ఆంధ్ర సాహిత్య దిగ్దర్శనం

కవిత్రయం

రాజకులైకభూషణుఁడు రాజమనోహరుఁ దన్యరాజతే–
జోజయశాలి శౌర్యుఁడు విశుద్ధయశశ్శరదిందుచంద్రికా–
రాజితసర్వలోకుఁ డపరాజితభూరిభుజాకృపాణధా–
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్.

ఇది ఆంధ్ర సాహిత్యంలో మొదటి పద్యం. నన్నెచోడుని కుమార సంభవానికి సంబంధించిన కాలకర్తృత్వ చర్చలను ప్రక్కన పెడితే, నన్నయ మొదలుపెట్టిన మహాభారతమే తెలుగులో మొదటి కృతి. దానిలో తొలి తెలుగు పద్యమిది. అంతకుముందు ప్రార్థనారూపమైన “శ్రీవాణీగిరిజాః …” పద్యం సంస్కృతపద్యం. ఆపై వచనం, మూడవది పై పద్యం. పద్యంలోని పదాలన్నీ సంస్కృతభాషవే. నాలుగవ పద్యమూ అంతే. అప్పటికి జనవ్యవహారంలోనే తెలుగు భాష ఉంది. అక్కడక్కడ శాసనాలలో మాత్రమే సాహిత్య(ఛందస్సు) స్పర్శ ఉంది. ఆ దశలో మహాభారతం వంటి గ్రంథాన్ని ఆంధ్రీకరించడానికి అవసరమైన ఛందస్సాహిత్యాలను సమకూర్చుకొనవలసి వచ్చింది నన్నయకు నారాయణభట్టు సహకారమూ లభించింది. సఫలుడయ్యాడు నన్నయ్య. ఇప్పటికీ ఆ బాట ఆంధ్రసాహిత్యంలో అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది.

అలా తీర్చుకున్న ఛందోభాషాసాహిత్యాలతో ‘ఆదిఁ దొడంగి మూడు కృతులాంధ్రకవిత్వ విశారదుండు విద్యాదయితుండు మహితాత్ముడు’ నన్నయభట్టు తీర్చాడు. ఆది సభా పర్వాలను ముగించి ఆరణ్యపర్వంలోని చతుర్థాశ్వాసంలోని 141/142 వ పద్యం దాకా నన్నయ రచించాడు. తిక్కన ఆరణ్యపర్వాన్ని కొనసాగించకుండా విరాటపర్వంతో ప్రారంభించి పదిహేను పర్వాలను ఆంధ్రీకరించాడు. ఆ తరువాత ఎఱ్ఱన ఆరణ్య పర్వశేషాన్ని పూరించాడు. ఇలా ‘కవిత్రయ భారతం’ తెలుగులో విశిష్టస్థానాన్ని పొందింది. సంస్కృత భారతానికి అప్పటివరకు ఒక్క వ్యాఖ్య కూడా వెలువడలేదు. సంస్కృత భారతానికి తొలి అనువాదమైనా, తొలి వ్యాఖ్య అయినా కవిత్రయ భారతమే.

తనను తాను నానారుచిరార్థసూక్తినిధినిగా ప్రకటించుకొన్న నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తితో, అక్షరరమ్యతతో భారతాన్ని ఆంధ్రీకరించాడు. వాల్మీకి సంస్కృత కావ్యనిర్మాణానికి మార్గదర్శకుడైనట్లు నన్నయ ఆంధ్ర సాహిత్య నిర్మాణానికి దారి చూపాడు. ఈ క్రమంలో ‘ఆంధ్రశబ్దచింతామణి’ని కూడా వ్యాకరణదర్శనం కోసం రచించాడు. అయితే అది నన్నయ వ్రాసింది కాదనే అభిప్రాయమూ ఉంది. కర్తృత్వ విషయవివాదం విద్వద్వినోదమే, కానీ దానివల్ల సాహిత్యావిర్భావానికి లాభమూ లేదు. నష్టమూ లేదు.

రాజరాజనరేంద్రుడు అభ్యర్థించినా. నన్నయ ఆదరించి ఆంధ్రీకరించినా-ఇద్దరి లక్ష్యమూ జగద్ధితమే. అయితే, ఈనాడు కొందరు భావించే సామాజిక దృష్టియే నాటి జగద్ధిత భావన కావలసిన అవసరం లేదు. తాము సంభావించిన జగత్ప్రయోజనాన్ని తాము పాటిస్తారు.

అందుకే, నన్నయ తరువాత తిక్కన దృష్టిలో జగద్ధిత స్వరూపంలో తేడా కనిపిస్తుంది. తన నాటికి చెలరేగిన శైవ వైష్ణవ వైషమ్యాలను పరిహరించటమో, పరిష్కరించటమో తిక్కన భావించిన జగద్ధితత్వం, అందుకే శంకరాచార్యులు పంచాయతన అనుష్ఠానాన్ని ఆదేశించినట్లు తిక్కన హరిహరాద్వైతాన్ని ప్రతిపాదించాడు.

కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా
పరిష్క్రియాయాం బహుమన్యసే త్వమ్
కిం కాలకూటః కిము వా యశోదా–
స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే॥

అని తన కలలో కనిపించిన హరిహరనాథుని ఆరాధ్యమూర్తిగా స్వీకరించి, దానినే ఆదర్శంగా ఆంధ్రులకు అందించాడు. ‘విష్ణురూపాయ నమశ్శివాయ’ అన్నది వైదిక ధ్యాయిత కావాలని అశించాడు. నాటి అవసరమది. అందరిదీ కాకపోయినా వైషమ్యవిషదష్టులైన రోగగ్రస్తుల అవసరమది.

అందుకే “అమలోదాత్తమనీష నేనుభయకావ్యప్రౌఢిఁ బాటించు శిల్పమునం బారగుఁడన్ గళావిదుఁడను” అంటూ నిర్వచనోత్తర రామాయణాన్ని రచించిన తిక్కన మహాభారతం దగ్గర నన్నయలాగే “నా నేర్చిన భంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికిన్” అని వినయశాలితను ప్రకటించాడు.

నన్నయ పురాణధోరణికి ప్రబంధనిర్మాణసరణిని యథావసరంబుగా కలిపి రెండున్నర పర్వాలను నిర్వహింపగా తిక్కన ప్రబంధధోరణికి ప్రాధాన్యమిచ్చి తన భారతాన్ని ‘ప్రబంధమండలి’ అని ప్రకటించి హృదయహ్లాదియై, ఊర్జితకథోపేతమై, నానారసాభ్యుదయోల్లాసి అయిన చతుర్థపర్వంతో — విరాటపర్వంతో — ప్రారంభించి పదిహేను పర్వాలనూ అనువదించాడు. సనత్సుజాతీయం వంటి వాటిని విడిచినా. భగవద్గీతలనో, యుద్ధపర్వాలతో సంక్షేపించినా ఆ ప్రయత్నమంతా చక్కని తెలుగు సాహిత్యాన్ని సృజించి, ప్రజల పలుకుబడులలో నిలిచిపోయిన తెలుగు నుడులకు ఉత్తమ కావ్యగౌరవాన్ని సంతరించి పెట్టడానికే.

ఆరణ్యపర్వం – చతుర్థాశ్వాసంలోని 142/143 వ పద్యంతో ప్రారంభించి, ఆరణ్యపర్వాన్ని పూర్తిచేసిన ఎఱ్ఱన ఆశ్వాసాంత గద్యలో ఆరణ్యపర్వం మొత్తాన్ని నన్నయ కృతంగానే నిర్దేశించాడు. అయితే, తన సృసింహ పురాణావతారికలో “ఆరణ్యపర్వశేషోన్నయమంధ్ర భాష, సుజనోత్సవమొప్పగ నిర్వహించి” అని ఆరణ్యపర్వంలో తన భాగస్వామ్యాన్ని స్పష్టపరిచాడు. ‘శేషోన్నయ’మంటే ఏమిటని విమర్శకులు రకరకాలుగా రచనమా? శిథిలపూరణమా? అని చర్చించినా రచనగానే ఎక్కువ మంది భావించారు. ఇలా మూడు చేతుల మీదగా మహాభారతం తెలుగులో ఆవిర్భవించింది. ‘హరివంశము, నృసింహపురాణము’ కూడా ఎఱ్ఱన కృతులే.

