తిష్టతత్వం జ్వలించింది

తిష్టతత్వం జ్వలించింది
మనుష్యత్వం క్షీణించింది
పదండి వెనక్కి
పదండి పోదాం!

కంటికి కనిపించే ప్రపంచమంతా నిజం కాదు; నిజమైన ప్రపంచం అంతా కంటికి కనిపించదు.

ఐదడుగుల పొడుగు, అరవై కిలోల బరువు ఉన్న మన భౌతిక శరీరం లోని కోటానుకోట్ల జీవాణువులలో మన జీవాత్మ తిష్ట వేసుకుని ఉందని ఎంతమందికి తెలుసు? మన శరీరంలో ఇటువంటి జీవాణువులు దరిదాపు 1.1 x 10^14 ఉన్నాయి (సుమారుగా వంద ట్రిలియన్లు). (ఇక్కడ 10^14 అంటే 10 x 10 … x 10 లా పదిని పద్నాలుగు సార్లు వేసి గుణించటం అని అర్థం. లెక్కలతో పరిచయం లేని వాళ్ళకి కూడా అర్ధం అవాలంటే, ఇలా ఆలోచించండి. మూడు మిలియన్ సంవత్సరాల కాలంలో ఎన్ని సెకండ్లు ఉన్నాయని అడిగితే దానికి సమాధానంగా “దరిదాపు 1.1 x 10^14 సెకండ్లు” అని చెప్పొచ్చు! లేదా వంద అడుగుల పొడుగు, వెడల్పు, ఎత్తు ఉన్న ఇసక దిబ్బలో ఎన్ని ఇసక రేణువులు ఉంటాయో అన్ని! ఈ జీవాణువులనే మనం జీవకణాలు అంటాం. చర్మం మీద ఉన్న కణాలు, రక్తంలో ఉన్న ఎర్ర కణాలు, తెల్ల కణాలు, మెదడులో ఉన్న న్యూరానులు, మొదలైనవన్నిటినీ కూడగలిపి అంచనా వేస్తే పైన చెప్పిన మొత్తం వస్తుంది.

ఒక వైజ్ఞానిక కల్పిత కథలో ఒక పనిలేని మంగలి ఇలాంటి అంచనాలు వెయ్యటానికి ఇష్టపడలేదు. కథే కనుక కూర్చుని తన స్నేహితురాలి శరీరంలో ఉన్న జీవకణాలన్నిటిని, విడదీసి, పోగు పోసి, ఓపిగ్గా లెక్క పెట్టటం మొదలెడతాడు. ఆశ్చర్యం! పసిడి చాయ, పద్మం లాంటి ముఖం, లేడి కన్నుల వంటి కళ్ళు, సంపెంగ మొగ్గ లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవులు, దానిమ్మ గింజలలాంటి పలువరుస, జొన్నపొత్తు జుత్తు, గుప్పిడిలో ఇమిడిపోయే నడుం, …. చూస్తే మేను మరచి పరవశించేలా అందాలు చిందే ఆ అమ్మాయి శరీరంలో దరిదాపు 1.1 x 10^14 జీవకణాలు కనిపించేయి! ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, వాటిలో నూటిలో పదవ భాగమే మానవ జీవకణాలు, మిగిలిన 90 శాతం బేక్టీరియా కణాలు. యక్‌! ఇటుపైన ఆ అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకోవటం?

మన మంగలి పనిలేని వాడు అయితే అయాడు కాని తెలివి మాలినవాడు కాదు. అమ్మాయి సంగతి అటుంచి తన శరీరం వైపు చూసుకున్నాడు. తన శరీరంలోనూ దరిదాపుగా 1.1 x 10^14 జీవకణాలు కనిపించేయి! వాటిలోనూ నూటిలో పదవ భాగం మానవ జీవకణాలు, మిగిలిన 90 శాతం బేక్టీరియా కణాలూను. ఇంక యక్‌ ఏమిటి?

ఇదేదో వింతగా ఉందే అనుకుని కనిపించిన ప్రతి మానవుడి శరీరాన్నీ విశ్లేషించటం మొదలు పెట్టేడు మన కథానాయకుడు. ఎక్కడ చూసినా ఇదే వరస! ఇంకా ఆశ్చర్య పడవలసిన విషయం ఏమిటంటే ఆ నూటిలో పదవ భాగం కణాలు కూడా నూటికి నూరు పాళ్ళూ మానవ కణాలు కాదు. ఈ నగ్న సత్యం నా ఎడలా, మీ ఎడలా, అందరి ఎడలా కూడ నిజం!

