“ఓ నరిసీ, నాగీ, రాజీ, చంద్రా, రాండేయమ్మలాల, మనకంటే ముందుగానే పొద్దు పరిగెత్తతా ఉంది. అసలే ఈ పొద్దు కూలికి పోయేది కసాపోనికి,” అంటా పార్వతత్త బజారు ముందర నిలబడి యాలకూతలేస్తా అందర్నీ పిలస్తా వుంది. ఎనకేసిన మగోల్ల మొబ్బురంగు పాత సొక్కాయిలు పైకి తొడుక్కొని, ఎండకు తలకాయలకు కట్టుకోను తువాలు గుడ్లు బుజానేస్కొని మేము ఐదుమందిమి కిట్నారెడ్డికి టమాటా కాయలు పెరికే దానికి మా ఊరు పాజిట్టు కిందికి ఎలబారితిమి. మా ఊరునుండి వాళ్ళ బూములుండే కాడికి అరమైలు నడల్ల.
నడిసే దావలో పార్వతత్త “గెడిసేపు ఎనుకు ముందైతే మగమల్లా ముడేసుకుంటాడు ఆ కిట్నారెడ్డి. వాన్ని కడుపులో ఏసుకొని వాళ్ళమ్మ దినామూ ఎలింగొడ్డు మగమేమో చూసింది, లేకపోతే ఎబుడూ మనసల మింద కుక్క కసిర్నటు కసరతానే ఉంటాడు. ఇబుడు నిదానమైతే ఈ వాసరామల్లా మనము తిరిగి ఇండ్లకొచ్చేటప్పుడు మనకాడ ఎలబెరుకుతాడు, కనుమొబ్బైనా ఇండ్ల కంపడు. మావిటేల బిన్న ఇల్లు జారకంటే మొగుల్లతో పోరు. మూరతాడు మెల్లో ముడేసి, మన జుట్టు వాళ్ళ చేతికి ముడేసుకొని ఆడిస్తారు. ఈ ఎర్రటెండకు నెత్తరుచ్చలు పోసుకొని కూలి చేసి ఇండ్లకొచ్చి మగప్పగార్లకి యాలకి గిన్ని ముందర తోయెల్ల. గెడువు ఇట్లా అట్లా అయితే, ఏమో వాళ్లు సమ్మలమిచ్చి పెట్టుకున్నెట్లు, సంసారం చేసే ఆడదానికి పొద్దు గుంకతానే ఇండ్లకు రావల్లనేది తెలియదా అంటారు. యాయాలకీ మన కాళ్లు చేతులు మనమే పొయిలో పెట్టుకోవల్ల, బిరి బిన్నే పదండమ్మ,” అని తొందర పెట్టె!
సరిగ్గా ఏడు గంటలంటే ఏడు గంటలకల్లా పనిలో ఉండల్ల, లేదంటే ఆ కిట్నారెడ్డికొచ్చే కోపానికి కొత్తోలైతే నువ్వొద్దు నీ కూలొద్దు అని ఎలిపాతారు. ఎందుకంటే ఆయప్పకు నోట్లోనుండి మాట బయట వస్తే ఆ మాటల్లా సింగిలిచ్చుకునే మాట్లాడుతాడు. అందుకే వాన్ని మా ఊరోళ్ళు కసాపోడు అంటారు. ఇంగా ఆయప్పని బూతులు బాగానే తిడతారు. అవన్నీ వద్దులే కానీ ఆయప్ప పెండ్లాము మంచిది. ఆయమ్మ పేరు అనసూయమ్మ. ఆయమ్మను కూడా ఎబుడూ కుక్కను గసిరినట్టు కసరతానే ఉంటాడు. అయినా ఆ మహాతల్లి వాంకోని ఓర్చుకొని పోతాది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు అట్లా ఆయమ్మ ఎట్లా మనిసినైనా జారబడుతుంది. జత చేసుకుంటుంది. బీద బిక్కికి ఆకిచ్చి అన్నం పెడుతుంది, పైడు బత్తిమిస్తుంది. ఆయమ్మ మగము చూసే వానికి కూలికి పాతారు.
అదీగాక మా పక్క ఈ టమాటా సేద్యం ఎక్కువ. దడ్డుకు దారం కట్టుకొని అందరూ ఒకే పంటేస్తారు. అదిక పెట్టుబల్లు ఈ సీజన్లో పెట్టాల్సి వస్తుంది. దానికోసం ఆడోల్ల మెల్లల్లో తాలిబొట్లు కూడా కుదవకు బోతాయి. గుడ్డోడు గువ్వ నేసినట్లు ఈ టమాటాలు ఎబుడు రేటమ్ముతాయో, ఎబుడు తగ్గుతాయో ఎవురికీ తెలియదు. బంగారు కోసం కంసలోని కుంపట్లో మొన్నును దేవినట్లు ఈ పంటను ఏస్తానే ఉంటారు. అందరమూ ఆ మాట, ఈ మాట చెప్పుకుంటా టమాట తోటకాడికొచ్చి పనిలో దిగితిమి.
