నాకు రోజూ శనివారమే, రోజూ ఆదివారమే! ఎందుకంటే, ఉద్యోగ విరమణ చేసి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఇంటి పట్టునే వుంటూ వుంటాను కాబట్టి! పిల్లలు తమ పిల్లలతో వేరే ఇళ్ళల్లో మాకు దగ్గిర్లోనే వుంటారు. పొద్దున్నే నాలిగింటికి కార్లో కూర్చుంటే, మా అమ్మాయి ఇంటి దగ్గిర నాలుగూ నలభై కల్లా వుంటాం. మా అబ్బాయి ఇంటి దగ్గిర ఆరింటి కల్లా వుంటాం. అమెరికాలో ఈ ప్రయాణాలు ఒక లెక్కలోకి రావు. పిల్లలు చాలా దగ్గిర్లో వున్నట్టే లెక్క.
ఆ రోజు శనివారమో, బుధవారమో, సరిగా గుర్తు లేదు. అన్ని రోజులూ ఒకే లాగ వుంటున్నాయి ఈ మధ్య. పొద్దున్నే ఉపాహారం సేవించి, యూట్యూబ్‌లో వీడియోలు తిరగేస్తూ కూర్చున్నాను.
నా చిన్నప్పటి, “రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా” అనే పాట వీడియో, “ఉండమ్మా బొట్టు పెడతా” అనే సినిమా లోది కనపడింది. ఆ పాట లోని సాహిత్యాన్ని పక్కన పెడితే, సంగీతం చాలా బావుంటుంది. పాడిన వారి గొంతులు కూడా చాలా బావుంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన పాట!
ఇంకేముంది? వెంటనే ఆ వీడియో నొక్కేసి, చూస్తూ వినసాగాను.
పల్లెటూరునీ, ఆ జనాలనీ, ఆ పశువులనీ చూస్తూ, ఆ పాట వింటూ వుంటే, పాట లోని ఒక వాక్యం దగ్గిర నా మనసు ఆగిపోయింది. “పాడిచ్చే గోవులకూ పసుపూ కుంకం …” అనే లైనులో, ఆవూ దూడలను చూస్తూ వుంటే నా మనసు పరవశించి పోయింది.
ఆవును పెంచుకోవాలనే కోరిక నిజంగా పుట్టేసింది. ఆ కోరిక గబ గబా పెరగడం మొదలెట్టింది కూడా. ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తూ వుండి పోయాను.
అంతట్లో, లోపట్నించీ మా వరలక్ష్మి విసవిసా వచ్చేసింది. “అబ్బ! ఎన్నిసార్లు అదే పాటను చూస్తారూ? లోపల్నించీ దాన్నే మళ్ళీ మళ్ళీ వినలేక చస్తున్నాను. సౌండు అన్నా పూర్తిగా తగ్గించండి, లేదా, వీడియో అన్నా మార్చండి!” అనేసి విసురుగా లోపలికి వెళ్ళి పోయింది.
ఆవిడి మాటలకు నాలో చలనం ఏమీ లేదు. కాదు మరీ? నలభై యేళ్ళ నుంచీ వినే మాటలకు కూడా జడుస్తాడా ఏ బుద్ధున్న వాడైనా?
“ఇదిగో వరం! ఇలా రా ఒకసారి!” అంటూ మంచిగా పిలిచాను.
అయితే, పిలిచే ముందు వీడియోని ఆపేశాను. దాంతో, ఈ సారి చాలా మామూలుగా మంద గమనంతో వచ్చింది హాల్లోకి మా వరలక్ష్మి.
“అది కాదు వరం! మరే, మరే, ఆ పాటలో, ఆవూ దూడలను ఎంత బాగా చూపించారో! పశువుల పాక కూడా చూపించారు. ఎద్దులను కూడా చూపించారు గానీ, అవి మనకు వొద్దు. ఆవు కూర్చుని బాగా నెమరు వేస్తూ వుంటే, ఆ దూడ పక్కనే వుండి తల్లి వేపే చూస్తూ వుంది. చక్కగా ఒక దూడని పెంచుకుందాం! అది పెద్దదై, ఆవు అవుతుంది. పాలు ఇస్తుంది. పాలూ, పెరుగూ, వెన్నా, నెయ్యీ, కావలసినంత తాజావీ, స్వచ్ఛమైనవీ దొరుకుతాయి. పాలతో చిక్కటి ఫిల్టర్ కాఫీ చేసుకోవచ్చు పొద్దున్నే. ఏమంటావు?” అంటూ లాలనగా అడిగాను.
“అంత సౌమ్యంగా పిలిచినపుడే అనిపించింది, ఏదో కొంప మీదకి తెస్తున్నారని. దూడని పెంచుతారా? ఆవుని చేస్తారా? పాలు పితుకుతారా? మీకేం వచ్చని ఈ పనులన్నీ?” అని గట్టిగా అడిగేసింది.
“అందరూ అన్నీ వచ్చే చేస్తున్నారా? మొన్నటి వరకూ రకరకాల కూరగాయలు పెరట్లో పెంచలేదూ? ఎన్నో పళ్ళ చెట్లను నాటలేదూ? అన్నీ వచ్చే చేశామా? తెలియక పోతే, తెలుసుకుంటాం. పెరట్లో ఒక దూడ ఛెంగు ఛెంగున తిరుగుతూ వుంటే, ఎంత బావుంటుంది?” అని జవాబిచ్చాను తగ్గకుండా.
