కృష్ణశాస్త్రి వచన (సం)గీతాలు

[దేవులపల్లి కృష్ణశాస్త్రి శతజయంతోత్సవ వేడుకల సందర్భంగా 1998 తానాపత్రిక ప్రత్యేకసంచికలో ప్రచురించిన ఈవ్యాసం ఈమాటలో పునర్ముద్రితం చేసుకోవడానికి అనుమతినిచ్చిన రచయితకు కృతజ్ఞతలు — సం.]

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పేరు వినగానే మనలో చాలా మందికి వెన్నెల జల్లులు, వియోగం, విరహం, విషాదం, కడవలకొద్దీ కన్నీరు, అక్కడక్కడ కాస్త పన్నీరు మాత్రమే గుర్తుకొస్తాయి. భావకవుల స్వేచ్ఛకి ప్రతీకగా డెబ్భై యేళ్ళ క్రితం ఆయన రాసిన గేయంలో చరణాలు:

పక్షినయ్యెదఁ జిన్ని ఋక్షమయ్యెదను
మధుప మయ్యెదఁ జందమామ నయ్యెదను
మేఘ మయ్యెద వింత మెఱపు నయ్యెదను

పాట నయ్యెదఁ గొండవాగు నయ్యెదను

లేదా, ఆయన మహదానందంతో పాడిన పాట:

చిత్త మానందమయ మరీచికల సోల
హృదయ మానందభంగ మాలికలఁ దేల
కనుల నానంద జనితాశ్రు కణములూర
జగము నిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు

గుర్తుకి రాక మానవు. ఒక్క క్షణం గగుర్పాటు రాక మానదు.

ఈ రాతలన్నీ రాసిన మూడేళ్ళు తిరక్క ముందే, ఇవన్నీ ‘అయోమయపు మాట’లనీ, ‘పులుముడు’ కవిత్వం అనీ, నిరంకుశంగా, తునాతునకలుగా ఖండించి నిరసించి, హేళన చేసిన అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుణ్ణి మాత్రం ఎవ్వరూ గుర్తు పెట్టుకోలేదు; ఇప్పుడెవ్వరూ గుర్తు కూడా పట్టరు. కాలమూ, ప్రజలూ, కృష్ణశాస్త్రిగారిని మాత్రమే ‘ఔ’నన్నాయి! కృష్ణశాస్త్రి కవిత్వం కాలపరీక్షకి నిలిచిందనీ, ఇకముందు కూడా నిలుస్తుందనీ విమర్శకులు చాలామంది చెప్పనే చెప్పారు. మళ్ళీ అదే రాయటం చర్వితచర్వణం.

మంచి పద్యం రాయగలవాడు మంచి గద్యం కూడా రాయగలడని, టి.ఎస్.ఎలియట్ అన్నాడు. మంచి కవి రాసిన పద్యానికీ గద్యానికీ మధ్య భేదం లేదంటాను నేను. వామనుడనే ప్రాచీన ఆలంకారికుడు కూడ ‘గద్య రచన కవికి గీటురాయి అనదగు’ అనే అర్థం వచ్చేట్లు సంస్కృతంలో చెప్పాడు. అంటే, కవి రాసింది మేలిమి బంగారమో, చిలకలపూడి బంగారమో తెలుసుకోవాలంటే, వాడు రాసిన గద్యం చూస్తే తెలిసిపోతుంది అని నా విశేషార్థం. అసలు విషయం సూటిగా చెప్పాలంటే, మంచి పద్యం రాసేవాడు, మంచి గద్యం కూడా రాయగలడూ అని.

ఇప్పుడు, కృష్ణశాస్త్రిగారి కొన్ని ‘గద్య’ రచనలని ఈ కోణం నుంచి చూద్దాం.