నిజానికి ఈ మోసం మనం పుట్టక ముందే జరిగి పోయింది. పురుషుడి వీర్య కణం ఒకటి స్త్రీ యొక్క అండంతో సంయోగం చెందిన ఉత్తర క్షణంలోనే మనలోని మనుష్యత్వం పాలు అతి మిక్కుటం. ఆ తరువాత “ఆకాశంబుననుండి శంభుని శిరం, బందుండి శితాద్రి, సుశ్లోకంబైన హిమాద్రినుండి…” అన్న పద్యంలోలా, ఒకటే పతనం! పురుషుడి వీర్యం (sperm), స్త్రీ అండం (egg), యుగాండం (zygote), పిండం (embryo), శిశువు, మనిషి… ఈ క్రమంలో, మనలో మనుష్యత్వం క్రమేపీ నశించి, మనం పెరిగి పెద్దయే నాటికి నూరింట పది పాళ్ళకి తక్కువే మిగులుతుంది.

తల్లి కడుపులోని బిడ్డ సంచిలో ఉన్నప్పుడు ఉన్న మనుష్యత్వం భూపతనం అయేసరికి ఉండదు! ప్రసవ కాలం సమీపించే వేళకి తల్లి శరీరంలో పెను మార్పులు వస్తాయి. రాజు వచ్చే వేళకి వీధులన్నీ ముగ్గులతో అలంకరించినట్లు, శిశువు ప్రయాణం చేసే వేళకి తల్లి జనన మార్గం వెంబడి – వెల్లివిరిసిన పువ్వులతో అలంకరించబడ్డట్లు – Lactobacilli అనే పేరుగల బేక్టీరియా ముమ్మరంగా పెరుగుతుంది. సూక్ష్మదర్శినిలో చూస్తే ఈ బేక్టీరియా కాకినాడ కోటయ్య కాజాల మాదిరి కనిపిస్తాయి. కైవారంలో మన జుత్తులో నూరో భాగమూ, అంతకి పదింతలు పొడుగు ఉండే ఈ బేక్టీరియా యోని ద్వారపు గోడల మీద చిక్కగా పెరిగి ఉంటుంది. శిశువు ఈ ద్వారంలోంచి బయటకి వచ్చేటప్పుడు ఈ బేక్టీరియా – బిలియన్లపై బిలియన్లు – శిశువు శరీరానికి అంటుకుని అక్కడ తిష్ట వేస్తాయి. అంటే శిశువు మొదటి ఊపిరి పీల్చే సమయానికే శిశువు శరీరం అంతా తల్లి దగ్గర నుండి సంక్రమించిన బేక్టీరియాతో కల్తీ అయిపోతుంది.

మన తెలుగు వాళ్ళకి తెలుగు కంటె ఇంగ్లీషు సులభంగా అర్ధం అవుతుందని అందరూ నాతో అంటూ ఉంటారు కనుక, ఇక్కడనుండి ముందుకి కదిలే లోగా రెండు ఇంగ్లీషు మాటలు, వాటి తెలుగు అర్ధాలూ తెంగ్లీషులో చెబుతాను. ఇంగ్లీషులో infectious, contagious అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్ధంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు భిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియాను (prion) వల్ల కాని, వైరస్‌ (virus) వల్ల కాని, బేక్టీరియం (bactirium) వల్ల కాని, ఫంగస్‌ (fungus) వల్ల కాని, పేరసైట్‌ (parasite) వల్ల కాని వచ్చే రోగాలని infectious diseases అంటారు. ఒక మనిషి నుండి మరొక మనిషికి అంటుకునే రోగాలని contageous diseases అంటారు. CJD (Creutzfeldt-Jakob disease )అనే జబ్బు ఉంది. ఇది ప్రియానులు మన శరీరంలో జొరబడ్డం వల్ల వస్తుంది. కాని ఇది ఒకరి నుండి మరొకరికి అంటుకోదు. కనుక ఇది infectious disease మాత్రమే. దోమకాటు వల్ల మనకి సంక్రమించే మలేరియా వంటి రోగాలు కూడ infectious disease కోవకే చెందుతుంది. కాని ఇన్ఫ్లుయెంజా (influenza or flu) infectious disease మాత్రమే కాకుండా contageous disease కూడా! ఎందుకంటే ఇంట్లో ఒకరికి వస్తే మరొకరికి అంటుకునే సావకాశం ఉంది కనుక. Infection లు ఎన్నో విధాలుగా రావచ్చు, కాని అన్ని infection లూ అంటుకోవు. మరొక విధంగా చెప్పాలంటే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించి అక్కడ తిష్ట వేస్తే అది ‘తిష్ట’ (లేదా, infection), దాని వల్ల వచ్చే రోగం తిష్ట రోగం (infectious disease). ఈ రోగం ఒకరి నుండి మరొకరికి అంటుకుంటే అది ‘అంటు’ (లేదా, contageon), దాని వల్ల వచ్చే రోగం అంటురోగం (contageous disease). ఇప్పుడు తిష్టతత్వం అంటే infectious, అంటుతత్వం అంటే contageous.

