పిట్టకథలు

చిన్నపిల్లలను జంతువులతో ఆడుకుంటున్నప్పుడు చూస్తే, వాళ్ళు ప్రపంచాన్ని చూసే కళ్ళలో ఇంకా ఎంత ప్రేమ, అమాయకత్వం, ఆశ్చర్యం ఉన్నాయో కదా అని చిత్రమైన సంతోషం కమ్ముకుంటుంది. నా బుజ్జాయికి కూడా ఊహ తెలిసిననాటినుండీ జంతుప్రపంచమంటే మహాప్రీతి. వాళ్ళ నాన్న మప్పిన ప్రేమ కావొచ్చు. కుక్కపిల్లలు కనపడితే చేతిలో ఉన్నవి తినడానికి పెట్టేసేవాడు. పిల్లిపిల్లలు ఎదురొస్తే ఎలాగైనా ఎత్తుకోవాలన్న ఆరాటం. తాతగారిది గోదావరి జిల్లాల్లోని పచ్చి పల్లెటూరు. వాళ్ళ వీధి చివరే పచ్చటి పొలాలుంటాయి. ఆ పొలాల దారుల వెంబడి పాకలు, గడ్డివాములు, కొయ్యలకు కట్టబడి నింపాదిగా నెమరేసుకుంటూ పడుకున్న ఆవుదూడలూ కనపడతాయి. ఆ దూడల చుట్టూ చేరి వాటికి వెగటొచ్చేదాకా గడ్డి తినిపించడం నా చంటివాడికి ప్రియమైన వ్యాపకాల్లో ఒకటి. తాతగారిని తోడు తీసుకెళ్ళి, అరటి గెలలు కొనిపించుకు తెచ్చుకుని, ఆ లేగదూడలను వాకిట్లోకి పిలుచుకుని ఒక్కొక్కటీ తినిపించడం, వాటి నాలుక తడి తగలగానే అంతెత్తున సంతోషంతో ఎగిరి తుళ్ళిపడటం వాడికిష్టం.

ఒక వేసవిలో ఎవరో ఊరికే ఇచ్చారని, పెంచుకుందామంటూ బాతు పిల్లలను తెచ్చాడు మా మరిది.

“ఊరికే ఎవర్రా నీకిచ్చేదీ?” అని మా అత్తగారు నిగ్గదీసేదాకా అది పిల్లలకోసమని నాకు తోచనే లేదు.

ఆ బాతు పిల్లల్ని అరచేతుల్లో ఉంచుకుని పిల్లమూక చేసిన గారాలూ అల్లర్లూ చూస్తే, ఎంతటి పాషాణహృదయాలైనా కరిగిపోతాయేమో అనిపించేది.

గిన్నెల్లో నీళ్ళు నింపి పెట్టేవాళ్ళు. బాతు ఆడుకోవడానికి, నీళ్ళల్లో బాతు బొమ్మలే తేలాడేలా పడేసేవాళ్ళు. బాతు ముక్కుతో అరచేతిలో పొడిపించుకుని చక్కిలిగింతలుగా నవ్వుకునేవాళ్ళు. ఆ లోకపు సంబరంలోకి ఆకర్షితులు కాకుండా ఉండటం ఎవ్వరి తరమూ కాదనిపిస్తుంది చూస్తే.

వీడికో మూడేళ్ళ వయసొచ్చాక, అమెరికా వెళ్ళి మూడేళ్ళు ఉన్నామక్కడ. అక్కడ వాకిట్లోకి బుజ్జి బుజ్జి కుందేలు పిల్లలొచ్చేవి. నిద్రకళ్ళతో నా బుజ్జాయి లేచొచ్చి, వాటి దగ్గరికి పరుగు పెట్టడం, అవి అంతకన్నా వేగంగా ఏవో పొదల్లోకి దూకడం, వీడు వెంటపడటం — ఇప్పుడిది రాస్తుంటేనే ఆ రోజు వాడిలో చూసిన ఉత్సాహమేదో మళ్ళీ నా నరాల్లో పొంగుతున్నట్టుంది. వాటి గంతుల్లో చూపుల్లో — ఏం కొంటెదనం! నా పిల్లాడిని బన్నీ బాబూ అని పిలుస్తుంటే ఆ పచ్చటి గరికని పళ్ళ మధ్య పట్టుకుని పరుగులు తీసిన ఆ కుందేలు పిల్లలే కళ్ళ ముందు మెదులుతున్నాయి.

