రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం

రచన: వి. సిమ్మన్న
జులై 2000

ఒకనాడు తెలుగునాట ప్రతి తల్లీ తన చిన్నారి ముద్దుబిడ్డ అన్నం తినడానికి మారాం చేస్తుంటే ఆ బుజ్జిని చంకలో వేసుకుని ఆరుబయటికి వచ్చి చంద్రుణ్ణి చూపించి
“చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే కోటిపూలు తేవే
బండెక్కి రావే బంతిపూలు తేవే
వెండి గిన్నెలో వేడిబువ్వ తేవే
అన్నిటినీ తెచ్చి మా పాపాయి కివ్వవే”
అని పాడుతూ అన్నం తినిపించే మధుర సన్నివేశం ప్రతి ఇంటా నేత్రానందాన్ని, హృదయానందాన్ని కలిగించేది. అయితే అంత చక్కటి పాటను రాసింది తాళ్ళపాక అన్నమాచార్యులని ఎవరికి తెలుసు? పాట ప్రజల్లోకి వెళ్ళినంతగా కవి వెళ్ళలేదు. అయినా పాట బతికిందీ అంటే కవి బతికినట్లే లెక్క.

పసిపిల్లల్ని ఉయ్యాలతొట్టెలోనో, కాళ్ళమీదనో పడుకోబెట్టి పాడే ఈ కింది జోలపాట కూడా అన్నమాచార్యులదే
“జో అచ్యుతానంద జోజో ముకుంద
లాలి పరమానంద లాలి గోవింద”

ఈ విధంగా ప్రజల నాల్కలపై నాట్యమాడే విధంగా, ప్రజలు పాడుకుని పరవశించటానికి అనువుగా, నిరక్షరాస్యుల్ని గాయకుల్ని చేసే విధంగా, జానపద కళారీతుల్ని ప్రతిబింబించేలా కీర్తనలు రాసి ప్రజాకవి అయ్యాడు అన్నమయ్య.

తాళ్ళపాక అన్నమాచార్యులు కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. 1408లో జన్మించిన అన్నమయ్య తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు మనకు తెలిసినంతవరకు. పదహారో ఏటనే వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొందిన “పదకవితాపితామహుడు”. అన్నమయ్య మొత్తం 32వేల సంకీర్తనలు రాసాడని తెలుస్తున్నా 12 వేలు మాత్రమే దొరికాయి.
“హరి యవతారమీతడు అన్నమయ్య
ఆకసపు విష్ణుపాదమందు నిత్యమై ఉన్నవాడు
భావింప శ్రీవేంకటేశు పాదములందె వున్నవాడు”
అని అన్నమయ్యను అతని పుత్రపౌత్రులు కీర్తించడంలో అతిశయోక్తిలేదు.

“ఏ వేల్పు సర్వేశ్వరుడే వేల్పు పరమేశు
డే వేల్పు … ఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రి విభుడు”
అంటూ తన్మయత్వంతో తనివి తీరా తెలుగు వారి ఇలవేల్పు అయిన వేంకటేశ్వరస్వామి దివ్యమంగళ స్వరూపాన్ని నోరారా వర్ణించిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ అన్నమయ్య.

తనకు ముందున్న పురాణ, కావ్య పద్ధతుల్ని కాదని సరికొత్త రీతిలో సంకీర్తనా సాహిత్యాన్ని సృష్టించిన సాహితీతపస్వి అన్నమయ్య. ” If angels are asked to speak, they will speak in poetry ” అన్నట్టుగా తెలుగు కవిత్వానికి ఒక అపరదేవతామూర్తిగా అవతరించాడు అన్నమయ్య.
అతడు ఆడిన మాటెల్ల అమృతకావ్యమైంది.
పాడిన పాటెల్ల పరమగానమైంది.
ప్రతి కీర్తననీ మధురభక్తితో అలౌకికజగత్తులో రచించి ఆ సౌగంధికపుష్పాల్ని దేవదేవుని పాదాలకు సమర్పించాడు అన్నమయ్య. అన్నమయ్య కీర్తనల్లో పెళ్ళిపాటలు, జోలపాటలు, గొబ్బిళ్ళపాటలు, ఏలపాటలు, సంవాదపాటలు, తుమ్మెదపాటలు, కోలాటపుపాటలు, సువ్విపాటలు, చిందుపాటలు, తందానపాటలు.. ఇలా ఎన్నో రకాలున్నాయి. కీర్తనల్లో గల విషయాన్ని బట్టి భక్తిపాటలు, శృంగారకీర్తనలు, వేదాంతకీర్తనలు, సాంసారికకీర్తనలు, వేడుకపాటలు,.. మొదలైన విధంగా కూడా విభజించవచ్చు. ఏ విభజనకీ లొంగని పాటలూ ఉన్నాయి, అన్ని రకాలకూ చెందిన పాటలూ ఉన్నాయి.