“తేగంటి బిడ్డ — అనంటే, తేగ కావాలని ఏడ్చిందట ఒకతె! అలా వుంది మీ విషయం. సినిమా పాట వీడియో చూసి, దూడను పెంచుతానూ, ఆవును చేస్తానూ అంటారా? ఇదెక్కడి విడ్డూరం?” అంటూ విస్తుబోయింది మా వరలక్ష్మి.
ఒక సారి ఒక విషయం మీద నా మనసు పారేసుకుంటే, ఇక ఎవరి మాటా, నా చేతులు కాలే వరకూ, విననని మా వరలక్ష్మికి తెలుసు. అయినా నా మనసు మార్చాలని ప్రయత్నం మాత్రం వొదలకుండా చేస్తూ వుంటుంది.
“నువ్వెన్ని చెప్పినా సరే! చక్కటి దూడని పెంచేది ఖాయం! ఆవుని చేసేది ఖాయం! ఇది అమెరికా! ఏమన్నా చెయ్యొచ్చు. ఆ స్వేచ్ఛ వుంది. అన్నీ కనుక్కుంటాను. నువ్వు కూడా కాస్త సహాయంగా వుంటావని చెప్పాను” అనేశాను మొండిగా.
“హు!” అని నిట్టూర్చింది మొదట. తర్వాత, “అన్ని విషయాలూ కనుక్కోండి మొదట. ఆ తర్వాత ఆ పనుల్లో నన్ను చేర్చకండి. ఆ పేడలు ఎత్తడం, పిడకలు చేయడం, పాక తుడవడం, అన్నీ మీరే చేసుకోండి. నా వల్ల కాదు. ముందే చెపుతున్నాను. తర్వాత నా మీద పనులు వేద్దామని చూస్తే, మర్యాద దక్కదు!” అని నిష్కర్షగా చెప్పేసి, లోపలికి వెళ్ళి పోయింది.
పిడకలు చేయడం ఏమిటీ? ఈవిడేమన్నా భోగి మంట వేస్తుందా? లేక, పిడకలతో పొయ్యి అంటించి, ఎసరు పడేసి, అడ్డగిన్నెతో అన్నం వొండుతుందా? అంతా చాదస్తం! ఆ పేడని ఎత్తి యార్డ్ వేస్ట్ డబ్బాలో వేసేస్తే, చెత్తను పట్టికెళ్ళే కంపెనీ వాళ్ళు తీసుకు పోతారు. అంతేగా! అసలు అది కూడా అక్కరలేదు. మా దొడ్లో బోలెడన్ని మొక్కలూ, చెట్లూ వున్నాయి. వాటి మొదట్లో ఆవు పేడ వేస్తే, ఎంత శ్రేష్ఠం! మంచి ఎరువు కదా? ఈవిడికి ఏమీ తెలీదు బొత్తిగా! — అని నా స్వగతం.
మళ్ళీ పిలిచాను ఆవిణ్ణి మర్యాదగా. “ఆవు పేడని మొక్కలకీ, చెట్లకీ ఎరువుగా వేసేద్దాం. ముక్కుకి మాస్క్ కట్టుకుని, చేతులకి గ్లవుజు వేసుకుని, పేడని నేనే ఎత్తుతానులే!” అని చెప్పాను గొప్పగా.
“ఇంకేం మొక్కలు? మీ దూడ వాటిని మేసేస్తుంది కదా?” అంది వరలక్ష్మి ఎగతాళి చేస్తూ.
కంగారు పడి పోయాను. అవును, భారతదేశంలో ఆవులు ఆడపిల్లల వెనకాల పడి, వాళ్ళ జడల్లోని పువ్వులను తినెయ్యడం గుర్తే! పెరటి తలుపు తీసి వుంటే, అవి ఇంట్లోకి జొరబడి, మొక్కలు మేసెయ్యడం కూడా అనుభవంలో వుంది. “అలా అంటావేమిటి? అలా అనకు. మన చిన్న దూడని షెడ్డులో కట్టేస్తాం కదా?” అన్నాను గాబరాగా.
“రోజంతా అలాగే కట్టి వుంచుతారా? అది స్వేచ్ఛగా తిరగొద్దా? ఇక మీరు దాన్ని ఆవును చేసినట్టే!” అంది వెక్కిరిస్తూ.
“అదేం కాదు! నేనొక చిన్న ట్రక్కు కొంటాను. ట్రక్కు వెనక వేపు దూడని పెట్టి, వూరు చివర కొండల దగ్గిరికి తీసుకెళతాను రోజూ. నాకూ వ్యాయామంగా వుంటుంది” అని వివరించాను.
“చిన్న ట్రక్కు ఏం ఖర్మ? పెద్దదే కొనండి! చాలా పెద్దది! అప్పుడు చిన్న ఏనుగు పిల్లని కొనండి. దాన్ని పెద్ద ఏనుగుగా చేయండి. దాని వల్ల ఏం ఉపయోగాలున్నాయో కనుక్కోండి!” అని ఏడిపించి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది.
నాలో నేనే కాస్సేపు గొణుక్కున్నాను.
“ఏమిటీ గొణుక్కుంటున్నారు? వినబడ్డం లేదు మరి!” అని లోపల్నించీ అరిచింది మా వరం.
“వినబడ కూడదనే కదా గొణుక్కోవడం? ఎలా వినిపిస్తుంది?” అని దూకుడుగా తిరిగి ప్రశ్నించాను.
దానికి లోపల్నించీ నిశ్శబ్దమే సమాధానం అయింది.