కుందేలంటే సరే అంత కవ్వింపు బేరం అనుకోవచ్చు, తాబేలు కూడా ఇష్టం మా వాడికి. విజయనగరంలో అమ్మమ్మ ఇంటికి వెళ్తే, పక్కనే కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయముంటుంది. అక్కడి సిమెంటు నీటి తొట్టెలో కొన్ని పదుల తాబేళ్ళు – చిన్నవీ పెద్దవీ, కుదురుగా ఒదిగి కనపడతాయి. మొట్టమొదటిసారి తాబేలు తల లోపలికి లాక్కోవడాన్ని నా పిల్లాడే చూపించాడు నాకు. దానికొక చిన్న థియరీ కూడా చెప్పేవాడు. తాబేలులా కుదురుగా ఉండాలి బుజ్జాయీ అని కుందేలు-తాబేలు కథ చెబితే, కుందేలులా కూడా ఉండొచ్చు, మధ్యలో నిద్రపోవద్దంతే అని చెప్పిన వాడి తెలివికి వార్నీ! అని ఆశ్చర్యపోవడం నిన్నా మొన్నటి గురుతులానే ఉంది.


అట్లాంటాలో కోకోకోలా కంపెనీకి వెళితే, అక్కడొక పెద్ద స్నో బేర్ ఎదురొచ్చి వాటేసుకుంది. మావాడి ఆశ్చర్యానికి హద్దుల్లేవు. అది బొమ్మో నిజమో తేల్చుకునే వీలేదీ వాడికి కనపడలేదు. ఐదేళ్ళ పసివాడు వాడప్పుడు.

“అమ్మా! ఇదిక్కడికెలా వచ్చిందీ?” చెవిలో రహస్యంగా అడిగాడు.

వాడు చాలా రాత్రిళ్ళు ఇష్టంగా చదువుకున్న ఒక బొమ్మల కథలో — బేబీ బేర్‌కి ఒక రాత్రి అకస్మాత్తుగా తానొక్కడినే ఉండాలన్న ఆశ మొదలవుతుంది.

అమ్మని అడుగుతాడు, రాత్రికి, ఆ కొండ పైన ఉన్న వేరే గుహకి ఒక్కడినే వెళ్ళి పడుకుంటానని.

అమ్మ వద్దంటుంది. వినడు. భయమేస్తుందని నచ్చజెప్పబోతుంది. అస్సలు ఒప్పుకోడు.

చివరికి, రాత్రయ్యాక, బొజ్జ నింపి, వెళ్ళమంటుంది.

మెత్తటి ఊలు దుప్పటి తీసుకుంటాడు. సీసాడు పుట్ట తేనె. ఇష్టమైన కథల పుస్తకం. బుల్లి లాంతరు. అన్నీ మోసుకుని ఝాంఝామ్మని ఎగురుతూ కొండ పైభాగంలో ఉన్న ఇంకో గుహకి చేరుకుంటాడు. తెచ్చినవన్నీ శ్రద్ధగా సర్దుకుంటాడు. అప్పుడే పైకొస్తున్న చందమామని, కాలు మీద కాలేసుకుని చూసుకుంటూ పాటలందుకుంటాడు. ఈ ఏర్పాటు మహా హాయిగా ఉందే అని సంబరపడిపోతాడు. రాత్రి కరిగిపోతూ ఉంటుంది. బయటనుండి ఏవో జంతువుల అరుపులు మొదలవుతాయి. బుజ్జి బేర్‌కి నిద్రపట్టదు. అమ్మ గుర్తొస్తుంది.