కిట్నారెడ్డి కుడిచేతికి ఇత్తలి రంగు గెడారం ఉంటుంది ఎప్పుడూ. నీళ్లు పోసుకునేటబుడు తప్ప ఆ గెడారం చేతిలోనుండి తీనే తీయడంట. ఆయప్ప చేతికి గట్టుకోనుండే గెడియారం ఈ చుట్టుపక్కల ఏ మొగోనికి లేదు, అది చానా గిరాకైయింది అని చెప్పుకుంటారు. మేము అబుడబుడు తిట్టుకుంటాం ‘వాని మాదిరి వాని గెడారం కూడా పని చేస్తానే ఉంటుంది, నిలిచి పాకూడదా’ అని. మమ్మల్ని చూసి గెడారంకల్లా చూసుకొని ఈ పొద్దు ఏమి మాట్లాడలే.
పార్వతత్త మాట్లాడతా “పానీలే సామి, ఈ పొద్దు నాలుగు రాజ్జెలూ ఒకటిగా ఉండాయి రెడ్డికి,” అని నగిచ్చే. ఎనిమిది గంట్లకే సూరుడు కరకర అని న్యాలికులు కోస్తా ఉండాడు. పార్వతత్త మాట్లాడతా “అయినా ఈ ఎండాకాలం ఎలిపోయిందంక సూరునికి కనబడకుండా దాంకుందామనిపిస్తా ఉంది పానము. పచ్చులు జీవాలన్నా కాంచేడి మేతాడుకోని కాంచేడి నీడనుంటాయి. మనట్ల కూలి చేసుకునే బతుకులు అట్లా కాదు. ఇబుడు పనికి వంగినామా, మల్ల పొద్దు కనుమరుగైందంక పొగులంతా ఈ ఎండకు కాగి కాగి ఇండ్లకు పోతే ఆడ మల్లా పొయ్యి కాడ కాగల్ల. రేయన్న కొంచేడి నిదర పాదాం అనుకుంటే రాయి కమ్మితో కట్టిన సిమెంటు కొంపలు. ఈ ఎండకు సెగ కొడుతుంది. ప్యాను ఏసుకుంటే ఆ ప్యాను గాలి కూడా ఉడుగ్గా తోలుతుంది. మేము చిన్నబుడు బతికిన ఇండ్లు మొంటి గోల్లు, బోద కప్పడాలు, ఇంటి సుటకారం సూరు, ఆ సూరులో గాలి తోలేది. ఆ ఇండ్లలో ఎండాకాలం చల్లగా, వానకాలం ఎచ్చగా ఉండేది. ప్యాను ఎరగము. ఎండలో దేశమంతా తిరిగి ఇంటికొచ్చి మొంటి కడవలో నీళ్లు తాగి కూసుంటే తూగు కొట్టకచ్చేది. ఇండ్లంటే అవి. ఇప్పుడుండే మిద్దిండ్లలో ఉండలేము, దొడ్లో ఉండలేము. తెల్లారుజామున వుగేవుగ తూగు తూగత ఉండాము అందుకే ఈ ఎండ కాలాన్ని ఎపిచారి కాలమంటారు,” అనే పార్వతత్త.
ఆ మాటకు నరిసిండుకొని, “అదేలక్కా, ఎండాకాలాన్ని ఎపిచారి కాలమనేది?” అనడిగా. “యాలంటే ఈ ఉడుక్కి, ఎండకు తట్టుకోలేక ఒళ్ళు మిందుండే గుడ్డగుసురు అంతా పెరికేస్తాంకదా, అదే చలికాలమైతే అన్ని మట్టంగా కప్పుకొని పొనుకుంటాము, కప్పుకొని తిరగతాము. అందుకె ‘చలికాలం సంసారికాలం, ఎండాకాలం ఎపిచారికాలం’ అంటారు పెద్దోల్లు. ఈ రోహిణి కార్తిలో ఎండకు రోల్లు కూడా పగిలిపోతాయంట, అదీగాక ఎండాకాలం సూరుడు బాల పెండ్లికొడుకంటారు. అందుకే దగదగా మెరిసిపోతాడు. ఆయప్ప సంబరంగా ఉంటే మనకేమో ఎండగాలి, ఎన్ని నీళ్లు తాగినా సర్తు గారిపోయి ఆడోళ్లకు, మొగోళ్ళకు సురుకుచ్చలెత్తుకునేది ఈ కాలంలోనే,” అని చెప్పకొచ్చె పార్వతత్త.
ఆ మాటకు రాజమ్మ “అవునక్కా నాకు మూడు దినాలనుండి సురుకెత్తుకుంది. ఎన్నెన్నో సిట్టైదిగాలు చేస్తా ఉండా, ఉచ్చలు వచ్చినట్టే ఉంటాయి రావు, ఆచ్రిమంతా ఒకటే మంట. ఉచ్చ వొగ బొట్టు నేలపడాలంటే దేవుడు కనపడతాడు. ఆచ్రిములో ముళ్ళకంపతో పొడిసినట్లుంటుంది. ఆ ఉడుకు సల్లారను మాయవ్వ చెప్పిన ఎన్నో సిట్టయిదిగాలు చేసిన. తొలిత ఆకులో ఆవు పేడ పెట్టి దాన్ని బొగ్గిట్లో అంటించుకుంటి, బొగ్గిటి సుట కారం తెల్లనాము సాది పూసుకుంటి, కాలి బొట్నేలికి బిర్రుగా దారం కట్టుకుంటి, ఊసేరు, కాసేరు, తాటి బెల్లం, నల్ల జీలకర్ర, యాపచెక్క కొట్టకచ్చి అన్ని కొత్త కడవలో ఊరేసి దినము పరగడుపున గలాసుడు సొప్పున ఏడు దినాలు తాగిన. ఇన్ని జెయనంక కోడి గుజ్జాము కాడ కాసింత వొల్లు చల్లబడి దోసెడు ఉచ్చలొచ్చినాయి. నాకీ ఎండకాలం ఎల్లిందంక ఈ బాదే,” అని చెప్పకచ్చే.