నన్నయ తిక్కనల మధ్యకాలంలోనూ, సమకాలంలోనూ మరికొంత సాహిత్యసృష్టి ఉంది. అయితే, తిక్కన హరిహరనాథ తత్త్వానికి మూలకారణమేమో అన్నట్లుగా వివిధ మతాల ప్రచారం లక్ష్యంగా సాహిత్యం అవిర్భవించింది. పాలకుల అభిరుచిని బట్టి, ప్రజలలో గల కొంత ప్రచారాన్ని బట్టి జైన, బౌద్ధ, వీరశైవ, వైష్ణవాలు ఈ కాలంలో సాహిత్యంపై తమ ముద్రవేశాయి. జైన, బౌద్ధాలు సాహిత్యంలో అంతగా వ్యాప్తినందకపోయినా వీరశైవ, వైష్ణవాలు విజృంభించాయి. వీరశైవ ప్రాతినిధ్యంగా ‘బసవపురాణం, వృషాధిపశతకం, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం’ (పాల్కురికి సోమన కృతులు), ‘శివతత్త్వసారం’ (మల్లికార్జునుడు) వెలువడ్డాయి. వైష్ణవ ప్రాతినిధ్యంగా ‘సర్వేశ్వర శతకము’ (యథావాక్కుల అన్నమయ్య) ‘రంగనాథరామాయణము’ (గోన బుద్దారెడ్డి), ‘భాస్కరరామాయణము’ (నలుగురి రచన) వెలువడ్డాయి. నన్నెచోడుని ‘కుమారసంభవము’ శైవప్రతిపాదనపరమే. ఒక విశిష్టప్రబంధం. శివకవుల వాఙ్మయంలో దేశికవితకు, దేశిభావాలకూ, దేశీయమైన పాత్రలకు ప్రాధాన్య మెక్కువ. సాంస్కృతికమైన మార్గకవితను కాదని దేశికవితపై వీరు మక్కువ చూపారు.

‘శబ్దరత్నాకరా’న్ని కూర్చిన బహుజనపల్లి సీతారామాచార్యులు తెలుగు కవులలో నలుగురిని మాత్రమే మొదటి తరగతికి చెందిన కవులుగా భావించారు. దాన్ని మనమంతా శిరసా వహించి తీరాలన్న నియమమేమీ లేదు. కానీ అటువంటి కేటాయింపు ప్రయత్నం జరిగిందని మనకు తెలియాలి గదా! మహాభారతాంధ్రీకర్తలైన మువ్వురు కవులతో పాటు ఉత్తరహరివంశకర్తయైన నాచనసోముని కూడా మొదటి తరగతి కవిగా గుర్తించాడు. సోమన పూర్వహరివంశాన్ని కూడా రచించి యుండవచ్చునని విమర్శకుల తలంపు. సోమన తనను గురించి అశ్వాసాంతగద్యలో “శ్రీమత్సకలభాషాభూషణ — సాహిత్యరసపోషణ — సంవిధానచక్రవర్తి — సంపూర్ణకీర్తి — నవీనగుణసనాథ” అని ప్రకటించుకొన్నాడు. విమర్శకులు ఈ ప్రతిపాదనను దాదాపు అందరూ అంగీకరిస్తారు. “ఒకడు నాచన సోమన్న యుక్కివుండు” అంటూ విశ్వనాథ విరుద్ధ లక్షణాసహకారంతో సోమనను ప్రశంసించినట్లే స్వీకరించాలి. “పరుఁజూచున్ వరుఁజూచు నొంపనలరింపన్….” మొదలుగా గల పోతన పద్యానికి అదే సందర్భంలో “అరిఁజూచున్ హరిఁజూచు” (ఉత్తరహరివంశం- 1/162) పద్యమే ప్రేరకం.

శ్రీనాథుడూ, సహచరులూ — అనుచరులూ

ఆంధ్ర సాహిత్యంలో విశేషించి ప్రాచీనాంధ్ర సాహిత్యంలో అధికభాగం అనువాదాలే. కాకపోతే అని అనువాదాలుగా గాక అనుసృజనలుగా కనిపించి, ఆకట్టుకొంటాయి. సంస్కృత భాషలోని కావ్యాలనూ, నాటకాలనూ, గద్యకావ్యాలనూ కూడా ప్రబంధీకరించటం ఎఱ్ఱన తరువాత ప్రారంభమైంది. కేతన దండికృతియైన ‘దశకుమార చరిత్ర’ను — గద్యకావ్యాన్ని — ప్రబంధంగా వ్రాశాడు.

శ్రీనాథుడు శ్రీహర్షుని నైషధకావ్యంలోని కొంత భాగాన్ని ‘శృంగారనైషధం’గా అనువదించాడు. సంస్కృత ప్రయోగ ప్రౌఢిమతో, తెలుగు నుడికారపు సొంపులతో శ్రీనాథుని కృతులు విలసిల్లుతాయి, ‘శృంగారనైషధం, కాశీఖండం, భీమేశ్వరపురాణం, హరవిలాసం, శివరాత్రిమాహాత్మ్యం’ (స్వతంత్ర రచన) శ్రీనాథుని కృతులు. “తపనీయదండైక ధవళాతపత్రితోద్దండ తేజఃకీర్తిమండలుండు” వంటి సీస పద్యాలను వ్రాసి శ్రీనాథుడు గొప్ప కీర్తిని పొందారు. ఆ శైలినే కొందరు మెచ్చక శ్రీనాథుని చేతిలో సీసం చెడిపోయిందన్నారు. అద్భుత భోగాలనూ, అసాధారణ శిక్షలనూ రెండింటినీ అనుభవించిన కవి శ్రీనాథుడు, అయినా, రాజసానికి జీవితంలో కానీ, సాహిత్యంలో కానీ లోటురానివ్వనివాడు —

‘ఎవ్వనితో నెచ్చోటం
జివ్వకుఁ జేసాఁపవలదు చేసాఁపినచో
నివ్వల నవ్వల నెవ్వరు
నవ్వక యుండంగఁ బగసనం దీర్పనగున్’

— అని ‘కాశీఖండం’లో కూర్చి రాజసాన్ని ప్రకటించినవాడు శ్రీనాథుడు. శ్రీనాథుడికి పాక్షికంగా సమకాలీనుడైన పోతన మరొక పుణ్యపేటి. తనకు ముందువారెవ్వరూ శ్రీమద్భాగవతాన్ని అనువదించనందుకు సంబరపడుతూ-

ఒనరన్ నన్నయతిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో
తెనుగుం జేయరు మున్ను భాగవతమున్…

అని భాగవతానువాదానికి పూనుకొన్న భక్తిశృంగారకవి పోతన.

కలకండ అచ్చులలాంటి పద్యాల కూర్పరిగా తెలుగు నేలపై విశిష్ట ఖ్యాతిని పొందినవాడు పోతన. తాను పలుకుతున్నా పలికిస్తున్నవాడు రామభద్రుడని ప్రకటించి కర్తృత్వాహంకారాన్ని అధిగమించిన కవి పోతన. తెలుగు నేలలో పండితులే కాక, సామాన్యులు కూడా పోతన పద్యాలను ఒకటో, రెండో చెప్పగలిగి వుండటం విశేషం. భక్తిభేదాలను అన్నింటినీ తన భక్తులలో ప్రదర్శిస్తూ శ్రీమద్భాగవతాన్ని తెలుగువారికి కానుక జేశారు పోతన.

శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోకర–
క్షైకారంభకు భక్తరక్షణకళాసంరంభకున్ దానవో–
ద్రేకస్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా–
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్

ఇది భాగవతంలోని తొలి పద్యం. భాగవతమంతా ఇదే రీతిగా అంత్యానుప్రాసలతో, భక్తిశృంగార సమ్మేళన రూపమైన రసపోషణతో నిరుపమానంగా నిలిచిపోయింది సాహిత్యలోకంలో.

(శ్రీనాథుడు పోతన బావబావమరుదు లంటూ లోకంలో ప్రచారం ఉన్నా, దానికి తగిన చారిత్రకాధారాలు కనిపించవు.)

ఈ కాలంలో విలక్షణమై విశిష్టమైన సాహిత్యసృష్టి జరిగింది. తొలి కవయిత్రిగా మొల్ల ఈ సమయంలోనే రామాయణాన్ని రచించింది. ఆకృతిలో చిన్నదైనా ఇది సహృదయుల నాకట్టుకొనగలిగినది.

కందువ మాటలు, సామెత
లందముగాఁ గూర్చి చెప్ప నది తెనుఁగునకున్
పొందై రుచియై వీనుల
విందై మఱి కానిపించు విబుధుల మదికిన్

— అని మొల్ల తాను సంభావించిన కవితాతత్త్వాన్ని కావ్యావతారికలో స్పష్టపరిచింది.

తాళ్ళపాక తిమ్మక్క (సుభద్రా కళ్యాణం), తాళ్ళపాక అన్నమాచార్యులు (సంకీర్తనల కర్త), గౌరన (హరిశ్చంద్రోపాఖ్యానం), నందిమల్లయ–ఘంటసింగనలు (ప్రబోధచంద్రోదయం), మడికిసింగన (పంచతంత్రం, నీతిసారం…) దుగ్గన (నాచికేతోపాఖ్యానము) మొదలగు రచయితలు ఈ కాలంవారే. ఆలస్యంగా అందుబాటులోనికి వచ్చినా, అన్నమాచార్యకీర్తనలు అశేష సంగీతసాహిత్యరసికుల హృదయాలను విశేషంగా అలరిస్తున్నాయి. వాటిని భద్రపరచటంలో, ప్రచురించటంలో, ప్రచారాన్ని కల్పించటంలో ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ కృషి అభినందనీయం.