అన్నీ వదిలేసి దొర్లుకుంటూ కిందకొచ్చేస్తాడు. అమ్మ పక్కన మెత్తగా పరిచిన దుప్పటి. ఖాళీగా వాడికోసమే కనపడుతుంది.

మమ్మా బేర్‌ని హత్తుకుని పొట్టలోకి ఒదిగిపోతాడు.

“భయమేసిందా?” అమ్మ ముద్దు పెట్టుకుని అడుగుతుంది.

ఏమీ చెప్పడు. అమ్మ ఇంకా దగ్గరగా లాక్కుంటుంది.

ఖాళీ అయిన తేనె డబ్బాలు చూపిస్తూ కథ పూర్తయిపోతుంది.

ఎన్నిసార్లు చెప్పించుకునేవాడో ఈ కథని నా బుజ్జాయి. ఆ తేనెరాత్రుల తీయదనం ఇన్నేళ్ళైనా నన్నే వదలదు, ఇక పసిమనసులో పడ్డ ముద్ర, వాణ్ణేం వదులుతుందీ! బేబీ బేర్ వాడికిష్టమైన జంతువుల్లో ఒకటి. అందుకే ఆ స్నో బేర్‌ను చూస్తే అంత సంబరం.


బోస్టన్‌లో ఉన్నప్పుడు మేమున్న కమ్యూనిటీలో మహాపురాతనమైన వృక్షాలుండేవి. కొమ్మకొమ్మకీ ఉడతలు. జరజరా పైకీ కిందకీ పాకుతూ కనపడేవి. ఊరికే కళ్ళు వాటి మీద నిలిపి ఉంచితేనే గంటలు కరిగిపోయేవి.

ఆ ఉడతల దగ్గరికి వెళ్తూనే, “ద స్కై ఈజ్ ఫాలింగ్ (The sky is falling),” అని పొలికేక పెట్టేవాడు మావాడు.

నేను చేతిలో ఉన్న బొమ్మలో, తాళాలో ఇంకేమైనానో, మెరుపు వేగంతో పైకి విసిరేసి దాక్కోవడానికి ఎటో పారిపోతున్నట్టు నటించేదాన్ని.

ఆ పరుగూ, కంగారూ మావాడికెంత నవ్వు తెప్పించేవంటే, వాడికి అలసటొచ్చేదాకా అట్లా అరుస్తూనే ఉండేవాడు.

దారిన పోయేవాళ్ళు ఆగి కుతూహలంగా చూసేవాళ్ళు. ఆ కథ తెలిసిన వాళ్ళు వచ్చి ఒక చిన్న పండో ఆకో మీదకు విసిరేసి ఆటపట్టించేవాళ్ళు.

అవును, అదీ ఒక కథలోదే. ఆప్రికాటో లేదంటే నట్ లాంటిదింకేదోనో చెట్టుమీదనుండి పడితే, ఒక కుందేలు దాని మీద ఆకాశం పడిందని అరిచి గోల చేసి ఊరందరినీ హడలగొట్టేస్తుంది. ఒక్కో జంతువూ ఆ కంగారంతా మోసుకుంటూ ఇంకో జంతువు దగ్గరికి పరుగెడుతూ ఉండటమే కథ. చివరికి ఓ తెలివైన ముసలి గుడ్లగూబ వాళ్ళని ఆపి ఆకాశం ఊడి పడదనీ అదొక చిన్న నట్ అని చెప్పడంతో కథ అయిపోతుంది. ఆలోచించకుండా అలా కంగారులో ఏదీ నిర్ధారించుకోవద్దని ముక్తాయింపు. బాగుంటుంది, తమాషా కథ.

ఉడతల మీదకి ఆకు విసిరేసినా అవి అరిచి గంతులు చిందులు వేస్తాయన్న ఊహ ఉండేది చిన్నోడికి కొన్నాళ్ళు. కొన్నాళ్ళే. ఆ కొన్నాళ్ళలో దొరికిన అల్లరి జ్ఞాపకాలన్నీ ఆ బోస్టన్ రోజులవి.