నాగక్క కూడా “నాకూ ఇదే సురుకుచ్చలే అనే. ఆ మంట నొప్పికి నోరు కొట్టుకుందామనిపిస్తుంది. ఆసుపత్రులకు పోయినా ఆ మాత్రలుకు, సూదులుకు కాంచేడి అట్లుటుందంతే! దీనికి తోడు నా మొగుడప్ప ఆ పనికి నిలుకుండదు. రేయి సరిగ్గా గువ్వరిసినబుడు పెరుకులాడతాడు, దానికే నిన్నట రేతిరి నాకు పితాళం రేగి ‘ఈ ఎండకాలం ఎల్లిందంక నా పక్కకొస్తే నిన్నన్న జంపేస్తా, నేనన్న జచ్చిపోతా’ అని ఇడ్డుకుంటి. అది సుతా మూసుకొని మడ్డ అదం పట్టుకొని ఎడిగా పొనుకుంటాడు,” అనే. ఆ మాటకు అందరూ నగిరి. అందరూ సుద్దులు చెప్పుకుంటా నక్కుంటా ఉంటే కిట్నారెడ్డి వొచ్చి “అరువులుతోనే సరిచేస్తారా, పనేమన్నా చేస్తారా, ఎక్కల్లేని అరువులు మీ ఆడోళ్ళకే వస్తాయి,” అని పెరికిన టమాటా కాయల గంపెత్తుకొని పాయ. వాటిల్లో పుచ్చులు, మంచివి, సైజుల వారి కాయలేరి పక్కనేసుకునేకి.
“ఈ ఎండకు మాట్ల సంబరాన కాలం పరిసి పోతుందని ఆ మాట, ఈ మాట చెప్పుకుంటే ఈ యప్పకు బలే బాదే, ఆడోళ్లు యాడన్న సంతోసంగా ఉంటే ఈ మగనాకొడుకులకి బుద్ది పులపదులే, అయినా వానదేవుడు కనికరించిందంకా ఈ ఎండకు మనం ఆగారం అయిపోవాల్సిందే? ఎక్కడ పోయినావు వానదేవా, నీ నేస్తురాలంచునే ఉండిపోతావా? మా కళ్ళచూడవా?” అనే పద్మక్క ఆకాశం కళ్ళ ఎగజూస్తా.
ఆ మాటకి నరిసి “అదేందక్క, వానదేవునికి కూడా నేస్తురాలుందా?” అనే.
“ఎందుకుండరు? నువ్వు వానదేవుని కత ఇన లేదా? నాకంటే నాగక్క బాగా చెప్తుంది. అది ఆ యక్క కతే, ఊర్లో తొలిత ఎవురు కత చెప్పినా, ఎవురు పాట బాన్నా అది వాళ్లకే సొంతము. మల్ల మద్దిలో ఎంతమంది నేరిసినా, తొలి చెప్పినోల్ల పేరే చెప్పుకుంటారు, తొలి నేర్సింది నాగక్కే. నాగక్కా ఈ ఎండకు పొద్దన్న పోనీ కత చెప్పు,” అనే పద్మక్క.
“అయ్యో పాపా అది పెద్ద కత, రెండు దినాలు చెప్పినా అయిపోదు,” అనే నాగక్క.
“అయితే గానీలే ఉలిబలిగానన్న జెప్పు, నేనెబుడూ ఇనిందే లేదు,” అనే నర్సి.
ఆ మాటకు “సరే అయితే బాగా ఊ గొట్టాలే నరిసీ,” అంటా కత అందుకుండే నాగక్క!
“అనగనగా వొకూర్లో ఒక ఒక రాజంట. ఆ రాజుకు ఏడుమంది కొడుకులు. ఆ ఏడుమంది సందున ఒక ఆడబిడ్డ. పేరు అనలక్కమ్మ. ఆయమ్మ పుడతానే ఆ రాజు రాణి కాలం చేస్తారు. ఈ అనలక్కమ్మ అన్నగార్లు ఏడుమందికి పెన్నిండ్లు అయితాయి. వచ్చిన ఏడుమంది వొదినగార్లు వాళ్ల సొంత బిడ్డ మాదిరి అనలక్కమ్మను అల్లారుముద్దుగా సాక్కుంటా ఉండారంట. కింద పెడితే మొన్నైతుందేమో, పైన పెడితే పచ్చులు ఎత్తకపోతాయేమో అన్నంత సుకుమారంగా సాక్కుంటా, దినాము తుమ్మిపూలతో తూంచతా, ఆయమ్మ ఏది కావల్లే మనసా అంటే, అదల్లా తెచ్చి పెట్టేది. ఇట్లా ఆ అనలక్కమ్మ ఇంతై అంతై పెండ్లీడుకొస్తుంది.