వివిధ జానపద గేయ లక్షణాల్ని ఆకళింపు చేసుకోవటం
భగవంతునితో మమేకం చెందటం
లోకపరిశీలనాశక్తిని కలిగి ఉండటం
వాడుక భాషకు ప్రాముఖ్యత ఇవ్వటం
జీవిత తత్వ్తాన్ని విడమరిచి చెప్పటం
ఇవీ అన్నమయ్య కీర్తనల గొప్పతనానికి మూలకారణాలు. పాందిత్యప్రదర్శనలు, భాషాభేషజాలు లేని నిసర్గరామణీయకతకి ఇతని కవిత్వం నిలువుటద్దం.

అన్నమయ్య పెండ్లిపాటలు చాలా ఉన్నాయి. వాటిల్లో గంధం పాటలు, బంతులాటపాటలు, వధూవరుల పాటలు, నలుగు పాటలు మొదలైనవి ఉన్నాయి. పెళ్ళిలో ప్రతి సంఘటనా వినోదాన్ని కలిగించేదే. జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్ళీనాటి ముచ్చట్ల గురించి అన్నమయ్య “విడియో” తీసి చూపించాడు. తెలుగువారి సాంఘిక ఆచారాలకి ఈ పాటలు సాక్ష్యాలుగా నిలుస్తాయి.
“పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత
పెడమరలి నవ్వేటి పెండ్లికూతురు
పేరుకల జవరాలె పెండ్లికూతురు, పెద్ద
పేరుల ముత్యాలమెడ పెండ్లికూతురు..”
అంటు అలవేలు మంగ అలంకార వైభవాన్ని, హావభావ విలాసాల్ని అన్నమయ్య వర్ణించినా కొంచెం అటూ ఇటూగా తెలుగువారింటి పెళ్ళికూతుర్నే దృష్టిలో పెట్టుకున్నాడు.

కృష్ణుడికీ కొండలరాయనికీ అభేదం పాటిస్తూ గొబ్బిళ్ళ పాటలు రాశాడు. మార్గశిరమాసం. బాలికలు గుమ్మాల ముందు గొబ్బిళ్ళు పెట్టి వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ నాట్యభంగిమలో పాడే ఈ పాట అత్యంత మనోహరం
“కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదు
కులస్వామికిని గొబ్బిళ్ళో

కొండగొడుగుగా గోవుల కాచిన
కొండొక శిశువుకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో”
ఇందులో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపకులను రక్షించిన విధం సూచించబడింది. “కొండొక”, “వెండిపైడి”, “కొండలయ్య” వంటి తెలుగుదనం ఉండనే ఉంది.

తానే ఒక నాయికయై భగవంతునితో విరహం అనుభవిస్తున్నట్టు ఏలపాట రాశాడు అన్నమయ్య. సుదీర్ఘంగా సాగే ఏలపాట మధురభక్తికి పరాకాష్ట. అన్నమయ్య
“వేడుకుందామా వెంకటగిరి వేంకటేశ్వరుని..
ఆమటి మ్రొక్కుల వాడే ఆదిదేవుడే వాడు” అంటూ మనల్ని కూడ తన జట్టులో కలుపుకుంటాడు. మనతో నడిచివచ్చి అలిపురి, తలయేరు గుండు, మోకాళ్ళ ముడుపు మొదలైన వాటిని అక్షరీకరించి చూపిస్తాడు.
“అదివో అల్లదివో శ్రీహరివాసము”
“కొందలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు”
వంటివి ప్రచారం పొందటానికి కారణం ఛాందసమైన భక్తితత్వం కాదని గ్రహించాలి జీవనతత్వాన్ని బోధించే భక్తితత్వం ఆ కీర్తనల్లో ఉంది. వైరాగ్యచింతనతో, తాత్వికదృక్పథంతో, నిర్మలమైన ఆరాధనాభావంతో రాయటం వల్లనే అతని తలపులు తెలుగు వాడి మోక్షగృహానికి తలుపు లయ్యాయి.

సంవాదపాటలు ఎన్ని రాసినా
“రావే కోడల రట్టడి కోడల
పోవె పోవె అత్తయ్య పొందులు నీతో చాలును
రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకుగొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డ వారిండ్ల
అంకెల దిరిగేవు అత్తయా”
అనే అత్తాకోడళ్ళ సంవాదపు పాట అన్నమయ్య లోకజ్ఞతని చాటి చెప్తుంది.