ఆవు గురించి కనుక్కుందామంటే, అమెరికాలో ఒక్కడు కూడా దొరకలేదు! అంటే, ఆవు గురించి తెలిసిన వాడూ, నాకు తెలిసిన వాడూ, దొరక లేదని అర్ధం. ఇంకా నాతో సంబంధ బాంధవ్యాలతో వున్న నా చిన్నప్పటి నేస్తాల్నితలుచుకుంటే, మా సీతారావుడు గుర్తొచ్చాడు. వీడు, నాతో ఎమ్మెస్సీ (టెక్) ఎలక్ట్రానిక్స్ ఆంధ్రా యూనివర్శిటీలో చదివాడు. వీడితో పాటు, వీడు ఆ రోజుల్లో చెప్పిన ఆవు కథ కూడా గుర్తొచ్చింది.
వెంటనే మా వరాన్ని మళ్ళీ పిలిచేశాను. ఆవిడ లోపట్నించీ మళ్ళీ వచ్చేసింది.
“వరం! వరం! మా సీతారావుడు చెప్పిన ఆవు కథ చెప్పనా?” అనడిగాను ఆశగా.
అప్పుడు గుర్తొచ్చిన ఆ చిన్న కథ ఎవరికన్నా చెప్పకపోతే, నా కడుపు ఉబ్బరం తగ్గే లాగా లేదు.
మా వరలక్ష్మికీ కథలు వినడమంటే ఇష్టమే, పాపం! “చెప్పండి, చెప్పండి!” అంది ఆత్రంగా. మళ్ళీ, “ఇదివరలో చెప్పేసిన కథా? పత్రికల వాళ్ళ లాగా, ఒక సారి చెప్పేసిన కథను నేను మళ్ళీ వినను!” అంది ఖరాఖండిగా.
“అదేం లేదులే! ఇదే మొదటి సారి చెప్పడం. నీ మీదొట్టు! విను ముందర!” అంటూ మొదలెట్టాను.
ఆంధ్రా యూనివర్శిటీలో చదివే రోజుల్లో, మూడేళ్ళ చదువు లోని రెండో యేడు, ఈ సీతారావుడు నాకు హాస్టల్‌లో గది నేస్తం! వాళ్ళది శ్రీకాకుళం దగ్గిర్లో వున్న ఆముదాల వలస. మరి అదో, దాని దగ్గిర్లో వున్న వేరే పల్లెటూరో సరిగా గుర్తు లేదు. కలిసిన నెల రోజుల లోపల్లే, “ఒరేయ్!” అంటే, “ఒరేయ్!” అనే స్నేహం లోకి దిగిపోయాం.
“ఒరేయ్! మీ పల్లెటూరు కథ ఏమన్నా చెప్పరా? ఆవు పాలూ, గట్రా చాలా చవగ్గా దొరుకుతాయంటగా? పుస్తకాల్లో చదివాను” అనడిగాను ఓ రోజు.
“అకస్మాత్తుగా పాలివ్వడం మానేసిన ఆవు కథ చెప్పనా?” అనడిగాడు సీతారావుడు నవ్వుతూ.
వాడు, కబుర్లూ, అవీ చాలా చక్కగా కళ్ళకి కట్టినట్టు చెపుతాడు. ఒక సినిమా చూశాడంటే, అందులోని సన్నివేశాలన్నీ కళ్ళకి కట్టినట్టు చెప్పేస్తాడు. “చెప్పు, చెప్పు!” అన్నాను ఆత్రంగా.
“మా ఊళ్ళో ఒకరింట్లో ఒక ఆవు వుండేది. అదెప్పుడూ, మూడో, నాలుగో శేర్ల పాలు ఇస్తూ వుండేది ప్రతీ రోజూ. అది ఉండుండి, అకస్మాత్తుగా పాలివ్వడం మానేసింది!” అని చెప్పి కాస్త ఆగాడు సీతారావుడు.
“ఆవులు సమ్మె చేస్తాయా ఎక్కడన్నా? నేను నమ్మను” అన్నాను గట్టిగా.
“నువ్వు నోరు మూసుకుని విను. పూర్తిగా చెప్పాక అప్పుడు మాట్టాడు” అన్నాడు గసురుకుంటూ.
నిజం గానే కొడతాడనే భయంతో, నోటిని రెండు చేతులతో మూసి, విన సాగాను.