“ఒకనాడు వాళ్ళ వొదినగార్ల పుట్టిండ్ల కాడ గంగ జాతరైతే ఆ జాతరకు రమ్మని పిలనంపింటారు. చిన్నబుటినుండి ఈ అనలక్కమ్మను ఇడిసి ఈ అన్న వొదిండ్లు ఎక్కడే గాని పొయిండ్రు. ఆయమ్మను సాకతా అట్లే ఉండిపోయినారు. ఇంగ ఈయమ్మ పెద్దదైంది కదా ఇబుడన్నా పదామని ఆయమ్మను వొంటి స్తంబం మేడలో పెట్టి, దాదిమనసులు కావలి పెట్టి, ఈ అన్న వొదిండ్లు వాళోళ్ల పుట్టినిండ్లకు పాతారు. ఈ పోయినోళ్ళు పాక పాక పోయినారు కదా అని వాలోల్లు అక్కడ మర్యాదలు చేస్తా ఉంటే వారం, రెండారాలు అక్కన్నే ఉండి పాతారు.
“ఈ అనలక్కమ్మకు ఒగటే బయిమెత్తుకుంటుంది. మా అన్న వొదిండ్లగార్లకి ఏమైందో ఏమో అని. ఆ యమ్మ, మన ఊరు ముందర ఉండే బాయకొండ గంగమ్మ గుడి మాదిరి వాళ్ల ఊర్లో కాళికాదేవి గుడి ఉంటే, ఆ గుడికి పోయి “తల్లీ మాయన్నలు, వొదినగార్లు సక్రంగా ఇల్లు చేరితే నీకు సమారాజిని పెట్టిస్తా,” అని మొక్కుంటుంది. ఆయమ్మ మొక్కొని వొచ్చిన మొరుసునాడే అన్నలు వొదిండ్లు ఇల్లు జేరుతారు. ఆ యమ్మ సంతోసంతో ‘నేను ఇట్లా మొక్కున్నా, సమారాజన పెట్టించల్ల’ అని అన్నలను అడుగుతుంది.
‘అట్లనే తల్లీ’ అని వాల్లందరూ కలిసి కోరిన వంటకాలు చేపిచ్చి ఊరందరికీ సమారాజన పెడితే, అందరూ ఆకుల ముందర కూర్చొని తినేదానికి చెయ్యి ఆకులో పెట్టినారంట. ఆ యాలకు ఉరుములు మెరుపులతో జల్లున వాన కురిసె. అది చూసి ఏడోల్లు ఆడ ఆకు మడిచేసి పరిగెత్తతా ఉంటే ఈయమ్మ కడుపు కాలి “ఏమి వాన దేవా ఇబుడొచ్చినావే, నీకు వాన కురిసే దానికి ఏలా పాలా లేదా, నడి రేయికాడ రాకూడదా, నడి జామ కాడ రాకూడదా, నీవల్ల నా సమారాజినంతా నిలిచిపాయినే. తినేవాళ్ల నోటికల్లు పెరికినావు, నీకు సరిపోతుందా, నీకు మర్యాదేనా?” అనే. ఆ మాటతో జల్లున నిలిచిపాయ వాన. ఆకాశమంత తేరిడి కొట్టే. మల్ల సమారాజిని జరుపుకొని ఇండ్లకొచ్చిరి.
“మల్ల మూడో దినం రాయి, నీరు కరిగే పొద్దులో ఆయమ్మ బాగా నిద్రపాతా ఉంటే ఈ వానదేవుడు ఆయమ్మ మందిరానికొచ్చి ఆయమ్మకోసం పెట్న పాలు, పండ్లు పలారమంతా బుజిచ్చి తాంబూలం ఎర్రగా నెమిలి, ఆ తమ్మ కర్ర ఆయమ్మ చీర కొంగులో ముడేసి పొయినాడు!
“ఆయమ్మ ఆ పద్దన్నే లేచి చీర కొంగు బరువుగా ఉంటే చూసింది. కొంగునేందో మూటుందని ఇప్పితే ఏముంది తమ్మకర్ర. అది చూసి ఆయమ్మ చింతాకాంతురాలై పాయా. ‘నా మందిరానికి నరుడుగాని, నారాయనుడుగాని రారే, ఎవురీ పని చేసింద’ని, లోలోపలే కుమలతా ఉంది. మల్ల ఆ మరుసనాడు అదే పకారం వొచ్చి అదే పని చేసి పోతాడు. అట్లా వరసగా మూడు దినాలు గడిచే. ఆయమ్మ ఈ విషయం మా అన్నగారికి చెప్పకూడదని, ఒగ పెద్దాయమ్మని అడిగింది, “కాదమ్మా నా మందిరానికి నరుడు, సురుడు, నారాయణడు ఎవురుగాని రారు. మూడు దినాలనుండి ఈ పకారం చేసి పాతా ఉండాడు, ఎవరో వస్తా ఉండారవ్వ, నాకు దిక్కు తోచలేదు,” అంటుంది. “అబుడైతే నాయనా, కాసింత ఏలు కోసుకొని నిమ్మకాయ పెట్టుకో, ఆ మంటకు నిదర రాదు, అబుడు ఎవురైంది తెలిసిపోతాది,” అంటుంది. ఈ యమ్మ ఆ రేతిరి అదే పనిచేసింది.
“బాగా రాయి నీరు కరిగే పొద్దులో వచ్చి, అదే పకారం అన్నీ తిని తాంబూలం ఎర్రగా నమిలి, తమ్మకర్ర కొంగున ముడేసే సమీములో ఈయమ్మ గబక్కున చేయి పట్టుకునే. “ఎవురు నువ్వు? దైవమా, దాతవా, పిశాచా ఎవురు నువ్వు? మా యన్నగారు నిన్ను చూస్తే బతకనిస్తారా? నువు ఎందుకొచ్చినావు?” అంటుంది. “అనలక్కమ్మా, నేను వానదేవున్ని, నేను వానై కురుస్తా ఉంటే నడి జామకాడ రాకూడదా, నడిరేవు కాడ రాకూడదా అంటివి, అందుకు నేను ఇబుడొచ్చిన, నిన్ను పెండ్లి చేసుకుంటా,” అంటాడు.
