కీబోర్డ్ మీద రాగాలు

[ఈ వ్యాసంలో పాటలు వినడానికి అడోబీ ఫ్లాష్ ప్లేయర్ (Adobe Flash Player) అవసరం. మీకు ఈ వ్యాసంలో పాటలకు కుడివైపున play బటన్ బొమ్మ కనిపించకపోతే, అడోబీ వారి డౌన్‌లోడ్ సెంటర్ నుండి ఫ్లాష్ ప్లేయర్ పొందవలసిందిగా మనవి. – సంపాదకులు.]

కంప్యూటర్ కీబోర్డు మీద వావీవరస లేకుండా టైప్ చేసినట్టయితే మహాకావ్యం తయారవుతుందా? అవదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సంగీతం కీబోర్డు మీద అయితే ఏదైనా రాగం పలుకుతుందా? చాలామంది నమ్మకపోవచ్చుగాని పలుకుతుంది. నిజానికి అన్నీ తెల్లనివో, నల్లనివో వాయిస్తే రాగం పలకకపోవడమే అరుదు. అతి ప్రాథమిక స్థాయిలో సంగీతం వాయించదలుచుకున్నవాళ్ళ కోసమే ఈ వ్యాసం.

చాలామందికి కీబోర్డు మీదున్న నలుపు తెలుపు మెట్లని చూడగానే కొంత కంగారు పుడుతుంది. ఇన్ని వాడే బదులుగా అన్నీ ఒకే రకమైనవి “ఏడవొచ్చుగా?” అన్నవాళ్ళున్నారు. వీటిని కలగా పులగంగా వాయించకుండా అన్నీ నల్లనివో, లేదా అన్నీ తెల్లనివో మాత్రమే వాయిస్తే ఏమవుతుంది? అలా వాయించినా కూడా కొన్ని రాగాలు పలుకుతాయి. ఏది నొక్కాలి అని తడుముకోకుండా ఒకే రంగు మెట్లని వరసగా వాయించి వాటిని వినిపించవచ్చు.

సంగీతంతో కుస్తీ అనే వ్యాసంలో కీబోర్డు వివరాలు కనబడతాయి. కీబోర్డులోని స్వరాలు పన్నెండు. ఏ మెట్టు నుంచి మొదలుపెట్టి క్రమంగా ఎడమ నుంచి కుడి వేపుకు (నలుపు తెలుపు భేదం పాటించకుండా) అన్ని మెట్లూ వరసగా వాయించినప్పుడు ఇవి మోగుతాయి. స, రి1, రి2, గ1, గ2, మ1, మ2, ప, ద1, ద2, ని1, ని2 అనే ఈ స్వరాలకు మనవాళ్ళు శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం అంటూ పేర్లు పెట్టారుగాని ప్రస్తుతానికి ఈ నంబర్ల వ్యవహారమే మేలు.

ఇవి కాక స్వరాల పేర్లతో సంబంధం లేకుండా శ్రుతులు (ఒకటి, ఒకటిన్నర వగైరా) ఏమిటో మొదటి పటంలో చూడవచ్చు. వీటినే పాశ్చాత్యులు సీ(C), సీ షార్ప్(C#) వగైరా పేర్లతో పిలుస్తారు.


పటం 1

ఇక స్వరాల సంగతి వదిలేసి అన్నీ నల్లమెట్లే మోగిస్తే ఏమవుతుందో చూద్దాం. వీటిలో ప్రతిఒక్క స్వరం నుంచి ఒక్కొక్క రాగం వస్తుంది. నల్లవి అయిదే కనక (ఒకే పేటర్న్ రిపీట్ అవుతుందని గమనించాలి) ఇవన్నీ ఔడవ ఔడవ రాగాలు. అంటే అయిదేసి స్వరాలే ఉన్నటువంటివి.

