దిశాంత భూరేఖ

తమాల వృక్ష ఛాయలో
సంధ్యార్ణవాన్ని
దాచేయాలని ఉంది.

ఎప్పటికీ
వెలుగు చూడకుండా
రాత్రి రథం మీద
సూర్యుడుండని చోటుకి
వెళ్ళిపోవాలని ఉంది

గుడ్లగూబల్ని
గబ్బిలాలనీ లాలిస్తూ
చింత చెట్టు మొదల్లో
కూర్చోవాలని ఉంది

నిశ్శబ్ద తటాకాల్లో
చీకటి తరగలతో
ఆడుకోవాలని ఉంది

నక్షత్రాల్లేని
అమావాస్య సాక్షిగా
కృష్ణ బిలాలని వెతుక్కుంటూ
జీవితం గడిపేయాలని ఉంది

కపటం లేని కీకారణ్యాల్ని
కాటుక గుహల తపోసీమల్ని
కృష్ణ జలరాశుల్ని
కూడగట్టుక పోవాలని ఉంది

నల్ల కలువల నీలి కళ్ళ
నల్లనమ్మల నర్మగర్భపు
నిశా భాషణాలు
నిశ్శబ్దంగా వినాలని ఉంది

సహస్ర శిరస్సులతో
వేనవేల చేతులతో
దిశాంత భూరేఖమీద
రంగులు కలుపుతోన్న
నిశాంతాన్ని నిర్విరామంగా
చూస్తూనే ఉండాలని ఉంది


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...