“సామీ ఇట్లాంటివి ఎన్నో చూసినా, నరున్ని నమ్మితే కాదని నిన్ను నమ్ముతా ఉండా, ఇది నిజిమేనా,” అంటే “నిజమే,” ఆనే వానదేవుడు. ఆ మాట తీసుకొని ఇద్దరూ ఒగటైరి. పొగులంతా ఆ వానదేవున్ని ఎవరూ చూడకుండా బంగారు బల్లిని చేసేది, గోడకు కరిపిచ్చేది. రేయి మల్ల మామూలు మనిసయ్యేది. ఇట్లా ఆరు నెలలు గడుస్తుంది. ఆయమ్మ నగిర్లో పనిచేసే దాసీలు “వానదేవుడు లేక గొట్టు పెట్టేసింది. యా దేశంలోగాని చినుకే లేదంట, గోగులకు, పచ్చిలకు నీళ్లు లేవు, పంట్లు పండక తిన్ను తిండి లేక సబ్బండి జీవరాశులు అలమటిస్తా, అలాపిస్తా ఉండాయి. ఈ వానదేవుడు ఏమైపోయినాడో ఏమో,” అనుకుంటా ఉంటే అనలక్కమ్మ ఇన్ని “సామీ నువ్వు నా దగ్గరే ఉండిపోతే గోగులుకు నీళ్లు లేవు, పచ్చిలకు మేత లేదు, నువ్వు పోసామి,” అని చెప్తుంది. “అయితే నేను పాతా, నీకు ఏమి కావల్నో కోరుకో,” అంటాడు. “నీకు ఏమి బుద్ది పుడితే అది ఈ సామీ,” అంటుంది. “అట్లయితే నేను పాతా ఉండా, తూర్పు బొయ్యి వానగురస్తా, అపుడు నేను తూర్పుండానని తలుసుకో, పరమట వాన కురుస్తా. నేను పరమటున్నానని తలుసుకో. ఇట్లా నాలుగు దిక్కుల్లో వాన కురుస్తా. నన్ను నగతా తలుసుకో. నేను రేయంత వాన గురస్తా, పొగులంతా పచ్చని చెట్టు కింద కుసోని నీకు కావలసిన చీరలు, రైకలు నేసి, సొమ్ములన్నీ పెట్టికి పెట్టి గరటాలచేత అంపతా, గరటమంతుడు నీ పంచన వాలతాడు, అబుడు ఆ గరటాలునికి పుట్టుడు మేతబోసి, ముగ్గురు ఆడోల్లను పిలిచి ఆ పెట్టి తెరు,” అని చెప్పి ఎలిపాతాడు.
“వానదేవుడు దినానికి ఒక దిక్కున కురుస్తాడు. ఈ అమ్మ ‘పలాన దిక్కున ఉండాడు నా సామి’ అని దండం పెట్టుకుంటుంది. ఈ వానదేవుడు చెప్పిన పకారం రేయంతా వాన గురిపించి పొగులంతా ఆయమ్మకు కావలసిన రకరకాల చీరలు నేసి, సొమ్ములు తయారుచేసి పెట్టి నిండా పెట్టి బీగమేసి, గరటను పిలుస్తాడు. ఆ గరట రెయిన వాలి, “ఏమి సామి,” అనే. “ఏమీ లేదు గరటా, ఏడేడు పద్నాలుగో మేళ్లో ఉంటుంది అనలక్కమ్మ, ఈ పెట్టి ఆమెకు జేరసల్ల,” అనే. “ఏమో సామి పోయేదానికేమో పాతాను, నడిదావలో మీ అక్క అడ్డగిస్తుంది. నా దావన నన్ను పానీయదు, ఏమి చేతు సామి?” అనే. “నువ్వు ఎవురి మాట ఇనద్దు నేరుగా ఎలిపో,” అనే వానదేవుడు.
“అబుడు ఈ గరట ఆ పెట్టి కాలికి తగిలించుకొని వస్తా ఉంటే, నడిదావలో వాన దేవుని అక్క కనిపెట్టేసింది. “గెరటా ఇక్కడరా, గెరటా ఇక్కడరా,” అంటా యల కూతలేస్తుంది. “నేను ఇబుడు వొచ్చేదానికి టైం లేదు” అంటే కూడా ఇన్లా, దావకు అడ్డం పోయింది, “పద గెరటా, రేతిరి చేసిన సొంటి పరమాన్నం నీకోసం అట్లే పెట్నా, పద తిని పోదు,” అనే. సరే, ముందే ఈ గెరట తిండికి తట్టారుసుకోలేడు. సరే అని పాయ! “గెరటా, పెట్టాడ బెట్టి పోయి ఇస్తరాకు కుట్టేదానికి సిగరాకులు పెరుక్కోని రా,” అనే. ఆయప్ప సిగరాకులకు పోయేకుందుకు పెట్టంతా దోచేసి, ఆ పెట్లో ఒగ తాడు, ఒగ మండ్రిగప్ప, ఒక తేలు, ఒగ పాము దాంట్లోకేసి బిగమేసేస.