సామాన్యంగా కీబోర్డు మీద ఎడమ కొస నుంచి సి(C) అనే శ్రుతితో మొదలవుతుంది. దాని పక్కనుండేది సీ షార్ప్ అనే నల్లమెట్టు. దాన్ని ఆధారశ్రుతిగా (అంటే స) భావించి అన్నీ నల్లమెట్లే వాయిస్తే శుద్ధసావేరి రాగం మోగుతుంది. (ఇక ముందు చెప్పబోయే అభ్యాసాలలో స అనుకున్న స్వరాన్ని పదేపదే మోగించి మననం చేసుకోవడం అవసరం. శ్రుతులను త్వరగా మార్చేస్తే ఏం వాయిస్తున్నామో అర్థంకాదు. అందుచేత కింద చెప్పిన ఒక్కొక్క వరసనీ చాలాసేపు వాయించి వినాలి)


“పాడనా తెనుగుపాట”
“కుమరేశ్, గణేశ్ వాయించిన వయొలిన్ కీర్తన”

శుద్ధసావేరి రాగంలోని “పాడనా తెనుగుపాట” అనేది అందరికీ తెలిసినదే. (ఇది కూడా ఒకటిన్నర శ్రుతిలోనే ఉండడం కేవలం యాదృచ్ఛికం). ఇదే రాగంలో కుమరేశ్, గణేశ్ వాయించిన వయొలిన్ కీర్తన మరొక శ్రుతిలో ఉంది. కొంత సాధన చేస్తే కేవలం ఈ నల్లమెట్లనే ఉపయోగించి ఈ పాటను పూర్తిగా వాయించవచ్చని ఆచరణ ద్వారా తెలుస్తుంది. కొంత అల్పసంతోషం పరవాలేదనుకుంటే ఈ పద్ధతిలో ఎవరైనా శుద్ధసావేరి రాగం (కనీసం దాని స్వరాలు) పలికించెయ్యగలరు. అవి స రి2 మ1 ప ద2 స. వివరాలు రెండో పటంలో ఉన్నాయి. ఇటువంటి ఎక్సర్ సైజులు చేసేవారు శ్రుతిలో గొంతెత్తి పాడుకోగలిగితే మరీ మంచిది. అలా చెయ్యనివారు తాము వాయిస్తున్నదాన్ని మరింత శ్రద్ధగా వినాలి.


పటం 2

ఇప్పుడు దీన్ని వదిలేసి మరొక శ్రుతికి వెళదాం. మొదటి విడత అయిన కాసేపటికి దీని మొదలుపెట్టడం మంచిది. కింద చెప్పిన ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రత్యేక అంశమని గుర్తుంచుకోవాలి.


“ఏడు కొండలసామి”
//eemaata.com/Audio/sep2007/lalgudi“ఎంత నేర్చినా”

రెండున్నర శ్రుతి, లేక డి షార్ప్(D#) షడ్జమంగా అనుకుంటే మూడో పటంలో చూపినట్టుగా శుద్ధ ధన్యాసి స్వరాలు పలుకుతాయి. (దీన్నే ఉదయరవిచంద్రిక అని కూడా అంటారు) ఇందులో ఏడు కొండలసామి అనే పాట మనకు తెలిసినదే. అలాగే లాల్గుడి జయరామన్ వాయించిన ఎంత నేర్చిన అనే త్యాగరాజ కీర్తన కూడా ఉంది. స్వరాలు స గ1 మ1 ప ని1 స.


పటం 3


“తెల్లవారవచ్చె”
//eemaata.com/Audio/sep2007/ramani“నిన్ను కోరి (వర్ణం)”

తరవాతిది ఎఫ్ షార్ప్ (నాలుగున్నర) శ్రుతిలో మొదలవుతుంది (నాలుగో పటం). ఇందులో వరసగా నల్లమెట్లు వాయిస్తే మోహన రాగం మోగుతుంది. స రి2 గ2 ప ద2 స అనే స్వరాలున్న వరవీణా అనే గీతం అందరికీ తెలిసినదే. ఇందుకు ఉదాహరణలుగా “తెల్లవారవచ్చె” అనే సినీగీతం, రమణి వాయించిన “నిన్ను కోరి” అనే వర్ణం వినవచ్చు.


