డిసెంబర్ 2025

Issue Index Image

కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికిగాను, తెలుగులో బాలసాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత గంగిశెట్టి శివకుమార్ గారి ‘కబుర్ల దేవత’ అనే కథా సంపుటికి ప్రకటించడం ముదావహం. ఇది తెలుగు బాలసాహిత్యానికి దక్కిన గౌరవం. ఒకప్పుడు తెలుగునాట పిల్లల చేతిలో చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి వంటి పత్రికలు కనిపించేవి. ఆ కథలు వారిలో అద్భుతమైన ఊహాశక్తిని, భాషాపటిమను, నైతిక విలువలను పెంచేవి. కానీ నేడు, ఆ స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, యూట్యూబ్ వీడియోలు ఆక్రమించాయి. దృశ్యమాధ్యమాలు, సోషల్ మీడియాలు మెదడుకు శ్రమ లేకుండా సులభమైన వినోదాన్ని అందిస్తాయి. అంతేకాకుండా, నేటి విద్యావిధానంలో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యం పెరగడంతో, పిల్లలు తెలుగును ధారాళంగా చదివే నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా, అక్షరాలను కూడబలుక్కుంటూ, వాక్యాలను అర్థం చేసుకుంటూ, సన్నివేశాలను మనసులో ఊహించుకుంటూ తెలుగు పుస్తకాలు చదివే ఓపిక నేటి తెలుగుపిల్లల్లో సన్నగిల్లుతోంది. ఇది కేవలం ఒక అలవాటు మారడం కాదు, ఒక జాతి భవిష్యత్ తరం తన సొంత భాషకు, సంస్కృతికి దూరమవుతున్న ప్రమాద ఘంటిక.

మరైతే, ఆంగ్ల డిజిటల్ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మన పిల్లలకు తెలుగు పుస్తకాలతో బంధాన్ని ఎలా ఏర్పర్చాలి? నేటితరం పిల్లలు తెలుగు పుస్తకాలు చదవకపోతే, వారు పెద్దవారైన తరువాత తెలుగు భాషను, సాహిత్యాన్ని ఎలా ఆదరించగలరు? వచ్చేతరం తెలుగు చదవలేకపోతే అప్పుడు భాష మనుగడనే ప్రశ్నార్థకమౌతుంది కాదా? నేటి తరం పిల్లలను ఆకట్టుకోవాలంటే, వారి అభిరుచులకనుగుణంగా, కేవలం పాతకాలపు నీతికథలే కాకుండా, సమకాలీన అంశాలతో కూడిన సాహసగాథలు, వైజ్ఞానిక కథలు, కార్టూన్ కథలు ఉన్నత ప్రమాణాలతో అందజేయాలి. ప్రచురణకర్తలు కూడా నాణ్యమైన కాగితంతో, ఆకట్టుకునే రంగుల బొమ్మలతో పుస్తకాలను ముద్రించి పిల్లలను ఆకర్షించాలి. ఆంగ్ల డిజిటల్ కంటెంట్‌తో పోటీపడేలా పిల్లలకోసం తయారుచేసే తెలుగు కంటెంట్ ఉన్నతమైన ప్రమాణాలతో ఆధునిక హంగులు అద్దుకోవాలి. మన పిల్లల్లో తెలుగు భాషపట్ల అభిమానం, వారిలో తెలుగు పఠనాసక్తిని పెంచడం కేవలం బడి బాధ్యతో, ప్రభుత్వ బాధ్యతో కాదు, ఇది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. ఇంట్లో తెలుగు పుస్తకాలకు ఒక చిన్న అరను కేటాయించాలి. రోజూ కాసేపైనా వారికి తెలుగు కథలు చదివి వినిపించాలి; వారితో తెలుగు చదివించాలి. రాబోయే హైదరాబాద్, విజయవాడవంటి నగరాల్లో జరిగే పుస్తక ప్రదర్శనలు కూడా ఇందుకు ఒక చక్కటి వేదిక. ఈసారి మీ పిల్లలను బుక్ ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లి, ఖరీదైన ఆంగ్ల పుస్తకాలతో పాటు వారికి నచ్చిన తెలుగు కథల పుస్తకాలను కొనివ్వండి. ఒక మంచి పుస్తకం వారి చేతిలో పెట్టడం అంటే, వారికి ఒక కొత్త ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వడమే. రేపటి తరాన్ని తెలుగు చదివే తరంగా తీర్చిదిద్దడానికి ఈరోజే శ్రీకారం చుట్టేద్దాం.