“ఈ గరట ‘ఎన్ని సిగరాకులు తీడితే ఆకయ్యేది’ అని తిట్టుకుంటా తీసుకోనొచ్చినాడు. రాకిలి బడి ఆడేసి గొడ్డలిచ్చే. ఈనిపుల్లలు చీల్చేదానికి. ‘ఆ రాకిలి బడి చీల్చేది నిజమా ఆ సిగరాకు కుట్టేది నిజమా, ఆయప్ప పరమాన్నం తినేది నిజమా, దీన్నెబుడికి కుడుదు, తూ దీని పరమాన్నమే నా కొద్ద’ని, ఆ పెట్టి తగిలించుకొని ఎలిపాయ. ఈ గరట ఏడేడు పద్నాల్గవ మేడపైన వాలేకుందుకి ఈ అనలక్కమ్మ పుట్టుడు మేత పోసే. అంతా తిని ఆ పెట్టి ఆ యమ్మకు అప్పగించే.
“ఆయమ్మ ముగ్గురు ఆడోళ్లను తోడుకొని పోయి పెట్టి తెరిస్తే ఏముంది? పాము, మండ్రి గబ్బ, తేలు, తాడు కనిపించే. అవన్నీ చూసి, ‘ఈటన్నిటితో నన్ను చచ్చిపొమ్మని పంపినాడు’ అని బాదపడి, ‘ఇంతమందిలో అవమానం అయిపోతినే’ అని మౌనంగా ఉండిపాయ.
“వొగనాటి రేతిరి వచ్చినాడు వానదేవుడు. ఎట్లా చేసినా ఈయమ్మ ఆయప్పతో మాట్లాడనేలే. “నువ్వు నాతో మాట్లాడని కానువు ఏదో నాకు చెప్పకపోతే నీ అన్నగారికి లేని కష్టాలు పెడతా. మీ మిద్దులు, గుర్రాలు, రొక్కము, రాజ్యము అన్ని లేకుండా సర్వశూన్యం చేస్తా, మీకు ఏమి లేకుండా అయిపోతుంది. దేశాలు పట్టుకొని ఎలిపోతారు,” అని కోప్పడినా కూడా ఉతుత్రవ, పతుత్రవ చెప్పదు ఆ యమ్మ.
“చెప్పిన పకారమే ఈ వాన దేవుడు వాళ్లకు కట్టుగుడ్లు తప్ప ఏమి లేకుండా సూన్యం చేసే. “మా అనలక్కమ్మకు నోరు పోవడంవల్లే మాకు ఈ గెతి పట్టింది,” అని ఏడుమంది అన్నగార్లు, ఏడుమంది వొదినగార్లు ఈ యమ్మను తోడుకొని కట్టుగుడ్లతో దావింటి పాతా ఉండారంట.
“వాళ్లు రాజాపురాజులు కదా, యాపొద్దు ఎండ మగమెరిగిండ్ల, కస్టమెరిగిండ్ల. అట్లాంటి వాళ్ళ కాళ్లకు చెప్పుల్లే, నెత్తిన గొడుగులే, కడుపులో కడిలే, దావింటి నడస్తా, సొమ్మగిల్లి సుట్టక పాతా సంగటికి అలాపిస్తా ఉండారంట. అబుడు ఈ వానదేవుడు ఒగ రైతు ఏసికము ఏసుకొని తట్టికి సంగటి ముద్దలు చేసుకుని ఎదురొచ్చినాడంట.
“అది చూసి వాళ్ళ అన్నగారు “అయ్యా ఇట్లా మేము కడి తిని మూడు దినాలాయ, ముద్ద సంగటి పెట్టప్పా,” అని అడిగే. అబుడు ఆయప్ప అందరికీ ఒగ ముద్ద పెడతాడు. ఈ యమ్మ కాడికొచ్చి కావల్సికల్లా “ఏమ్మా నీకు ముద్ద కావాలా?” అని అడుగుతాడు, ఆయమ్మ ఏమి మాట్లాడదు. “ఏమయ్యా? పుట్టకతోనే మూగదా?” అంటాడు వాళ్ళ అన్నగారితో. “లేదు సామి, మద్యలో ఇట్లా అయింది, ఆయమ్మకు నోరు పోవడంతోనే మాకు ఈగెతి పట్టింది,” అని వాళ్ళ అన్నగారు తినే ముద్ద ఆయమ్మకు పెట్టినా తినదు.
“అట్లే వాలు మల్ల దావపడతారు. అట్లే ఆరండ గోరండ ఆడివిలో నడిచొస్తా ఉంటే నీళ్ల దప్పికి నాలికలు కోస్తా ఉండాయి. యాడేగాని గువ్వ దాగను నీళ్లుండవు. మల్ల ఈ వానదేవుడు ఏం చేస్తాడు, సొరకాయ బుర్రనిండా నీళ్లు పోసుకోని ఆడ పెట్టుకొని గొర్లు వంగేస్తా ఉంటాడు. ఈళ్లు ఆ బుర్ర చూసి “ఏమయ్యా ఇట్లా నీళ్ల దాహంతో తపిచ్చి పాతా వుండాము, నీళ్లు కాసిన్ని పొయి,” అనడిగి వాళ్ళ అన్నోల్లందరూ నీళ్లు తాగుతారు. ఈ యమ్మ నీళ్లు అడగదు, తాగదు. అబుడు ఆ వానదేవుడే కలగజేసుకోని ” ఏమ్మా నువ్వు నీళ్లు తాగవా?” అనడగతాడు. దానికీ ఏమీ మాట్లాడదు.