పటం 4


“సీతారాముల కల్యాణము”
“అలకలల్ల”

ఇక కుడివేపుగా మరొక నల్లమెట్టుకు జరిగి అయిదున్నర శ్రుతిగా జి షార్ప్ షడ్జమంగా ఉపయోగించి అన్నీ నల్లమెట్లే వాయిస్తే అయిదో పటంలో చూపినట్టుగా మధ్యమావతి వినవచ్చు. స రి2 మ1 ప ని1 స అనే స్వరాలు కలిగిన ఈ రాగంలో “సీతారాముల కల్యాణము” అనే పాటనూ, ఎ.ఎస్. గణేశన్ జలతరంగం మీద వినిపించిన “అలకలల్ల” అనే కీర్తననూ వినవచ్చు.


పటం 5


“పగలే వెన్నెలా”
“సామజవరగమనా”

నల్లమెట్లలో ఇక మిగిలినది ఆరున్నర లేక ఏ షార్ప్ ఒక్కటే. దీని నుంచి మొదలుపెట్టి వాయిస్తే స గ1 మ1 ద1 ని1 అనే స్వరాలతో హిందోళం పలుకుతుంది (ఆరో పటం). “పగలే వెన్నెలా” అనే పాటనూ, రాజరత్నం పిళ్ళై వాయించిన “సామజవరగమనా” అనే కీర్తననూ ఉదాహరణలుగా చెప్పవచ్చు.


పటం 6

ఈ పద్ధతిలో వీటన్నిటినీ వాయించడంవల్ల ఉపయోగమేమిటని అడగవచ్చు. ఇందులో అపస్వరం పలికే అవకాశం తక్కువ. పది సార్లు ప్రయత్నిస్తే వీటిలోంచి మీకు తెలిసిన పాటలోని వరస మోగే అవకాశం కూడా ఉంది. పైన చెప్పినవన్నీ ఒకే సారిగా కాకుండా ఒకే రాగాన్ని కాసేపు వాయిస్తే దాని స్వరూపం పట్టుబడుతుందని ఆశించవచ్చు.

ఇదే పద్ధతిలో తెల్లమెట్లను మాత్రమే వరసగా వాయించినప్పుడు కూడా కొన్ని రాగాలొస్తాయి. ఇవన్నీ మేళకర్త (సంపూర్ణ) రాగాలు. అంటే అన్నిటిలోనూ సరిగమపదనిసలన్నీ తప్పనిసరిగా ఉంటాయి.


“శంకరాభరణము”
“స్వరరాగసుధా”

ముందుగా సి, లేక ఒకటో శ్రుతి ఆధారంగా అన్నీ తెల్లమెట్లే వాయిస్తే శంకరాభరణం రాగం వస్తుంది. ఏడో పటంలో చూపినట్టుగా స రి2 గ2 మ1 ప ద2 ని2 స్వరాలతో వినబడే “శంకరాభరణము” అనే సినీగీతం, సూర్యనారాయణ వాయించిన “స్వరరాగసుధా” అనే కీర్తనా ఇందుకు ఉదాహరణలు.


పటం 7


“బాలనురా మదనా”
“గణపతియే”

ఇప్పుడు రెండు లేక డి మెట్టును శ్రుతిగా ఉపయోగిస్తే ఖరహరప్రియ స్వరాలు స రి2 గ1 మ1 ప ద2 ని1 అనేవి వినవచ్చు. “బాలనురా మదనా” అనే పాటా, యు. శ్రీనివాస్ వాయించిన “గణపతియే” అనే కీర్తనా దీనికి ఉదాహరణలు.


పటం 8


“హనుమతోడి” గురించి డా. నూకల
“సంసారం”

మూడో శ్రుతి ఇ నుంచి మొదలుపెడితే హనుమతోడి వినిపిస్తుంది (తొమ్మిదో పటం). స రి1 గ1 మ 1 ప ద1 ని1 స్వరాలతో ఈ రాగలక్షణాలని డా. నూకల వివరించారు. ఈ స్వరాలు ప్రధానంగా సింధుభైరవి రాగంలో వినిపిస్తాయి కనక అందుకు ఉదాహరణగా “సంసారం” సినిమా పాట తీసుకోవచ్చు.