సువ్వి పాటలు అన్నమయ్య కీర్తనల్లో విశేషమైనవి. ఇవి దంపుడు పాటల కిందికి వస్తాయి. ధాన్యం దంచేటప్పుడు శరీరక్లేశాన్ని పోగొట్టుకోవటానికి “ఇస్‌” అనే ధ్వన్యనుకరణ శబ్దమే వేగంగా దంచుతూ అన్నప్పుడు ఆ ఊపులో “సువ్‌” అన్నట్టు వినిపిస్తుంది. అందుకే ఇలాటి పాటల్ని సువ్వి పాటలన్నారు. వీటికే “రోకటిపాటలు” అనే పేరు కూడా ఉంది.
“సువ్వి సువ్వి సువ్వి సువ్వని
సుదతులు దంచెదరోలాల
వనితలు మనసులొ కుందెన చేసిటు
వలపులు తగనించో లాల
కనుచూపులనెడి రోకండ్లను
కన్నెలు దంచెద రోలాల..”
అనే సరసమైన పాటలతో పాటు మధురభక్తి భావాలు గల సువ్వి పాటలూ వున్నాయి.

అన్నమయ్య 15వ శతాబ్దిలోనే అభ్యుదయ భావాలు గల పరమయోగి. వృత్తిపనుల్ని గౌరవించాలన్నాడు. కులభేదాలను, అంటరాని తనాన్ని నిరసించి బ్రాహ్మణుడూ, చండాలుడూ అంతా సమానులే అని ఎలుగెత్తి చాటి “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే” అని బోధించిన జ్ఞాని అన్నమయ్య.
“ఎక్కువ కులజుడైన హీనకులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు
ఏ కులజుడేమి యెవ్వడైన నేమి
ఆకడ నాతడే హరి నెరింగిన వాడు”
అనటంలో అన్నమయ్య విశాలదృక్పథమే కాదు, మానవుడే మాధవుడన్న మహనీయసూక్తి దాగి ఉంది.

అన్నమయ్య కీర్తనల్లో ఉన్న మరొక గొప్పదనం వర్ణనావైభవం. శృంగారవర్ణనలు, వైరాగ్యవర్ణనలు, ప్రకృతివర్ణనలు, జీవితవర్ణనలు, .. అనేకం ఉన్నాయి. దేవదేవుని సౌందర్యాన్ని, అలమేలుమంగ విలాసాన్ని తనివితీరా వర్ణించాడు. జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డ పన్నెండు రాసులు ఉపమానాలుగా గ్రహించి
“ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి..” అంటూ అద్భుతంగా వర్ణించాడు.

అన్నమయ్య కవితా వైభవం అతని భాషలో ఉంది. “ఏటిలో పైరు”, “నీళ్ళు నమలు”, “జలధిలో వానలు,” “వరదం గలిపిన చింతపండు”, “పిండంతే నిప్పటికి” వంటివి ఎన్నో పలుకుబడులు. సామెతలు, సూక్తులు ఆహ్లాదం కలిగిస్తాయి. “చాంగుబళా,” “జాజర”, “తందనాన,” “పురే”, వంటి విశేషణాలు వినూత్నంగా ఉండి గానానికి ఊతం ఇస్తాయి. తెలుగుభాషలో గల స్వఛ్ఛమైన భావసంపదకీ, సహజమైన తెలుగుదనానికి అన్నమయ్య కీర్తనలు నెలవులు.  “వెన్నెలకు కొలలేదు”, అన్నమయ్య కీర్తనకి వెలలేదు.

    
   

19అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    aswanikumar August 17, 2008 10:00 am

    very good

  2. 2
    Sai Brahmanandam Gorti August 22, 2008 8:06 am

    “జో అచ్యుతానంద జోజో ముకుంద
    లాలి పరమానంద లాలి గోవింద”

    అనే ఈ లాలి జోల అన్నమాచార్యుడు రాసింది కాదని ఓ వివాదం ఉంది. ఇదే విషయాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు రాసిన రెండు మూడు వ్యాసాల్లో రాసారు. అలాగే చదివినట్లు గుర్తు. ఈ లాలి పాట చరణాలు ఇలా ఉంటాయి.