అంతకు ముందుగా, 1897 నవంబరు నెలలో విజయనగరంలో గురజాడవారి కన్యాశుల్కం కన్ను తెరిచింది. పుట్టీ పుట్టంగానే, దేశాన్ని గగ్గోలు పెట్టడం మొదలెట్టింది. అదే యేట, అదే నెలలో, చంద్రంపాలెంలో కృష్ణశాస్త్రిగారు పుట్టారు. కొన్ని నెలల తరువాత, పాశ్చాత్య సాహిత్యసంస్కృతీరంగాలను ఒక కుదుపు కుదిపి, అమెరికాలో తెల్లవాడి కర్కశత్వంపై — నాకు ఘట్టిగా ‘గీ’ పెట్టి — పాడిన పాల్ రోబ్సన్, మన వంగదేశంలో హరీన్ చటోపాధ్యాయ అవతరించారు. వీటన్నిటికీ మధ్య బాదరాయణ సంబంధమే అని మీరు నవ్వచ్చు. ఎందుకో మరి, చెప్పబుద్ధవుతోంది; ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు; నా యిచ్ఛయే గాక నాకేటి వెఱపు’ అన్న పాదాలు గొంతుకలో పాడుకొంటున్నాయి!

కృష్ణశాస్త్రి రాసిన ‘వచనం’ కొద్దిగానే. అందులో, అచ్చయి అందుబాటులో వున్నవి బహు కొద్ది. రేడియో వ్యాసాలు, ఉపన్యాసాలూ అన్నీ కలుపుకుంటే ఓ ముప్పై పై చిలుకు ఉండవచ్చు. ‘ఏకం పద్యం ప్రబంధశతాయతే,’ అన్నారు, తిరుమల రామచంద్రగారు కృష్ణశాస్త్రిగారిని గురించి. మచ్చుకి, ఆయన రాసిన ఓ కథ, ఓ రేడియో ప్రసంగం, ఓ ఉపన్యాస వ్యాసం గురించి మాట్లాడుకుందాం.

కృష్ణశాస్త్రిగారి ‘మావూరు పోయింది’ నాకు నచ్చిన కథల్లో ఒకటి. కథ యావత్తూ గతస్మృతులతో నిండి, ఆవూరు మీవూరేమో అన్నట్టు కళ్ళకు కట్టినట్టుంటుంది. ఈ కథ, పరిస్థితుల ప్రభావానికి సత్సంప్రదాయాలు ఎలా మాయమై పోతున్నయో అద్దంలో బింబంలాగ చూపించే తేటతెలుగు మాటల మూట. శాస్త్రిగారు వాళ్ళ వూరి గురించీ, ఆయనకి వాళ్ళ వూరు వెళ్ళిపోదామని ఉన్నదనీ స్నేహితుడితో చెపుతున్నారు. నగరవాసం మొహం మొత్తింది.

‘మావూరు వెళ్ళిపోతాను. వెంటనే వెడతా. వెళ్ళి అక్కడ చక్కని, చల్లని ఇల్లు కడతా. పూరిల్లు. ఇంటిచూరులంట, శాంతీ, చల్లదనమూ ఎప్పుడూ నామీదికి జారుతూ వుంటాయి. మా వూరికి ఉత్తరాన ఒక చెరువుంది. దక్షిణాన కూడా ఒక చెరువుంది. గాలి ఊదినప్పుడు, మీలు ఎగిరినప్పుడూ, నీళ్ళు గలగల మంటాయి. అప్పుడు, చెరువు నిద్దరలోనుంచి ఒళ్ళు విరుచుకున్నట్టనిపిస్తుంది.’

తరువాత వూరిలో పురాణం చెప్పే రామశాస్త్రి గురించీ, ఆయన పాండిత్య ప్రకర్ష గురించీ చెపుతారు కృష్ణశాస్త్రి. ఆయన పురాణం గురించి కృష్ణశాస్త్రి మాటల్లో:

‘ఆ చీకట్లో శాస్త్రిగారి గొంతు ద్వాపరయుగం నుంచి వస్తుంది. ఆయన కంఠరవ పక్షాలమీద శ్రోతల మనస్సులు ఆదికాలాలదాకా ప్రయాణం చేస్తాయి.

పగలు మన కళ్ళు కనపడినంత మేరే చూస్తాయి. రాత్రి రామాయణం దాక చూస్తాయి.

ఆముదం దీపం కూడా పురాణం ఆలకించడం నేను ఎరుగుదును. ఆలకించి అటూ ఇటూ తల ఊపుతుంది.’