పైన ఎదుర్కున్న సమస్య ని మరొక విధంగా పరిష్కరించవచ్చు. పిలవకుండా పేరంటానికి వస్తే వారిని పిలవని పేరంటం అంటాం కదా! పిలిస్తే వచ్చి భోజనం చేసి వెళ్ళేవాడు అతిథి, పిలవకుండా భోజనాలవేళకి వచ్చి తినేవాడు అభ్యాగతి. పిలవకుండా వచ్చి, తిని, ఇంట్లో తిష్ట వేసి, ఇంటి వాసాలు లెక్కపెట్టేవాడు ఆషాఢభూతి. కనుక infection అనేది పిలవని పేరంటం లాంటిది, లేక ఆషాఢభూతి లాంటిది. కనుక infection ని మనం ‘భూతి’ అనో ‘పిపేరంటం’ అనో అనొచ్చేమో కూడ!

తెలుగు పాఠం అలా ఉంచి అర్ధంతరంగా వదలి పెట్టిన మన కథకి వెళదాం. పూర్తిగా పుట్టకుండానే శిశువు బేక్టీరియాతో కల్తీ అయిపోయిందని నేను చెబితే కొంచెం క్రూరంగానే ఉంటుంది. కాని ఇది పచ్చి నిజమే కాకుండా ఇలా జరగవలసిన అవసరం ఉంది. జనన కాలానికి ముందు యోని ద్వారంలో Lactobacilli తిష్ట వెయ్యకపోతే ఆ తల్లులకి నెలలు నిండకుండా ప్రసవం అయే ప్రమాదం ఉంది. అంతే కాదు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు (premature babies), సిజేరియన్‌ (cesarean) వల్ల పుట్టిన పిల్లలు నెలలు నిండిన పిల్లలతో పోలిస్తే చాల ఆరోగ్యపరమైన ఇబ్బందులకి లోనవుతారని కొందరి అభిప్రాయం. అంటే ఏమిటన్న మాట? సృష్టి మన మంచికే కుట్ర పన్ని మన శరీరాన్ని పుట్టక ముందే తిష్టకి లోను చేస్తుంది.

ప్రసవం జరిగి, బిడ్డ భూపతనమైన తరువాత అంతా దిగజారుడే! బిడ్డ తీసే మొదటి శ్వాస, వైద్యుడి (మంత్రసాని) చేతులు, తల్లి పాలు – ఇవన్నీ సూక్ష్మజీవులకి స్థావరాలు. పరిశుభ్రంగా ఉన్న ఆసుపత్రి గదులలో కూడ – ఒత్తే ముందు చపాతీ ఉండలని పిండిలో వేసి దొర్లించినట్లు – మనం సూక్ష్మజీవులనే పిండిలో దొర్లుతూనే ఉంటాం. పంది శరీరానికి అంటుకున్న బురదలా, ఆసుపత్రి వదలే వేళకి మన శరీరం నిండా వైరసులు, బేక్టీరియా, పేరసైటులు తిష్ట వేసుకుని ఉంటాయి. ఆ రోజు లగాయతు మనం ఒంటరి వాళ్ళం కాదు!