“అట్లే ఇంగా కాందూరం నడుస్తారు. దావలో యానిగి పల్లేరుగాయలు సాబ్బడా పరిసింటాయి. అవి తొక్కి రత్తాలు కారిపోతా ఉంటాయి. వాళ్ల అన్న, వదినగార్లు అమ్మ, అబ్బా అని అరుసుకుంటా నడస్తారు. ఈయమ్మ ఆ మాట కూడా అనదు. అబుడు ఈ వానదేవుడు మెట్లు కుట్టుకొని కట్టికి తగలేసుకోని దావింటి వస్తాడు. అది చూసి వాళ్ళందరూ “సామి, ఇట్లా మాకు రగతాలు గారి అడుగు బూమ్మింద మోపలేకుండా ఉన్నాము. తలాకు ఒగ జోడి ఈయప్ప,” అని బంగపోతారు. ఆయన ఇస్తాడు. వాళ్ళందరూ తలాకొక జోడు ఏసుకుంటారు. ఆయమ్మ ఏసుకోదు. వానదేవుడు “నువ్వు ఏసుకోవా?” అంటాడు అనలక్కమ్మతో, దానికి ఆయమ్మ ఏమీ చెప్పదు.
“అట్లే వస్తా ఉంటే దావలో ఒగ కొలను. ఆ కొలను పక్కన నేరేడుమాను పూత, కాయి ఇరబూసి వాలాడతా ఉంటుంది. వాళ్ళందరూ ఆ కాయలు తిని ఆ కొలనులో నీళ్లు తాగుతారు. ఈయమ్మ తినదు, తాగదు. అట్లే నడుచుకుంటా తూర్పు తుంగబద్ర చేరుకుంటారు. వాళ్ళ అన్నగారు ఆ ఊరు రెడ్డితో మాట్లాడి, ఆ రెడ్డి దగ్గర కాసింత పొలమడిగి కోరుకు సేద్యం చేస్తారు. వొడ్లపంట పెడతారు. ఆ వొడ్లు బండన ఎండబోసి, ఆ బండ కాడ ఈ అనలక్కమ్మను కావిలి పెట్టింటారు. అబుడు ఈ వానదేవుడు పిల్లల కోడై సిదిరి, సిదిరి మేస్తా ఉంటే ఆయమ్మ సో అని కూడా తోలదు. అబుడు ఇరుగుపొరుగోల్లు చూసి “అయ్యో పిలదానా, మీ అన్న వొదిండ్లు కష్టపడి పంట పెట్టి పోస్తే నువ్వు కోళ్ల పాలు చేస్తావా? నోరు లేకపోతే కాళ్ళు, చేతులు ఉండాయి కదా, కట్టితో తోల్లేవా?” అని తిడతారు. అయినా ఏం మాట్లాడదు. బండన పోసిన వడ్లన్నీ పిల్లలకోడి తినేస్తా ఉంది. వాళ్ళ అన్న వదిన గార్లొచ్చి ఉన్నిబన్ని వొడ్లు తోసుకుంటారు.
“వాలన్నోళ్ళు మల్ల సేద్యం చేసి జొన్న పంట పెట్టిరి. ఆ జొన్నపంట కోసి బండన వాములేసుంటారు. దానికి ఈయమ్మనే కావిలి పెట్టి పాతారు. అబుడు ఈ వానదేవుడు గూలెద్దై కొమ్ములతో గూరాడి గూరాడి జొన్నవామంతా తినేస్తాడు. అబుడు కూడా కట్టితో ‘హే’ అని తోలలే. చుట్టుపక్కలోలు ఈ అమ్మనే తిడతారు. ఈ వానదేవుడు పెట్న కష్టాలన్నీ బరిస్తా ఉంది కానీ నోరు మాత్రం ఇప్పలా. అందుకే అంటారు పెద్దలు ఆడది మొకిరేస్తే వాళ్ళమ్మ పితాముడొచ్చినా కదిలించలేరని అంటారు.
“వానదేవుడు ‘ఇంగెట్ల దీన్ని చేసేది’ అని, ఒగ పేదరాశి పెద్దమ్మను పురమాయిచ్చి “ముసలమ్మ, ఎట్లన్న చేసి ఆ చిన్నదాన్ని మాట్లాడి మావిటేల నీ ఇంటికి తొడకొచ్చుకోని పండేసుకో, రెండు దినాలు అడుగు, ఏం నువ్వు మాట్లాడంది, యాల నువ్వు మాట్లాడంది అని. అబుడు ఏమి చెప్తుందో కనుక్కో,” అనే.
“అదే మాట పకారం ఆ ముసిల్ది వాళ్ళ అన్నగారిని అడిగి “నాయనా నేనొగదాన్నే ఇంట్లో, నాకు దిక్కు దరి ఎవరూ లేరు. మీక్కూడా ఇంతమంది జంట్లు పనుకోను చోటులేదు. ఆ బిడ్డను అంపిస్తే నాకాడ పండేసుకుంటా,” అంటుంది. ఆ మాట పకారం ఆ ముసలిదాని ఇంటికి పోయి పోనుకుంటుంది అనులక్కమ్మ.
“ఆ ముసల్ది పక్కలో బండేసుకోని “నాయనా, నువ్వు చూస్తే చక్కగా ఉండావు. నీకు నోరు ఎట్లా పోయింది? నువ్వు ఎందుకు మాట్లాడంది కారణమేమో చెప్పమ్మా,” అని రెండు దినాలు అడుగుతుంది. ఈ యమ్మ ఏమీ చెప్పదు.