    అంగజుని గన్న మాయన్న యిటు రారా
    బంగారు గిన్నెలో బాలు పోసేరా
    దొంగ నీవన సతులు పొంగుచున్నారా
    ముంగిట నాడరా మోహనా కారా || జో ||

    గోవర్థనంబెల్ల గొడుగుగా బట్టి
    కావరమ్ముననున్న కంసు బడగొట్టి
    నీవు మధురా పురము నేల జేపట్టి
    ఠీవితో నేలిన దేవకి పట్టి || జో ||

    అంగుగా దాళ్ళ పాకన్నయ్య చాల
    శృంగార రచనగా జెప్పె నీ జోల
    సంగతిగ సకల సంపదల నీవేళ
    మంగళము తిరుపట్ల మదన గోపాల || జో ||

    ఈ జోల పాట ఆఖరి చరణంలో అన్నమయ్య పేరుంది కానీ తిరుపట్ల మదన గోపాల దేవుని ముద్రతో ఉంది. “తిరు”, వేంకట”, లాంటి ముద్రలేకపోవడం వల్ల ఇది అన్నమయ్య రాసింది కాదేమో నని ప్రభాకర శాస్త్రి గారు ఓ చోట రాసారు.

    పై మూడు చరణాలు కాకుండా, ఇలాంటిదే ఇంకో చరణం తెలుసు.

    అలిగి తృణావర్తు నవని గూల్చితివి
    బలిమిమై బూతన బట్టి పీల్చితివి
    వెలగి శకటాసురుని జేరి డొల్చితివి
    తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి

    ఇందులో ఏది ప్రక్షిప్తమో, ఏది అన్నమయ్య రాసిందో చెప్పలేమని పండితుల అభిప్రాయం. ఈ పాట అన్నమయ్య రాగిరేకుల్లో దొరికిందో లేదో తెలీదు. అన్నమయ్య కీర్తనల పుస్తకాల్లో నాకెక్కడా దొరకలేదు. ఇంతవరకూ ఈ కీర్తన అన్నమయ్యది గానే చెలామణీ అవుతూ వస్తోంది. ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే తెలియజేయండి. సంతోషిస్తాను.

  3. 3
    D Srinivasa Chary April 23, 2009 11:12 pm

    చాలా బాగా అభివర్ణించారు అన్నమయ్య కీర్తనలోని తెలుగుతనాన్ని.
    చిన్న సందేహం. పిండంతే నిప్పటి యన్నట్లు అనే పలుకుబడికి అర్థం చెపతారా?

  4. 4
    Srinivas Vuruputuri April 24, 2009 8:48 pm

    “పిండంతే నిప్పటి” అనే పలుకుబడి “పిండి కొద్ది రొట్టె” కి సమానార్థకం. బ్రౌన్ నిఘంటువు లోంచి:
    నిప్పటి (p. 0654) [ nippaṭi ] or నిప్పట్టు nippati. [Tel. నిప్పు+అట్టు.] n. A sort of cake or biscuit. ఆకులలో పెట్టి కాల్చు భక్ష్యము.
    (http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=nippaTi&table=brown)
    ఈ నడుమనే రాముని తోక పివరుడిట్లనియె అన్నట్లు మీరు ఉదహరించిన పలుకుబడిని “పిండం తేనె ఇప్పటి అన్నట్లు” అని విరిచి చదువుకున్న శబ్ద విరించిని నేను 🙂

  5. 5
    rama bharadwaj April 24, 2009 10:42 pm

    చారి గారూ!
    “నిప్పట్టు” అన్న ది రాయలసీమ ప్రాంతం వాడుక. అరిసె లేదూ అలాంటిది. ఎంత పాటి పిండి అయితే..ఆ అట్టు అంత పాటే అన్న ట్టుగా అన్నమాట. పిండి ఎంతో నిప్పట్టు కూడా అంతే అని సామెత గా అన్నమయ్య ఉపమిస్తున్నాడు. నిప్పు మీద కాల్చే అట్టు “నిప్పట్టు”..అని.

    “ఎంత మాత్రమున ఎవ్వరుదలచిన..అంత మాత్రమే నీవు ..అంతరాంతరములెంచి చూడ..పిండంతే నిప్పటు అన్న ట్టూ.”…అన్న ది
    అన్నమయ్య ..అన్న మాట. అంటే ….ఎవరి భావన ఎంత మేరకు వుందో..వారి ఊహని అనుసరించే ఆ మేరకు మాత్రమే..వారికి ఆ దేముని దర్శన ప్రాప్తి సాధ్యమౌతుంది..అని చెప్పే సందర్భంలో ఈ సామెతని అన్నమయ్య వాడటం
    మీరు గమనించండి. ఇప్పుడు మీకు భావం..సామెతతో కలిసి స్పష్టపడిందనుకుంటాను.