“ఆ ఇంట్లో ఎవరికీ అర్ధం కాలేదు. ఆవు అకస్మాత్తుగా పాలు ఇవ్వడం ఎందుకు మానేసిందో, ఎవరికీ అర్ధం కాలేదు. ఊళ్ళో వున్న పశు వైద్యుడిని పిలిపించి చూపించారు. ఆ వైద్యుడు, ఆ పశువుకు అన్ని పరీక్షలూ చేసి, పశువు ఆరోగ్యం గానే వుందనీ, ఏ లోపమూ లేదనీ తేల్చేశాడు. పాలివ్వడం మానేసిందని ఇంట్లో వాళ్ళు ఆరోపిస్తే, అలాంటి దేమీ లేదని, ఇంట్లో వాళ్ళెవరో ఆ పాలు తాగేసి, ఆవు ఇవ్వడం లేదని దుష్ప్రచారం మొదలెట్టి వుంటారని, గట్టిగా చెప్పేసి, చక్కా పోయాడు ఆ వైద్యుడు. ఇంట్లో వాళ్ళు ఒకరి వేపు ఒకరు కాస్త అనుమానంగా చూసుకున్నా, వాళ్ళలో ఏ ఒక్కరో నాలుగు శేర్ల పాలు తాగేసి వుంటారని ఏ ఒక్కరూ నమ్మలేదు. ఆ రాత్రి గొడ్ల పాక వేపు ఇంటి కిటికీ లోంచి కాపలా కాస్తూ చూశారు. వారు చూసింది, వారే నమ్మలేక పోయారు. అర్ధరాత్రి దాటాక, ఒక పాము, జెర్రి గొడ్డు, చరచరా పాక్కుంటూ ఆ ఆవు దగ్గిరికి వచ్చింది. ఆ పాము, ఆవును కరుస్తుందేమోనని ఇంట్లో వాళ్ళు కాస్త కంగారు పడ్డారు గానీ, ఆశ్చర్యం తోనూ, భయం తోనూ, అలాగే చూస్తూ వుండి పోయారు. ఆ పాము, ఆవు వెనక కాళ్ళ మీదకి పాకి, వాటిని చుట్టేసి, ఆవును కింద పడేసింది. ఆవు కాస్తా నోర్మూసుకుని, భయంతో కింద పడిపోయింది. అప్పుడా పాము జరజరా పాక్కుంటూ, ఆవు పొదుగు దగ్గిరికి వెళ్ళి పాలు తాగెయ్యడం మొదలెట్టింది. అరిస్తే, కాటేస్తుందేమోననే భయంతో ఆవు కూడా కిమ్మనలేదు. అలా పాలన్నీ తాగేసి, ఆ పాము తన దారిన తాను వెళ్ళి పోయింది. అప్పుడా ఆవు మామూలుగా పైకి లేచి, గడ్డి తినడం మొదలు పెట్టింది. అప్పుడు అర్ధం అయింది ఆ ఇంట్లో వాళ్ళకి, ఆ ఆవు అకస్మాత్తుగా పాలు ఇవ్వడం ఎందుకు మానేసిందో! రోజూ ఆ జెర్రి గొడ్డొచ్చి పాలన్నీ తాగేసి, తన మానాన తాను చక్కా పోతోందన్న మాట! ఎవరికీ చెప్పుకోలేక ఆ ఆవు మౌనంగా గడ్డి తింటూ వుండి పోయింది. ఆ మర్నాటి రాత్రి, పాముల బసవన్నను పిలుచుకు వచ్చారు. పాము రాగానే, ఆ పాముల బసవన్న నాగస్వరం వూదేసి, వింటూ తలాడిస్తున్న ఆ పాముని పట్టుకుని, ఇంటి వారి దగ్గిర డబ్బులు తీసుకుని, పాముతో సహా వెళ్ళి పోయాడు” అని చెప్పి ఆగాడు సీతారావుడు.
“ఆ తాచు పాము, నాలుగు శేర్ల పాలనీ ఒక్కతే తాగేసిందా?” అని ఆశ్చర్యంగా అడిగాను నోరెళ్ళబెట్టి. అసలే నాకు పామంటే చాలా భయం. అసహ్యం కూడా! ఒళ్ళు జలదరిస్తుంది దాన్ని తలుచుకుంటేనే! అయినా సరే, సీతారావుడు చెప్పిన కథను చెప్పక తప్పలేదు నాకు.
“తాచు పాము కాదు. జెర్రి గొడ్డు. తాచు పామంటే విషం కలది. కోరలు కలది. జెర్రిగొడ్డుకి విషం వుండదు. అయినా, ఏ కాసిని పాలో ఒదిలేసి వుంటది. మర్నాడు ఆ దూడ తాగేసి వుంటది” అన్నాడు వాడు.
ఆ కథని వినేసి, పామంటే భయపడుతూ, నోటి మాట లేకుండా వుండి పోయాను ఆ రోజు!
“ఈ కథని నమ్మిన మీరు, ఉత్త వెర్రి బాగులోళ్ళన్న మాట!” అని ఝాడించేసింది మా వరలక్ష్మి.
“అప్పట్లో అంతే! క్లాసు పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు ఎక్కువగా చదవలేదు. మహా అయితే, నవలలూ, సినిమా పత్రికలూ చదివాను! కథని నమ్మేశాను అప్పుడు. ఆ తర్వాత కాలంలో తెలిసింది, పాములు పాలు తాగవనీ, అదొక అభూత కల్పన అనీ! పాముకు చెవులు లేవనీ, అది నాగస్వరం వినదనీ కూడా అప్పుడు తెలీదు. నిజం గానే ఉత్త వెర్రి బాగులోళ్ళం! చెప్పేవాడూ, వినేవాడూ ఎంతో నమ్మకంతో వున్నారు ఆ రోజుల్లో. చెప్పేవాడయితే, పల్లెటూళ్ళో అక్కడో, ఇక్కడో, ఎక్కడో కాస్త విన్నదీ, కొంత తానూహించుకున్నదీ, అన్నీ కలిపేసి, ఆ కథను సొంతం చేసుకున్నాడు. చాలా ఉత్కంఠగా చెప్పేశాడు. ఇక, వినేవాడికి అభూత కల్పనలంటే పిచ్చి భ్రమ. అప్పటికే, “పున్నమి నాగు” సినిమాను చూసి, చాలా భయపడ్డాను. నమ్మక ఛస్తానా?” అంటూ నన్ను నేను సమర్ధించుకున్నాను.
“మరి అలాంటి మీ నేస్తానికి ఆవు గురించి అన్నీ తెలుస్తాయని మీరు నమ్ముతున్నారా?” అని సూటిగా, మొహమాటం లేకుండా అడిగేసింది మా వరం.
ఆ అనుమానం నాక్కూడా కాస్త లేకపోలేదు. అయినా, ఆ మాటను తన ముందర ఒప్పేసుకుని, నా నేస్తాన్ని మొదట కించపరిచి, ఆ తర్వాత నేను కించపరుపుకు గురవడానికి మనసు ఒప్పుకోలేదు.