స్నేహితుడికి తన వూరు గురించి చెప్పడంలో ఆవేశంలో ఎన్నెన్నో స్మృతులు.

‘ఆ హాయిలో, ఆ ఆవేశంలో, మాగ్రామానికి బయలుదేరి వెళ్ళాను.

“చంద్రంపాలేనికి త్రోవ ఇదేనా?”

“అవును. ఈరోడ్డు అక్కడికే పోతుంది. ఈ బస్సు కూడా అక్కడికే. అదుగో దూరాన ఆ టూరింగు సినిమా డేరా.”

త్వరగా వూళ్ళోకి నడిచి వెళ్ళాను.

అక్కడ నా చంద్రంపాలెం లేదు.

మా ఊరు పోయింది.’

కృష్ణశాస్త్రి పుట్టి పెరిగిన వూహించుకునే పల్లెటూర్లు, గాంధీగారికి తీరని కోరికగానే మిగిలిపోయిన స్వయంసమృద్ధమైన పల్లెటూరూ, అన్నీ పోయాయి. పొరపాటున మిగిలినవి, త్వరత్వరగా పోతున్నాయి. ఆవూళ్ళల్లో వుండే కలుపుగోలుతనం, సౌభ్రాతృత్వం, అన్నీ పరిస్థితుల మార్పుకి తట్టుకోలేక, మాయమైపోతున్నాయి. వాటితో పాటు, మానవుడిలో మంచితనం కూడా మాసిపోతున్నదనే ఆవేదన ఈ కథాగీతంలో ప్రతి చరణంలో ప్రతిబింబిస్తుంది.

శాస్త్రిగారు 1938లో చేసిన రేడియో ప్రసంగం, ‘ఆకలి.’ ఈ ఆకలి వచనసంగీతంలో, బెంగాల్లో కరువు కృష్ణశాస్త్రిగారికి కల్గించిన తీవ్రావేదన ప్రతిధ్వనిస్తుంది, మొదటినుంచి చివరిదాకా. సమసమాజ ధ్యేయం, గొప్ప సామాజిక స్పృహ, ఈ గీతం నిండా కన్పిస్తాయి. మన ఆర్థిక వ్యవస్థలో అసమానత్వాన్ని ఎత్తిపొడిచే ప్రసంగగీతం ఈ ఆకలి.

‘మనదేశంలో ఆకలి లేదు. మనం శిలలం. మనం మృత్తు. మనం మృత్యువు! వేనవేలేండ్లు అసత్య ప్రచారాలు, అధర్మాచారాలు, అసంబద్ధ వైరాగ్యాలు, మనకి ఆకలి లేకుండా చేశాయి.’

అంతటితో ఆగరు శాస్త్రిగారు:

‘గంగాతరంగ హిమశీకర శీతలాని
విద్యాధరాధ్యుషిత చారు శిలా తలాని
స్థానాని కిం హిమవతః ప్రళయం గతాని?
యత్సావమాన పరపిండ రతా మనుష్యాః’

అన్న భర్తృహరి శ్లోకం చెప్పి:

‘ఎంత చక్కని శ్లోకం! ఎంత తీయనిది! కాని ఇంతకంటే అపాయకరమైనది ఈ దేశంలో లేదు. “తాగడానికి గంగాజలం వున్నది; పరుండటానికి శిలాతలాలు ఉన్నాయి; ప్రళయం వచ్చి హిమగిరిస్థానాలు పోలేదే! ఎందుకు మానవులు పరపిండాన్ని ఆశిస్తారు” అని.

ఎంత దిగులు పుట్టిస్తుంది ఈ వేదాంతం!
ఎంత నీరసం చేస్తుంది ఈ వేదాంతం?

నాకు ఐశ్వర్యం కావాలి. సమృద్ధి కావాలి. అందరికీ కావాలి. ఇది గుర్తించడం అవసరం. మునుపు దక్షుడు గుర్తించలేదు. నలిగిపోయాడు.

నిజానికి కలిమి అందరిదీని.

పోగొట్టు నీదేశంలో దారిద్ర్యాన్ని.’