    రమ.

  6. 6
    baabjeelu April 26, 2009 8:33 am

    పిండంతే నిప్పటి యన్నట్లు అంటే పిండికొద్దీ రొట్టె యన్నట్లు అని అనుకుంటున్నాను. నిప్పట్టు రాయలసీమ కారపు అప్పచ్చి. మొదటిసారి పుంగనూరు నుంచీ “బిన్నీగాడు” తీసుకొస్తే “మద్రాసు” లో రుచి చూసేను. అచ్చు సేమ్ డిటో చేగోడీ. మెటీరియలూ అదే, వేయించడవూ అదే. కనస్ట్రక్షన్ లో తేడా, అంతే. చేగోడీలు నలుపుతారు. జబ్బలు పడిపోతాయి. అదీ గాకుండా చక్కగా వ్రుత్తాల్లా చుట్టకపోతే తిట్లు తప్పవు. గొళ్ళేల్లా చుట్టెస్తే ఇంకా తిట్లు. నూనె ఎక్కువ పీల్చకుండా ఏదో టెక్నిక్ తో మా మేనత్త చేగోడీలు చేసీదికాని అవి “కటక, పటక్” మంటాయి. కరకరలాడవు. బావుండవు. అన్నట్టు నూనె బాగా పీల్చి కరకరలాడీ చేగోడీల్ని జేబులో వేసుకుని ఆడుకుందుకి వెళ్ళకూడదు. ఆ రాత్రి ఎలకలు జేబులు కొట్టెస్తాయి. నిప్పట్లు అప్పచ్చుల్లా చేస్తారు. నలపరు. బహుశా నిప్పట్లని ఉండలా చుట్టిన పిండిని అరచేతిలో పల్చగా అప్పచ్చిలా చేసి వేయిస్తారు కాబోలు. చిన్న ఉండయితే చిన్న నిప్పట్టు, పెద్ద ఉండయితే పెద్ద నిప్పట్టు.
    పిండికొద్దీ రొట్టె అన్న ప్రయోగం “పిండంతే నిప్పటి” ముందుదా వెనకదా? రొట్టెలు అన్నమయ్య టైములో లేవా? వున్నా లేకపోయినా నిప్పట్ల వల్ల చేగోడీలకోసం ఏడవడం తప్పిపోయింది నాకు. చిన్నప్పటి పోగుట్టుకున్నాననుకున్న, మరి దొరకదు గాక దొరకదనుకున్న “బంతి” దొరికిందినాకు. అన్నమయ్య పాటల్లో ఇన్ని మంచి వూసులున్నాయా?

  7. 7
    ravikiran Timmireddy April 26, 2009 7:22 pm

    బాబ్జీ,

    మదరాసులో బిన్నీ గాడు ఎవి తెచ్చేడో నీకేవి చెప్పేడో, అసలే వాడి ఊరు పుంగనూరు. నిప్పట్లంటే రాయలసీమ సంగతేవో గాని, నెల్లూరులో మీ అరిసెల్ని నిప్పట్లంటారు. పెద్ద పండగకి చేసుకునే అప్పచ్చులు అనమాట. రొట్టె పదం సంస్కృతవా, పారసీకవా? పిండి కొద్ది రొట్టెని, పిండి కొద్ది నిప్పటని (మా పక్క మీ ఉల్లిపాయల్ని, ఎర్ర గడ్డలంటారు, ఎర్రగా వుంటాయి కాబట్టి, అట్లనే ఎర్రగా నిప్పులా వుండే మీ అరిశలు, బెల్లపరిశలు, నెల్లూరులో నిప్పట్లయినాయి, బహుశా రాయలసీమలో కూడా నిప్పట్లంటే అరిశలే కావొచ్చు) అన్నమాచార్యులవారు (అప్పటి తెలుగుదేశంలో రొట్టెలుతినే వాళ్ళెవరు) ఆ ప్రాంతానికి అణుగుణంగా రొట్టెని, నిప్పటిగా మార్చుకున్నారెవో, సంస్కరించుకున్నారేవో?