“అదేం మాట? చిన్నప్పుడు ఏదో తెలియక కథలను నమ్మితే, పెద్దయ్యాక కూడా అలాగే వుంటాడా మా సీతారావుడు? ఇప్పుడు వాడొక పెద్ద ఫిజిక్స్ లెక్చరర్ ఆ వూళ్ళో. ఆవుల గురించి బాగానే తెలిసి వుంటుంది. మొదట నన్ను మాట్లాడనియ్యి!” అని కాస్త చనువుగా గసురుకున్నాను.
ఆ క్షణాన్న ఏ మూడ్లో వుందో గానీ, మా వరం ఏమీ అనకుండా ఊరుకుంది.
తలుచుకున్న వెంటనే తాత పెళ్ళన్నట్టు, వెంటనే మా సీతారావుడికి ఫోను చేసేశాను. భారతదేశంలో వున్న వాడికి రాత్రి తొమ్మిదీ నలభై అయివుంటుంది. నిద్రలో వుంటే, వాడే ఫోను ఎత్తడులే అని చేశాను. ఆ రోజు నా అదృష్టం ఎక్కడ పుచ్చిందో మరి, వాడు వెంటనే ఫోను ఎత్తాడు. ‘హలో’ అని కూడా అనేశాడు.
“అమెరికాలో అందరూ మోజు కొద్దీ, కుంపట్లూ, రుబ్బు రోళ్ళూ, తిరగళ్ళూ, రోకళ్ళూ, రాచ్చిప్పలూ, ఇత్తడి బిందెలూ, గట్రా కొనుక్కుని పాత సంస్కృతిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆ మధ్య అయితే, ఒక తెలుగు సంస్థ వాళ్ళు, ఒకే ఒక సారి, తోలుబొమ్మలాట కూడా ప్రదర్శించేశారు. ఆ తర్వాత దాన్నందరూ మర్చిపోయారనుకో! ఆ గోల ఏల? నాకయితే, ఇప్పుడు ఆవును పెంచుకోవాలనుంది. రిటైరయ్యాను కాబట్టి, దాని పనులన్నీ నేనే చూసుకుంటాను శ్రద్ధగా. తాజా ఆవు పాలతో చిక్కటి కాఫీ, తాజా ఆవు పాలతో గట్టి పెరుగూ, దాన్నించి వచ్చిన తాజా వెన్నతో కాచిన తాజా నెయ్యీ — ఇవన్నీ కావాలి. వీటి కన్నా ముందు, జున్ను పాలు కూడా కావాలి ఇంట్లో ఆవు నుంచి. నువ్వు నవ్వినా సరే, వెక్కిరించినా సరే, నేను ఆవును పెంచక మానేది లేదు. కాబట్టి ఆవు పెంపకం గురించి నీకు తెలిసింది చెప్పు” అన్నాను కాసింత బతిమాలుతున్నట్టు.
సీతారావుడేమో నిద్రకి తయారవుతున్నాడు ఆ సమయంలో పాపం! అందుకే నవ్వనూ లేదు, వెక్కిరించనూ లేదు. గట్టిగా ఆవలించాడు. ఆవు గురించి తనకు తెలిసింది చెప్పడం మొదలు పెట్టాడు. ఆవుకి నాలుగు కాళ్ళూ, రెండు కొమ్ములూ, ఒక తోకా వుంటాయని అనలేదు గానీ, ఆవు పచ్చగడ్డి మాత్రమే ఇష్టంగా తింటుందనీ, దాన్ని తర్వాత నెమరు వేస్తుందనీ, దానికి వానంటే పడదు అనీ, గేదెకి అయితే వానంటే పడుతుంది అనీ, ఆవు మెడకింద గంగడోలు వుంటుందనీ, దాన్ని నెమరితే ఆవు సంతోషిస్తుందనీ, దాని ఒంటి మీదకి నులి పురుగులు రాకుండా చూసుకోవాలనీ, దాని పాకని చాలా శుభ్రంగా వుంచుకోవాలనీ చెప్పాడు. దానికి నీరు బాగా పెట్టాలని కూడా చెప్పాడు. కుడితి సంగతి మాత్రం ఏమీ చెప్పలేదు.
“ఆవు తనను కొట్ట వచ్చిన వారిని కొమ్ములతో పొడుచును” అని కూడా ఆవు వ్యాసం లోని మాటలు చెపుతాడేమోననుకున్నాను గానీ, పాపం, చెప్పలేదు.
ఆ మాటలు చెప్పేసి, ‘గుడ్ నైట్’ చెప్పేసి, ఫోను పెట్టేశాడు సీతారావుడు.
ఆవు వ్యాసాన్ని పక్కన పెట్టినా, ఒక వాక్యం నా బుర్రలోకి ఎక్కేసింది. ఆవు పాకను శుభ్రంగా వుంచుకోవాలనే మాటలు బాగా పట్టాయి నాకు.
ఇంకేముంది? వెంటనే ‘హోమ్‌డిపో’కి వెళ్ళి, కావలసిన సామానులన్నీ కొనేశాను. ఆ షాపు పార్కింగ్‌లాట్‌లో వున్న మెక్సికన్ వాళ్ళిద్దరిని బేరమాడి ఇంటికి తోలుకు పోయాను. వాళ్ళ చేత పెరట్లో ఒక షెడ్ తయారు చేయించేశాను.
“ఎందుకండీ ఈ షెడ్? ఏం వుంచుతారు దీంట్లో?” అని వచ్చీ రాని ఇంగ్లీషులో అడిగారు వాళ్ళు.