ప్రబంధ రచనకు మూలం

కాళిదాసుని అభిజ్ఞానశాకున్తలాన్ని తోడు చేసికొని దుష్యంతోపాఖ్యానాన్ని ప్రబంధీకరించిన పిల్లలమర్రి పినవీరభద్రుడు ఈ కాలంవాడే. ‘శృంగార శాకుంతలం’ పేరుతో ఒక మంచి కృతిని నిర్మించా డీ కవి. వాస్తవానికి ఇది తదనంతర కాలానికి చెందిన ప్రబంధాలకు మార్గదర్శి.

‘భారత ప్రోక్తకథ మూలకారణముగఁ
గాళిదాసుని నాటకక్రమము కొంత
తావకోక్తికి నభినవశ్రీ వహింపఁ
గూర్మిఁ కృతిసేయు నాకు శాకుంతలంబు’

— అని కృతిభర్త చిల్లర వెన్నమంత్రి చేసిన అభ్యర్థనతో పినవీరభద్రుడు శృంగారశాకుంతలాన్ని తీర్చిదిద్దాడు. ఇది ముప్పేటగొలుసు. మూలకథ మహాభారతంలోనిది. అంతకుముందే కాళిదాసు ఆ కథను నాటకీకరించి ఉన్నాడు, కాబట్టి ఆ నాటకరచనను అనుకరిస్తూ వ్రాయమన్నాడు. కేవలం అనుకరణం కాకుండా, పినవీరన ప్రతిభనూ జోడించమన్నాడు. అలా రూపునందినది ‘శృంగార శాకుంతలం’. అయితే, కాళిదాసుని నాటకక్రమంతో పాటు శ్రీనాథుని కవితావిన్యాసాలను కూడా అనుకరించాడు పినవీరభద్రుడు. కాళిదాసుని నాటకాన్ని చతుర్థాంకం వరకూ స్వీకరించి, పంచమాంకం ముగింపును భారతకథతో జోడించి అశరీరవాణి సాక్ష్యంతో శకుంతలను దుష్యంతునిచే స్వీకరింపజేసి కృతిని శృంగారశాకుంతలాన్ని చేశాడు పినవీరన. కాళిదాస శ్లోకాలను చాలావాటిని అనువదించాడు ఈ కృతిలో పినవీరన. ‘జైమిని భారతం’ కూడా పిల్లలమర్రి పినవీరభద్రుని కృతియే. భోజరాజీయము (అనంతామాత్యుడు), విక్రమార్క చరిత్ర (జక్కన), కేయూరబాహు చరిత్ర (మంచన) సింహసన ద్వాత్రింశిక (కొఱవి గోపరాజు) మొదలైన కృతులన్నీ ఈ శతాబ్దంలోనే కొంచెం అటు ఇటుగా ఆవిర్భవించిన కృతులు.

ప్రబంధాలు- శాబ్దిక విన్యాసాలూ

ఆంధ్ర సాహిత్యానికి ఒక విశిష్టమైన లేదా విలక్షణమైన స్థానాన్ని సంపాదించి పెట్టిన గ్రంథాలుగా మనం సంభావించే ప్రబంధాలు ‘శృంగారశాకుంతల’ కాలం తర్వాత 15,16 శతాబ్దాలలో విలసిల్లాయి. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత ఆంధ్ర ప్రబంధాల పతనాన్ని కూడా శాసించినవి ఈ ప్రబంధాలే. కవిత్వం రాయాలంటే రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చే కర్పూర తాంబూలం కూడా అవసరమే అని తేల్చి చెప్పగలిగింది ఈ యుగం కవులే. రాజాశ్రయంలోనే ఉండి ‘రాజుల్ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు’ అంటూ ఆ రాజుల సహనానికీ, మంచితనానికీ పరీక్ష పెట్టి వారి ప్రాపుతోనే బ్రతుకు గడుపుకొన్న కవులున్న దీ ఈ యుగంలోనే, సుకవులు ఎదురైతే తన మదకరీంద్రము డిగ్గి కేలూత యిచ్చి యెక్కించుకొన్న రాజులు ఇప్పటివారే. ద్వ్యర్థికావ్యాలూ ఈ రోజుల్లో పుట్టినవే.

ఈ యుగంలోని కృతుల రచనకు మూలాశయం ఒకటే.

‘కేవలకల్పనా కథలు కృత్రిమరత్నము లాద్యసత్కథల్
వావిరి పుట్టురత్నము లవారిత సత్కవికల్పనావిభూ–
షావహ పూర్వవృత్తములు సానలు దీరిన జాతిరత్నముల్…’

— అని రామరాజభూషణుడు వసుచరిత్రలో నొక్కి చెప్పాడు.

ప్రఖ్యాత కథను తీసికొని, దానికి తమ కల్పనను జోడించి, మిశ్రేతివృత్తంతో ప్రబంధ నిర్మాణం చేయటం ఈ యుగకవుల లక్షణం. దానితో వర్ణనల భారం కావ్యంలో ఎక్కువైంది. ఉత్ప్రేక్షలు, అతిశయోక్తులు పెరిగాయి. కట్టమంచి రామలింగారెడ్డి వంటి విమర్శకుల తీవ్రాధిక్షేపణకు గురి అయ్యాయి, వాస్తవానికి కట్టమంచివారు చేసిన విమర్శ ఆనాటి ప్రబంధాలకు అన్నింటికీ పట్టేది కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఒక్క ‘వసుచరిత్ర’కు మాత్రమే పరిమితమైనది. అంటే, ఒక్క వసుచరిత్ర తానే సమస్తమూ అన్నట్లుగా విమర్శలోకాన్ని ప్రభావితం చేయగలిగింది. అందుకే ఆ విమర్శ నిజమేనని ఉలిక్కిపడ్డారే గానీ, “అన్ని ప్రబంధాలు అలా లేవు గదా! కథాసహితాలే గానీ కేవల వర్ణనాత్మకాలు కావు గదా!” అని ఎవ్వరూ దాదాపు అనలేదు. సాహిత్యలోకంలో ప్రబంధప్రతినిధిగా అంత గట్టి ముద్రవేసింది వసుచరిత్ర. శబ్దం మీద అధికారం — సంపూర్ణాధికారం — అసాధారణ భావుకత, శ్లేషయమకవినియోగం, రాగానుకూలమైన శైలి — ఇవన్నీ వసుచరిత్రకు వన్నె తెచ్చాయి. ఆ ప్రభావంతో అన్ని ప్రబంధాలూ అటువంటివే అనే భ్రాంతికి లోనయ్యారు విమర్శకులు. రామరాజభూషణుని ‘వసుచరిత్ర’లోని ఒక పద్యం మచ్చుకు –

‘తారాసస్యము పండినన్ గగనకేదారంబునం జంద్రికా–
నీరంబారఁగఁ గోసి తద్రుచిఫలానీకంబు ప్రాతర్మహా–
సీరగ్రామణి తూరుపెత్తెననఁ దోఁచెం దూర్పునం దెల్పు త–
ద్దూరన్యస్తపలాలరాశిక్రియ నిందుండేగె నిస్సారుఁడై,’

ఇది సూర్యోదయాన్ని వర్ణిస్తున్న పద్యం.

నాలుగు వేదాలకూ భాష్యం ఆరోజుల్లోనే వెలువడింది. కాబట్టి అది స్వర్ణయుగమో, ఈ ప్రబంధాల కారణంగా అది స్వర్ణయుగమో తెలియదు, కానీ సంస్కృతానికి గుప్తుల కాలాన్ని ‘స్వర్ణయుగం’గా భావిస్తే, తెలుగు సాహిత్య విషయంలో ప్రబంధయుగాన్నే ‘స్వర్ణయుగ’ మని భావించారు.

ఆంధ్రకవితాపితామహుడుగా కీర్తింపబడిన పెద్దనామాత్యుని ‘స్వారోచిషమనుసంభవము’ అనాటిదే. మార్కండేయ పురాణాంతర్గత గాథను స్వీకరించిన పెద్దన, మారన మార్కండేయ పురాణంతో పాటు మరెందరినో అనుకరించాడు ఆయా సాందర్భిక వర్ణనల్లో. అయితే, అన్యకవుల నుండి అర్థాలను దొంగిలించకూడదన్న నియమం, అటువంటివాడు కుకవి అన్న నిర్ణయం ఆయనకున్నాయి.

భరమైతోఁచు కుటుంబ రక్షణకుఁగాఁ బ్రాల్మాలి చింతన్ నిరం–
తర తాళీదళసంపుట ప్రకరకాంతారంబునం దర్థపుం
దెరువాటుల్ దెగికొట్టి తద్‌జ్ఞ పరిషద్విజ్ఞాత చౌర్యక్రియా–
విరసుండై కొఱఁతన్ బడున్ గుకవి పృథ్వీభృత్సమీపక్షితిన్

— అంటూ కుకవులను నిందించారు పెద్దన.