చీమలని జాగ్రత్తగా ఆకులమీదకెక్కించే పసితనం వాడిలో ఎన్నేళ్ళో చూశాన్నేను. వాటిని తొక్కకుండా జాగ్రత్తగా పక్క నుండి వెళ్ళిన ప్రతిసారీ, వాడిని మనసులోనే దీవించుకుంటాను, బంగారు కొండవిరా నువ్వూ, అని.

చీమలు సరే, పాములు కూడా మావాణ్ణి భయపెట్టలేకపోయాయి. కొండచిలువలాంటి భారీ కాయాన్నొకసారి ఒంటి చేత్తో ఎత్తుకుని చిన్ని కృష్ణుడిలా ఫోజులిచ్చాడు. ‘గోవర్ధనగిరి కాదు చిన్ని కన్నయ్యా దాన్ని అవతల పారేసి రా’ అన్న నా అరుపులన్నీ భయానికి గొంతులోనే ఉండిపోయాయా రోజు.

“చీ! ఎలా ముట్టుకున్నావురా అసలు, భయం వేయలే?” అని రాత్రికి బజ్జోపెడుతూ అడిగితే,

“భయం దేనికమ్మా, అది నాన్ వెనమస్,” అని కొత్త పాఠాలు చెప్పాడు.


ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణాల్లో కొందరు పసిపిల్లలు చిన్న బొమ్మనొకదాన్ని చంకనేసుకుని తిరుగుతూ కనపడతారా? భలే ముద్దొస్తారు. వాళ్ళే సరిగా నడవలేనట్టుంటారు, వాళ్ళకో లంపటం. అమ్మాయిల్లో బార్బీ డాల్స్ తోడు ఎక్కువే కనపడుతుంది కానీ, అబ్బాయిల్లో కొంచం తక్కువ చూశాను, ఏ బొమ్మైనా పట్టుకోవడం.

చిత్రంగా, ఎప్పుడో ఊరికే కొన్న ఒక చిన్న పెంగ్విన్ సాఫ్ట్ టాయ్‌ ఎన్నో యేళ్ళపాటు మా వాడికి ప్రియమైన తోడై ఉండిపోయింది. చాలా చిన్నది. చిట్టి చేతులతో దాన్ని ఎత్తుకు మోస్తూ ఉండేవాడు. పార్క్‌కి వెళుతుంటే — అయ్యో, అదొక్కతే ఇంట్లో ఎలా ఉంటుందీ? అని వాడడిగిన రోజు నా మనసు కరిగి నీరయిపోయింది. ఇక అప్పటినుండీ మేమెటు వెళ్ళినా కార్‌లో దానికీ దర్జాగా ఓ స్థానం.

దాని మీద మోజు తీవ్రంగా ఉన్న కాలాల్లో, “అంటార్కిటికా పోదాం నానా” అని గారాలు పోయేవాడు.

ఇంటికి ఎవ్వరొచ్చినా, “ఎగరలేదు కానీ పక్షి, పక్షి కానీ ఈదగలదు, ఏమిటది?” అని పొడుపుకథ అడిగి వేధించేవాడు.

పెంగ్విన్స్ ఉండే దేశాల చుట్టూ మేప్‌ల మీద ఎర్ర రంగుల గుర్తులతో మా సెలవుల కలలు పరుచుకునేవి.

పాత ఫొటోల్లో, వాడు ఈ బొమ్మని ఎత్తుకున్నవో, పక్కనుంచుకుని పడుకున్నవో, కార్‌లో వీడి గుండెల మీద పెట్టుకుని కబుర్లాడినవో మెమరీస్‌గా వస్తే, వాణ్ణి పిలిచి చూపిస్తాను. ఆ మనిషీ, ఆ బొమ్మా కూడా గుర్తు లేనట్టు నాటకాలాడతాడు.