ఆవును పెంచుదామనీ, అందుకే ఆ షెడ్ కావాల్సి వచ్చిందనీ చెప్పాను. వాళ్ళు చాలా సంభ్రమంతో చూశారు నా వేపు. ఆ చూపులో కాస్త మెప్పుదల కూడా కనపడింది నాకు. ఆ సంతోషంతో వాళ్ళతో బేరమాడిన దాని కన్నా ఎక్కువ, అంటే, మొదట్లో వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చాను. వాళ్ళు బోలెడంత సంతోషించేసి, ‘ఆల్ ద బెస్ట్’ చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందర వాళ్ళకి పొద్దున్న చేసిన దిబ్బరొట్టె పెడదామనుకున్నాను గానీ, వాళ్ళొద్దంటారని మానేశాను. అదీ గాక, వాళ్ళా రొట్టె తిని ఆరోగ్యం పాడు చేసుకుంటే, పోలీసులు నన్ను పట్టుకుంటారని ఒక భయం కూడా!
దొడ్లో పశువుల పాక తయారయి పోయింది. మా వరలక్ష్మి కూడా దాన్ని చూసి సంబరపడింది.
“ఇంట్లోని పాత సామాను దీంట్లో పెట్టుకోవచ్చు. మన కారు గేరేజీ నిండి పోయింది సామాన్లతో” అంటూ సంతోషించింది.
“ఇంకా నయం! ఇది మన ఆవు కోసం. ఇందులో ఏ సామానూ పెట్టడానికి వీల్లేదు. ఆవుకు సంబంధించిన సామాన్లే వుంటాయి” అని గట్టిగా చెప్పేశాను.
మా వరానికి గుస్సా వచ్చేసింది. “సర్లెండి! మీ సంబరం ఎన్నాళ్ళో నేనూ చూస్తాను!” అని అపశకునం పలుకుతూ ఇంట్లోకి విసవిసా వెళ్ళిపోయింది.
మళ్ళీ కాస్సేపటికి, నేను పిలవకుండానే తనే వచ్చింది లోపల్నించీ మా వరం. ఆవిడి మొహంలో చిన్న నవ్వు కూడా వుంది.
“ఏమండోయ్! ఇంతకీ మీ దూడకి పేరేం పెడతారూ? తెలుగు పేరే పెడతారా?” అనడిగింది అల్లరిగా.
అయ్యో! పేరు సంగతే ఆలోచించలేదు బొత్తిగా!
“అమెరికాలో వుంటూ తెలుగు పేరేమిటి? అమెరికా దూడకి అమెరికా పేరే పెడతాను. ‘మేడిసన్’ అనే పేరు పెట్టి, ఇంట్లో రోజూ, ‘మేడీ’ అని పిలుస్తాను. మనుషులకు పేర్లున్నట్టే, దూడకి కూడా పేరు వుండాలి కదా?” అన్నాను వివరంగా.
“అలాగే! మీరూ, మీ ‘మేడీ’ కలిసి ఒక ఫోటో తీయించుకుని, ఫేస్‌బుక్‌లో పెట్టుకోండి. నలుగురూ చూసి, వ్యాఖ్యానాలు చేస్తారు. లైకులు కూడా ఇస్తారు. ఆ తర్వాత మీరే, మీ ‘మేడీ’కి దిష్టి కూడా తియ్యండీ” అనేసి నవ్వుకుంటూ లోపలికి చక్కా పోయింది మా వరలక్ష్మి.
ఆ గొడ్ల పాకకు, అదే షెడ్డుకు, దగ్గిర్లో కొంత మేర పచ్చ గడ్డి చాపను షాపులో కొని, పరిచాను. రోజూ నీళ్ళు పోస్తే, అది బాగా పెరిగి, దూడకు కావలసినంత పచ్చగడ్డిని ఇస్తుందని ఆశ!
ఇక, తెలియని విషయాలను తెలుసుకోడానికి ఈ రోజుల్లో ఒకటే మార్గం! అదే, కృత్రిమ మేధ! అదేనండీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్! గూగుల్ వారి జెమినైని అడిగాను దూడ పెంపకం గురించి. చెప్పేసింది ఎంతో ప్రేమతో!
దూడ దత్తత ప్రక్రియ అనేది వుండక పోవచ్చంది. పశువుల పెంపకందారులను అడగమంది. మా రాష్ట్రంలో వున్న పశుసంవర్ధక శాఖ వారిని సంప్రదించమంది. దూడల ఆరోగ్య ధృవీకరణ పత్రాలనూ, వేక్సినేషన్ రికార్డులనూ తప్పకుండా పరిశీలించమంది. దూడకి షెడ్డూ, కంచే, మేత స్థలం, గడ్డీ, నీరూ, గట్రా కావాలంది. ఒక పశువైద్యుడిని సంప్రదించమని కూడా చెప్పింది. కొత్త టీకాలు వేయించమంది. నులిపురుగులతో జాగ్రత్త — అని కూడా చెప్పింది. ఆవుకు దూడ పుడితేనే గానీ, పాలు ఇవ్వదని తెలిసిన విషయమే చెప్పింది. ఆవును ఇంట్లో పెంచుతున్నారు కాబట్టి, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అనుమతి కోసం కనుక్కోమంది. పేడ గురించి కూడా చెప్పింది.
అబ్బ! ఒక మానవ పిల్లనో, పిల్లాడినో పెంచుకోడానికి కూడా ఇన్ని నియమాలూ, పద్ధతులూ వుంటాయో వుండవో తెలీదు గానీ, దూడ కోసం మాత్రం మూడు పేజీల వివరాలు ఇచ్చింది!
అవన్నీ చదివే సరికి, చాలా నీరసం వచ్చింది! అయినా సరే, మళ్ళీ ఉత్సాహం తెచ్చుకుని, అవన్నీ పాటించాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే దూడకి కావల్సిన పాకని, అదే షెడ్డుని, వేయించేశాను కదా? మరి ఇంకేం?