అంటూ ప్రబోధించారు శాస్త్రిగారు.

‘కృష్ణశాస్త్రి వచనం గుండెల దగ్గిర పెదవులు చేర్చి నెచ్చెలి వలె గుసగుసలాడుతుంది. తల్లిలా చెవులకు దగ్గిరగా చల్లగా లాలిపాట పాడుతున్నట్లు మెత్తగా ఏవేవో అనుభవాలను కెరటాలు కెరటాలుగా ఊరిస్తుంది; ఉరికిస్తుంది. నెమ్మదిగా మృదుమంజులంగా అనుభూతుల నెన్నింటినో ఆవిష్కరిస్తూ సాగుతుంది,’ అని అనడం నిజంగా కృష్ణశాస్త్రి ‘వచనం’, దానిలోని ఆలోచనా పరంపర గురించి అర్థం చేసుకొని అన్న మాటల్లో కనపడవూ?

1976లో అభ్యుదయ రచయితల సంఘంలో ఇచ్చిన అధ్యక్షోపన్యాసం, ‘లిరిక్ శిల్పం.’ ఆ ఉపన్యాస వ్యాసంలో కృష్ణశాస్త్రిగారే అన్నారు:

‘లిరిక్ లో ప్రతి శబ్దానికీ ప్రత్యేక పరిమళం వుంటుంది. ప్రత్యేక వర్ణం వుంటుంది. పర్యాయపద్ధతులు వుండవు. లిరిక్ రాగ తాళాలలో గేయమే కానక్కర లేదు. పద్యం కావచ్చు. వచనం కూడా కావచ్చు’

1946లో అభ్యుదయ రచయితల సంఘం తృతీయ మహాసభకు ‘అభ్యుదయ రచనోద్యమం’ అన్న శీర్షికతో అధ్యక్షోపన్యాసం ఇస్తూ కృష్ణశాస్త్రి ప్రజా సాహిత్యం గురించి అన్న మాటలు:

‘మంచి ఏల పాటగాని, బుర్రకథ గాని, స్త్రీల పాటగానీ వుంటే, దాన్ని ఒక మంచి కావ్యం ముందు పెట్టడానికి నాకభ్యంతరం లేదు. నేను ఇరవై ఏళ్ళ క్రితం (అంటే 1920లలో) వ్రాసినట్టుగా నేడు వ్రాయలేను. నేను పెరిగానో, మారానో, మరి ఏమైనానో ఇప్పుడలాంటిది వ్రాయలేను. నేను అభ్యుదయం వైపుకు వచ్చి తీరాలనుకుంటున్నాను. అభ్యుదయం శ్రీశ్రీలో 80వంతులు ఉంది. ఆయన ప్రజాకవి.’

కృష్ణశాస్త్రిగారిపై షెల్లీ, కీట్స్, వర్డ్స్‌వర్త్, బైరన్ల ప్రభావం వున్నదని చాలామంది చెప్పారు. ఆయనేమీ కాదనలేదు. అయితే, కృష్ణశాస్త్రిగారి ప్రభావం ఆ రోజుల్లో అందరి కవుల మీదా (కొందరిపైన ఇంకా ఈ రోజుల్లో కూడా!) వుంది. కృష్ణశాస్త్రి ప్రభావం నుంచి బయటపడటానికి తనకి పదేళ్ళ పైచిలుకు పట్టిందని శ్రీశ్రీ అన్నాడు! కృష్ణశాస్త్రి ప్రభావం నుంచి, వేషంలోనూ, భాషలో కూడా, తిలక్ పూర్తిగా బయటపడనే లేకపోయాడు. వీళ్ళిద్దరూ మనకి నిజంగా గొప్ప కవులు. ఇకపోతే, కృష్ణశాస్త్రిగారిని అనుకరించి, అనుసరించిన ప్రతిధ్వని కవులు మనకి కోకొల్లలు ఇంకా వున్నారు. ఇంకా ఇక ముందు కూడా వుంటారు. అది కృష్ణశాస్త్రిగారి గొప్పతనమే మరి.