    రవి

  8. 8
    M.S.Prasad April 26, 2009 10:47 pm

    మహా భక్తులు కవులు ఐన పోతన,అన్నమయ్య వంటి వారి గురించి ఒకే ఒక్క పేజీ వ్యాసం వ్రాయడం వారి అభిమానులైన మా బోటి వారికి ఆశాభంగమై నిరుత్సాహంగా అనిపిస్తుంది. వ్యాసకర్తలూ, సంపాదకులూ స్థలం కై లోభించకుండా ఇటువంటి వారిపై వ్యాసాలను బెజ్జాల వారి వ్యాసాల నిడివికన్నా రెండు మూడింతల నిడివిలో ఇంకా అనేక విషయాలను పొందుపరచి ప్రచురించాలని కోరుకుంటున్నాను. వ్యాసం అలరించింది కానీ మనస్సు ఇంకా కావాలని కలవరించింది. నా నిత్య దేవతారాధన 2-3 అన్నమయ్య సంకీర్తనలతో కానీ సంపూర్ణం కాదు. అన్నమయ్య గారు ఎక్కువ తెలుగు పదాలే వాడారు కానీ అవి వారి మాండలికాలై మండలేతరులమైన మా వంటి వారికి గ్రాహ్యం కాక ఒక్కొక్క చోట పూర్తి భావమే అవగతం కావడం లేదు. నిప్పట్టు వివరించిన లాగానే విజ్ఞులైన సహ పాఠకులు నా సందేహాలని తీరుస్తారని ఆశిస్తాను.

    మూసిన ముత్యాల కేలే మొరకులు
    ఆశల చిత్తాల కేలే అలవోకలూ
    మొరకులు – అలవోకలు పదాల అర్ధం మొత్తం పల్లవి భావం కావాలి.

    పరమ మూర్తి, హరి, ప్రహ్లాద వరదుడు, కరుణానిధి, బుధ కల్పమూ
    బరగు శ్రీ వేంకట పతి తన దాసుల అరుదుగ గాచే అనంతుడితడు
    ఇక్కడ అరుదు పదానికి మనకు తెలిసిన అర్ధం అన్వయం కావడంలేదు

    ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహా!
    ఇక్కడే గాక ఇంకో వేరే కీర్తనలో కూడా నృసింహునికి ఫాలనేత్ర ప్రశంస వున్నది. ఇందులో ఔచిత్యం.

    మాధవా! కేశవా! మధుసూదనా! విష్ణు! శ్రీధరా! పదనఖం చింతయామి యూయం
    చింతయామి యూయం అర్ధం.
    ఒకవేళ నాకు తెలిసిన సాహిత్యమే తప్పైన పక్షంలో సరిఐన పదాలను తెలుపవలసినదిగా ప్రార్ధన.

    భవదీయుడు

  9. 9
    rama bharadwaj April 27, 2009 10:09 am

    అన్నమయ్య సాహిత్యం గురించిన.. మీ పాఠకుల సందేహాలని చూసేక ఈ సమాచారం.. ఈమాట కి తెలుబడి చేయటం మంచిదని నాకు అన్పించింది. జయప్రభ గారు అన్నమయ్య పదాల విశ్లేషణ రెండు సంపుటాల్లో చేసారు.మొదటి సంపుటం 2006 లో రాగా..ఈ నెలలోనే రెండవ సంపుటం అచ్చయి వచ్చింది. పుస్తకం పేరు..”కాంతల మనసు లోని కఱవు వాసె..అంతటా జవ్వనమనే ఆమని కాలమున”. 450 పేజీలు; ఖరీదు 500 రూపాయలు.

    ప్రసాద్ గారూ! అన్నమయ్య సంకీర్తనా సంపుటాలని నిఘంటువుల్ని దగ్గర పెట్టుకుని చదవండి. ఒక నిఘంటువు కాదు..చాలా నిఘంటువుల్ని వెతకండి.మీకు అన్నమయ్య సాహిత్యం్ ఇష్టం్ అయినప్పుడు అంతపాటి శ్రమ పడాలి. క్రమేపీ మీకు వాటి లోని అందాలు అవగతం కాగలవు. అన్నమాచార్యుని కవిత్వం ఎందుకు వైవిధ్యమైందో..అది ఎంత గొప్పదో..చాలా ఆసక్తి గానూ..చాలా విపులంగానూ ఆమె విశ్లేషించారు. వాటిని చదవండి. మీ చాలా సందేహాలకి సమాధానం దొరుకుతుంది. పుస్తకాల ప్రాప్తి స్థానం…రచయిత్రి దగ్గర గానీ..అక్షర బుక్ షాప్ లో గానీ.