అంతర్జాలం అంతా వెదికి అన్ని ఫోను నంబర్లూ సంపాదించాను. రేపట్నించీ వాళ్ళందరికీ ఫోను చెయ్యాలని ఒట్టేసుకున్నాను నా మీద నేనే!
మొదటగా, పిల్లలకి చెప్పాలి. తర్వాత మాకు చెప్పలేదేం? — అని నా మీద నిష్ఠూరాలు వేస్తారు.
మా అమ్మాయికి ఫోను చేసి చెప్పాను. నా ఉత్సాహానికి మా అమ్మాయి చాలా సంతోషించింది. “నాన్నా! నన్ను ఉద్యోగంలో పెట్టుకో! ఆ దూడ సంగతంతా నేను చేసుకుంటాను. మా కంపెనీలో ఈ వెధవ ఉద్యోగం చెయ్యలేకపోతున్నాను. జీతం మాత్రం తగ్గించకూడదు. నేను చేస్తా!” అంటూ సంబర పడింది.
ఆ తర్వాత మా అబ్బాయికి ఫోను చేసి చెప్పాను. వాడు, నవ్వాడు. బాగా నవ్వాడు. ఆ తర్వాత, “తప్పకుండా!” అన్నాడు. ఆ పైన, “రిటైరయ్యాక నేను కూడా ఇలాంటి పనులే చేస్తానేమో!” అని కూడా అన్నాడు.
మా అబ్బాయి మావగారికి ఇంటి చుట్టూ ఎకరాల స్తలం వుంది. ఆయన దాంట్లో రకరకాల జంతువులను పెంచుతాడు. గొర్రెలు, మేకలు, బాతులు, కోళ్ళు, లామా, గాడిదలు, పందులు, ఇంకా ఎన్నో రకాల జంతువులు. ఆవులు మాత్రం లేవు. వాళ్ళ స్తలాన్ని అవి సారవంతం చేస్తాయట. అదో కథ!
మొత్తానికి మా పిల్లల మాటల్ని, నన్ను ప్రోత్సహించేటట్టే తీసుకున్నాను.
ఈ లోపల, మా వూళ్ళోనే వున్న నన్ను భరిస్తూ వుండే నా అమెరికా నేస్తానికి ఫోను చేశాను. ఫోనులో నా సోదంతా చెప్పాను.
“సరే! అలాగే! మంచి ఉద్దేశమే! నీకు వీలుంటే, ఒక గంటలో బయలు దేరి, ఫలానా చోటున్న పశువుల శాలకు వెళదాం! అక్కడ అన్నీ చూసి, వివరాలు కనుక్కుందాం దూడ రేటు ఎంత వుంటుందో. అసలు అమ్ముతారో, లేదో కూడా అడుగుదాం. నాకూ సరదాగానే వుంది దూడని కొనుక్కోవడం గురించి. అన్ని జంతువులనీ కొనుక్కుని పెరట్లో పెంచుకున్న వారిని చూశాను గానీ, దూడని పెంచిన వారిని చూడలేదు. బావుంది! బావుంది!” అంటూ ఆంగ్ల భాషలో చాలా సంతోషించాడా అమెరికా నేస్తం.
దాంతో నా బలం ఒక్క సారిగా పెరిగిపోయింది ఉత్సాహంతో పాటు! వెంటనే, మా వరాన్ని పిలిచి, విషయం చెప్పి, బయలుదేరుతున్నానని కూడా చెప్పేశాను. ఆవిడేం బాణం విసురుతుందో చూద్దాం — అని మనసు లోనే అనుకున్నాను.
అనుకున్నట్టుగానే, “సంతోషం! వొద్దంటే ఆగుతారా, యేం? మంగళ హారతి ఇచ్చి, వీర తిలకం దిద్దమంటారా?” అంది కిసుక్కున నవ్వుతూ!
ఆ బాణం బాగా గుచ్చుకుని, నాకూ బాగా నవ్వొచ్చింది గానీ, ఆ నవ్వును కనపడకుండా, “బై” చెప్పి, పైకి మాత్రం రుసరుసలాడుతున్నట్టు బయలు దేరాను.
పొద్దున్నే లేవడం నాకు ఎప్పట్నించో అలవాటు. కుర్చీలో కూర్చుని, చక్కటి ఫిల్టర్ కాఫీ తాగుతూ, కిటికీ లోంచి పెరట్లోని మొక్కలనూ, చెట్లనూ చూస్తూ ఆనందించడం దైనందిక చర్య నాకు.
ఆ రోజూ అలాగే చేశాను. మొక్కలూ, చెట్లతో పాటు, దూడ షెడ్డుని కూడా చూస్తూ ఆలోచించ సాగాను.
ఈ లోపల, మా వరలక్ష్మి కూడా నిద్ర లేచి, దంతధావనం కానిచ్చి, అక్కడికి వచ్చింది. నేను తాగుతున్నది చూసి, ఆశ్చర్యంతో ఒక పెద్ద కేక పెట్టింది. “అదేమిటీ? నల్ల కాఫీ తాగుతున్నారేం? పాలు పాడై పోయాయా?”
“పాలేమీ పాడవ లేదు. నేనసలు పాలను ముట్టుకోలేదు. ఈ రోజు నించీ నేను ‘వీగన్’ అయిపోయాను!” అన్నాను గంభీరంగా.
“ఏం ‘గన్” అయ్యారూ?” అంది విడ్డూరంగా మా వరం, గడ్డం కింద చెయ్యి పెట్టుకుని.
కన్యాశుల్కం సినిమా లోని ఛాయాదేవి లాగా వుంది మా వరం ఆ పోజులో.
