత దయ కలుగుతుంది. గుడికో గోపురానికో సహకరిస్తారు. ఎవరూ భుజం కాయకుండా యే పనీ జరగదు. అయినా యెలా చేశానన్నది చూస్తారా? ఏమి చేశానన్నది చూస్తారా?” ఆందోళన కమ్ముతుండగా ఆవేశంతో అడిగాను.
స్వర్గాధిపతి నవ్వారు.
“నేను చేసింది పాపమే అయితే నేరుగా నరకలోకానికే పంపాల్సింది, స్వర్గం రుచి చూపించి నా ఆశని అడియాస చేయడం తమరికి తగునా?” అన్నాను రోషంగా. ఉక్రోషంగా.
“నువ్వు కట్టిన గుడివల్ల నీకు పుణ్యం వచ్చి స్వర్గానికి చేరావు. అయితే ఆ గుడిలో జరిగిన తొక్కిసలాటల్లో తొమ్మిదిమంది చనిపోయారు…” స్వర్గాధిపతి చెప్పకముందే, “ఆ చావులకు నేను కారణమా?” అడ్డంపడి అడిగాను.
“నువ్వే కారణం. ఆ గుడి కట్టకపోతే ఆ చావులు సంభవించేవి కావు. అభం శుభం తెలియని పసివాళ్ళు కూడా చనిపోయేవారు కాదు. ఆ వీరభక్తికి కారణమైన వాళ్ళలో నువ్వూ వున్నావు, యెవరూ తప్పించుకోలేరు…” స్వర్గాధిపతి చెపుతుంటే, “నేనా?” కాదన్నట్టు తలాడించాను. “మంచిరోజు – యిలాంటి రోజు యే పన్నెండేళ్ళకోగాని మళ్ళీ రాదు, అటువంటి అమృత ఘడియల్లో దేవుణ్ణి దర్శించాలంటే పెట్టి పుట్టాలి అని ప్రచారం చేసింది నువ్వు. జనంలో ప్రెషర్ పెంచిందే నువ్వు,” అంటుంటే నాకు మాటలు రాలేదు. ‘ఆలయానికి ఆదాయం పెరుగుతుందని చేశాను, ఆ ఆదాయం మళ్ళీ దేవుని సేవలకీ సంబరాలకీ వాటికే కదా?’ నాలోపలి వాడు నాతో వాదిస్తున్నాడు.
“అతి సర్వత్ర వర్జయేత్. అది యేదైనా. భక్తీ అందుకు అతీతం కాదు. అతి భక్తి కూడా ప్రమాదకరం. చెప్పాలంటే నువ్వు గుడులూ గోపురాలూ కట్టి అతి భక్తికి చోదకశక్తివి అయ్యావు. మనిషిలో వుండే స్వశక్తిని నాశనం చేసి అన్నీ మా దేవుళ్ళే చూసుకుంటారన్న భ్రమని కల్పించావు. అందువల్ల తలకాయ వున్నా, అందులో గుజ్జు వాళ్ళది కాకుండా పోయింది. వాళ్ళెలా ఆలోచించాలో ఆచరించాలో… అసలు ఆలోచించకుండా చేయడంలో నీవంతు పాత్ర నువ్వు పోషించావు. నీవంతు పాపం నువ్వూ మూటకట్టుకోవాల్సిందే,” తుది పలుకులు అన్నట్టు ఆసనం మీదినుంచి లేచి వెళ్ళిపోయాడు స్వర్గాధిపతి.
నరకలోకపు భటులు యిద్దరూ నా రెండు భుజాలూ పట్టుకొని గాల్లోకి లేచారు!
నేను అనుకోనట్టు నరకలోకం చేరుకున్నాను.