    బాబ్జీలు గారూ! ఒక సామెతకి ఒకే రూపం..ఉండనఖ్ఖర లేదు. ఒక అర్ధాన్ని ఇచ్చే సామెత భిన్న ప్రాంతాల్లో..భిన్న కాలాల్లో ప్రాచుర్యం లో ఉండటం్ అన్న ది..దాని ప్రభావానికీ..ప్రచారానికీ..ఆ భావ వ్యక్తీకరణ అవసరానికీ గుర్తు. సామెతలకి, కర్తృత్వాలూ..కాల నిర్ణయాలూ ఉండవు. అందువల్ల వాడకంలోని ప్రాచీనతే..దాని చెలామణీని ..వ్యాప్తినీ సూచిస్తుంది. మనకి అట్టు తొలి గానూ..రొట్టె..అటు తర్వాతా వచ్చిన ట్లయితే అన్నమయ్య వాడిన రూపమే మొదటిది కావొచ్చు. నిప్పట్టు అంటే అరిసె అన్న వాడుక సీమలో ఉంది మరి.

    రమ.

  10. 10
    రంగ April 27, 2009 3:54 pm

    M.S.Prasad అభిప్రాయం:
    ఇక్కడే గాక ఇంకో వేరే కీర్తనలో కూడా నృసింహునికి ఫాలనేత్ర ప్రశంస వున్నది. ఇందులో ఔచిత్యం.

    ప్రసాద్ గారూ,

    నారసింహుని ఫాలనేత్రం లక్ష్మీనృసింహ స్తోత్రాలలో ఉన్నదే:

    సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం
    యోగారూఢ మతిప్రసన్న వదనం భూషాసహస్రోజ్జ్వలం
    త్ర్యక్షం, చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం,
    ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం, లక్ష్మీనృసింహం భజే.

    జ్ఞాననేత్రం సర్వ దేవతా మూర్తులకూ ఉన్నదని భావించటం సంప్రదాయమే. అంతే కాక, నారసింహరూపం ప్రత్యేకించి శివకేశవాత్మకం. విష్ణుసహస్రంలో వలెనే నారసింహ సహస్రంలోనూ అనేక శివ నామాలు ఉన్నాయి. శంభు, విరూపాక్ష, పినాకి, భద్రరూప, ధూర్జటి, శ్రీశైలాద్రినివాస, రుద్ర, ఈశాన ఇలా 30, 40 నామాలు లక్ష్మీనృసింహ సహస్రనామ స్తోత్రంలో ఉన్నాయి.

    సర్పాకృతిలో ఉన్న శ్రీపర్వత శ్రేణిలో, తలవైపు వైష్ణవ క్షేత్రమైన వెంకటాచలం, తోక వైపు శైవ క్షేత్రమైన శ్రీశైలం ఉంటే, మధ్యన విష్ణశివాత్మకమైన నారసింహ క్షేత్రం ఉంది.

    రంగ

  11. 11
    Srinivas Vuruputuri April 28, 2009 8:19 am

    “మాధవా! కేశవా! మధుసూదనా! విష్ణు! శ్రీధరా! పదనఖం చింతయామి యూయం”
    ఈ సంకీర్తన పల్లవి రేకులోనో పూర్వ ప్రచురిత పాఠాలలోనో సరిగా లేనట్లున్నది. 19986 లో ముద్రించిన “తాళ్ళపాక పద సాహిత్యం – నాలుగవ సంపుటంలో ఇలా ఉన్నది:
    “మాధవ కేశవ మధుసూదన విష్ణు
    శ్రీధరా పద నభం (ఖం?) చింతయామి యూయం (మో వయం?)”
    బ్రాకెట్టులలోని సూచన గౌరిపెద్ది రామ సుబ్బ శర్మగారిదనుకుంటాను.
    పదనఖం చింతయామః వయం అంటే కాలి గోటిని తలచుకుంటున్నాము అని అర్థమా?

    అరుదు అనే మాటకు ఆశ్చర్యము, అపూర్వము అనే అర్థాలు ఉన్నాయి (శబ్ద రత్నాకరం)

  12. 12
    రంగ April 28, 2009 4:17 pm

    M.S.Prasad అభిప్రాయం:
    మాధవా! కేశవా! మధుసూదనా! విష్ణు! శ్రీధరా!
    పదనఖం చింతయామి యూయం
    చింతయామి యూయం అర్ధం.

    ప్రసాద్ గారూ,

    నఖస్తుతి మన స్తోత్రాలలో చాలా చోట్ల కనబడుతుంది. ఉదాహరణకు, ‘నఖధీధితి సంచ్ఛన్న నిమజ్జన తమోగుణా’ అని లలితా సహస్రం. కేశాది నఖ పర్యంత స్తుతులు మనకు కనబడతాయి. అందునా అన్నమయ్య అహోబల వైష్ణవుడు. నారసింహ నఖ ధ్యానం సంప్రదాయం. ‘స్ఫురిత విబుధజన ముఖములు, పరివిదళిత దనుజ నివహపతి తను ముఖముల్, గురురుచి జిత శిఖిశిఖములు, నరహరి కరనఖములమరు నతజన సుఖముల్’ అని పోతన.