” ‘గన్’ కాదు! ‘వీగన్’! అంటే, ‘సంపూర్ణ శాకాహారి’ అని. అంటే, జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారాన్నీ, లేదా, ఏ ఉత్పత్తినీ ఉపయోగించని మనిషి — అని అర్ధం!” అన్నాను అదే గంభీరంగా.
“కొత్తగా ఈ జబ్బు ఎప్పట్నించీ? ఏమైంది మీకు అకస్మాత్తుగా? నిన్న సాయంత్రం మీ అమెరికా నేస్తంతో దూడని చూసొస్తాననీ, వీలైతే కొనుక్కు వస్తాననీ ప్రగల్భాలు పలికి వెళ్ళారు. రాత్రి చాలా ఆలస్యంగా తిరిగి వచ్చారు. మంచి నిద్రలో వున్న నేను పట్టించుకోలేదు. ఇప్పుడేమిటీ ఈ సన్యాసం? ఎందుకీ విరక్తి? చెప్పకపోతే ఎలా తెలుస్తుందీ?” అని గుక్క తిప్పుకోకుండా అడిగేసింది.
ఇక నా అంతరంగంలో జరుగుతున్న మథనాన్ని చెప్పుకోక తప్పలేదు.
“నిన్న నా నేస్తంతో కలిసి, ఎంతో దూరంలో వున్న పశువుల శాలకి వెళ్ళాను. అది ఒక మైలు దూరంలో వుండగానే, వచ్చింది భయంకరమైన దుర్గంధం! దాన్ని భరిస్తూనే, ఆ శాలకి చేరుకున్నాం. అక్కడ ఎన్ని దూడలో! ఎన్నెన్ని ఆవులో! అంత తక్కువ స్తలంలో ఎన్ని జంతువులో! అవి స్వేచ్ఛగా తిరగడానికి చోటే లేదు. అన్నన్ని ఆవుల నుంచి పాలు పితకడానికి యంత్రాలు వాడతారట. ఇక ఆవుల శరీరాలనూ, వాటి చర్మాలనూ కూడా వ్యాపారానికి ఉపయోగిస్తారట. అసలు, వ్యాపారం కోసమే ఆ జంతువులని పెంచడం! ఎంత హింసో వాటికి! మా నేస్తం ఇంకా చాలా వివరాలు చెప్పాడు గానీ, నేనవి నీకు చెప్పలేను. నా కడుపు తరుక్కు పోతోంది. ఆవులను హింసిస్తే వచ్చిన పాలను మనకు అమ్ముతున్నారు. మనం వాటితో అన్నీ చేసుకుంటున్నాం. అదంతా చూశాక, దూడని కొనాలనే ఆలోచన పోయింది నాకు. జంతువులను హింసిస్తే వచ్చే ఉత్పత్తులను వాడడానికి నా మనసు ఒప్పడం లేదు. అందుకే నేనిక సంపూర్ణ శాకాహారిని అయిపోయాను” అని వివరంగా చెప్పాను.
మా వరలక్ష్మి నిట్టూర్చింది జాలిగా. “అవును! అయినా, సృష్టిలో మేధ పెరిగి, జంతువుల మీద ఆధిపత్యం సంపాదించారు మానవులు. అవసరాల కోసం జంతువులను వాడుకోవడం మొదలు పెట్టారు. వాటి ఉత్పత్తుల కోసం వాటిని పెంచడం మొదలు పెట్టారు. మొదట్లో అవి చాలా స్వేచ్ఛ కలిగిన పెంపుడు జంతువుల్లాగా వుండేవి. దూడ తాగిన తర్వాత మిగిలిన పాలనే తమ అవసరాలకి ఉపయోగించే వారు. రాను రాను అదొక వ్యాపారం అయిపోయింది. ఏం చేస్తాం? ఆహారపు అలవాట్లను మానుకోవడం చాలా కష్టం. విచారకరమైన విషయమే!” అంది బాధగా.
“మరి నువ్వు కూడా వీగన్ అయిపో! మనిద్దరం కలిసి, ఇంచక్కా పాలూ, పెరుగూ, వెన్నా, నెయ్యీ, గట్రా వాడటం మానేద్దాం. నా జట్టుంటావా? ‘ధేనుః రక్షతి రక్షితా’ అన్నారు. అంటే, ఆవును మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది — అని అర్ధం” అని ఆశగా అడిగాను.
“అబ్బే! నా వల్ల కాదు. చెప్పడం అంత సులభం కాదు వీగన్ అయిపోడం! మీరు కూడా ఈ త్యాగాలు ఎన్నాళ్ళు చేస్తారు? గట్టిగా వుండే సంపూర్ణ శాకాహారులు లేరనీ కాదు, వుండకూడదనీ కాదు. మీరలా చెయ్యలేరు. కొన్ని రోజులు పోగానే, మీకే మళ్ళీ విరక్తి కలిగి, పాలతో ఫిల్టర్ కాఫీ కోసం అర్రులు చాచుతారు. మనం సాధారణ మనుషులం. ఆలోచనలు గట్టివే గానీ, ఆచరణే తక్కువ! అదీగాక, మీ సంస్కృతం నా మొహం లాగా వుంది. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనేది ఆర్యోక్తి వుంది గానీ, మీరు చెప్పింది కాదు. ఏదో కాస్త సంస్కృతం నేర్చుకున్నారని, ఇలా దబాయించకూడదు” అంది మా వరలక్ష్మి ఘాటుగా.
మా వరం మాటల్లో సత్యం లేకపోలేదు. నేనెన్నాళ్ళు గట్టిగా వుండగలనో! అదీ చూద్దాం!