మహాకావ్యాల ప్రధాన లక్షణంగా భావించిన అష్టాదశవర్ణనలలో వీలైనన్ని ఎక్కువ వర్ణనలను ఆదరించటం ఈ యుగ ప్రధానలక్షణాలలో ఒకటి. అందుకే, ‘వరణాద్వీపవతీతటాంచలమునన్ వప్రస్థలీ చుంచితాంబరమై’ అంటూ ‘మనుచరిత్ర’లో ప్రారంభమైన నగరవర్ణన సాహిత్యంలో కొనసాగుతూనే ఉంది.

కృష్ణదేవరాయల కృతి ‘ఆముక్తమాల్యద’ ఈ కాలంలోని గొప్ప కృతి. కృతికర్తృత్వ విషయంలో కొంత నిరర్థక వివాదం ఏర్పడినా, అది పెద్దగా నిలవలేదు. విష్ణుపారమ్యాన్ని ప్రబోధించే కావ్యాలలో ‘ఆముక్తమాల్యద’ అగ్రగణ్యంగా నిలిచింది. అంతమాత్రంచేత తెనాలి రామకృష్ణుని ‘పాండురంగమాహాత్మ్యం’ తక్కువేమీ కాదు. ‘శారద నీ రూపము’ అని కృతిభర్తచే మన్ననలు పొందినవాడు తెనాలి రామకృష్ణుడు. ‘ఘటికాచల మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్ర’ కూడా రామకృష్ణుని కృతులే. ఆముక్తమాల్యదలో సుదీర్ఘ వర్ణనలు, విస్తృతకథాభాగం, తత్త్వప్రబోధాలు ముప్పిరిగొని వుంటాయి. పాఠకుని సమాజానికి దగ్గరగా నడిపించటంలో రాయలు ముందుంటే, రామకృష్ణుడు కూడ నడుస్తాడు.

పారిజాతాపహరణం స్వతంత్రమేనా?

ఈ సమయంలోనే రాణిపై కోపించిన రాజుగారి అలకలో ఔచిత్యం లేదని ధ్వనింపజేయటానికి రాసిన కృతిగా విమర్శకులు భావించే ‘పారిజాతాపహరణం’తో ముక్కు(నంది) తిమ్మన అద్భుత కవిత్వాన్ని రుచి చూపించాడు. శ్రీకృష్ణుని అష్టవిధనాయికలతో కూడిన దక్షిణనాయకునిగా మనోహరంగా చిత్రించి దక్షిణనాయకత్వం కత్తిమీద సాము వంటిదని, ఆ సాముగరిడీలు కృష్ణునికే కుదిరాయని నిరూపించాడు. అవతారికలో కృష్ణదేవరాయలు కృష్ణుడే అని వర్ణించిన సీసం రమణీయంగా ఉంటుంది (యాదవత్వమున సింహాసనస్థుఁడు గామి…) అయితే ఈ ‘పారిజాతాపహరణం’ స్వతంత్రమా? అనువాదమా? అని చిన్న శంక, ఇంకా తీరవలసి ఉంది.

నను భవదీయదాసుని మనంబున నెయ్యపుఁగిన్కఁబూని దా–
చిన నది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ–
త్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చునంచు నే–
ననియెద నల్కమానవు గదా యికనైన నరాళకుంతలా!”

— అన్న పద్యం తిమ్మనను మహాకవిని చేసింది. కానీ-

దాసే కృతాగసి భవత్యుచితః ప్రభూణాం
పాదప్రహార ఇతి సుందరి! నాస్మి దూయే।
ఉద్యత్కఠోరపులకాంకుర కంటకాగ్రైః
యద్భిద్యతే తవ పదం నను సా వ్యథా మే॥

— అన్న శ్లోకం రుయ్యకుని అలంకార సర్వస్వంలో రూపకాలంకారానికి ఉదాహరణంగా ఇవ్వబడింది. ఈ శ్లోకానికి తిమ్మన పద్యం పక్కా అనువాదం, రుయ్యకుడు 12 వ శతాబ్దం వాడు. ఆ సంస్కృత కావ్యం లభిస్తేనే కానీ తిమ్మన ‘పారిజాతాపహరణం’ ఎంతవరకు స్వతంత్రమో నిర్ణయించలేము.

రాయల ఆస్థానంలో ఉండి కూడా ‘రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయంబు‘ అని ఈసడించి రాయల శిక్షకు పాత్రుడు కాకుండా తప్పించుకొన్న కవి ధూర్జటి కాళహస్తీశ్వరశతకాన్ని, కాళహస్తి మాహాత్మ్యాన్ని వ్రాసి “ధూర్జటి పల్కుల కేల యబ్బెనీ యతులిత మాధురీమహిమ” అని రాయల పొగడ్తల నందిన కవి ఇతడు. కాళహస్తి మాహాత్మ్యం శివపారమ్యాన్ని బోధించే గ్రంథం. బహుకథలతో నిండిన తిన్నని కథ, నత్కీరుని కథ బహుళ ప్రచారాన్ని పొందాయి. “ఈ రాజన్యుని మీదనేఁ గవిత…” మొదలైన పద్యంలో “లక్షణంబో, యలంకారంబో, పదబంధమో, రసమొ…” అని ప్రస్తావించి ఉత్తమ కవిత కుండవలసిన లక్షణాలను సూచించాడు ధూర్జటి.

కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నము‘లన్న భావానికి భిన్నంగా కల్పిత కథతోనే ‘కళాపూర్ణోదయా’న్ని రచించిన పింగళి సూరన ఈ కాలంవాడే కొంచెమించుమించుగా. ఈయన కృతి ‘ప్రభావతీ ప్రద్యుమ్నం’ మిశ్రకథతో కూడినదైనా, కళాపూర్ణోదయం కల్పితమే. అయితే, ఒక విశేషం. కళాపూర్ణోదయంలోని చాలా పాత్రలు ప్రఖ్యాతాలే. కథ మాత్రమే కల్పితం. బ్రహ్మ, సరస్వతి, రంభ, నలకూబరుడు, నారదుడు, తుంబురుడు వగైరా పాత్రలు ప్రసిద్ధాలు. కలభాషిణి, మణికంధరుడు, మణిస్తంభుడు వగైరా పాత్రలు కల్పితాలు. రెండింటినీ మేళవించి, కథను మాత్రం కల్పించి, కథా నిర్వహణలో కార్యక్రమ పద్ధతిని స్వీకరించి మనోహరంగా తీర్చిదిద్దబడిన ప్రబంధం కళాపూర్ణోదయం. దీనిలో అవాంతర కథయైన సుగాత్రీశాలీనుల కథ కూడా ఆకట్టుకొనేది. కథాకథనానికి అనుగుణమైన చక్కని శైలి ఈ ప్రబంధానికి వన్నె తెచ్చింది.

తమిఁ బూఁదీఁగెల తూఁగుటుయ్యెలలఁ బంతాలాడుచుం దూఁగు నా
కొమరుంబ్రాయపు గబ్బిగుబ్బెతల యంఘ్రుల్ చక్కఁగాఁ జాఁగి మిం–
టి మొగంబై చనుదెంచు ఠీవిఁ గనుఁగొంటే దివ్యమౌనీంద్ర నా–
కమృగీనేత్రలమీదఁ గయ్యమునకుం గాల్‌చాఁచు లాగొప్పెడున్.

ఇటువంటి శైలి ప్రబంధమంతా పరచుకొని ఉంటుంది.

ఈ యుగంలోనే మరెన్నో కావ్యాలు వెలువడ్డాయి. అయ్యలరాజు రామభద్రుడు ‘రామాభ్యుదయం’ వ్రాశాడు. రసౌచిత్యాన్ని పాటించనందువల్ల ఈయన దశరథుడు నిఘంటువులు చూస్తూ ఏడుస్తున్నట్లు ఉన్నదని కట్టమంచివారిచే అధిక్షేపింపబడ్డాడు. మాదయగారి మల్లన ‘రాజశేఖరచరిత్ర’ వ్రాశాడు. ఇది కల్పిత కథాకావ్యం, ఎల్లనార్యుడు ‘రాధామాధవ’ కావ్యాన్ని వ్రాసి ‘రాధామాధవ కవి’ అనిపించుకొన్నాడు రాయలచే. సంకుసాల నృసింహకవి రచించిన ‘కవికర్ణరసాయనం’ ఒక విశిష్టకావ్యం.