ఆయన్ని అనుకరించిన వాళ్ళని గురించి అపహాస్యంగా ఆయనే అన్నారు:

‘మెరుగు కళ్ళజోళ్ళు గిరజాల సరదాలు
భావకవికి లేనివేవి లేవు
కవితయందు తప్ప గట్టివాడన్నింట
విశ్వదాభిరామ వినురవేమ.’

కృష్ణశాస్త్రిగారి బ్రహ్మసమాజ మతం, ఆయన హరిజనోద్ధరణ, వేశ్యావివాహాది సంఘసంస్కరణోద్యమాల్లో ఆయన కీలకపాత్ర, ఆయన్ని బహిరంగంగా నిందించి వెలివేసిన ఛాందసత్వం గురించీ మరొకసారి చెప్పుకుందాం.

1963లో ఆయన కంఠానికి క్యాన్సరు వ్యాధి వచ్చింది. స్వరపేటిక తీసివేసేశారు, డాక్టరు హీరా నందానీ! ఏనాడో, 1925లో కృష్ణశాస్త్రిగారు, ‘మూగవోయిన నా గళమ్మున గూడ నిదురవోయిన సెలయేటి రొదలు గలవు,’ అని రాశారు. అది పట్టుకొని ఆయన్ని నిరాశావాది అన్నవాళ్ళూ లేకపోలేదు. ఆయన ఎంత ఆశావాదో చూడండి. హీరా నందానీ ఆపరేషను చేసిన మర్నాడు శాస్త్రిగార్ని ఏదయినా కవిత రాయమని అడిగితే ఆయన చెప్పిన మాటలు:

‘మాట తీసుకొని నాకు
మౌనం ఇచ్చావు —
హీరా నందానీ!
మౌనం తీసుకొని నీకు
గానం ఇస్తున్నా!
హీరా నందానీ!

నా మందిర గవాక్షం నుంచి తొలి అరుణ స్వర్ణకాంతి వచ్చి
నా కళ్ళను తాకినప్పుడు
కళ్ళు విప్పి స్వాగతం చెపుతాను.

వేకువగాలి వ్రేళ్ళతో నామొగం నిమిరినప్పుడు
చిరునవ్వు నవ్వుతాను.

పెరటిలోనుంచి కొత్తగా విరిసిన విభాత సుపరిమళం వచ్చి
పలుకరిస్తే ఔనని తలూపుతాను.

కాని, గవాక్షంలోనికి రవ్వంత వొదిగిన
మావి కొమ్మ చివరనించి ‘కో’ అన్న
వనప్రియారావానికి బదులు మాత్రం చెప్పలేను.
ఇక బదులు మాత్రం చెప్పలేను.’

చలం గారి వచనాన్ని కత్తిరించి అతికించి కవిత్వం చూపించాడు వజీర్ రహ్మాన్, ఒకప్పుడు. అల్లాగే రాచకొండ విశ్వనాథశాస్త్రి కథల్ని కత్తిరించి అతికించి కవిత్వం అచ్చేశాడు ఈమధ్యనే త్రిపురనేని శ్రీనివాస్. వచనానికీ కవనానికీ మధ్య భేదం లేదనిపించేట్లు రాసి ఆలాపించినవాళ్ళు కృష్ణశాస్త్రి, శ్రీశ్రీనూ!

‘గద్యం కవీనాం నికషం వదంతి.’ — ఏమెన్!


ఈ వ్యాసానికి సంప్రదించిన పుస్తకాలు:
1. కృష్ణశాస్త్రి, వ్యాసావళి — 2,3,4 (1982): ఈ మూడూ తప్పకుండా అందరూ చదవవలసిన పుస్తకాలు!
2. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి కృతులు: కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి (1950)
3. దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహితీ సౌరభం: డా. నిర్మలా దేవి యన్. (1985)
4. కృష్ణశాస్త్రి కవితాత్మ: ఆవంత్స సోమసుందర్ (1986)
5. నేటి కాలపు కవిత్వం: అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు (తెలుగు విశ్వవిద్యాలయం, 1994)
6. మరపు రాని మనీషి: తిరుమల రామచంద్రగారి పత్రికా వ్యాసాలు