తల్లి చనుమొన పిల్ల పెదాలకి తగలగానే మరొక రకం సూక్ష్మజీవులు తిష్ట వేసుకోవటానికి అవకాశం మొదలవుతుంది. తల్లి పాలలో ఉన్న ప్రాణ్యములు (proteins) పోషక పదార్ధాలు. ఇవి పిల్లకే కాదు, సూక్ష్మజీవులకి – ప్రత్యేకించి Bifidobacteria కి కూడా పోషక పదార్ధాలే. ఈ కొత్తరకం బేక్టీరియా పుట్టుకతో వచ్చిన Lactobacilli ని కొంచెం పక్కకి నెట్టి, శిశువు చిన్న పేగుల (intestines) గోడలకి అంటుకుని వేలాడుతూ ఉంటాయి. ఈ రెండు జాతుల బేక్టీరియాలు కొద్దిరోజులలో చిన్నపేగుల గోడలని పూర్తిగా కప్పెస్తాయి – ఒక రక్షరేకులా!

పసిపిల్లల శరీరంలో ఈ రెండు రకాల బేక్టీరియాలు పుష్కలంగా లేక పోతే వారికి ‘తెల్లపూత’ (oral thrush) అనే జబ్బు వచ్చే అవకాశం జాస్తీ. ఈ జబ్బు చేసిన వారికి నోటి నిండా పూత పూసినట్లు తెల్లటి పొక్కులు, మచ్చలు వస్తాయి. మామూలు నోటి పూత ఎర్రగా ఉంటుంది, ఇది తెల్లగా ఉంటుంది. కనుక దీనిని ‘తెల్లపూత’ అన్నాను. ఈ జబ్బు చెయ్యటానికి మూలకారణం Candida albicans అనే ఒక రకం ఈస్టు (yeast). ఇదే ఈస్టు యోని ద్వారం వద్ద తిష్ట వేస్తే దానిని యోనితిష్ట (vaginal infection) అంటారు. ఏ మందు వెయ్యక పోతే ఈ తిష్ట వ్యాపించి, కిందనున్న శరీరాన్ని తినేస్తుంది. అప్పుడు అవి కురుపులుగా మారి బాధ పెడతాయి. ఈ తెల్లపూత రాకుండా ఉండాలంటే మన శరీరంలో Lactobacilli, Bifidobacteria ఉండాలి. చూసారా! బేక్టీరియా లేకపోతే మన బతుకు ఎలా కష్టం అయిపోతుందో!

ఈ బేక్టీరియా మన శరీరం మీదకి చేసే దాడిలో కూడ ఒక పద్ధతి ఉంది. ముందు Lactobacilli. తరువాత Bifidobacteria. వయస్సు పెరుగుతూన్న కొద్దీ క్రొంగొత్త బేక్టీరియా జాతులు, ఒకదాని తరువాత మరొకటి, ఒక వరస ఇటికల మీద మరొక వరస వేసినట్లు, దొంతిలా పెరుగుతూ ఉంటాయి. కాలగమనంతో మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనలో ఐక్యం చేసుకుంటున్నామన్న మాట! నిజం చెప్పాలంటే, మనం తిన్న తిండి, తాగిన పానీయం, పీల్చిన గాలి, స్పృజించిన ప్రపంచం మనలో ఐక్యం అయిపోతూ ఉంటాయి. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెత మన ఎడల అక్షరాలా నిజం.

పుట్టకముందున్న పవిత్రత పోయి మన శరీరం రకరకాల సూక్ష్మ్మజీవులకి ఆలవాలం అయిపోతుంది. నోరు తిరగని వీటి పేర్లు కొన్ని ఇక్కడ చెబుతాను: Staphylococcus aureus, Streptococcus mitis, Trichomonas tenax, Candida albicans, Haemophilus influenzae. ఇన్ని జీవులు మన శరీరం లోపల, పైన పెనవేసుకుని మనతో సహవాసం చేస్తూన్నప్పుడు “నేను, నువ్వు” అనే సర్వనామాలకి అర్ధం లేదు; ఇటుపైన “మేము, మీరు” అన్నవే సంబోధనకి అనువైన వాచకాలు.

మనం ఒక్కళ్ళం! మన సహచరులు బిలియన్ల మీద బిలియన్లు!! మనం, మన అంగసౌష్టవ నిర్మాణం వల్ల, చూట్టానికి మనుష్యులులా కనిపించినా మనలో తిష్టతత్వం జ్వలించింది! మనుష్యత్వం క్షీణించింది!!

[Gerald N. Callahan రాసిన Infection: The Uninvited Universe, St. Martin’s Press, New York, 2006 అనే పుస్తకంలోని పదార్ధం ఆధారంగా. — రచయిత]

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...