‘యతి విటుఁడు కాకపోవు టెట్లస్మదీయ
కావ్యశృంగారవర్ణనాకర్ణనమున
విటుఁడు యతి కాకపోవునే వెస మదీయ
కావ్యవైరాగ్యవర్ణనాకర్ణనమున’

— అని ప్రతిజ్ఞ చేసిన కవి సంకుసాల నృసింహకవి. కందుకూరి రుద్రకవి ఈ కాలంవాడే. ‘సుగ్రీవవిజయ’ యక్షగాన కర్త ఇతడు. ఇది మొదటి యక్షగానం. తరువాత దక్షిణాంధ్రయుగంలో యక్షగానాలు తామరతంపరగా వెలువడ్డాయి. ‘నిరంకుశోపాఖ్యానం’ కూడా ఈతని రచనయే.

తెలుగులో అచ్చతెనుగు కావ్యాలకు ఒక విశిష్టస్థాన ముంది. పొన్నెగంటి తెలగన అచ్చతెనుగులో ‘యయాతి చరిత్ర’ను రచించాడు. తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యమిదే. ఈ యుగంలో విశిష్టంగా చెప్పుకొనవలసిన మరొక కావ్యం ‘వైజయంతీ విలాసం’. సారంగు తమ్మయ రచన మిది. విప్రనారాయణుని చరిత్ర దీనిలో ఇతివృత్తం. విరాగియైన విప్రనారాయణుని మనస్సు క్రమంగా దేవల్దేవివైపు మొగ్గటాన్ని కవి ఎంత మనోహరంగా వర్ణించాడో చూడండి.

ఆ విప్రోత్తము వజ్రపంజరనిభంబై నిశ్చలంబైన స–
ద్భావంబంగన సాహచర్యగుణ సంపర్కంబునన్ లోహమై
గ్రావంబై దృఢదారువై తరుణవృక్షంబై ఫలప్రాయమై
పూవై తన్మకరందమై కరిగెఁ బోఁ బో నీళ్ళకుం బల్చనై.

చిత్రకవిత్వం ప్రధానంగా ‘చిత్రభారతాన్ని’ రచించిన చరిగొండ ధర్మన ఈ కాలంనాడే. దాశరథి శతకాన్ని, కొన్ని కీర్తనలనూ వ్రాసి తన వరివస్యనందించిన రామదాసు ఈనాటివాడే.

నాయకరాజులకాలంలో దీన్నే ‘దాక్షిణాత్యయుగం’గా విమర్శకులు పేర్కొంటారు. ఆంధ్ర సాహిత్యం గతంలోని ప్రౌఢిమను కొంతమేర తగ్గించుకొన్నా, చమత్కారితను సమీకరించుకొని హృదయాలకు దగ్గర కాగలిగింది. రఘునాథ నాయకుడు, అతని కుమారుడు విజయరాఘవ నాయకుడు, ఆ ఇద్దరి అస్థానాలలోని కవులు ఈ యుగంలోని ప్రముఖులు. రఘునాథ నాయకుడు స్వయంగా సంగీత సాహిత్యవేత్త.

“తా రసపుష్టిమై ప్రతిపదంబున జాతియు వార్తయున్ చమ–
త్కారము నర్థగౌరవము గల్గు ననేకకృతుల్ రచించి”

— అని చేమకూర వేంకటకవి రఘునాథ నాయకుని ప్రస్తుతించాడు. రఘునాథ నాయకుడు తనను ప్రశంసించినట్లుగా–

ప్రతి పద్యమునందుఁ జమ–
త్కృతి గలుగం జెప్పనేర్తు వెల్లెడ బెళుకౌ
కృతి వింటి మపారముగా
క్షితిలో నీ మార్గమెవరికిన్ రాదు సుమీ

— అని ‘విజయవిలాసం’లో ఉట్టంకించుకొన్నాడు. అయినా ‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా’ అని ప్రాసంగికంగా తన అసంతృప్తిని ప్రకటించాడు ఆ ‘విజయవిలాసం’లోనే. చేమకూర వేంకటకవి ‘సారంగధర చరిత్ర’ను కూడా రచించాడు. ప్రతిపద చమత్కృతి అంకురాలు దానిలో కనిపిస్తాయి. ‘విజయవిలాసం’ దాదాపు పేరు పొందిన ప్రబంధాలలో చివరిది. రఘునాథ నాయకుడు ‘వాల్మీకి చరిత్రను, రఘునాథ రామాయణా’న్ని రచించాడు. ద్విపదలో ‘నలచరిత్ర’ను తీర్చిదిద్దాడు. విజయరాఘవ నాయకుడు తెలుగులో దాదాపు ఏబది కావ్యాలను రచించారు.

నాయకరాజుల కాలం

ఈ ‘దక్షిణాంధ్రయుగం’ వివిధ ప్రక్రియలకు ప్రసిద్ధి కెక్కింది. యక్షగానాలు ఈ కాలంలో కవులను విపరీతంగా ఆకర్షించాయి. విజయరాఘవునితో పాటు ఆయన ఆస్థానంలోని ఎందరో యక్షగానాలను రచించారు. ‘రఘునాథాభ్యుదయం’ తన తండ్రిని గురించి విజయరాఘవుడు రచించిన యక్షగానమే. తంజావురాన్నదాన వంటి యక్షగానం ఆనాటి అన్నదాన సత్రాల పరిస్థితికి అద్దం పడుతుంది. సముఖం వేంకటకృష్ణప్ప నాయకుని ‘రాయవాచక’మనే వచన కావ్యం ఈ కాలంలోనిదే. సంకీర్తనలకు పేరెన్నికగన్న త్యాగయ్య, క్షేత్రయ్య ఈ కాలంవారే. త్యాగరాజ కీర్తనలూ, క్షేత్రయ్య మువ్వగోపాల పదములు జగత్ప్రసిద్ధాలే.

నారాయణ కవి రచించిన ‘హంసవింశతి’, కదిరీపతి రచించిన ‘శుకసప్తతి’ మంచి కథాకావ్యాలు. అవి కూడా దాదాపు ఈ కాలంలోనివే. శేషము వేంకటపతి విరచించిన ‘శశాంకవిజయం’, సముఖము వేంకటకృష్ణప్ప నాయకుని ‘అహల్యా సంక్రందనం’, ముద్దుపళని రచించిన ‘రాధికాసాంత్వనం’, చిననారాయణ కవి రచన “కువలయాశ్వ చరిత్ర’ వగైరా కృతులు ఈ కాలానికి చెందినవే. వీటిలో కథాకావ్యాలలో చక్కని శైలి. తెలుగుదనం, తెలుగువారి సాంస్కృతిక విశేషాలు అద్దంపట్టినట్టు కనిపిస్తాయి. ‘శశాంక విజయం, అహల్యాసంక్రందనం’ వంటివి ‘పిల్ల వసుచరిత్రలు’ అన్న పేరు పొంది అంతమాత్రంగానే మిగిలిపోయాయి తమలో గొప్ప శైలి ఉన్నా కూడా. ‘రాధికా సాంత్వనం’ వంటివి అతివేల శృంగారంతో ఒకప్పుడు ప్రభుత్వ నిషేధానికి నోచుకున్నాయి. రంగాజమ్మ, రామభద్రాంబ, మధురవాణి, కృష్ణాజి వంటి కవయిత్రులు ఈ యుగంలోనివారే. అవధాన విద్యలోనూ అరితేరి అనేక ప్రక్రియలలో రచనలు చేసిన గణపవరపు వేంకటకవి ఈ కాలంవాడే. ద్వ్యర్థి, త్ర్యర్థి కావ్యాలు కూడా ఈ యుగంలోనే మిక్కుటమయ్యాయి, కృష్ణాధ్వరి రచించిన ‘నైషధ పారిజాతం’, వీరరాఘవకవి కృతి ‘యాదవపాండవీయం’, ఎలకూచి బాలసరస్వతి రచన ‘రాఘవయాదవపాండవీయం’ ఈనాటివే. ఎలకూచి బాలసరస్వతి భర్తృహరి ‘త్రిశతి’ని కూడా అనువదించాడు. ‘మల్లభూపాలీయ’మని దీనికి పేరు. అశుకవితలకు కూడా ఈ కాలం పెట్టినది పేరే. రంగాజమ్మ విజయరాఘవుని ధర్మపత్నిని ఉద్దేశించి చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న క్రింది పద్యం అద్భుతమైన అశుకవితగా కనిపిస్తుంది —

ఏ వనితల్ మముం దలప నేమి పనో? తమ రాడువారు కా–
రో? వలపించు నేర్పెరుగరో? తమ కౌగిలిలోన నుండఁగా
రావది యేమిరా విజయరాఘవ! యంచిలుదూరి బల్మిమై
తీవెరకత్తెనై పెనఁగి తీసుకువచ్చితినా? తలోదరీ!