పటం 9


“విప్రనారాయణ” సినిమా పాట
ద్వారంవారి కల్యాణి ఆలాపన

ఇక పదో పటంలో చూపినట్టుగా ఎఫ్ మెట్టును శ్రుతిగా ఉపయోగిస్తే కల్యాణి స్వరాలు స రి2 గ2 మ2 ప ద2 ని2 అనేవి వస్తాయి. ఉదాహరణలుగా ఈ రాగంలో విప్రనారాయణ సినిమా పాటనూ, ద్వారంవారి కల్యాణి ఆలాపననూ వినవచ్చు.


పటం 10


“రాగాలాపన”
“కుంతీకుమారి”

అయిదు శ్రుతిలో వాయిస్తే పదకొండో పటంలోని స రి2 గ2 మ1 ప ద2 ని1 స్వరాలు వినిపిస్తాయి. ఇవి హరికాంభోజి స్వరాలు. ఘంటసాల “కుంతీకుమారి” మొదటి పద్యంలో ఇవే స్వరాలు వినిపిస్తాయి. ఇదే రాగంలో మణి కృష్ణస్వామి “రాగాలాపన” వినవచ్చు.


పటం 11


“మధురమైన జీవితాల”
అష్టపది “యామిహే”

చివరగా ఆరు శ్రుతిని ఉపయోగిస్తే (పన్నెండో పటం) నఠభైరవి రాగం వినిపిస్తుంది. స రి2 గ1 మ1 ప ద1 ని1 ఈ స్వరాలు “మధురమైన జీవితాల” అనే సినీగీతంలోనూ, బాలమురళి అష్టపది “యామిహే” లోనూ వినిపిస్తాయి.


పటం 12

మొత్తం 12 స్వరాల్లో దేనితో మొదలుపెట్టి (అన్నీ ఒకే రంగు మెట్లు) వాయించినా 11 సందర్భాల్లో ఏదో ఒక రాగం వస్తుందన్నమాట. అయితే వీటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్క శ్రుతిలో మొదలవుతాయి కనక వెంట పాడుకోవడం సులువుగా వీలు కాకపోవచ్చు. ఈ వ్యాసం ముఖ్యంగా కీబోర్డ్ సులువుగా వాయించటం చేతగానివారి కోసమే. చేతులకు కాస్త పని తగ్గితే వినబడే స్వరాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వీలవుతుంది. (తెలుగు సినిమా పాటల రాగాల గురించి తెలుసుకోగోరేవారు శ్రీనివాస్ పరుచూరి తదితరులు తయారు చేసిన జాబితాను రామకృష్ణ సంకా వెబ్ సైట్ లో చూడచ్చు.)

  • కీబోర్డ్ మీద రాగాలు అన్నది చదవగానే ఎలక్ట్రానిక్ కీబోర్డ్లు భారతీయ సంగీతానికి పనికిరావని భావించేవారికి ఒక మాట: ఈ వ్యాసం సంగీతానికి సులభపరిచయం మాత్రమే. ఇది చదివినవారికి సంగీతం వచ్చేస్తుందని పొరపాటున కూడా ఎవరూ అనుకోరాదు.
  • రెండోది. రాగం అంటే కేవలం స్వరాల కూర్పు కాదు. అందులో మరెన్నో విశేషాలుంటాయి. అయితే రాగస్వరూపాన్ని గుర్తించడానికి స్వరాలను పోల్చుకోవడం ఒక సులభపద్ధతి మాత్రమే.
  • మూడోది. పెద్ద పెద్ద హిందూస్తానీ గాయకులందరికీ కీబోర్డు సంగతీ, భారతీయ సంగీతంలోని సున్నితమైన స్వరభేదాలను పలికించగలగడంలో దానికున్న పరిమితులూ తెలియనివి కావు. అయినప్పటికీ తమ కచేరీల్లో హార్మోనియమే పక్కవాద్యంగా ఉండాలని వారంతా భావించారు కనక శాస్త్రీయ సంగీతం విషయంలో కీబోర్డుకు కొందరనుకున్నంత అంటరానితనమేమీ లేదు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...