పసివాళ్ళకు ఈ పిట్టల మీద ఉండే మోజేమిటో అర్థం కాదు. వాళ్ళ లోపల కట్టడి కాలేక తన్నుకులాడే ఉత్సాహానికి, ఆ పిట్టల రెక్కలు చూస్తే- అవి కదా మాకుండాల్సింది అనిపిస్తుందేమో. కాళ్ళూ చేతులూ వాళ్ళ స్వాధీనంలోకి వచ్చిన క్షణంనుండీ ఎంత ఆరాటం వాళ్ళకి, ఈ లోకాన్నంతా చిట్టి పాదాలతో కొలిచేయాలని!

మొన్న దీపావళి రోజుల నాటి ముచ్చటిది.

ఎన్నిసార్లు వదిలేసినా మళ్ళీ వచ్చి మా వాడి భుజం మీదే వాలిందిట ఓ బుల్లిపిట్ట.

మధ్యాహ్నం వేళ నా నిద్ర చెడగొట్టి “అమ్మా రా, అమ్మా తొందర్రా” అని కేకలు పెడితే హడావుడిగా బయటకు వెళ్ళి చూసేసరికి ఎదురుగా వీడి చేతుల్లో ఓ చిట్టి పిట్ట!

సాక్ష్యం కోసం దాన్ని పట్టుకోకుండా వదిలి చూపించాడు. అయినా అది అరచేతిలోనే ఒదిగి కూర్చుంది. వాడి చిట్టి పిడికిలికే చిట్టిదయ్యే సుకుమారమైన ప్రాణం.

“జాగ్రత్తరా, పొడవట్లేదా?” వాడి అరచేతిని గుచ్చుతోన్న దాని ముక్కునే చూస్తూ అడిగాను. చేయి మార్చుకుని వేళ్ళతో అరచేయి పాముకున్నాడు.

“నొప్పే లేదు,” కొట్టిపారేస్తున్నట్టు చెప్పాడు.

“ఎందుకు రా ఇవన్నీ నీ దగ్గరకే వస్తాయ్” ఫొటో కోసం ఫోన్ తెచ్చుకుని మళ్ళీ అడిగాను.

నా మొహంలోకి చూసి, నేను సీరియస్‌గానే అడిగానని రూఢి చేసుకుని చెప్పాడు — “మాకు కొన్ని పవర్స్ ఉన్నాయమ్మా!”

“మేం రమ్మంటే పిట్టలు వచ్చేస్తాయ్”

(వచ్చిందొక్కటి).

“చాలా పూలు వస్తాయ్”

(పూలు వస్తాయ్ అంటే పూయడం కాదు. రాలడం. సన్నజాజి మొదల్లో పట్టి ఊపారని నిన్నే ఇక్కడ ఒకావిడ తిట్టి తిట్టి వదిలింది).

“వాన మేం చెప్పేదాకా ఆగదు. లాస్ట్ వీక్ చూశావ్ కదా.”

(యెస్. స్కూల్‌కి సెలవు కూడా ఇచ్చారు.)

“మేం పిలిస్తే ఫైర్ కూడా వస్తుంది”

“ర్రేయ్, నిప్పుతో ఆడుతున్నారా!” నా అరుపు వినపడే వీల్లేకుండా పాదాల మీదకి ఉల్లిపాయ బాంబు వేశాడొకడు.

“అసలెవర్రా ఈ దీపావళి టపాకాయలు అప్పుడే మొదలెట్టిందీ?” నేను పట్టుకునేలోపే పిట్టతో సహా పిట్టల్లానే పరుగెత్తి పోయారందరూ.

“మానసా, ఇంట్లో అగ్గిపెట్టెలు బతకనివ్వట్లేదు వీళ్ళు,” నా కేకలకి బయటకొచ్చి చెప్పారు అత్తగారు.


మానస చామర్తి

రచయిత మానస చామర్తి గురించి:

ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు.

 ...