మరో అచ్చతెనుగు కబ్బం ‘నీలాసుందరీ పరిణయం’ ఈ సమయంలోనే జీవించిన కూచిమంచి తిమ్మకవి రచన. పుష్పగిరి తిమ్మకవి ‘సమీరకుమార విజయం’ రచించాడు. కంకంటి పాపరాజు ‘ఉత్తర రామాయణం’తో, ఏనుగు లక్ష్మణకవి సుభాషితానువాదంతో ఈ కాలంవారిలో ప్రసిద్ధి కెక్కారు. అలంకారశాస్త్ర గ్రంథమైన ‘చంద్రాలోకా’న్ని సంస్కృతం నుండి అనువదించి అడిదము సూరకవి పేరు పొందాడు. అచ్చతెలుగు పదాల నిఘంటువులను కూడా కూర్చినవాడితడు.

ఇదంతా దాదాపు 1800 సంవత్సరానికి ముందు. 19 వ శతాబ్దాన్ని విమర్శకులు క్షీణయుగమన్నారు. వాస్తవానికి దీన్ని ‘క్షీణయుగ’మని అంగీకరించవలసి వస్తే, అది అంతకు ముందే మొదలైందని చెప్పవలసి వస్తుంది. కొంచెం విశదంగా చూద్దాం —

తెలుగు కవుల కవితాత్మీయత

నన్నయతో ప్రారంభమైన తెలుగు సాహిత్యం దాదాపు అందరూ వ్రాసినవి చంపువులే, అయినా ఏదో ఒక క్రొత్తదనాన్ని కనిపింపజేసేవారు. నాచన సోమన అందువల్లనే “నవీనగుణసనాథ, సంవిధాన చక్రవర్తి” అని తనను తాను నిర్దేశించుకొన్నాడు. వాస్తవానికి నన్నయ శైలి నుండి తనను తాను వేరు చేసుకుంటూ తిక్కన భారతాన్ని ముగించాడు. అంగిక సాత్త్వికాభినయ వర్ణనను తన కవితాలక్షణంగా నిరూపించాడు. దానినే రసాభ్యుచితబంధమన్నాడు. బంధానికి సహకరించే భాషను ప్రజలనుండి ఎన్నుకొన్నాడు. శ్రీనాథుడు ఎక్కువగా అనువాదాలనే చేశాడు. శైలిని కొండమీదనుండి బండరాళ్ళను లాగా, చరియలనుండి జలపాతంలాగా దొర్లించి దానితో ముందు ఆకట్టుకొన్నాడు. అపై రసభావ నిర్భరత. పోతన కూడా అంతే. తనదైన విలక్షణశైలి శబ్దాలంకార ప్రధానమైనా పాఠకుల హృదయాల కెక్కేటట్లు చేశాడు. ప్రబంధయుగంలో ఒకరినొకరు అనుకరించడానికి వీలులేనట్లుగా సొంత పోకడలు పోయారు.

అనుకరణం – స్వాతంత్ర్యం

ఆ తరువాత నుండి అనుకరణం ప్రధానమైంది. ఛందస్సులూ, భావాలూ, ఊహలూ, అలంకారాలూ అన్నీ పాతబడిపోయాయి. క్రొత్తదనాన్ని ఎలా సాధించాలో అర్థం కాని విషయమైంది కవులకు, పదాలూ, భావాలూ కాకుండా పలుకుబళ్ళకు ప్రాధాన్య మిచ్చి రచించవలసి వచ్చింది. దానికి దారి చూపినవారు పింగళి సూరన అయితే, అనుసరించి విజయాన్ని సాధించినవారు కథాకావ్య రచయితలు. దక్షిణాంధ్రయుగంలో ప్రక్రియావైవిధ్యంతో కవులు కొంతమేర నిలద్రొక్కుకోగలిగారు. సాధారణ ప్రబంధ నిర్మాణమైతే ఎంత మెలకువ అవసరమయిందో చూడండి. ఒక చేమకూర పద్యంలో క్రొత్తదనం సాధించటానికి —

అతివ కుచంబులున్ మెఱుగుటారును వేనలియున్ ధరాధిపో–
న్నతియు నహీనభూతికలనంబు ఘనాభ్యుదయంబు నిప్పుడొం–
దితి మని మాటిమాటికిని నిక్కెడు నీల్గెడు విఱ్ఱవీగెడున్
క్షితి నటుగాదె యొక్కొకరికిన్ నడుమంత్రపు కల్మి కల్గినన్.

ఈ అంగాంగ వర్ణనలు ప్రబంధాలలో కుప్పలు తెప్పలు, కానీ తనకూ ఆ వర్ణన చేయవలసిన అవసరమేర్పడింది చేమకూర వేంకటకవికి ఆ ధోరణి ప్రబంధం కాబట్టి, నూతనత్వం కోసం తాను పాటించిన మెలకువలు

1. మూడింటిని వర్ణించటానికి ఒకే పద్యాన్ని ఎన్నుకోవటం, పాత ప్రబంధాలలో మూడు పద్యాలలో వర్ణించేవారు.
2. ఉద్దేశ విధేయ భావంతో క్రమాలంకారాన్ని పాటించటం
3. ప్రతిఫలన రూపమైన చేష్టను వర్ణించటంలో క్రమాలంకారంతో మూడింటిని వర్ణించటం. ఏ ఒక్కదానికైనా ఆ మూడూ అన్వయించే అవకాశముండటం.
4. అవి జగమెరిగిన లాక్షణికమైన చేష్టావర్ణనాత్మక పదాలు కావటం
5. దానిని ఒక అర్థాంతరన్యాసంతో సమర్థించటం
6. అది ‘నడుమంత్రపు కల్మి’ అన్న పదం వర్ణ్యవిషయంలో వాచ్యంగానూ, అర్థాంతరన్యాసంలో రూఢమైన లక్షణతోనూ అన్వయించటం.
7. క్షితి పదాన్ని– విశేష్యాన్ని — సాభిప్రాయంగా ప్రయోగించి పరికరాంకురాలంకారాన్నీ సాధించటం.
8. అచేతనాలలో చేతనత్వాన్ని ఆరోపించి వక్రోక్త్యలంకారాన్ని ప్రదర్శించటం.
9. ఘనాభ్యుదయంబు అంటూ ఘనశబ్దంపై శ్లేష
10. క్రమ, అర్థాంతరన్యాస పరికరాంకుర వక్రోక్తి, శ్లేష అలంకారాల సంసృష్టి

ఈ నూతనత్వాన్ని సాధించటం కవులకు కత్తిమీద సాము. కవితా సామగ్రి మొత్తం అయిపోయింది 19 వ శతాబ్దికి వచ్చేటికి. ప్రతిభావంతులకన్న వ్యుత్పన్నుల సంఖ్య ఎక్కువైంది. ఆ పరిణామాలే 19 వ శతాబ్దంలో కనిపించాయి. ఈ శతాబ్దంలో వెలువడిన ప్రబంధాల పట్టిక:

మంగళగిరి ఆనందకవి 1760-1820 వేదాంత రసాయనము
కనుపర్తి అబ్బయామాత్యుడు 1770-1840 అనిరుద్ధచరిత్ర, కవిరాజమనోరంజనం
దిట్టకవి నారాయణకవి 1780-1820 రంగరాయచరిత్ర
ముద్దుపళని 1790-1830 రాధికాసాంత్వనము
తరిగొండ వెంకమాంబ 1840-1980 ద్విపదభాగవతము, వేంకటాచల మాహాత్మ్యము, రాజయోగసారము
పిండిప్రోలు లక్ష్మణకవి 1840-1900 లంకావిజయము
శిష్టు కృష్ణమూర్తి 1840-1906 సర్వకామదాపరిణయము
మాడభూషి వేంకటాచార్యులు 1840-1910 భరతాభ్యుదయము
గోపినాథుని వేంకటకవి 1861-1980 వాల్మీకిరామాయణము, శిశుపాలవధ, భగవద్గీత
మండపాక పార్వతీశ్వరశాస్త్రి 1870-1918 అనేక శతకములు, మాలికలు
త్యాగరాజ మొదలి 1830-1880 సుబ్రహ్మణ్యవిజయము, విద్వత్కర్ణామృతము, ఛందోరత్నాకరము
చెళ్ళపిళ్ళ నరసకవి 1850-1900 యామినీపూర్ణతిలక విలాసము
కోలా శేషాచలకవి 1840-1900 నీలగిరి యాత్ర
అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి 1831-1892 శేషధర్మములు, మణిధ్వజచరిత్రము, చాటుధారాచమత్కారసారము

వీరేశలింగానికి ఇటూ… అటూ

ఈ శతాబ్దంలో ప్రారంభమై ఇప్పటికీ అప్రతిహతంగా సాగుతున్న ఒకానొక కవితాప్రక్రియ శతకం. బద్దెన సుమతి శతకం, సోమనాథుని వృషాధిపశతకం, నృసింహకవి కృష్ణశతకం, భాస్కరశతకం, దాశరథిశతకం అందరూ ఎరిగినవే.