    ‘పదనఖం చింతయామి యూయం’ అనేది సరైన పాఠమో, కాదో నాకు తెలియదు కానీ ‘యూయం’ అంటే ‘మీరు’ అని అర్థం. త్వం – యువాం -యూయం.

    రంగ

  13. 13
    M.S.Prasad April 28, 2009 9:16 pm

    మాధవా! కేశవా! మధుసూదనా! విష్ణు! శ్రీధరా! పదనఖం చింతయామో వయం” అనే పాఠం ఎక్కువ గ్రాహ్యంగా తోస్తోంది. మాత్రలు కూడా సరిపోయి పాడడానికి అనువుగానే వుంది.
    త్ర్యక్షం, చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం – సందేహం తీరింది. నృసింహదేవుడిని ఫాలనేత్రం కలవాడిగా స్తుతించిన వారున్నారు అని తెలిసింది. ఐతే ఎక్కడా చిత్రాలలోగానీ, విగ్రహాలలో గానీ ఫాలనేత్రం నేను చూడలేదు. అందుకని ఈ సందేహం వచ్చింది.
    రంగ గారికి, రమా గారికి, శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. నా సందేహం ఇంకొక్కటి మిగిలే వుంది. దానికి రమ గారు సూచించిన మార్గమే శరణ్యమనుకుంటాను, ఎవరూ తెలుపకపోతే.

    మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు.

    భవదీయుడు.

  14. 14
    M.S.Prasad April 30, 2009 2:14 am

    రంగ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. మీరు చెప్పింది సమంజసమే అనిపిస్తుంది. శ్రీ నృసింహావిర్భావ ఘట్టంలో పోతన గారి పద్యం గుర్తు చేశారు. నతజన సఖముల్ అనుకుంటాను.
    చింతయామి ఉత్తమ పురుషైక వచనానికి సంబంధించిన క్రియ. యూయం మధ్యమ పురుష బహు వచనం. కాబట్టి ఇక్కడ చింతయామో వయం (చింతయామః వయం = మేము చింతన చేస్తున్నాము) అనే పాఠం గ్రాహ్యం అని అనుకుంటున్నాను.
    మరొక్కసారి కృతజ్ఞతలతో
    భవదీయుడు

  15. 15
    ellanki.bhaskaranaidu April 12, 2010 10:19 pm

    చాల బాగున్నది. ధన్యవాదాలు.

  16. 16
    Prof L D Sudhakara Babu July 17, 2010 4:43 am

    Prof Simmanna is my colleague.

    His name was listed in google search with reference to this article was typed as SINNAMMA.

    Kindly do the needful.

  17. 17
    vijay kumar D June 29, 2011 12:49 am

    I believe Annamacharya is not a man ,he is the god. A simple tip for all is, if u r so anger just listen his songs automatically u will be cool with in seconds this is the medicine for anger persons.

  18. 18
    mruduravali December 28, 2014 12:28 pm

    please do provide some padyams /slokas of annamayya or lord venkateswara .

  19. 19
    kusuma 1955 August 7, 2026 10:43 am

    కమ్మని సుగంధ పొడి జవ్వాది – ఎన్నెన్నో దినుసులు – పట్టిక – ఔతుంది – మనం అన్నమయ్య కీర్తనలను పరిశీలిస్తూ, పరిశోధిస్తుంటే ;
    కీర్తన ;-
    జవ్వాది మెత్తినది అది తన
    జవ్వనమే జన్నె వట్టినది ;

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం

ఇటువంటివే…

  1. అన్నమయ్య సంకీర్తనల్లో కవిసమయాలు
  2. నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం
  3. రాగలహరి: ఆభేరి
  4. మన శాస్త్రీయ సంగీతం
  5. నా రామాయణం

జులై 2000 సంచికలో ...

  • అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం
  • కనిపించడం లేదు
  • కవిత్వము కథ
  • కుడితిలో ఎలకలు
  • జులై 2000
  • తమాషా దేఖో 2
  • నా రామాయణం
  • భాగ్యలక్ష్మి
  • మన శాస్త్రీయ సంగీతం
  • యోర్హే లూయీ బోర్హేస్‌కవితలు:ఇంకేఁవక్కర్లేదు
  • రాగలహరి: ఆభేరి
  • వర్గ సంబంధం
  • సాక్షి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నా రామాయణం
కవిత్వము కథ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.