“ఆ మూడో దినము వానదేవుడొస్తాడు. వాన దేవునికి ఆ ముసలమ్మ చెబుతుంది, “నాయనా నేను ఎంతెంతో అడిగి చూసినా, ఆ బిడ్డ నోరే ఇప్పలేదు,” అనే. ఆ మాటకు “సరే ముసలమ్మ, ఈ పొద్దు నీ చీరా రైకి నాకియ్యి, నీ ఏసికమంతా నేను ఏసుకుంటా, నువ్వు పక్కన పనుకో, నేను ఆ బిడ్డ పక్కలో పనుకొని ఏం జరిగిందో అడుగుతాను” అంటాడు. అదే పకారం ఆ ముసలిదాని ఏసికం ఏసుకొని పొనుకుని అడుగుతాడు, “కాదు చినదాన, నువ్వు యాల మాట్లాడంది, సుద్దులాడంది, నీ మంచేమి, నీ చెడేమి?” అని రాతిరంతా నిలుకు లేకుండా ఉరిసెరి పందనీకుండా అడుగుతానే ఉంటే, ఈ ముసిల్దాని పోరు బాగై పాయనే, నిదరకూడా పానీయదే అని మనసులో తిట్టుకుంటా, అబుడు నోరు తెరిచి “ఏమే ముసిలిదానా, నీకేం తెలుసు అని, నీకు ఏమి తెలిసిండ బట్టి అడగతా ఉండావు, ఇట్లా నరున్నికాదని, దేవుని నమ్ముకుంటే దేవుడు కూడా నన్ను మోసం చేసినాడు,” అని జరిగిన కతంతా చెప్తుంది.
“ఇట్లా వానదేవుడు సొమ్ములు, చీరలు పెట్టికేసి పంపిస్తాను అని ఆ పెట్లో ఒగ పాము, ఒగ తేలు, ఒగ మండ్రి గబ్బ, ఒగ తాడు ఈ వొస్తువులేసి పంపినాడు. నేనేమన్నా అడిగినానా నాకవన్నీ కావాలని? వాటన్నిటితో నన్ను చచ్చిపొమ్మని కదా పంపినాడు. అందరెదురుగా నగుబాట్లు పాలైతి, ఆ దేవుడు కూడా నన్ను మోసం చేసినాడు,” అని చెప్పుకొని ఏడుస్తుంది. ఆ మాటతో ఆ వానదేవుడు నిజరూపమెత్తి “అయ్యో చినదాన, నేను అడిగినా పొద్దే నువ్వు ఇవన్నీ చెప్పింటే, నేను ఆ పొద్దే నీకు నిజిము చెప్పుదు కదా,” అని వెంటనే గెరటను పిలిచి ఏమి జరిగిందో కనుక్కొని, వాళ్ళ అక్కను పిలిచి ఆయమ్మ దగ్గర నిజమొప్పించుకొని, వాళ్ళ అక్కను తాటాకుల గుడిసెలో పెట్టి, “నేను నీకు అంపినవన్నీ నడిగావులో మాయక్క గెరటను అడ్డగిచ్చి దోచుకునేసింది. ఆయమ్మ చేసిన పని ఇది, నా తప్పు కాదు,” అని మల్ల ఇద్దరూ ఒగటయినారు. మల్ల ఎంటనే అనలక్కమ్మ అన్నలకు పొయిన వైబోగమంతా తిరిగొచ్చింది, రాజ్యము, గుర్రాలు, రొక్కము, మిద్దులు మేల్లు సొంతమైనాయి.
“అందుకే ఆరు నెలలు వానబడితే ఆరు నెలలు గొట్టుపెడుతుంది అంటారు. ఆరు నెలలు వానదేవుడు నేస్తురాలింటికి పొయినాడు అంటారు. ఇదేమ్మ వానదేవుని కత. ఆయప్ప కత చెబితే వాన పడుతుందంటారు”. ‘ఈ పొద్దు వాన పడితే మేలే. ఈ యట్టన్నా తగ్గుతుంది’ అని అందరూ ఎండ తెలియకూడదని ఆ మాట, ఈ మాట చెప్పుకొని వాళ్లు పని ముగించుకొని ఇండ్లకు పోయినారు. ఆ పొద్దు రేయి నడి జామ కాడ ఉరుములు, మెరుపులు, గాలి, వాన ఎత్తుకొని రెండుగంట్లసేపు నిల కురిసింది. ‘వాన పన్నీలే సామి’ అని అందరూ పానాలు తట్టారుసుకుండ్రి.
అర్థాలు:
పాజిట్టు =ప్రాజెక్టు
సమ్మలమిచ్చి = జీతమిచ్చి
జారబడుతుంది = జత చేసుకుంటుంది
దడ్డు = మొల
సిట్టైదిగాలు = చిట్టి వైద్యాలు
తమ్మకర్ర = తమలపాకు పిప్పి
కానువు = కారణం
గరటమంతుడు = గరుత్మంతుడు
ఉతుత్రవ, పతుత్రవ = బదులు
ఏసికము = వేషము
గొట్టు = కరువు
కోరుకు = కౌలుకి
ఉరిసెరి పందనీకుండా = ఊపిరి ఆడనీకుండా
మొకిరేస్తే = మొండికి
సాబ్బడా = సందులేకుండా