19 వ శతాబ్దంలో శతకాలు చాలా వచ్చాయి. కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం, గోగులపాటి కూర్మనాథకవి సింహాద్రి నారసింహ శతకం బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. వీటిలోని వ్యాజస్తుతి లక్షణం వీటికి ఆ వైభవాన్ని తెచ్చిపెట్టింది. దాసు శ్రీరాములు రచించిన చక్కట్లదండ శతకం అచ్చతెనుగు శతకం. ఆ తరువాత 20, 21 వ శతాబ్దాలలో శతక రచన కుంభవృష్టి స్థాయికి చేరింది. కుప్పలుగా శతకాలు వ్రాసేవారి సంఖ్య ఎక్కువైంది. (19 వ శతాబ్దిలోని సాహిత్య స్వరూప వికాసాలను యండమూరి సత్యనారాయణరావు రచించిన ‘ఉషఃకిరణాలు’ అన్న సాహిత్య అకాడమీ బహుమతి పొందిన విమర్శ గ్రంథంలో చూడవచ్చు.) 1838 లో ఏనుగుల వీరాస్వామయ్య ప్రకటించిన ‘కాశీయాత్రాచరిత్ర’ ఒక విలక్షణ వచన గ్రంథం. యాత్రాచరిత్ర ఇందలి విషయం.

పందొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్థం నుండీ తెలుగు సాహిత్యం సరియైన మలుపు తిరిగింది. అది అనివార్యమై కావచ్చు. అత్మాభిమాన రూపమైనా కావచ్చు. ‘నాయకరాజుల యుగం’ తరువాత రాజాశ్రయంతోనే కవులు జీవించటమన్నది దాదాపు అంతరించింది. దేశంలోని వివిధ సంస్థానాలు సాహిత్యసేవ చేసినా, కవులందరూ సంస్థానాధిపతులను ఆశ్రయించినవారు కారు, స్వతంత్రంగా కవితానిర్మాణాన్ని చేతబట్టినవారే. మరో ప్రత్యేకత కూడా ఉన్నది. కవిత్వాన్ని వృత్తిగా స్వీకరించినవారూ చాలా తక్కువే. ప్రవృత్తిగా మాత్రమే కవితను ఆశ్రయించినవారే ఎక్కువ. కవుల దృక్పథమూ చాలావరకు మారినది.

విమలయశోనిధీ! పురుషవృత్త మెఱుంగుచునుండుఁ
జూవె వేదములను బంచభూతములు ధర్మువు సంధ్యలు…

అన్న నన్నయవాణిని కొంత సవరించుకొని తామూ ఆ పురుషవృత్తాలకు ద్రష్టలమేననీ, అవసరమైన చోట వాటిని పరిష్కరించటమో, సంస్కరించటమో చేయవలసిన కర్తవ్యం తమ మీదా ఉన్నదనీ గ్రహించగలిగారు. అట్టివారిలో ప్రథముడూ, ప్రముఖుడూ కందుకూరి వీరేశలింగం. వీరేశలింగానికి ముందే చిన్నయసూరి నీతిచంద్రికనూ, బాలవ్యాకరణాన్ని వ్రాసి సాహిత్యాన్ని ప్రభావితం చేసినా, సాహిత్యాన్ని ప్రధానంగా సమాజంతో ముడిపెట్టిన ఖ్యాతి వీరేశలింగానిదే.

తొలుత ప్రాచీన ధోరణిలోనే ‘శుద్ధాంధ్రనిరోష్ఠ్య నిర్వచన నైషధం’ వంటి రచనలతో సాముగరిడీలపై మోజుపడినా, ఆ తర్వాత వాస్తవాన్ని గుర్తించి ‘సరస్వతీ నారదవిలాపం’ వంటి కృతులను వెలువరించినవాడు. ఆపై అనేక సాహితీ సంప్రదాయాలకూ, సమాజ సంస్కరణలూ తానే ఆద్యుడయ్యాడు. పత్రికలు స్థాపించాడు. ప్రహసనాలు రచించాడు. నవలలు వ్రాశాడు. వితంతు వివాహాలు జరిపించాడు. ప్రత్యర్థులతో ఘర్షణలు పడ్డాడు. అనుచరులే వ్యతిరేకించినా హితమని భావించిన దానిని ఆచరించి చూపాడు. గ్రాంథిక, వ్యావహారిక భాషావివాదాలు చెలరేగుతున్నా, తన ప్రహసనాల్లో తాను వ్యావహారికం వైపే మొగ్గుచూపాడు.

ప్రాచీన ధోరణిలోనే కావ్యాలనూ, అనువాదాలనూ, శతకాలనూ, ప్రభువుల వైభవాన్నీ నిర్మిస్తున్నవాళ్ళున్నా, వారి సరసనే నూతన భావాలూ, సంఘసంస్కరణలూ లక్ష్యంగా చాలా రచనలు వచ్చాయి. చాలామంది కృషి చేశారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం, పానుగంటి లక్ష్మీనరసింహారావు వంటివారు సంస్కరణ బాట పట్టారు. మాడభూషి వంటి వారు అవధానాల వైపు మొగ్గారు. వేదం వేంకటరాయశాస్త్రి వంటి వారు బహుముఖప్రజ్ఞులై వరివస్యను అందించటంతో పాటు ‘ప్రతాపరుద్రీయం’ వంటి నాటకాలతో సహృదయుల నలరించారు. ఇక ‘కన్యాశుల్కం’ గురించి, గురజాడ గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీపాద కృష్ణమూర్తి భారత భాగవత రామాయణాలను తానొక్కడే అనుసృజన చేసి చూపాడు. దాసు శ్రీరాములు దేవీభాగవతాన్ని అనువదించాడు. వీరి ‘తెలుగునాడు’ ఒక విలక్షణ గ్రంథం. గిడుగు రామమూర్తి వ్యావహారికోద్యమాన్ని నడిపించాడు. నిఘంటు నిర్మాణాలూ అప్పుడే ప్రారంభమయ్యాయి. అముద్రిత గ్రంథచింతామణి, విజ్ఞానసర్వస్వాలూ అప్పుడే మొదలయ్యాయి. కథానికా రచన కూడా గురజాడతో మొదలైంది. ఆ తరువాత అది విరివిగా పెరిగింది. ఇరవయ్యవ శతాబ్దపు పూర్వార్ధంలోనే తెలుగులో పత్రికలూ ప్రారంభించబడ్డాయి.

‘కవిత్వతత్త్వవిచారం’ విమర్శను మలుపు త్రిప్పినట్లే కట్టమంచి రామలింగారెడ్డి ‘ముసలమ్మ మరణం’ కవితను కూడా ఒక మలుపు నిచ్చింది. రాయప్రోలు ఖండ కావ్యాలూ, గురజాడ ముత్యాల సరాలూ వస్తుఛందోనవ్యతలను ప్రోది చేశాయి. ఆ నవ్యతను మరోమలుపు త్రిప్పి ఆత్మాశ్రయకవితా ధోరణిని అవిష్కరించి దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు వంటివారు ముందు కురికారు. ఊహప్రేయసిని తలచుకుంటూ వ్రాసిన కవితలతో పాటు దేశ రాష్ట్రభక్తి కవిత్వం ప్రకృతి ప్రణయ కవిత్వం కూడా విపరీతంగానే పెల్లుబికింది. గురజాడ, రాయప్రోలు, విశ్వనాథ వీరంతా ఆ రథాలకు సారథులే. ఎవరినో ఒకరిని ముందు నిలపకపోతే, తోచనివాళ్ళు యుగకర్త గురజాడా? రాయప్రోలా? అని చర్చలూ చేశారు. అటు కొందరూ, ఇటు కొందరూ మద్దతుగా నిలిచారు. రాయప్రోలు ప్రతిపాదించిన ‘అమలిన శృంగార’మన్నది తరువాతి కవులకు ఉత్ప్రేరకమై భావకవితోద్యమాన్ని ప్రతిష్ఠించింది. వీరేశలింగం సంఘసంస్కరణం, గురజాడ దేశమానవ ప్రేమ, రాయప్రోలు అమలిన శృంగారం అనంతరకాల సాహితీ తత్త్వాన్ని నిర్దేశించాయి.

మనమూ-మనకు ముందూ!

భావకవిత్వమిలా శాఖోపశాఖలై కొంత ప్రాచీనతా, కొంత సవీనత, కొంత ప్రౌఢిమా, కొంత లాలిత్యం- ఇలా ఆయా కవులు భావకవితాప్రక్రియను స్వీకరించినా, స్వీయకవితా ధోరణిని విడనాడకుండా ముందుకు నడిచారు. సాంప్రదాయక మార్గంలో కాక నవీన మార్గంలో వస్తు నిర్వహణలతో ఖండకావ్య రచన ఈ కాలపు ప్రత్యేక లక్షణం. నాటక రచనలూ, ప్రదర్శనలూ, అవధాన విద్యా ప్రదర్శనలూ, ఘర్షణలూ కూడా ఈ కాలంలో చోటు చేసుకున్నాయి. ఛందోరీతులతో పాటు గేయకవితా రీతులూ ఈ కాలంలోనే పొడసూపాయి. కిన్నెరసాని పాటలు, ఎంకిపాటలు, బసవరాజు గీతాలు. భక్తికవిత్వం మాత్రం అన్ని కాలాలలోనూ ఇతర ప్రక్రియలతో సమాంతరంగా సాగుతూనే ఉండేది. ఇప్పటికీ అది అలా కొనసాగుతూనే ఉంది. 20వ శతాబ్దపు తొలి మూడు దశాబ్దాల వరకు ఈ ధోరణి వెలుగొందింది క్రమక్రమంగా పలచబడుతూ.

