జ్ఞాపకాల పల్లకీనెక్కి…

ఇసిఐఎల్ రోడ్లపై మనం తిరుగాడినట్టే ఉన్నాయి
ఈ రాత్రులు!

ఆ పార్కులు, ఆ సినిమా హాళ్లు,
ఆ రోడ్లు—
మనల్ని మరుస్తాయంటావా?

మనమెంత గింజుకున్నా,
అరిచి గీపెట్టినా—
మన పెదవుల తాకిడి రగిల్చిన మంటల్ని
చల్లార్చలేము, చెలీ!

చాటు మాటుగా మనమెంత ముద్దులాడినా—
మనల్ని అదిలించేవారు,
కదిలించేవారు గుర్తున్నారా?
మళ్లీ మనల్ని గుర్తు పడతారా?

ఆ ఐస్‌క్రీమ్-బాయ్
ఇద్దరికోసం ఒక్కటే ఐస్‌క్రీమ్ కొన్నప్పుడు
నాపైకి విసిరిన చూపుల్ని
పోల్చుకోగలవా ఎప్పుడైనా?

కార్నర్ సీట్స్‌లో కూర్చొని,
నీపైకి నే వాలిన ఆ ఘడియల
చిక్కుబుక్కులు ఏవైపోయాయి?

అనవసరంగా రెండు బిర్యానీలు ఆర్డర్ పెట్టుకొని,
మధ్యలోనే వదిలేసొచ్చిన ఆ రోజు గుర్తుందా?
ఎక్కడికెళ్లామో? ఏం చేశామో?

ఎంత బాగుండేవి ఆ రోజులు!
నీ ఎదపై వాలి పడుకున్న
ఆ క్షణాల సుఖం — ఎంత మైమరపో!
ఎంత తలపోసినా
మళ్లీ రావు కదా!
ఆ రోజుల మాధుర్యం
అంతా ఇంతా కాదు కదా!


ఇప్పుడు—
నే జ్ఞాపకాల పల్లకినెక్కి
నీ కల్లోకొస్తున్నా…

నన్ను సాదరంగా ఆహ్వానించు.
నిన్ను తనివితీరా హత్తుకొని నిద్రిస్తా!

ఈ చలి కాపుల్లో—
నీ వెచ్చని పెదాల రంగు తాకినా చాలు
ఒళ్లంతా భగభగమండి పోతుంది!

నీ తోడు లేక
నే ఎప్పుడో భస్మమయ్యాను–
ఇప్పుడు రూపంలేని ఆత్మే
నీతో సంభాషిస్తోంది.

నువ్వు నన్ను గుర్తుపట్టలేవు
నే నిన్ను అంటిపెట్టుకుని ఉంటా.
నే నిన్ను నాలోకి నింపుకుంటా
నన్ను నీలోకి ఒంపుకో — చాలు.


ఇసిఐఎల్ వెళ్దాం–
వస్తావా నాతో?


బాలాజీ పోతుల

రచయిత బాలాజీ పోతుల గురించి:

నారాయణఖేడ్, సంగారెడ్డిలో నివాసం. బాలాజీ పోతుల ఒక తెలుగు రచయిత, కవి. ఆయన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ ప్రాంతానికి చెందినవారు. ఆయన రచనలు సామాజిక, వ్యక్తిగత భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ భావోద్వేగభరితంగా, సామాజిక అంశాలను స్పృశిస్తూ ఉంటాయి.

 ...