ఇక్కడొక విషయం గుర్తించాలి మనం. ఆధునిక కాలంలో ఏ ప్రక్రియను గురించి మాట్లాడినా, అది ఆ కాలంలో ప్రచారాన్ని పొంది, వ్యాపించినది అనే అర్థం కానీ, ఇతర ప్రక్రియలు అసలు లేవని కాదు. నోరు కలవాడిదే ఊరు — కాబట్టి ఏదో యొక ప్రక్రియ మిగతావాటిని త్రోసిరాజని బహుళప్రచారంలోనికి వచ్చిందని మాత్రమే అర్థం. ఎందుకంటే పత్రికలు మొదలయిన ప్రసారమాధ్యమాలు అందుబాటులోనికి వచ్చినది ఈ కాలం నుండియే.

భావకవిత్వం మసకబారుతున్న సమయంలో స్వేచ్ఛావాదులూ లేదా తిరుగుబాటుదారులైన పఠాభి, శిష్ట్లా ఉమామహేశ్వరరావు, శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), నారాయణబాబు మొదలైన కవులు సాహిత్యాన్ని భూమార్గం పట్టించారు. ఊహలోకంలోని భావకవిత్వాన్ని కాదని వాస్తవికతను ఆదరించారు. అది తర్వాత అధివాస్తవికత అయింది. ఆ తరువాత పాతదంతా పోతేగానీ క్రొత్తది రాదన్న విధ్వంసవాదం మొదలైంది. వాస్తవికత వస్తువునకూ, వ్యక్తీకరణకూ సంబంధించినవైతే అవాస్తవికత, విధ్వంసకత వ్యక్తీకరణకు సంబంధించినవయ్యాయి. ఈకాలంనుండి ప్రతి అంశాన్ని మార్క్సిజం కళ్ళతో చూడటం అలవాటైంది. అందరికీ కాదనుకోండి. మార్క్స్ దృక్పథం మంచిదే. అయితే అది వాల్మీకిలో ఉన్నదా లేదా అన్నది నిరర్థకం. అయినా అటువంటి ఆలోచనలే సాగాయి.

ఇంతలో అదో రకమైన దృష్టితో సమాజాన్ని చూస్తూ దిగంబరకవిత్వం మొదలైంది. మఖ రాలే మునుపే మందగించింది. ఇంతలో దళితవాద కవిత్వం,మరికాసేపట్లో స్త్రీవాద కవిత్వం, అంతలోనే ముస్లిం మైనారిటీవాద కవిత్వం, ఈ వాదాలలోని కవిత్వమంతా శక్తిమంతమైన కవిత్వమే. ఎవరికి వారు తమ గళాన్ని గట్టిగా, దృఢంగా వినిపించినవారే, అంతలోనే అనాదిగా వున్నా, అప్పుడే పేరు పెట్టుకొన్న అనుభూతివాదం కూడా కొద్ది రోజులు కొనసాగింది.

ఈ సందర్భంగా సాహితీపరులు మరొక విషయాన్ని గుర్తించాలి. పైన మన మనుకున్న వివిధ వాదాలకు చెందిన సాహిత్యంతో పాటు సాహిత్యంలోని ఇతర ప్రక్రియలన్నీ కొనసాగుతునే వచ్చాయి. ఏ ప్రక్రియా ఆగిపోలేదు. ఏ వాదమూ అన్ని ప్రక్రియలను శాసించలేదు. లేకుండా చేయలేదు కూడా. కాకపోతే ప్రచారసాధనాలు, ప్రసారమాధ్యమాలూ వాటివాటికి అనుగుణంగా ఉండటంతో అదే ఆనాటి సాహిత్యస్వరూపం అన్నంతగా భావింపబడ్డాయి ఆయా మాధ్యమాల్లో. ఆయా వాదాలు ప్రధానంగా సాహితీప్రక్రియలలో చాలా వెలియటాన్ని కూడా అక్కడక్కడ కాదనలేం. కానీ పూర్తిగా కాదు. ఆయా వాదాలతో సంబంధం లేకుండా ప్రబంధాలూ, ఖండకావ్యాలూ, నవలలూ, కథలు, కథానికలూ, వచన కవితలు, గేయ కవితలు వగైరాలన్ని కూడా సాగుతూనే ఉండేవి.

దాదాపు 1969 నుండీ తెలంగాణవాదం ఒక కవితావస్తువే అయింది. పాక్షికంగా, ఈ వాదాలన్ని సాగుతున్న వేళల్లోనే వీటితో సంబంధం లేని రచనలు ‘రామాయణ కల్పవృక్షం, విశ్వంభర, పాకుడురాళ్ళు’ జ్ఞానపీఠ్ బహుమతిని పొందాయి. ఒకటి మహాకావ్యం, ఒకటి వచనకావ్యం, ఒకటి నవల. ఒక కృష్ణపక్షం, ఒక మహాప్రస్థానం, ఒక రుద్రవీణ, ఒక అమృతం కురిసిన రాత్రి, ఒక త్వమేవాహం (వగైరాలు) మైలురాళ్ళుగా వెలిసి, విలిచాయి.

దిన, వార, మాసపత్రికలలో కథా, నవలా సాహిత్యం ఏరులై పారింది. విశేషించి రచయిత్రులు ఈ రంగంలో అగ్రస్థానంలో నిలిచారు. మధ్య తరగతి కథలు నవలలకు ఇతివృత్తాలై అన్ని తరగతులవారినీ, విశేషించి మధ్యతరగతివారినీ ఆకర్షించాయి. ‘భారతి’ వంటి పత్రికలు అన్ని వాదాలనూ అక్కున చేర్చుకొన్నాయి.

‘అధునిక కవిత్వం’ అలా పొంగి పొంగి పొంగి పొర్లకుండానే పాత్ర అడుగుకు పోయింది. మరింత నూతనత్వాన్ని భావించి వ్రాసే కవితలకు ఏం పేరు పెట్టాలో తెలియలేదు. ఆధునికానంతరకాల కవిత్వమన్నారు. రేపటి కవిత్వానికి ఈనాడు పేరు పెట్టే హక్కు ఈనాటివారికి ఉండదు అని ఆలోచించలేదు. ప్రక్రియలోని కొంత నూతనత్వానికి కాలంతో ముడిపెట్టినందువల్ల వచ్చిన ఇబ్బంది ఇది.


ఆ వైభవమూ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. వర్తమానంలో ఆంధ్ర సాహిత్యం ‘సర్వతోముఖ’మై కొనసాగుతోంది. సాంకేతికత సునామీలా విరుచుకపడి ప్రసారమాధ్యమాలైన పత్రికలనూ, దృశ్య శ్రవ్య మాధ్యమాలనూ తీవ్రంగా దెబ్బ తీసింది. ఇప్పుడవి కొన ఊపిరితో ఉన్నాయి. కాబట్టి కవులకూ, కవితాప్రక్రియలకూ అవి ఆశ్రయ మివ్వలేవు.

అయితే, జారిపడేవారికి మంచి పట్టు దొరికినట్టు ‘సోషల్ మీడియా’ ఇప్పుడు సాహిత్యానికీ ఆలంబనమైంది. ఇప్పుడు యుగాలూ లేవు, యుగకర్తలూ లేరు. తనకు తానే కవి, తనకు తానే ప్రచారకుడూ. ప్రాచీనకాలం నుండీ ఇప్పటి దాకా పొడసూపిన అన్ని ప్రక్రియలూ ఈనాడు ఉన్నాయి. యుగకర్తల స్థానంలోనికి బృంద నాయకులు వచ్చారు. అయితే వారూ నిమిత్తమాత్రులే.

ఇప్పుడు ‘ప్రమోట్’ చేసుకోవటం చేతకావటమే కవితాప్రక్రియ. దానిలో అరితేరినవాడే కవి, మహాకవీ, పండితుడూ, మహాపండితుడూ; వాడే నిలుస్తాడు. ఇతరులు కాలపు పొరలలో ఏ అంచునకో అతుక్కొని అంటిపెట్టుకొని ఉంటారు.

అయితే ఇది ఈనాటిది కాదు. కాళిదాసు కూడా “పురాణమిత్యేవ న సాధు సర్వం…” అన్నాడు. కాలమెప్పుడైనా ఒకటే. బాహ్యరూపంలోనే తేడా.